Friday, May 28, 2010

హమ్మయ్య...బాసు పై అరిచేశా(పాపం మొదటి రోజే)

నిజంగా మీ జీవితంలో మంచిరోజులు  ఏవి అని ఎవరైనా అడిగితే ఏమి గుర్తొస్తాయి? మనం స్నేహితులతో ఆటలాడుతూ గడిపిన బాల్యమా?, సెలవులకి తాతగారి వూరెళ్ళి తోటి పిల్లలతో, గేదలతో కూడా కలిసి కోనేట్లో ఈదులాడుతూ, కోతికొమ్మచ్చిలు ఆడుకోవటమా? పిచ్చిపిచ్చిగా పోటీపడి చదివినా అలసట రాకపోగా ఆనందం కలిగిన రోజులా? కుటుంబం అంతా కలిసివుంటూ ఏదో టూర్ కి వెళ్ళిన రోజులా?  పట్టపగ్గాలు లేని యవ్వనోత్సాహం తో సృష్టిలో ప్రతీది మనకోసమే వుంది అనిపించిన కాలేజీ రోజులా? ఆవేశంగా ర్యాలీలలో, బందులలో పాల్గొని, లైబ్రరీలలో అన్ని సాహిత్యాలు చదివి దేశాన్ని ఒక దారిలో నాలాంటివాళ్ళే నడిపించాలి అనిపించిన రోజులా? పేరు ఊరు తెలియని లేదా కొన్ని రోజుల పరిచయంలోనే ఒక మనిషితో పీకల్లోతు ప్రేమలో పడిపోయి లోకం మొత్తం అందరూ ప్రేమించుకుంటూ వుంటే నాలాగ సంతోషంగా వుంటారు కదా అనిపించిన రోజులా? కష్టాలు, అవమానాలు, చీవాట్లు దాటి అనుకున్నది సాదించి విజయం పొందిన రోజులా? చెట్టాపట్టాలేసుకొని  తిరుగుతూ చిన్నప్పటినుండి జరిగిన కబుర్లన్నీ ఒకరితో ఒకరు చెప్పేసుకుంటూ పగలు రాత్రీ తేడా లేకుండా ఒకరికి ఒకరు అనుకుంటూ  ఒక్కొక్క వస్తువుని ప్రేమగా కస్టపడి సమకూర్చుకుంటూ మీ చిన్న పొదరింటిని తీర్చిదిద్దుకున్న పెళ్ళైన క్రొత్త రోజులా? మీ ప్రేమ కి గుర్తు గా మీ చిన్నారి మీ మద్యకి వచ్చి మీ జీవితాన్ని తలకిందులుగా చేసేసి, మిమ్మల్ని ఊపిరితిప్పుకోలేనంత మైకంలో సంవత్సరాలు క్షణాలలా పరిగెత్తిస్తున్న రోజులా? అడ్డగాడిదలా పనిచేసీ చేసీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తోపాటు బుజ్జి పొట్ట, బట్టతలా, ఒబెసిటీ, బి.పి,షుగరు, బ్యాంకులోనూ + కిడ్నీలోనూ నాలుగు రాళ్ళు సంపాదించుకున్న రోజులా? బాద్యతలన్నీ నెరవేర్చేసి పిల్లలందరినీ అమెరికాకో ఆఫ్గనిస్తాన్ కో మొత్తనికి ఫారిన్ పంపించేసి మా పిల్లలు మనవలు అని అందరికి గొప్పలు చెప్పుకుంటూ తీర్ధయాత్రలు, విదేశీ యాత్రలు చేసే రొజులా?

నాకైతే జీవితంలో అన్నీ మంచిరోజులే అనిపిస్తాయి. ఇప్పటివరకు ప్రతీ సంతొషంలో కష్టంలో కూడా మరిచిపోలేని అనుభవాలే. అన్నిటికంటే ముఖ్యం ప్రతీ కొత్తపరిచయం, అనుభవం మరిచిపోలేనిదే. ఎందుకంటే ప్రతీసారీ ఎదో ఒకటి నేర్చుకుంటాము కదా. మంచో చెడో ఏదో ఒకటి.చెడ్డరోజులేవి అంటే ఏమీ నేర్చుకోలేని రోజులు. అలా ఏమి నేర్చుకోలేకపోతే మనకి మన లైఫ్ చాలా బోర్ గా ఏదో వెలితిగా అనిపిస్తుంది. అటువంటిది ఒకేసారి వందల మంది, వేల మందిని కలిసే అవకాశం వస్తే,రోజూ కొత్త పరిచయాలైతే!! అదే నా ఉద్యోగం. ఎందరో మనుషులని కలవడానికి అవకాశం ఇచ్చిన వెలుగు.అలా మొదటగా నాకు నచ్చిన మనుషులు జీవితంలో ఎన్నో ఆశయాలతో పనిచేసే వాళ్ళు, ఎన్నో విలువలను ఆచరణలో చూపే వాళ్ళను మొదటిసారిగా పరిచయం చేసింది వెలుగు.

నా ఇంటర్యూ రోజే కలిశాను మంచి ఆశయాలు విలువలు జీవితంలో చూపించే వ్యక్తులని. కానీ ముందు నాకు జరిగిన చెడు అనుభవం వలనో లేక ఎన్.జి.ఓ లో పనిచేసిన అనుభవం వల్లనో గవర్నమెంట్ అన్నా,  గవర్నమెంట్ అదికారులన్న కొంత నెగిటివ్ అభిప్రాయం వుండేది. అందువల్ల ఆ రోజు వాళ్ళతో నా ప్రవర్తన నాకు ఈ రోజు తలుచుకుంటే చిన్నతనంగా అనిపిస్తుంది.కానీ అయినా వాళ్ళు నాలో వున్న పాజిటివ్ ఎనర్జీ ని చూసి అవకాశం ఇచ్చారు.

