Tuesday, June 29, 2010

రేపిస్ట్ ...కవిత్వం (2nd part).

" దేవుడు కరుణిస్తాడనీ, వరములు కురిపిస్తాడనీ నమ్మ లేదు నువ్వు ఇక్కడ ప్రత్యక్షమైన వరకు" ఇలాగే పాడుకున్నాను, ఆ రోజు శ్రీను తన ప్రకృతి కార్యక్రమం ముగించుకొని వచ్చేసరికి.తను  నా కళ్ళకి అప్పుడే లెట్రిన్ కి వెళ్ళి వచ్చి ప్రశాంతంగా చూస్తున్న దేవుడిలా (ఓ విష్ణు మూర్తి, ఓ సాయి బాబా,ఓ జీసస్,ఓ అల్లా) కనిపించాడు.

ఆ రోజు రెడ్డీ తన రేపిస్ట్ అని చెప్పిన తరువాత నేను కాస్త జాగ్రత్త పడ్డాను. రెడ్డీని పూర్తిగా అవాయిడ్ చేసేదాన్ని. కానీ చాలా సార్లు అసలు ఆ రేప్ కధ గురించి అడగాలని అనిపించేది. మీరే ఊహించండి ఎక్కడో సినిమాలలో చూస్తాము కానీ నిజంగా రేపిస్ట్ లని,మర్డర్ చేసినవాళ్ళని కలిస్తే ఎవరికైన అసలు వాళ్ళు అలా చెయ్యడానికి కారణాలేంటి, చేస్తున్నప్పుడు,చేసే ముందు తరువాత వాళ్ళ మనోభావాలేంటి అని తెలుసుకోవాలి అనిపించదా? నాకు కూడా అలాగే అనిపించింది.కానీ భయం వల్ల అడగలేదు.అసలు మాటలే మానేసాను.కానీ మళ్ళీ నడక తప్పలేదు, రాత్రి పగలు కలిసి వుండేది తప్పలేదు.

అసలు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఎవరండీ చెప్పింది?అసలు ఒక మనిషి ఇలాంటి వాడు అని చెప్పడానికి జీవితకాలం సరిపోతుందా?అందులోనూ మనిషి రోజు రోజు కూ మార్పు చెందుతుంటాడనిపిస్తుంది నాకేంటో. ఒక సారి అతి భయస్థుడు అనిపించిన మనిషి ఒకసారి ఎంతో ధైర్యం ప్రధర్శిస్తుంటారు, ఎంతో మాటకారి అనిపించినవాళ్ళు ఒక్కో విషయంలో మౌనం గా వుంటారు.అలాగే ఈ రెడ్డీ అసలు అమ్మాయిలతో నేను మాటలే ఆడను అన్నట్లు బిల్డప్ ఇచ్చాడు, తీరా చూస్తే ఎవరినో రేప్ చేసి వచ్చాడంట. హమ్మో! నయం నేను గడుసుదాన్ని కాబట్టి నాకేమీ కాలేదు అనుకొని రెడ్డీ తో జాగ్రత్తగా (దూరం గా) వుండటం మొదలు పెట్టాను. రెడ్డీ కూడా నా పలకరింపుల గోల నాకు కాపల కాసే పదవి తప్పిందనేమో హాయిగా వున్నాడనిపించింది.కానీ ఒకరోజు శ్రీను ఇంటికెళ్ళాడు. తప్పనిసరిగ మండల ఆఫీసులో ఆ మండలానికి సంబందించిన సమాచారం తీసుకుని రావాల్సిన పని వుంది. అప్పటికే చాలా రోజులుగా తిరుగుతుంటే ఆరోజు వాళ్ళు ఇస్తామన్నారు. వెళ్ళక తప్పదు. వజ్రపుకొత్తూరు మండల ఆఫీసు ఏ ఊరికి సంబంధం లేనట్లు ఒక నిర్మానుష్యమైన స్థలంలో వుంది. రెడ్డీ తో వెళ్ళాలంటే భయం వేసింది. ఏడుపు కూడ వచేస్తుంది. కానీ భయం లేనట్లు నటిస్తూ వెళ్ళాను.పని అయిపోయింది కానీ కాస్త లేటయ్యింది. చీకటి పడుతుంది బస్సులు రావటం లేదు. రెడ్డీ నేను ఒక్క మాట కూడా మాట్లాడక కొన్ని రోజులయ్యింది.ఇక అక్కడ వుండిపోవాల్సిన పరిస్తితి కానీ ఎవరూ తెలీదు.బస్సు వస్తే బాగుండు అని, రాకపోతే నా పరిస్తితి ఏంటి అని అలోచనలతో టెన్షన్ పడుతున్నాను.ఎవరైన కదిలిస్తే ఏడ్చేస్తా అటువంటి పరిస్థితి. రెడ్డే నాకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నాడనిపించింది ఎందుకో!ఇక చీకటి అయిపోయాక అప్పుడు మాట్లాడాడు. ఆకలేస్తుందా అని. చా ఇంతసేపు టెన్షన్ పడింది ఆకలికా?అనుకున్నాను. ఊహూ అని తల అడ్డంగా ఊపాను.  సరే ఇక బస్సులు రావు ఏమి చేద్దాము అని అడిగాడు. ఎవరైన తెలిసిన వాళ్ళుంటే వాళ్ళింటికి వెళ్ళి వుండటమే. మాకు అక్కడ ఎవరూ తెలీదు. కానీ ఇంతక ముందు వచ్చినప్పుడు రెడ్డీ ఒక గ్రామంలో వున్నాడు. వారి గ్రామం అడ్డదారిన నడిస్తే దగ్గరవుతుంది అక్కడికి వెళ్దామా అన్నాడు. రెండో ఆలోచన లేకుండా వొప్పేసుకున్నాను. నా భయాలన్నీ నాలోనే వున్నా అప్పటికి వేరే దారి లేదు. కాస్త చిన్న వెలుగు వుంది కానీ పొలం గట్లమీద నడుచుకుంటూ వెళ్ళాలి.పగటి పూట పొలం గట్లు మీద నడవటమే కస్టం నాకు పడిపోతూ వుండే దాన్ని, ఇక రాత్రి పూట కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించడంలేదు. తాడి చెట్టులా నా ముందు వెళ్తున్న రెడ్డీ నీడ కాసేపు కనిపించింది. కాసేపయ్యాక అదికూడా మాయం అయిపోయింది.ఇక ఆతరువాత రెడ్డీ నా బ్యాగు ని పట్టుకొని లాక్కొని వెళ్తుంటే నేను ఎక్కడ కాలు వేస్తున్నానో కూడా తెలియకుండా వెళ్తున్నాను.
దగ్గరే, ఇక్కడే అని చెప్తూ అప్పటికే ఒక  గంట నడిపించాడు. ఆ చీకటికే నాకు ప్రాణంపోయేలా అనిపిస్తుంది. అసలు ఇదంతా నాకు అవసరమా? హాయిగా ఇంట్లో వుండి మా డాడీ తీసుకొచ్చిన ఏ సిమెంటు వ్యాపారినో,సివిల్ కాంట్రాక్టర్నో, ఎన్.ఆర్.ఐ.నో పెళ్ళి చేసుకొని, ఒకరు ఇద్దరు పిల్లల్ని కనుకుటూ కూర్చోకుండా నాకేంటి ఈ బాధలు.ఇలా నన్ను నేను తిట్టుకుంటుండగా, ఇంతలో నా కాలుపై ఎదో కుట్టినట్లైంది. పొలంలో ఏముంటాయి? పాములు అని వెంటనే ఆన్సర్ వచ్చేసింది మైండ్ లో.రెడ్డీ పాముకరిచింది అని చెప్పాను అనుకున్నాను కానీ ఎప్పుడు కళ్ళుతిరిగి పడిపోయానో నాకే తెలీదు,ఎందుకంటే నాకు అప్పటివరకు ఎప్పుడూ కళ్ళుతిరగలేదు. చిన్నప్పుడెప్పుడో స్కూల్ అసెంబ్లీ లో అందరు కళ్ళుతిరిగి పడుతున్నారు కదా అని నేను కూడా మా ఫ్రెండ్ ని అడిగి తను పట్టుకుంటాననే గ్యారంటీతో కావాలని పడిపోయినట్లు నటించా అంతే. కానీ ఈసారి నిజంగానే కళ్ళు తిరిగాయి.కానీ లేచేసరికి రెడ్డీ మొహం మీద నీళ్ళు వేసినట్లున్నాడు ఏమి జరిగింది అని అడిగాను. నీకు పాము కరిచింది అని చెప్పాడు. హమ్మో అవునుకదా అని మళ్ళీ నొప్పి గుర్తు చేసుకొని ఏడవటం మొదలు పెట్టేసాను. అయ్యో నేను ఇక్కడే చచ్చిపోతానా, ఎలా రెడ్డీ, ప్లీజ్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళవా అని ఏదేదొ మాట్లాడేసి ఏడ్చేస్తున్నను.నాకు నా ప్రాణం అంటే అంత ఆశ/తీపి వుందని నాకు అప్పుడే తెలిసింది.రెడ్డీ ఏమో మరీ అంత ఫీల్ అయిపోకు, పాము కాదు కనీసం చీమ కూడా కాదు చూడు ముల్లు చెట్టు. నీ కాలు కి ముల్లు గుచ్చుకుంది అంతే అని తన దగ్గర వున్న అగ్గిపెట్టెలో అగ్గిపుల్ల వెలిగించి చూపించాడు.రెడ్డీ సిగరెట్ తాగే అలవాటు ఆరోజు నాకు ఉపయోగపడింది.

