Tuesday, August 7, 2012

కారు కష్టాలు



అసలు హైదరాబాద్ లో జనాలు  కార్ ఎందుకు కొనాలనుకుంటారో కాని నేను ఎందుకు కొనాలనుకున్నానో మర్చిపోయాను. మొదట ఎప్పుడూ కార్ అంతగా అవసరం అనిపించలేదు. ఎప్పుడో కాని ఒకసారి లాంగ్ డిస్టన్స్ వెళ్ళము, అప్పుడు రెంట్ కి తీసుకుంటే సరిపోతుంది. ఆఫీస్ కి మిగిలిన రెగ్యులర్ పనులకి టూ వీలర్ చాలా సౌకర్యం అనిపించింది. ఆఫీస్ టూర్లకి ఎలాగూ ఆఫీస్ కార్ వుండేది. కానీ సంగారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇల్లు దూరం, బస్సుల్లో లోకల్ ట్రైన్లలో రద్దీ కష్టం అనిపించి సేఫ్టీ + సౌకర్యం కోసం కార్ కొనాలి అనుకున్నాము.రోజూ 200 కి.మీ తిరగాలి కాబట్టి కాస్త రఫ్ మరియు డీజిల్ బండి, పల్లెల్లో తిరుగుతాను కాబట్టి రోడ్ క్లియరెన్స్, మైంటైనన్స్ తక్కువ వున్న బండి అనుకున్నాము.మొదటి బండి+ లోన్ కాబట్టి కాస్త 5లక్షల్లో అనుకున్నాము, ట్రఫిక్ ప్రోబ్లెం కాబట్టి చిన్న బండి మంచిది అనిపించింది.తీరా షో రూములకు వెళ్ళాక అవన్నీ అసలు పనికి మాలిన విషాయాలన్నట్లు అవసరాలు మర్చిపోయాము.

మొదట మేము అనుకున్నవి:

మారుతి సుజికి వేగనార్ లేదా స్విఫ్ట్, చెవొరలెట్ బీట్

కానీ నా సంగతి ఇలా అయితే, ఇక రెడ్డి, లక్కీ , మా తమ్ముడు, మా డాడీ, మా పక్కింటి వాళ్ళు, మా అపార్ట్మెంట్ వాచ్ మేన్,రెడ్డీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, లకీ ఫ్రెండ్స్, మా తమ్ముడి ఫ్రెండ్స్, మా పనమ్మాయి, మా ఆఫీస్ కార్ డ్రైవర్, బస్ లో నాతో ప్రయాణం చేసే వాళ్ళు, అద్దెకి తెచ్చుకున్న కార్ డ్రైవర్లు, ఆల్రెడీ పలానా కార్ కొనుక్కొని వాడుతున్న వాళ్ళు... ఇలా అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత

"వోక్స్ వేగన్ పోలో,ఇన్నోవా, చెవొరలెట్ డస్టర్, ఫోర్డ్ ఫిగో, టాటా విస్టా, మరియు....."ఇలా రోజూ లిస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్ గురించి గాని, నేను తిరిగే దూరం కాని, వెళ్ళే రోడ్లు కాని గుర్తులేవు. కార్ లుక్ ఎలా వుంది, మైలేజ్ ఎంత, ఎన్ని ఎయిర్ బేగ్స్,డిక్కీ ఎంత పెద్దది (ఏదో అందులో నే కాపురం వుంటామ అన్నట్లు) బ్రేక్స్ ఎలాంటివి, వెనక ఫాగ్ వైపర్ వుందా,మ్యూజిక్ సిస్టం ఇస్తున్నాడా, మేట్స్ ఇస్తున్నాడా, ఏమైనా ఆఫర్లు ఉన్నాయా, సీట్ అడ్జస్ట్ మెంట్ వుందా, కార్ బాడీ కలరు, మిర్రర్ ఫ్రేం కలర్ మేచ్ అవుతుందా,(అసలివన్నీ ఉంటాయని ముందు తెలీనే తెలీదు కాని ఇప్పుడు అవే చాలా ముఖ్యం అన్నంతగా చెప్తారు షోరూం లో ఎక్జిక్యూటివ్స్)

ఈ కార్ మా బంధువుల్లో ఎవరికీ లేకుండా వుండాలి కదా, ఆఫీస్ కి తీసుకెళ్తాము కాబట్టి మరీ రిచ్ గా కనిపించకూడదు, మిగిలిన వాళ్ళకి మరీ చీప్ గా వుండకూడదు,ఇలా ప్రైయారిటీలు మారిపోయాయి. అంతే కాదు వీలుకాని రెండు కాంబినేషన్ ప్రైయారిటీలు ఒకే కార్లో ఎలా? (రిచ్ అండ్ చీప్ లుక్).

ఈ పిచ్చిలో పడి ఒక వైపు చస్తుంటే, అన్ని షో రూములు తిరిగామేమో రోజూ ఉదయాన్నే షోరూములు వాళ్ళు ఏమి చేస్తారు అనేది తెలిసిపోయింది మా లాంటి ఫ్యూచర్ బకరాలని వెతుక్కొని మా దగ్గర ఆ ఆఫర్ వుంది, ఈ నెల ఆఖరుకి రేట్లు టాక్స్ లు పెరిగిపోతాయి, త్వరగా బుక్ చేసుకోండి మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తాము అని అందరూ ఊరిస్తున్నారు. అన్ని షో రూముల వాళ్ళ పేర్లు ఎలా గుర్తుంటాయి? వాళ్ళేదో నాతో జన్మ జన్మ ల సంబంధం అన్నట్లు పేరు చెప్పి నన్ను అప్పుడే మర్చిపోయారా అన్నట్లు మాట్లాడుతున్నారు.నేనేమో మారుతీ వాడితో ఫోర్డ్ ఫిగో గురించి, హుండయ్ వాడితో బీట్ గురించి బేరాలాడుతున్నా.

అయినా వాళ్ళిచ్చే ఆఫర్స్, పెద్ద కార్లలో వుండే సదుపాయాలు విన్నాక ఎవరు మాత్రం పిచ్చి చిన్న కార్ కొనాలనుకుంటారు? మన అవసరాలు,బడ్జెట్ గొడవలు ఎప్పుడూ వున్నవే కార్ ఏమైనా వంద సార్లు తీసుకుంటామా ఒకేసారి పేద్ద పడవ లాంటి కార్ ఒక 20 లక్షల అప్పు చేసేసి కొని పడేద్దాం అనిపిస్తుంది. చుట్టాలు, చుట్టు పక్కల వాళ్ళు సంతోష పడతారు(నోరు వెళ్ళబెట్టాలి) అని కపటాలోచన వస్తుందే తప్ప, మనకి అసలు కార్ పార్కింగ్ కూడా లేదే అనే కనీస ఆలోచన రావట్లేదు.

ఉదయాన్నే అసలు నిద్రే లేవని రెడ్డి పాపం 4 గంటలకే అలారం పెట్టుకొని మరీ లేచి కార్ ల బ్రోచర్లన్నీ ముందు వేసుకొని, దీని మైలేజ్ ఎంత, దాని రేట్ ఎంత, వాడిచ్చే ఆఫర్ ఎంత, వీడిచ్చే ఆక్ససరీస్ ఏంటి అని కంఠతా పడుతుంటే ఏమీ చెయ్యలేక గబ గబా రెడీ అయ్యి ఆటో లో జె.బి.ఎస్ కి వెళ్ళి, అక్కడ బస్సెక్కి సంగారెడ్డి వెళ్ళటమో, సీతాఫల్ మండి వెళ్ళి ఎం.ఎం.టి.ఎస్ ఎక్కి, లింగంపల్లి తిగి మళ్ళీ నడిచి, ఆటో ఎక్కి, బస్సెక్కి సంగారెడ్డి చేరడమో చేస్తూ నేను రోజులు గడిపేస్తున్నాను.చాలా రోజులయింది కదా మీరు కార్ తెస్తామని, ఏమైంది మీ కార్ అని ఎవరైనా అడిగితే ఇదిగో రేపు, అదిగో ఎల్లుండి అని చెప్పలేక చస్తున్నాను. అసలు ఈ కారు కష్టాలేంటో నాకు.

తీరా ఒక వైపు కార్లు చూస్తూనే, 'ఆఫీస్లో బిజీ గా పని చేసుకుంటూనో, కలక్టర్ గారి రూంలో మీటింగ్ లో ఉంటేనో రెడ్డి పెద్ద కొంపలు మునిగిపోయినట్లు ఫోన్ చేసి " నీకు తెలుసా పెట్రోల్ రేట్ మళ్ళీ పెరుగుతుందంట మనం డీజిల్ కొందాము, ఎల్.పి.జి లీక్ అవుతుందంట, మనం సి.ఎన్.జి చేయించుకుందాం, కాని సి.ఎన్.జి స్టేషన్లు పెద్దగా లేవు, అసలు కార్ కొంటే నెలకి 30,000/- ఖర్చు అసలు కార్ ఒద్దు లే" అని నా బి.పి.పెంచడమో, నాకు సన్యాసం పుచ్చుకోవటం ఉత్తమం అనిపించేలా చెయ్యటమో చేస్తున్నాడు. ఒక్కోసారి రెడ్డిని చూసి జాలేస్తుంది అసలు కార్ లు గురించి ఆలోచిస్తూ సరిగా తిండి నిద్ర కూడా పోవట్లేదేమో అని....ప్చె...ఎంటో ఈ కారు కష్టాలు.కార్ రాక ముందే ఇన్ని కష్టాలు అయితే వచ్చాక ఇంకెన్నో???

కార్ కొనుక్కున్న మా తమ్ముడు నవ్వటమే మర్చిపోయాడు,డ్రైవింగ్ చేస్తున్నంత సేపూ రోడ్లని, రోడ్ మీద పోయే వాళ్ళని తిట్టుకుంటూనే వుంటాడు. నిద్రలో కూడా వాడి కారు ప్రక్కన పిల్లలు ఆడుకుంటూ కారుకి గీతలు పెట్టేసినట్లు, వాడు కరెక్ట్ గా వెళ్తుంటే ఎవడో వెనకనుండి వచ్చి గుద్దేసినట్లు కలలు వస్తున్నాయి వాడికి. మొన్నొసారి ఎవరో లూనా వాడు వీడి కారు ని గుద్దించేస్తే కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియక గుద్దించినవాడి కి కార్ ఇచ్చేసి, వాడి లూన వేసుకొని వీడు ఇంటికొచ్చేశాడు (అదీ వర్షం లో)....పాపం పిచ్చి తమ్ముడు.