ఇంటర్యూ అంటే ఏదొ మహా అయితే ఎక్కువలో ఎక్కువగా 25 మంది వస్తారు అనుకున్నాను. మా అమ్మమ్మ గారి ఊరు శ్రికాకుళం కావటం వల్ల, వీధికొక భంధువు వుండటం వల్ల నేను మాస్టర్ ప్లాన్ వేసి 2 రోజులు లీవ్ తీసుకుని వెళ్ళను. మహా అయితే 2 గంటలు ఇంటర్యూ తరువాత హాఫ్ డే, ఆ మర్నాడు అందరి బంధువుల ఇంటికి వెళ్ళి పలకరించేసి ఎప్పుడూ నాకు లేని మంచి పేరు తెచ్చేసుకుందాం అనుకున్నాను. అందరికి ఫోన్లు కూడా చెసేశాను మీ ఇంటికి లంచ్ కి, మీ ఇంటికి టిఫిన్  కి  మీ ఇంటికి డిన్నర్ కి, మీతో టీ అని, వుదయాన్నే మా పెద్దమ్మ ఇంట్లో ఫుల్ గా మెక్కెసి తీరికకా ముస్తాబయ్యి 9 కల్లా వెళ్ళాను వాళ్ళిచ్చిన అడ్రస్ కి. నేనే కదా ఇంత కరెక్ట్ టైముకి వెళ్తున్నా అని కూడా ఫీలయ్యాను. కానీ అక్కడ చూస్తే ఏదో పెళ్ళో, చావో జరిగినట్లుంది. షామియానాలు వేసి, బోల్డన్ని కుర్చీలు, జనాలు హడావిడి. తప్పు అడ్రస్ కి వచ్చానేమో అనుకున్నాను. తీరా చూస్తే 500 మంది వరకు వచ్చారు అదే ఇంటర్యూకి. దేశంలో నిరుద్యోగ సమస్య మరీ ఇంత తీవ్రంగా వుందా అని తెలిసొచ్చింది. 20సంవత్సరాల నుంది 60 వరకు అన్ని వయసుల వాళ్ళూ వున్నారు. బహుశా మా బంధువులు కూడా వున్నారేమో!ఎందుకంటే నేను గుర్తుపట్టిన వాళ్ళే ఒక 20 మంది వున్నారు.
నాకు జాబ్ వస్తుందా లేదా అనేది తరువాత విషయం కానీ అసలు ఇంతమందిని వీళ్ళు ఇంటర్యూ ఎలా చేస్తారో చూడాలనిపించింది. ఎప్పుడో విడిపోయిన వాళ్ళు అందరు అక్కడ కలుసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, కాలేజిల్లో స్నేహితులో బ్యాచ్ మేట్లో అయినవాళ్ళు వాళ్ళ కాలేజి కబుర్లు చెప్పుకుంటున్నారు, బాబాయ్ కొడుకు వరుస వాళ్ళు, మామా అళ్ళుళ్ళు, పిన్నీ కూతుర్లు, వదిన మరదళ్ళు  ఇలా రక రకాల బంధువులు కూడా వున్నారు. నేను కూడా చాలా బిజీగా అయిపోయాను.ఇంతలో అక్కడ పనిచేసే ఒక మేనేజర్ వచ్చి ఇంటర్యూ పద్ధతి గురించి తెలియజేశారు. మొదట 1 గంట టెస్ట్ వుంటుందని అందులో పాస్ అయిన వాళ్ళకు గ్రూప్ డిస్కషన్ వుంటుందని తరువాత ఇంటర్యూ అని చెప్పారు. వీలైనంత వరకు ఈరోజు రాత్రి 8 లోపల ముగిస్తాము అని చెప్పారు. రేపటికి మీకు అందరికి రిజల్స్ తెలిసిపోతాయి అని చెప్పారు. ఇంతమంది భవిష్యత్ ఒకరోజులో తేల్చెస్తారా అని  ఆశ్చర్యం అనిపించింది. చాలా మంది ఇవన్నీ ఫార్మాలిటీస్ అండి పోస్టులు అన్నీ ముందే అమ్మేసుకున్నారు అన్నారు. నాకు చాలా అన్యాయం అనిపించింది. మరి ఇంతమంది తో ఈ సర్కస్ ఎందుకు అనిపించింది. నా స్నేహితులు అందరు అవన్నీ పట్టించుకోకు నీ పని నువ్వు బాగచెయ్యు మిగిలినది ఎన్.టి.ఆర్ చూసుకుంటాడు అని చెప్పి ధైర్యం చెప్పారు.( ఎన్.టి.ఆర్ అంటే శ్రీ క్రిష్ణుడే  కదా!!) కొందరు ఇంటర్యూ ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది భవిష్యతులో వుపయోగ పడుతుందని చెప్పారు. సరే అని  టెస్ట్ కి వెళ్ళాము. ఒక పెద్ద హాల్ లో అందరిని పరీక్ష రాస్తున్నట్లు కూర్చుండబెట్టారు. ఇందాకటి మేనేజర్ బోర్డ్ మీద్ 4 ప్రశ్నలు రాశారు. అవన్నీ చాలా పెద్ద వ్యాసాలు గా రాయాలి. గవర్నమెంట్ స్కీం ల గురించి,మన దేశం లో పేదరికం కారణాలు, బాలకార్మిక వ్యవస్థ ఇలా ఏవో నాలుగైదు తీవ్రమైన ప్రశ్నలిచ్చారు. ఇచ్చిన టైము మాత్రం 1 గంట ఇక అక్కడ ఒక అతను కాస్త పొట్టిగా, తెల్లగా ఇప్పుడే కాలేజి నుండి వచ్చి కొత్తగా జాబ్లో జాయిన్ అయినట్లున్నారు విపరీతమైన హడావిడి చేస్తున్నారు. ఆ ప్రశ్నలకి అర్ధం ఏంటి, ఎలా రాయాలి,ఏంటేంటి రాయాలి, ఎంత రాయాలి, ఎంత టైము రాయాలి ఇలా చెప్తునే వున్నారు. చెప్తు 1/2 గంట టైము తినేశారు. అందరు అతని మొహం చూస్తు అతను చెప్పేది వింటూ టెన్షన్ పడుతున్నాము. ఇంతలో అతనే 12 గంటల వరకే టైము తరువాత మేము పేపర్ తీసుకోము అని చెప్తునే వున్నారు. నాకు ఒక్కసారి చిరాకొచ్చేసింది(బహుశా అందరికీ వచ్చే వుంటుంది), ఇక  వుండలేక అతనితో " ఆల్రెడీ 1/2 గంట టైము చెప్పటంతోనే  అయిపోజేశారు, మీరు ఇక చెప్పటం ఆపితే మేము వ్రాస్తాము" అని చెప్పాను. నాకు  వున్న ఒక అభిప్రాయం ఏంటి అంటే ఇలా చిన్న ఏజ్ లో వున్న వాల్లు జాబ్ లో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారని, ఆ బ్యాక్ గ్రౌండ్ తో కూడా నా చిరాకు చూపించేశాను. కొందరు నావైపు వింతగా చూశారు; కొందరు ఆశ్చర్యంగా చూశారు. నా ధైర్యానికి వీళ్ళందరు అబ్బురపడుతున్నారు అని చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక ఆ కాలేజి ఆఫీసర్ "ఓహ్ సారీ సారీ ఇక రాసుకోండి" అని చెప్పారు. నేను విజయ గర్వంతో ప్రశ్నలన్నిటికీ తీవ్రంగా జవాబులు వ్రాసేసాను. చెమటలు తుడుచుకొని బయటకి వస్తుంటే నా ఫ్రెండ్సు బయట ఆందోళనగా ఎదురుచూస్తూ కనిపించారు. నేను రాగానే నన్ను పక్కకి ఒక లాగు లాగారు. "నీకు ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరో తెలుశా?" అని అడిగారు. తెలీదు అన్నాను. "పెద్ద వీర నారీమణిలాగా ఇందాక నువ్వు పి.డి గారి మీదనే అరిచావు, ఇక్కడ అతనే మన భవిష్యత్ నిర్ణయిస్తారు" అని చెప్పారు. ఇంకేముంది ఈ వుద్యోగం కూడా గోవిందా!

సరే ఇంక చేసేది ఏముంది, ఎలాగు పోస్టులన్నీ ముందు అమ్మేశారు కదా ఏదైతే అదయిందిలే ఇది కూడా ఒక ఎక్స్ పీరిన్స్ , ఫ్యూచర్లో ఏదైనా ఇంటర్యూకి వెళ్తే శిరీష లోని ఝాన్సీ రాణి ని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తాను. ఇలా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి గ్రూప్ డిష్కషన్ కి నా గ్రూప్ ని పిలిస్తే వెళ్ళాను. అప్పటివరకు నేను ఎప్పుడు గ్రూప్ డిస్కషన్ చూడలేదు వినలేదు. జన్మభూమి కార్యక్రమం మీద మా అభిప్రాయాం గురించి చర్చ. మా గ్రూప్ లో 30 మంది వున్నారు.  అతను రెడీ అనగానే మాట్లాడాలి మొత్తం అందరికి కలిసి 20 నిముషాలు.వాళ్ళు రేడీ అనగానే నేను ఒకరిద్దరు మాట్లడాక నా దగ్గరకొస్తుంది అప్పుడు మాట్లాడదామని మనసులో నేను ఎప్పుడూ చూడని జన్మభూమి కార్యక్రమం గురించి అలోచించ సాగాను.ఏమిజరిగిందో నాకు అర్ధం కాలేదు. అందరు ఒకేసారి అరుస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఎవరు ఏమి చెప్తున్నారో అర్ధం కాలేదు. 10 నిముషాలు చూశాక ఇది పద్ధతి కాదని ఒకరి తరువాత ఒకరు మాట్లాడదాము అని ఒకొక్కరు 3 నిముషాలు మాట్లాడదాము అని  చెప్పడానికి ట్రై చేశాను. కానీ అసలు ఎవరూ వినే మూడ్ లో అసలు లేరు. ఇంటర్యూ టీం వాళ్ళు ఏమైనా జొక్యం చేసుకొని సెట్ చేస్తారేమో అనుకున్నాను. మళ్ళీ 2 సార్లు చెప్పాలని ట్రై చేశాను. అప్పుడు నావైపు ఇంటర్యూ టీం వాళ్ళు చూశారు. కానీ ఇంతలో టైం అయిపోయింది, ఈ దెబ్బతో చాలామంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళలో బాగా నోరేసుకొని అరిచిన వాళ్ళు, నాలాగ ఇంటర్యూ లో కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, చివరివరకు పోరాడాలి తప్పదు అనే పరిస్థితి వున్నవాళ్ళు బహుశా పోస్టులు కొనుకున్న వాళ్ళు కూడా వున్నారేమో!