మెల్లిగా అగ్గిపెట్టెలో పుల్లల్ని వెలిగిస్తూ ఆ వెలుగులో కొంతసేపటికి ఆ ఊరు చేరాము. వాళ్ళు నిజంగా రెడ్డీ ని ఏదో వాళ్ళ స్వంత కొడుకు వచ్చినట్లు రిసీవ్ చేసుకున్నారు. మాతో ఒక్కమాట కూడా మాట్లాడని మనిషి వాళ్ళకి ఒక విజిట్ లో అంత క్లోజ్ ఎలా అయిపోయాడో నాకు అర్ధం కాలేదు. నేను వున్న ఇళ్ళల్లో వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు కాని ఇంత ఆప్యాయత వుంటుందా అనేది అనుమానమే! మొత్తానికి వాళ్ళకి చెప్పాడు, ఆరోజు చెప్పాను కదండీ మా టీంలో ఒకమ్మాయి వుందని ఆమే శిరీష అని పరిచయం చేశాడు, వాళ్ళు కూడా నేనేదో ముందుగా తెలుసన్నట్లే మాట్లాడారు. ఎలా అయినా శ్రికాకుళం ఏరియాలో చూసిన ఆప్యాయత నేను ఇంక ఎక్కడా చూడలేదు. స్నానానికి వేడి నీళ్ళుపెట్టి, వేడి వేడి చేపల పులుసుతో అన్నం పెట్టారు.ఏ గ్రామం వెళ్ళినా ఇలాంటి మర్యాదలుంటాయి. కాసేపటికి బోజనాలు కానిచ్చి కబుర్లు చెప్పుకుంటున్నాము. రెడ్డీ కి ఆ ఊర్లో చాలా మంది పరిచయం అయిపోయినట్లున్నారు, పిల్లలందరు వచ్చేశారు అన్నా అన్నా క్రికెట్ ఆడదాము అనుకుంటూ, నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మాతో సరిగా మాత్లాడటమే రానట్లుంటాడు,ఇక్కడి వాళ్ళకి ఇంత క్లోజ్ ఎలా అయ్యాడా అని. ఈ లోగా ఇంట్లో నుండి గట్టిగా అరుపులు ఏడుపులు, ఏమయిందో అని ఖంగారు పడి లోపలకి వెళ్ళేసరికి, ఆ ఇంట్లో వాళ్ళ చిన్న కోడలు మెలికలు తిరిగిపోతుంది కడుపు పట్టుకొని. ఆమె ప్రెగ్నెంట్ అని రెడ్డీ పలకరించిన విధానం బట్టి ఇంతకు ముందే అర్ధం అయింది.ఇంతలో ఏమైందో. ఆ సమయానికి ఆ ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. వజ్రపు కొత్తూరు మండలం లో చాలా ఇళ్ళల్లో మగవాళ్ళందరూ అండమాన్ కో, దుబాయ్ కో లేదా మిలటరీ కో వెళ్ళివుంటారు. ఆడవాళ్ళు జీడితోటలు, పొలాలు, చేపల వ్యాపారం చేస్తూ ఇక్కడే వుంటారు.వీళ్ళింట్లో ఇద్దరు కొడుకుల్లో ఒకరు అండమాన్, ఒకరు మిలటరీ. మామగారు మర్నాడు సంత వుందని వేరే వూరెళ్ళారు. అందరు ఖంగారు పడుతున్నారు, ఏడుస్తున్నారు. పల్లెల్లో మంచి/చెడు ఏంటంటే ఒకరింట్లో ఏదైనా జరిగితే అందరూ విపరీతంగా పట్టించుకుంటారు.ఒక్కొసారి అది ఇబ్బంది గా కూడా వున్నా, ఒక్కొసారి ధైర్యం ఇస్తుంది. పక్క ఇంట్లో వాళ్ళు అందరుర్ వచేశారు. కానీ ఆ టైము లో ఏమి చెయ్యాలి. ఊర్లో హాస్పటల్, డాక్టర్ లాంటి సదుపాయాలుండని ఇలాంటి ఊర్లు చూస్తే నాకు చాలా భయం. ఒకరు ఎడ్ల బండి లో తీసుకెల్దామని ఒకరు ఉదయం వరకు చూద్దామని, ఒకరు మంత్రసాని ని పిలిపిద్దామని సలహాలు. రెడ్డీ సడన్ గా ఎవరిదైనా బైక్ వుంటే ఇవ్వండి పలాస తీసుకెళ్తాను అని అడిగాడు కాని ఆ నొప్పితో ఆమె బైక్ మీద సరిగా కూర్చోలేదు కాబట్టి వెనక ఆమెకి సపోర్ట్ గా ఎవరైన ఇంకొకరు కూర్చోవాలి. మొత్తానికి 3 బైక్స్ లో వెంటనే బయలుదేరిపోయాము. దారిలో ఆటో కనిపిస్తే ఆమెని అందులోకి మార్చాలని అలోచన. అందరిలో నేనే బైక్ మీద అటు ఇటు కాళ్ళు వేసుకొని కూర్చోగలను కాబట్టి నేను ఆమె, రెడ్డీ బైక్ మీద. వాళ్ళ అత్తగారు ఇంకొకతను కలిసి వేరె బైక్ మీద, మూడవ బైక్ వెరే ఒకతను వచ్చారు. మాకు బెండిగేటు దగ్గరే ఆటో దొరికింది కానీ ఈలోగా నాకర్ధమైంది ఏంటి అంటే ఆ అమ్మాయికి అబార్షన్ అయింది అని,ఆమె కాసేపటి వరకు నొప్పి అని ఏడ్చింది కాసేపటికి నామీద తల వాల్చేసింది.చాలా చెమటలు పట్టేశాయి, ఒళ్ళంతా చల్లగా అయిపొఇంది.చనిపోయిందేమో అని భయం వేసింది నాకు. రెడ్డీ కి చెప్తే చేతులు రుద్దుతూ వుండమన్నాడు. అలాగే చేశాను. ఆటో లోపలికి ఇద్దరం మోసుకొని పడుకోబెట్టాము. అప్పటికి మిగిలిన వాళ్ళు వెనక వస్తున్నారు.నా ఒళ్ళో తల పెట్టుకున్నాను చేతులు రుద్దుతూ కూర్చున్నాను, రెడ్డీ తన ఒల్లో కళ్ళు పెట్టుకొని అరికాళ్ళు రుద్దుతున్నాడు. అప్పటికే ఆమెకి బ్లీడింగ్ ఎక్కువైంది. హాస్పటిల్ దగ్గరకి రాగానే రెడ్డీ నన్ను నీకు చున్నీ అవసరమా అని అడిగాడు, నాకు ఒక నిముషం ఏమీ అర్ధం కాలేదు. అలా తిక్కదానిలా మొహం పెట్టి చూశాను,తనే ఆటో దిగాక నా చున్నీ తీసుకొని ఆమె నడుము కి చుట్టమని చెప్పాడు. అప్పటికి అర్ధం అయింది నాకు. లోపలికి తనని రెడ్డీ నే మోసుకొని వెళ్ళాడు. ఆతరువాత అన్నీ వెంటనే జరిగిపోయాయి. ఆ రాత్రి తెల్లార్లూ అక్కడే వున్నాము. అన్ని ఖర్చులు రెడ్డీ పెట్టుకున్నాడు. అప్పుడర్ధమైంది నాకు వాళ్ళెందుకు రెడ్డీ అంటే అంత ఆత్మీయంగా వున్నారో. నేను అదే లేదా అటువంటి ఎలాంటి పరిస్థితిలో వున్నా రెడ్డీ అంత చొరవ తీసుకొనేదాన్ని కాదేమో.ఆ ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా వారి కోడలు,అన్నా అని పిలుస్తూ ఎంతో ఆత్మీయంగా వుండేది. అలా ఏ ఊరు వెళ్ళినా అక్కడ రెడ్డీకి కొందరు ఆత్మ బంధువులుండే వాళ్ళు.

మొన్న రేపిస్ట్ లా కనిపించిన వాడు ఈరోజు ఒక గొప్ప మనిషిగా కనిపించాడు. నాలాగా హడావిడిగా మాట్లాడేవాళ్ళే చొరవ వున్న వాళ్ళు అనుకునే దాన్ని. కాని ఆ సమయంలో నా నోరు,తెలివి ఏమైపోయిందో మరి. రెడ్డీ కి అంత చొరవ ఎలా వచ్చిందో మరి.ఆ తరువత చాలా తీవ్రంగా ఆలోచించాను.ఇంత మంచి మనసున్న మనిషి రేప్ ఎలా చెయ్యగలిగాడా అని, దానికి చాలా కధలు ఊహించుకున్నాను,బాగా డబ్బు పొగరున్న ఒకమ్మాయి పొగరు అణచడానికి, ఊర్లో ఆ పిల్ల నాన్న చేస్తున్న దుర్మార్గాలు అడ్డుకోడానికీ ....మొదలైన ఎన్నో తెలుగు సినిమా కధలు ఊహించాను.తనలో వున్న మంచి మనిషిని ఎలా వుద్ధరించాలా అని కూడా చాలా ప్రణాళికలు వేశాను.ఇక ఊహించడానికి చిరాకేసి ఒక రోజు ఒక ఊర్లో ఫీల్డ్ పని అంతా అయ్యాక ఆ ఊరివాళ్ళు మాకు వుండడానికి ఇచ్చిన దేవాలయంలో బయట కూర్చున్నప్పుడు ఇక వుండబట్టలేక అడిగేశాను."రెడ్డీ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు, నిన్ను 3,4 నెలలుగా చూస్తున్నాను, మంచివాడిలాగానే కనిపిస్తున్నావు,(అది కూడా డౌటే అన్నట్లు)  మరి రేప్ ఎందుకు చేశావు?ఆమె ఎవరు?ఆమె మీద నీకు కోపమా లేకపోతే ఏదైన కారణం వుందా?రేప్ చేస్తుంటే నీకు ఏమీ అనిపించలేదా?(ఈ ప్రశ్న వేసినప్పుడు ఒక పిచ్చి చూపు చూశాడు నా వైపు) అంటే బాధ అనిపించలేదా ఆ అమ్మాయిని చూస్తే?తప్పు చేస్తున్నట్లు అనిపించలేదా? ఆమెని పెళ్ళిచేసుకుంటావా? ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా?ఎందుకిలా చేశావు?నీకు అసలు రేప్ చెయ్యటం ఎలా...."    అని అడుగుతూనే వున్నాను,ఇంకా నా ప్రశ్నలు చాలా మిగిలిపోయాయి కానీ అప్పటికే రెడ్డీ పెద్ద శబ్ధం చేస్తూ నాకొక నమస్కారం పెట్టేసి"అమ్మా తల్లీ నీ ప్రశ్నలతో నన్ను రేప్ చెయ్యకు, నేనేదో నిన్ను ఆటపట్టిద్దామని రేప్ కధ చెప్పాను. నాకు అంత సీన్ లేదు, నాకు అసలు అమ్మాయిలతో మాట్లాడటం అలవాటేలేదు, మా వైపు అమ్మాయిలు చదువుకొనేది తక్కువ అందుకని కాలేజిలో కూడా పెద్దగా అమ్మాయిలు లేరు, అసలు నాకు నిన్ను చూస్తేనే భయం ,నువ్వేమో అది ఇది అని ఏదో ఒకటి మాట్లాడిస్తావు.అందుకే నిన్ను భయపెట్టి నిన్ను దూరంగా వుంచి నేను సేఫ్ గా వుందామని అలా చెప్పాను.కానీ నువ్వేమో నన్ను ఒక సీరియల్ రేపిస్ట్ ని, సైకో ని ఒక సైకో డాక్టర్ అడిగే ప్రశ్నలన్నీ అడుగుతావనుకోలేదు.ప్లీజ్ నన్నొదిలేయ్ నేను ఎప్పుడూ రేపులు,నిన్నలు చెయ్యలేదు, భవిష్యత్తులో ఒకవేళ చెయ్యాలనిపించినా ఈ ప్రశ్నలన్నీ గుర్తొచ్చి ఇక చెయ్యలేను " అని చెప్పాడు.నాకు కోపం, ఉక్రోషం, మంచివాడే అనే రిలీఫ్ అన్నీ కలగాపులగంగా వచ్చాయి.ఒక మనిషి మంచివాడు కాదు అంటే మనకి ఎందుకు అశాంతి, మంచివాళ్ళని చూస్తే ఎందుకు సంథొషం? కానీ ఆ టైములో ఉక్రోషం డామినేట్ చేసి మొహం మాడ్చుకొని కూర్చున్నాను.అప్పుడు రెడ్డీ నా గురించి చెప్పిన మాటలు నా కోపం బాధ అన్నీ తగ్గించేసాయి.
 
"కానీ శ్రీను ని,నిన్ను చూస్తే, మీ స్నేహం చూస్తే చిన్నప్పటి మనసుతో మీరెలా ఇంక వుండగలిగారు అనిపిస్తుంది, అలా అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఎలా వుండగలరు అని ఆశ్చర్యం వేస్తుంది, మాకెందుకు అలాంటి అవకాశం, పరిస్తితులు లేవా అనిపిస్తుంది. మీ స్నేహం చూస్తే నేను కూడా మీలాగే వుండగలిగితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మా పరిస్తితులు మమ్మల్ని ఆడపిల్లలు మగపిల్లలు  మట్లాడుకోవటమే తప్పు అని నేర్పాయి"  అనిచెప్పాడు.  నిజమే కదా ఇప్పటికీ చాలా మంది పల్లెలు పట్నాలు అని తేడాలేకుండా ఇంకా ఇటువంటి పరిస్థితిలో వున్నారు. కాని స్నేహం మధురమైనది అది ఎవరి మద్య అయినా ఒకటే, జాతులు, కులాలు, పేద, గొప్ప,ఆడ,మగ అని తేడా వుంటుందా.నా భయం బాధ అన్ని తీసేసినట్లు పోయాయి.కాకపోతే ఒకటే బాధ కలిగిన విషయం, అన్నిరోజులుగా నేను ఊహించుకున్న సినిమా కధలన్నీ వేస్ట్ అయిపోయాయి. చా!!ఒక రేపిస్ట్ ని మార్చాలనుకున్న నా కలలన్నీ కల్లలైపోయాయి.ఎందుకో నేను ఈవిషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాననిపించింది ఎందుకంటే నేను మరి ఈ క్రింద  కవిత్వం నేను అప్పుడే వ్రాశాను......

"అంతా బ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా..
ఆశా నిరాశేనా మిగిలేదీ చింతేనా"
 
(సరే ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ ఇంకో రేపిస్టో,గజ దొంగో,హంతకుడో దొరక్కపోతాడా నేను వుద్ధరించడానికి!లోకం అంత గొడ్డు పోయిందంటారా మీరే చెప్పండి)

Monday, June 21, 2010

దేవుడా.....ఎక్కడున్నావు?

