చాలా రోజుల తరువాత ఎందుకు బ్లాగ్ రాశాను అని ఆలోచించాను. బహుశా నేను సంతోషం గా వున్నప్పుడే రాయగలుగుతాను అని అనిపించింది. కొత్త ఉద్యోగం లో చేరాక చాలా విషయాలు వున్నాయి.కాని సంతోషం కలిగించేవి ఏవీ లేవు. అన్నీ మనసు ని కలిచివేస్తున్న విషయాలు. అందుకే రాయలేకపోతున్నాను.
హెచ్.ఐ.వి తో బాధ పడుతున్న లేదా, ఆ వ్యాధి వల్ల ప్రభావానికి గురి అయిన కుటుంబాలతో పని చేస్తున్నాము. ముఖ్యంగా పిల్లలు వున్న కుటుంబాలతో మా ప్రాజెక్ట్ లో పని చేస్తాము. ఒక్కో కుటుంబానికి వెళ్తుంటే పాపం తెలియని ఆ పిల్లలు హెచ్.ఐ.వి బాధితులంటే మనసులు కలిచివేసినట్లవుతుంది. చిన్న పిల్లలు ఇంక లోకం కూడా తెలియని పిల్లల దగ్గర నుండి జీవితం మీద ఆశలు పెంచుకునే టీనేజ్ పిల్లల వరకు వున్నారు.
90% తండ్రి ద్వార కుటుంబంలోకి ఈ జబ్బు వస్తుంది మామూలు కుటుంబాలలో. 18 సంవత్సరాలకి పెళ్ళి అయి, 20 కి భర్త పోయి, హెచ్.ఐ.వి వచ్చేసి, ఇంట్లో వాళ్ళు బయటకి తరిమేస్తే వ్యాది సోకిన తను, తన చిన్నారి బిడ్డతో రోడ్ మీద పడిన ఎందరో ఆడవాళ్ళు. ఇక వారు బ్రతకడానికి దారి ఏది? అమ్మ నాన్న చనిపోతే అనాధగా బ్రతకడం లేదా తాత గారింట్లో బ్రతకడం కూడా కష్టమే అలాంటిది వారు ఎయిడ్స్ తో చనిపోతే? చేరదీయాల్సిన వాళ్ళు కూడా చేరదీయకపోతే? ఎయిడ్స్ అంటే ఏమిటో తెలీకపోయినా, ఆ వ్యాధి చిన్నప్పుడే వాళ్ళకి తల్లిదండ్రులనుండి వారసత్వంగా వచ్చేస్తే? తన చర్మం ఎందుకు అలా వుందో, తనెందుకు ఎప్పుడూ జబ్బులు పడుతున్నానో తెలీక, అందరు తనని ఎందుకు నీచంగా చూస్తున్నారో తెలీక ఆ పిల్లల కళ్ళల్లో కనిపించే అయోమయం చాలా బాధ కలుగుతుంది.
ఎయిడ్స్ బయట నుండి చూస్తే ఒక ఆరోగ్య సమస్య, లేదా నీతి సంబందించిన సమస్య అనుకుంటాము. కాని అది అంతకు మించి ఎంతో.....ప్రకృతి ని శాసించే స్టేజ్ కి వచ్చాము అనుకునే మనకి, దేనికైన పరిష్కారం కనుక్కోగలమనుకునే మన శాస్త్ర విగ్ఞనానికి ఈ పిల్లల్ని చూస్తె సిగ్గు చేటు. హెచ్.ఐ.వి వచ్చినా సి.డి.4 కౌంట్ ఎక్కువ వుండి నిరోధక శక్తి బాగుంటే పర్వాలేదు. కానీ సి.డి.4 తగ్గిపోయాక ఒకసారి ఎ.ఆర్.టి మందులు వాడటం మొదలు పెట్టాక ఇక జీవితాంతం అవి వాడాలి. పిల్లల్లో కనుక ఎ.ఆర్.టి మందులు మొదలయిపోతే అవి 15 సంవత్సరాలు వరకే మొదటి లైన్ మందులు పనిచేస్తాయి. ఒక సారి రెండవ లైను మందులు మొదలైపోతే మహా అయితే 8 సంవత్సరాలు... చిన్నప్పుడే ఎ.ఆర్.టి మొదలైన పిల్లలికి,కరెక్ట్ గా టీన్ ఏజ్ కి వచ్చేసరికి ఇక జీవితం వుండదు. ఆ పిల్లల్ని చూస్తే నాకు ఏమి చెప్పాలో అర్ధం కాదు. కానీ ఒకటి నిజం. వ్యాధి వున్నా లేకపోయినా మనందరి మనసులు ఒకటే, మనందరి ఆశలు ఒకటే. నవ్వుతూ మాట్లాడితే సంతోషిస్తారు. వ్యాధి గురించి మాట్లాడితే.............చావు గురించి , సమాజం చూసే చూపు గురించి మాట్లాడితే.......