అసలు పెట్రోలే తాగని, గాలి తో నడిచే కారు దొరికి, వడ్డీలే లేని లోనిచ్చే బ్యాంకు దొరికి,  జీతమే తీసుకోని డ్రైవర్ దొరికి, ట్రాఫిక్కే లేని  ఖాలీ రోడ్ కూకట్ పల్లి రూట్ లో వుండి, 50 కి.మీ. దూరం నేను కళ్ళు మూసి తెరిచేలోగా సంగరెడ్డీ టు సికింద్రాబాద్ ప్రయాణం అయిపోయి, 4 గంటలకే ఆఫీస్ అయిపోయి, 4.10 కే నేను ఇంట్లో వుండి,ఉదయం 9 కి లేవగలిగి, 10 కి ఆఫీసు కి వచ్చేసి ఇలా....అన్నీ జరిగిపోతే ఎంత బాగుంటుంది కదా! ఛా ఇంత చిన్ని చిన్ని కోరికలు కూడా తీరని ఈ దిక్కుమాలిన జీవితం నేను జీవించలేను....అందుకే త్వరగా నిద్ర పోతా. (గుడ్ నైట్)( ఇలాంటివే ఇకొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి- లక్కీ హోం వర్క్ ఎవరు చెప్పకుండా చేసేసు కొని, రెడ్డీ ఇంటిపని అంత చేసేసి, పనే చెప్పని బాస్ దొరికి, ఫ్రీగ జీతమిచ్చే ఉద్యొగం దొరికి...ఇవన్నీ కల కంటున్నా నిద్రలో...)  







Monday, July 23, 2012

హృదయ లేఖ


మొన్న నా అల్మరా అంతా సర్దుతుంటే పాత గ్రీటింగ్ కార్డ్లు, లెటర్లు బయటపడ్డాయి. అవన్నీ నేను దాచుకున్నవి. కనీసం 10 సంవత్సరాల క్రితంవి. నా ఫ్రెండ్స్ బంధువులు పంపిన కార్డ్స్, వ్రాసిన ఉత్తరాలు. అవన్నీ వెతికితే, రెడ్డి పంపిన గ్రీటింగ్ ఒకే ఒకటి వుంది. ఎంత అన్యాయం రెడ్డి నాకెప్పుడు లవ్ లెటర్స్ రాయలేదా అని మళ్ళీ వెతికా, ఆఖరికి నేను ఉన్న ఒక హాస్టల్ వార్డెన్ కూడా ఒకసారి లెటర్ రాసింది కాని, రెడ్డి రాయలేదు అని తేలిపోయింది. విపరీతమైన దిగులొచ్చేసింది. ఛా.. స్కూల్ లో ఉన్నప్పటినుండి ఎంతో మంది లవ్ లెటర్స్ రాసారు నాకు, పోయి పోయి ఒక్క లెటర్ కూడా రాయని ఈ మనిషిని నేను పెళ్ళిచేసుకున్నానా అని తెగ బాధ పడ్డాను.ఇంటికొస్తే కడిగేద్దామని కోపంగా ఎదురుచూస్తున్నా. ఈలోగా నా ఫ్రెండ్ శాంత ఫోన్ చేసింది....

శాంత: హాయ్ డార్లింగ్ ఏమి చేస్తున్నావ్?

నేను: హుహ్..బాధ పడుతున్నాను

శాంత: ఏం? ఈరోజు రెడ్డి నీకు నచ్చిన కూర వండలేదా? చెప్పు, విడాకులకి అప్లై చేసేద్దాం?నాకు తెలిసిన మంచి లాయర్ ని మాట్లాడనా?

నేను: నీ...ఛీ.. అది కాదు, రెడ్డి నాకెప్పుడు లవ్ లెటర్ రాయలేదు, ఈరోజు అల్మరా దులిపితే ఎన్నో లెటర్స్ దొరికాయి కాని ఆలోచిస్తే రెడ్డి నాకు ఒక్క సారి గ్రీటింగ్ కార్డ్ ఊరికే సంతకం చేసి ఇచ్చాడు తప్ప లెటర్ రాయలేదు. అదికూడా ఎవరో కలెక్టర్కో, ఎం.ఎల్.ఎకొ ఇచ్చినట్లు అఫీషియల్ కార్డ్ ఇచ్చి పైన నా పేఅరు, కింద తన సంతకం చేశాడు, ఎంత మోసం, ఎంత దగా, ఎంత దారుణం, ఎంత అది,ఎంత ఇది....

శాంత: ఆపు ఆపు, మీ ఇద్దరి లవ్ లెటర్లు నా దగ్గర వున్నాయి

నేను: అదేంటి? నీకు పిచ్చా? మా లెటర్లు నీ దగ్గరెలా వుంటాయి? అసలు రెడ్డి నాకే రాయలేదు, నీకు రాశాడా?

శాంత: ఎహెయ్, అది కాదు, మీరిద్దరు ఎప్పుడూ ఒకదగ్గరే వున్నరు, తరువాతా మొబైల్స్ వచ్చాయి ఇంకెక్కడ లెటర్స్ రాసుకుంటారు? అది కాక, మన మీటింగ్స్,ట్రైనింగ్స్ లో కూడా ఒకే దగ్గర కూర్చుని చీటీలు రాసుకునే వాళ్ళు మర్చిపోయావా? మీరు ఫ్లాష్ కార్డుల మీద కబుర్లు రాసుకోవటం మేమందరం చూసేవాళ్ళం కాని మేము లవర్స్ కాదు అన్నట్లు వుండే వాళ్ళు. ఒకసారి పేపర్లు లేకపోతే రెడ్డి ఎదురుగా కూర్చున్న నా చున్నీ మీద నీకు ఎదో రాశాడు. ఆ చున్నీ నాదగ్గర ఇంకా ఉంది, కావాలంటే చూపిస్తా!!

నేను: అవునా!నాకు ఏదో లీల గా గుర్తొస్తుంది కాని, అయినా అవి లవ్ లెటర్లు కాదు. ఏవో సోది కబుర్లు, అప్పుడు మేము నిజంగా లవర్స్ కాదు,రెడ్డి నాకెప్పుడు లెటర్ రాయలేదు, ఈరోజు రానీ అయిపోయాడు.

శాంత: సరే రాంగ్ టైం లో ఫోన్ చేశాను, నీకు పిచ్చి, మొబైల్స్ వచ్చాక ఎవరు లెటర్లు రాస్తారు?

అని ఫోన్ పెట్టేసింది.

నిజమే సెల్ ఫోన్ లు వచ్చాక, లెటర్స్ లేవు. కాని మనం మాట్లాడిన మాటలు కాలం తో పాటు మరిచిపోతాము, ఆసమయంలో మన ఫీలింగ్స్ కూడా కాలం తో పాటు మారిపోతాయి, కాని అప్పుడు రాసిన ఉత్తరాలు మాత్రం తీపి ఙ్ఞాపకాలు గా మిగిలిపోతాయి. ఎంతో మంది స్నేహితులు కొంతకాలం మన భావాలని పంచుకుంటూ ఆసమయంలో మన ఆలోచనలని, జీవితాన్ని ప్రభావితం చేస్తారు. ఎందరో బంధువులు మనకి ఒక్కొ సమయంలో మార్గ్దర్శకం అవుతారు, టీచర్లు, తెలిసినవాళ్ళు ఇలా ఎందరో! నా దగ్గర ఉత్తరాలు చూస్తే ఈరోజు నేను ఏంటి అనేదానికి వాళ్ళందరు కారణం, కాని వాళ్ళందరు నా జీవితాన్ని ఎలా మలిచారు అని ఆ ఉత్తరాలే చెప్పాయి. అవి చదివాకా నాలో చాలా భావాలకి, ఆలోచనలకి, నేటి నా దిశ, పయనానికి కారణాలు దొరికాయి.

ఉదాహరణకి, నా  చిన్నప్పుడు మా ట్యూషన్ మాస్టారు నాకు ఎప్పుడూ పుస్తకాలు గిఫ్ట్లు గా ఇవ్వటమే కాకుండా, అతను యూనివర్సిటీకి చదువుకోడానికి వెళ్ళిపోయినా కూడా ఉత్తరాలు రాసి పలానా పుస్తకం చదువు అని చెప్పేవారు. దానితో నాకు విపరీతమైన పుస్తకాల పిచ్చి వచ్చింది. ఈరోజు నా భాషకి,రాయటంలో ఆశక్తి కి అదే కారణం. ఒక సీనియర్ అక్క, పెళ్ళి అయ్యాక లెటర్స్ రాసేది, తనకి వాళ్ళ ఇంట్లో విపరీతమైన ఆంక్షలు, బొట్టు, కట్టు తీరు దగ్గర నుండి, తనేమి తినాలి ఎలా నడవాలి అన్నీ మారిపోయానని, పెళ్ళి తనలో తనకి ఇష్టమైన విషయాలు కూడా లేకుండా చేసిందని రాసేది, దానితో నేను ముందే చాలా విషయాలలో ఎలా ఉండాలి అని  నిర్ణయించుకున్నాను.

ఇంతే కాదు, ఒకసారి మా మామయ్య ట్రైన్ ఆక్సిడెంట్లో ఇరుక్కుని వారం రోజులు ఆ శిబిరంలో వున్నారు. అక్కడనుండి నాకు ఉత్తరం రాశారు, సేవ అనేది ఎంత అవసరమో, మనిషి మనిషికి సహాయం చెయ్యటం లో ఎంత తృప్తి ఉందో అప్పుడు తెలిసింది.

ఒకప్పుడు సెలవుల్లో కూడా వదలలేక ఉత్తరాలు రాసుకున్న స్నేహితులం ఇప్పుడు ఎందుకు అంత దూరం అయిపోయాము? అని ఆ ఉత్తరాలు చదివాక మళ్ళీ తన మీద ప్రెమ పొంగిపోయి కాల్ చెయ్యలనుకున్నా, కాని నా మనసులో భావం మాటల్లో వ్యక్తం కాదని అప్పుడే తెలిసింది. మేమిద్దరం కలుస్తున్నాము అప్పుడప్పుడు మాట్లాడుతున్నము కూడా కాని, ఉత్తరం చెసే మాయ ఇవేవి చెయ్యలేకపోతున్నాయి.

