Monday, March 29, 2010

ఆత్మలతో స్నేహం కావాలి



పేరు చూసి భయపడ్డారా? పోస్ట్ చదివితే అసలు  ఓస్ స్ ఇంతేనా అంటారు!!!!

నా మొదటి జాబ్ మూడు ఫీల్డ్ విజిట్లు ఆరు మలేరియా జ్వరాలతో బాగానే వుండింది. నేను పని చేస్తున్న సమయం లో నేను నేర్చుకున్నదే ఎక్కువ, చదువులో ఏమి నేర్చుకున్నానో కూడా మరిచిపోసాగాను.

గిరిజనులు సమాజం, వారి కట్టుబాట్లు, నీతి, పద్దతులు, నమ్మకాలు అన్నీ కూడా ఏదోవిధంగా ప్రకృతితో ముడిపడి వుంటాయి. నా మొదటి పోస్టు లో చెప్పాను కదా వాళ్ళ ప్రతి పండగ ప్రకృతి కి సంబందించిందే అని. అలాగే వాళ్ళ నమ్మకాలు(మన దృష్టిలో మూఢ నమ్మకాలు), చెసే పూజలు అన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవే.

గిరిజనుల సమాజానికి/గూడేం కి పెద్ద "దిసారి". అంటే మన సర్పంచ్ లా మాత్రమే కాదు, పూజారి లా, పూర్వం రాజరికంలో రాజ్యానికి పెద్ద గురువులా.. దిసారి అంటే పూజారి, డాక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇంజనీర్, మొ.వి ఎన్నో. అలాగే ఆడవాళ్ళలో కూడా ఒక సూపర్ లేడీ వుంటుంది ఆమెని గునియా అంటారు.  ఆమె ముఖ్యంగా డెలివరీ లు చెయ్యటం, స్త్రీలకు సంబంధించిన జబ్బులకు వైద్యం, పూజలు మొ.వి  మాత్రమే కాక గిరిజనులు నమ్మే దేవత/ఆత్మ ఏదైన గునియా మీదకి వాలి అక్కడి వారితో మాట్లాడుతుందని వాళ్ళ నమ్మకం.

ఇవన్నీ బాగానే వున్నాయి కానీ, వాళ్ళు చేసే పూజలన్నిటికీ కూడా ఎదో శాస్త్రీయత వుంది అని మా సంస్థ (మా చైర్మేన్) వుద్ధెశ్యం. సో ఆ శాస్త్రీయత కనుక్కొనే పనినే మా ప్రొజెక్ట్ లో ఒక విభాగం -కాస్మో విజన్. దానిలో భాగంగా ఆయన రాత్రి పూట గిరిజన గూడల్లోకి వెళ్ళేవారు, దిసారిలతో రోజులు తరబడి అడవుల్లో గడిపేవారు, ఎన్నో తాళపత్రాలు, పాటలు(కొండబాషలోవి) చదవటం, రికార్డ్ చెయ్యటం లాంటివి చేసేవారు.నేను అవన్నీ  మూఢనమ్మకాలనీ, నాకు భయం లేదని అన్నాక అతనికి నామీద కోపం వచ్చిన తరువాత నన్ను ఆత్మలకి పరిచయం చెయ్యాలని ఆశపడ్డారు.

ఒక సాయంత్రం చలికి తట్టుకోటానికి చక్కగ చలి మంట పెట్టారు. దాని చుట్టూ మా స్టాఫ్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నాము. చైర్మేన్ గారు నన్ను వుద్ధేశించి, శిరీష నీకు భయం లేదన్నావు కదా మరి నాతో ఈరోజు రాత్రి అడవిలో కాంచా దిసారి పూజ రికార్డ్ చెయ్యడానికి వస్తావా అన్నారు. రానంటానని, భయపడతానని ఎదురుచూశారు నేను మాత్రం 9 అయ్యేసరికి అతనెప్పటికీ పిలవకపోయేసరికి నేనే వెళ్ళి అతని రూం తలుపు కొట్టాను. ఫుల్ గా మంకీ క్యాప్ లో వున్న నన్ను చూసి భయపడ్డరనుకుంటా! మారు మాటల్లేకుండా బయలుదేరారు. ఒక గంట జీప్ లో వెళ్ళాక ఇక  జీప్ పోలేదు. నేను, మా సార్, కుదూసు అనే ఒక  గిరిజన వాలంటీర్ నడిచి కాస్త దూరం వెళ్ళాము. దూరం గా నిప్పుల వెలుగు కనిపిస్తుంది. మా సార్ కి నా గురించి భయం పట్టుకుంది, వెళ్ళిపోతావా వెనక్కి కుదూసుతో అని  అడిగారు. లేదన్నాను. సరే భయపడకు ఏమి కాదులే అని  ధైర్యం చెప్పారు (అతనికే చెప్పుకున్నారేమో) అక్కడ ఒక దిసారి జుట్టులు జడలు కట్టినట్లు పెద్దగా వేళ్ళాడుతున్నాయి, చిన్న గోచి పెట్టుకొని ఒళ్ళంతా తెల్లగా ఏవేవో గుర్తులు వేసుకున్నాడు. మా సార్ కి కొన్ని కొండ బాషలు వచ్చు. ఏదో మాట్లాడారు. దిసారి నావైపు చూస్తాడేమో అని చాలా ఎదురు చూశాను. అసలు నన్ను పట్టించుకోనేలేదు. మా సార్ నా చేతికి టేప్ రికార్డర్ ఇచ్చారు, దిసారి పూజ మొదలుపెడితే రికార్డ్ చెయ్యమని. కుదూసు అక్కడ దిసారి వేస్తున్న ముగ్గుల లాంటి గుర్తులను అదేవిధంగా పుస్తకంలో గీస్తున్నాడు. దిసారి చాలా సైలెంట్ గా ముగ్గులేస్తున్నాడు. నాకు  కాష్మోరా సినిమా చూసినప్పుడు కలిగిన భయం కూడా కలగటంలేదు. దిసారి ఎదొ చిన్నగా రైం స్ చదవటం మొదలుపెట్టాడు. పూజ ఒక గంట గడిచింది. చాలా మామూలుగా వుంది.కానీ నేను ఈ విషయం  మా ఇంట్లో చెప్తే ఎలావుంటుంది అని  ఆలోచించాను. వాళ్ళు నన్ను  ఒక దెయ్యం పట్టినదానిలా చూసి భయపడతారేమో!! దిసారి గుడ్డుని బలి ఇచ్చాడు. వాళ్ళ పూజల్లో నేను ఎప్పుడూ బలి అంటే జంతువులు ఎక్కువుగా చూడలేదు. పెద్ద జాతర లా చేస్తే అప్పుడు  మేక లేదా పందిని కోసేవారు.పూజ అయిపోయాక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పాడు దిసారి. నాకు  ఎవరైనా ఏదైనా వద్దు అంటే ఇక అదే చెయ్యాలనిపిస్తుంది. కాని నా విషయం తెలిసినట్లు మా  సార్ నా వెనకే నడిచారు, ఇక నేను వెనక్కి చూసే అవకాశం లేకుండా. 

తరువాత రోజు నుండి నాకేమైన జ్వరం వచ్చిందా అని, భయపడ్డనా అని ఎదురుచూశారు. చలికి రోజూ చలి మంట వేసుకొని మీటింగ్ అక్కడే చుట్టూ కూర్చొనే వాళ్ళం.మా సార్ నన్ను భయపెట్టాలని కుదూసు తో లేదా నీలయ్యతో ఆత్మలగురించి, భూతాల గురించి  మాట్లాడేవారు. కుదూసు, సార్ మాటలు ఇలా వుండేవి: ఏమయ్యా కుదూసు, ఏంటయ్యా ఇది రాత్రి తెల్లగా పొగలా కనిపించింది, చల్లగా గదిలొనే వుంది, నాతో ఏదో చెప్పలని చూస్తుందయ్యా.

సారూ, అది కొంచెం మొండిఘటం లా వుందండి. చిన్న బాయి గూడెం దిసారి దానికి కరక్ట్ గా వొంచగలడండి,

సార్: నాకు అలావాటయ్యిందయ్యా, కుదూసు పాపం  శిరీషా మేడం అసలే చిన్నపిల్ల, మన సెంటర్ లో ఒంటరిగా వుంటుందయ్యా దిసారి వద్దు  కానీ గునియా ని పిలిపించు అసలు దానికేమి కావాలో ఎందుకొంచిందో అడుగుదాము

ఇలా మాట్లాడేవాళ్ళు అందరూ.అసలు విషయం  ఏంటి అంటే వాళ్ళు ఎంత కస్టపడి నన్ను భయపెట్టాలని చూసినా నాకు అసలెందుకో భయం వెసేదే కాదు ఎంటో మరి. కాకపోతే ఇక్కడ ఇంకో  గమ్మత్తు జరిగింది. ఇలా మాట్లాడెటప్పుడు మా మీటింగ్ లో వున్న నాతో పాటు చేరిన కొత్త స్టాఫ్ లో  రాధాక్రిష్ట్ణ  అనే  ప్రొజెక్ట్ ఆఫిసర్,సుందర్ అనే అగ్రికల్చర్ ఆఫీసర్ మొత్తానికి జడుచుకొని చచ్చెవాళ్ళు. వాళ్ళు ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చెయ్యాల్సిన వాళ్ళు కానీ ఈ  ఆత్మల కధలు విని అరుకు సెంటర్ లో  ఒక రోజు రాత్రి బాత్రూం కి  వెళ్ళినపుడు ఒకరిని చూసి ఒకరు భయపడి జ్వరం తెచ్చుకొని వెంటనే జాబ్ మానేశారు. 

నాకు భయం వెయ్యలేదు సరికదా నిజంగా ఆత్మ వుంటే ఎంత బాగుణ్ణు చక్కగా ఒక ఆత్మతో స్నేహం చెయ్యొచ్చు కదా , ఎంతసేపూ ఈ మనుషులతో మాట్లాడీ మాట్లాడీ బోర్ కొడుతుంది అనిపించేది. ఇదే విషయం మా సార్ ని  అడిగా, సార్ ఆత్మలతో ఏ భాష లో మాట్లాడాలి? ఈసారి మీకు కనిపిస్తే నన్ను కూడా పిలవండి సార్ అన్నాను. దానితో ఒక విషయం అతనికి అర్ధం  అయింది, ఈ అమ్మాయి భూతాలకే భూతం, ఇక ఈమెని  ఏ భూతం మాత్రం ఏమి చెయ్యగలదు?అని. అప్పటితో నన్ను  భయపెట్టే పని మానుకొని భయపడేవాళ్ళకి నన్ను  చూపించేవాళ్ళు. 

