Monday, March 29, 2010

ఆత్మలతో స్నేహం కావాలి



పేరు చూసి భయపడ్డారా? పోస్ట్ చదివితే అసలు  ఓస్ స్ ఇంతేనా అంటారు!!!!

నా మొదటి జాబ్ మూడు ఫీల్డ్ విజిట్లు ఆరు మలేరియా జ్వరాలతో బాగానే వుండింది. నేను పని చేస్తున్న సమయం లో నేను నేర్చుకున్నదే ఎక్కువ, చదువులో ఏమి నేర్చుకున్నానో కూడా మరిచిపోసాగాను.

గిరిజనులు సమాజం, వారి కట్టుబాట్లు, నీతి, పద్దతులు, నమ్మకాలు అన్నీ కూడా ఏదోవిధంగా ప్రకృతితో ముడిపడి వుంటాయి. నా మొదటి పోస్టు లో చెప్పాను కదా వాళ్ళ ప్రతి పండగ ప్రకృతి కి సంబందించిందే అని. అలాగే వాళ్ళ నమ్మకాలు(మన దృష్టిలో మూఢ నమ్మకాలు), చెసే పూజలు అన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవే.

గిరిజనుల సమాజానికి/గూడేం కి పెద్ద "దిసారి". అంటే మన సర్పంచ్ లా మాత్రమే కాదు, పూజారి లా, పూర్వం రాజరికంలో రాజ్యానికి పెద్ద గురువులా.. దిసారి అంటే పూజారి, డాక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇంజనీర్, మొ.వి ఎన్నో. అలాగే ఆడవాళ్ళలో కూడా ఒక సూపర్ లేడీ వుంటుంది ఆమెని గునియా అంటారు.  ఆమె ముఖ్యంగా డెలివరీ లు చెయ్యటం, స్త్రీలకు సంబంధించిన జబ్బులకు వైద్యం, పూజలు మొ.వి  మాత్రమే కాక గిరిజనులు నమ్మే దేవత/ఆత్మ ఏదైన గునియా మీదకి వాలి అక్కడి వారితో మాట్లాడుతుందని వాళ్ళ నమ్మకం.

ఇవన్నీ బాగానే వున్నాయి కానీ, వాళ్ళు చేసే పూజలన్నిటికీ కూడా ఎదో శాస్త్రీయత వుంది అని మా సంస్థ (మా చైర్మేన్) వుద్ధెశ్యం. సో ఆ శాస్త్రీయత కనుక్కొనే పనినే మా ప్రొజెక్ట్ లో ఒక విభాగం -కాస్మో విజన్. దానిలో భాగంగా ఆయన రాత్రి పూట గిరిజన గూడల్లోకి వెళ్ళేవారు, దిసారిలతో రోజులు తరబడి అడవుల్లో గడిపేవారు, ఎన్నో తాళపత్రాలు, పాటలు(కొండబాషలోవి) చదవటం, రికార్డ్ చెయ్యటం లాంటివి చేసేవారు.నేను అవన్నీ  మూఢనమ్మకాలనీ, నాకు భయం లేదని అన్నాక అతనికి నామీద కోపం వచ్చిన తరువాత నన్ను ఆత్మలకి పరిచయం చెయ్యాలని ఆశపడ్డారు.