హాస్టల్ లో ఉన్నప్పుడు డాడీ రాసిన ఉత్తరాలు, డాడీ అంటే భయం, భక్తే కాకుండా, డాడీ మనసులో ప్రేమ ని తెలియజేశాయి, డాడీ నాతో ఎప్పుడూ ఎదురుగా మాట్లాడని కబుర్లు తెలియజేశాయి. మమ్మీ రాసిన ఉత్తరాలు కేవలం ప్రేమ చూపి సాఫ్ట్ గా కనిపించే మమ్మీ లో ఎంత ధైర్యం,అలోచనా ఉందో, ఆమె లోని ఒక స్త్రీ ని కూడా తెలియజేశాయి. మనకు తెలిసిన మనుషుల్లోనే మరో దాగి ఉన్న కోణం చూపించగలిగే శక్తి ఉత్తరాలకు ఉంది.

క్లాస్ మేట్ అబ్బాయి రాసిన ఉత్తరం అప్పట్లో చిరాకొచ్చినా, అయ్యో నాకోసం అంత ఆలోచించాడా ఎంత టైము నాకు లెటర్ రాయడానికి ఇచ్చాడా అని ఆలోచిస్తే జాలి వేస్తుంది, ఇప్పుడు ఎంతో సీరియస్ గా జీవితంలో పడిపోయిన మనకి ఆ చిన్న విషయాలలో ఉన్న ఇంత ఆనందం తెలిసొచ్చింది. దాదాపు 10,15 సంవత్సరాలు గా అసలెవరైనా ఉత్తరాలు రాసుకుంటున్నారా? నేనైతే రాయట్లేదు. చిన్నప్పుడు ఇన్లాండ్ కవర్లు కొనడం, నీట్ గా ఉత్తరాలు రాయటం, రోజూ పోస్ట్ చెయ్యటం, పోస్ట్ మేన్ మనకి ఉత్తరం తెస్తాడని ఎదురుచూడటం, ఒకేసారి 3,4 ఉత్తరాలొస్తే గొప్ప అయిపోవటం, హాస్టల్ లో అయితే ఇక చెప్పక్కర్లేదు, ఏ అమ్మాయికి ఎక్కువ ఉత్తరాలొస్తే ఆమె ఒక పెద్ద టాపిక్, తన వైపు ఈర్ష్యతో చూడటం, ఇంకో ఉత్తరం వచ్చేవరకు చదివినదే మళ్ళీ మళ్ళీ చదవటం. కొన్ని ఫ్రెండ్స్ కి పేరెంట్స్ కి చూపించేవి, కొన్ని చూపిస్తే ఏమంటారో అని భయపది దాచేసేవి, లేదా చింపేసేవి. కొన్ని బాధలో చదువుకునేవి, కొన్ని సంతోషంగా చదువుకునేవి.

ఉత్తరం రాయడానికి ప్రతి ఒక్కరు కాసేపు ఈలోకం నుండి బయటకు వెళ్ళి ఊహా లోకానికి వెళ్ళాలి, మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళతో మాట్లాడుతున్నట్లు ఊహించుకోవాలి, నవ్వాలి, కోప్పడాలి, ఆలోచించాలి,ఇంకా ఎన్నెన్నో గుర్తు చేసుకోవాలి. ఒక్కొసారి మొదలు పెట్టిన ఉత్తరం రాయలేక పోతాము, కారణం రాయడానికి ఆ మనిషితో మానసిక సంభాషణ చేసే పరిస్థితులు కుదరక. అంటే ఉత్తరం రాయటం అంటే ఎదో కెలకటం కాదు మనసు పెట్టి సంభాషించడం.


ఇప్పుడు బహుశా 10,15 సంవత్సరాలుగా నాకు ఒక్క ఉత్తరం కూడా రాలేదు,నేను రాయలేదు. ఇంటర్ నెట్ వచ్చాక ఎప్పుడైన ఫ్రెండ్స్ మెయిల్ చేస్తారు, లేదా ఎస్.ఎం.ఎస్ లేదా ఆన్ లైన్ చాటింగ్. కాని ఆ మనిషి లేకుండా ఎదురుగా ఊహిస్తూ ఊహలకి రెక్కలిస్తూ, భావాన్ని స్వతంత్రంగా రాయగలిగితే వచ్చే ఎఫెక్ట్ వీటిలో లేదేమో! తరువాత ఆ ఉత్తరాన్ని దాచుకొని, కొన్నాళ్ళ తరువాత ఆ నలిగిన కాగితాన్ని చదువుకుని కాలంలో వెనక్కి పరిగెత్త గలిగే ఆనందం వీటిలో రాదేమో!

నేను టెక్నాలజీకి వ్యతిరేకిని కాను,కాని ఇలాంటి సున్నిత భావాలు, సుకుమార సాన్నిహిత్యం ఇచ్చే ఉత్తరాలకే నా ఓటు.

ప్రియుడు ప్రియురాలిని లేదా భర్త భార్యని పొగడటం కూడా ఉత్తరాలలోనే అందంగా ఉంటుంది, ఆ తొలి రోజుల మధుర భావం ఎప్పటికీ నిలిచిపోయే ఒక ప్రేమ లేఖ, వదిలి ఊరెళితే వచ్చే విరహ లేఖ, ఆచారాలు, పెద్దలు పేరు తో నన్ను దూరం చేస్తున్నావని సున్నితంగా తిట్టుకునే కలహ లేఖ,దూరం గా వున్న బిడ్డకి అమ్మ రాసే అమృత లేఖ, నాన్న డబ్బు పంపుతూ రాసే బుద్ధుల లేఖ, అక్క చెల్లెళ్ళు రాసుకునే కలగాపులగం లేఖ, అన్న దమ్ములు రాసుకునే పోటీ లేఖ, స్నేహితులు రాసుకునే తరగని కబుర్ల చిలిపి లేఖ, గురువు రాసే మార్గదర్శక లేఖ, గడుగ్గాయిలు రాసే గడసరి లేఖ, హాస్టల్ నుండి వార్డెన్ కి అర్ధం కాకుండా రాసే కంప్లైంట్ లేఖ...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో...

మీ జీవితంలో కూడా ఎన్నో రకాల లేఖలు వచ్చి ఉంటాయి, ఒకసారి గుర్తు చేసుకోండి, వీలైతే ఒకరికి మీరు లేఖ రాసి సర్ప్రైజ్ చెయ్యండి. నేను కూడా అదే ప్లాన్ లో ఉన్నాను. ఇంతకీ ఎవరికి రాయాలబ్బా???? నాకు ఎప్పుడూ లెటర్ రాయని రెడ్డిని తిడుతూ రాయనా? లేక నేను పట్టించుకోకపోయిన నాకు లవ్ లెటర్స్ రాసిన వాళ్ళలో ఎవరినైనా ఎక్కడున్నారో కనిపెట్టి అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు జవాబు ఇస్తున్నా అని రాయనా???

Saturday, July 21, 2012

బ్లాగాలని వుంది

బ్లాగాలని వుంది. సినిమా టైటి ల్  కాదు, నా ఫీలింగ్. ఏ మ0టారు ?

ఒకసారి నా పోస్ట్ లు చదివి మళ్ళీ నిర్ణయ0 తీసుకుంటా 

Friday, November 11, 2011

ఒక ఇన్ ఫర్మేషన్ అలాగే ఇన్విటేషన్.


హలో ఆల్..మీ అందరికి ఒక ఇన్ ఫర్మేషన్ అలాగే ఇన్విటేషన్.

మా ప్రోగ్రాం లో చిల్డ్రన్స్ డే సంధర్భంగా "కేరింతలు" అని 500 మంది హెచ్.ఐ.వి కి గురికాబడిన, బాధింపబడిన పిల్లలతో 2 రోజుల ప్రొగ్రాం చేస్తున్నాము. అందులో భాగంగా 14 నవంబర్ సాయంత్రం నెక్లేస్ రోడ్ లో కేండల్ లైట్ వాక్ వుంది. సో ఎవరికైనా ఇంట్రస్ట్ వుంటే మీరు అందులో పాల్గొనవచ్చు. దూరంలో వున్నవాళ్ళకి కుదరదు కాని దగ్గరలో వున్న వాళ్ళకి కుదురుతుంది. మామూలు పిల్లల లాగానే వీరికి అవే ఆశలు, హక్కులు, నైపుణ్యాలు వుంటాయని చెప్పటమే ఈ కేరింతల వుద్దేశ్యం.

పిల్లలికి చాలా ప్రోగ్రాములు, పోటీలు,ఆటలు ఏర్పాటు చేస్తున్నాము,పిల్లలు ఎంజాయ్ చేస్తారనే ఆశతో. అవకాశాలు లేక, అవసరమైన సదుపాయం లేక, జీవితం సరైన గాడిలో లేకపోవటం వలన ఎంతో సంతోషం గా గడపాల్సిన బాల్యం కస్టాలపాలైపోతుంది ఎందరో పిల్లలికి. అటువంటి ఎందరో పిల్లలు వారి జీవితంలో ఎప్పుడూ ఊహించని ఆట పాటలు చూసే అవకాశం ఈ కేరింతలు. నాకు చాలా సంతోషం గా వుంది. అంతమంది పిల్లలితో ప్రోగ్రాం అంటే కష్టమే కాని ఆ కస్టం చాల ఇష్టం గా వుంది.

Monday, August 22, 2011

వర్షం కురిసిన ఒక రోజు



రవి(డ్రైవర్): మేడం మీరు ఎయిడ్స్ మేడమా?

నేను: !!!!..అంటే?

రవి: అదే మేడం రెండ్రోజుల నుండి మీ మాటల బట్టి మీరు ఎయిడ్స్ డిపార్ట్ మెంట్ అని అర్ధం అయింది, మీరు ఎయిడ్స్ మేడమే కదా?

నేను: ఆ...అవును. నేను ఎయిడ్స్ మేడం నే

రవి: మేడం మీదగ్గర ఎయిడ్స్ కి సంబందించి బుక్స్ వుంటాయా?

నేను: ఆ ..వుంటాయి.

రవి: నాకు కొన్ని ఇవ్వండి, నేను చదువుతాను. నేను తెలుసుకోవాలి

నేను: నిన్ననే అడగాల్సింది (ఈ టాక్సి 2 డేస్ కి బుక్ చేసుకున్నా) ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు అడిగితే ఎలా? నా దగ్గర పట్టుకొని తిరగను కదా.

రవి: నేను తెలుసుకొని మొత్తం మా డ్రైవర్స్ అందరికీ చెప్తానండి.

నేను: కరక్టే మంచి ఆలోచన, తరువాత ఎప్పుడైనా వస్తానంటే తీసి పెడతాను రవీ, లేదంటే నువ్వేమి తెలుసుకోవాలో నన్ను అడుగు చెప్తాను.