కానీ నాకు ఇచ్చిన  క్వార్టర్ లో మా సంస్థ సేకరించిన కాస్మో విజన్  వస్తువులన్నీ నా బెడ్రూం పక్క రూం లో వుండేవి.ఒక్కోసారి రాత్రిపూట ఏవేవో గిరిజనుల మాటల్లా వినిపించేవి. సింద్రి కి చెప్తే పక్క రూంలో పెద్దలున్నారు కదా అనేది. అంటే ఏంటి సింద్రి వుద్దేశ్యం? పక్క రూంలో వాళ్ళ చనిపోయిన పెద్దలు అర్ధరాత్రి వచ్చి మాట్లాడుకుంటున్నారనా??? ఎంత నేను లేడీ జేంస్ బాండ్ ని   అయినా, ఎంతగా ఆ మాటలు వినిపించే గదిలోకి అర్ధరాత్రి వెళ్ళాలనిపించినా ధైర్యం చెయ్యలేకపోయాను. కానీ నా ధైర్య ప్రదర్శన కోసం తెల్లవారిఝామున నిద్రలేచాక చాలాసార్లు వెళ్ళి చూసి వచ్చాను. అక్కడున్న రాళ్ళు, బొమ్మలు నావైపు చూస్తున్నట్లు నన్ను గమనిస్తున్నట్లు, నా మంచి కోరుతున్నట్లు అనిపించేది. నిజంగా దేవుళ్ళుంటే మనందరి మంచే కదా కోరుకుంటారు. అది  గిరిజన దేవుడైనా, వైజాగ్ దేవుడైనా, అమెరికా దెవుడైనా....ఒకవేళ నిజంగా దెయ్యాలుంటే కూడా నాకు ప్రోబ్లెం లేదు. ఎందుకో తెలుసా నాకు  అవికూడా ఇష్టమే కదా!!!!!! నాకు నువ్వంటే ఇస్టం అంటే పాపం ఏభూతం మాత్రం మనల్ని ఏం చేస్తుంది??కానీ నాకు ఒక్క భూతం కూడా కనిపించలేదు. వాటితో స్నేహం చెయ్యాలన్న నా ఆశ తీరనేలేదు. హుహ్ !!ఏం చేస్తాం
ఇంతకీ ఆరోజు నేను చూసిన కాంచా దిసారి  పూజ ఏదో భూతాలకోసం కాదు. కాంచా దిసారి ఆరోజు రాత్రి వాళ్ళ పెద్దలతో మాట్లాడి మర్నాడు గూడెంలో వస్తున్న విష జ్వరాలకి మంత్రించిన నీళ్ళిస్తాడంట. అతను చేసిన పూజలో చాలా వేపాకులు నూరి పెద్ద కుండలో మరగబెడుతున్నాడు. ఇంకా ఎవేవో ఆకులు కూడా వేశాడు.మరి ఈ అర్ధరాత్రి, జడలు కట్టిన జుట్టు, ముగ్గులు బిల్డప్ అంతా ఎందుకో అనిపించింది. కాని నమ్మకం కలిగించటం కోసం అయి వుంటుంది లేదా నాకు తెలియనిది ఇంకేదైనా అయి వుంటుంది. కాని ఖచ్చితంగా సినిమాల్లో చూపించినట్లు రక్తం కక్కుకోవటం లాంటిది, ఎవరికో నష్టం కలిగించేది ఏమీ లేదు.ఈ కాస్మో విజన్ విషయాలు మాత్రం మా సార్ మాత్రమే చూసేవారు. కొందరు గిరిజన దిసారీలు, గునియాలు కూడా మా సంస్థలో వాలంటీర్లు గా వుండేవాళ్ళు. అది నా విభాగం కాదు. కానీ ప్రోగ్రాం సెక్రెటరీ ని కాబట్టి ధైర్యం వుంది కాబట్టి కొన్ని సార్లు మా సార్ నా అసిస్టెన్స్ తీసుకునేవారు.

గిరిజనులకు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోరనీ ప్రకృతి లోనే వుంటారని నమ్మకం. వాళ్ళంతా మనల్ని కాపాడతారని నమ్ముతారు. వాళ్ళు ప్రకృతిలో వున్న ప్రతి జీవి కి, చెట్టుకి కూడా ప్రాణం వుందని నమ్మి అన్నిటినీ పూజ చేస్తారు.మతం ఎలా పుట్టివుంటుందో వాళ్ళని చూస్తే మనకు అర్ధం అవుతుంది.మనుషులందరినీ కలిపి వుంచగలిగేందుకు, వాళ్ళకు వచ్చే సమస్యలు అన్నిటినీ తీర్చలేకపోయిన ఏదో తెలియని శక్తి మనల్ని కాపడుతుందనే ధైర్యం మనలో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ నమ్మకం  కలిగించటం కోసం సమాజం లో కొన్ని కట్టుబాట్లు వుంచటం కోసం కొంత ముఖ్యమైన నాలెడ్జ్, సమాచారాన్ని అందరికీ తెలియకుండా మత పెద్దల దగ్గ్ర మాత్రమే వుంచుకున్నారు. ఆ  సమాచారం కలిగి వున్న వ్యక్తులు సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళయివున్నంత కాలం అందరికీ మంచిదే. కాని మనిషి దురాశాపరుడైపోయి తన వద్ద వున్న ఙ్ఞనం వేరొకరిని మోసం చెయ్యటానికి వుపయోగిస్తే మతం యొక్క వుద్దేశ్యం మారిపోతుంది.  

సింద్రి కానీ, నీలయ్యాకానీ ఏ గిరిజనులు కూడా ఎప్పుడూ భూత ప్రేతాలు వున్నాయని, మనకి ఏదో నస్టం చేస్తాయని ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళ పూజలన్నీ ఒక మంచి నమ్మకం కోసం కారణం కోసమే వుండేవి. ఏ ఆత్మ తమని బాధిస్తుందని ఎప్పుడూ చెప్పరు, భావించరు.మన లాగా పూజలు కాస్ట్లీ అఫ్ఫైర్ కాదు. దేవుడు ఒక  నమ్మకం, ఆత్మ కూడా నమ్మకమే అన్నీ మంచికొరకే.

ఇదంతా ఒ.కె. కాని మీకెవరికైనా "కాల్ ద సోల్" ఆత్మ ని పిలిచే ఆట వస్తే చెప్పండి ఒక మంచి ఆత్మని పిలిచి స్నేహం చెయ్యాలి. 

Saturday, March 20, 2010

నా స్పైడర్ మ్యాన్ - "బులు"

ఒక్కోసారి చిన్న చిన్న జీవులు కూడా మనకంటే ఎంతో గొప్పవి అని, మనమే ఏమీ చేతకాని వాళ్ళం అనిపిస్తుంది. ఒక చిన్న స్పైడర్( సాలి పురుగు) కూడా ప్రజలకు సాయం చెయ్యగలుగుతుంది కాని నేను(మనిషి) తన తోటి మనిషికి ఏమీ చెయ్యలేకపోతున్నాను అనిపించింది

నన్ను ఒక రోజు మా చైర్మేన్ గారు పిలిచి నువ్వు "దిసారిలకి", "గునియాలకి" ట్రైనింగ్ ఇవ్వాలి 5 రోజులు అన్నారు. దేని మీద ట్రైనింగ్?, అసలు ట్రైనింగ్ ఇవ్వడానికి నాకున్న అర్హత ఏంటి?ఇలాంటి చాలా ప్రశ్నలకి సమాధానాలు అడిగేంత టైము అతను ఎప్పుడూ ఎవరికి ఇవ్వరు. నాకసలే కంగారు. ఐన బయలుదేరా. దారిలో ఏమి చెప్పారంటే " ట్రైబల్స్ లో ఎవరు కూడా ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లరు, గునియాలే ప్రసవం చేస్తారు, ఏదైన ఆరొగ్య సమస్య ఎవరికి వచ్చినా దిసారి దగ్గరికి వెళ్తారు అందుకని మనం దిసారిలకి, గునియాలకి గర్భిణి స్త్రీ ల గురించి, ప్రసవం గురించి, ప్రసవం తరువాత జాగ్రత్తల గురించి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు."

సరే చాల మంచి ఆలోచన కాని ట్రైనింగ్ ఎవరిస్తారు సార్, ఎవరైన డాక్టర్ వస్తున్నారా అని అడిగాను. వాళ్ళు డాక్టర్ ని నమ్మరు అందుకే నువ్వే ఇవ్వాలి అన్నారు. నేనెలా ఇస్తాను నన్ను మా డాడీ డాక్టర్ చెయ్యాలనుకున్నారు కాని నేను కాలేదు కదా. నాకు గర్భిణీ స్త్రీలని దగ్గరనుండి చూస్తేనే చాల భయం ఇక ప్రసం ఎలా చెయ్యాలో చేసి చూపించాలా కొంపదీసి అని ఎవేవొ ఆలోచించి భయపడసాగాను. కాకపోతే ఆ ట్రైనింగ్ నేను ఇచ్చేముందు నేను చదవాల్సిన పుస్తకాలు, సమాచారం అంతా నాకు తరువాత ఇచ్చారు కాబట్టి ఎలాగో నెగ్గుకొని వచ్చాను.దిసారిలు, గునియాలు ఏమి నేర్చుకున్నారో నాకు తెలీదు కాని దెబ్బకి నాకు మాత్రం ఈ పెళ్ళి అన్నా పిల్లలన్నా చాలా భయం వచ్చేసింది. ఈ ట్రైనింగ్ లో వీళ్ళకి చెప్పాను కాబట్టి నాకు తెలిసింది అక్కడ హాస్పటిల్ లో డాక్టర్లకి ఈ విషయాలు తెలియకపోతే నా గతి ఏమి కావాలి అని భయపడ్డాను!!!

ఇక ట్రైనింగ్ అయ్యాక నేను మా చైర్మేన్ గారికి కొంత ఙ్ఞాన  బోధ చెయ్యాలని ఆశపడ్డాను.దిసారి,గునియాలు ఇచ్చే మందులు ఎక్కువగా వేప, పసుపు మరియు ఇతర యాంటిబయోటిక్ వుంటాయి.అవి కూడా సీజన్ ప్రకారం వచ్చే జబ్బులకి సహజంగా పనిచేస్తాయి. కానీ వాళ్ళు చేసే పూజలు మంత్రాలకి అన్ని సమస్యలు తీరవు కదా అని వాదించటం మొదలు పెట్టను. మంత్రాలకు చింతకాయలు రాలవండి అనీ, మూఢనమ్మకాలు వద్దండీ వాళ్ళు అఙ్ఞనంతో వున్నారనీ చెప్పాను. నా వుద్దెశ్యం ఏదైనా మాచైర్మేన్ గారికి నేను గిరిజనులను తక్కువ అంచనా వేస్తున్నానని కోపం వచ్చింది. వాళ్ళవి మూఢనమ్మకాలు కాదనీ, వాళ్ళు ప్రకృతి లో మనకు  తెలియని కాస్మిక్ పవర్ తో మాట్లాడగలరనీ, మనకు  తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలకు వాళ్ళదగ్గర మనకంటే మంచి పరిష్కారం వుందని చెప్పారు. నేను కూడా అది గమనించాను.

అక్కడ ఎవరైనా సరే పంట వెయ్యాలంటే మొదట దిసారి నిర్ణయమే. పంటల కాలం మొదలయ్యే ముందు అందరు వారి పొలం నుండి కొంత మట్టి తీసుకొని వచ్చి దిసారికి చూపిస్తారు. దిసారి పదవి వంశపారంపర్యంగా వస్తుంది. కాబట్టి మట్టికి సంబందించి ఙ్ఞానం అంతా వారికి తరాలుగా వస్తుంది. ఏ మట్టిలో ఏ పంట పండుతుంది, మట్టి రంగు, వాసన, రుచి బట్టి అందులో వున్న ధాతువులేంటి అని అంచనా వెయ్యగలుగుతారు. అందుకే నత్రజని వంటివి తక్కువైతే పూజ పేరుతో పచ్చి ఎరువు ఆ భూమికి దొరికేలా చేస్తారు. దిసారి కావాలంటే ఆ ఙ్ఞనం నేర్చుకోవాలి. మంత్రాలు కేవలం ప్రజలలో నమ్మకం కలిగించటం కోసమే, కాని అసలు మాయ ఈ తరతరాల సైన్సు విఙ్ఞనమే. 

నాకు అక్కడ అన్నిటికంటే నచ్చినది "బులు" - నా చిన్నారి స్పైడర్ మ్యాన్.పంటకి ఏదైనా తెగులు వచ్చిందంటే వాళ్ళ దిసారి వాళ్ళకి ఒక జీలుగు చెట్టుకి పూజ చేసి వాటి కొమ్మలు తీసి ఇస్తాడు. ఆ మంత్రించిన జీలుగు చెట్టు కొమ్మలు వారి చేనులో అక్కడక్కడ గ్రుచ్చితే చీడ పోతుందని నమ్మకం. కాని అసలు సీక్రెట్ దిసారి ఏరి కోరి తీసి ఇచ్చే కొమ్మల మీద నా హీరొ స్పైడర్ మ్యాన్ గూడు (వెబ్) వుండటమే, అవును బులు అనే ఈ సాలి పురుగు, సింగిల్ మ్యాన్ ఆర్మీ కాదు, బులు ఒక సామాజిక జీవి, అంటే మన తీనెటీగ లా ఒక గూడులో చాలా పెద్ద బులు జాయింట్ ఫామిలీస్ వుంటాయి. ఆ గూడులో రూములు కూడా వుంటాయండోయ్!! అంటే మన డైనింగ్ హాలు, బెడ్ రూములు,దెలివరీ రూం, నర్సింగ్ రూము ఇలా.ఆ సాలి గూడు ని  మద్యలోకి రెండు భాగాలుగా జాగ్రత్తగా కట్ చేసి చూస్తే ఇంత చిన్న పురుగులు ఇంత టెక్నికల్ గా ఎలా గూడు కట్టాయా అనిపిస్తుంది. ఆ చిన్న వెబ్ లో  వాటికి కావలసిన అన్ని సదుపాయాలున్నయి.ఇవి పగలంతా హ్యాపీగా నిద్రపోయి రాత్రి పూట ఫ్యామిలీ మెంబర్స్ అందరు గూడులోనుండి బయటకొచ్చి పంట పొలం లో వున్న చీడపురుగుల్ని తింటాయి. అంటే బులు ఒక మిత్ర క్రిమి (ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతులనీ, ఐ.పి.ఎం పద్ధతి అనీ  మనం కూడా అదే పద్ధతుల్లోకి వస్తున్నాము)

అదేవిధంగా పశువులకు సంబందిచిన జబ్బులకు, ఎక్కువ పాలు కొరకు, ఎంతో విలువైన సమాచారం వుంది  దిసారి దగ్గర.