హెచ్.ఐ.వి లోతులు ఇంకా నాకు పూర్తిగా తెలీదు. ఒక్కొక్కరితో మాట్లాడితే ఒక్కో విషయం తెలుస్తుంది. కాని ఎంతమంది కి ఇవన్నీ తెలుసు? కౌన్సిలింగ్ ఇస్తున్నారు కాని ఎంతవరకు బయట విన్న అపోహలు నిజాలు కలిసిపోతున్నాయి అని తెలీదు. నేను హెల్త్ సైడ్ పని చెయ్యట్లేదు. కేవలం హెచ్. ఐ. వి కి గురి అయిన లేదా ప్రభావితమైన వారికి జీవనాధారం కల్పించే టాస్క్ నాది. కానీ కొంత వరకు తెలుసుకుంటున్నా.
మొన్న ఒకరోజు లత (పేరు మార్చేశాను), పాజిటివ్ నెట్ వర్క్ (హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరిది నెట్వర్క్) మెంబర్, నేను కలిసి చాలా సేపు కలక్టర్ ఆఫీస్ దగ్గర ఎదురుచూస్తూ కూర్చున్నాము. ఆ జిల్లా కలెక్టర్ కి ఎప్పటికీ మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడే సమయం దొరకటం లేదో, లేక పాజిటివ్ వాళ్ళంటే వున్న చిన్న చూపో కాని అంత సమయం తీసుకుంటున్నారు. లత కి నీరసం వస్తుంది. సరే అని నేను వుంటున్న హొటెల్ రూం కి తీసుకెళ్ళాను. కాసేపు ఫ్రెష్ అయ్యాక వెళ్ళొచ్చని. లత కి 25 సంవత్సరాలు. పాజిటివ్, ఒక కొడుకు 7 సంవత్సరాలు, 18 కి పెళ్ళి అయ్యింది, 20 కి విడో అయ్యింది, కనీసం భర్త శవాన్ని కూడా ఇంటికి రానీయలేదు స్వంత తల్లిదండ్రులు, అత్త మామలు. లత ఒంటరిగా బ్రతుకుతుంది. నెట్ వర్క్ లో చిన్న ఉద్యోగం, అప్పుడే ఎ.ఆర్.టి వాడుతుంది. తను చనిపోతే కొడుకేమి కావాలి? నేను అడిగాను ఎందుకు మంచిగా ఆహారం తీసుకుని వుంటే నీకు సి.డి.4 బాగుండేది కదా ఎ.ఆర్.టి కి అప్పుడే ఎలా వచ్చావు అని?, బార్యా భర్తలిద్దరికి హెచ్.ఐ.వి వుండి వాళ్ళిద్దారు కండోం లేకుండా సెక్స్ లో పాల్గుంటే, వైరస్ పెరిగిపోతుందని, ఇద్దరిలో ఒకరు ఎ.ఆర్.టి మందులు వాడుతుంటే రెండవ వారికి కూడా ఆ మందుల కు రెసిస్టెన్స్ వచ్చేసి సెకండ్ లైన్ మందులకు డైరెక్ట్ గా వెళ్ళాలని , తన భర్త ఎప్పుడు కండోం వాడలేదని చెప్పింది. హెచ్.ఐ.వి వచ్చక అసలెందుకు కలిశారు అని అదిగాను, అదేంటండి మా వయసెంత? మాకు కోరికలుండవా అని అడిగింది. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియక వ్యాది తీవ్రత పెంచేసుకున్నాము అని చెప్పింది. నిజమే మనందరికి హెచ్.ఐ.వి గురించి, దాని బారిన పడ్డవారి గురించి చాలా తక్కువ తెలుసు.
ఎ.ఆర్.టి మందులు చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. యాంటీ బయటిక్ ఎప్పుడో జ్వరమొచ్చినప్పుడు తక్కువ పవర్ ది వేసుకుంటేనె తిండి సహించక, వికారం వచ్చేసి నానా రకాలు అయిపోతుంది. అలాంటిది రోజూ హై డోస్ ఏంటీబయటిక్ వాడితే వారి పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. సరిగా తినలేరు, వాంతులు, కళ్ళు తిరగటం, కాంబినేషన్ మార్చినప్పుడు కొందరికి పెరాలసిస్ కూడా వచ్చేస్తుంది, చర్మ వ్యాధులు, చర్మం నల్లగా మాడినట్లు అవ్వటం, మెడ వెనుక మూపురం లా రావటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో వస్తుంటాయి.