ఇక ఆఖరి ఘట్టం ఇంటర్యూ. ఇంటర్యూ బోర్డ్ లో జిల్లా కలెక్టర్,వెలుగు పి.డి, హైదెరాబాద్ నుండి సెర్ప్ లో స్టేట్ ప్రాజెక్ట్ మానటరింగ్ మేనేజర్ ఇలా ఎవరెవరో వున్నారు. లోపల ఇంటర్యూ జరిగి వచ్చిన వాళ్ళని కొందరు ఏమి అడుగుతున్నారు అని ఎంక్వైరీ చేశారు కానీ ఇంటర్యూ రూం లోపలినుండి వచ్చిన వాళ్ళు ఏదో ట్రాన్స్ లో వున్నట్లు మాట్లాడుతున్నారు. నేను నాతో వున్నందుకు నా ఫ్రెండ్స్ కూడా పాపం ఇక  జాబ్ మీద ఆశలు లేక ఇంటర్యూ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము. ఇంతలో నాకు పిలుపు వచ్చింది.

లోపల మొత్తం ఒక 8 మంది వున్నారు. ఆశ్చర్యంగా అందరు నవ్వుతూ తమని పరిచయం చేసుకున్నారు. అందరు కూడా మంచి పొజిషన్లో వున్నవాళ్ళు. కలెక్టర్ జవహర్ రెడ్డిగారు నాకు  ఎందుకో చాలా నచ్చారు, వెలుగు పి.డి గారు,డి.ఆర్.డి.ఎ. పి.డి, సెర్ప్ నుండి మురళి(ఇప్పుడు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) గారు, ఇంక  ఎవరెవరో. నాకు అప్పటికి నేను ఇంటర్యూ కి వచ్చిన జాబ్ యొక్క సీరియస్ నెస్ కొంచెం అర్ధం అయింది. నన్ను అడిగిన ప్రశ్నలు నేను చెప్పిన కోతి సమాధానాలు తలుచుకుంటే నాకు ఎప్పుడు కూడా చాలా చిన్నతనంగా అనిపిస్తుంది.
కూర్చొండి. శిరీష హౌ ఆర్ యు?
నేను: ఐ యాం ఫైన్ సార్ థాంక్ యు
ప్రశ్న: మీరు టెస్ట్ లో బాగా వ్రాశారు, పి.జి  కూడా గోల్డ్ మెడల్ వుంది ఈవుద్యోగం చెయ్యాలని మీరెందుకు అనుకుంటున్నారు?
నేను: నాకు ఏదైన జాబ్ చెయ్యాలని చిన్నప్పటినుండి ఇష్టమండి అందుకే వచ్చాను.
ప్రశ్న: ఐతే  ఈ జాబ్ గురించి మీకేమీ తెలీదా?
నేను: తెలీదండి
ప్రశ్న: శిరీష ఈ జాబ్ లో మీరు ఏదైన చిన్న పల్లెలో వుండాల్సి వస్తుంది. అక్కడ మీకెలాంటి సదుపాయాలు వుండవు. ఎలక్ట్రిసిటీ వుండదు ఏమీ దొరకదు, టి.వి. సినిమా ఇలాంటివి ఏమి వుండవు మరి అక్కడ వుండగలరా?
నేను: హ్మ్ మరీ అంత కనీస సదుపాయాలు లేని దగ్గర వుంటే నేను బతకటమే కస్టమైపోతుంది ఇక ఉద్యోగం ఏమి చెయ్యగలనండి. ఒక మండల హెడ్ క్వాటర్ గ్రామం అయినా ఐతే కనీసం నెల నెలా గ్యాస్ దొరికితే నా తిండికి, నీళ్ళు లాంటి  ఇబ్బంది లేకపోతే రోజూ నేను పనిచెయ్యాల్సిన గ్రామాలకు వెళ్ళి రాగలుగుతాను. లేదంటే కట్టెల పొయ్యిమీద వండుకోవటం తినడం, నీళ్ళకోసం వెళ్ళిరావటం ఇవి చెయ్యటమే సరిపోతుంది కదండీ
(టీం అందరూ నవ్వారు ఎందుకో) సరే అయితే మండల్ హెడ్ క్వాటర్ అయితే పరవాలేదా అన్నారు.
నేను: అరకు గూడేలలో తిరగటం కంటే బెటర్ కదండీ. నాకు  కొన్ని మినిమం అవసరాలు మాత్రం అవసరం.
ప్రశ్న:స్వయం శక్తి సంఘాల(ఎస్.హెచ్.జి.) గురించి చెప్పండి.
నేను: స్వంత శక్తి సామర్ద్యాలతో తమ అవసరాలను తీర్చుకోవటం కోసం ఏర్పాటైన సంఘాలు
(ఈ సమాధానం విని వాళ్ళకి గిర్రుమని తల తిరిగిపోయి వుంటుంది నాకు ఎస్.హెచ్.జి ల గురించి అసలేమీ తెలీదు అప్పటికి నేను తిరిగిన గిరిజన ప్రాంతాలలో ఇంకా వాటి జాడలేదు అప్పటికి మరి)
ప్రశ్న: గ్రామ సంఘాలంటే ఏమిటి?
నేను: (పిచ్చి వాళ్ళలా వున్నారే, ఇందాకే  సఘం గురించి చెప్పాను కదా మళ్ళీ తిప్పి తిప్పి అడుగుతున్నారు అనుకున్నను) ఏముందండీ ఏ సంఘం అయినా ఒకటే, గ్రామం లో అందరు కలిసి వారందరికి వున్న  కొన్ని  అవసరాల కోసం సంఘం గా ఏర్పడితే దానినే గ్రామ సంఘం అంటారు.
(వెంటనే కాలేజి అబ్బాయిలా వున్నారనిపించిన పి.డి గారు అదికాదు మరి గ్రామైక్య సంఘం ...అని ఏదో చెప్పబోయారు) ఇంతలో మురళిగారు సరే "గిరిజా" బేసిక్ అర్ధం అదే కదా అన్నారు. నాకు తెలీకుండా ఏదో గూఢు పుఠాణీ జరిగిపోయిందనిపించింది,నేను తప్పు జవాబు చెప్పానని తరువాత సంఘాలతో పనిచేశాక తెలిసింది) సరే ఏమి చేస్తాము.
ప్రశ్న: మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ వదిలేయాడానికి గల కారణం ఏంటి?
నేను: జాబ్ చాలా చాలా నచ్చిందండి. కానీ జీతం..ఇస్తున్నారుకానీ నాకు సరిపోవటంలేదు. అంటే కొంత మినిమం సాలరీ కావాలి కదా అని తిరిగి నేనే ప్రశ్న వేసేసా(జవహర్ రెడ్డి గారిని.అతను కూడా నిజమే అన్నట్లు తల ఊపేశారు)కానీ వెంటనే
ప్రశ్న: మరి మీరెంత జీతం కావాలనుకుంటున్నారు?
నేను: (ఇలాంటి ప్రశ్న వేస్తే ఎలా మరీ)అంటే ఒక 4,000/- ఐతే బాగుంటుంది. అలా అని జీతం ఒక్కటే నాకు ముఖ్యం అని కాదులెండి.(మా ఆర్గనిజేషన్ కి ప్రాజెక్ట్స్ లేవని చెప్పాలనిపించింది కాని ఏమో చెప్పలేకపోయాను)
ప్రశ్న: మీ ఫ్యామిలీ గురించి మీ గురించి  చెప్పండి.
నేను:(చంపేశారు ఆ ఒక్కటీ అడక్కుండా వుండలేరా? అబద్ధాలు చెప్పటం కుదరదు, చెప్పాక మీకెందుకు జాబ్ అంటారేమో అని కొన్ని డీటైల్స్ మాత్రం చెప్పాలనుకున్నాను)మాది పార్వతీపురమండి, నేను  మాత్రం  ఎక్కువగా విజయవాడ, విశాఖపట్నం లో చదువుకున్నాను, చదువు వివరాలన్నీ నా సర్టిఫికేట్లలో వున్నాయి, నా మొదటి ఉద్యోగం ఇప్పుడు అరకులో గిరిజనులతో అని చెప్పాను.
ప్రశ్న: మీ కుటుంబం గురించి కూడా ఏమైనా చెప్పండి
నేను:(వదిలేలా లేరు) మా డాడీ పార్వతీపురం లో వ్యాపారస్తులు, మమ్మీ కూడా టైలరింగ్ సెంటర్, ఇంక రకరకాల ట్రైనింగులు ఇస్తుంటారు. చెల్లి తమ్ముడు చదువుకుంటున్నారు అంతేనండి నాగురించి
ప్రశ్న: మీ  ఫాధర్ ఏ వ్యాపారం చేస్తారు?
నేను: (నీకు అంత అవసరమా దొంగ మొహమా అని తిట్టుకున్నా, ఎవరిని  అని అడగకండి) అంటే మా  డాడీ వాళ్ళకి ఒక సినిమా హాలు వుందండి. అని చెప్పి భయం గా చూశాను.