ఇక గునియాల విషయానికి వస్తే వీళ్ళకి చాలా వరకు స్త్రీల ఆరొగ్యానికి సంబందించిన విషయాలు,సమాచారం వాళ్ళకి తరాలుగా వస్తుంది. అవి పాటల రూపంలో, కొన్ని రకాల ముగ్గులు గుర్తుల ద్వారా వాళ్ళు ఆ సమాచారం తరువాత తరానికి అందిస్తారు. గునియాలు గర్భిణి స్త్రీలలో పిండం స్థితి కొన్ని లక్షణాలు చూసి చెప్పగలుగుతారు. కడుపులో బిడ్డ ఎలావున్నది చెప్పగలుగుతారు. గునియాలకి కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ తెలుసు. ఏ దుంపలు, ఆకులు తింటే తల్లికి ఎక్కువగా పాలుంటాయి అని, బిడ్డలో వచ్చే చాలా జబ్బులకొసం తల్లి ఎటువంటి ఆహారం, మొక్కలు  తినాలని చెప్తారు. 

అడవిలో వెళ్తున్నప్పుడు ఎన్నో ఆకులు, మొక్కలు, దుంపలు  కలక్ట్ చేస్తుంటారు దిసారి, గునియాలు. ఆ మొక్కల, దుంపల  వుపయోగం వాళ్ళకి తరాలుగా వస్తున్న సమాచారం.మనం అటువంటి ఎంతో గొప్ప సమాచారం, నాలెడ్జ్ వాళ్ళ పరిస్థితులకు అనుకూలమైనది నాగరికత ప్రభావం వల్ల  చాలా త్వరగా కోల్పోతున్నాము. 

ఈ సమాచారం అంతా దిసారి గునియా ఇంక కొన్ని వర్గాలు పాటల్లో, ముగ్గుల్లో, పండగల్లో, మంత్రాలలో వుంచారు. కాని ఇప్పుడు మన సినిమా పాటలే అక్కడా వినిపిస్తున్నాయి

అక్కడ పని చేసిన ఒక సంవత్సరంలో నేను ఒకే ఒక పాట చరణం కాస్త నేర్చుకున్నాను "ఇచి ఇచి మువాపొడే రే సొయీ రణజలొథిలా డేగ ఇపాయా, ఇసమ కొరిబ అసె అసె రే సొయీ రణజలొతిలా దేగ ఇపాయా" ఈ రెండు ముక్కలు మాత్రం నేర్చుకున్నా.(అర్ధం ఏంటి అని మాత్రం అడగకండి, మీకెవరికైన తెలిస్తే మాత్రం చెప్పండి )

 సరే ఇక అసలు దిసారిలకి తెలిసిన వైద్యం ఏదో చేస్తున్నారు!! అసలు ఒకరికి ఏదైనా పెద్ద ఆరొగ్య సమస్య వస్తే పల్లెలకే సరైన రవాణా సదుపాయలు లేవు అలాంటిది ఈ కొండల్లో వాళ్ళ పరిస్థితి దారుణం. గిరిజనులకోసం ప్రభుత్వం అన్ని సదుపాయలతో ఆసుపత్రి, ఆంబులన్స్ అందులోనే అధునాతన పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చాలా చేస్తుందండీ కాని ఆ వ్యవస్థలో పని చేసే వాళ్ళు మాత్రం అవి అవసరమైన వాళ్ళకి అందకుండా చేస్తారు. ఎక్కడ వుండాల్సిన సిబ్బంది అక్కడ వుండరు/వుండలేరు. అన్ని చోట్ల వుండకూడనంత అవినీతి వుంటుంది.ఇక తిట్టటం మొదలు పెడితే ఇది ఎక్కడా ఆగదు.నేను కూడా ఈ సమాజంలో భాగమే కదా!!

డాక్టర్, ఇంజనీర్, టీచర్ అని ప్రతీ ప్రొఫెషనల్ ని కూడా మొదట కనీసం 2,3 సం.లు తప్పనిసరిగా పల్లెలలో, గిరిజన ప్రదేశాలలో చేయనిదే ఎక్కడా పనిచేసె అర్హత ఇవ్వకూడదు అనిపిస్తుంది(చదువులో భాగంగా, ఇంకా పావురాల్ల మనసుతో వుంటారు కాబట్టి.ఒకసారి సమాజంలోకి వృత్తిలోకి వచ్చేస్తే కాకుల గుంపులో చేరి కాకులైపోతారని చెప్తారు). అలా ఐనా కనీసం కొందరైన అక్కడ వుండి చేస్తారేమో! అయిన మనం శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు/ఉపయోగాలు కనిపెట్టగలం కదా, ఇలాంటి ఎన్ని రూల్స్ పెట్టినా వుపయోగం వుండదు. 

నేను డాక్టర్ చదవనందుకు నేను బాధపడిన సంధర్భం కూడా అప్పుడే.ఒక సారి నేను నీలయ్య, మేరీ అరకు కి పద్మావతిపురం నుండి కొండమీద 20 కి.మీ పైన దూరం వుండే ఒక గూడెంకి వెళ్ళాము. ఆ గూడెం లో  మాకు అంతకుముందు వెళ్ళినప్పుడు వున్న వాళ్ళ ఇంట్లో ఈసారి విడిది ఏర్పాటు చేయలేదు, కారణం అడిగితే ఆ ఇంట్లో మేము చూసిన 16సం.ల అమ్మాయి కి రెండు రోజులుగా ప్రసవం నొప్పులతో వున్నదని మాకు ఇబ్బంది అవుతుందని ఇలా వేరే చోట ఏర్పాటు చేశామని చెప్పారు.నేను, మేరీఅక్క, ఆమెని   చూడడానికి వెళ్ళాము. లోపల అంతా చీకటి గది, వాసన వస్తుంది ఒక గునియా ఇంకా కొందరు స్త్రీలు వున్నారు. నేను సినిమాలలో చూసినట్లు ఆమె అరవాలి కదా అని  ఎదురుచూశాను, కానీ ఆమె అప్పటికే చాలా కష్టపడిందని అలసిపోయిందని ఇక ప్రసవానికి ప్రయత్నం చేయలేకపోతుందని చెప్పారు.మేరీ అక్కకి కొంచెం ఐడియా వుందనుకుంటా, అలా వదిలేయకూడదని ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పింది. కానీ లోపలకి వెళ్ళి వచ్చిన మేరి అక్క బయటకి వస్తూనె కన్నీళ్ళతో వచ్చింది. కొంపదీసి చనిపోయిందా అని అడిగితే లేదు, రా నీకు చూపిస్తా అని తీసుకుని వెళ్ళింది. నాజీవితంలో మొదటిసారి ఒక ప్రసవం చూస్తున్నను అప్పుడు....కానీ బిడ్డ కాళ్ళు కాస్త బయటకి వచ్చివున్నాయి కొద్దిగా కదులుతూ చిన్న పాదాలు. నాకు అందులో ఏడవటానికి ఏముందో అర్ధం కాలేదు. గునియా ఆ అమ్మాయిని మొహం మీద కొడుతుంది, పొట్టమీద పైనుండి కింద వైపుకి నొక్కుతూ బిడ్డ బయటకి వచ్చేందుకు తోస్తుంది. అందులొ నాకు సమస్య అర్ధం కాలేదు, మేరీ అక్క అప్పుడు చెప్పింది బిడ్డ మొదట తల బయటకి రావాలి కానీ కాళ్ళొచ్చాయి, ఆసుపత్రి లో  అయితే ఎదైనా చేస్తారు, అదికాక 2 రోజులయ్యి ఆమె కష్టపడుతుంది ఇక ప్రసవంకి ఆమె ఏమి  చెయ్యలేదు అని.నాకు నేను డాక్టర్ చదివి వుంటే ఎంత వుపయోగపడేదికదా అని, నేనేమీ చెయ్యలేకపోతున్నందుకు చాలా కష్టంగా అనిపించింది. 

వాళ్ళంతా ఇక చేసేది ఏమీ లేదన్నట్లు దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు నిర్వికారంగా వున్నారు, ఒక్క గునియా మాత్రం ఆమెని కొడుతూ బిడ్డ కాళ్ళదగ్గర నిప్పుతో వేడి చురుకపెట్టేలా వేడి తగిలిస్తూ ఏదో ప్రయత్నం చేస్తుంది. నేను , మేరి అక్క వాళ్ళని ఒప్పించి ఆసుపత్రికి బయలుదేరించాము.మా కారు కొండకింద వుంది అక్కడవరకు ఎలా అయినా  జాగ్రత్తగా తీసుకెళ్తే ఆసుపత్రికి కారులో వెళ్ళొచ్చని చెప్పాము. అక్కడ ఫోను లేదు, ఏ బస్సు రాదు, నడిచి మాత్రమే దారి. నులక మంచం మీద ఆమెని పడుకొబెట్టి నలుగురు మోస్తూ కొంతమందితో కలిసి కొండ దిగటం మొదలుపెట్టాము. నేను మేరి అక్క  వాళ్ళ వేగం అందుకోడానికి పరిగెడుతూ వెళ్ళాము. కనీసం ఒక 3 గంటలు పట్టే నడక గంటన్నరలో పూర్తిచేశాము. కారు దగ్గరకి వచ్చాక ఆమెని కారులోపలికి ఎక్కించాలని చూసినప్పటకి ఆమె చనిపోయి వుంది, ఒళ్ళు చల్లబడిందని నీలయ్య చెప్పాడు, అందరు నాడి చూసి నిజమే అన్నారు. ఎవరు ఏమి మాట్లాడలేదు. ఇకా ఆసుపత్రికి వద్దు అని మళ్ళీ వెనక్కు బయలుదేరారు. కనీసం ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్తే అందరికీ తెలుస్తుంది కదా అనీ, ఇంకేదో జరుగుతుందని ఆశతో మేరి అక్కకి చెప్పాను.కానీ ఇదంతా ఇక్కడ అలవాటే, ఒకవేళ మనం ఆసుపత్రికి వెళ్ళినా అక్కడ డాక్టర్ వుండరని, శవం తో ఎన్నిరోజులు అక్కడ వుంచుతారో, ఏమో వద్దు అని చెప్పింది. ఇక ఎవరు మాత్రం ఏమి చేస్తారు? ఆసుపత్రికి మొదటిరోజే తెస్తే బాగుండేదని మాకు కోపం వస్తే, హాయిగా ప్రశాంతంగా ఆమె ఇంట్లొ,తన వాళ్ళందరి మద్య  గూడేం లోఆమెని చావనీయలేదని వాళ్ళకు మా మీద కోపం వచ్చింది.  

కనీస అవసరాలైన కడుపు నింపేంత తిండి, సరిపడేంత బట్ట, స్వచ్చమైన గాలి, మంచి నీరు, ఆరోగ్యం, రవాణా,చదువు ఇటువంటి అవసరమైన సదుపాయాలు, భద్రత సామాజిక జీవులైన మన అందరికీ కల్పించలేని సమాజం మనది.ఇది జరిగిన చాలా రోజులు నాకు  చాలా బాధగా అనిపించింది.ఒక ప్రాణం ఎంత నరకం అనుభవించిందో కదా కొండ దారుల్లో? ఆమెని అటువంటి పరిస్థితిలో పరిగెడుతూ తీసుకెళ్తుంటే ఆ కుదుపులకే ప్రాణం నిశ్శబ్ధంగా పోయిందేమో అని!! చిన్న "బులు" తన గూడులో కల్పించుకున్న సదుపాయాలు కూడా మనుషులైన మనలో చాలా మందికి లేవు.అందుకే వాళ్ళు మనల్ని  మంత్రాలని, ఆత్మలని, దేవుళ్ళని నమ్ముతారు.కనీసం ఆ (మూఢ) నమ్మకాలు వుంటే కాస్త ధైర్యం ఐనా వుంటుంది కదా.  లేదంటే చిన్నపిల్లలు నమ్మేలా ఏ సూపర్ మ్యానో, స్పైడర్ మ్యానో నిజంగా రావాలి.   