రవి: ఎయిడ్స్ రాకుండా ఎలా వుండాలి, ఏ మందులు వాడాలి అవి అన్నీ చదివితే నాకు బాగుంటుంది అందరికి చెప్పడానికి. పుస్తకాలన్నీ అందరికి అందుబాటులో వుంటే బాగుంటుంది కదా మేడం.

(కండోం వాడడం ఒకటే అన్నిటికీ మంచి పద్ధతి, ఒక్క ఎయిడ్స్ మాత్రమే కాదు చాలా వుపయోగాలు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి కూడా మందులు పని చెయ్యాలంటే కూడా కండోం వాడాలి. అని చెప్పాలనుకున్నాను. కానీ అది తనకి తెలీకుండా వుంటుందా అనో, కొంచెం మొహమాటమో అనిపించి ఆగిపోయా. అది ప్రొఫెషనలిసం కాదు అని తెలిసి కూడా)

నేను: అవును రవి, కానీ గవర్నమెంట్, ఇతర సంస్థలు అన్నీ కూడా ఎయిడ్స్ సంబందించి అంత సమాచారం పేపర్లలో, పుస్తకాలలో,టి.వి. లో ఇస్తున్నారు. అంతే కాదు ప్రతీ చోట ముఖ్యంగా హైవేలలో కండోంస్ ఫ్రీ గా అందుబాటులో పెడుతున్నారు.

రవి: ఇవన్నీ మాకు తెలీదండి.ఎవరికీ అందుబాటులో లేకుండా వుంచితే గవర్నమెంట్ బాధ్యత తీరిపోదు కదండీ. మీరేమీ అనుకోకండి, గవర్నమెంట్ వల్లే మన రాష్టంలో ఎయిడ్స్ పెరిగిపోతుందండి, అందరికి అన్ని విషయాలు తెలీవు.

అంతే కాదు మేడం అందరికీ అన్ని కండోంస్ పడవు. కొందరికి కొన్ని బ్రాండ్లే పడతాయి, ఎలర్జీ వస్తుంది కొందరికి, కొందరికి ఇంక వేరే కంప్లైంట్స్ వున్నాయి

నేను: ( నేను ఈ సెక్టర్ లోకి వచ్చాక సెక్స్ వర్కర్స్ కానీ, ఇతరులు కాని చెప్పినది కండోం వాడితే వారికి సరిగా ఎంజాయ్ మెంట్ వుండదని వాడరు అని) ఎలర్జీ కి ట్రీట్మెంట్ వుంది కానీ ఎయిడ్స్ కి ట్రీట్మెంట్ లేదని చెప్పండి అన్నాను.

తరువాతా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయాము. నేను రెండ్రోజులుగా సంగారెడ్డి లో పని వుండి టాక్సి బుక్ చేసుకుని వెళ్ళి, తిరిగి వచ్చేస్తున్నా.సాయంత్రం 3.30 అయింది. కానీ నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పేసి చీకటిగా చిన్న వర్షం మొదలై చల్లగా వుంది. నాకు వర్షం అన్నా, ఈ చల్లదనం అన్నా చాలా ఇష్టం. ట్రాఫ్ఫిక్ ఎక్కువుంటుందని త్వరగా వెళ్ళిపోవాలని రవి స్పీడ్ గా వెళ్తున్నాడు. సరే నా ఫేవరెట్ పని వుందిగా చేద్దామని బుక్ తీసా..."ద 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్", చేతన్ భగత్ పుస్తకం. నిన్న ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా త్వరగా చదివి ఇచ్చేయాలి. ఎప్పటిలాగే భామ కి పుస్తకం మొదలు పెట్టేముందు ఎస్.ఎం.ఎస్ చేశా. పలానా బుక్ మొదలు పెట్టా అని. వెంటనే ఆన్సర్ వచ్చింది " హేవ్ యు డన్ అనీ వన్ ఆఫ్ ద మిస్టేక్స్?" అని

తప్పులు చేశావా అని అడుగుతుంది. తప్పు చెయ్యని వాళ్ళు ఎవరైనా వుంటారా? నేను అందరికంటే ఎక్కువే చేసి వుంటా. నాకెందుకో ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళే ఎక్కువ నేర్చుకుంటారు జీవితం లో అనిపిస్తుంది. మన అంతరాత్మని చంపుకుని మంచి అనిపించుకునే కంటే, మంచి అమ్మాయి కాదు అనిపించుకోవడమే నాకు ఇష్టం. అయినా తప్పు ఒప్పులు ఎవరు నిర్ణయించాలి. మనకి ఆ సమయానికి అది కరెక్ట్ అనో , అవసరం అనో అనిపిస్తేనే కదా చేస్తాము.ఈ మధ్యనే ఒకరు చెప్పారు "ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ తేడా అంతే కాని మంచి చెడు అని వుండదు అని" ఇలా ఆలోచిస్తూ వర్షం చూస్తున్నా.ఇంత మంచి వాతావరణం. నాకు వర్షం చూస్తుంటే చాలా బాగుంది. ఇంటికి ఫోన్ చెద్దామనిపించి చేశాను. రెడ్డీ ఫోన్ బిజీ. ఈ రెడ్డి కి బుధ్ధి లేదు. మామూలు గా నేను పిచ్చి బిజీ గా వున్నప్పుడు కాల్ చేసి ఎప్పుడొస్తావు, త్వరగా వచ్చేయ్ అని విసిగిస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఎవరితోనో సోది వేసుకుంటున్నాడు.పాపం ఫోన్ లో సోది వెయ్యడులే. అసలే పిసినారి. ఏదో ఆఫీస్ పని అయివుంటుంది అని సర్ది చెప్పుకున్నా.

జీవితంలో ఎవరూ ఎప్పుడూ ఒకేలా వుండరు. పెళ్ళికి ముందు ఇద్దరం తెగ మాట్లాడుకునే వాళ్ళం. పెళ్ళి అయ్యాక కొన్నాళ్ళు నేను అదే రేంజ్ లో ఆశించేదాన్ని. కాని రెడ్డీ విసుక్కునే వాడు. తరువాత అలవాటైపోయింది. ఇప్పుడు నేను విపరీతమైన బిజీగా వున్నాను, ఇప్పుడు నేను అసలు ఫోన్ చెయ్యను, రెడ్డీ నే చేస్తుంటాడు. నా ఫోన్స్ అన్నీ లక్కీకి లేదా ఆఫీస్ పని మీద లేదా ఎప్పుడైనా ఫ్రెండ్స్ కి. ఇదే లైఫ్ సైకిల్ ఏమో! కాని అప్పుడు, ఇప్పుడూ కూదా ఏదో ధైర్యం.

ఇంతలో రవి ఫోన్ మోగింది. వాళ్ళ అమ్మగారనుకుంటా అవతలి మాటలు కూడా క్లియర్ గా వినిపిస్తున్నాయి తన ఫోన్ ప్రాబ్లెం అనుకుంటా. రవి వాళ్ళమ్మ గౌతమి ని ఎక్కడికి తీసుకెళ్ళావు రా వాళ్ళమ్మ ఫోన్ చేసి నీ దగ్గరే వుందని చెప్తుంది అని గట్టిగా అరుస్తుంది.

రవి: నేను డ్యూటీలో వున్నానే, వచ్చేసరికి రాత్రి 11 అవుతుంది అసలు,రాత్రికి రాలేనేమో. నాకు గౌతమి గురించి తెలీదు. కనుక్కొని చెప్తాలే, నువ్వు ఫోన్ పెట్టేయ్.

రవి ఆ తరువాత ఒక 30 కాల్స్ చేశాడు. సో కాల్డ్ గౌతమి కి, గౌతమి ఫ్రెండ్ కి, గౌతమి అన్నకి, గౌతమి అమ్మకి, రవి ఫ్రెండ్స్ కి, రవి వాళ్ళ అమ్మకి....ఇలా సాగింది లిస్ట్

మొత్తానికి నాకు అర్ధం అయింది ఏంటి అంటే గౌతమి, రవి కి మరదలు. పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి. ఏదో చదువుతుంది, వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్ కి వచ్చి వుంది. ఎవరికీ తెలీకుండా ఈరోజు గౌతమి, రవి కలవాలని ప్లాన్ చేసుకున్నారు, కానీ ఇంట్లో అనుమానం వచ్చింది. రవి గౌతమి కాసేపు ఫోన్లో పోట్లాడుకున్నారు. కాని రవి అందరికీ ఫోన్లు చేసి తను సిటీలో లేడని నమ్మకం కలిగించి అందరిని సెట్ చేసి మళ్ళీ గౌతమి కి ఫోన్ చేసి బ్రతిమలాడుతున్నాడు కొపం వద్దు అని. తను 6కి వస్తానని, అనుకోకుండా లేట్ అయిందని, తన ఫ్రెండ్ 7కి నైట్ డ్యూటీకి వెళ్ళిపోతాడు అప్పుడు మనం వాడి రూం కి వెళ్దాము అని చెప్పాడు.( అసలు నేను ఒకదాన్ని వున్నాననే ద్యాసే లేనట్లుంది, లేదా నన్ను మనిషిగా అనుకోలేదో?)

ఈ ఫోన్స్ అన్నీ మాట్లాడుతూనే రవి డ్రైవింగ్ చేస్తున్నాడు. హైదరాబాదులో పడిన వర్షానికి హుస్సేన్ సాగర్ పొంగినట్లు మురికి నీరు రోడ్ల మీద నిండిపోయింది. ట్రాఫిక్ పిచ్చి పిచ్చిగా వుంది. కార్ అసలు కదులుతున్నట్లే లేదు. నాకు కూడా ఇరిటేషన్ గా వుంది ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంటే. కాని నాతో పాటు తోడుగా వున్న వర్షం వల్ల సంతోషం కూడా. రవి డ్రైవింగ్ లో చాలా తేడా వచ్చేసింది. చాలా రేష్ గా వెళ్తున్నాడు. రెండు సార్లు వేరే వెహికల్స్ ని గుద్దించి తిరిగి వాళ్ళ మీద అరుస్తున్నాడు. " రవి మనకి తొందరలేదు, చూసుకొని డ్రైవ్ చెయ్యండి అన్నాను" నాకు తొందరగా వెళ్ళాలని వున్నా కూడా.