వాళ్ళంతా మొహాలు చూసుకున్నారు నన్నేమి అనలేదు
ప్రశ్న:ఒక్కరే పని చెయ్యటం మంచిదా గ్రూపులో పనిచేస్తే మంచిదా?
నేను: గ్రూపులో పని చేసినా ఎవరి పని,బాద్యత వారికి వేరుగా వుండేలా వుంటే బాగుంటుంది.లేదంటే ఏ పనులు  పూర్తికావు

సరే చాల మంచిది మీకు ఇంటర్యూ ఫలితాలు రేపు  తెలియజేస్తాము అన్నారు.వెళ్ళే ముందు  నాకు నిజంగా  ఒక మాట చెప్పలనిపించింది. నా ఫ్యామిలీ గురించి కాకుండా నన్ను చూసి జాబ్ ఇవ్వండి అని. నేను ఇంటర్యూ సరిగా చేసినట్లే నాకు నమ్మకం  కుదరలేదు, ఇక ఈ ఓవర్ యాక్షన్ మాటలెందుకు అనిపించి ఊరుకున్నాను.ఏమైనా చెప్పాలా అని  అడిగారు నా తటపటాయింపు చూసి.ఏమి లేదండి అని వెళ్ళిపోయాను.నాకు ఖచ్చితంగా తెలుసు నన్ను సెలెక్ట్ చెయ్యరని. ఇక అక్కడ వుండటం కూడా అనవసరం.

ఆ రోజంతా అలసిపోవటం వల్ల బాగా నిద్రపోయా.ఇక ఉదయం లేచి ఆ ఇంటర్యూ జాబ్ అన్ని మర్చిపోయాను. ఒక ఆదర్శ భంధువు యొక్క బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నాను ఆ రోజంతా. అప్పటికి సెల్ ఫోన్లు లేవు కాబట్టి పాపం నా ఫ్రెండ్స్ కి నన్ను కాంటాక్ట్ చేసే అవకాశం కూడా లేదు. చుట్టాల సూరి లా అందరి ఇళ్ళు తిరిగి, ఆ ఉద్యోగం నాకు ఇక రాదని వాళ్ళు ఎప్పుడో అమ్మేసుకున్నారని చెప్పేసాను అందరికీ. అసలు ఆ ఇంటర్యూకోసం కాదు అందరిని కలవటం కోసమే వచ్చానని మాట్లాడాను.

సాయంత్రం మామయ్య ఇంట్లో వున్నాను. ఆయన బ్యాంక్ మేనేజర్, ఆయన బ్యాంక్ వెలుగు ఆఫీసు ఎదురుగానే. మామయ్య ఇంటికి రాగానే  కంగ్రాట్స్ రా నువ్వు అన్ని టెస్ట్స్ ఇంటర్యూ లలో ఎక్కువ స్కోర్ చేశావు లిస్ట్ లో నీదే మొదటి పేరు వుంది అని చెప్పారు. నాకు ఏమి అర్ధం కాలేదు మొదట. అర్ధమైన తరువాత చాలా సంతోషం.ఎంత పాపాత్మురాలిని వుద్యోగాలు అమ్మేసుకున్నారు అని ఏదేదో వాగాను. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. తరువాత అన్నీ త్వరగా అయిపోయాయి. మమ్మల్ని అందరిని ఒకేసారి రమ్మని చెప్పారు. సేలరీ 7,000/- అని తరువాత మళ్ళీ పెరుగుతుందని చెప్పారు.మొత్తానికి నేను కొత్త జాబ్ లోఅ జాయిన్ అయిపొయా!!

ఆగండీ హమ్మయా సుఖాంతం అనుకుని హేపీ గా ఫీల్ అవుతున్నారా..అలా ఐతే నాతో పాటు మీరు కూడా ముద్దపప్పులో కాలేసినట్లే. ఫ్రెంట్ కి వుంది క్రోకోడైల్ ఫెస్టివల్ (ముందుంది మొసళ్ళ పండగ).ఉతికి ఆరేసి గెంజి పెట్టేసారు నన్ను.ఆ ఉతుకుడు తరువాత వ్రాస్తానేం!!

Thursday, May 27, 2010

నా అంత పనికిమాలిన వాళ్ళెవరూ వుండరేమో!