Monday, March 15, 2010

ఆడపనా? మగపనా?

తాడి ని తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నే వాడు ఇంకొకడంట!! లేక పోతే మనమొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందంట!! ఈ రెండు సామెతల్లో నాకు ఏది సూట్ అయ్యిందో ఈ పోస్ట్ చివరలో మీరే చెప్పండి.

ఈ బ్లాగు మొదలు పెట్టినప్పుడు చెప్పాను కదా నా వుద్యోగ జీవితం లో నేను కలిసిన మనుషులు, ఎదురైన పరిస్థితులు, అనుభవాలు మీతో చెప్పాలని ఈ బ్లాగు ప్రారంభించా అని. ఎంత సేపు గిరిజనులు గురించే చెప్తున్నాను నా పరిణామక్రమం కూడా చెప్పితే బాగుంటుందని (ఎవరికి బాగుంటుంది? )  ఈసారి పోస్ట్ ఇలా వ్రాస్తున్నా. ఎందుకంటే మనం చూసే విషయాలే కాదు, వాటిని మనం ఎలా మన జీవితానికి అన్వయించుకున్నామో కూడా అంతే ముఖ్యం కదా!!

నేను మొత్తనికి ఉద్యోగం జాయిన్ అయ్యాక నా మకాం వైజాగ్ కి మారింది. అంతకు ముందు కూడా చదువు కోసం అక్కడే వున్నా ఎప్పుడూ హాస్టలే. కాని ఇప్పుడు ప్రత్యేకంగా వర్కింగ్ ఉమన్ హాస్టల్ అని, లేదా ప్రైవేటు హాస్టలని చేరాల్సి వచ్చింది. అప్పటికి మా తమ్ముడు కూడా బి.సి.ఎ చదువుతూ ఒక హాస్టల్ లో వుంటున్నాడు. ఎంత వుద్యోగం చేసినా, వయసులో పెద్ద అయినా అదేంటో అమ్మాయిలకి తోడు,పెద్ద దిక్కు అని ఆఖరికి ఒక చెడ్డీ వెసుకునేంత మగ బంధువునే వుంచాలని చూస్తారు పెద్దవాళ్ళు. నాకు మరీ చెడ్డీ వేసుకునేంత చిన్న కాకపోయినా నాకంటే 8 సం.ల చిన్న వాడయిన నా తమ్ములుంగారు నాకు పెద్ద తోడయ్యారు. మరింకేం వాడున్న హాస్టల్లోనే అమ్మాయిలు కూడా ఉన్నారని నన్ను కూడా జాయిన్ అయిపోవచ్చనీ మా ఇంట్లో వాళ్ళ వాళ్ళతో సహా నన్ను కూడా ఒప్పించాడు. వాడి తెలివితేటలు ఆ తరువాతే నాకు తెలిశాయి. సాధారణంగా వాడికి ఇచ్చే పాకెట్ మనీ వాడికి జస్ట్ చాక్లెట్ మనీకి సరిపోయేది. ఇక అక్క వాడి కనుసన్నల్లో వుంటే వాడి ఖర్చులు, వాడి బాధ్యతలు (అక్క తన కంటే పెద్దదైనా సరే ఆడపిల్ల అంటే పాపం చిన్న వాళ్ళైనా సరే మగపిల్లలకి బాధ్యతే  అని మన సమాజం ఆర్డర్ వేసింది కదా) ఉన్న చోటు నుండి కదలకుండా నెరవేరిపోతాయని వాడి ప్లాన్. 

ఆ హాస్టల్లో మమ్మల్నీ కనీసం సెకండ్ షో సినిమాకి కూడా వెళ్ళనీయట్లేదనీ, కనీసం హాస్టల్లో వున్న తోటి ఆడపిల్లలికి/మగపిల్లలికి లైను వెయ్యనీయటం లేదనీ ఇంకా ఇలాంటివే చాల కారణాలు వున్నా కూడా మా పేరెంట్స్ కి మాత్రం బోజనం సరిగా లేదనే కారణం మాత్రం చెప్పి మేమిద్దరం ఇల్లు తీసుకున్నాము. అప్పటికి ఒక స్వతంత్ర ఇంటిదాన్ని అవుతున్నాననే సంతొష పడ్డాను. నేనూ మా తమ్ముడు కలిసి చక్కగా పనులన్నీ చేసేసి వాడు కాలేజి కి నేను ఆఫీసు కి వెళ్తున్నట్లూ, రోజూ సెకెండ్ షో సినిమాలు చూస్టున్నట్లు కలలు కని ఇంట్లో చేరిపొయాను. అప్పుడు కలిగించాడు మా సోదర తమ్మయ్య అసలైన ఙ్ఞనోదయం.  వంట ఆడపిల్లలు చెయ్యాలికదా, ఇల్లు ఆడపిల్లలే కదా తుడవాలి, అంట్లు ఆడపిల్లలే కదా తోమాలి, కాయగూరలు ఆడపిల్లలే కదా తరగాలి, బట్టలు ఆడపిల్లలే కదా ఉతకాలి....ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే ఇక మగపిల్లలు చేసే పనులు ఒకటే మిగిలింది మార్కెట్ కి వెళ్ళి కాయగూరలు తేవటం. పోనీ అదైనా చెశాడా అంటే పుచ్చిపోయిన కాయగూరలు తేవటం, లేకపోతే కలర్ బాగున్నాయి కదా అని టమోటాలు మాత్రమే తేవటం చేసే వాడు. అదేమంటే నువ్వే తెచ్చుకో ఫో... నాకెలా తెలుస్తాయి అన్నాడు. నాకు మాత్రం ఎలా తెలుస్తాయి నేనేమైనా పుట్టడమే రైతు బజార్లో పుట్టానా? ఐనా నేను వాడికంటే ఎక్కువ సంవత్సరాలు పని అలవాటులేకుండా వున్నాను కదా అని ఎవరూ అనలేదు, అమ్మాయివే కదా నువ్వే చెయ్యాలి అన్నట్లు చూశారు. వాడి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అని వేరు వేరుగా, మా ఫ్రెండ్స్ అని కామన్ గా హాస్టల్లో మంచి బోజనానికి మొహం వాచి వున్న మా జనాలందరూ అప్పుడప్పుడు  బోజనానికి తగలడేవాళ్ళు. నేనసలే పని చెయ్యలేక చస్తుంటే అతిది దేవుళ్ళు కూడా!. వీళ్ళందరూ నా వంట గురించి కూరలో ఉప్పేస్తె బాగుండేది, చారులో చింతపండు వేస్తె బాగుండేది, ప్లేటు కడిగి బోజనం పెడితే బాగుండేది అని ఎగతాళి చేసేవాళ్ళు. అమ్మాయి అంటే అన్ని పనులు పుట్టిన వెంటనే తెలిసి వుండాలి అన్నట్లు మాట్లాడేవాళ్ళు. కానీ ఒక్కరు కూడా మా తమ్ముడి తో అక్కకి సాయం చెయ్యరా అని చెప్పలేదు. ఆఖరికి నేను కూడా అది నా అసమర్ధత లాగే ఫీల్ అవుతుండే దాన్ని.నేను అరుకు వెళ్తే మా తమ్ముడు వంటగది కాదుకదా అసలు ఇంటికే వచ్చేవాడు కాదు. హోటల్ లో తిని, ఆ చెత్త కూడా తీసుకొచ్చి ఇంట్లో పోగులు పెట్టేవాడు.  

ఆఫీసు లో పని, అరుకు ప్రయాణాలు, ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలో కోపంగా ఆకలితో ఎదురు చూస్తూ "రా నీ పని  చెబుతా" అన్నట్లు చూసే తమ్ముడు,సిటీ బస్సుల్లో ప్రయణాలు ఇవి కాక నాకు వచ్చే జీతం మా ఇద్దరి సినిమాలకీ, ఉదయం, సాయంత్రం టిఫిన్ లకే సరిపోయేది కాదు. ఫస్టు తేదీ వస్తుందంటే ఇంటి ఓనర్స్ కి జబ్బు చేస్తే బాగుండు, వాళ్ళు సడన్ గా చచ్చిపోతే బాగుండు అని దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఇలాంటి దుర్మార్గపు ప్రార్ధనలు చేసేదాన్ని. 

డబ్బు విలువ అప్పుడే తెలిసింది. మా డాడీ, మమ్మీ లతో ఎన్నోసార్లు డబ్బు ముఖ్యం కాదు అని వాదించేదాన్ని. బతకడానికి డబ్బు కావాలి, అదీ మన  ఒకరి బాధ్యత వున్నప్పుడు మరీ కావాలి అని తెలుసుకున్నా. కానీ పట్టు వదల లేదు. తమ్ముడికి ఇచ్చే పాకెట్ మనీ ఇంటి ఖర్చులకని ఎప్పుడూ అడగలేదు. డబ్బు ఎక్కువ వున్నా తక్కువ వున్నా కూడా రోజులు మాత్రం ఆగవు. గడిచిపోతునే వున్నాయి. కష్టపడినా కూడా నాకు ఆ రోజులెందుకో బాగా నచ్చాయి.

అప్పట్లో నేర్చుకున్న, ఎక్కువగా ఆలోచించిన విషయం "పని". ఎందుకని కొన్ని పనులు ఆడపనులు, కొన్ని పనులు మగ పనులు అయ్యాయి? జీవుల్లో ఆడ మగ అనేది పకృతి పెట్టిన సహజమైన భేధం. అధి కూడా ఆడవాళ్ళ ద్వారా కస్టమైన పిల్లల్ని కనే పని జరిగేల చూసే భేధం. మిగిలిన పనులన్ని మనం కల్పించుకున్నవి, మనకి అవసరమైనవి. కాని ఇవి ఆడ పనులు, ఇవి  మగ పనులు అని  ఎవరు విభజించారు. ఎందుకని విసుగొచ్చేవీ, మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చేవి, మురికి పనులు ఆడవాళ్ళకి ఇచ్చారు? కష్టమైన పనులు ఆడవాళ్ళు చెయ్యలేరు అంటారు మళ్ళీ, స్త్రీ ని పూజించాలి అంటారు.

అప్పటివరకు కేవలం చదువు, ఫ్రెండ్స్, సరదాలతో గడిచిపోయిన జీవితం లో నిజంగా ఇంత భేదాలున్నాయని గమనించలేదు. అప్పట్నించి ఇంకా ఇప్పటికి కూడా గమనిస్తూనే వున్నాను.చాలా సంధర్భాలలో చాలా మంది నోట ఈ మాట విన్నాను. ఈ ఆడంగి పనులు నాకు చెప్పకు అనీ, మగరాయుడి పనులు చేస్తుంది చూడు అనీ.జీవుల్లో ఆడ మగ కనుక్కోగలం,ఇది ఆడ పంది, ఇది మగ పంది అని చెప్పడానికి కొన్ని సహజమైన లక్షణాలున్నయి.  ఈ పనులకి ఆడ మగ ఎలా వచ్చింది? నాకు ఏదైన సరైన లాజిక్ కనబడే వరకు దాని గురించి ఆలోచిస్తునే వుంటాను, గమనిస్తూనే వుంటాను.

మా ఆవిడ లేకపొతే ఒక్కరోజు కూడ వుండలేనండి, కనీసం నీళ్ళు కాచుకోవటం కూడా రాదు అనే మగవాళ్ళుంటారు మన  అందరి ఇళ్ళల్లో, సడన్ గా  కరెంట్ ఫ్యూజ్ పోయిందంటే, బ్యాంక్ లో డబ్బు డ్రా చెయ్యలంటే, సిలెండర్ మేడమీదకి ఎక్కించాలంటే, బల్బు కాలిపోతే మార్చాలంటే, కాస్త బరువు మొయ్యాలంటే, మార్కెట్ కి వెళ్ళి చికెన్/చేప తేవాలంటే  ఇలా చాలా పనులు పెద్ద టెక్నికల్ అనుకుంటారో లేక పోతే బజార్లోకి మనమెలా వెళ్ళటం అనుకుంటారో వీటిని చెయ్యని ఆడవాళ్ళుంటారు.