"అమ్మా,దేవుడు అంటే ఎవరు? పెద్దవాల్లందరూ దేవుళ్ళతో సమానం అన్నవుకదా,ఐతే, దొంగలు కూడా దేవుళ్ళేనా? దేవుడు ఎక్కడుంటాడు? ఆకాశంలో వుంటాడా? అంటే పెద్దవాళ్ళు దేవుళ్ళైతే ఆకాశంలో ఎందుకు లేరు? మనలోనే వుంటాడా దేవుడు? అంటే లోపలికి ఎలా వెళ్ళాడు? బయటకి ఎప్పుడొస్తాడు? అతనికి ఊపిరి ఎలా ఆడుతుంది? దేవుడు ఎప్పుడూ మంచిపనులే చెయ్యమంటాడు అన్నావు కదా, మరి ఎందుకు మంచి పనులెప్పుడూ బోర్ కొడుతుంటాయి?దేవుడు ఎందుకు స్కూల్ కి వెళ్ళొద్దు ఆడుకో అని చెప్పడు?దేవుడు ఆకాశం లోనో, మనలోనో వుంటే మరి రిషి ఏంటి గుడిలో వున్నాడని చెప్తాడు? అసలెక్కడున్నాడు నీకు కరెక్ట్ గా తెలుసా లేదా? దేవుడు మనుషులని ఎలా తయారు చేశాడు? దేవుడు స్కూల్ కి వెళ్ళాడా? దేవుడు జాబ్ చేస్తున్నాడా? మరి దేవుడు కి కూడా అమ్మ నాన్నా, పిల్లలు అందరూ వున్నారా? "

దేవుడా......ఏంటి ఈ దేవుడి గోల అనుకుంటున్నారా! నా కొడుకు, లక్కీ నన్ను రోజూ ఇలాంటి ప్రశ్నలతో ఆయిల్ లేకుండా వేపుకొని తినేస్తున్నాడు. అసలే నాకు దేవుడుగురించి చాలా తక్కువ తెలుసు(అసలు అతనెవరో/ఆవిడెవరో నాకు నిజంగా తెలీదు) నాకు తెలియని విషయాలు, నాకు అర్ధం కాని విషయాలు ముఖ్యంగా ఈ దేవుడు, పూజలు, మతం అనే విషయాలు నేను ఎప్పుడూ ఆలోచించలేదు.నేను నాస్తికురాలినో,ఆస్థికురాలినో కూడా నేను ఆలోచించలేదు. నాకు నిజ జీవితంలో అంతగా అవసరం పడని టాపిక్  దేవుడు మరియు మతం. మా మమ్మీ డాడీ కూడా పెద్దగా పూజలు చేసి గుళ్ళకి గోపురాలకి తిరిగిన వాళ్ళు కాదు.పండగంటే కొత్త బట్టలు, పిండివంటలు, టపాకాయలు, ఒక ఇంట్రెస్టింగ్ కధ, కొన్నిరోజుల సెలవు, ఆటలు. ఇదే తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే కొంత పెద్దయ్యాక పండగలంటే మా మమ్మీ మీద తోటి ఆడవాళ్ళందరి మీద జాలి కలుగుతుంది. మిగిలిన రోజులకంటే పండగంటే ఇంకాస్త పని ఎక్కువ. ఎక్కువ వంటలు, పూజలు, వాటికి ప్రసాదాలు వగైరా వగైరా. 

నేను పుట్టింది హిందువుల ఇంట్లో, చదివింది ఎక్కువగా క్రిస్టియన్ విద్యా సంస్థలలో, స్నేహితులు వున్నది అన్ని మతాలనుండి. ఒక్కో స్నేహితుడు/స్నేహితురాలు ఒక్కో మతానికి సంబందించిన మంచి/చెడు గుణాలతో నాకు ఆ మతం మీద కొంత అవగాహన కల్గించారు.కాని నేను మతం దేవుడు గురించి ఆలోచించింది ఒకే ఒక సంధర్భం (నాకు తెలిసి). చిన్నప్పుడు స్కూల్ లో " ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవమూ..ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతమూ..." అనే పాటకు స్కూల్ ఫంక్షన్లో నేను డాన్స్ చేశాను. అప్పుడు ఆ పాట ని కొన్ని వందల సార్లు పాడటం, వినటం జరిగింది.ఆ పాట నాకెంతో నచ్చింది. అప్పుడే ఆలోచించాను. మతం ఏమి చెప్తుంది? ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అని చెబుతుంది. అది ఏదో ఒక మతం కాదు అన్ని మాతాలు అలాగే చెప్తాయి. అదే పని మతం కంటే ముందు మన హృదయం చెప్తుంది.అందుకే హృదయం కంటే మించిన మతం లేదు. అప్పుడే నాకు నా మతం గురించి ఆలోచనలు ఆగిపోయాయి. నా స్నేహితులలో,కాళిదాసులో పట్టుదల, నిస్ట; మేరీ లో ప్రేమ గుణం,స్వరూపలో క్షమించే సహనం, షాహిద్ లో కుటుంబానికి పెద్దలకి ఇచ్చే గౌరవం ఇవన్నీ వివిధ మతాలలో చెప్పిన మంచి గుణాలు. మంచి ఏది చెడు ఏది అని తెలియజేయటమే మతం వుద్దేశ్యం. 

మళ్ళీ ఇందులో నాకు కొన్ని అనుమానాలు కూడా వున్నాయి. మంచి చెడులు కాలానికి అణుగుణంగా మారుతుంటాయి కదా(అన్నీ కాక పోయినా కొన్ని అయినా). ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మన పెద్దలు వ్రాసిన నీతులు, నియమాలు ఈనాటి కాలానికి, సామాజిక పరిస్థితులకు సరిపోతాయ?(సరిపడకనే అందరు నీతి తప్పుతున్నారా?) నీతి నియమాలంటే ఎప్పుడూ మారనివా?లేక కాలానికి తగిన విధంగా మారాల?అసలు మత గ్రంధాలలో చెప్పిన వాటిని నీతి నియమాలంటారా లేక వేరే ఏమైనా అంటారో "అవి"ఎప్పటికీ అలాగే వుండాలా?మారాలా? మత గ్రంధాలే మనిషి జీవితానికి ముఖ్యమైన మార్గదర్శకాలు అయినప్పుడు, వాటిని ఎందుకు ఎవరూ రివైస్ చెయ్యరు? చట్టం లో ఎలా మార్పులు చేసుకుంటున్నమో మత నియమాలు, జీవన మార్గదర్సకాలైన ఈ నియమాలు ప్రజలని,సమాజాన్ని మంచి మార్గంలో నడిపే విధంగా ఎందుకు ఎవరూ తిరిగి వ్రాయటంలేదు.(ఇదే ప్రశ్న ఒక సారి ఎవరినో అడిగితే నువ్వే వ్రాయొచ్చుకదా అన్నారు, నాకెందుకొచ్చిన గొడవ అని నోరుమూసుకున్నా అప్పటినుండి). కానీ దేవుడు, మతం ఇవన్నీ చాలా అంతులేని కంఫ్యూజన్. నాకు తెలిసిన బెస్ట్ మతం హృదయం/మనసు(నా హృదయం నాదగ్గరలేదు ఎవరికో ఇచ్చేసాను అని చెప్పకండి ప్లీజ్, నేను చాలా సీరియస్ విషయం చెప్తున్నాను).   

అసలు పిల్లలికి ఇన్ని అనుమానాలు ఎలా వస్తాయో? అందులోనూ వీడికి ఈ దేవుడి డౌట్లే ఎందుకొస్తాయో? పిల్లలికి దేవుడూ, భక్తి ఇవన్నీ నేర్పాలి అంటారు ఇంట్లో అత్తయ్య వాళ్ళు. నాకే అన్ని అనుమానాలున్నప్పుడు నేను ఏమని నేర్పను? నాకేమనిపిస్తుందంటే కొంత వయసు వచ్చాక ఎలాగు పిల్లలికి అన్ని మతాల గురించి తెలుస్తుంది, లేదంటే అని మతాల గురించి తెలియ జేసి, వారు ఏ మత మార్గం పాటించాలనుకుంటున్నరో ఎన్నుకొనీయాలి.లేదా మతమే లేకుండా బతికే అవకాశం ఇవ్వాలి.ఇలా ఆలోచనలు రేపుతున్న పిల్లలే మనల్ని ఎదిగేలా చేస్తుంటారు,కానీ మనమేమో మనమే పిల్లల్ని పెంచుతున్నాము అనుకుంటాము.అంతా మన పిచ్చి. 

లక్కీ ఇలా దేవుడి గురించి ఏదో అడిగేసి నాతో తిట్లు తినేసి ఎంచక్కా వెళ్లిపోయి ఆడుకుంటాడు లేదా కార్టూన్ చూసుకుంటాడు. నేనేమో పిచ్చిదానిలా పైన చెప్పినవన్నీ అలోచించీ,చించీ నా బుర్ర పాడు చేసుకుంటాను. అప్పుడొస్తుంది వాడి మీద కోపం, వెంటనే లక్కీ ని పిలిచి "ఒరేయ్ ఇంకెప్పుడైనా దేవుడి ప్రశ్నలు వేశావంటే తంతాను జాగ్రత్త" అని బెదిరిస్తాను. వాడు అదేమీ పట్టించుకోకుండా వెంటనే "అమ్మా దేవుడు ఏ రంగులో వుంటాడమ్మా?, కృష్ణ కార్టూన్ లో మరి కృష్ణుడు బ్లూ కలర్ లో వున్నాడేంటమ్మా? అలా రంగు పూసుకున్నాడా? అంటే దేవుళ్ళు మనలాంటి కలర్లో వుండరా? వాళ్ళదగ్గర బోల్డంత బంగారం వుందా?" ..........

"దేవుడా!!....ఏదో ఒక దేవుడా!!....నన్ను ఈ పిల్ల పిశాచిగాడి ప్రశ్నల నుండి కాపాడు ప్లీజ్.. నీకు పూజలు చెయ్యలేదని ఇలా కక్ష తీర్చుకుంటున్నవా, కొంపదీసి???"  


Monday, June 14, 2010

రేపిస్ట్...... కవిత్వం.

మనసు బాధగా వుంటే కవిత్వం వస్తుందా, లేక సంతోషంతో పరవశిస్తే కవిత్వం వస్తుందా? నాకైతే ఈ రెండు సంధర్భాలలో కూడా కవిత్వం రాదు. ఎందుకంటే నాకు అసలు కవిత్వం రాదు కదా అందుకన్నమాట.

కానీ విచిత్రం ఏమిటంటే కవిత్వం చదవటం కూడా రాని ఈ కవిత్వనిరక్షరాస్యులాలితో కూడా జీవితంలో కొన్నిసార్లు కవిత్వం చెప్పించగలిగాడు ఒక మహానుభావుడు.ఆ మహానుభావుడి గురించి, నా కవిత్వం గురించి చెప్తాను వింటరా?కానీ ముందే చెప్పేస్తున్న అదో పేద్ధ కధ.మీకు ఓపిక వుంటేనే మొదలుపెట్టండి.