నిజం చెప్పాలంటే నా అంత పనికిమాలిన వాళ్ళెవరూ వుండరేమో! నీకంత డౌటు ఎందుకొచ్చింది అంటారా. మరి ఒక వైపు సైక్లోన్ లైలా వచ్చి అక్కడ అల్లకల్లోలం అయిపోతుంటే నేను ఇక్కడ కోటీ బజార్ లో కుర్తీలు, కర్చీఫ్ లు కొనుక్కుంటూ, ప్రసాద్ ఐ-మాక్స్ లో ఐరన్ మ్యాన్ -2 చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఓస్ అంతేనా అనకండి. నేను ప్రస్తుతం కేర్- ఇండియా సునామీ ప్రొగ్రాం లో పనిచేస్తున్నాను కదా అందులో భాగంగా మేము డిసాస్టర్ ప్రిపేర్డ్ నెస్ ప్రోగ్రాం (విపత్తుల సంసిద్ధతా కార్యక్రమం )చేస్తున్నము. అంటే గ్రామాలలో ప్రజలను తుఫానులు, వరదలు, అగ్నిప్రమాదాలు మొదలైన విపత్తులొస్తే, వచ్చేముందు, వచ్చినప్పుడు, వచ్చి వెళ్ళిన తరువాత జరిగే పరిస్థితులకు ఎలా సంసిద్ధులుగా వుండాలో ట్రైనింగ్ ఇచ్చాము. అంతే కాక విపత్తులకు సిద్ధంగా వుండడానికి అవసరమైన ఎన్నో పద్ధతులు (సిస్టంస్) ఏర్పాటు చేశాము.
తీరప్రాంత గ్రామాలలో యువకులు, స్త్రీలను (పిల్లల్ని కూడా) కొన్ని టాస్క్ ఫోర్స్ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి వారి వారి గ్రూపుకు సంబందించిన ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. హెచ్చరికల కమిటీ వారికి వివిధ మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలలో ప్రజలకి తుఫాను మొదలైన హెచ్చరికలు ఎలా ఇవ్వాలో, హాం రేడిఒ, ఇంటెర్నెట్, ప్రభుత్వ సమచారం/వాతావరణ సమాచారం మొదలైనవి అందరికి అందజేస్తారు. సముద్రం లోపల వున్న వాళ్ళకి, లోతట్టు ప్రాంతలవాళ్ళకి అందరికి సమాచారం అందే పద్దతులలో శిక్షణ పొందారు. తరలింపు కమిటీ వాళ్ళు వికలాంగులను, ఘర్భిణిలను, ముసలివారిని, పిల్లల్ని ఇంక బలహీనంగ వున్నవారిని, పశువులను, లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర పరిసరాలలో వున్న వారిని సురక్షితమైన ప్రదేశాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. శిబిర నిర్వహణ (షెల్టర్ మేనేజ్మెంట్) టీం  వారు పునరావాస కేంద్రం లో అవసరాలన్నిటినీ చూస్తారు. బోజనం, నీళ్ళు, వస్త్రాలు మొదలైనవి. రక్షణ కమిటీ విపత్తులో ప్రమాదంలో వున్న వారిని రక్షించడానికి తగిన శిక్షణ పొందారు. వరదలో కొట్టుకుపోతున్న వారిని, శిధిలాల క్రింద పడ్డవారిని,అగ్నిప్రమాదాంలో వున్న వారిని,గాయాలతో వున్న వాళ్ళని, ఎముకలు విరిగిన వారిని ఏవిధంగా సురక్షితంగా బయటకు తీసుకురావటం ఎలాగో వీరికి శిక్షణ ఇవ్వబడింది. అదే విధంగా ప్రధమ చికిత్స కమిటీ, ఇంకా రకరకాల కమిటీలు. అసలు ప్రతీ సంవత్సరం తుఫాన్లు వస్తాయి నెల్లూరుకి. నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలవుతుంది. నెల్లూరుకి మామూలు రుతుపవనాలు రావు. అంటే జూన్, జూలై లో వర్షాలు రావు. తిరోగమన రుతుపవనాలొస్తాయి. అవి తుఫాన్లుగానే వస్తాయి. ఈ విషయం తెలియక నేను వచ్చిన కొత్తలో తుఫానొచ్చి బీబత్సంగా గాలి వర్షం వస్తే, మా బాసు, నేను వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారిని కలిసాము. "సార్ దారుణంగా తుఫాను, ఈదురుగాలులు, అయ్యో అమ్మో అని ఖంగారు పడిపోతూ చెప్పి గవర్నమెంట్ తరుపున మీరు ఏమి చేస్తున్నారు మేము కూడా మీతో కలిసి పనిచేస్తాము అని చెప్పాము. అతను నవ్వి మీరు నెల్లూరికి కొత్త లా వున్నారు అని నన్ను ఎక్కడనుండి వచ్చారు, మీరు ఆంధ్రా యూనివర్సిటీ లో చదివారా ! ఏ బ్యాచు, నేను కూడా అక్కడే, అని కబుర్లు మొదలుపెట్టారు. మేము మళ్ళీ తుఫాను గురించి అడిగితే ఈ సంవత్సరం పడాల్సిన వర్షపాతం అంత ఒక్కరోజులో పడిపోయిందని నేను హ్యాపీ గా వున్నను మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పారు. మేము మొఖాలు చూసుకొని వచ్చేశాము.
ప్రతీ సంవత్సరం తుఫాన్లు వస్తున్నా కూడా పరిస్తితుల్లో మార్పులు లేవు. ఇందులో అందరి తప్పు వుంది. హెచ్చరిక చేసినా, కష్టపడి అరా కొరా సదుపాయాలు కల్పించినా ప్రజలు సరిగా వుపయోగించరనేది కూడా సత్యమే, ఎందుకంటే వారికి వరద చేసే నష్టం కంటే ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతే దొంగలు/తోటి మనుషులు చేసే నష్టం అంటే భయం. అలాగే అధికారులు నిర్లక్ష్యం అనేది కూడా సత్యమే. గవర్నమెంట్ అందరికీ చెయ్యాలంటే వారికి శిక్షణ వుండాలి. దీనికి మంచి వుదాహరణ మొన్న నవంబర్ లో వచ్చిన వాన లేని వరద. కర్ణాటకలో నీరెక్కువైపోయి గేట్లు ఎత్తేస్తే మనకి వరదలొచ్చాయి. ఆ సమయంలో , ఎప్పుడూ వరదల అనుభవం లేని కర్నూలు, మెహబూబ్ నగర్ లో అధికారులు సరిగా స్పందించలేకపోయారు, కాని కృష్ట్ణ గుంటూరు వాళ్ళు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు బాగా ఏర్పాట్లు చేశారు. చిన్న చిన్న లోపాలు ప్రతీ దగ్గరా వుంటాయి. దానికి ఏ ఒక్కరో కారణం కాదు.
వరదలొక ఎత్తయితే పులిహోర పేకెట్లు ఇంకొక ఎత్తు. నిజమండీ బాబు. మీలో కూడా చాలా మంది పులిహోర పేకెట్లు పంచేవుంటారు. అలా ఎందుకు పంచుతారో నాకు అర్ధం కాదు. పాపం 3 పూటల పులిహోర తింటే ఏమవుతుంది. కడుపు గోదారి అవుతుంది. ఊరు గోదారయిపోయినప్పుడు ఈ పులిహోర సైడ్ ఎఫెక్ట్ ఎంత దారుణం. ఇలాంటివి చాలా వుంటాయి. చీరలు, లుంగీలు, దుప్పట్లు పంచుతారు, పిల్లలికి పాలు, స్త్రీలకు ప్రత్యేక అవసరాలు ఎన్నో వుంటాయి. కనీసం బట్టలు మార్చుకొనేందుకు ప్రైవసీ కూడా లేని పునరావాస కేంద్రాలెన్నో! కొన్ని వందల కుటుంబాలు ఒకే కప్పుకింద వుండాలి, ఎన్నో భయాలు, ఎన్నో ఆశలు పెడతారు, మోసం చేస్తారు, ఒకటి వుంటే ఒకటి వుండదు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న తుఫాన్ కి నేను డ్యూటీ లో లేను. లీవ్ లో వున్నాను. సడన్ గా లైలా వచ్చింది. అదికూడా నేను పనిచేస్తున్న జిల్లాలకే. లీవ్ కేన్సిల్ చేసుకొని వస్తానంటే కూడా మా ఆఫీస్ లో, ఇంట్లో అందరు ఆ టైములో ప్రయాణం వద్దు అన్నారు. నేను కూడా లక్కీ కి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాడిని ఒక్కడిని వదిలేయలేక ఎక్కువగా ఓవర్ యాక్షన్ చెయ్యకుండా వుండిపోయాను హైదరాబాదులో. కానీ నా కొలీగ్స్, ఎన్.జి.ఒ లు ఫోన్లు చేసి కావలసిన సమాచారం అడుగుతూనే వున్నారు. ఆప్పుడు మాత్రం గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. కానీ చెప్పానుగా కోటీ, శిల్పారామం అని తిరుగుతూ గిల్టీ ఫీలింగ్ ని పక్కన తొక్కి పెట్టేసా. మీరే చెప్పండి తుఫాన్లు ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తాయి (కనీసం సంవత్సరంలో 2 సార్లు వస్తాయి) కానీ నాకు ఇలా ఇన్ని సెలవులు, బలాదూర్ తిరిగే చాన్స్ అంతా ఈజీ గా వస్తుందా!! అందుకే అన్న నా అంత పనికిమాలిన మనిషి ఇంకెవరూ వుండరని.