ఒక సాయంత్రం చలికి తట్టుకోటానికి చక్కగ చలి మంట పెట్టారు. దాని చుట్టూ మా స్టాఫ్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నాము. చైర్మేన్ గారు నన్ను వుద్ధేశించి, శిరీష నీకు భయం లేదన్నావు కదా మరి నాతో ఈరోజు రాత్రి అడవిలో కాంచా దిసారి పూజ రికార్డ్ చెయ్యడానికి వస్తావా అన్నారు. రానంటానని, భయపడతానని ఎదురుచూశారు నేను మాత్రం 9 అయ్యేసరికి అతనెప్పటికీ పిలవకపోయేసరికి నేనే వెళ్ళి అతని రూం తలుపు కొట్టాను. ఫుల్ గా మంకీ క్యాప్ లో వున్న నన్ను చూసి భయపడ్డరనుకుంటా! మారు మాటల్లేకుండా బయలుదేరారు. ఒక గంట జీప్ లో వెళ్ళాక ఇక  జీప్ పోలేదు. నేను, మా సార్, కుదూసు అనే ఒక  గిరిజన వాలంటీర్ నడిచి కాస్త దూరం వెళ్ళాము. దూరం గా నిప్పుల వెలుగు కనిపిస్తుంది. మా సార్ కి నా గురించి భయం పట్టుకుంది, వెళ్ళిపోతావా వెనక్కి కుదూసుతో అని  అడిగారు. లేదన్నాను. సరే భయపడకు ఏమి కాదులే అని  ధైర్యం చెప్పారు (అతనికే చెప్పుకున్నారేమో) అక్కడ ఒక దిసారి జుట్టులు జడలు కట్టినట్లు పెద్దగా వేళ్ళాడుతున్నాయి, చిన్న గోచి పెట్టుకొని ఒళ్ళంతా తెల్లగా ఏవేవో గుర్తులు వేసుకున్నాడు. మా సార్ కి కొన్ని కొండ బాషలు వచ్చు. ఏదో మాట్లాడారు. దిసారి నావైపు చూస్తాడేమో అని చాలా ఎదురు చూశాను. అసలు నన్ను పట్టించుకోనేలేదు. మా సార్ నా చేతికి టేప్ రికార్డర్ ఇచ్చారు, దిసారి పూజ మొదలుపెడితే రికార్డ్ చెయ్యమని. కుదూసు అక్కడ దిసారి వేస్తున్న ముగ్గుల లాంటి గుర్తులను అదేవిధంగా పుస్తకంలో గీస్తున్నాడు. దిసారి చాలా సైలెంట్ గా ముగ్గులేస్తున్నాడు. నాకు  కాష్మోరా సినిమా చూసినప్పుడు కలిగిన భయం కూడా కలగటంలేదు. దిసారి ఎదొ చిన్నగా రైం స్ చదవటం మొదలుపెట్టాడు. పూజ ఒక గంట గడిచింది. చాలా మామూలుగా వుంది.కానీ నేను ఈ విషయం  మా ఇంట్లో చెప్తే ఎలావుంటుంది అని  ఆలోచించాను. వాళ్ళు నన్ను  ఒక దెయ్యం పట్టినదానిలా చూసి భయపడతారేమో!! దిసారి గుడ్డుని బలి ఇచ్చాడు. వాళ్ళ పూజల్లో నేను ఎప్పుడూ బలి అంటే జంతువులు ఎక్కువుగా చూడలేదు. పెద్ద జాతర లా చేస్తే అప్పుడు  మేక లేదా పందిని కోసేవారు.పూజ అయిపోయాక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పాడు దిసారి. నాకు  ఎవరైనా ఏదైనా వద్దు అంటే ఇక అదే చెయ్యాలనిపిస్తుంది. కాని నా విషయం తెలిసినట్లు మా  సార్ నా వెనకే నడిచారు, ఇక నేను వెనక్కి చూసే అవకాశం లేకుండా. 

తరువాత రోజు నుండి నాకేమైన జ్వరం వచ్చిందా అని, భయపడ్డనా అని ఎదురుచూశారు. చలికి రోజూ చలి మంట వేసుకొని మీటింగ్ అక్కడే చుట్టూ కూర్చొనే వాళ్ళం.మా సార్ నన్ను భయపెట్టాలని కుదూసు తో లేదా నీలయ్యతో ఆత్మలగురించి, భూతాల గురించి  మాట్లాడేవారు. కుదూసు, సార్ మాటలు ఇలా వుండేవి: ఏమయ్యా కుదూసు, ఏంటయ్యా ఇది రాత్రి తెల్లగా పొగలా కనిపించింది, చల్లగా గదిలొనే వుంది, నాతో ఏదో చెప్పలని చూస్తుందయ్యా.