ఈ లోగా మళ్ళీ ఫోన్. గౌతమి. ఏదో చెప్పింది...నవ్వుతూ హేపీ గా మాట్లాడాడు. కాని ఆమె త్వరగా రమ్మంటుంది. ఈ ట్రాఫిక్ ఎక్కువగా వుంది 8 అవుతుంది అని చెప్తున్నాడు. రోడ్ల మీద నీరు, వెహికల్స్ అన్నీ నిలబడిపోయాయి. రెండు మూడు సార్లు పక్కకి రూట్ మార్చి ట్రై చేశాడు. అన్ని రోడ్స్ అలాగే వున్నాయి. మొత్తానికి తార్నాక ఫ్లై ఓవర్ దగ్గరకి వచ్చాము. అక్కడ నీళ్ళు నిలబడి పోయాయి. అందరు స్లో గా వెళ్తున్నారు. కాని రవి అసహనంగా అటు ఇటూ ఎటు చిన్న సందు దొరికితే అక్కడ వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఎందుకింత తొందర? గౌతమి కోసమా? తనకోసమే...హార్మోన్స్ తొందర.

టూ వీలర్స్ వాళ్ళందరు పైనుండి వర్షం, క్రింద నీళ్ళు, ప్రక్క వెహికల్స్ వాళ్ళెక్కడ నీళ్ళు తుళ్ళిస్తారో అని జాగ్రత్తగా వెళ్తున్నారు. నేను వాళ్ళందరి అవస్థ చూస్తూ బాధ పడుతున్నాను. వర్షం అందమైనదే కానీ...సౌకర్యమైనది కాదు. అందులోనూ హైదరాబాదులో కేవలం ఆదివారం వర్షం పడితే బాగుండు.చాలా వరకు జనాలు ఇళ్ళళ్ళో వుంటారు. ఇబ్బంది వుండదు. సండే మార్కెట్లు, మిగిలిన వాళ్ళకి తప్పదు. ఇలా ఆలోచిస్తూ వుండగానే రవి ఒకేసారి స్పీడ్ గా ఏక్సిలేటర్ ఇచ్చాడు. చుట్టుప్రక్కల వున్న అందరిని బురద సునామీ అల తాకినట్లు నీళ్ళు చిమ్ముతూ మా కార్ ముందుకి వెళ్ళిపోయింది. ఇద్దరు బైకర్స్ బ్యాలన్స్ తప్పారు. నా మనసు కి చాలా బాధ వేసింది, నేను స్కూటీ మీద వెళ్ళేప్పుడు, లేదా నడిచి వెళ్ళేప్పుడు ఏ వెహికల్ అయినా బురద చిమ్మితే చాలా కోపం వస్తుంది. మరి ఇప్పుడు మా వెహికల్ చేసిన పని ఏంటి?

నేను: రవీ, అంత స్పీడ్ వద్దు అని చెప్పాను కదా!! చూడండి వాళ్ళందరి మీద ఎలా బురద చిమ్మారో?

రవి: బైకుల వాళ్ళు ఎక్కడో సైడ్ చూసుకొని వెళ్ళాలి మేడం, రోడ్ మధ్యలోకి రాకూడదు...అని ఏదో గొణుక్కుంటూ మళ్ళీ స్పీడ్ పెంచాడు.

ఇంతలో మా ఇళ్ళు వచ్చింది. టూర్ స్లిప్ మీద సంతకం చేస్తూ...రవీ...మీ వాళ్ళందరిని కండోం వాడమని చెప్పు. గవర్నమెంటు కే కాదు మనకి కూడా బాధ్యత వుంటుంది. మన జీవితం మీద, ప్రక్క వాళ్ళ జీవితం మీద కూడా.....ఒక్క ఎయిడ్స్ విషయం లోనే కాదు...అన్ని విషయాలలో మన బాధ్యత వుంటుంది. హేపీ ఈవినింగ్...థాంక్స్ రవి, నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినందుకు. మీరు కూడా చూసుకొని జాగ్రత్తగ వెళ్ళండి. రోడ్స్ బాగాలేవు.

అని చెప్పి బ్యాగు తీసుకొని...3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ బుక్ తీసుకొని...ఇంట్లోకి బయలుదేరా. వర్షం కదా,లక్కీ ట్యూషన్ డుమ్మా కొట్టి వుంటాడు, రెడ్డీ కి వాడికి ఈ పూట టి.వి కొసం గొడవ వుంటుంది, వాడి స్కూల్ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాడు విని వాడి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. ఈ పిల్లలు చిన్నప్పుడు అన్నీ అమ్మకి నాన్నకి చెప్తారు, పెద్దయ్యాక ఎందుకు అంత దూరమైపోతారు..??

 


Tuesday, July 5, 2011

ప్రేమ ని వ్యక్తం చేస్తే తప్పు


ఇది నాకు ఈ మద్య జరిగిన అనుభవం, నాకే కాదు మనలో ఎందరికో జరిగే అనుభవం. ఉదయాన్నే 9 గంటలకి మహబూబ్ నగర్ లో మీటింగ్ అన్నారని ఎంత కష్టపడినా 7 కి ముందు ఎం.జి.బి.ఎస్ కి వెళ్ళలేకపోయా. డైరెక్ట్ గా టాక్సి బుక్ చేసుకోవచ్చు కాని మహబూబ్ నగర్ లో తిరిగేది ఏమీ లేదు కదా ఎందుకు వేస్ట్ అని నాన్-స్టాప్ కి వెళ్తాను మీటింగ్ టైములో. ల్యాప్టాప్, ఇంక ఏవో చెత్త పనికిమాలిన పేపర్లు, కనీసం ఒక నవల, డైరీ, ఇంకా నా లేడీ స్టఫ్ తో నా బ్యాక్ బ్యాగ్ ఒక మినీ సూపర్ మార్కెట్, అది కాక నా బరువు, ఇవన్నీ మోసుకుంటూ ఆటో దిగి వాడితో ఎప్పటిలాగే మీటరు మీద దిగేటప్పుడు తప్ప ముందు అడగని ఎక్స్ ట్రా డబ్బుల గురించి గొడవపడిన చిరాకు మూడ్ లో పరుగులాంటి నడకతో వెళ్ళి ఎవరినో ఆల్ మోస్ట్ గుద్దేసా. తీరా చూస్తే అది ఒక లవ్ జంట. వాళ్ళు నన్నే కాదు ఎవరినీ పట్టించుకునేలా లేరు. ఇద్దరు చేతులు పట్టుకొని నడుస్తూ నన్ను గుద్దేసారు. (ఇప్పుడు వాళ్ళ మీద నెపం తోసేయొచ్చు)...అయినా నేనే సారి చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళినా కూడా రెడీ గా వున్న బస్ మిస్ అయ్యాను. సరే నెక్స్ట్ బస్ కి క్యూలో టికెట్ తీసుకుందాము అని కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ రెండు లైన్లు(చిన్నవే) లేడీస్, జెంట్స్. అక్కడ నాముందు నిల్చున్న అమ్మాయి టికెట్ తీసే వుద్దేశం కంటే పక్క లైన్లో నిలబడిన తన భర్త అనుకుంటా అతనితో కళ్ళతో మాట్లాడుతుంది, కొత్త జంట లా వున్నరు. పక్క పక్క లైన్లు అయినా ఎదో ఒక నెపంతో చేతులు పట్టుకుంటున్నారు. నేను నవ్వు ఆపుకుంటూ వారికి కాస్త ప్రైవసీ ఇవ్వాలని ఎడంగా నిలబడి నా వంతు వచ్చాక టికెట్ తీసుకున్నాను.

ఇంక బస్ పాయింట్లో పెట్టే ప్రాసెస్ జరుగుతుంది అని అక్కడ చైర్స్ లో కూర్చున్నా. అక్కడ కూడా ఒక జంట. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఏదో మాట్లాడుకుంటున్నారు. నాకేందుకో ప్రపంచం అంతా ప్రేమ మయం అనిపించింది. వాళ్ళ పక్కన ఒక సీట్ వదిలేసి కూర్చున్నా. ఇంతలో ఒకామె వచ్చింది. నన్ను పక్కకి జరుగు అని చెప్పింది. నేను కాస్త సందేహించా నేను ఆ జంట కి దొరికిన చిన్న ప్రైవసీ లోకి వెళ్ళలా? అని. ఇంతలో ఆమే వాళ్ళని చూసి మీరు చేతులు పట్టుకోవాలంటే మీ ఇంటికెళ్ళి పట్టుకోండి పోయి అని వెళ్ళి పక్కన కూర్చుంది. ఆమే కూర్చుంటే పర్వాలేదు. కానీ ఆ మాటతో వాళ్ళు ఇద్దరి మొహం చిన్నబోయింది. అక్కడ నుండి లేచి వెళ్ళిపోయారు. నేను ఆమె వైపు చూశాను. ఆమె కి పెళ్ళి అయింది అనడానికి బయటకి కనిపించే అన్ని గుర్తులు వున్నాయి. "ఈమె వాళ్ళాయన చెయ్యి అయిన పట్టుకుందా ఎప్పుడైనా?" అని అనుమానం వచ్చింది. తనేదో ఘనకార్యం చేసినట్లు నాతో కూడా చెప్తుంది ఇలాంటి వాళ్ళని వదలకూడదు, ఈ కాలం పిల్లలు పాడైపోతున్నారు అని ఏదో గొణుక్కుంటూ వుంది.

ఇంతలో ఎవరో వేరే వాళ్ళు వచ్చారు. ఆమె 20 సంవత్సరాలుండొచ్చు మొహం లో లేతదనం పోనేలేదు, కాని చంకలో ఒక పాప, 8 నెలలుండొచ్చు కడుపులో ఇంకో పాప, ఇంకో చేతిలో ల్గేజీ బ్యాగు, ఆమె ముందు స్పీడ్ గా నడుస్తూ ఆమెని త్వరగా నడవనందుకు అరుస్తూ, చేతిలో సెల్ ఫోన్ తప్ప ఇంకే లగేజీ లేని ఆమె భర్త వచ్చారు. అతను బస్సు కనుక్కోడానికి అటు ఇటూ పరిగెడుతున్నాడు ఆమె కూడా ఒక గమ్యం లేకుండా అతని వెంట పరిగెడుతుంది.ఇదంతా మా ఎదురుగానే జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని వదిలేయొచ్చా?