Friday, May 14, 2010

వడదెబ్బ తగిలింది దాని ఫలితమే ఈ పైత్యం.

చెన్నై కి ఒక నమస్కారం పెట్టేయాలనిపిస్తుంది.కానీ అలా వదిలించుకునే వీలు ఇప్పట్లో కనిపించటం లేదు. నేను పనిచేసే సునామీ ప్రాజెక్ట్ కి హెడ్ ఆఫీసు చెన్నై లోనే వుంది. మొన్న 4 రోజులుగా చెన్నై లో వున్నాను. ట్రైన్ దిగగానే ఎవరో ఫెడేల్ మని కొట్టినట్లు తగిలింది వేడి గాలి. సరేలే ఎంత సేపు ఆటో లో హొటెల్ కి చేరిపోతే హాయిగా ఎ.సి కదా అనుకున్నాను. నా మనసులో మాట పైన "అతధాస్తు" దేవతలకి వినపడినట్లుంది. నీ పని చెప్తాము ఆగు అనుకున్నారు. అంతే జనాలందరూ తోసేస్తూ నన్ను ఎలాగో మొత్తానికి ఆటో స్టాండ్ దగ్గరికి చేర్చారు. నాకొచ్చిన తమిళం లో అషోక్ పిల్లర్ కి పొళామా అని అడిగాను. వెంటనే ఆటో వానికి అర్ధం అయిపోయింది నాకు తమిళం చాలా బాగా తెలుసని. 200 అని చెప్పాడు. వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లో మా తమిళ్ కొలీగ్ ఆటో బేరం చేసిన సీన్ గుర్తు చేసుకున్నాను, "ఎన్నప్పా ఇంద మాదిరి, కొంజెం చూసి చొల్లుంగొ" అన్నాను. అంతే టప టప బడ బడ అని ఏదో ఒక 5 నిముషాలు గుక్కతిప్పుకోకుండా చెప్పాడు. అతను చెప్పింది నాకు ఎక్కడ అర్ధం కాలేదు అనుకుంటాడో ఖర్మ అని "చెరి అప్ప" 150 లేలో అన్నాను(లేలో హిందీ కాబోలు) ఏదో ఒకటి ఈ వేడిలో ఇంకాసేపు బేరం చెయ్యకుండా ఎంతో కొంత మా ఆఫీస్ డబ్బులు కదా నాదేం పోయింది అనుకుని ఆటో ఎక్కేసాను.ఆటో కొంచెం దూరం పోనిచి " అషోక్ పిల్లర్ ఇంగలుకు తెరియుమా" అని అడిగాడు. అసలే రాత్రి 10 అయింది నాకు దారి తెలియదు అంటే ఆటో వాళ్ళతో కష్టం అని కొంజెం తెరియుం అని చెప్పను. (కొంచెం తెలుసని). నన్ను ఊరికే టెస్ట్ చేస్తున్నాడు కాని చెన్నై లో ఆటో వాళ్ళకి అంత ముఖ్యమైన ప్రదేశం తెలియదా అనుకున్నాను.కాని ఆ పైనున్న దేవతల వరం వలన నాకు ఒక అద్భుతమైన ఆటో వాడు దొరికాడు. అతను కూడా శ్రికాకుళం నుండి 20 రోజుల క్రితమే చెన్నై కి వచ్చాడంట అతనికి కూడా సేం టు సేం నాలాగే కొంచెం తమిళం మాత్రమే వచ్చంట, సేం టు సేం నాలాగే ఎక్కడికి దారులు తెలీవంట. 5 నిముషాలకి ఒకసారి లెఫ్టా రైటా అని అడుగుతుంటే డౌట్ వచ్చి అడిగితే చెప్పాడు. మరి ఇందాక అంత తమిళం మాట్లాడావు కదా అని అడిగితే అది తమిళం కాదమ్మ ఎదో కొంజెం కొంజెం తెరుయుం అన్నాడు. ఛా ఈ చెన్నై లో నన్ను ఒక తెలుగు వ్యక్తి తమిళంలో మోసం చెశాడా!!ఖర్మ. శుభ్రంగా తెలుగు మాట్లాడకుండా తమిళం మొదలు పెట్టి ఇద్దరం కష్టపడి తమిళం మాట్లాడామన్నమాట! సరే ఇప్పుడు ఎలా నాకు కూడా పూర్తిగా దారి తెలీదు అని చెప్పాను. అందుకే కదా మీకు తెలుసా అని అడిగాను అని దారి తెలియకపోవడం ఖచ్చితంగా నాదే తప్పన్నట్లు చెప్పాడు. పోనీ ఎవరినైనా అడుగు అంటే మీరు కూడా అడగండి నా తమిళం సరిగా వుండదు అని చెప్పాడు. అక్కడికి నాది తమిళ్ ఎం.ఎ.లిట్ అయినట్లు. సరేలే అని చెప్పాను. మొత్తానికి వాళ్ళనడిగి వీళ్ళనడిగి రాత్రి 12 గంటలకి నన్ను హొటెల్ కి చేర్చాడు. ఎవరు చెప్పింది మన దేశానికి స్వతంత్రం ఇంకా రాలేదని? నేనే ఉదాహరణ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా.....ఓహ్ ఆటో అబ్బాయి కూడా వున్నాడు కదా!! ఛా జస్ట్ మిస్ అయింది లేదంటే నేనే మనకి స్వాతంత్రం తెచ్చేసే దాన్ని.ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఎంత పెద్దైన ఆడవాళ్ళకి భయాలు వుంటాయి. ఎక్కడ మనసు భయం లేకుండా స్వేచగా వుండగలుగుతుందో ....అక్కడే కదా స్వతంత్రం. మనసులో భయం పోయిన రోజు 90% స్వతంత్రం వచ్చేసినట్లే. ఈ తతంగం అంతా అయ్యే లోపల నా ఫేస్ జిడ్డు పట్టేసి జుట్టు రేగిపోయి బాగా చెమటలు పట్టేసి నామీద నాకే అసహ్యం వేసేలా వున్నాను.నిజంగా అయితే నన్ను ఆ హొటెల్ లోపలకి రానీయకూడదు, మా ఆఫీస్ తరుపున నేను రెగ్యులర్ గా వెళ్ళటం వల్ల రానిచ్చారు. హొటెల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన రిసెప్షనిస్ట్ మాత్రం నన్ను చూసి ఐస్వర్య రాయ్ ని చూసినంత ఫీలింగ్ తో అద్భుతంగా నవ్వుతూ చూసి విష్ చేశాడు. అక్కడ కూడ "తంగ్లిష్" మాటలే. వెల్ కం మేడం అని మొదలు పెట్టి నల్లా ఇరికింగ్లా మేడం అని ఇంకా ఏదేదొ చెప్పాడు. మొత్తానికి నాకు అర్ధం అయింది ఏంటి అంటే.....ఏమి అర్ధం కాలేదు




