Saturday, March 6, 2010

భలే,భలే పెళ్ళిళ్ళు


 
మనం అంతా స్త్రీ స్వాతంత్రం, సమాన హక్కులు, మానవీయ దృక్పదం అని వేదికలెక్కటం, వేరే దేశాలని ఉదహరించటం చేస్తుంటాము. కాని మన దేశంలోనే, మన వాళ్ళ దగ్గరే వున్న గొప్ప సంస్కృతిని, అనాగరికత, వెనుకబాటుతనం అని అపహాస్యం చేస్తున్నామని నాకు ట్రైబల్స్ తో పని చేశాక అర్ధం అయింది. సోషియాలజీ క్లాసులో ప్రొఫెసర్లు చెప్తే, ఎన్నో పుస్తకాలు, పేపర్లు చదివితే మానవ సంబందాలలో సమానత్వం సహజత్వం లోపిస్తుందే అని  నాలో రగిలిన బాధ నిజజీవితం లో సింద్రి లాంటి గిరిజనులను చూశాక కాస్త తగ్గింది.

సింద్రి అరకు రీసెర్చ్ సెంటర్ లో పని చేసే 17 సం.ల గిరిజన అమ్మాయి. సింద్రి అంటే అర్ధం ఏంటో నాకు తెలీదు కాని సహజమైన అని అయివుంటుంది అని, బలమైన అయివుంటుందని, ధైర్యమైన అయి వుంటుందని ఇలా ఒక్కోసారి తనని తెలుసుకున్నప్పుడంతా ఒక్కో అర్ధం తోచేది.నేను అక్కడ వుండటం మొదలు పెట్టాక సింద్రికి కూడా నైట్ డ్యూటీ పడింది. అంతకుముందు కేవలం మా స్టాఫ్ లో మగవాళ్ళు మాత్రమే సెంటర్ లో స్టే చెసే వాళ్ళు, లేడీ స్టాఫ్ మహా అయితే ఒకటి రెండు సార్లు వుండి భయపడి వెళ్ళిపోయారని చెప్పారు. కారణాలు రెండు. ఒకటి ఆ ప్రదేశం ఒక నిర్జన ప్రదేశం కావటం వల్ల రాత్రి పూట జంతువుల భయం కూడా. రెండవది ఆ ఎన్.జి.ఒ లో గిరిజనులు చెసే పూజలు, ఆత్మలు ఇవన్నిటికి కూడ సంబంధించి రీసెర్చ్ అక్కడే చేసే వాళ్ళు. నాకెందుకో చిన్నప్పటినుండి అలాంటి భయాలు లేవు, ఒంటరిగా అంత ప్రశాంతత (నిర్జనత్వం) ప్రకృతి కి దగ్గరగా కొత్తగా అనిపించి ఒక రకమైన ఆకర్షణకి లోనయ్యి అక్కడ వుండేదాన్ని.(రాత్రి పూట బాత్రూం కి వెళ్ళాల్సి వస్తే ఎలుగుబంట్లు వస్తాయేమో అనే భయం తప్ప అన్ని బాగానే అనిపించాయి). నాతో పాటు ఒక మనిషి తోడని సింద్రి ని వుండమనేవారు.సాధారణంగా గిరిజనులు చాలా తక్కువ మాట్లాడతారేమో, లేదా మన భాష సరిగ పలకలేక తక్కువ మాట్లాడతారో నాకు తెలియదు కానీ సింద్రి చాలా తక్కువ గా మట్లాడేది. తన మూమెంట్స్ కూడా చాలా వింత గా తొచేవి. తనే కాదు అక్కద పనిచేసే గిరిజనులు అందరు అలాగే అనిపించేవాళ్ళు. హఠాత్తుగా మాయం అయిపొయినట్లు ఎక్కడో వెళ్ళిపోతారు మళ్ళీ ఏదో చెట్టు వెనక నుండి తుప్ప వెనక నుండి వస్తుంటారు. సింద్రి గిరిజనుల అందం నాకు అర్ధం అయ్యేల చేసింది. అప్పటి వరకు అందం అంటే సిటీ అమ్మాయిల్లో అబ్బాయిల్లో కనిపించే నాజూకుతనం అనుకునేదాన్ని. కాని సింద్రి  ధృఢంగా వుండేది. లావు కాదు, సన్నం కాదు బలం, ఆరోగ్యం, ప్రకృతి కి దగ్గరతనం, సహజత్వం ఇదే అసలైన అందం ఆమెలో. నాకు సింద్రి, అలాగే గిరిజన స్త్రీలందరు ఎల్లవేళళ్ళో అందంగా కనిపించేవారు.