ఇక్కడే కాదు మనదేశంలో పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ లవ్(పి.డి.ఎల్) అనేది మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ. అందులో ముంబై ఒక మొదటి స్థానం లో వుంటే, తమిళనాడు ఆఖరి స్థానంలో వుంది. మన ఆంద్రాలో ముఖ్యంగా హైదరాబాదులో చేతులుపట్టుకొని నడిచే జంటలు, బుజం మీద చేతులు వేసి నడిచే వాళ్ళు ఇలా కనిపిస్తారు. మన దేశంలో ఇది చాల తప్పు గా ఎందుకు భావిస్తారో నాకు అర్ధం కాదు. డీసెన్సీ అని చెప్పొచ్చు. కానీ పబ్లిక్ గా తాగి పడిపోవటం,గోడల మీద యూరిన్ చెయ్యటం, రోడ్ మీద ఉమ్మటం, ఆఫీస్ గోడల మీద ఉమ్మటం అన్నిటికంటే ఘోరం ఏంటంటే నడిరోడ్ మీద ఆడవాళ్ళని కొట్టడం, తిట్టడం ఇవన్నీ డీసెన్సీ నా? నా చిన్నప్పుడు మా వీదిలో రోజూ ఎవరో ఒకరు తాగి వచ్చి తన భార్యని రోడ్ మీదకి ఈడ్చుకొని వచ్చి కొట్టేవాళ్ళు. నేను పనిచేసిన ప్రతి పల్లెల్లో, ప్రతి ఊరిలో ఇలాంటివి కొన్ని వందలు వేలు రోజూ కనిపించే సంఘటనలు.

ద్వేషం, కోపం వ్యక్తం చెయ్యడాన్ని సహిస్తున్న మనం, ప్రేమ ని వ్యక్తం చేస్తే మాత్రం తప్పు పట్టడానికి రెడీ గా వుంటామా అనిపించింది. ప్రేమ వ్యక్తం చెయ్యటంలో వాళ్ళేమి హద్దులు దాటటం లేదే, మహా అయితే చేతులు పట్టుకుంటారు, దగ్గరగా కూర్చోవటం, నడవటం చేస్తారు పబ్లిక్ ప్లేస్ లలో. తల్లి దంద్రులు పిల్లలు ఎదురుగా గట్టిగా అరుచుకోవడానికి, తిట్టుకోవడానికి సందేహించరు కాని చేతులు పట్టుకోవడానికి, దగ్గరగా హగ్ చేసుకోవడానికి చాలా సందేహిస్తారు. దీని వల్ల పిల్లలేమి నేర్చుకుంటారు? ప్రేమ అనేది తప్పు పని, ఒకరినొకరు అవమానించుకోవడం అనేది చాలా సాదారణం అనే కదా?

అలా అని మరీ ఇండీసెంట్ గా బిహేవ్ చెసే వాళ్ళని సహించమని కాదు. అలాంటి వాళ్ళు నాకు ఎక్కడా పెడ్డగా కనిపించలేదు. బహుశా కొన్ని పేరుగాంచిన పార్కులు, ప్రదేశాలలో వుండొచ్చు.కాని నిజంగా ఇండీసెన్సీ కి, ప్రేమ ని వ్యక్తం చెయ్యడానికి తేదా మనకి తెలీదా?పబ్లిక్ అనే పదానికి కూడా అర్ధం మారిపోతుంది. మా మమ్మీ వాళ్ళ టైము లో నలుగురు కలిసి వుండే కుటుంబం లో స్వంత ఇళ్ళు కూడా పబ్లిక్ ప్లేసే అయ్యేది. కనీసం ఒకరితో ఒకరు పగటి పూట మాట్లాడుకున్న సంఘటనలు కూడా లేవేమో ఇంకా ముందు జెనరేషన్ లో. ఇప్పుడు వీధిలో, మాల్స్ లో, రోడ్ల పై ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యింది. ఇంకా ముందు జెనెరేషన్ కి ఈ నిర్వచనం కూడా మారుతుంది.

ప్రేమని వ్యక్తం చెయ్యటం ఎంతమాత్రం తప్పుకాదు, కొత్త జంటలు చూడండి ఎంత ఆనందంగా వుంటారు. కాని కొంతకాలానికి ప్రేమ తప్పు అన్నట్లు ఎందుకు వ్యక్తం చెయ్యరు? ఎంతమందిలో వున్నా కళ్ళతో మాట్లాడుకోగలగటం, ఏ క్షణం లో అయినా నీకు నేనున్నాను అని తెలియచెప్పగలిగే చిన్న స్పర్శ. మనిద్దరం ఎప్పటికీ ఒకటే అని చెప్పగలిగే బుజాలమీద ఒక చెయ్యి. మన ప్రేమ పదిలం అని చెప్పే దగ్గరతనం ఇవన్నీ తప్పా? ప్రేమ తప్పు ఐతె అది నాలుగు గోడల మద్య చెయ్యటం కూడా తప్పే. ఒప్పయితే ఎక్కడైనా ఒప్పే.

ప్రపంచమంతా ఇలా ప్రేమని పంచటం, వ్యక్తం చెయ్యటం నేర్పితే ఎంత బాగుంటుంది, పక్క వారిని ప్రేమించటం కూడా అలవాటవుతుంది. పక్కన ప్రయాణించినా, కూర్చున్నా, నిల్చున్నా కూడా ఆడ మగ కనీసం నవ్వుకోవటం కూడా తప్పు అని చూసే దుర్దశ ఇలాంటి ప్రేమ వ్యక్తీకరణ తప్పు అనే భావం నుండే వచ్చింది. ఎదురెదురుగా ఇద్దరు మగాళ్ళు లేదా ఆడాళ్ళు కూర్చుంటే నవ్వగలిగే మనం ఒక ఆడ, మగ కూర్చుంటే ఏదో ఘోరం జరిగిపోతుందేమో అన్నట్లు మొహాలు మాడ్చుకొని కూర్చుని, ఎవరేమనేసుకుంటారో అనో నీచమైన ఆలోచనలు మదిలో మొదలయిపోయే స్థితి లో వున్నాము.

ప్రేమ ని తప్పుగా కాక ఒక మంచి గా చూడగలిగే స్థితి ఎప్పుడొస్తుందో? నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, ఆరోజులు నాకిప్పటికీ గుర్తు ఎంత సంతోషమో మనసు నిండా, మా ఇద్దరికి ఖచ్చితంగా తెలుసు మేము కలిసి జీవిస్తామని, కానీ నలుగురిలో తన చెయ్యి పట్టుకొని నడవాలంటే భయం వేసేది. ఎందుకు? పోనీ పెళ్ళి కాలేదు అందుకు, సరే పెళ్ళయ్యాక రెడ్డి చెయ్యి పట్టుకునే రోడ్ మీద నడుస్తా అనుకునేదాన్ని. కాని ఇప్పుడు కూడా భయమే. ఇదెందుకు? ఇది నాకు వున్న జబ్బు, అంతే ప్రేమని వ్యక్తం చెయ్యలేకపోయే జబ్బు.
అది తప్పు అని అలోచిచే వాళ్ళందరు ఇలా నాలాగ జబ్బుతో ఎంతో సంతోషాన్ని మిస్ అవుతున్నారు.

Tuesday, June 28, 2011

ఇటువంటి ఒక ఆఫీసర్ మీ జీవితంలో ఎదురైతే ......


వెర్రోడి పెళ్ళాం ఊరందరికి వదిన అని సామెత. గవర్నమెంట్ వుద్యోగులు అంటే చాలు అందరూ తిట్టేస్తారు. కాని నిజానికి వాళ్ళకి చాలా పని వుంటుంది. నేను ఎక్కువగా చూసేది కలెక్టర్స్ ని, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, వివిధ డిపార్ట్ మెంట్ హెడ్స్ ని. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి వచ్చాక అనిపించింది, ఎందుకని కలెక్టర్ల గురించి ఒక పోస్ట్ రాయకూడదు అని. అక్కడికి నాకేదో వందలమంది కలెక్టర్లు తెలుసని కాదు. కాని తెలిసిన వారిలో కొందరి మీద కొన్ని అభిప్రాయాలు వున్నాయి. అవి మీతో పంచుకోవాలని ఈ పోస్ట్.

నేను వుద్యోగం జాయిన్ అయిన కొత్తలో నాకు తెలిసిన మొట్టమొదటి కలెక్టర్ గారు జవహర్ రెడ్డి గారు. కలెక్టర్ అంటే నాకు మొదట గుర్తొచ్చేది అతనే. నన్ను ఇంటర్వ్యూ చేసిన బోర్డ్ లో అతను కూడా వున్నారు, ఇంత స్మార్ట్ గా వున్నారు కదా ఒక ప్రశ్న అయిన అడుగుతారేమో అని ఎదురు చూశా, అతను అలా చూస్తునే వున్నారు కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు.పుట్టడమే కలెక్టర్ హోదాలో పుట్టారా అన్నట్లు వుంటారు. ఎంతో డిగ్నిఫైడ్ గా ఎక్కడా ఏమాటలో, భావంలో చూసినా ఒక డిగ్నిటీ కనిపిస్తుంది. అసలు అతను మాట్లాడుతుంటే అలాగే వినాలనిపించేది. నేనైతే అతన్ని అలా చూస్తూ నేను ఎందుకు కలెక్టర్ కాలేదా అని, అసలు ఐ.ఎ.ఎస్ అయితే అలాంటి డిగ్నిటీ వస్తుందేమో అనుకునేదాన్ని.

కాని ఆ అభిప్రాయం ఎక్కువ కాలం నిలబడలేదు. కొందరు ఐ.ఎ.ఎస్ లను చూసినతరువాత చదువు, పదవి, పొజిషన్ కాదు ఒక మనిషి ఏమి నేర్చుకున్నాడు అని కాదు నేర్చుకున్నదానిని ఎంత బాగా సంధర్భానికి అన్వయిస్తున్నాడు అనేదాన్ని బట్టి వుంటుంది. అందరు కలెక్టర్లు డైరెక్ట్ ఐ.ఎ.ఎస్ లు కాదు. కొందరు కర్ఫర్డ్. వాళ్ళల్లో కొందరికి వారు ఎక్కువకాలం పనిచేసిన డిపార్ట్మెంట్ వాసనలు ఎప్పటికి పోవు, కాని కొందరు అనుభవం తో వచ్చిన ఙ్ఞానం ఎలా అయినా గొప్పది అనిపించేలా వుంటారు.