ఈ సమ్మర్ ఎందుకొస్తుందో?అసలు సమ్మర్ సీజన్ లో ఆఫీసులెందుకో? మా ఆఫీస్ ఊటీ లోనో కొడైకెనాల్ లోనో లేదెందుకో? ఫార్మల్ డ్రెస్సులు వేసుకొనే ఆఫీసుకి ఎందుకు వెళ్ళాలో? హాయిగా నైటీ వేసుకొని రావొచ్చు అని కనీసం చెన్నై లో పాలసీ పెడితే బాగుండు.అసలు ఎ.సి ఎవరికి వారు పెట్టుకునే బదులు కొంచెం కస్టమైన సూర్యుడి ని ఎ.సి లో పెట్టేస్తే బాగుండును!!!నేను కేంపులు ఎక్కువయ్యి మార్నింగ్ వాక్ చెయ్యకుండా 10 రోజులనుండి కస్టపడి పెంచుకున్న కొవ్వంతా చెన్నై ఎండలకి 4 రోజుల్లో కరిగిపోయింది. అసలు ఎవరిని పలకరించామంటే చాలు తిడుతున్నారనిపించే సౌండ్ వచ్చేలా మాట్లడేస్తుంటారు. చచ్చినా హిందీ మాట్లాడరు, తెలుగు వచ్చినా రానట్లుంటారు. కాకపోతే వాళ్ళ భాషా ప్రాంతీయాభిమానం చూసి ఒక్కోసారి ముచ్చటగా అనిపిస్తుంది.



సరే ఇంకెన్నాళ్ళు సునామీ ప్రాజెక్ట్ అయిపోతుంది లే ఆ తరువాత ఎక్కడో వేరే ప్రాంతం వేస్తారు అనుకున్నాను...సునామీ వచ్చిన విషయం వాళ్ళు మర్చిపోయిన మేము అంత త్వరగా మరిచిపోనీయం అందుకే ఇంకా డిసెంబర్ వరకు పని చెయ్యాలి అని చెప్పారు. ఇంకో సంవత్సరం నాకు తమిళ్ కష్టాలు, చెన్నై వేడి ట్రాఫిక్ తప్పదు.హుహ్ ఏమి చేస్తాము!!! ఎవరికి ఎంత ఎండ వ్రాసిపెట్టివుంటే అంత.



ఏంటి ఈ సోది మాకు అనుకుంటున్నరా...వడదెబ్బ తగిలింది దాని ఫలితమే ఈ పైత్యం.

Thursday, May 13, 2010

అభిమానులు క్షమించాలి( అంత లేదంటారా??)

నేను ఇప్పుడు తిరుపతి -బిలాస్ పూర్ ట్రైన్ లో వైజాగ్ వెళ్ళాలి. ట్రైన్ 1.40 కి నాకు టికెట్ కంఫర్మ్ కాలేదు. ఆన్ లైన్ లో చేశాను కాబట్టి అది కేన్సిల్ అయిపోతుంది. నెల్లూరు నుండి వైజాగ్ దాటి వెళ్ళలి అంటే మధ్యానం 2 నుండి రేపు ఉదయం 8 వరకు ప్రయాణం. ఎలాచెయ్యాలి? ఈ నెలంతా ప్రయాణాలు కొన్ని ఎ.సి దొరుకుతున్నాయి కొన్ని దొరకవు. కొన్ని వెయిటింగ్ లిస్ట్ లు కొన్ని ఆర్.ఎ.సి లు. నా ట్రైన్ కస్టాలే ఎక్కువగా వున్నాయి.

వీలైనంత త్వరగా పోస్ట్ రాయడానికి చూస్తాను. నా పోస్ట్ కోసం కూడా ఎదురుచూసే జీవులున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. వున్న ఒకరిద్దరు ఫేన్స్ ని ఐనా కాపాడుకోవాలి కదా!!

Monday, May 3, 2010

లేడీ బాస్

వెలుగు ప్రోగ్రాము మొదట 6 జిల్లాలో పైలట్ చేశారు. నా అదృష్టం కొద్దీ నేను అందులో పనిచెసే అవకాశం నాకు వచ్చింది. జీవితంలో అది మంచి మలుపు. అసలెవరకీ ఆ ప్రొగ్రాము గురించి తెలీదు అప్పటికి. పనిచేస్తున్న మాకు కూడా తెలీదు పూర్తి వివరాలు.సరే అంత మంచి అవకాశం నాకెలా వచ్చిందో చెప్తాను.


నేను జాబ్ వెతుకుతున్న టైములో నా బ్యాచ్ లో వాల్లంత అదే పనిలో వున్నారు. నేనే ఎదో చిన్న జాబ్ అయిన చేస్తున్నాను అప్పటికి. మిగిలిన వాళ్ళంత బేవార్స్ బ్యాచ్ అప్పటికి. నా ఫ్రెండ్స్ విజయనగరం లో వెలుగు ఇంటర్యూస్ కి వెళ్ళారు. కాని ఆరోజు నాకు అరుకు ఆఫీసులో విజిట్ వుండి, ఇంటర్యూ కి వెళ్ళటం కుదరలేదు. నేను పనిచేస్తున్న సంస్థకి ఆ విజిట్ చాలా ముఖ్యం అందుకని లీవ్ అడగలేకపోయాను.సో నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే తరువాత వారంలో శ్రికాకుళం జిల్లా ఇంటర్యూలకు వెళ్ళొచ్చని అనుకున్నాను.కాని నా ఫ్రెండ్స్ కొందరు మన జిల్లా అనీ చెప్పి అక్కడ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని ఒప్పించి నన్ను మళ్ళీ ఇంటర్యూ కి పిలిపించారు.నాకు ముందుగా కాస్త ఉద్యోగ అనుభవం వుండటం వల్ల జెండర్ కో-ఆర్డినేటర్ పోస్టుకి పిలిచారు నన్ను. మిగిలిన నా స్నేహితులందరు కమ్యూనిటీ కో-ఆర్డినేటర్స్ గా సెలెక్ట్ అయ్యారు. అసలు ఆ పోస్టలకు, పదాలకు అర్ధం కూడా మాకు నిజంగా తెలీదు. అందరు ఫ్రెష్ ఫ్రం కాలేజి. అలా అయితే బాగా మౌల్డ్ చెయ్యొచ్చని వెలుగు ప్రాజెచ్ట్ వారి అభిప్రాయం. అది కొంతవరకు నిజమే.