అక్కడ సాయంత్రం 7 కి అన్నిపనులు ముగించుకొని రూం లో వుండాల్సిందే. నాకు అంత త్వరగా పడుకునే అలవాటు లేదు సింద్రి తో కబుర్లు చెప్పేదాని. కాని తనకి నాగురించి తెలుసుకోవాలనే తపనే లేదు. తన జీవితం, తన పరిసరాలు, తన తెలివితో తను సంతృప్తి గా వుంది అనిపించె ఒక వెలుగు కనిపించేది. నేను అలాంటి వెలుగు మన ఎవరి దగ్గర చూడలేదు. కొత్తగా సోషల్ వర్క్ మొదలు పెట్టాను కాబట్టి పాపం గిరిజన స్త్రీలకి ఎన్నో కష్టాలుంటాయి, వాళ్ళు ఎంతో అణచివేతకి గురి అయిపోతూ వుంటారని ఊహించేదాన్ని.కాని సింద్రి మాటల్లో భావం లో ఆఖరికి ముఖంలో కూడా ఎప్పుడూ అలాంటిదేది నాకు కనిపించలేదు.
సింద్రి నీకు పెళ్ళి అయిందా అని అడిగాను ఒక రోజు(అప్పటికి నా వయసు కి ఆలోచనలకి పెళ్ళి ఒకటే ఇంట్రస్టింగ్ టాపిక్). సింద్రి "ఒకసారయ్యింది వదిలేసా" అని చెప్పింది. వెంటనే నాలో సోషల్ వర్కర్ జూలు దులిపింది, ఎంతగా పాపం గృహ హింస కి గురి అయ్యిందో అని " ఏమి బాధ పడకు సింద్రి కష్టాలు భరిస్తూ కలిసి వుండాల్సిన అవసరం లేదు " అని చెప్పాను. సింద్రి కష్టాలు ఏమి లేవు నాకు వాడు నచ్చలేదు అందుకే వదిలేస అని చెప్పింది. నచ్చలేదా ఎందుకు నచ్చలేదు, మరి  నిన్ను బలవంతంగా అతనికి ఇచ్చి పెళ్ళి చెశారా అని అడిగాను. "లేదక్కా ఆడు గోసి కట్టుకుంటాడు, ఇక్కడకి వచే బాబుల్లాగ పాంటు యెసుకోమంటే ఇనడు అందుకే నాకు నచ్చలేదు" అని చెప్పింది. (మన నాగరికత వాళ్ళ జీవితాలలో ఇంకా ఎన్నెన్ని విధాల ఆకర్షణలు తీసుకొస్తుందో మరి) పాంట్ వేసుకోలేదని వదిలేశావా???  అదేంటి అంటే మరి నస్చకపోతే కలిసి ఎలాగుంటావు, ఆడిచ్చిన 4 మేకలు 5 పందులు (గిరిజనుల్లొ వరకట్నం లేదు, ఆడపిల్ల తండ్రికి "ఓలి" అని జంతువులు ఇస్తారు) తిరిగిచ్చేసేసెలాగా దిసారి,పెద్దోళ్ళు ఒప్పందం సేశారు అని చెప్పింది.దిసారి అంటే గ్రామ పెద్ద, పూజారి అన్నీ. ఈ తతంగం అంతా నాకు ఆరోజు అర్ధం కాలేదు. కాని రాను రాను అర్ధం అయింది.