నాకు వెలుగులో పోస్టింగ్ ఏ మండలమో ఎంచుకోమని అందరికీ ఇచ్చినట్లే అవకాశం ఇచ్చారు. మండలం సైజు బట్టి ఎంతమంది టీము అనేది నిర్ణయించారు. పాపం మా వాళ్ళందరు వాళ్ళ ఇంటికి దగ్గర అని, బంధువులున్నవనీ, ప్రయాణం సులభం అని, బస్సులు అన్ని ఊర్లకు వున్నయనీ ఇలా రకరకాలుగా నాకు ఈ మండలం కావాలి అంటే నాకు ఇది కావాలి అని కొట్టుకుంటున్నారు. నాకు ఏ మండలమైన ఒకటే ఇంటికి ఎంత దూరంగా వుంటే అంత మంచిది కదా! నాలాగే నా పి.జి క్లాస్మేట్ శ్రీను అలాగే వెంకటేశ్వర రెడ్డి అని ఇంకో అబ్బాయి ఏ రాయి ఐనా ఒకటే తల పగలగొట్టుకోడానికీ అని చెప్పారు( అదే ఏ మండలం అయిన ఒకటే అని పని చెయ్యడానికి అని మర్యాదగానే చెప్పారనుకోండి). సో మొదట ఆ విధంగా మేము ముగ్గురం మరాఠీల గ్రూపు ఎవరు వెళ్ళము అని చెప్పిన వజ్రపుకొత్తూరికి వెళ్ళడానికి సిద్ధం అయ్యాము.శ్రీను అంటే నాకు బాగా తెలుసు ఎందుకంటే మా ఇద్దరిదీ పరీక్షల్లో చూసి కాపీ కొట్టిన ధృఢమైన బంధం. పి.జి లో మొదట ఏదో పరీక్ష రోజు వచ్చాడు, నా వెనక కూర్చొని నీ అన్సర్ పేపర్ చూపిస్తావ చచ్చిపోవాల అనే లెవెల్ లో బెదిరించాడు. సరే నాకు కూడా ఎందుకో మరి చూడగానే నచ్చాడు నా సైజులో వున్నాడు. ఇక అప్పటినుండి మేము స్నేహితులం. మరి శ్రీను వున్న తరువాత ఆ ఇంకో మూడో మనిషి ఎవరైతే నాకేంటి గొట్టం అనుకున్నాను. కానీ ఆ గొట్టం అదే ఆ మూడో అబ్బాయే నాతో కవిత్వం చెప్పించగల మహానుభావుడని నాకు అప్పుడు నిజ్జంగా తెలీదు. ఆ మహానుభావుదు చాలా పొడుగ్గ జెండా కర్రలా వున్నాడు నా దగ్గరకొచ్చి నేనే ఆ మూడో మనిషిని రేపు మనం ఫీల్డ్ కి వెళ్ళాలి కదా ఎక్కడ కలవాలి అని అడిగాడు. నాకసలే పొడుగ్గా వున్న వాళ్ళంటే పరమ చిరాకు ఎందుకంటే నేను పొడుగ్గా లేను కదా మరి. సరే నీ పేరేంటి అని అడిగి పాపం పేరు చెప్తుంటే వినకుండానే సరే రేపు వుదయాన్నే 7 గంటలకి కరెక్ట్ గా శ్రికాకుళం బస్ స్టాండ్ కి వచ్చేయ్, నేను శ్రీను కూడా వచ్చేస్తాము, లేట్ చెయ్యకు నాకు పంక్చువాలిటీ గా లేకపోతే భలే చిరాకు అని చెప్పి నేను మర్నాడు ఖచ్చితంగా రెండుగంటల లేటుగా వచ్చేసాను. ఆ మాత్రం ఎదురుచూడలేరా అందులోనూ ముగ్గురిలో మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మాదే మెజారిటీ కదా! సరే అలా మొదలుపెట్టాము మా మొదటి ప్రయాణం వజ్రపుకొత్తూరికి. మాకు 3 ఊర్లు ఇచ్చి ఒక్కొక్కరు ఒక ఊర్లో కనీసం 2 రోజులుండాలి అని, అక్కడ గ్రామానికి సంబంధించి సమాచారం (పెద్ద ప్రశ్నా పత్రం ఇచ్చారులెండి) తేవాలని చెప్పారు. కాకపోతే ఒక చిన్న కండిషన్. మేము ఎవరన్నది చెప్పకూడదు. వెలుగు, జిలుగు అంటే ఎలాగూ ఎవరికీ తెలీదు కాబట్టి మాకు నచ్చిన అబద్ధం ఏదైన చెప్పి 2 రోజులు ఆ గ్రామంలో మా తిండి, వుండడానికి నీడ వగైరా మేమే సంపాదించుకోవాలి. ఇది మాకిచ్చిన పరీక్ష. మద్యలో మా ఆఫీసు నుండి ఎవరైన వచ్చి చెక్ చేస్తారని చెప్పలేదు కానీ వచ్చారు. పాపం కొందరు ఇంట్లో కూర్చొని కధలు చెప్పి దొరికిపోయారు. మేము కూడా ముగ్గురం మూడు గ్రామాలలో స్థిరపడ్డాము. నేను యూనివర్సిటీ స్టూడెంట్ అని గ్రామాల గురించి మా చదువని 2 రోజులు వుండడానికి ఏర్పాటు చెయ్యమని డైరెక్ట్ గా గ్రామ ప్రెసిడెంట్ ని అడిగి వాళ్ళింట్లోనే తిష్ట వేసాను. శ్రీను, రెడ్డీ కూడా అదే చెప్పారు. మొదటి రోజు బాగానే వుంది, కానీ 2 వ రోజుకి ఆ గ్రామంలో వున్న అబ్బాయిలు నేను ఇల్లిల్లూ తిరిగి సమాచారం అడుగుతుండటం, ఒక్కదాన్నే వుండటం చూసి నన్ను ఆటపట్టించటం మొదలుపెట్టారు. పల్లెల్లో వాళ్ళది కాస్త మోటు సరసం అనుకుంటా మరీ ఎవరూ లేని చోట నన్ను చూసి దారికి అడ్డంగా నిలబడి బెదిరించసాగారు.నాకు దిగులొచ్చేసింది, అయ్యో శ్రీను తో పాటు వెళ్ళినా బాగుండేది అనిపించింది. కానీ వెంకటేశ్వర రెడ్డి అకస్మాత్తుగా ప్రత్యక్ష్యం అయ్యాడు సినిమాలలోలాగా. నాకు భలే సంతోషం వచ్చింది. ఎందుకొచ్చావు అంటే అమ్మాయివి ఒక్కదానివే కదా నీకేదైనా అవసరం వుందేమో అని వచ్చాను నేను పలాస వెళ్తున్నాను అని చెప్పాడు. ఆహా నా ఫ్రెండ్ నాదగ్గర చూసి పరీక్ష రాసి పాస్ అయి కూడా నన్ను పట్టించుకోలేదు ఈ అబ్బాయి పేరు కూడా నాకు సరిగా గుర్తులేదు నాకోసం ఎంత బాగా ఆలోచించాడు అనిపించింది. అయినా కూడా ఆతరువాత చాలా సార్లు తన పేరు మర్చిపోయాను మళ్ళీ ఎందుకంటే కర్నూలు యు.ఎన్.డి.పి ప్రాజెక్ట్ నుండి ఒక 4 అబ్బాయిలు వచ్చారు అందరూ రెడ్డీలే శ్రీనివాస రెడ్డీ, వెంకటేశ్వర రెద్దీ, ఆ రెడ్డీ, ఈ రెడ్డీ అని.నేను రోజుకో పేరుతో పిలిచేదాన్ని శివారెడ్డీ, బాలక్రిష్న రెడ్డీ, నాగార్జున రెడ్డీ అని. పాపం ప్రతీ సారీ మేడం నా పేరు వెంకటేశ్వర రెడ్డీ అండి అని చెప్పేవాడు.

ఆ తరువాత 2వ సారి ఫీల్డ్ మరీ విచిత్రంగా ప్లాన్ చేసారు మా ఆఫీస్ లో. మండలంలో మొత్తం గ్రామాల లిస్ట్ ఇచ్చేసి మీరెలా చేస్తారో మీ ఇస్టం అన్ని గ్రామాలకి వెళ్ళి ఆ సమాచారం తీసుకు రండి కానీ మీరెవరో చెప్పొద్దు అన్నారు.అక్కడికి మేమేదో సి.బి.ఐ లో పనిచేస్తున్నట్లు.మాది పెద్ద మండలం,మేము ముగ్గురమే. సరే అని బయలు దేరాము. కొన్ని గ్రామాలు చేరాలంటే కనీసం బస్సు కూడా లేదు. కొన్ని గ్రామాలున్నాయని మేము తిరిగి వాస్కోడిగామాలలా కనుక్కున్నాము. వజ్రపుకొత్తూరు చాలా విచిత్రంగా వుంటుంది. మొత్తం సముద్రపు ఒడ్డు గ్రామాలు, మత్సకారులు. పల్లీలు,పట్టపు ముఖ్యమైన కులాలు. అవికాక మిగిలిన వాళ్ళు కూడా వున్నారు. కొన్ని గ్రామాలు సముద్రపు ఒడ్డునే వుంటాయి అంటే వారు అంట్లు తోమి గిన్నెలు కూడా సముద్రంలో కడుక్కుంటుంటారు అంత దగ్గరన్నమాట. అన్ని గ్రామాలలో జీడితోటలు వుంటాయి. వారికి అదే ప్రధాన పంట. ఇసుకనేల. జీడితోట వుంది ఇక్కడ మనుషులూ, ఊరు లేదూ అనుకున్నారో ఏమో అలా కొన్ని తోటల్లో గ్రామాలు రెవెన్యూ లెక్కల్లో లేవు. మేము ముగ్గురం ఒక గ్రామాన్ని కేంప్ గా పెట్టుకొని (ఎవరు తిండి నీడ చూపిస్తే వారిగ్రామం) చుట్టుపక్కల గ్రామాలు ఉదయం నుండి సాయంత్రం వరకు ముగ్గురు 3 వైపుల తిరిగి సాయంత్రానికి కేంప్ గ్రామం చేరేవాళ్ళం. ఒక్కోరోజు ఒక్కొక్కరు 2,3 కంటే ఎక్కువ తిరగలేకపోయే వాళ్ళం. రెడ్డీ ఎక్కువ కవర్ చేసేవాడు. తను సన్నగా బలంగా వుంటాడు కాబట్టి చాలా స్పీడుగా నడుస్తాడు. నేను మాత్రం వీలైనంతవరకు బస్సు తిరిగే గ్రామాలను కవర్ చేసి నడిచి వెళ్ళేవి పక్కనపెట్టేదాన్ని. కాని ఎప్పటికైనా తప్పదు కదా, రెడ్డీ తోడొచ్చాడు కొన్ని దూరం గ్రామాలకి. శ్రీను ది శ్రికాకుళం జిల్లానే. అదీ కాక శ్రీనుకి ఎప్పుడూ కడుపులో బాగుండేది కాదు. అందువల్ల శ్రీను ఎక్కువగా వచ్చేవాడు కాదు. ఒకవేళ వచ్చినా శ్రీను అర్జెంట్ గా ప్రకృతి పిలుస్తుంది అని చెరువు గట్లు చూసుకొని వెళ్ళిపోయే వాడు.ఇక నేను రెడ్డీ తనకోసం ఎదురుచూస్తు రాక రాక వచ్చే బస్సులు కూడా మా కళ్ళముందు వెళ్ళిపోతుంటే శ్రీను ని తిట్టుకునే వాళ్ళం. ఈ ప్రయాణలలో ముగ్గురం చాలా మంచి స్నేహితులయిపోయాము.ఆకలి, నిద్ర, ఇంకా మిగిలిన ప్రకృతి సహజమైన అవసరాలు, అలసట, భయాలు ఇవన్నీ మమ్మల్ని ఎంతో దగ్గర చేసాయి.నిర్మానుష్యంగా వున్న రోడ్డు మీద నడుస్తూ చిన్నపిల్లల్ల గట్టిగా అరిచేవాళ్ళం. పులి వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది అని ఒకరిని ఒకరు బయపెట్టుకొని పరిగెత్తేవాళ్ళం. ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోతే మిగిలిన ఇద్దరు తనకి సేవలు చేసేవాళ్ళం. ఒకరి పనిలో ఒకరు సహాయం చేసుకొనే వాళ్ళం. గ్రామాలలో మీటింగులు పెట్టి మేము వచ్చిన పనితో పాటు ఆ గ్రామానికి,ప్రజలకు అవసరమైన విషయాలు తెలుసుకొని వాటి కోసం ముగ్గురం ప్రిపేర్ అయ్యి మళ్ళీ మీటింగులు పెట్టి వారికి చెప్పేవాళ్ళం. చాలా గ్రామాలలో నీరు, పరిశుబ్రత, స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి ప్రత్యేకమైన మీటింగులు అడిగేవారు.ఇలా మా ఆఫీసులో ఇచ్చిన పని మాత్రమే కాకుండా మేము వేరే పని కూడా చేసే వాళ్ళం. 15 రోజుల పైనే తిరిగాము.వాళ్ళిద్దరు మొదట నేను ఉండడానికి సరైన చోటు వుండేలా చూసేవారు. కానీ చాలా సమయాల్లో మాకు స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ సెంటర్ ఇవే వుండడానికి ఇచ్చేవారు.మొదట్లో చాలా ఏడుపొచ్చేది.బాత్రూం కానీ,స్నానం కానీ చెయ్యాలంటే కానీ అవికూడా సరైన స్థలం చూసి నాకు సహాయపడే వారు. రాత్రి పూట మేము ఒకే దగ్గరపడుకున్నా కూడా వాళ్ళిద్దరు నాకోసం ఎంతో జాగ్రత్తపడేవాళ్ళు. నాకు ఉదయం మెలుకువ రాదు.కానీ రెడ్డి నన్ను ఖచ్చితంగా 3.30కి లేపేసేవాడు నా దృస్టిలో అది అర్ధ రాత్రి. కానీ తను బలవంతంగా నన్ను అప్పుడు వెళ్ళి స్నానం,బాత్రూం ముగించుకోమని నీళ్ళు పట్టి మరీ చెప్పేవాడు.చీకటికి కళ్ళుపొడుచుకున్నా ఏమీ కనిపించేది కాదు. అయినా రెడ్డీ వున్న శబ్ధం నాకు ధైర్యం ఇచ్చేది. బోరింగ్ దగ్గర స్నానం చేశానంటే ఈరోజు నాకు నేనే నమ్మలేకపోతున్నాను. నాకు మనుష్యుల మధ్య స్నెహం విలువ, ఒకరికి ఒకరు ఎంతగా సహాయపడొచ్చో అర్ధమ్య్యేది. మిగిలిన టీములు కూడా ఇలాగే స్నేహితులయ్యారో లేదో నాకు అంతగా తెలీదు కానీ మా టీములో ముగ్గురికి ఒకరంటే ఒకరికి విపరీతమైన నమ్మకం కుదిరింది.