విజయనగరం ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్. తరువాత కాలం లో ఐ.ఎ.ఎస్ కంఫర్మ్ అయ్యింది ఆమెకి. ఆమెకి నేను ఎందుకో మొదట నచ్చనే లెదో లేక ఇంటర్యూ రోజు రాలేదనో ఆమెని చూడగానే నాకు అర్ధం అయిపోయింది ఆమెకి నేను నచ్చలేదు అని.(నాకు నచ్చారా లేదా అన్నది అనవసరం) సరే నా పని ప్ర్యత్నం చెయ్యటమే కదా!! క్వాలిఫికేషన్స్, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ అనుభవం అన్ని అడిగారు. జెండర్ అంటే ఏమి తెలుసు అన్నారు. నిజంగా డిక్షనరీ అర్ధం తప్ప నాకు అప్పటికి జెండర్ ఈక్విటీ గురించి పనిచెస్తే ఏమి చెయ్యాలి అనేది, అదొక పని వుందని కూడా తెలీదు. అయినా నాకు తెలిసిందే చెప్పాను. తెలుగులో స్త్రీత్వం, పురుషత్వం అనే అర్ధం అని. ఆమె నీకు అంతే తెలుసా? మరి నీ పోస్ట్ డెస్క్ ఆఫీసర్ జెండర్ అని వుంది నీ బయోడేటా లో అన్నారు. నిజమే కొథ్త్తగా నాకు అప్పగించిన ఇంకో పని మా ఆఫీస్ లో. కానీ దానిగురించి ఇంకా నాకేమి చెప్పలేదండి అని చెప్పాను.కేవలం కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చాము కొందరు దాయీలకి అని చెప్పాను. సరే మేమెలాగూ ట్రైనింగ్ ఇస్తాము అన్నారు. హమ్మయ్య అనుకుని, థాంక్స్ చెప్పాను. అంతా బాగ అయ్యింది అనుకునే సరికి మలుపు తిప్పిన ప్రశ్న అడిగారు. "నీకు రేపు పెళ్ళి అయ్యాక(అంటే ఫ్యూచర్ లో) కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావా? ఉద్యోగానికా? అని అడిగారు. నాకు తెలుసు ఎవరికైన కుటుంబమే ముఖ్యం, పెళ్ళి అయినా అవ్వక పోయినా కూడా. కానీ అలా చెప్తే ఉద్యోగం ఇస్తారా? అందుకె ఆలొచించడానికి టైము దొరుకుతుందని " అంతే యె విషయంలో మేడం అని అడిగాను" ఆమె మళ్ళీ సోదాహరణగా అడిగారు. ఫ్యూచర్లో నీకు పెళ్ళి అయ్యాక జాబ్ లో ప్రెజర్, ఇంట్లొ ప్రెజర్ ఎక్కువగా వున్నప్పుడు దేనికి ప్రాదాన్యత ఇస్తావు, ఏది వదులుకుంటావు అన్నారు. అంత వరకు చిన్న ఆశ వుండేది జాబ్ ప్రెజర్స్ మీద పనిచేస్తాను అని చెప్పడానికి. కానీ ఆమె ఏది వదులుకుంటావు అనే వుద్ధెశ్యంతో అడిగారు.ఇక అబద్దం చెప్పే ఉద్దెశ్యం నాకు లెదు. " నాకు కుటుంబమే ముఖ్యం దానికే ప్రాధాన్యత ఇస్తాను. వీలైనంత వరకు జాబ్ లో ప్రెఊర్ ని తట్టుకొని పనిచెయ్యడానికే ప్రయత్నిస్తాను. ఒకవేళ ఎదో ఒకటి వదులుకోవాల్సి వస్తే తప్పదుకదా వుద్యోగమే వదులుకుంటాను. బహుశా అది ఆ జాబ్ కి న్యాయం చెయ్యటమే కదండి అన్నాను." కాని ఆమెకి ఈ జవాబు నచ్చలేదు(బహుశా నేను నచ్చలేదు) "ఈ ఉద్యోగం ఎంతో ముఖ్యమైనది మన కుటుంబంకంటే కూడా ఉద్యోగమే ముఖ్యం అనుకునే వాళ్ళే చెయ్యగలరు. నువ్వు ఈ ఉద్యొగానికి సరికాదు అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఆ పొజిషన్లో వున్న ఆమె చెప్తున్నారంటే అది నిజమేనేమో. ఆ ఉద్యోగం చెయ్యాలంటే అదే జీవితం గా భావించేవాళ్ళు కావాలేమో అనిపించింది. అలా అని నన్ను నేను ఊరడించుకుంటున్నాను మనసులో ఇంతలో ఆమె ఇంకొక మాట అనేశారు. ఇలా కుటుంబమే ప్రధానం అనుకునే నువ్వు ఎక్కడా పనిచెయ్యలేవు అని. నాకు చాలా కోపం వచ్చేసింది. చేతకానివాళ్ళకీ, నిస్సహాయస్థితిలో వున్నప్పుడూ కోపం వస్తే అది కన్నీళ్ళుగా మారిపోతుంది. ఆమె ముందు ఏడ్చేస్తానేమో అని  చాలా కస్టపడి కంట్రోల్ చేశుకిని సరే మాడం చూస్తాను. నాకు తగిన జాబే వెతుక్కుని చేస్తాను తొందరేమీ లేదు అని చెప్పి వచ్చేశాను. బయట ఆశగా ఎదురుచూస్తున్న నా ఫ్రెండ్స్ కి ఎలా చెప్పాలి ఇలా మాట్లాడారు మీ మేడం అని. ఒకప్పుడు ఒకరికోసం ఒకరు ఆవెశంగా నిర్ణయాలు తీసుకునే వయసు కాదు కదా! అప్పటికే పి.జి. చేసి ఒక సంవత్సరం ఖాళీగా వుండి బాధలు పడుతున్నారు. అప్పుడేదో చెప్పాను నాకు గుర్తులేదు కూడా.


అన్ని మన మంచికే జరుగుతాయి అనేది నిజమేనేమో! తరువాత నేను శ్రికాకుళం వెలుగు ప్రాజెక్టు లో సెలెక్ట్ అయ్యాను. ఆ ఇంటర్యూ ఒక సరదా కధ(నాకు). ఇంటర్యూ చెసినవాళ్ళకి కంఫ్యూజన్ పాపం. అది వచ్చేవారం రాస్తాను. కానీ నేను అసలు ఏ వుద్యోగానికీ పనికి రాను అన్న ఆమె కరెక్టుగా 4 నెలల తరువాత ఒక మీటింగ్ లో మా పి.డి గారితో పాటు ప్రెజెంటేషన్ చెయ్యడానికి వెళ్ళిన నన్ను, మీటింగ్ లో నేను మాట్లాడిన విధానం చూసి, మా  పి.డి గారితో మీకు మంచి కేండిడేట్లు దొరికారండీ మా వాళ్ళు ఇంకా అంతగా లేరు అన్నారు. నాగురించి అడిగారు. ఆమె నన్ను గుర్తుపట్టలేదో ఏమో! కానీ మా పి.డి. గారు గుర్తుచేశారు, ఈమె పేరు శిరీష మీ జిల్లానే అని. ఆమె నన్ను చూసి "ఏమ్మాయ్ మన జిల్లా వదిలి పక్క జిల్లా కి ఎందుకు వెళ్ళావు?" అని అడిగారు. కాసేపు నా కోపం తీరేలా ఆమె నన్ను అన్న మాటలు తిరిగి గుర్తుచేద్దామా అనిపించింది. కానీ ఏదో మర్యాద అడ్డం వచ్చింది. బట్ మా పి.డి గారికి తెలుసు నేను ముందు అక్కడికి ఇంటర్యూ కి వెళ్ళిన విషయం ఆయన ఆనందంగా చెప్పారు. అసలే పి.డి.ల మద్య ఎప్పుదూ గిల్లికజ్జాలే."మీరు గుర్తుపట్టలేదేమో మీదగ్గరకే మొదట ఇంటర్యూకి వచ్చింది" అని చెప్పారు. నేను  అవును అన్నట్లు తల ఊపాను.ఆమెకి గుర్థొచిచిందో లేదో నాకు తెలీదు కానీ ప్రతీ సారి ఏ మీటింగ్లో కలిసినా నన్ను గుర్తుపట్టలేదన్నట్లే వుంటారు. ఇప్పటికి ఆమే నేను ఎన్నో స్థాయిలలో ఎన్నోచోట్ల కలిశాము. సునామీ టైములో ఆమె జిల్ల కలెక్టర్ గా వున జిల్లలో నేను పనిచేయటం వల్ల చాలా మీటింగ్ లలో కలిశాము. ప్రతీ సారీ ఇదే జరుగుతుంది. నా ముఖం మరీ అంత గుర్తుపెట్టుకోనవసరంలేనంతగా వుందా అని డౌట్ వస్తుంది.ఆమె తప్ప నన్ను ఇంతవరకూ ఎవరూ మర్చిపోలేదు, ఆఖరికి ఒక్కసారి చూసినవాళ్ళు కూడా! నా హింస భరించిన వాళ్ళు మరిచిపోయే చాన్సే లేదు. 


నెక్స్ట్ పోస్ట్ వ్రాసేవరకు మీరు గుర్తుపెట్టుకుంటారా? మరిచిపోతారా?