గిరిజనుల్లొ పెళ్ళిళ్ళు, విడిపోడాలు అన్ని మన నాగరిక సమాజాం మెచ్చదేమో! కాని నా మటుకు నాకు ఆ పద్దతులన్ని భలే నచ్చాయి.ఇంట్రస్టింగ్ గా అడ్వెంచరస్ గా అనిపించాయి. అక్కడ పెళ్ళిళ్ళు ఈ క్రింద సంధర్భాలలో జరుగుతాయి:

1. అమ్మాయి అబ్బాయి ఇస్టపడితే "నన్ను తీసుకు పో అని అమ్మాయి చెప్పొచు లేదా ఇద్దరు కలిసే నిర్ణయించుని అయినా అబ్బాయి అమ్మాయిని కొండమీద ఎక్కడైన దాచి పెడతాడు. ఒక రెండు రోజులయ్యాక అమ్మాయి తండ్రి పంచాయితి పెట్టిస్తాడు అప్పుడు అబ్బాయి 4 మేకలిస్తా, 5 పందులిస్తా అని ఎంతో కొంత ఓలి బేరం కుదుర్చుకున్నక అమ్మాయిని అబ్బాయికిచి పెళ్ళి చేస్తారు.(ఎంత మంది కూతుర్లుంటే అంత లాభం, ఆడ పిల్లలంటే గిరిజనుల్లో చాల విలువ)

2. అబ్బాయికే నచ్చి, అమ్మాయి కి పెద్దగా ఎటువంటి వుద్ధేశ్యం లేక పోతే, అమ్మాయి వెళ్ళే దారిలో అబ్బాయి కాపు కాసి అమ్మాయి చెయ్యి పట్టుకొని లాగేసుకుంటే కూడా వాళ్ళ పెళ్ళి అయిపోయినట్లే. (ఇది కాస్త డేంజర్ గా వుంది కదా!!అలా నన్ను ఎవరైనా లాగేస్తే కస్టం కదా అని  భయపడేదాన్ని ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు)

3. అమ్మాయికి నచ్చి అబ్బాయికి నచ్చక పొతే..అమ్మాయి వెళ్ళి అత్తగారింట్లో వున్న రాట (దూలం/స్థంభం) పట్టుకొని కూర్చుని వుండిపోతుంది, ఎంత మంది లాగినా రాట వదలకుండా కూర్చుంటుంది. అలా చేస్తే ఆమె ఆ ఇంటికి కొడలే.(నాలాగ చేతుల్లో బలం లేకపోతే కష్టమే మరి)

4. ఒక మగాడు ఎంత మంది భార్యలనైనా  పెళ్ళి చేసుకోవచ్చు. రెండవ భార్య ని తెచ్చినప్పుడు మొదటి భార్యకి సంతాప సభ లాంటి పండగ చేసి రెండవ భార్య, మిగిలిన బంధువులు కలిసి ఆమెకి బట్టలు ఇస్తారు, పూజ చేస్తారు.(ఇదేంటో నాకు అర్ధం కాలేదు, కాంపన్సేషనా??)

5. అలాగే పెళ్ళి జరిగిన తరువాత ఎవరికి నచ్చకపొయినా విడిపోవచ్చు,ఆడ, మగ ఇద్దరు  మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు. కాని విడిపోవాలి అనుకున్నవాళ్ళు నస్టపరిహారం కట్టాలి. (ఇది చాలా న్యాయం కదా??)