ఆడవాళ్ళు మగాళ్ళలాగ కస్టమైన పని చెయ్యలేరు అంటారు కొందరు. అసలు మనలో ఎంత మందికి తెలుసు ఆడ శిశువుల కంటే మగ శిశువుల్లోనె మరణాలెక్కువని, స్త్రీలే శారీరక మానసిక కష్టాలు బాగా తట్టుకొని నిలబడగలుగుతారని. ప్రకృతి స్త్రీకే పురుషుని కంటే  ఎక్కువ శక్తి సామర్ద్యాలిచ్చింది, కానీ మన సమాజం అసలు గర్భం లో ఆడ శిశువు వుందని తెలిస్తేనే తల్లి తినే తిండి లో శ్రధ్ధ తీసుకోదు, ఆడ పిల్లల్లో శారీరకంగా/మనసింకంగా/సామాజికంగా చాలా ఆంక్షలు విధించి నువ్విలా కదలకూడదు, ఇలా  నడవకూడదు, ఇంత తినకూడదు, బయట ఆటలాడకూడదు అని  స్త్రీ ఎదుగుదలని ఆపేస్తున్నాము. ఇక వాళ్ళు మగ వాళ్ళతో సమానంగా అన్నిపనులు చెసే అవకాశం ఎక్కడిది.

సోషియాలజీ లో  మాకు "అన్నా" అనే అమ్మాయి కధ  నాకు చాల సంధర్భాలలో గుర్తు వస్తుంది. "అన్నా" అనే అమ్మాయి సమాజానికి దూరంగా తోడేళ్ళ మధ్య పెరుగుతుంది. కొన్నాళ్ళ తరువాత ఆమెని మన సమాజం లోకి తీసుకొచ్చారు కాని "అన్నా" ఆమె వయసు వాళ్ళు చేయగలిగే ఏ శారీరకమైన పని చేయలేక, ఆ వయసుకి తగిన తెలివి (ఐ.క్యూ) లేకుండా వుంది.మన సమాజంలో ఆడవాళ్ళందరు అన్నాలే  చాల విషయాలకు సంబందించిన ఎక్స్పోసర్  లేని వాళ్ళెవరూ ఆ పని చెయ్యమంటే సడన్ గా మిగిలిన వాళ్ళలా చెయ్యలేరు. కాని అసలు చేయనే లేరు అని  కాదు.ఆడవాళ్ళేకాదు ఎవరుకూడా ఒకవిషయానికి కొన్ని తరాలుగా దూరం అయినప్పుడు తిరిగి ఆ విషయం మీద అవగాహన సంపాదించడానికి ఇంకాకొన్ని తరాలు, సమయం,సహాయం, అవకాశం, తగిన  పరిస్థితులు  అవసరమవుతాయి. నాకుతెలిసి రిజర్వేషన్ల వుద్దేశ్యం అదే అయ్యుంటుంది. దానిలో వున్న లోటుపాట్లు వేరే వున్నాయనుకోండి!! 

ఆఫీసు లో పని అంటే అంత కస్టం ఏముంది నేను కూడా చేస్తున్నా కదా! అది హాయిగా వుంటుంది. గౌరవంగా వుంటుంది. అదే కాదు బయట మగవాళ్ళు చేసే ఏపని అయినా చూస్తే నాకు రోజూ బట్టలుతికే పని, అంట్లు తోమే పని  కంటే సుఖం గానే వుంటుంది.మద్యలో స్నేహితులతో కబుర్లు, టీ లు, కాఫీలు, జోకులు, నవ్వులు అన్నిటికీ మించి మగ పనులకు జీతాలు. ఇంత చిరాకైన, అలసటైన, విసుగైన, తప్పని సరి అయిన, ముఖ్యమైన( ఇవి  ఎవరో ఒకరు చెయ్యక పోతే ఇంట్లో ఎవరూ ఆఫీసులకి స్కూళ్ళకి పోలేరు)పనులకు మాత్రం జీతం లేదు.

అందుకే కదా మీకు ఫ్రీ గా తిండి, బట్ట, బంగారు, గౌరవం అంటారేమో మరి? ఒకటి ఇంత పని చేసినా ఫ్రీ గా తింటున్నావు అనే మాట మిగులుతుంది, ఖాళీగా వుంది అనే మాటే మిగులుతుంది, ఆ పనికే గనుక లెఖ్ఖ కట్టి వసూలు చేస్తే మగ పని కంటే ఆడ పని చేస్తే వచ్చే సంపాదన చాలా ఎక్కువ అయిపోతుంది.  

ఇదంతా నేను అంట్లు తోముతూ, బట్టలుతుకుతూ, లెట్రిన్ కడుగుతూ ఆలోచించా. 

ప్రపంచంలో సహజంగా వచ్చిన పిల్లల్ని కనే పనిలో వున్న తేడాలు తప్ప, మిగిలిన ఏ పనికి కూడా ఆడ పని, మగ పని  అని బేధం లేదు. అన్ని పనులు గౌరవప్రదమైనవని అందరూ గుర్తించాలి. అన్ని పనులకు సరైన వేతనం ఇవ్వాలి. అలా ఇవ్వలేని అసమర్ధత ఒప్పుకొని కనీసం ఆ పనులు  చేసే వాళ్ళని గౌరవించాలి, వీలైనంత ఆ పనిలో సహాయ పడాలి. ఎవరికి ఇస్టమైన పని వాళ్ళు చెయ్యనీయాలి అంతే కాని ఆడదానివి కాబట్టి నువ్వు ఇంటి పని తప్పక చెయ్యాలి అని, మగవాడివి కాబట్టి నువ్వు తప్పక సంపాదించే పనులు చెయ్యాలి అని  ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. నాకు తెలిసి చాలా కుటుంబాలలో సంపాదించే పని /భారం మగ పుట్టుక పుట్టావు కాబట్టి చెయ్యల్సిందే అని సంపాదించే తండ్రి చనిపోతే వెంటనే అందరికంటే చిన్న వాడైనా సరే మగ పిల్లవాడిని చదువు,ఆటలు మానిపిచేసి పనిలో పెట్టేయటం చూశాను.

చెప్పాను కదా నేను కొంచెం తేడా అని. ఇలా ఆలోచించి మా తమ్ముడితో గొడవపడేదాన్ని. అప్పట్లో నాతో గొడవపడినా కూడా ఇలాంటి ఆలోచనా సరళి వాడిని పూర్తిగా ఒక  ఆఢారపడే మగాడిగా తయారు కాకుండా మార్చగలిగింది. ఇది ఆడ పని ,మగ పని  అని  ఆలొచన మానుకున్నాడు వాడు ఇప్పుడు పనులు ఆడ మగ తేడా చూడడు కనీసం. వంట చెయ్యటం ఇస్టపడతాడు.ఇప్పుడు వాడు అన్ని పనులు చేస్తాడు?????(అసలు పని చెయ్యటమే మానుకున్నాడు అనేది నిజం). 

ఆధార పడే మగాడు అని ఎందుకన్నానంటే, ఒకసారి సమాజం వైపు చూడండి. మన జీవితాలు ఆఖరికి ఇంట్లో అంతమవుతాయి కానీ, ఆఫీసుల్లో కాదు. మనకి ఎంత ఆఫీసు పని, బయట పనీ బాగా వచ్చినా చివర్లో మనం ఒంటరి వాళ్ళం అయ్యేటప్పుడు లేదా ముసలి వాళ్ళై అందరికి బరువైనప్పుడూ. మన బట్టలు మనం ఉతుక్కోవటం చేతకాని, వంట చేతకాని, సరిగా కూరగాయలు ఎంచటం చేతకాని, ఆఖరికి తన పని ఏది తను చేసుకోవటం చేతకాని ఆధారపడే మగ వాళ్ళే చాలా కస్టపడతారు. వయసుంటే మళ్ళీ పెళ్ళి చేసుకొనీ, డబ్బుంటే ఒక ఆడ పని మనిషిని పెట్టుకొనీ మళ్ళీ అధారపదుతూ బతుకుతారు, ఇవేవీ లేకపోతే భార్యని పెట్టిన హింసలు తలుచుకొని బాధపడుతూ రోజులు ఎప్పుడైపోతాయా అని చూస్తారు.

అలాగే ఆడవాళ్ళైతే బయటకెళ్ళి సంపాదించలేక, పైసా కి కూడా పిల్లల మీద ఆధార పడాలి.

పనిని పని అని చూడలేకపోవటం, తక్కువ ఎక్కువ అనీ, ఆడ  మగ అనీ సహజం కాని తేడాలతో చూడటం వల్ల ఎవరికి నస్టం? ఇలా  ఆలోచించి నేను  పనులు  ఆడవైన మగవైనా వీలైనన్ని పనులు చెయ్యటం అంటే వీలైంతంత స్వతంత్రులం అవ్వటం అని నేర్చుకున్నాను మా తమ్ముడి వలన.

వాడు ఈ పోస్ట్ చదివితే నన్ను విలన్ చెసేసావా అక్కా అంటాడేమో? కాని వాడు నన్ను అన్ని కస్టాలు పెట్టడం వలనే నేను నేను ఆడ మగ తేడా లేకుండా అన్ని పనులు చేయటం నేర్చుకున్నాను. ఇంత ఎక్కువ స్వతంత్రురాలినయ్యాను.మన దేశానికి బ్రిటీషు వాళ్ళొచ్చి కష్టాలు పెడితేనే కదా మనకి  స్వాతంత్ర్యం వచ్చింది, అలాగె నా  స్వతంత్రానికి నా తమ్ముడు మొదటి హీరో.ఇలాంటి హీరో లు నాకు  ఇంకా చాలా మంది వున్నారు. మరి మీరు ఎంత స్వాతంత్రులో ఎప్పుడైనా ఆలోచించారా? 
 

Saturday, March 6, 2010

భలే,భలే పెళ్ళిళ్ళు


 
మనం అంతా స్త్రీ స్వాతంత్రం, సమాన హక్కులు, మానవీయ దృక్పదం అని వేదికలెక్కటం, వేరే దేశాలని ఉదహరించటం చేస్తుంటాము. కాని మన దేశంలోనే, మన వాళ్ళ దగ్గరే వున్న గొప్ప సంస్కృతిని, అనాగరికత, వెనుకబాటుతనం అని అపహాస్యం చేస్తున్నామని నాకు ట్రైబల్స్ తో పని చేశాక అర్ధం అయింది. సోషియాలజీ క్లాసులో ప్రొఫెసర్లు చెప్తే, ఎన్నో పుస్తకాలు, పేపర్లు చదివితే మానవ సంబందాలలో సమానత్వం సహజత్వం లోపిస్తుందే అని  నాలో రగిలిన బాధ నిజజీవితం లో సింద్రి లాంటి గిరిజనులను చూశాక కాస్త తగ్గింది.