కొన్ని గ్రామాలు మాత్రమే తిరిగాము. మండలం మొత్తం తిరగాలంటే సరైన ప్రయాణసదుపాయాలు లేకుండా కష్టమే. రామాయణం లో పిడకలవేట లాగా ఇన్ని కష్టాలు స్నేహం మధ్యలో నాకు రెడ్డీకి గొడవయ్యింది. రెడ్డీ సిగరెట్ తాగేవాడు. అది మర్యాదో లేక భయమో కానీ రెడ్డీ నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. దూరం దూరం గా తిరుగుతుండేవాడు.శ్రీను,నేను మాత్రం చాలా అల్లరి చేసే వాళ్ళం.శ్రీను చాల సరదా మనిషి. మేమిద్దరం నవ్వి నవ్వి ఇక నవ్వలేక కదుపు,బుగ్గలు నొప్పి వచ్చి కూర్చొనే వాళ్ళం.రెడ్డీ కి ఇదంతా ఆశ్చర్యం.వీళ్ళిద్దరు ఏంటి చిన్నపిల్లల్లా ఆడుకుంటారు అన్నట్లు చూసేవాడు. నాకసలు నోటి దురద ఎక్కువ కదా అలా రెడ్డీని ప్రశాంతంగా వుండనిస్తే నేను శిరీష ని ఎలా అవుతాను. ఒక రోజు యధావిధిగా మధ్యానం బోజనం అయ్యాక వేరే గ్రామానికి నడుస్తూ వెల్తుంటే ఒక గుబురు గా వునా జీడితోట కనిపించింది. బెండిగేటు దగ్గర నుండి పలాస వరకు వున్న మెయిన్ లైను తప్ప మిగిలిన గ్రామాలన్నిటికి మద్య చాలా నిర్మానుష్యమైన తోటలు, ఇసుక నేలలు చాలా దూరం వరకు వుండేవి.అక్కడ నడవాల్సిందే.చీకటి పడే లోపు ఏదో ఒక గ్రామానికి చేరాల్సి వుండేది.లేదంటే కొన్ని ప్రాంతాలు నక్సల్ ఏరియాలు. అలాంటి జీడితోట చూసి శ్రీను "శిరి, రెడ్డీ ఇక మీరు నన్ను ఆపకండి, ఈ తోట నన్ను పిలుస్తుంది (అప్పటికే మాకది కోడ్ భాష అయిపోయింది. శ్రీను కి కడుపులో గడబిడ అయితే వెంటనే బ్రహ్మానందం లా మొహం పెట్టి శ్రీను తనని ప్రకృతి పిలుస్తుంది అనడం) అని చెప్పి వెళ్ళిపోయాడు. మేము చేసేది లేక ఎటూకాని ఆ ప్రదేశంలో కూర్చున్నాము. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేరలో జనసంచారంలేదు. జీడి పళ్ళ/పిక్కల సీజన్ కాదు కాబట్టి తోటలన్నీ ఖాళీగా వుంటాయి. కాస్త కొద్దిగా చీకటయ్యే లా వుంది. నాకు కొంచెం బోరుగా, భయంగా అనిపించింది. రెడ్డీ బుద్దిగా దూరంగా ఒక రాయిమీద కూర్చొని ఇసకలో కర్రతో రామకోటి కాబోలు సీరియస్ గా రాసుకుంటున్నాడు.సరే అని తనని పలకరించా. రెడ్డీ ఏదైనా మాట్లాడొచ్చుకదండీ బోరు కొడుతుంది అన్నాను. ఏమి మాట్లాడాలండి అన్నాడు(నేను అంత త్వరగా ఎవరిని అండి లేకుండా మాట్లాడను, రాయలసీమ వాళ్ళకు అండి అని మాట్లాడతారని అసలు తెలీదనుకుంటా అందుకని నన్ను అండి అని కష్టపడి పిలిచేవాడు). సరే మాట్లాడడానికి టాపిక్ కూడా మేమే చెప్పాలి కాబోలు అనుకొని, మీ గురించి చెప్పండి మీ ఊరు, మీ ఫ్యామిలీ, చదువు, ఫెండ్స్ అన్నీ చెప్పండి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు అన్నాను. అదే నేను చేసిన తప్పు. దానికి సరైన శిక్ష వేశాడు..


సరే వినండి విన్నతరువాత మీరు ఆవిషయాలు కాస్త రహస్యంగా వుంచాలి అని చెప్పాడు. నవ్వొచ్చింది, రెడ్డి కాస్త సీరియస్ కామెడీ చేస్తాడని అప్పటికే కాస్త అర్ధం అయింది అలాగే అన్నాడేమో అనుకునా.కానీ తను చెప్పింది విని దిమ్మతిరిగిపోయింది. "మాది నంద్యాల దగ్గర చిన్న పల్లెటూరు, అమ్మ,నాన్న,ఒక అక్క,చెల్లి వున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి" అని ముగించాడు. నంద్యాల నుండి శ్రికాకుళం పల్లెటూరికి ఎందుకు వచ్చారు జాబ్ కోశం?అని అడిగా (ఇక్కడ తిండి తినలేక చాలా ఇబ్బంది పడేవాడు సరిగా ఒక్క రోజు కూడా తినలేకపోయేవాడు.మీ శ్రికాకుళం వాళ్ళు ఎందుకు చింతపండు నీళ్ళు చేసి దానితో బతికేస్తారు అని తిట్టుకునేవాడు.) దానికి సమాధానంగా దీర్ఘంగా కాసేపు ఆలోచించి"నేను ఒక తప్పు చేశాను, ఒకమ్మాయిని రేప్ చేశాను. పోలీసులు నాకోసం వెతుకుతున్నారు, మా ఇంట్లో వాళ్ళకి ఒక్కడినే కొడుకుని కదా కేసు మేము చూసుకుంటాము నువ్వెక్కడైనా దూరంగా వెళ్ళిపో అని చెప్పారు. అందుకే ఇంత దూరం వచ్చాను.ఇన్ని సమస్యలు పడుతున్నాను.నా జీవితం నీలాగా శ్రీనులాగా హాయిగా నవ్వుకునేది కాదు." అని చెప్ప్పాడు."రేప్ చేశావా!!! ఎందుకు చేశావు?" అని అడిగాను. తరువాత అర్ధం అయింది ఎంత చెత్త ప్రశ్న వేసానో ఆ షాక్ లో అని. "ఎందుకంటే ...ఏమో చెయాలనిపించిందీ, ఆ అమ్మయి బాగుంటుంది నీలాగ.ఒక్కతే దొరికింది" అని చెప్పాడు. నా లాగానా?, ఒక్కతే దొరికిందా!! నాకు ఏంటో కళ్ళుతిరిగినట్లు,పడిపోతున్నట్లు అనిపించింది.కానీ హమ్మో ఈ టైములో కళ్ళు తిరిగి పడిపోతే నన్నుకూడా రేప్ చేస్తాడేమో!అని భయం వేసింది.ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా కూర్చున్న చోటునుండి లేచి నడవటం మొదలుపెట్టాను.అవసరమైతే పారిపోడానికి సిద్ధంగా అన్నమాట.చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ లేరు, రేప్ చేసి పోలీసులనుండి పారిపోయి వచ్చి తీరికగా కూర్చున్న రెడ్డీ తప్ప.ఏమీ ఎరగనట్లు మళ్ళీ ఇసుకలో రాసుకుంటూ కూర్చున్నాడు.హుహ్..జీవితం మీద విరక్తి లాంటిది కలిగింది ఆ భయంలో, విరక్తి లో అప్పుడొచ్చింది మొదటిసారి నాకు కవిత్వం.

"ఎరక్కపోయి అడిగాను ఇరుక్కుపోయాను.


నేను ఎరక్కపోయి అడిగాను ఇరుక్కుపోయాను


ఎవరో రావాలీ ..నన్ను ఇక్కడనుండి తీసుకొని పోవాలీ..."


బాగుందా నా మొదటి కవిత? ఏంటి ఇది కవిత కాదా?ఎందుకు కాదు, కవిత్వం అంటే కడుపులోతుల్లోంచి తన్నుకొని వచ్చే భావమే కదా?(అది వాంతి అంటార కొంపదీసి!!)ఏంటి ఇవి సినిమాలలో పాటలా?ఏమో నాకు సినిమా ఙ్ఞానం బాగా తక్కువ.ఇది మాత్రం నా కవితే.

ఇక ఆతరువాత నేను ఆ విపత్కర పరిస్థితుల నుండి ఎలా తప్పించుకున్నానో తెలియాలంటే తరువాత పోస్ట్ వరకు ఎదురుచూడాల్సిందే. నేను క్షేమంగా బయటపడాలని ప్రార్ధనలు జరపండి ప్లీజ్.

Sunday, June 6, 2010

షీబా ...washing body(with image)



మొత్తానికి వెలుగు ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాను,అదేంటో తెలియక పోయినా. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గిరిజా శంకర్ గారు. ఇప్పుడు కడప జె.సి. ఆయన మాకు ఎప్పుడూ బాస్ లాగా లేరు. అతను తన సీట్ లో ఆఫీస్ రూం లో కూర్చుని ఉండగా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ మా మధ్యన, క్రింద కార్పెట్ పైన కాళ్ళు చాపుకొని కూర్చునే వారు. మా ట్రైనింగ్ లో మొట్టమొదట రూల్ అందరు క్రింద కూర్చోవాలి. ఎందుకంటే పల్లెల్లో పనిచేసేప్పుడు స్టైల్ గా పెద్ద ఆఫీసర్ వచ్చారన్నట్లు కుర్చీలో కూర్చోవటంతోనే మనకి ప్రజలకి మధ్య దూరం మొదలవుతుంది అని చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే అయినా పెద్ద తేడా చూపించే ఎన్నో విషయాలు ఆచరించి మరీ చూపించేవారు.ఎప్పుడో చిన్నప్పుడు ట్యూషన్లో క్రింద కూర్చోవటమే తప్ప తరువాత అంత కుర్చీలు అలవాటైన చాలమందికి మొదట్లో రోజుకి 18 గంటలు క్రింద కూర్చోవాలంటే కస్టంగా వుండేది. నాకు కూడా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన కాళ్ళ జాయింట్ దగ్గర కమిలిపోయి బండబారిపోయిన చర్మం మళ్ళీ ఫ్రెష్ గా కమిలిపోయింది. ఈ ఒక్క చర్మమే కాదు ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక నా మొత్తం చర్మం కలర్ మారిపోయింది. కొన్నిరోజులయ్యక ఫీల్డ్ నుండి ఇంటికెళ్తే మా మమ్మీ చేపలమ్ముకునేదానిలా తయారయ్యవేంటే అని అడిగింది. అంత కరక్ట్ గ ఎలా అడిగిందో! నా పోస్టింగ్ ఒక సీ కోస్ట్ మండలం. వజ్రపుకొత్తూరు. వుండటం కూడా సముద్రపు ఒడ్డున ఇల్లు. తినేది వంజరం చేపల బ్రేక్ ఫాస్ట్, కొరమీను చేపల లంచ్, సొర చేపలతో డిన్నర్, ఎండుచేపల స్నాక్స్, పీతలు, మెత్తళ్ళు ...వగైరా వగైరా. అసలు నేను ఊరు లోపలికి ఎంటర్ అవుతున్ననటే ముందే తెలిసిపోతుంది నా వాసనకి అని మా ఇంట్లో ఏడిపించేవాళ్ళు.ఒక వేళ నాకు పెళ్ళి చెయ్యాలంటే కనీసం నెల ముందుగా నన్ను మంచి సువాసనలు కలిపిన నీళ్ళల్లో నానబెట్టాలేమో అని నాకే అనుమానం వచ్చింది. కాకపోతే ఆ బాధ లేకుండా ఇంకో చేపల కంపుకొట్టే కొలీగ్ నే పెళ్ళి చేసుకున్నాను కాబట్టి పెద్ద ప్రాబ్లెం రాలేదు.