సారూ, అది కొంచెం మొండిఘటం లా వుందండి. చిన్న బాయి గూడెం దిసారి దానికి కరక్ట్ గా వొంచగలడండి,

సార్: నాకు అలావాటయ్యిందయ్యా, కుదూసు పాపం  శిరీషా మేడం అసలే చిన్నపిల్ల, మన సెంటర్ లో ఒంటరిగా వుంటుందయ్యా దిసారి వద్దు  కానీ గునియా ని పిలిపించు అసలు దానికేమి కావాలో ఎందుకొంచిందో అడుగుదాము

ఇలా మాట్లాడేవాళ్ళు అందరూ.అసలు విషయం  ఏంటి అంటే వాళ్ళు ఎంత కస్టపడి నన్ను భయపెట్టాలని చూసినా నాకు అసలెందుకో భయం వెసేదే కాదు ఎంటో మరి. కాకపోతే ఇక్కడ ఇంకో  గమ్మత్తు జరిగింది. ఇలా మాట్లాడెటప్పుడు మా మీటింగ్ లో వున్న నాతో పాటు చేరిన కొత్త స్టాఫ్ లో  రాధాక్రిష్ట్ణ  అనే  ప్రొజెక్ట్ ఆఫిసర్,సుందర్ అనే అగ్రికల్చర్ ఆఫీసర్ మొత్తానికి జడుచుకొని చచ్చెవాళ్ళు. వాళ్ళు ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చెయ్యాల్సిన వాళ్ళు కానీ ఈ  ఆత్మల కధలు విని అరుకు సెంటర్ లో  ఒక రోజు రాత్రి బాత్రూం కి  వెళ్ళినపుడు ఒకరిని చూసి ఒకరు భయపడి జ్వరం తెచ్చుకొని వెంటనే జాబ్ మానేశారు. 

నాకు భయం వెయ్యలేదు సరికదా నిజంగా ఆత్మ వుంటే ఎంత బాగుణ్ణు చక్కగా ఒక ఆత్మతో స్నేహం చెయ్యొచ్చు కదా , ఎంతసేపూ ఈ మనుషులతో మాట్లాడీ మాట్లాడీ బోర్ కొడుతుంది అనిపించేది. ఇదే విషయం మా సార్ ని  అడిగా, సార్ ఆత్మలతో ఏ భాష లో మాట్లాడాలి? ఈసారి మీకు కనిపిస్తే నన్ను కూడా పిలవండి సార్ అన్నాను. దానితో ఒక విషయం అతనికి అర్ధం  అయింది, ఈ అమ్మాయి భూతాలకే భూతం, ఇక ఈమెని  ఏ భూతం మాత్రం ఏమి చెయ్యగలదు?అని. అప్పటితో నన్ను  భయపెట్టే పని మానుకొని భయపడేవాళ్ళకి నన్ను  చూపించేవాళ్ళు. 

