Thursday, May 27, 2010

నా అంత పనికిమాలిన వాళ్ళెవరూ వుండరేమో!

నిజం చెప్పాలంటే నా అంత పనికిమాలిన వాళ్ళెవరూ వుండరేమో! నీకంత డౌటు ఎందుకొచ్చింది అంటారా. మరి ఒక వైపు సైక్లోన్ లైలా వచ్చి అక్కడ అల్లకల్లోలం అయిపోతుంటే నేను ఇక్కడ కోటీ బజార్ లో కుర్తీలు, కర్చీఫ్ లు కొనుక్కుంటూ, ప్రసాద్ ఐ-మాక్స్ లో ఐరన్ మ్యాన్ -2 చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఓస్ అంతేనా అనకండి. నేను ప్రస్తుతం కేర్- ఇండియా సునామీ ప్రొగ్రాం లో పనిచేస్తున్నాను కదా అందులో భాగంగా మేము డిసాస్టర్ ప్రిపేర్డ్ నెస్ ప్రోగ్రాం (విపత్తుల సంసిద్ధతా కార్యక్రమం )చేస్తున్నము. అంటే గ్రామాలలో ప్రజలను తుఫానులు, వరదలు, అగ్నిప్రమాదాలు మొదలైన విపత్తులొస్తే, వచ్చేముందు, వచ్చినప్పుడు, వచ్చి వెళ్ళిన తరువాత జరిగే పరిస్థితులకు ఎలా సంసిద్ధులుగా వుండాలో ట్రైనింగ్ ఇచ్చాము. అంతే కాక విపత్తులకు సిద్ధంగా వుండడానికి అవసరమైన ఎన్నో పద్ధతులు (సిస్టంస్) ఏర్పాటు చేశాము.
తీరప్రాంత గ్రామాలలో యువకులు, స్త్రీలను (పిల్లల్ని కూడా) కొన్ని టాస్క్ ఫోర్స్ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి వారి వారి గ్రూపుకు సంబందించిన ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. హెచ్చరికల కమిటీ వారికి వివిధ మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలలో ప్రజలకి తుఫాను మొదలైన హెచ్చరికలు ఎలా ఇవ్వాలో, హాం రేడిఒ, ఇంటెర్నెట్, ప్రభుత్వ సమచారం/వాతావరణ సమాచారం మొదలైనవి అందరికి అందజేస్తారు. సముద్రం లోపల వున్న వాళ్ళకి, లోతట్టు ప్రాంతలవాళ్ళకి అందరికి సమాచారం అందే పద్దతులలో శిక్షణ పొందారు. తరలింపు కమిటీ వాళ్ళు వికలాంగులను, ఘర్భిణిలను, ముసలివారిని, పిల్లల్ని ఇంక బలహీనంగ వున్నవారిని, పశువులను, లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర పరిసరాలలో వున్న వారిని సురక్షితమైన ప్రదేశాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. శిబిర నిర్వహణ (షెల్టర్ మేనేజ్మెంట్) టీం  వారు పునరావాస కేంద్రం లో అవసరాలన్నిటినీ చూస్తారు. బోజనం, నీళ్ళు, వస్త్రాలు మొదలైనవి. రక్షణ కమిటీ విపత్తులో ప్రమాదంలో వున్న వారిని రక్షించడానికి తగిన శిక్షణ పొందారు. వరదలో కొట్టుకుపోతున్న వారిని, శిధిలాల క్రింద పడ్డవారిని,అగ్నిప్రమాదాంలో వున్న వారిని,గాయాలతో వున్న వాళ్ళని, ఎముకలు విరిగిన వారిని ఏవిధంగా సురక్షితంగా బయటకు తీసుకురావటం ఎలాగో వీరికి శిక్షణ ఇవ్వబడింది. అదే విధంగా ప్రధమ చికిత్స కమిటీ, ఇంకా రకరకాల కమిటీలు. అసలు ప్రతీ సంవత్సరం తుఫాన్లు వస్తాయి నెల్లూరుకి. నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలవుతుంది. నెల్లూరుకి మామూలు రుతుపవనాలు రావు. అంటే జూన్, జూలై లో వర్షాలు రావు. తిరోగమన రుతుపవనాలొస్తాయి. అవి తుఫాన్లుగానే వస్తాయి. ఈ విషయం తెలియక నేను వచ్చిన కొత్తలో తుఫానొచ్చి బీబత్సంగా గాలి వర్షం వస్తే, మా బాసు, నేను వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారిని కలిసాము. "సార్ దారుణంగా తుఫాను, ఈదురుగాలులు, అయ్యో అమ్మో అని ఖంగారు పడిపోతూ చెప్పి గవర్నమెంట్ తరుపున మీరు ఏమి చేస్తున్నారు మేము కూడా మీతో కలిసి పనిచేస్తాము అని చెప్పాము. అతను నవ్వి మీరు నెల్లూరికి కొత్త లా వున్నారు అని నన్ను ఎక్కడనుండి వచ్చారు, మీరు ఆంధ్రా యూనివర్సిటీ లో చదివారా ! ఏ బ్యాచు, నేను కూడా అక్కడే, అని కబుర్లు మొదలుపెట్టారు. మేము మళ్ళీ తుఫాను గురించి అడిగితే ఈ సంవత్సరం పడాల్సిన వర్షపాతం అంత ఒక్కరోజులో పడిపోయిందని నేను హ్యాపీ గా వున్నను మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పారు. మేము మొఖాలు చూసుకొని వచ్చేశాము.