నిజం చెప్పాలంటే సింద్రి చెప్పే ఎన్నో విషయాలు చాలా సహజం గా స్వేచ్ఛగా వుండేవి.నేను చాలా ఆశ్చర్య పడుతుంటే సింద్రి నన్ను వింతగా చూసేది.
ఈ పెళ్ళిళ్ళ పద్దతులన్ని సింద్రి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇందులో ఎంత నిజమో, ఎవరు  ఏ పద్ధతి పాటిస్తారో తెలుసుకునే అవకాశం రాలేదు.వీటన్నిటిలో నాకు అర్ధం అయింది ఏంటి అంటే గిరిజనుల సమాజం ఇంకా పూర్తిగా మన అంతగా పాడైపోలేదు. స్త్రీ పురుషులకి చాలా విషయాలలో స్వతంత్రత ఇంకా వుంది. సమానత్వం "ఇస్తున్నాము"అని  ఫీల్ అవ్వరు (ఎవరో ఎందుకివ్వాలి అది పుట్టుకతో అందరి హక్కు కదా).  అది వాళ్ళకి ఆకలి ఎంత సహజమో, నిద్ర ఎంత సహజమో సమానత్వం అంత సహజం. అది ఎందులో ఐనా సరే.. ఆఖరికి దమ్ముకొట్టడమైనా, మందు కొట్టడమైనా, ఇష్టమైన మనిషితో గడపటమైనా, తమ అభిప్రాయాలు చెప్పటం లో ఐనా..వాళ్ళు ఏపని చేసినా వాళ్ళకోసం చేస్తారు, ఎవరి సంతోషం కోసమో చెయ్యరు.

ధింసా అనే నృత్యం చేస్తారు. ఎవరైనా అతిధులు వస్తే మనం వాళ్ళకోసం ఆట పాటలు చేస్తాము. గిరిజనులు వాళ్ళ సంతోషం కోసం ఆడతారు పాడతారు, మనం విన్నా వినకపోయిన వాళ్ళ పాట కానీ, ధింసా కాని వాళ్ళు కోరుకునే వరకు ఆగదు. మనల్ని కూడా కలిపేసుకుంటుంది చోటు కల్పిస్తుంది వాళ్ళ సంగీతం, నృత్యం అంత సహజంగా సులభంగా వుంటుంది. అచ్చం గ్రిజనుల మనసులా. 

పెళ్ళి కంటే కూడా సింద్రి ఎక్కువగా పెళ్ళి తరువాత విషయాల గురించి చెప్పేది. ఎప్పుడు నాగురించి అసలు అడగనే అడగని సింద్రి ఒక  సారి ఎందుకో చాల సంతోషంగా వుండి "అక్క నీ జోడి ఎవరు?" అని అడిగింది, ఆటల్లొ ఎప్పుడో చిన్నప్పుడు జోడీలు వుండేవాళ్ళు. జోడి అంటే తన వుద్దేశ్యం నా లవర్ ఎవరు అని. ఎవరూ లేరు సింద్రి అని చెప్పాను.( నేను నిజమే చెప్పాను). సింద్రి చాలా ఆశ్చర్య పడింది, ఏంటి ఇంత పెద్దదానివి జోడి లేదా నీకు అని అడిగింది.అప్పటికి నా వయసు 25, ఎక్కువో తక్కువో కాని చదువులు, ఉద్యోగాలు అని తపించే మనకి జోడి అంటే పెళ్ళి కదా!! కాని వాళ్ళకి పెళ్ళికి సెక్స్ కి సంబంధం లేదనుకుంటా. అది కూడా చాల సహజం. వయసుకి తగిన సహజమైన పనులు అని వాళ్ళు దానిని తప్పు పట్టరు. అందువల్ల చాల సార్లు వాళ్ళని మోసం చేసే వాళ్ళ మోసాన్ని కూడా అర్ధం చేసుకోలేరు. 