కానీ నాకు ఇచ్చిన  క్వార్టర్ లో మా సంస్థ సేకరించిన కాస్మో విజన్  వస్తువులన్నీ నా బెడ్రూం పక్క రూం లో వుండేవి.ఒక్కోసారి రాత్రిపూట ఏవేవో గిరిజనుల మాటల్లా వినిపించేవి. సింద్రి కి చెప్తే పక్క రూంలో పెద్దలున్నారు కదా అనేది. అంటే ఏంటి సింద్రి వుద్దేశ్యం? పక్క రూంలో వాళ్ళ చనిపోయిన పెద్దలు అర్ధరాత్రి వచ్చి మాట్లాడుకుంటున్నారనా??? ఎంత నేను లేడీ జేంస్ బాండ్ ని   అయినా, ఎంతగా ఆ మాటలు వినిపించే గదిలోకి అర్ధరాత్రి వెళ్ళాలనిపించినా ధైర్యం చెయ్యలేకపోయాను. కానీ నా ధైర్య ప్రదర్శన కోసం తెల్లవారిఝామున నిద్రలేచాక చాలాసార్లు వెళ్ళి చూసి వచ్చాను. అక్కడున్న రాళ్ళు, బొమ్మలు నావైపు చూస్తున్నట్లు నన్ను గమనిస్తున్నట్లు, నా మంచి కోరుతున్నట్లు అనిపించేది. నిజంగా దేవుళ్ళుంటే మనందరి మంచే కదా కోరుకుంటారు. అది  గిరిజన దేవుడైనా, వైజాగ్ దేవుడైనా, అమెరికా దెవుడైనా....ఒకవేళ నిజంగా దెయ్యాలుంటే కూడా నాకు ప్రోబ్లెం లేదు. ఎందుకో తెలుసా నాకు  అవికూడా ఇష్టమే కదా!!!!!! నాకు నువ్వంటే ఇస్టం అంటే పాపం ఏభూతం మాత్రం మనల్ని ఏం చేస్తుంది??కానీ నాకు ఒక్క భూతం కూడా కనిపించలేదు. వాటితో స్నేహం చెయ్యాలన్న నా ఆశ తీరనేలేదు. హుహ్ !!ఏం చేస్తాం
ఇంతకీ ఆరోజు నేను చూసిన కాంచా దిసారి  పూజ ఏదో భూతాలకోసం కాదు. కాంచా దిసారి ఆరోజు రాత్రి వాళ్ళ పెద్దలతో మాట్లాడి మర్నాడు గూడెంలో వస్తున్న విష జ్వరాలకి మంత్రించిన నీళ్ళిస్తాడంట. అతను చేసిన పూజలో చాలా వేపాకులు నూరి పెద్ద కుండలో మరగబెడుతున్నాడు. ఇంకా ఎవేవో ఆకులు కూడా వేశాడు.మరి ఈ అర్ధరాత్రి, జడలు కట్టిన జుట్టు, ముగ్గులు బిల్డప్ అంతా ఎందుకో అనిపించింది. కాని నమ్మకం కలిగించటం కోసం అయి వుంటుంది లేదా నాకు తెలియనిది ఇంకేదైనా అయి వుంటుంది. కాని ఖచ్చితంగా సినిమాల్లో చూపించినట్లు రక్తం కక్కుకోవటం లాంటిది, ఎవరికో నష్టం కలిగించేది ఏమీ లేదు.ఈ కాస్మో విజన్ విషయాలు మాత్రం మా సార్ మాత్రమే చూసేవారు. కొందరు గిరిజన దిసారీలు, గునియాలు కూడా మా సంస్థలో వాలంటీర్లు గా వుండేవాళ్ళు. అది నా విభాగం కాదు. కానీ ప్రోగ్రాం సెక్రెటరీ ని కాబట్టి ధైర్యం వుంది కాబట్టి కొన్ని సార్లు మా సార్ నా అసిస్టెన్స్ తీసుకునేవారు.

గిరిజనులకు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోరనీ ప్రకృతి లోనే వుంటారని నమ్మకం. వాళ్ళంతా మనల్ని కాపాడతారని నమ్ముతారు. వాళ్ళు ప్రకృతిలో వున్న ప్రతి జీవి కి, చెట్టుకి కూడా ప్రాణం వుందని నమ్మి అన్నిటినీ పూజ చేస్తారు.మతం ఎలా పుట్టివుంటుందో వాళ్ళని చూస్తే మనకు అర్ధం అవుతుంది.మనుషులందరినీ కలిపి వుంచగలిగేందుకు, వాళ్ళకు వచ్చే సమస్యలు అన్నిటినీ తీర్చలేకపోయిన ఏదో తెలియని శక్తి మనల్ని కాపడుతుందనే ధైర్యం మనలో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ నమ్మకం  కలిగించటం కోసం సమాజం లో కొన్ని కట్టుబాట్లు వుంచటం కోసం కొంత ముఖ్యమైన నాలెడ్జ్, సమాచారాన్ని అందరికీ తెలియకుండా మత పెద్దల దగ్గ్ర మాత్రమే వుంచుకున్నారు. ఆ  సమాచారం కలిగి వున్న వ్యక్తులు సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళయివున్నంత కాలం అందరికీ మంచిదే. కాని మనిషి దురాశాపరుడైపోయి తన వద్ద వున్న ఙ్ఞనం వేరొకరిని మోసం చెయ్యటానికి వుపయోగిస్తే మతం యొక్క వుద్దేశ్యం మారిపోతుంది.  

సింద్రి కానీ, నీలయ్యాకానీ ఏ గిరిజనులు కూడా ఎప్పుడూ భూత ప్రేతాలు వున్నాయని, మనకి ఏదో నస్టం చేస్తాయని ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళ పూజలన్నీ ఒక మంచి నమ్మకం కోసం కారణం కోసమే వుండేవి. ఏ ఆత్మ తమని బాధిస్తుందని ఎప్పుడూ చెప్పరు, భావించరు.మన లాగా పూజలు కాస్ట్లీ అఫ్ఫైర్ కాదు. దేవుడు ఒక  నమ్మకం, ఆత్మ కూడా నమ్మకమే అన్నీ మంచికొరకే.