ప్రతీ సంవత్సరం తుఫాన్లు వస్తున్నా కూడా పరిస్తితుల్లో మార్పులు లేవు. ఇందులో అందరి తప్పు వుంది. హెచ్చరిక చేసినా, కష్టపడి అరా కొరా సదుపాయాలు కల్పించినా ప్రజలు సరిగా వుపయోగించరనేది కూడా సత్యమే, ఎందుకంటే వారికి వరద చేసే నష్టం కంటే ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతే దొంగలు/తోటి మనుషులు చేసే నష్టం అంటే భయం. అలాగే అధికారులు నిర్లక్ష్యం అనేది కూడా సత్యమే. గవర్నమెంట్ అందరికీ చెయ్యాలంటే వారికి శిక్షణ వుండాలి. దీనికి మంచి వుదాహరణ మొన్న నవంబర్ లో వచ్చిన వాన లేని వరద. కర్ణాటకలో నీరెక్కువైపోయి గేట్లు ఎత్తేస్తే మనకి వరదలొచ్చాయి. ఆ సమయంలో , ఎప్పుడూ వరదల అనుభవం లేని కర్నూలు, మెహబూబ్ నగర్ లో అధికారులు సరిగా స్పందించలేకపోయారు, కాని కృష్ట్ణ గుంటూరు వాళ్ళు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు బాగా ఏర్పాట్లు చేశారు. చిన్న చిన్న లోపాలు ప్రతీ దగ్గరా వుంటాయి. దానికి ఏ ఒక్కరో కారణం కాదు.
వరదలొక ఎత్తయితే పులిహోర పేకెట్లు ఇంకొక ఎత్తు. నిజమండీ బాబు. మీలో కూడా చాలా మంది పులిహోర పేకెట్లు పంచేవుంటారు. అలా ఎందుకు పంచుతారో నాకు అర్ధం కాదు. పాపం 3 పూటల పులిహోర తింటే ఏమవుతుంది. కడుపు గోదారి అవుతుంది. ఊరు గోదారయిపోయినప్పుడు ఈ పులిహోర సైడ్ ఎఫెక్ట్ ఎంత దారుణం. ఇలాంటివి చాలా వుంటాయి. చీరలు, లుంగీలు, దుప్పట్లు పంచుతారు, పిల్లలికి పాలు, స్త్రీలకు ప్రత్యేక అవసరాలు ఎన్నో వుంటాయి. కనీసం బట్టలు మార్చుకొనేందుకు ప్రైవసీ కూడా లేని పునరావాస కేంద్రాలెన్నో! కొన్ని వందల కుటుంబాలు ఒకే కప్పుకింద వుండాలి, ఎన్నో భయాలు, ఎన్నో ఆశలు పెడతారు, మోసం చేస్తారు, ఒకటి వుంటే ఒకటి వుండదు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న తుఫాన్ కి నేను డ్యూటీ లో లేను. లీవ్ లో వున్నాను. సడన్ గా లైలా వచ్చింది. అదికూడా నేను పనిచేస్తున్న జిల్లాలకే. లీవ్ కేన్సిల్ చేసుకొని వస్తానంటే కూడా మా ఆఫీస్ లో, ఇంట్లో అందరు ఆ టైములో ప్రయాణం వద్దు అన్నారు. నేను కూడా లక్కీ కి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాడిని ఒక్కడిని వదిలేయలేక ఎక్కువగా ఓవర్ యాక్షన్ చెయ్యకుండా వుండిపోయాను హైదరాబాదులో. కానీ నా కొలీగ్స్, ఎన్.జి.ఒ లు ఫోన్లు చేసి కావలసిన సమాచారం అడుగుతూనే వున్నారు. ఆప్పుడు మాత్రం గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. కానీ చెప్పానుగా కోటీ, శిల్పారామం అని తిరుగుతూ గిల్టీ ఫీలింగ్ ని పక్కన తొక్కి పెట్టేసా. మీరే చెప్పండి తుఫాన్లు ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తాయి (కనీసం సంవత్సరంలో 2 సార్లు వస్తాయి) కానీ నాకు ఇలా ఇన్ని సెలవులు, బలాదూర్ తిరిగే చాన్స్ అంతా ఈజీ గా వస్తుందా!! అందుకే అన్న నా అంత పనికిమాలిన మనిషి ఇంకెవరూ వుండరని.