అందుకు కొన్ని ఉదాహరణలు :

గిరిజనేతరులు ఎక్కువగా అక్కడ గవర్నమెంట్/ప్రైవేటు సంస్థల లో పని చేసే వాళ్ళు గిరిజన స్త్రీలని మోసం చేస్తారు, బయట పడితే అక్కడ అన్యాయం అయ్యేది ఎప్పటిలాగ గిరిజనులే. కొన్ని సార్లు పంచాయతి చేసి గిరిజనేతరులతో డబ్బు కట్టిస్తారు. కాని ఆ డబ్బులో 80% పంచాయతీ కే చెందుతుంది.అందువలన పంచాయితీకే ఉపయోగం తప్ప ఇంకేమి లేదు.

లేదా అటువంటిది ఏమైనా బయట పడితే మగవాళ్ళు గిరిజనులు తనకి ఏదో మందు పెట్టారనీ, బ్లాక్ మాజిక్(మంత్ర ప్రయోగం) చేశారనీ  చెప్పి తప్పు అంతా గిరిజనుల మీద తోసేస్తారు. ఇలాంటి సంఘటన ఒకటి చూశాను, మన నాగరికులందరు అమాయకమైన ఆ 16 సం.ల గిరిజన అమ్మాయి అతని మీద మంత్ర ప్రయోగం చేసిందని, అందుకే లొంగిపోయానని చెప్పాడు. అతని బంధువులు, భార్య అతనికి సపోర్టు. ఆ అమ్మాయి, మిగిలిన గిరిజనులు పాపం వాళ్ళని ఎందుకు తిడుతున్నారో కూడా అర్ధం కాక భయంగా చూస్తున్నారు. నాకు కడుపులో ఎవరో కత్తిపెట్టి నన్ను చంపేస్తున్నారనిపించింది వాళ్ళ మొహాలు చూస్తే. వాళ్ళని ఏమంటున్నారో  కూడా పూర్తిగా అర్ధం కాని వాళ్ళకి మనం గట్టిగా మాట్లాడితే చాలా భయం. వాళ్ళకి తెలిసింది కేవలం కొండ, అడవి, ప్రకృతి. ప్రతీ చెట్టు,పుట్టా,జీవి దేవుడని నమ్మే వాళ్ళు మన మీద మంత్ర ప్రయోగాలు చేసే తెలివి వుంటే ఆ కొండల్లో, కష్టాలలో ఎందుకు మగ్గిపోతారు?

ఇక అసలు సిసలు సూపర్ మోసం ఎంటి అంటే "పెళ్ళిళ్ళు"- వీటిని ఆదర్శ వివాహాలు అంటారు. ఎవరికి ఆదర్శమో నాకు తరువాత తెలిసింది. గిరిజన ప్రదేశాలలో గిరిజనేతరులు ఎవరు భూమి కొనడానికి హక్కు లేదు.అలా అని వదిలేస్తే మన నాగరికత, చదువు వేస్ట్ అయిపోదా??సో ఇంకేముందీ కొందరు ఆదర్శ వాదులు బయలుదేరి ఆ భూమి ఎలా కొనాలో దారి చూపారు. దాని ఫలితం గిరిజన మరియు గిరిజనేతరుల మద్య పెళ్ళిళ్ళు. సాదారణంగా పెళ్ళి తరువాత ఆడపిల్ల కులం మారుతుంది మన  సాంప్రదాయం లో, కాని ఇక్కడ అంతా ఆదర్శమే మగవాళ్ళే గిరిజన కులస్థులు అయిపోతారు. ఇక భూమి కొనడానికి అడ్డు ఏమి వుంది?.ఇక ఆతరువాత అక్కడ అనవసరంగా అడ్డంగా మిగిలిపోయేది ఆ పెళ్ళికి బలయిన గిరిజన స్త్రీ...ఇక ఆమె ఏమవుతుంది అనే కధలు నన్ను అడగకండి, నాకుచాలా కోపం వస్తుంది.(చేతకాని వాళ్ళకే కోపం వచ్చేది)