సింద్రి అరకు రీసెర్చ్ సెంటర్ లో పని చేసే 17 సం.ల గిరిజన అమ్మాయి. సింద్రి అంటే అర్ధం ఏంటో నాకు తెలీదు కాని సహజమైన అని అయివుంటుంది అని, బలమైన అయివుంటుందని, ధైర్యమైన అయి వుంటుందని ఇలా ఒక్కోసారి తనని తెలుసుకున్నప్పుడంతా ఒక్కో అర్ధం తోచేది.నేను అక్కడ వుండటం మొదలు పెట్టాక సింద్రికి కూడా నైట్ డ్యూటీ పడింది. అంతకుముందు కేవలం మా స్టాఫ్ లో మగవాళ్ళు మాత్రమే సెంటర్ లో స్టే చెసే వాళ్ళు, లేడీ స్టాఫ్ మహా అయితే ఒకటి రెండు సార్లు వుండి భయపడి వెళ్ళిపోయారని చెప్పారు. కారణాలు రెండు. ఒకటి ఆ ప్రదేశం ఒక నిర్జన ప్రదేశం కావటం వల్ల రాత్రి పూట జంతువుల భయం కూడా. రెండవది ఆ ఎన్.జి.ఒ లో గిరిజనులు చెసే పూజలు, ఆత్మలు ఇవన్నిటికి కూడ సంబంధించి రీసెర్చ్ అక్కడే చేసే వాళ్ళు. నాకెందుకో చిన్నప్పటినుండి అలాంటి భయాలు లేవు, ఒంటరిగా అంత ప్రశాంతత (నిర్జనత్వం) ప్రకృతి కి దగ్గరగా కొత్తగా అనిపించి ఒక రకమైన ఆకర్షణకి లోనయ్యి అక్కడ వుండేదాన్ని.(రాత్రి పూట బాత్రూం కి వెళ్ళాల్సి వస్తే ఎలుగుబంట్లు వస్తాయేమో అనే భయం తప్ప అన్ని బాగానే అనిపించాయి). నాతో పాటు ఒక మనిషి తోడని సింద్రి ని వుండమనేవారు.సాధారణంగా గిరిజనులు చాలా తక్కువ మాట్లాడతారేమో, లేదా మన భాష సరిగ పలకలేక తక్కువ మాట్లాడతారో నాకు తెలియదు కానీ సింద్రి చాలా తక్కువ గా మట్లాడేది. తన మూమెంట్స్ కూడా చాలా వింత గా తొచేవి. తనే కాదు అక్కద పనిచేసే గిరిజనులు అందరు అలాగే అనిపించేవాళ్ళు. హఠాత్తుగా మాయం అయిపొయినట్లు ఎక్కడో వెళ్ళిపోతారు మళ్ళీ ఏదో చెట్టు వెనక నుండి తుప్ప వెనక నుండి వస్తుంటారు. సింద్రి గిరిజనుల అందం నాకు అర్ధం అయ్యేల చేసింది. అప్పటి వరకు అందం అంటే సిటీ అమ్మాయిల్లో అబ్బాయిల్లో కనిపించే నాజూకుతనం అనుకునేదాన్ని. కాని సింద్రి  ధృఢంగా వుండేది. లావు కాదు, సన్నం కాదు బలం, ఆరోగ్యం, ప్రకృతి కి దగ్గరతనం, సహజత్వం ఇదే అసలైన అందం ఆమెలో. నాకు సింద్రి, అలాగే గిరిజన స్త్రీలందరు ఎల్లవేళళ్ళో అందంగా కనిపించేవారు.

అక్కడ సాయంత్రం 7 కి అన్నిపనులు ముగించుకొని రూం లో వుండాల్సిందే. నాకు అంత త్వరగా పడుకునే అలవాటు లేదు సింద్రి తో కబుర్లు చెప్పేదాని. కాని తనకి నాగురించి తెలుసుకోవాలనే తపనే లేదు. తన జీవితం, తన పరిసరాలు, తన తెలివితో తను సంతృప్తి గా వుంది అనిపించె ఒక వెలుగు కనిపించేది. నేను అలాంటి వెలుగు మన ఎవరి దగ్గర చూడలేదు. కొత్తగా సోషల్ వర్క్ మొదలు పెట్టాను కాబట్టి పాపం గిరిజన స్త్రీలకి ఎన్నో కష్టాలుంటాయి, వాళ్ళు ఎంతో అణచివేతకి గురి అయిపోతూ వుంటారని ఊహించేదాన్ని.కాని సింద్రి మాటల్లో భావం లో ఆఖరికి ముఖంలో కూడా ఎప్పుడూ అలాంటిదేది నాకు కనిపించలేదు.
సింద్రి నీకు పెళ్ళి అయిందా అని అడిగాను ఒక రోజు(అప్పటికి నా వయసు కి ఆలోచనలకి పెళ్ళి ఒకటే ఇంట్రస్టింగ్ టాపిక్). సింద్రి "ఒకసారయ్యింది వదిలేసా" అని చెప్పింది. వెంటనే నాలో సోషల్ వర్కర్ జూలు దులిపింది, ఎంతగా పాపం గృహ హింస కి గురి అయ్యిందో అని " ఏమి బాధ పడకు సింద్రి కష్టాలు భరిస్తూ కలిసి వుండాల్సిన అవసరం లేదు " అని చెప్పాను. సింద్రి కష్టాలు ఏమి లేవు నాకు వాడు నచ్చలేదు అందుకే వదిలేస అని చెప్పింది. నచ్చలేదా ఎందుకు నచ్చలేదు, మరి  నిన్ను బలవంతంగా అతనికి ఇచ్చి పెళ్ళి చెశారా అని అడిగాను. "లేదక్కా ఆడు గోసి కట్టుకుంటాడు, ఇక్కడకి వచే బాబుల్లాగ పాంటు యెసుకోమంటే ఇనడు అందుకే నాకు నచ్చలేదు" అని చెప్పింది. (మన నాగరికత వాళ్ళ జీవితాలలో ఇంకా ఎన్నెన్ని విధాల ఆకర్షణలు తీసుకొస్తుందో మరి) పాంట్ వేసుకోలేదని వదిలేశావా???  అదేంటి అంటే మరి నస్చకపోతే కలిసి ఎలాగుంటావు, ఆడిచ్చిన 4 మేకలు 5 పందులు (గిరిజనుల్లొ వరకట్నం లేదు, ఆడపిల్ల తండ్రికి "ఓలి" అని జంతువులు ఇస్తారు) తిరిగిచ్చేసేసెలాగా దిసారి,పెద్దోళ్ళు ఒప్పందం సేశారు అని చెప్పింది.దిసారి అంటే గ్రామ పెద్ద, పూజారి అన్నీ. ఈ తతంగం అంతా నాకు ఆరోజు అర్ధం కాలేదు. కాని రాను రాను అర్ధం అయింది.

గిరిజనుల్లొ పెళ్ళిళ్ళు, విడిపోడాలు అన్ని మన నాగరిక సమాజాం మెచ్చదేమో! కాని నా మటుకు నాకు ఆ పద్దతులన్ని భలే నచ్చాయి.ఇంట్రస్టింగ్ గా అడ్వెంచరస్ గా అనిపించాయి. అక్కడ పెళ్ళిళ్ళు ఈ క్రింద సంధర్భాలలో జరుగుతాయి:

1. అమ్మాయి అబ్బాయి ఇస్టపడితే "నన్ను తీసుకు పో అని అమ్మాయి చెప్పొచు లేదా ఇద్దరు కలిసే నిర్ణయించుని అయినా అబ్బాయి అమ్మాయిని కొండమీద ఎక్కడైన దాచి పెడతాడు. ఒక రెండు రోజులయ్యాక అమ్మాయి తండ్రి పంచాయితి పెట్టిస్తాడు అప్పుడు అబ్బాయి 4 మేకలిస్తా, 5 పందులిస్తా అని ఎంతో కొంత ఓలి బేరం కుదుర్చుకున్నక అమ్మాయిని అబ్బాయికిచి పెళ్ళి చేస్తారు.(ఎంత మంది కూతుర్లుంటే అంత లాభం, ఆడ పిల్లలంటే గిరిజనుల్లో చాల విలువ)

2. అబ్బాయికే నచ్చి, అమ్మాయి కి పెద్దగా ఎటువంటి వుద్ధేశ్యం లేక పోతే, అమ్మాయి వెళ్ళే దారిలో అబ్బాయి కాపు కాసి అమ్మాయి చెయ్యి పట్టుకొని లాగేసుకుంటే కూడా వాళ్ళ పెళ్ళి అయిపోయినట్లే. (ఇది కాస్త డేంజర్ గా వుంది కదా!!అలా నన్ను ఎవరైనా లాగేస్తే కస్టం కదా అని  భయపడేదాన్ని ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు)

3. అమ్మాయికి నచ్చి అబ్బాయికి నచ్చక పొతే..అమ్మాయి వెళ్ళి అత్తగారింట్లో వున్న రాట (దూలం/స్థంభం) పట్టుకొని కూర్చుని వుండిపోతుంది, ఎంత మంది లాగినా రాట వదలకుండా కూర్చుంటుంది. అలా చేస్తే ఆమె ఆ ఇంటికి కొడలే.(నాలాగ చేతుల్లో బలం లేకపోతే కష్టమే మరి)

4. ఒక మగాడు ఎంత మంది భార్యలనైనా  పెళ్ళి చేసుకోవచ్చు. రెండవ భార్య ని తెచ్చినప్పుడు మొదటి భార్యకి సంతాప సభ లాంటి పండగ చేసి రెండవ భార్య, మిగిలిన బంధువులు కలిసి ఆమెకి బట్టలు ఇస్తారు, పూజ చేస్తారు.(ఇదేంటో నాకు అర్ధం కాలేదు, కాంపన్సేషనా??)

5. అలాగే పెళ్ళి జరిగిన తరువాత ఎవరికి నచ్చకపొయినా విడిపోవచ్చు,ఆడ, మగ ఇద్దరు  మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు. కాని విడిపోవాలి అనుకున్నవాళ్ళు నస్టపరిహారం కట్టాలి. (ఇది చాలా న్యాయం కదా??)

నిజం చెప్పాలంటే సింద్రి చెప్పే ఎన్నో విషయాలు చాలా సహజం గా స్వేచ్ఛగా వుండేవి.నేను చాలా ఆశ్చర్య పడుతుంటే సింద్రి నన్ను వింతగా చూసేది.
ఈ పెళ్ళిళ్ళ పద్దతులన్ని సింద్రి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇందులో ఎంత నిజమో, ఎవరు  ఏ పద్ధతి పాటిస్తారో తెలుసుకునే అవకాశం రాలేదు.వీటన్నిటిలో నాకు అర్ధం అయింది ఏంటి అంటే గిరిజనుల సమాజం ఇంకా పూర్తిగా మన అంతగా పాడైపోలేదు. స్త్రీ పురుషులకి చాలా విషయాలలో స్వతంత్రత ఇంకా వుంది. సమానత్వం "ఇస్తున్నాము"అని  ఫీల్ అవ్వరు (ఎవరో ఎందుకివ్వాలి అది పుట్టుకతో అందరి హక్కు కదా).  అది వాళ్ళకి ఆకలి ఎంత సహజమో, నిద్ర ఎంత సహజమో సమానత్వం అంత సహజం. అది ఎందులో ఐనా సరే.. ఆఖరికి దమ్ముకొట్టడమైనా, మందు కొట్టడమైనా, ఇష్టమైన మనిషితో గడపటమైనా, తమ అభిప్రాయాలు చెప్పటం లో ఐనా..వాళ్ళు ఏపని చేసినా వాళ్ళకోసం చేస్తారు, ఎవరి సంతోషం కోసమో చెయ్యరు.

ధింసా అనే నృత్యం చేస్తారు. ఎవరైనా అతిధులు వస్తే మనం వాళ్ళకోసం ఆట పాటలు చేస్తాము. గిరిజనులు వాళ్ళ సంతోషం కోసం ఆడతారు పాడతారు, మనం విన్నా వినకపోయిన వాళ్ళ పాట కానీ, ధింసా కాని వాళ్ళు కోరుకునే వరకు ఆగదు. మనల్ని కూడా కలిపేసుకుంటుంది చోటు కల్పిస్తుంది వాళ్ళ సంగీతం, నృత్యం అంత సహజంగా సులభంగా వుంటుంది. అచ్చం గ్రిజనుల మనసులా. 

పెళ్ళి కంటే కూడా సింద్రి ఎక్కువగా పెళ్ళి తరువాత విషయాల గురించి చెప్పేది. ఎప్పుడు నాగురించి అసలు అడగనే అడగని సింద్రి ఒక  సారి ఎందుకో చాల సంతోషంగా వుండి "అక్క నీ జోడి ఎవరు?" అని అడిగింది, ఆటల్లొ ఎప్పుడో చిన్నప్పుడు జోడీలు వుండేవాళ్ళు. జోడి అంటే తన వుద్దేశ్యం నా లవర్ ఎవరు అని. ఎవరూ లేరు సింద్రి అని చెప్పాను.( నేను నిజమే చెప్పాను). సింద్రి చాలా ఆశ్చర్య పడింది, ఏంటి ఇంత పెద్దదానివి జోడి లేదా నీకు అని అడిగింది.అప్పటికి నా వయసు 25, ఎక్కువో తక్కువో కాని చదువులు, ఉద్యోగాలు అని తపించే మనకి జోడి అంటే పెళ్ళి కదా!! కాని వాళ్ళకి పెళ్ళికి సెక్స్ కి సంబంధం లేదనుకుంటా. అది కూడా చాల సహజం. వయసుకి తగిన సహజమైన పనులు అని వాళ్ళు దానిని తప్పు పట్టరు. అందువల్ల చాల సార్లు వాళ్ళని మోసం చేసే వాళ్ళ మోసాన్ని కూడా అర్ధం చేసుకోలేరు. 