సరే ఇక మా ట్రైనింగ్ విషయానికి వద్దాము. మేము మొత్తం 50 మంది టీం మెంబెర్స్. శ్రికాకుళం అన్ని మండలాలకి 3 నుండి 5 మంది వరకు మెంబర్స్ చొప్పున పోస్టింగ్. అదికూడా మొదట 15రోజుల ట్రైనింగ్ తరువాత సడణ్గా టీంస్ చేశి ఫీల్డ్ కి పంపారు. మాకు మొత్తం వెలుగు జిల్లాలన్నిటికంటే చాలా మంచి ట్రైనింగ్ దొరికింది. మొదటి 6 నెలలు ఎక్కువ రోజులు ట్రైనింగ్ లో వుండే వాళ్ళం. మాకు ట్రైనర్ గా ఐ.ఎ.ఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇచ్చే అమిత్వా ముఖర్జీ గారిని రిసోర్స్ పర్సన్ గా తీసుకున్నారు.ఆ తరువాత అలాంటి ట్రైనర్ ని నేను చూడలేదు.మాకు ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ గా షీబా అనే రాజస్థాని ఆమెని నియమించారు. అసలు మా ట్రైనిగ్ కధలో షీబా నే హీరోయిన్. మేము చూస్తే పక్క శ్రికాకుళం యాసలో మాట్లాదే తెలుగు తప్ప ఏదీ రాని 50 మంది కొత్తవాళ్ళం. షీబా చూస్తే హిందీ, ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడదు. మా టీం మొత్తంలో నేనూ శాంతా అని ఇంకో అమ్మాయి మాత్రం ఇంగ్లిష్ అర్ధం చేసుకొని మాట్లాడగలము. అదికూడా అప్పటికి అర కొరగా.  అందువలన మా ఇద్దరిని ఆస్థాన ట్రాన్స్ లేటర్లుగా నియమించారు. కొన్ని రోజులయ్యాక శాంత ని తప్పించారు. కారణం షీబా చెప్పేది తప్పించి శాంతాకి వచ్చింది చెప్తుందని అందరికీ అర్ధమైపోవటం వల్ల.సో నా పని అప్పడప్పడ తాండ్ర అయిపోయింది.అంటే షీబా చెప్పింది నిద్రపోకుండా విని అర్ధం చేసుకోవాలి, దాన్ని అదే విధంగా తెలుగులో అర్ధం అయ్యేలా మా వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ మా వాళ్ళు అడిగేది హిందీ లోనో, ఇంగ్లిష్ లోనో షీబా కి చెప్పాలి.చచ్చినా మీటింగ్ జరిగేటప్పుడు నేను కదలడానికి లేదు. మిగిలిన వాళ్ళందరికీ నిద్రవస్తే అక్కడే పడుకుని హాయిగా నిద్రపోయినా పరవాలేదు అనేంత స్వతంత్రం ఇచ్చారు. కొన్ని రోజులకి మా టీం అందరికి మాట్లాడటం సరిగా రాకపోయినా షీబా చెప్పేది బాగా అర్ధం అయ్యేది. నేను ఒక చిన్న విషయం కొంచెం వేరుగా చెప్పినా వాదించేవాళ్ళు. షీబా కి కూడా తెలుగు మాట్లాడటం రాదు కానీ అర్ధం అయిపోతుండేది. నా సెన్సార్ కటింగ్లు కూడా తిరిగి అడిగేసేది. మొత్తానికి నాకు ఇంగ్లిష్ బాగా వచ్చేసింది. అంతే కాదు ఏది చెప్పిన రెందు మూడు బాషల్లో చెప్పటం కూడా ఆటోమ్యాటిక్ గా అలవాటైపోయింది. అంటే ఫ్రెండ్స్ తో , ఇంత్లో కూడా అలాగే మాట్లాడ సాగాను. అందరూ ఏడిపించే వాళ్ళు. షీబాని తిట్టుకోవాలంటే నన్ను పిలిచి మరీ తిట్టి ఇది షీబా కి ట్రాన్స్లేట్ చెయ్యి అని చెప్పే వాళ్ళు.అటు మీటింగ్లో ప్రశాంతత లేక, బయట టీంలో వాళ్ళతో ఎగతాళి చెయ్యబడుతూ...దీన్నే అప్పడప్పడ తాండ్ర అంటారు. ట్రైనింగ్ అంటే ఒక విషయం కాదు, ఒక వారం కాదు. 6 నెలల పాటు అహా అక్కడ పనిచేసినంత కాలం ప్రతి నెల ఏదో ఒక ట్రైనింగ్ జరిగింది. ఎప్పుడూ ఎదో ఒక విషయం మీద. ఎవరో ఒక కొత్త రెసోర్స్ పర్సన్.రోజుకు 18 గంటలు అంటే వుదయం 7,8 నుండి రాత్రి 12 వరకు కూడా జరిగేది.ఆతరువాత కూడా గ్రూప్ వర్క్స్ తెల్లవార్లూ చేసే వాళ్ళం. నిద్ర ఆకలి లాంటివి వుండేవి కాదేమో.ఇప్పుడు ఆలోచిస్తే అలా ఎలా వున్నాము అనిపిస్తుంది. ఆ ట్రైనింగ్ విధానంలో వున్న గొప్పతనం అది.


ట్రైనింగ్ అంత (పార్టిసిపేటరీ)భాగస్వామ్య పద్ధతిలో జరిగింది. అంటే గ్రూప్ డిస్కషన్స్, అర్గుమెంట్స్ తో అందరూ కలసి ఒక కన్ క్లూజన్ కి వచ్చే వాళ్ళం. అప్పటివరకు నాకు ఈ ప్రొఫెషన్ గురించి ఏమీ తెలియదని అప్పుడే తెలిసింది. నాకే కాదు మా అందరికీ. ఇదొక ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్.ఇందులో మాకు అన్ని రంగాలగురించి కొంత పరిఙ్ఞనం వుండాలి. ప్రజలకు సంబందించిన అన్ని విషయాలూ మాకు కొంతైనా తెలియాలి. కనీసం ఆ సేవలందిచే వారిగురించి తెలియాలి.అవి ప్రజలకి అందుబాటులోకి ఎలా తేవాలో తెలియాలి. ఆరోగ్యం,విద్య, నీరు, వ్యవసాయం, ఋతువులు, రకరకాల వ్యాపారాలు, పశువుల పెంపకం వాటి వైద్యం, చట్టాలు, హక్కులు, వివిధ పధకాలు, సంస్థలు, అంగవైకల్యం, మానసిక వైకల్యాల  గురించి, స్థ్రీలు, పిల్లలు, ముసలి వారు, వెనుకబడిన వారు, రరకాల కుల వ్యవస్థలు, బ్యాంకింగు, స్వయంశక్తి సంఘాలు, వాటి తరువాత లెవెల్, మ్యాక్స్లు, వివిధ వృత్తులు వాటి కి వున్న సమస్యలు వాటికి అవసరమైన సపోర్టింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేదు. ఈ సమస్యలు నాలెడ్జె తో పాటు ప్రజలతో పనిచేసే వారిగా మా ప్రవర్తన, మాకు తప్పక వుండాల్సిన విలువలు, ప్రజలతో రాపో పెంచుకోవటానికీ, సమస్యలు వారికి అర్ధమయ్యేలా తెలియ చేయటానికీ వుపయోగించాల్సిన కొన్ని మాధ్యమాలు (నాటకం, పాట, స్కిట్,మొదలైన కళా రూపాలు).ప్రభుత్వంలో వున్న వివిధ శాఖలు వాటి పని తీరు, వాటి బాద్యతలు, వివిధ అధికారులు...ఎన్నని చెప్పను.ఎన్నో అన్నిట్లో శిక్షణ ఇప్పించారు. 


ఇవన్నీ ఒక ఎత్తు ఐతే వచ్చే మనుషులు వారి ప్రవర్తన, వారు నిజ జీవితంలో పాటించే, ప్రవర్తించే విధానం ఒక ఎత్తు. ఒకరికి తెలిసింది 50% అయితే మేము టీం గా ఇంతమంది దగ్గరనుండి నేర్చుకున్నది ఇంకెంతో పెరిగింది. షీబా అంటే అందరికీ హడల్.కానీ తనేమీ అనదు.నిజం చెప్పాలంటే షీబా రాజ్యం నడిచింది అని అందరూ అనేవారు. తను అనుకున్న విధంగా ప్రాజెక్ట్ నడవాలని చూసేది. మిగిలిన జిల్లాలలో కంటే చాలా భిన్నంగా చెయ్యాలనే షీబా ఆలోచన వల్ల కొన్నాళ్ళు శ్రికాకుళం ప్రాజెక్ట్ వెనకపడింది అని మిగిలిన వాళ్ళంటారు. మేము మాత్రం (నేను మాత్రం) అలా అనుకోలేదు. చాలా ఐడీలిస్టిక్ గా వెళ్ళలని ప్రయత్నించాము.కానీ అలా కంటిన్యూ చెయ్యటం కుదరలేదు. షీబా చాలా మొండి మనిషి. గవనమెంటు నడిపే ప్రాజెక్టులు చాలా పెద్దవి. అటువంటి చోట అన్నీ ఖచ్చితంగా ఇలాగే జరగాలి అంటే కుదరదు.100 లో 90% మంది సాధారణ వ్యక్తులు. వారి మద్య షీబా ఊహించే ఐడియల్ పరిస్థితి చాలా కష్టం. ఏది ఏమైనా షీబా చాలా మందికి కష్టం అయింది.నాకు మాత్రం చాలా విషయాలలో ఇష్టమైనది. కానీ విచిత్రం ఏమిటంటే షీబా తో నేను మాత్రమే ఎల్లప్పుడూ వాదించేదానిని గొడవపడేదానిని.అందరి మన్సులో వుద్దేశ్యం షీబాకి కానీ, పి.డి.గారికి గానీ చెప్పగలిగే ధైర్యం నేను మరో 2,3 మంది మాత్రమే చేసేవారు. 


షీబా ఒక సిద్ధాంతం నమ్మింది.అన్నిటికీ, అన్ని వాదనలకి ఒకటే సమాధానం, తను పాటించే సిద్ధాంతం ఒక పెద్ద చార్ట్ మీద పెట్టి అన్నిటికంటే ఎత్తులో పెట్టేసింది.ఎవరేమడిగినా చార్టు చూపించేది.(chart is given above) ఎవరైన ఎక్కువ తక్కువగా వాదిస్తే వెంటనే "హూస్ నాలెడ్జ్ కౌంట్స్?" అని అడిగేది షీబా. షీబా మా అందరికి ఒక వింత.తనకి ఎలా వుండాలనిపిస్తే అలా వుండేది. తెల్లగా ఎత్తుగా బ్రౌన్ రంగు జుట్టుతో ఫారిన్ అమ్మయిలా వుంటుంది.ఎడమచేతి వాటం. బోజనం కూడా ఎడమ చేతితోనే. షీబా దెబ్బకి మా శ్రికాకుళం టీం అంతా ఇంగ్లిషే మాట్లాడే వాళ్ళం. వచ్చినా రాకపోయినా సరే. తను కూర్చునే విధానం, నడక, బట్టలు వేసుకునే పద్ధతి అన్నే మాకు వింతే. చిన్నప్పటినుండీ విదేశాలలో పెరిగింది,కానీ గ్రామాలలో పనిచేసింది. 


బాబూ రావ్ అని మా టీం లో ఒకతను వుండేవాడు. అతను మంచి కళాకారుడు. ఎంత పెద్ద మీటింగ్ అయినా, ఎంత వ్యతిరేకత వున్న వారినైనా తన మాటలతో పాటలతో మైమరిపించేసేవాడు. కానీ ఇంగ్లీష్ అంటే మాత్రం చాలా కష్టపడి ప్రయత్నించేవాడు. ఒకసారి మేమంతా ఒక గ్రామానికి మొదటిసారిగా పి.ఎం.ఎల్.పి(పార్టిసిపేటరీ మైక్రో లెవెల్ ప్లానింగ్) చెయ్యతానికి వెళ్ళము. అదే  గ్రామంలోని తుఫాన్ బిల్డింగులో మా బస. బోరింగులదగ్గర స్నానాలు. ఆడవాళ్ళందరం (షీబా తప్ప) తుఫాన్ బిల్డింగులో వున్న స్నానాల గది ఉపయోగించేవాళ్ళం.ఒకరోజు ఎవరూ రాని సమయం చూసి ముఖ్యం గా షీబా రాని టైము చూసి (షీబా ఎప్పుడూ సిగ్గుపడతం, మొహమాటపడటం చెసేది కాదు, అందుకని అబ్బాయిలే ఆమెదగ్గర సిగ్గుపడే వాళ్ళు)బోరింగ్ దగ్గర స్నానాలు మొదలు పెట్టారు. కాపలాగా బాబూరావుని పెట్టారు. కాని వాళ్ళ అదృష్టం కొద్ది షీబా అటు వైపు దూసుకుంటూ వచేస్తుంది. అది చూసి బాబూరావు హడావిడిగా షీబాని ఆపాడు. 


షీబా: వై? వై ఆర్ యు స్టాపింగ్ మి బాబూ రావ్ ?   
బాబూ రావు: మేడం దేర్, జెంట్స్ వాషింగ్ మేడం. యు నో గో
షీబా: వై? వాట్ ఆర్ దే వాషింగ్? ఐ విల్ సీ
బాబూ రావు: నో మేడం. దే ఆర్ వాషింగ్ దెయిర్ బాడీస్
షీబా:??????  వేర్?
బాబూరావు: ఎట్ బోర్ 


అబ్బాయిలు బోర్ దగ్గర స్నానం (వాషింగ్ బాడీ) చేస్తున్నారు మీరు వెళ్ళొద్దు అని చెప్పడానికి వచ్చిన తిప్పలు షీబాకి ఒక్క ముక్క అర్ధం కాలేదు. 


ఇలా షీబా బాధితులు ఎందరో మాలో. కానీ అన్నీ మా ఎదుగుదలకే ఉపయోగపడ్డాయి.మొండిగా మాతో ప్రజలతో కలిసి పనిచేసేప్పుడు ప్రజల అవసరాలు, ప్రజలదగ్గర వున్న వనరులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, ప్రజలతోనే ప్లాన్ చేయించి(వారి పరిస్తితి,శక్తి,టైము వాళ్ళకే తెలుసు కనుక)ప్రజల నిర్ణయంతోనే వారి భాగస్వామ్యం 100% వుండేలా చాలా రియలిస్టిక్ వుండాలని పట్టుపట్టి మరీ ప్లాన్స్ తయారు చేయించింది.గ్రామాలలో చాలా కష్టాలు పడ్డాము. ఎందుకంటే, గ్రామస్థులు ఎప్పుడు అన్నీ గవర్నమెంటు ఇస్తే తీసుకోవాలని చూస్తారు.షీబా అలా చేసే ప్లాన్ ని ఒప్పుకోదు. అది జరగదు, వారి వనరులతో మాత్రమే వుండే ప్రణాలికకి,ప్రాజెక్టులకు సుస్థిరత వుంటుంది అనేది తన వాదన. అది చాలా నిజం. ఆ నిజం కొన్ని సంవత్సరాలు పనిచేస్తే కానీ అనుభవం కాలేదు.