8 comments:

Anonymous said...

జర్నలిస్ట్లులు శెలవు పెట్టినపుదు పెద్ద సంఘటనలు జరిగి రిపోర్ట్ చేసే అవకాశం కోల్ఫొయినట్లు మీరు శెలవు పెట్టి తుఫాన్ సేవ అవకాశం కోల్పోయారన్న మాట. ఇదే జర్నలిస్ట్లులు చేస్తే బాసులు మెమోలతో మాత్రమే కాకుండా మాటలతొ చంపుతారు. ఎన్.జి.వో లే నయం అన్నమాట! మీరు కొంచెం త్వరత్వరగా రాయాలండి

బాటసారి said...

మీరు చేస్తున్న పని చాలా ఇంటరెష్టింగ్ గా ఉంది. చాలా తెలియని విషయాలు చెప్తున్నారు. Dont be guilty , you also need a break once a while

భావన said...

అదేమిటండి అలా అనుకుంటారు. వుద్యోగమెంత ముఖ్యమో పర్సనల్ లైఫ్ కూడా అంతే కదా. రెండిటికి మధ్య బేలన్స్ లో అలా పనికి మాలిన మనిషి అనేసుకుంటే ఎలా. మంచి విశ్లేషణ (తుఫానుల గురించి, మీ గురించి కాదు)

'Padmarpita' said...

Interesting...

chandu said...

మంచి పని చేస్తూ అలా అనుకుంటారు ఎందుకండి మీరు.

Anonymous said...

ఉధ్యోగరీత్యా తప్ప మీరు స్వంతంగా సహాయకార్యక్రమాలలో పాల్గోకూడదు అని ఫత్వా ఏమైనా వుందాండి?

మీ దేశభక్తికి , సామాజిక స్పృహకి పాఠకులు జేజేలు చెప్పాలంటారా?

Anonymous said...

టైటిల్ నచ్చిందండీ నాకు...

శిరీష said...

andarikee thanks anDi. i just wrote all this during laila whatever come to my mind.