అందుకు కొన్ని ఉదాహరణలు :

గిరిజనేతరులు ఎక్కువగా అక్కడ గవర్నమెంట్/ప్రైవేటు సంస్థల లో పని చేసే వాళ్ళు గిరిజన స్త్రీలని మోసం చేస్తారు, బయట పడితే అక్కడ అన్యాయం అయ్యేది ఎప్పటిలాగ గిరిజనులే. కొన్ని సార్లు పంచాయతి చేసి గిరిజనేతరులతో డబ్బు కట్టిస్తారు. కాని ఆ డబ్బులో 80% పంచాయతీ కే చెందుతుంది.అందువలన పంచాయితీకే ఉపయోగం తప్ప ఇంకేమి లేదు.

లేదా అటువంటిది ఏమైనా బయట పడితే మగవాళ్ళు గిరిజనులు తనకి ఏదో మందు పెట్టారనీ, బ్లాక్ మాజిక్(మంత్ర ప్రయోగం) చేశారనీ  చెప్పి తప్పు అంతా గిరిజనుల మీద తోసేస్తారు. ఇలాంటి సంఘటన ఒకటి చూశాను, మన నాగరికులందరు అమాయకమైన ఆ 16 సం.ల గిరిజన అమ్మాయి అతని మీద మంత్ర ప్రయోగం చేసిందని, అందుకే లొంగిపోయానని చెప్పాడు. అతని బంధువులు, భార్య అతనికి సపోర్టు. ఆ అమ్మాయి, మిగిలిన గిరిజనులు పాపం వాళ్ళని ఎందుకు తిడుతున్నారో కూడా అర్ధం కాక భయంగా చూస్తున్నారు. నాకు కడుపులో ఎవరో కత్తిపెట్టి నన్ను చంపేస్తున్నారనిపించింది వాళ్ళ మొహాలు చూస్తే. వాళ్ళని ఏమంటున్నారో  కూడా పూర్తిగా అర్ధం కాని వాళ్ళకి మనం గట్టిగా మాట్లాడితే చాలా భయం. వాళ్ళకి తెలిసింది కేవలం కొండ, అడవి, ప్రకృతి. ప్రతీ చెట్టు,పుట్టా,జీవి దేవుడని నమ్మే వాళ్ళు మన మీద మంత్ర ప్రయోగాలు చేసే తెలివి వుంటే ఆ కొండల్లో, కష్టాలలో ఎందుకు మగ్గిపోతారు?

ఇక అసలు సిసలు సూపర్ మోసం ఎంటి అంటే "పెళ్ళిళ్ళు"- వీటిని ఆదర్శ వివాహాలు అంటారు. ఎవరికి ఆదర్శమో నాకు తరువాత తెలిసింది. గిరిజన ప్రదేశాలలో గిరిజనేతరులు ఎవరు భూమి కొనడానికి హక్కు లేదు.అలా అని వదిలేస్తే మన నాగరికత, చదువు వేస్ట్ అయిపోదా??సో ఇంకేముందీ కొందరు ఆదర్శ వాదులు బయలుదేరి ఆ భూమి ఎలా కొనాలో దారి చూపారు. దాని ఫలితం గిరిజన మరియు గిరిజనేతరుల మద్య పెళ్ళిళ్ళు. సాదారణంగా పెళ్ళి తరువాత ఆడపిల్ల కులం మారుతుంది మన  సాంప్రదాయం లో, కాని ఇక్కడ అంతా ఆదర్శమే మగవాళ్ళే గిరిజన కులస్థులు అయిపోతారు. ఇక భూమి కొనడానికి అడ్డు ఏమి వుంది?.ఇక ఆతరువాత అక్కడ అనవసరంగా అడ్డంగా మిగిలిపోయేది ఆ పెళ్ళికి బలయిన గిరిజన స్త్రీ...ఇక ఆమె ఏమవుతుంది అనే కధలు నన్ను అడగకండి, నాకుచాలా కోపం వస్తుంది.(చేతకాని వాళ్ళకే కోపం వచ్చేది)

గిరిజన పాఠశాలలు, హాస్టళ్ళు, టూరిస్టులు,రక రకాల సంస్థలు, పోలీసులు, నక్సలైట్లు...ఇలా వాళ్ళని ఉద్ధరిస్తామని ఎంత ఎక్కువ మంది వెళ్తుంటే వాళ్ళ జీవితాలు అంతగా నరకం అయిపోతున్నాయి. "వాళ్ళని అబివృద్ధి (?)చెయ్యాలని సంస్థలు పని చెయ్యాలా లేక వాళ్ళని అలా వాళ్ళకి వున్న ఇండీజినస్ అభివృద్ధికి, పద్ధతులకీ, స్వేచ్ఛకి వదిలేయాలా అని నాకు ఇప్పటికి సమాధానం దొరకని ప్రశ్న" 

చివరగా: మన అభివృద్ధికార్యక్రమాల పుణ్యమో, వారి అమాయకత్వానికి ఫలితమో కానీ ప్రస్తుతం ఒక్క అరకు లోనే ఎయిడ్స్ 4% వుంది.

Monday, March 1, 2010

నీలయ్య ఇచ్చిన షాక్ మీద షాక్

పోయిన సారి పోస్ట్ లో మొత్తం గిరిజనుల ప్రాంతంలో పండగలు వాటి విశేషాలు చెప్పాను, ఈ సారి నాకు పరిచయం వున్న, కొంచెం ఎక్కువగా నా మీద ప్రభావం చూపిన గిరిజనులు వారి భావాలు చెప్తాను. నీలయ్య గురించి పరిచయం చేసా కదా.ఈసారి నీలయ్య గురించి పూర్తిగా చెప్తా. నీలయ్య ఒక గిరిజన వ్యక్తి (కాని ప్యాంటు వేసుకుంటాడు) అరుకు ప్రాంతంలో గ్రామాలలో వాళ్ళు చిన్న గోచి పెట్టుకుంటారు లేద మోకాళ్ళ వరకు అడ్డపంచె కట్టుకుంటారు.ఆడవాళ్ళైతే మొకాళ్ళు దాటే వరకు చీర కట్టుకుంటారు. జాకెట్ వేసుకోరు. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు జాకెట్ వేసుకోవటం మొదలుపెట్టారు. మగ వాళ్ళు కూడా షర్టు పాంటు వేసుకుంటున్నారు. మరీ లోపల గ్రామలలోకి వెళ్తే బోండ్ తెగ మొదలైన వాళ్ళు వుంటారు, వాళ్ళు కేవలం పూసలు, చెట్టు బెరడు లాంటివి మాత్రం మొలకి చుట్టుకుంటారు. 

నీలయ్యని నాకు తోడుగా, గైడ్ గా వుంచారు. నీలయ్య మొహంలో ఎటువంటి ఫీలింగ్ కనిపించదు. అన్నివిషయాలు ఒకేలా చెప్తాడు. నేను ఎం.ఎ లో వున్నప్పుడు కాస్త వైజాగ్ అంత నడవటం వలన నాకు నడక పెద్ద కష్టం అనిపించేది కాదు. కాని నీలయ్యతో నడవటం నా వల్ల అయ్యేది కాదు. అతని ఒక అడుగు నాకు నాలుగు పెద్ద పెద్ద అంగలు. అలాంటిది నీలయ్యతో పాటు కొండ ఎక్కి టైం కి అనుకున్న గూడెం (చిన్న గ్రామం) ఎప్పుడూ చెరలేకపొయాను. అయిన నీలయ్య ఫేస్ లో కనీసం అలసట, కోపం, చిరాకు ఏమి కనిపించవు.ఒక సంవత్సరం అతనితొ అడవుల్లొ వెళ్ళాక  నీలయ్య కి సంబందించి నేను కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కనుక్కోగలిగాను. అది ఆకలి. అతనికి ఆకలి వేస్తె వెంటనె చుట్టూ ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తాడు. అప్పటివరకు కేవలం నడిచెవాడు ఆకలేస్తె కాస్త చుట్టుపక్కల గమనిస్తాడు. నేను ఏవో పండ్ల చెట్లు వెతుకుతున్నాడెమో అనుకునేదాన్ని. కాని నాకు కనిపించని ఏవెవొ జంతువులు అతనికి అమాంతం దొరికిపొయేవి, లేదా అతని చిన్న కత్తికి, కర్రకి బలి అయిపోయేవి.ఒక సారి అలాగే ఒక గూడెం వెళ్ళాలని నేను ఉదయాన్నె పెద్దపర్వతావహరోహికురాలి లాగా వెనుక ఒక పెద్ద బాగ్ తగిలుంచుకొని రెడీ అయ్యా. అందులో బిస్కెట్ పేకెట్లు, బ్రెడ్,వాటర్ బాటిల్లు, టవల్, బట్టలు మొదలైనవి పెట్టుకున్నా. నాకంటే నా బాగ్ బరువెక్కువయ్యిందనిపించినా మొదటిసారి కాబట్టి వాటి అవసరం వుండదని తెలీదు కాబట్టి అలా రెడీ అయ్యాను. 

తీరా కొంచెం కొండ ఎక్కేసరికి  నా బాగ్ తో పాటు నన్ను కూడ ఎవరైన మోస్తె ఎంత బాగున్ను అనిపించింది. కాని నీలయ్య చేతులు వూపుకుంటూ నడుస్తున్నాడు. మన లాగా వాళ్ళకి అటువంటి మర్యాదలు తెలీవా అనిపించింది. కాని నా బాగ్ ఎవరో మొయ్యాలనుకునే నేను ఎందుకు అంత లగేజి తేవాలి అని ఆలొచించి నోరుమూసుకున్నా. 11 అయ్యె సరికి నేను సగం బాగ్ ఖాలీ చెసేసా. నీలయ్యని అడిగినా తను ఎక్కువగా తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. అప్పుడు నీలయ్య సడన్ గా ఒక చిన్న కుందేలు ని పట్టుకున్నడు. నేను పెంచుకోడానికి గిఫ్ట్ గా ఇస్తాడేమో అనుకున్నా.కాని నా సంతొషం చూసి కూడా ఏమి జవాబు చెప్పకుండా దాన్ని తీసుకొని పక్కకి పొయాడు. కాసేపటికి చేతిలో కొన్ని పెద్ద ఆకులతొ ఒక పొట్లం లా చుట్టి తీసుకొచ్చాడు. ఆ ఆకుల పొట్లాం చుట్టూ తడిపిన మట్టిని మెత్తాడు. దగ్గర్లో వున్న ఎండు పుల్లలు, ఆకులు ఒక చోట చేర్చి నిప్పు చేసాడు. నాకు అప్పటికే కళ్ళల్లొ నీళ్ళు. అయ్యో కుందేలు చచ్చిపోయిందే అని.(కాని నేను తినే చికెన్ మటన్ అప్పుడు గుర్తురాలేదు). ఆ మట్టి మెత్తిన పొట్లాన్ని ఆ నిప్పుల్లొ పడేసాడు. కాసేపయ్యక ఆ పొట్లం తీస్తే అది గట్టి పడింది. దాన్ని జాగ్రత్తగ విరగ్గొట్టాడు.మట్టి అంతా పడిపోయాక ఆకుల్లో మాంసం వేడి ఆవిరికి వుడికింది. నన్ను తింటావా అని అడిగాడు. వద్దు అన్నా. మళ్ళీ అడగకుండా మొత్తం తినేసాడు. కుందేలు మాత్రమే కాదు అన్ని జంతువులు తినే వాడు. పాములు కూడా కొన్ని రకాలవి తింటారు. నీలయ్య మాత్రం స్పెషల్ ఇది అది అనుకూకుండా అన్ని జీవాలకి న్యాయం చేస్తాడు. నాకు కూడా కొన్నాళ్ళకి అసహ్యించుకోవటం, బయపడటం తగ్గింది. వాళ్ళ తిండి ని అసహ్యించుకోవటం వాళ్ళని అవమానించటమే అనిపించింది.అరకు ట్రైబల్స్ పొదల్లో దొరికే "బుడ్డలు" అనే చిన్న చిన్న పురుగులు నిప్పుల్లొ వేయించి బంధువులు వస్తే స్పెషల్ అని పెడతారు. చూడడానికి మన రొయ్యల్లా వుంటాయి. కాని పురుగులు అని తెలిశాక మనం తినలేము కద!! నీలయ్య తో మాట్లాడటం, తన తెలుగు అర్ధం చేసుకోవటం వచ్చాక మా ఇద్దరికీ స్నేహం  బాగానే కుదిరింది. నీలయ్యకి అందరు చెసే పొలం పనులు, పోడు చేస్తే లాభం లేదని, కష్టం తప్ప ఏమి వుండదని అభిప్రాయం. ఇలా ఈ ఎన్.జి.ఒ తో లెదా అరుకు లో టూరిస్ట్ల కోసం, గవర్నమెంట్  వాళ్ళకోసం, మిషనరీ వాళ్ళకోసం తెలుగు నేర్చుకొని పనిచేయటమే లాభం అని చెప్తాడు. అప్పుడు వైజాగ్ వెళ్ళొచ్చుకదా అంటే అక్కడ అడవి లేదు కదా అనేవాడు. అడవి వాళ్ళ కి శ్వాస లాంటిది అని అనిపించింది. నాకెందుకు నేను పుట్టిన ఊరు వదిలి వెళ్ళలేనని అనిపించదు అని ఆలోచించేదాన్ని. సమాధానం దొరకలేదు. 