Wednesday, June 2, 2010

దీప ఫోన్ చేసింది

నిన్న రాత్రి చాలా రోజుల తరువాత నాకు తెలిసిన దీప అనే  ఒకమ్మాయి ఫోన్ చేసింది. నేను వెలుగులో వజ్రపుకొత్తూరులో పనిచేస్తున్నప్పుడు మా దగ్గర ఏక్టివిస్ట్ గా చేరింది అప్పట్లో. అంటే ప్రతి ఒక గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు ఏక్టివిస్టులు తీసుకున్నాము. ముఖ్యంగా చదువుకున్న మహిళలు లేదా అమ్మాయిలు. అలా దొరకకపోతే కాస్త అందరికి సమ్మతమైన చదువుకున్న అబ్బాయిలు. గ్రామస్థులే , గ్రూపుల మహిళలే వారిని ఎన్నుకునే వారు. వీరికి మొదట్లో వెలుగు నుండే హానరోరియం ఇచ్చే వాళ్ళం. వీళ్ళు గ్రూపులకు(స్వయం శక్తి సంఘాలకు) పని చేస్తారు, సంఘాలు తయారు చేయటం, మీటింగులు ఏర్పాటు చేయటం, మీటింగ్ జరుపుకొనే పద్ధతి, అవసరమైన హండ్ హోల్డింగ్ సప్పోర్ట్ ఇస్తారు. గ్రూపు పుస్తకాలు కూడా రాసేవారు. ఇవన్నీ చెయాడానికి వీరికి అవసరమైన ట్రైనింగ్ మేము ఇచ్చేవాళ్ళము. వీళ్ళ పని తీరు సమీక్ష మా జాబ్ లో ఒక భాగం.

సరే ఇక అసలు విషయానికి వస్తాను. నేను కాస్త చిన్నగా వుండటం వల్ల నా ఏక్టివిస్టులందరూ కూడా కాస్త చిన్న వయసు వాళ్ళు, ఎక్కువగా ఆడవారు వుండే వారు. నాకు అది చాల ప్లస్ పాయింట్ అయింది. వీళ్ళంతా గ్రూపు మహిళలతో చక్కగా కలిసిపోయే వారు. కానీ నాణేనికి బొమ్మ బొరుసు లాగా  కొన్ని మంచి కొన్ని చెడు కూడా చూశాను.ఎప్పుడూ ఇల్లు, లేదా ఊరు దాటని వారికి ఈ ఏక్టివిస్ట్ పొజిషన్ వల్ల అనుకోకుండా కావలసినంత స్వంతంత్రం, చేతిలో వారి సంపాదన, ఎక్స్ పోజర్ దొరికింది. ఈ స్టేజ్ ని చాలా వరకు అందరూ కొన్ని కష్టాలతో అయిన బాగానే దాటారు. ఎప్పుడూ లేనిది ఎక్కడ చూసినా వీళ్ళే మీటింగులని, బ్యాంకు పని అని ఎప్పుడూ తిరుగుతూ కనిపించటం, ఎక్కువమందితో మాట్లాడటం, వెలుగు టీం లో, బ్యాంకులలో, గవర్నమెంట్ ఆఫీసులలో తిరగటం, అక్కడి మగవాళ్ళతో కలిసి మాట్లాడటం, పగలు రాత్రి అని తేడా లేకుండా పని చేయటం, ప్రయాణాలు చేయటం మొదలైనవి అన్నీ అంత చిన్న పల్లెల్లో తీవ్రమైన అలజడి తీసుకొచ్చింది. వెలుగు కి మొదట్లో ఆఫీసు లేదు. అసలు చిన్న పల్లెల్లో మేము 4,5 మంది వుండడానికి సరైన ఇల్లే దొరకలేదు. చాలా చోట్ల కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ఇంటర్యూలో ఒప్పుకున్న విధంగా పనిచేసే మండలాలలో వుండేవాళ్ళు కాదు. నేను వుండలేను అని ఇంటర్యూలో చెప్పాను కానీ వజ్రపు కొత్తూరు మండలం లో మా టీంతో కలిసి అక్కడ పనిచేసినంత కాలం అలాగే వున్నాను. మాకు కావలసింది లెట్రిన్ వున్న ఇల్లు. అది మండలం అంతా వెతికితే ఒకటే దొరికింది. అందరూ అదే ఇంట్లో వున్నాము. బెడ్రూములు వేరు అమ్మాయిలకు అబ్బాయిలకు. కామన్ కిచెన్, కామన్ బాత్ రూం. ఆ కష్టాలన్నీ వేరే టపా లో రాస్తాను. సో ఇటువంటి పరిస్థితులలో వెలుగు అంటే ఏంటో ఎవరికీ అంతగా తెలియని టైములో మేము మా ఏక్టివిస్టులు అందరికి ఒక వింత టాపిక్ గా తయారయ్యాము. నేను నాలాంటి స్టాఫ్ వేరే చోట నుండి వచ్చాము కాబట్టి మా గురించి ఎలాగూ ఏమి మాట్లాడుకున్నా మాకు కలిగే ఇబ్బంది కంటే కూడా అక్కడే గ్రామాల నుండి వచ్చిన వారికి కలిగే ఇబ్బంది ఎక్కువ. అప్పుడే కాలేజి నుండి వచ్చిన ఆవేశం తప్ప జీవితం గురించి సమాజంలో వున్న మంచి చెడుల గురించి తెలియనితనం నాది. తెలిసినా, పుస్తకాల లో చదివిన విధంగా జీవితంలో అన్నీ ఆచరణలో పెట్టేందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలని తెలియని వయసు. నేను  చిన్నప్పటి నుండి ఆడ మగ అని అడ్డుగీతలు గీసి స్నేహం చెయ్యలేదు ఎప్పుడు. దానికి కారణం మా ఇంట్లో మేము అంతా ఆడపిల్లలం అయితే మా బంధువులందరికి ఎక్కువగా మగపిల్లలు. మా తమ్ముడి స్నేహితులు మాకు కూడా స్నేహితులే. మా ఇంట్లో కూడా ఎప్పుడూ అలాంటి ఆంక్షలు విధించలేదు.కాబట్టి నేను ఇద్దరితో ఒకేలా ప్రవర్తించగలిగే మెచ్యూరిటీ అలవాటయింది.

మా జాబ్ కి నా ఆలోచనా తీరు ప్రవర్తన సరిపోయిందేమో! కానీ పాపం చిన్న పల్లేల్లో పుట్టి ఎన్నో ఆంక్షల మధ్య పెరిగిన అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ వుద్యొగంలో కొన్ని కష్టాలు తప్పలేదు. అసలు ఈ వుద్యోగం ద్వార కలిగిన పరిస్థితుల్లో బ్యాలన్స్ తో నిలబడటానికి చాలా మందికి కొంత టైము పట్టింది.మొదట్లో మీటింగులో కూర్చోమంటే అమ్మాయిలంతా ఒక వైపు అబ్బాయిలంతా ఒక వైపు కూర్చునే వాళ్ళు. మేము కూడా. కానీ కొన్ని రకాల ఆటలు ఆడించి ఆ రెండు గ్రూపులని కలిపేసే వాళ్ళం. ఇక్కడ కలిసి పని చెయ్యాలంటే నమ్మకం చాలా ముఖ్యం. ఒకరిమీద ఒకరికి నమ్మకం, స్నేహం, అందరు కలిసి టీం గా పనిచెయ్యల్సిన టీం స్పిరిట్ కావాలి.కొంచెం ఇస్టం కొంచెం కష్టం సినిమాలో హీరోయిన్ కళ్ళుమూసుకొని వెనక్కు పడిపోతుంది కానీ హీరో మాత్రం ఆమెని పడిపోకుండా పట్టుకుంటాడు. అలా  ఎందుకు చేశావు అంటే నేను పడనని నాకు నీ పై వున్న నమ్మకం అని చెప్తుంది. ఇదే  ఆట మా టీం స్ లో 10 సంవత్సరాల క్రితం  ఆడించారు. ఒకరితో ఒకరు సరిగా మాట్లాడే వారు కాదు మొదట్లో. కానీ ఇవన్నీ ఒకొక్కటే తగ్గిస్తూ రావటానికి చాలా సమయం పట్టింది. కానీ అందరు ఈ ట్రాన్సిషన్ బాగా తీసుకున్నారు అని  చెప్పలేను. అలాంటిదే దీప కధ.

దీప అప్పటికి ఇంటర్ చదువుతుంది. చిన్నగా, అమాయకంగా నవ్వుతూ సిగ్గుపడుతూ వుండేది.చాలా మంది ఆడవాళ్ళు ఊరికే ఎందుకు సిగ్గుపడుతుంటారో నాకెప్పుడు అర్ధం కాదు, బహుశా అది సొగసేమో!!మా మమ్మీని అడిగితే నాకు లేని విషయాలు నన్ను అడగకు అని చెప్పింది. (అంటే ఆవిడకి సిగ్గులేదని కాదు, అనవసరంగా అలా సిగ్గుపడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె లో ఎక్కువ చూసింది విపరీతమైన గుండె నిబ్బరం.అందుకే ఆమెకి వున్న గుండె జబ్బుకి డాక్టర్లు ఎప్పుడో చనిపోతావు అని చెప్పినా కూడా ఇప్పటికి 30 సంవత్సరాలుగా మా అందరికంటే ఏక్టివ్ గా బ్రతికి చూపిస్తుంది.సో ఈ బ్యాక్ గ్రౌండ్ వల్ల నా పెళ్ళిలో కూడా నేను సిగ్గుపడలేకపోయాను. ) సరే దీప దగ్గరికి వద్దాము. నాకు అందరి ఏక్టివిస్ట్ ల  కంటే దీప అంటే ఎక్కువ ఇష్టం వుండేది. ఎందుకంటే దీప తెలివైనది, స్వీట్ గా వుంటుంది.కానీ ఒకరోజు నాకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది.

ఇంట్లో ఆఫీస్ పని మీద నా దగ్గరకొస్తున్నాను అని చెప్పి ఉదయం వెళ్ళిన అమ్మాయి రాత్రి అయిన రాలేదు. వాళ్ళ ఇంట్లో నాదగ్గర వుందేమో అనుకుని ఊరుకున్నారు. నేను ఫీల్డుకి వెళ్ళడానికి నా కైనటిక్ హోండాలో పెట్రోల్ అయిపోతే దీప వాళ్ళింటిపక్కన వుండే వాళ్ళు మాత్రం పెట్రోల్ స్టాక్ పెడతారు ఇంట్లో(దొంగతనంగా) అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు టైము సాయంత్రం 4. దీప వాళ్ళ అమ్మగారు గుమ్మంలో నిలబడితే  పలకరించాను, దీప వుందా అండి అని. ఆవిడ అయోమయంగా చూసి మీ దగ్గరకే వచ్చింది వుదయం 7 కే అని చెప్పారు.అదేంటండీ నేను అసలు పిలవలేదు, రేపు  మాకు మీటింగ్ వుందని ఈరోజంతా మేము ఆ పనిలో వున్నాము అని చెప్పాను. ఆవిడ నావైపు చాలా కోపంగా చూసి లోపలకి వెళ్ళిపోయింది. నాకు వెంటనే చాలా భయం వేసింది. ఎందుకో గానీ పెట్రోల్ ట్యాంకు ఫుల్ చేయించాను. వెంటనే ఇంటికెళ్ళి మా కొలీగ్స్ కి విషయం చెప్పాను. అందరు ఫీల్డు కి వెళ్ళే ప్రొగ్రాం కేన్సిల్ చేసుకొని కూర్చున్నాము. రకరకాల ఆలోచనలు చేశాము.దీప చాల అమాయకంగా కనిపించినా తెలివైన అమ్మయి అని మా అందరి అభిప్రాయం. తనకి ఎవరితోనూ లవ్ ఎఫైర్ వున్న సూచన కూడా లేదు. ఒక వేళ వున్నా అంత అర్జెంటుగా పారిపోయే అవసరం లేదు కదా!నాతో ఎంతో చనువుగా మాట్లాడుతుంది, తనకి చదువుకోవాలనే కోరిక వుందని చెప్తే నేనే ఫీస్ కట్టి వాళ్ళ ఇంట్లో కూడా వొప్పించాను. ఇప్పుడు దీపకి ఏమైనా ఐతే బాధ్యత నాదే అనిపించింది. ఒకవేళ ఈ డిగ్రీ పనిమీదే ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్ళిందా! నా పేరు ఉపయోగించుకున్నప్పుడు నాకొక మాట చెప్పొచ్చుకదా! నేను తన అమాయకత్వం చూసి మోసపోయానా లేక దీప ఎవరిమాటలో నమ్మి మోసపోయిందా! అలా అయితే అసలు ఆమే ఇంట్లోనుండి బయటకి రావడానికి కారణమే నేను కదా. నాకు నిజంగా నా వుద్యోగం ఎంత బాద్యతా యుతమైనదో, ఎంత  రిస్క్ వుందో అప్పుడు తెలిసింది. వెంటనే మా టీం లో వున్న 5 మంది  దీపకోసం వెతకడానికి బయలుదేరాలని నిర్ణయించాము. పలాస దగ్గరలో వున్న పెద్ద ఊరు.ఎవరెక్కడికి వెళ్ళాలన్నా పలాస వెళ్ళాల్సిందే. అదీ కాక మా వెలుగు టీం చుట్టుపక్కల ఊర్లలో ముఖ్యంగా బస్సుల వాళ్ళకి, షాపుల వాళ్ళకి బాగా తెలుసు. సో  వాళ్ళు దీపని చూస్తే వెంటనే ఎక్కడికి వెళ్ళింది తెలిసిపోతుంది. అలా అని  మేము మా టూ వీలర్స్ తీసుకొని మనిషి ఒక వైపు  వెళ్ళాలని ఎప్పటికప్పుడు ఇన్ ఫర్మేషన్ మా ఇంటి ఓనర్ అక్కకి ఫోన్ చేసి అప్ డేట్ చెయ్యాలని నిర్ణయించుకొని బయలుదేరాము.