ఒక వైపు శరీరం తో పోరాటం, ఒకవైపు సమాజంతో పోరాటం, ఒకవైపు చావమని చెప్పే మనసుతో పోరాటం....
ఒక్కొక్కరిని కదిపితే అంతులేని వేదన, మనిషి ఎంతో సాధించాము అంటాడు కదా మరి ఇదేంటి మన తోటి వారు నరకం చూస్తుంటే ఏమీ చెయ్యలేకపోతున్నాము? ఇంత ప్రాణాంతకమైన జబ్బులు ఇలా ఆకలి, దాహం,నిద్ర, సెక్స్ కోరిక వంటి సహజమైన అవసరాలు ద్వారా వస్తే ఎంత కష్టం (ఇక్కడ నేను నీతులు, సామాజిక కట్టుబాట్లు ఆలోచించటంలేదు, ఎందుకంటే ఈ కట్టుబాట్లు జంతువులకు లేవు కాని మనుషులకున్నాయి, కాని ఇలాంటి జబ్బులు మాత్రం మన్షులకే వున్నాయి) మనం ప్రకృతి సహజత్వం నుండి చాలా దూరం వచ్చేసామా??? మనకి మనమే నీతులు కట్టుబాట్లు, సౌకర్యాలు సంరక్షణలు ఏర్పాటు చేసుకొని, మనమే సహజమైన ప్రేమ, భంధాలు, సహజమైన కట్టుబాట్లు దాటి ఈ అసహజ సామాజీకీకరణ వల్ల ఇవన్నిటి బారిన పడుతున్నామా అనిపిస్తుంది .ఇటువంటి అలోచన మనకి జీవితంలో ఎన్నో సంధభాలలో కలుగుతుంది. అసలు మనిషి ఎందుకు ఈ సమాజికీకరణ చెందాడు అని(ముక్ఖ్యంగా ఆఫీసు లో చికాకొచ్చినప్పుడు, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు, నిద్రొస్తున్నా పనిచెయ్యల్సి వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇలా, హాయిగా ఆ పూట తిండి మాత్రం సంపాదించి నిద్రపోయే జంతువులను చూస్తే, టెన్షన్ లేని వాటి జీవితాన్ని చూస్తే, మెరిసిపోయే వాటి ఆరోగ్యమైన చర్మాన్ని చూస్తే ఈర్ష్య కలుగుతుంది.
మరి మనం అందరం ఏమి చేస్తున్నాము మన తోటి వారు ఇలాంటి వ్యాధికి గురవుతుంటే? ఇక్కడ కుటుంబాలు చూస్తే వారేదో అంగారక గ్రహం నుండి రాలేదు, మనలాంటి మామూలు కుటుంబాలు, ముందు రోజు వరకు సంతోషంగా జీవితం మీద ఆశతో, సమాజం లో గౌరవంగా బ్రతుకుతున్న వారే. దాని బారిన పడే పరిస్థితి వస్తుందని వారు కూడా ఊహించరు. మనం, మన కుటుంబాలు, స్నేహితులు, పిల్లలు ఈ వ్యాది రాకుండా ఎంతవరకు అరికడుతున్నాము, మన పిల్లల్ని ఎంతవరకు ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము? తల్లి దండ్రులు చూసి చేసిన పెళ్ళిల్లే, కాని అప్పటికే హెచ్.ఐ.వి వుంటే వారికి తెలుసుకునే అవకాశం వుందా? ఒక వేళ వ్యాదికి గురి అయితే కూడా జీవిత కాలం పొడిగించుకుని ఆరోగ్యంగా జీవించే అవకాశం ఎంతమందికి కల్పిస్తున్నాము? తోటి మానవులుగా, కుటుంబ సభ్యులిగా, స్నేహితులుగా, అద్యాపకులిగా, డాక్టర్లుగా, బాధ్యత కలిగిన స్థానాలలో వుండి మనం ఎంతవరకు మన పాత్ర నిర్వహిస్తున్నాము?ఎంతవరకు హెచ్.ఐ.వి. కి గురైన వారికి బ్రతికే ధైర్యాన్ని ఇస్తున్నాము?
పెద్ద పెద్ద చదువులు చదివి, వుద్యోగాలలో వుంటూ...ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలియకుండా వుండే వారి వల్ల ఈ కుటుంబాలు మానసికంగా కూడా బ్రతికే శక్తి కోల్పోతున్నాయి అని కళ్ళారా చూస్తుంటే...ఇంకా ఇలాంటి ఎన్ని విషయాలు నాకు ఇంకా తెలియకుండా వున్నాయా అని భయం వేస్తుంది.