గిరిజన పాఠశాలలు, హాస్టళ్ళు, టూరిస్టులు,రక రకాల సంస్థలు, పోలీసులు, నక్సలైట్లు...ఇలా వాళ్ళని ఉద్ధరిస్తామని ఎంత ఎక్కువ మంది వెళ్తుంటే వాళ్ళ జీవితాలు అంతగా నరకం అయిపోతున్నాయి. "వాళ్ళని అబివృద్ధి (?)చెయ్యాలని సంస్థలు పని చెయ్యాలా లేక వాళ్ళని అలా వాళ్ళకి వున్న ఇండీజినస్ అభివృద్ధికి, పద్ధతులకీ, స్వేచ్ఛకి వదిలేయాలా అని నాకు ఇప్పటికి సమాధానం దొరకని ప్రశ్న" 

చివరగా: మన అభివృద్ధికార్యక్రమాల పుణ్యమో, వారి అమాయకత్వానికి ఫలితమో కానీ ప్రస్తుతం ఒక్క అరకు లోనే ఎయిడ్స్ 4% వుంది.

16 comments:

భాస్కర రామి రెడ్డి said...

Good information.

నిషిగంధ said...

గిరిజనుల పెళ్ళిళ్ళ గురించి తెలుసుకుంటూ ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉండి చివర్లో చాలా బాధగా అనిపించింది శిరీష గారు.. వాళ్ళనేదో ఉద్ధరించే ఉద్దేశ్యంతో నాగరికత ముసుగేసుకుని బయటప్రపంచం మనుషులు చేస్తున్న పనులు చాలా అన్యాయమనిపిస్తున్నాయి!! అవన్నీ దగ్గరగా చూసిన మీ కోపం సహజమైనదే!!

'సమానత్వం వాళ్ళకి సహజం' - ఎంత చక్కగా చెప్పారో! చదువులు ఎక్కువైనకొద్దీ మనసులు పనిచేయడం మానేస్తాయి కదండీ!!

శిరీష said...

నిషిగంధ గారు,

సామాజకీకరణ ప్రభావం మనం పెరుగుతున్న కొద్దీ మన మీద ఎక్కువ అవుతుంది. దానితో పాతు సహజత్వానికి దూరం అయిపోతూ వుంటాము. అది మన ఇంట్లో వున్న పిల్లల్ని చూస్తే మళ్ళీ మనకి అర్ధం అవుతుంది, మనం ఎంత కుళ్ళిపోయామో అని!

కొండముది సాయికిరణ్ కుమార్ said...

చాలా బాగుందండి మీ పోస్టు. Very much unique.

శరత్ 'కాలమ్' said...

Nice post.

Swarnamallika said...

శిరీష గారు, చదువుతుంటేనే ఆ కొండల్లో అడవుల్లో తిరుగుతున్న అనుభవం కలుగుతోంది. చాలా బాగుంది మీ వివరణ. ఇంత బాగా రాసే మీరు.. ఇలా నెమ్మదిగా రాయడం ఏమీ బాగోలేదు.. ఇక నుంచి నేను ప్రతి రోజు ఎదురుచూస్తూ ఉంటాను మీ పోస్టుల కోసం. మీకు వీలయితే నన్ను కుడా తీసుకుని వెళతారా.. ఆ అడవుల్లోకి. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అడవుల్లో తిరగాలని. నాకున్న ఇంట్రెస్ట్ సరి అయిన ప్రోత్సాహం లేక ఒక కోరికలాగే మిగిలిపోయింది. మీరు సహకరిస్తే... నేను కుడా ఒకటి రెండు రోజులు మీతో ఆ అడవుల్లో కొండల్లో తిరిగి నా కల నిజం చేసుకుంటాను.

sunita said...

Interesting.Please remove word verification.

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

బాగున్నాయండీ మీ అబ్సర్వేషన్స్....