జవహర్ రెడ్డి గారి తరువాత నాకు అంత బాగా నచ్చిన కలెక్టరు ప్రస్తుతం మా మెదక్ కలెక్టర్ సురేష్ కుమార్ గారు, తమిళాయన కాని ముద్దు ముద్దు గా అయినా చాల అనర్గళంగా తెలుగు మాట్లాడతారు. మాటల కంటే కూడా సమయం వేస్ట్ చెయ్యకుండా చాలా ఆర్గనైజ్డ్ గా పని చేస్తుంటారు. అసలు మెదక్ జిల్లా ఏదో అదృష్టం చేసుకుంది ప్రస్తుతం వున్న ఆఫీసర్లు అందరూ చాలా బాగా పనిచేస్తారు. మనం ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమీ పని చెయ్యరు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అనుకుంటాము. కాని ఎవరో కొందరు తప్ప అందరూ చాలా మంచి వాళ్ళు వుంటారు. (అటునుండి ఇటు కూడా అయ్యుండ వచ్చు) కాని ఎవరికైనా సరే వుదయం 6 నుండి రాత్రి కనీసం 10 వరకు తల తిప్పుకోడానికి వీలుకాని పని వుంటుంది. నేను ఎప్పుడైనా వుదయాన్నే 6, 7 కి కేంప్ ఆఫీస్ కి వెళ్ళినా, రాత్రి 10 కి అలా కలిసినా నాకు వాళ్ళని చూస్తే చాలా జాలి వేస్తుంది. వాళ్ళకంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వారి పేషిలో పని చేసే వారి మీద చాలా జాలి. ( మా ఇంట్లో వాళ్ళు నన్ను అచ్చేసి వదిలేశారనుకోండి).నా తరువాత ఇంకా వాళ్ళకి చాలా మందితో మాట్లాడాల్సిన వాళ్ళుంటారు. అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి, బుద్ధిగా రాసుకుంటారు, వింటారు, సలహాలిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్డర్స్ ఇస్తారు, ఇలా క్షణాలలో చాలా ప్రోసెస్ జరగాలి మెదడులో.

అసలు నాకు అందరికంటే ఇష్టం అయిన కలెక్టర్ ఎందరికో ఆదర్శం అయిన కలెక్టర్, ప్రస్తుతం ఎస్.ఇ.ఆర్.పి కి పి.డి అయిన రాజశేకర్ గారు. అతని పేరు చెప్తే తెలియని వాళ్ళు వుండరు. అంత మంచి పేరుంది. నేను అయితే అతనికి అదౄశ్య అభిమానిని. ఎందుకంటే ఎప్పుడు కలిసి పని చెయ్యలేదు, కనీసం చూడలేదు కాని అతనంటే చాలా చాలా ఇష్టం. నా దురదృస్టం నేను అతన్ని కనీసం చూడగలగటం ఎప్పుదు క్షణాల తేడాలో మిస్ అయిపోతాను. మొదట అతని గొప్పతనం విని పెద్ద అభిమాని అయిపోయాను. మొదటసారి 1999 లో అతన్ని కలిసే అవకాశం వచ్చింది నన్ను అనంతపూర్ ఎక్స్ పోజర్ కి పంపినప్పుడు ఆయన అక్కడ వెలుగు పి.డి. అక్కడ 3 రోజులున్నా అతని క్లాస్ కూడా వుంది మాకు కాని ఏదో అర్జెంట్ పని వుందని ఇంకో పెద్దాయనతో ఆ సెషన్ జరిపించారు. అయినా సరే అతన్ని చూడాల్సిందే అని నేను పట్టు బట్టి తరువాత రోజు వెళ్ళిపోయే ముందు ఆఫీస్ కి వెళ్ళాము. కాని మేము వెళ్ళేసరికి అతను లంచ్ కి వెళ్ళారంట (టైము సాయంత్రం 4) ఇక మాకు టైము లేకపోయింది. తరువాత మళ్ళీ అతన్ని కలిసే అవకాశం 2004 లో వచ్చింది, అప్పుడు అతను నెల్లూరు కలెక్టర్. సునామీ ప్రాజెక్ట్ లో నాకు నెల్లూరు పోస్టింగ్. మా కేర్ వాళ్ళందరు అతనితో కలిసి సర్వే కూడా చేశారు. ఇక నేను కలిసి పని చెయ్యబోతున్నా అనుకుని సంతోషించా. కాని నేను జాయిన్ అయిన రెండ్రోజులకి అతను రిలీవ్ అయిపోయారు. కనీసం చూడలేకపోయా. మొన్న పని కట్టుకొని హైదరబాదు లో ఎస్.ఇ.ఆర్.పి ఆఫీస్ కి అతన్ని కలవాలని వెళ్ళాను. వేరే పనులు కూడా వున్నాయిలెండి. ఆరోజు సార్ కేంప్ కి వెళ్ళారు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ విషయం తెలిసిన చాలా మంది నన్ను ఎగతాళి కూడా చేస్తుంటారు. నేను అడుగుపెడితే రాజశేకర్ గారికి ట్రాన్స్ఫర్ అని.జీవితంలో ఒకసారన్నా కలిసి........ఏమి చెప్పాలి? ఏమో నాకు ఒక ప్లాన్ అని ఏమీ లేదు. కొందరు ప్రమోషన్లు మీద మినిష్టర్స్ కి సెక్రటరీ గా వెళ్ళిపోతారు, వారికి ఇన్ ఫ్లుఎన్స్ వుంటుంది కాని పనిలో ఏమాత్రం సంతృప్తి వుంటుందని ఈ సారి అడిగి చూస్తా కన్నబాబు గారిని, అమరేంద్ర గారిని.

నేను చెప్పేది ఏంటి అంటే ఒక్క కలెక్టర్లే కాదు చాలా మంది ముఖ్యమైన పొజిషన్లో వున్న ఎందరో గొప్ప వ్యక్తులున్నారు. మా అదిలాబాద్ జె.సి స్యామ్యూల్ ఆనంద్ గారు, మొదట అతన్ని కలిసి మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుతుంటే అతను చేతులతో మొహం తుడుచుకుంటూ, కళ్ళు మూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఆడుకుంటుంటూ వుంటారు.కోపం తో మనం బయటికి వచ్చిన తరువాత గేట్ దాటేలోపల మన పని మొదలయిపోతుంది. అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు. మనిషిని చూసి అపార్ధం చేసుకోకూడదు అని అతని పని చూస్తే తెలుస్తుంది.ఇక విజయకుమార్ గారు, గిరిజా శంకర్ గారు వంటి వాళ్ళతో ఒకసారి పరిచయం వారి పని తీరు చూశాక ఆ జాబ్ వదిలేసినా, ఎక్కడికెళ్ళినా ఆ బంధం కొనసాగుతుంది. కొందరు కొత్త ఐ.ఎ.ఎస్. టాపర్స్ ముత్యాల రాజు లాంటి వారు వుంటారు వాళ్ళకి కొంత కాలం అయ్యే వరకు ఒక స్టైల్ అంటూ రాదు.కొంత డక్కాముక్కీలు తిన్నాక వారిదంటూ ఒక ప్రత్యేక స్టైల్ వస్తుంది,నేను మొదట్లో చూసిన సంజయ్ జాజు గారికీ ఇప్పటి కీ చాలా తేడా వచ్చింది.

నాకేమనిపిస్తుందంటే కాస్త యంగ్ గా వున్న ఆఫీసర్స్ ని వుంచాలి. కాస్త ఏజ్ అయిన తరువాత పెద్దగా నిర్ణయాలు స్పీడ్ అవసరం లేని పదవుల్లో వెయ్యాలి. 90% మందికి కొంత వయసొచ్చక స్పీడ్ తగ్గి పోతుంది, అది మెచ్యూరిటీ అనుకోవాలేమో!. కాని కొందరికి అసలు పనిలో ఎప్పటికీ వయసవ్వదేమో!!వుదాహరణకి ప్రస్తుతం ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.(ఉపాది హామీ పధకం) డైరెక్టర్ మురళి గారు. అతను రోబో లాగా పని చేస్తుంటారు. నిజంగా అతని నడక, ఆఫీసులో లేదా మీటింగ్స్ లో అతని పని తీరు, మాట తీరు 10 సంవత్సరాలుగా కొంత కూడా స్పీడ్ తగ్గటం చూడలేదు. అసలు చాలా మంది పని తీరు ఎంత ఆర్గనైజ్డ్ గా వుంటుందో అసలు. నేను ఎవరిదగ్గరికైనా వెళ్ళే ముందు కొంత హోంవర్క్ చేస్తా, ఏమి విషయాలు మాట్లాడాలని పాయింట్స్ రాసుకోవటం, ఏది ముందు చెప్పాలి, ఏ విషయం కాస్త తరువాత చెప్పాలి వంటివి ముందే అనుకొని వెళ్తాను. కాని కొందరు నాకంటే బుద్ధిమంతులుంటారు. నాకున్న మతిమరుపుకి లేదా ఓవర్ కాంఫిడెన్స్ కి ఒక్కో సారి ఏదైనా మర్చిపోయానో అప్పుడే అది అడుగుతారు. చాలా వరకు మనతో మాట్లాడుతూ నోట్స్ రాసుకుంటారు, కొందరైతే పోయినసారి రాసుకున్న పేజ్ కరెక్ట్ గా తీసి ప్రస్తుతం స్టేటస్ గురించి ఆ సంబందించిన అఫీషియల్స్ ని అడుగుతారు. చాలా నిర్ణయాలు వెంటనే తీసుకుంటారు.

అందరు మంచి వాళ్ళే అని పొగిడేస్తుంది...ఈమె మరీ ఓవర్ అనుకుంటున్నారా. అసలు వేరే రకం వాళ్ళని చూడలేదా ఆఫీసర్లలో అంటే చూశాను. కాని నాకు చెడు గుర్తుచేసుకోవటం కూడా ఇష్టం వుండదు. వ్యవస్థ లో లోపాలు అందరూ ఎలాగు చూస్తున్నారు. ఇలా కష్టపడి పనిచేసేవాళ్ళు, గొప్ప వ్యక్తిత్వం వున్న వారి గురించి మాట్లాడుకుంటే మంచిది, వాళ్ళ దగ్గర్ నేర్చుకోడానికి వుంటుంది, వారితో పని చేస్తే ఎంతో తృప్తి వుంటుంది.