నీలయ్య ఎప్పుడూ షాక్ ఇచ్చెవాడు. ఒక రోజు ఎప్పుడు కాసేపు ఆగి కూర్చుందాము అని అడగని నీలయ్య "మాడం, ఇక్కడ కున్సేపు కూసూని యెల్దావ్" అన్నడు. ఆహా నడకలో నేను నీలయ్య నే ఓడిస్తున్నను అని ఆనందపడుతూ దగ్గరలో రాయి మీద కూర్చోబోయా. "ఆడొద్దు, సెట్టెక్కు " అన్నాడు. ఎందుకు అంటే " ఇప్పుడే పెద్ద పిల్లి యెల్లింది, కూసేపు ఆగి యెల్దావ్" అన్నాడు. పెద్ద పిల్లి అంటె "పులి". వాసన తో  పసిగట్టాడంట, గుండెలు దభ దభా అని కొట్టుకుంటుండగా నెమ్మదిగా చెట్టెక్కి కూర్చున్నా. నాకు చెట్టు ఎక్కటం వచ్చని నాకు కూడా అప్పుడే తెలిసింది.కాని నీలయ్య ముఖం లో ఎప్పటిలాగే ఎటువంటి ఫీలింగ్ లేదు.

ఎప్పుడు ఫేల్డ్ కి వెళ్ళినా చీకటి పడే వేళకంటే ముందు ఎదో ఒక గూడెం చెర్చేవాడు నీలయ్య. ఆశ్చర్యం గా అన్ని గూడేలలో నీలయ్యకి తెలిసిన వాళ్ళుంటారు. గిరిజనులు మా కోసం అన్నం వండేవాళ్ళు. వాళ్ళు అంబలి, మాంసం, వుడకబెట్టిన దుంపలు తింటారు (ఇప్పుడు డైటింగ్ పేరుతో నేను కూడా అవే తింటున్నాను).విప్ప సారా, అరటి పండ్ల సారా మొదలైనవి తాగుతారు. . నేను ఎప్పుడూ 2 రోజులకంటే ఎక్కువ కంటిన్యూ గా ఫీల్డ్ కి వెళ్ళలేదు. నాకు అలవాటు చేసుకోవటం లోనే సరిపోయింది, అందులో ఎక్కువ సమయం నడకతోనే సరిపోయేది. నిజంగా వాళ్ళ గురించి అర్ధం చేసుకొని పని చేయాలంటే అక్కడే కొన్ని రోజులు వుండగలిగే వాళ్ళు పనిచెయ్యాలి.ఒక రోజు ఫీల్డ్ నుండి తిరిగి అరకు ఆఫీసు కి వస్తున్నాము. కాస్త చీకటి పడింది.అక్కడ ఎదో శవం కాలుతుంది, ఆ ఆలొచనతో భయపడకుండా వుండాలని నీలయ్య తో మాటలు మొదలుపెట్టా. నీలయ్యని కాసేపు ఆటపట్టిద్దామని, నీలాయ్య నువ్వు తినని మాంసం ఎదైన ఒకటి చెప్పు అన్నాను.దానికి నీలయ్య అస్సలు ఆలొచించకుండా సమాధానం చెప్పడు. " అన్నీ తిన్నా మాడం  ఒక్క మడిషి మాసం తినలేకపోయా" అన్నాడు.  ఓహూ ఏమి పాపం ఎందుకు తినలేదు అని అడిగాను, "ఒకసారి శవం కాలుస్తుంటే తీసి తిందామనుకున్న్నాను...కాని మా ఊర్లో వాలు కొట్టారండి నన్ను" అని చెప్పాడు. అప్పటివరకు జోక్ చేస్తున్నడేమో అని నవ్వుతున్న నేను అతని సిన్సియర్ జవాబు విని ఒక్కసారిగా షాక్ తో ఆగిపోయాను.నీలయ్య మాత్రం ఆగకుండా చెప్తూ నడుస్తూ పోతున్నాడు. "మల్లీ ఎప్పుడైన ఒకసారి తింటాలే సచ్చేలోపు" అని ముగించాడు.

అలా నీలయ్య ఇచ్చిన షాక్ కి నేను భయపడి..ఒంటరిగా దొకితే నన్ను తినేస్తాడేమో అని చాలా రోజులు మా చైర్మన్ గారు ఎంత నచ్చ చెప్పినా నీలయ్యతో ఫీల్డ్ కి పోలేకపోయా. కాని గిరిజనుల అమాయకత్వం, నిజాయితీ, కల్మషం తెలియని మాటలు, స్వచ్చమైన చేతలు వాళ్ళని ప్రేమించేలా చేస్తాయి.

అక్కడ నేను వున్నన్ని రోజులు నీలయ్య నాతో ఫీల్డ్ కి తోడుగా వచ్చాడు. నా అవసరాలన్నీ నేను చెప్పకుండానే తెలుసుకుని ఒక్క మాటకూడా మాట్లాడకుండా నాకు అన్నీ చేసేవాడు.మనుషుల మధ్య భాష పెద్దగా అవసరం లేదని భావప్రకటన కి,  భాష కంటే మౌనం చాలా విషయాలను తేలికగ చెప్పేస్తుందని అనిపించేది. ఎందుకంటే అక్కడ నీలయ్య మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళినా, మా మద్య భాష సమస్య వల్ల మౌనం ఎక్కువ నేర్పేది.

నీలయ్య ఏమనుకున్నడో ఏమో ఒక రోజు "మాడం నువ్వు మాకు తెలివి లేదు అనుకుంటున్నావు కదా" అని అడిగాడు. "లేదు నీలయ్య నేను అల అనుకోలేదు అని చెప్పాను".నమ్మాడో నమ్మలేదొ నాకు అర్ధం కాలేదు. నా మనసులో మాత్రం పాపం గిరిజనులుకి ఏమి తెలీదు అనే భావం వుండేది. అప్పుడు ఒక గూడెం వెళ్ళాల్సి వుంది కాని నీలయ్య రూటు మార్చి తీసుకెళ్తున్నాడు అని డౌటు వచ్చింది (నిజం చెప్పాలంటే భయం వేసింది..ఏంటి నా జీవితం తో నేను ఏమి చేస్తున్నాను? ఎందుకు ఈ కొండల్లో తుప్పల్లో ఎవరో తెలియని ఒక గిరిజనుడి వెంట తిరుగుతున్నాను అని ఒక్కసారి శరీరం చల్లబడినట్లైపోయింది) ఏమి అడగడానికి, ఆలోచించడానికి ఒక్కోసారి మెదడు సహకరించదు. అలా అయింది.  కాని నడుస్తునే వున్న నీలయ్య వెనుక. బహుశా మనుషుల్ని నమ్మటం తప్ప మనం ఇంక ఏమి చెయ్యగలం అనే గుణమే నన్ను ఈ వుద్యోగం లో వుండేలా చేస్తుందేమో! ఈలోగా అక్కడ ఇంకో మనిషి కనిపించాడు. అడవిలో మన ఊర్లలో లాగా జనం కనిపించరు, ఎక్కడో ఒక చోట ఎవరో వుంటే వుంటారు. వాళ్ళు కూడ మనకంటికి సులభంగా కనిపించరు. ప్రకృతి అక్కడ పెద్దగా వుంటుంది ఏ జీవి ఐనా అందులో కలిసిపోయినట్లే వుంటుంది అనిపించేది. నీలయ్య అతని దగ్గరకి వెళ్ళి ఎదో వాళ్ళ బాషలో మట్లాడాడు.కాసేపటికి నాదగ్గరకి వచ్చి అతను దిసారి అని చెప్పాడు. మేము వెళ్ళబోయే గూడెం లో ముందు రోజు పోలీసులు ఎవరో నక్సలైటు కోసం అని అడగడానికి వచ్చి వున్నారంట. మనం వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ విషయం నీకు ముందే తెలుసా?అందుకే దారి మార్చావా? ఎలా తెలుసు అని వరసగా ప్రశ్నలు వేశా మళ్ళీ "నో జవాబు" . మరి వెనక్కు వెళ్దామ, కాని ఇంత ఎండలో ఎంత కష్టపడి ఎక్కాము కదా అని అన్నాను. దానికి దిసారి ఎదో చెప్పాడు. నాకు అర్ధం కాలేదు. నీలయ్య మొదటిసారి నవ్వాడు, నవ్వి " మాడం నీకు ఇప్పుడు వర్షం కావాలా అని మా దిసారి అడిగాడు అని చెప్పాడు"...వర్షం ఏమైనా నా హ్యాండ్ బ్యాగ్ లో వున్న రుమాలా? లేక పోతే చెట్టు మీద కాయనా, ఇప్పుడు అర్జెంట్ గా కావాలంటే రావడానికి అన్నను. మళ్ళీ వాళ్ళిద్దరూ ఎదో హ, హు, క, ఈ (వాళ్ళ భాష నాకు అలాగే వినిపిస్తుంది మరి) అని మాట్లాడుకున్నారు. నన్ను కూర్చోమని దిసారి అక్కడే ఎదో చుట్టు వెతికి ఒక చీమల పుట్ట పట్టుకొచ్చాడు. దాన్ని క్రింద పెట్టి దాని మీద ఎవేవో ఆకులు వేసి ఎదో పాట, మంత్రం లా మాట్లాడాడు. పుట్ట తీసి నేలకేసి కొట్టాడు.చీమలన్ని బయటకొచ్చాయి. మా వైపు చూసి ఎదో చెప్పాడు. నీలయ్య "మాడం మనం తొరగా యెల్లాలి, కొండ దిగే లోపు వర్షం వస్తే తడిసిపోతావ్ అన్నాడు. 

వీళ్ళిద్దరి మంత్రాలకి చింతకాయలు రాల్తాయా అని నవ్వుకొని, ఆ ఎండని తిట్టుకుంటూ బయలుదేరా.ఒక 15నిమిషాలు నడిచామో లేదో వున్నట్లుండి వర్షం పడటం మొదలయ్యింది. నా మైండ్ మళ్ళీ బ్లాంక్ అయ్యింది. నా లాజిక్ కి అర్ధం కాని విషయాలు జరిగినప్పుడు నా మైండ్ ఇలాగే ఏమి ఆలోచించకుండా ఆగిపోయి నాకు సహాయం చేస్తుంటుంది.

ఆ వర్షం కూడా నాకోసమే పడినట్లు మేము రకు ఊర్లోకి వచ్చెసరికి ఆగిపోయింది. అక్కడ అసలు తీవ్రంగా ఎండ కాస్తుంది.

ఇప్పుడు చెప్పండి ఇన్ని షాకులు నాకు అవసరమా??? గిరిజనులు వాళ్ళకి తెలిసిన విషయాల్లో తెలివైన వాళ్ళని ఒప్పుకోకుండా వుంటానా?వాళ్ళకి ప్రకృతి గురించి చాలా విషయాలు తెలుసు, వాళ్ళ పూజలగురించి తరువాత పోస్ట్ లో నాకు తెలిసిన అనుభవాలు రాస్తాను
అసలు ఆ వర్షం ఎలా పడింది అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా.మీరేమంటారు, దిసారి పూజ కి పడిందా? లేక నా అలసట చూసి కొండ నా సేద తీర్చడానికి వర్షాన్ని ఇచ్చిందా? నేను చాలా సార్లు ప్రకృతి నాతో మాట్లాడుతుందనీ,నన్ను అర్ధం చేసుకుంటుందని, నాకు సహాయపడుతుందని ఫీల్ అవుతుంటా ఎందుకో మరి!