శిరీష said...

అందరికీ చాలా థాంక్స్,

నా బ్లాగ్ అందరికీ నచ్చుతుంటే నాకు కూడా ఇంకా ఎక్కువ వ్రాయాలనిపిస్తుంది. కాని సమయం చిక్కటం లేదు. వీక్ ఎండ్ అంతా బ్లాగ్ రాయడానికే ఎక్కువగా టైము కేటాయిస్తున్నా! అందుకు సంతోషమే. రాసేప్పుడే చాలా బాగుంటుంది పోస్ట్ చేసేసాక ఏంటొ మనసు ఖాళీగా అనిపిస్తుంది. మళ్ళీ అందరి దగ్గర నుండి కామెంట్స్ చదివితే బాగుంది.

మల్లిక గారు, మిమ్మల్ని అడవిలోకి తీసుకెళ్ళలేను ఎందుకంటే ప్రస్తుతం నేను గిరిజనులతో కాదు మత్స్యకారులతో పనిచేస్తున్నా. కావాలంటే సముద్రంలోపలికి జాలరివాళ్ళతో కలిసి వెళదాం.

మురళి said...

చాలా ఆసక్తికరంగా ఉందండీ.. గిరిజన పెళ్ళిళ్ళ గురించి ఎక్కడో చదివాను.. అలాగే ఎయిడ్స్ వ్యాప్తి గురించి కూడా.. కానీ గిరిజన సమాజం, ఆచారాలు, కట్టుబాట్లు.. ఇవన్నీ టపాని రెప్ప వేయకుండా చదివించాయి..

శరత్ 'కాలమ్' said...

ఈ సారి ఇండియాకి వచ్చినప్పుడు ప్రశాంతంగా, నాగరికతకు దూరంగా ఎక్కడయినా కొండా కోనల్లో గిరిజనులకు దగ్గరగానో లేదా సముద్రానికి దగ్గర్లో జాలరులతోనో కనీసం మూడు రోజులు గడుపుతూ వారితో, ప్రకృతితో మమేకం కావాలని వుంది. నేను సెప్టెంబర్ లో వచ్చే అవకాశం వుంది. నాకూ స్వఛ్చంద సేవ అంటే ఇష్టం. ఆర్ధిక సమతా మండలి వారి ఒక ఏడాది IRDP (Integrated Rural Development Program) ట్రైనింగ్ కూడా అప్పట్లో తీసుకుంటూ గ్రామాల్లోనూ, గిరిజన తండాల్లో విస్తృతంగా పనిచేసాను.

మీరు కానీ, ఇతరులు కానీ నేను ఆశించిన విధంగా కొన్ని రోజులు గడపడానికి ప్రదేశాలు సూచిస్తే సంతోషిస్తాను.

SRRao said...

శిరీష గారూ !
మీ అనుభవాలు మాకు పంచుతున్నందుకు ధన్యవాదాలు. మీకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

భావన said...

చాలా బాగున్నాయి మీ అనుభవాలు చదువుతుంటే. ఎంత నిజం కదు నాగరికత నేర్పి ప్రకృతి కు దూరం గా జరుపుతున్నామేమో వాళ్ళను. మీ బ్లాగ్ నిజం గా చాలా ప్రత్యేకం గా వుంది మిగతా వాటికంటే. బాగుంది.

jaya bharathi ram said...

gud narration. meeru panichestune enta obsrevation chesaro anipinchindi.

శ్రీ said...

అడవి రాముడు సినిమా కూడా అరకు లోనే తీసారనుకుంటా. ఆ సినిమాలో కూడా మీరన్నట్లే శ్రీధర్, జయసుధని పెళ్ళి చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు.

గిరిజనుల అమాయకత్వం,నాగరికుల స్వార్ధం,మీ కోపం ...అన్నీ బాగున్నాయి.

Anonymous said...

చాలా బాగుందండి.
venkat.