ఇదంతా ఒ.కె. కాని మీకెవరికైనా "కాల్ ద సోల్" ఆత్మ ని పిలిచే ఆట వస్తే చెప్పండి ఒక మంచి ఆత్మని పిలిచి స్నేహం చెయ్యాలి. 

10 comments:

శిశిర said...

మీ టపాలన్నీ చదివానండి. చాలా బాగా రాస్తున్నారు. క్రొత్త విషయాలు చెప్తున్నారు. బాగుంది.

శిరీష said...

Thank you Sisira garu. your name is soo good

స్వర్ణమల్లిక said...

ఆ ఆట ఏంటో తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలమే.. కానీ ఎవరికీ తెలియదట. మీకు గానీ తెలిస్తే నాకు కుడా చెప్పండి. మీరు చెప్పిన / చెపుతున్న విషయాలు చాలా ఆశక్తి కరంగా ఉన్నాయి. తొందర తొందరగా రాయండి, మేము ఎదురు చూస్తూ ఉంటాము.

శిరీష said...

స్వర్ణ గారు,

నాకు మీకంటే కూడా తొందరెక్కువగా వుంది. కాని ఏంచెయ్యను. నాకు అసలు టైము దొరకటం లేదు. నిద్ర త్యాగం చేసి బ్లాగులు రాస్తున్న. రొజులో మద్య మద్యలొ ఒక నిమిషం దొరికిన కూడా ఏమిన కామెంట్స్ వచాయా అని మాత్రం చూస్తున్నా

శిరీష

Change Maker said...

శిరీష గారు, మాకు ఒక క్రొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు. గిరిజనుల గురించి చాలా విషయాలు చెప్తున్నారు.
2007 లో భారతదేశం వచ్చినప్పుడు, సాలూరు దగ్గర ఒరిస్సా బోర్డర్ లో గిరిజనుల ఆతిద్యం దొరికిన అదృష్టం కలిగింది నాకు. దగ్గర రోడ్ నుంచి సుమారు మూడు గంటలు కొండల్లో నడిచి , వాగులు దాటి చేరాం ఆ ఊరు.
ఒక ఆశ్చర్యకరమైన విషయం నేను చూసింది ఏమిటంటే, క్రైస్తవ మిషనరీ ఒక అతను, పెద్దగా అరుస్తూ గిరిజనులకు మత బోధ చేస్తున్నాడు ఆ ఊరిలో . గ్రామ పెద్ద చెప్పాడు, సగం మంది క్రైస్తవ మతం పుచ్చుకున్నారని, పాత సంప్రదాయాలను వదిలేస్తున్నారని. ఆ మిషనరీ చుట్టు ప్రక్కల 50 కిలోమీటర్ల అడవి ప్రాంతమంతా తిరుగుతూ మత ప్రచారం చేస్తారంట

మీరు చెప్పిన సంప్రదాయాలు, నమ్మకాలు ఏమై పోతాయో ఈ గ్లోబలైజేషన్లో.

మీరు చాలా బాగా వ్రాస్తున్నారు.

శిరీష said...

బాటసారి గారు,(సారీ నాకు మీ పేరు తెలీదు కదా!!)

మీరు చెప్పింది నిజమే చాలా వరకు మతం మార్పిడి, నగర ప్రభావం, సినిమా ప్రభావం తో చాల మార్పులు ఎప్పుడో మొదలయ్యాయి.అందుకే వాళ్ళ ఆహార భద్రత, సంస్కృతి, జనాభా అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. నా బ్లాగ్ నచ్చినందుకు చాల సంతోషం.

శిరీష

కొత్త పాళీ said...

Very interesting. Pl keep writing

శిరీష said...

కొత్తపాళీ గారు,

చాలా థాంక్స్ అండి

భావన said...

చాలా బాగుంది అండి ఎప్పటి లానే. ఆత్మ లనేవి వుండీ నిజం గా మన మధ్య తిరిగినా మనుష్యుల కంటే భయపెడతాయా ఏమి?

Indrasena Gangasani said...

Excellet Sirisha Gaaru..Your narration is simply superb.Thanks for sharing your experiences with nature.