కానీ కరెక్ట్ గా ఊరు సెంటర్ దగ్గరకి వచ్చేసరికి ఊరివాళ్ళంతా పెద్ద గుంపుగా వచ్చేసారు. మేము పారిపోతున్నామనుకున్నారు. ఆ ఆలోచన కూడా మాకు రాలేదు. మేము దీప కి ఏమైవుంటుందో ని ఆలోచించాము కానీ మాకేమవుతుంది అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.కానీ పల్లెల్లో వాళ్ళని మోసం చేసి పారిపోయేవాళ్ళు ఎక్కువగా వుంటారు అందుకని మమ్మల్ని కూడా అదే కోవలోకి చేర్చారు. కానీ మా టీంలో వెంకటేశ్వర రెడ్డి కొంచెం ముందుగా గ్రహించాడు. వాళ్ళతో మీరేమి చెప్పొద్దు అని చెప్పాడు. తనే ముందుగా వెళ్ళి మేమే మీ దగ్గరకి వస్తున్నాము. గ్రామంలో కుర్రాళ్ళని అవసరమైతే మా టూ వీలర్స్ ఇచ్చి వెతకడానికి పంపాలి. దీప కి ఏమి కాకుండా త్వరగా బయలుదేరండి అని చెప్పాడు. ఆ మాటలు విని గ్రామ పెద్దలు కాస్త శాంతించినా దీప వాళ్ళ కుటుంబం, ఇంకా కొందరు  మా మీద కోపం వుందో ఏమో మీరే ఏదో చేశారు అని గట్టిగా అరవటం మొదలు పెట్టారు. నాకు అర్జెంట్ గా పోలీస్ సహాయం తీసుకోవాలనిపించింది. కానీ పల్లెల్లో పోలీసు, చట్టం న్యాయం అంతా ముందు గ్రామస్తులదే. మేము చాలా నచ్చచెప్పాము. అప్పటికి మా గురించి బాగా తెలిసిన సంఘం మహిళలు మాకు అండగా వచ్చారు. లేదంటే ఆ కోపంలో గ్రామస్తులు మమ్మల్ని ఏమి చేసేవారో. అసలు ఎవరూ మీటింగ్ కి ఈ రోజు రాలేదు. అంటే శిరీష మేడం పిలవలేదు అనే కదా అర్ధం. మమ్మల్ని కూడా ఈరోజు రమ్మని ఆమె చెప్పలేదు. దీప  ఎక్కడికెళ్ళిందో ఏమో అబద్ధం చెప్పి వుండొచ్చు కదా! ఒక వేళ ఆమెకి తెలిసే వుంటే వెళ్ళి దీప వాళ్ళమ్మని ఎందుకు పలకరిస్తుంది అని గ్రామపెద్దలతో వాదించారు. మా టీం మాత్రం ఆల్ మోస్ట్ అందరూ బిక్కచ్చిపోయాము. చిత్ర, నేను  ఏడుపు ఆపుకుంటూ నిలబడ్డాము.చిత్ర నా చెయ్యి గట్టిగా పట్టుకింది. రెడ్డి, ధర్మా, శ్రీను మా చుట్టూ కంచుకోటలా నిలబడ్డారు. ఒకవేళ ఎవరైనా చెయ్యి చేసుకుంటే మాకు ఏమీ కాకూడదని. ఇదే కదా స్నేహం, అదే కదా టీం లో ఒకరిపై ఒకరికి కలిగే నమ్మకం.అందుకే నేను  ఎప్పటికి మా టీం ని, ఆ జాబ్ ని మర్చిపోలేను. మొత్తానికి అబ్బాయిలు ముగ్గురూ ఆ ఊర్లో మిగిలిన కొందరు అబ్బాయిలతో కలిసి వెతకడానికి వెళ్ళారు.సాయంత్రం 5 కి వెళ్ళిన వాళ్ళు రాత్రి 11 కి వచ్చారు.కానీ దీప దొరకలేదు.ఆరోజు రాత్రి నేను  ఎప్పటికి మర్చిపోలేను. అప్పటికే నేను, చిత్ర కలిసి మా పి.డి గారికి ఫోన్ చేసి విషయం చెప్పాము. వాళ్ళు అక్కడి లోకల్ ఇన్స్ పెక్టర్ ని ఉదయాన్నే పంపిస్తామని చెప్పారు. అదే విషయం అక్కడి పంచాయతీ ప్రెసిడెంట్ కి కూడా చెప్పారు. వెంటనే కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రెసిడెంట్ కి మేము ఊరికే అల్లరిచేసే పిల్లలం కాదనీ, మమ్మల్ని ఏమీ చెయ్యకూడదని అర్ధం చేసుకున్నాడు. కానీ మేము 5మంది రాత్రంతా నిద్రపోలేదు. స్వరూప అని వేరే మండలం లో చేస్తున్న మా కొలీగ్ మరియు ఫ్రెండ్ ఆరోజు మా దగ్గరే వుండటం వల్ల తను రాత్రంతా మా అందరిని చేతులు పట్టుకొని ప్రార్ధనలు చేయించింది.మాలో ఎవరికీ దైవ భక్తి లేదు అయినా ఒకరికి ఒకరు తోడున్నామని ధైర్యంగా అనిపించింది.ఉదయాన్నే 5 గంటలకి ఇన్స్ పెక్టర్ వచ్చారు. అతనికి జరిగింది చెప్పాము. భయపడకండి నేను చూసుకుంటా అన్నారు. కానీ 7 అయ్యేసరికి దీప వచ్చేసిందని వార్త వచ్చింది.ఇన్స్పెక్టర్ గారు వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడదాము అన్నారు. మేమే వద్దండి ఆమె కూడా భయపడి వుంటుంది, ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తామని పంపించేశాము. మేము శ్రికాకుళం మీటింగ్ కి కూడా వెళ్ళకుండ ఇంట్లో వుండిపోయాము. ఆరోజు మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాము.ప్రజలకోసం పనిచేసినా కూడా, వాళ్ళ మధ్యనే బతుకుతున్నా కూడా ఎప్పటికైనా మనల్ని గమనిస్తూ వుంటారు, చిన్న తప్పు జరిగినా మనల్ని వదిలిపెట్టరు అని అర్ధం అయింది. నాకైతే అసలెందుకు ఈ కష్టాలన్నీ, నమ్మని మనుషుల మధ్య ఎందుకు వుండాలి అనిపించింది. కానీ ఆలోచిస్తే అన్నీ సహజంగానే జరిగాయి అనిపించింది.దీప నా పేరు చెప్పి వెళ్ళటం వల్లనే గ్రామస్తులు అలా స్పందించారు.

ఈ సంఘటన మాకే కాదు వెలుగు కే ఎంతో నేర్పింది. మేము ఏక్టివిస్ట్లు సెలక్షన్ కి ఒక పెద్ద పుస్తకం పట్టేన్ని రూల్స్ పెట్టేసుకున్నము. అంతే కాదు వెలుగు గురించి ప్రజలలో సరైన పరిచయం చెయ్యాలని కూడా  నిర్ణయించారు.ఇలాంటివే రకరకాల సమస్యలు మా టీం వాళ్ళు ఎక్కువగా ఎదుర్కోవలసి రావటంతో పి.డి  గారు స్వయంగా అన్ని మండలాలకు వెళ్ళి వెలుగు అంటే చంద్రబాబు నాయుడు డైరెక్టుగా అందరిమీద పెత్తనం చెయాలించడానికి ఏర్పాటుచేసిన ప్రోగ్రాం అన్నట్లు బిల్డప్ ఇచ్చారు.

దీప మాత్రం ఆరోజంతా రాలేదు. మేము దీపని ఏక్టివిస్ట్ గా తీసేయాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే  ఇదే విధంగా ఇంకెవరూ చెయ్యకూడదని. దీప ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకోవటం, ట్రైన్ చెయ్యటం ఇవన్న్నీ నాకు చాలా పెద్ద గ్యాప్. కానీ ఎవరికోసమో ఏపనీ ఆగిపోదు కదా!మర్నాడు దీప ఇంటికొచ్చింది. చిత్ర ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడారు. నాకు మాట్లాడాలనిపించలేదు. మాట్లాడితే ఏడుస్తానేమో అనిపించింది. దీప అందరికి చెప్పిన విషయం ఏంటి అంటే వాళ్ళ నాన్నమ్మ ఒంటరిగా వుంటోంది వేరే ఊర్లో. దీప వాళ్ళ ఇంట్లో ఎవరూ ఆ ముసలామెని చేరదీయరు, మాట్లాడరు.కానీ దీపకి ఆమె అంటే ఇష్టం. అందుకని అబద్ధం చెప్పి ఆమె వున్న్న ఊరికి వెళ్ళింది.రాత్రి అయిపోవటం వలన అక్కడే వుండిపోవలసి వచ్చిందంట.తను చేసింది ఒక మంచి పని అయినా కూడా దీప చెప్పిన ఒక అబద్ధం వల్ల మా టీం అంతా ఆరోజు పడిన నరకం నన్ను దీప మీద జాలి చూపనీయలేదు. ఒకేమాట మాట్లాడాను దీప తో "దీప ఇకనుండి నువ్వు రానవసరంలేదు, వేరే వాళ్ళని నీ ప్లేస్ లో తీసుకుంటున్నాము" అని. అది తప్పా కాదా నాకు తెలీదు. కానీ అది అవసరం. తరువాత చాలా సార్లు కనిపింపించినా కూడా ఎప్పుడూ నేను సరిగా మాట్లాడలేదు. ఆ తరువాత నేను అక్కడనుండి వచ్చేశాను. ఇప్పటికి 8 సంవత్సరాలు పైనే అయింది. నిన్న రాత్రి దీప ఫోన్ చేసింది.మేడం బాగున్నారా? మీరూ వెంకటేశ్వర రెడ్డీ సార్ పెళ్ళిచేసుకున్నరంటకదా, ఇప్పుడు మీరు నెల్లూరులో ఉన్నారంటకదా,చాలా సంతోషం గా వుందండి మీతో మాట్లాడుతుంటే.  నాకు కూడా పెళ్ళి అయింది, కావలిలో మా  ఆయన టెలిఫోన్ డిపార్ట్ మెంట్లో పని, నాకు ఒక పాప....నేను మిమ్మల్ని ఒకసారి కలవొచ్చా?అని అడిగి కాసేపాగి.. "ప్రైవేటుగా ఈసంవత్సరమే నేను  డిగ్రీ పూర్తి చేశాను" అని చెప్పింది. నాకు సంతోషం అనిపించింది.ఇంటి అడ్రస్ చెప్పాను. ఎప్పుడైనా వీలు చూసుకొని కలుస్తానని చెప్పింది.

దీప 8 సంవత్సరాలతరువాత ఫోన్ చేసి పాత ఙ్ఞాపకాలని మళ్ళీ గుర్తుచేసింది. ఒక్కోసారి ఎవరి కోణం నుండి వాళ్ళు సరిగా వున్నా ఇలాంటి అనుకోని సంఘటనలు అందరిని బాధిస్తాయి. తరువాత తరువాత ఇలాంటి ఎన్నో సంఘటనలు నాకు కూడా అలవాటైపోయాయి. ఏక్టివిస్టులు కూడా మాతో పాటు చాలా కష్టపడ్డారు. మంచి ఏక్టివిస్టు దొరికితే ఆ ఊర్లో గ్రూపులన్నీ బాగుపడతాయి. తరువాత కాలంలో ఒక్కో జిల్లాలో వాళ్ళని ఒక్కోలా పిలుస్తున్నరు. నెల్లూరు లో సంఘ ప్రియ అంటారు. బాగుంది కదా పేరు.