రెండో రకం కూడా వున్నారు. విపరీతమైన బ్యూరోక్రసీ, ఆధిపత్యం చూపించుకోవటం, వచ్చిన వారి తో మర్యాద లేకుండా ప్రవర్తించడం, ఫైల్స్ మొహం మీద విసిరి కొట్టడం, తన క్రింద స్థాయి వాల్ల మీద అరవటం, పర్సనల్ గా నిందించటం,వ్యవస్థని తిట్టుకోవటం, అన్ని విషయాలలో తప్పులు వెతకడం, అనవసరమైన విషయాల పై శ్రద్ధ అసలు పని పక్కన పెట్టి నాయకుల వెంట మంచి పేరు కోసం ప్రమోషన్ల కోసం తిరిగుతూ పని ఎగ్గొట్టే వాళ్ళు, ఉద్యోగంలో స్థాయి పెరిగినా మెచ్యూరిటీ రాని వాళ్ళు.....ఇలా చాల పెద్ద లిస్ట్ వుంది. కాని అది అనవసరం.అనవసరం అంటే వాళ్ళగురించి చాలా అందరికీ తెలుసు. కాని ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళని చూస్తే అసలు వీరి గురించి ఎవరూ మాట్లాడరేంటి అనిపిస్తుంది. తినడానికి, నిద్రకి, సెలవులకి మనకి ఎన్నో సదుపాయాలుంటాయి. కాని వీరికి జీవితంలో టైము అన్నదే వుండదు, చేసే వాళ్ళకి గవర్నమెంటు లో చాలా చాలా పని వుంది. మన అందరికంటే మన ప్రభుత్వం పని ఎక్కువ, ప్రభుత్వం యొక్క అవుట్ రీచ్ ఎక్కువ. ప్రభావం ఎక్కువ.......సమస్యలు కూడా ఎక్కువే. పని చెయ్యని వాల్లకు అవకాశాలు ఎక్కువ, పని చేసే వాళ్ళకి పని, అడ్డంకులు చాలా ఎక్కువ.

ఇటువంటి ఒక ఆఫీసర్ మీ జీవితంలో ఎదురైతే తప్పక అభినందించండి.నేను ఒక పోస్ట్ లో రాసినట్లు బాస్ హ్యాండ్సం అని వారి పని వల్లనే అనిపిస్తుంది. హార్డ్ వర్కర్స్, స్మార్ట్ వర్కర్స్ ఇలా ఎందరో మహానుభావులు.....అందరికీ వందనాలు. మీరు పడుతున్న శ్రమ వల్లనే మాకు ఎన్నో పనులు జరుగుతున్నాయి.జీవితంలో ఒక్క మనిషికైనా ఉపయోగపడగలిగే తృప్తి వర్ణించలేనిది అటువంటిది మీ వుద్యోగం మీకిచ్చిన అవకాశం. ధన్యం ఆ జీవితం.

Friday, June 24, 2011

ఎందుకిలా అవుతుంది? నాకేమైంది?




నాగార్జున సాగర్ చూశానోచ్. మన నెహ్రు గారి పుణ్యం, ఎందరో వ్యక్తుల శ్రమ, మన దేశానికే గర్వకారణం అయిన బహుళార్ద సార్ధక ప్రాజెక్టు చూశాను. ఈ మద్య రెండ్రోజులు మాకు అక్కడే మీటింగ్ అయింది. సరే అంత పెద్ద డ్యాం దగ్గర ఏమి చూశావు అని మాత్రం అడకండి ఎందుకంటే అందులో పెద్దగా నీళ్ళు లేవు. సో బహుళార్ధం సార్ధకం అంతా సగం సగం పని చేస్తుంది. కాకపోతే కృష్ణ అంటే నలుపు అని చెప్పినట్లు నల్లటి కృష్ణ లో కాసేపు జలకాలాడాము, నీటి ప్రవాహంలో నున్నగా మారిన రాళ్ళు ఏరుకొని ఇంటికి మోసుకొని వచ్చాను. ఇప్పుడవి ఏమి చెయ్యాలో తెలియక అలా వుంచాను. ఏదో ఒక రోజు మా ఇల్లు మ్యూజియం వాళ్ళకి గిఫ్ట్ గా ఇచేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఎక్కడెక్కడనుండో తెచిన గవ్వలు, ఆల్చిప్పలు, రాళ్ళు, రప్పలు వున్నాయి.

సరే ఇక అసలు విషయానికి వస్తాను, అసలేమి జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి....ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే...నేను బ్లాగ్ లోకాన్ని సందర్శించి చాలా నెలలైంది. టైము వుంది కాని, ఏంటో ఎందుకు రాయలేకపోతున్నానో అర్ధం కావటం లేదు. ఎందుకు రాయలేకపోతున్నాను అని చెప్తూ రాయడానికి కొన్ని సార్లు ప్రయత్నించాను. కుదరలేదు. మీరే చెప్పండి నేను ఎందుకు రాయలేకపోతున్నాను?

నా పరిస్థితి, ఇంతకు ముందు నా ప్రపంచం, ఇప్పుడు పరిస్థితి ఇవన్నీ చూసి చెప్పండి. నేను ఏమి చేస్తె రాయగలను? ఏ పరిస్థితులవల్ల రాయలేకపోతున్నాను అని.

లేదా ఏదైన టాపిక్ రాద్దాము అంటే ఏమి రాయాలి తెలియటం లేదు. పిచ్చి పిచ్చి పిచ్చిగా....పిచ్చెక్కినట్లుంది.

మీకు ఎప్పుడైన ఇలాంటి పరిస్థితి వచ్చిందా? వస్తే ఏమి చేశారు? అవును మరి నువ్వు రాయకపోతే లోకానికి కనీసం మాకేమైనా నష్టమా అని అడగకండి...నేను నాకోసమే రాస్తుంటాను. రాయటంలో మనసులో భావాలు బయటకి వచ్చి, భావాలు అక్షరాలుగా ఘల్లు ఘల్లు మని నాట్యం చేస్తున్నట్లు, మల్లెలుగా రాసులు పోగైనట్లు, ఒక చక్కని తృప్తి వస్తుంది. ఇప్పుడు ఆ తృప్తి లేదు. కీ బోర్డ్ మీద చెయ్యి అలా ఆగిపోతుంది. మనసు ఆలోచనలు, భావాలు రాక, రాయలేక బాధపడుతుంది. ఎందుకిలా అవుతుంది? నాకేమైంది? (నీకు పిచ్చి పట్టింది, నువ్వు ప్రేమలో పడ్డావు లాంటి ఆన్సర్స్ ఇవ్వొద్దు ప్లీస్)

మీకు నేను రాసిన పోస్ట్లు ఏవైనా నచ్చితే....నిజంగ చెప్పండి, నేను ఎందుకు రాయలేకపోతున్నాను, ఎటువంటి ఆలొచనలు చేస్తె రాయగలుగుతాను. హైదరాబాదు వచ్చి, కొత్త జాబ్ లో జాయిన్ అయిన నుండి రాయలేకపోతున్న. నేను ఏమి చెయ్యలి?(జాబ్ మానేయ్, హైదరబాద్ వదిలేయాలి అంతేనా? అది కాదు కాని ఇంకో మాట చెప్పండి) మనసులో సౌకుమార్యం, స్పందన లేనితనం నాకెందుకు వచ్చింది? నేను బండలా ఎందుకు మారిపోతున్నాను?అంటే రాయలేని వాళ్ళందరూ బండలా అని కాదు, ఎవరి భావ వ్యక్తీకరణ కొసం వాళ్ళు చేసే పని వాళ్ళు చెయ్యలేకపోవటం వాళ్ళలో ఆ సున్నితత్వం పోవటం వల్ల జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది అని నా ఫ్రశ్న?

తిండి,నిద్ర, పని షాపింఘ్ అన్నీ చెయ్యగలుగుతున్నాను. కాని మనసు లో సంతోషం లేదు. ఏ పని కూడా మనసుని తాకటం లేదు. నేను చేస్తున్న జాబ్ లో ప్రయాణాలు ఎక్కువ. మెదక్, మెహబూబ్ నగర్, అదిలాబాద్ జిల్లాలు తిరుగుతున్నాను. అక్కడ పనిలో ప్రకృతిలో కూడా సంతోషం లేదు. జీవం లేనట్లున్న మైళ్ళు కొలది రహదారిపొడుగునా వున్న ప్రదేశాలు,తెల్లగా దుమ్ము తో ఎండ వేడితో తేమ లేని గాలి మనసు లో తడి కూడా ఆరిపోయేలా చేస్తుందా? కలిసిన ప్రతి కుటుంబంలో వున్న కన్నీరు కాని, ఏమీ మార్చలేని వారి జీవితాలాలో బాధ కూడా కరిగించలేని ఈ ఖటినత్వం నాకెందుకొస్తుంది? మనిషి సంతోషంలోనే రాయగలడా? బాధ కూడా రాస్తాము కదా.......కాని మనసు కి బాధ కలిగినా రాయాలేకపోతున్న ఈ పరిస్థితి కి కారణం ఏమై వుంటుంది? మీకు ఏమైన అర్ధం అవుతుందా? ఐతె చెప్పరూ..........


Saturday, April 2, 2011

మీరెంతవరకు హెచ్.ఐ.వి నుండి రక్షణ పొందారు???


చాలా రోజుల తరువాత ఎందుకు బ్లాగ్ రాశాను అని ఆలోచించాను. బహుశా నేను సంతోషం గా వున్నప్పుడే రాయగలుగుతాను అని అనిపించింది. కొత్త ఉద్యోగం లో చేరాక చాలా విషయాలు వున్నాయి.కాని సంతోషం కలిగించేవి ఏవీ లేవు. అన్నీ మనసు ని కలిచివేస్తున్న విషయాలు. అందుకే రాయలేకపోతున్నాను.

హెచ్.ఐ.వి తో బాధ పడుతున్న లేదా, ఆ వ్యాధి వల్ల ప్రభావానికి గురి అయిన కుటుంబాలతో పని చేస్తున్నాము. ముఖ్యంగా పిల్లలు వున్న కుటుంబాలతో మా ప్రాజెక్ట్ లో పని చేస్తాము. ఒక్కో కుటుంబానికి వెళ్తుంటే పాపం తెలియని ఆ పిల్లలు హెచ్.ఐ.వి బాధితులంటే మనసులు కలిచివేసినట్లవుతుంది. చిన్న పిల్లలు ఇంక లోకం కూడా తెలియని పిల్లల దగ్గర నుండి జీవితం మీద ఆశలు పెంచుకునే టీనేజ్ పిల్లల వరకు వున్నారు.

90% తండ్రి ద్వార కుటుంబంలోకి ఈ జబ్బు వస్తుంది మామూలు కుటుంబాలలో. 18 సంవత్సరాలకి పెళ్ళి అయి, 20 కి భర్త పోయి, హెచ్.ఐ.వి వచ్చేసి, ఇంట్లో వాళ్ళు బయటకి తరిమేస్తే వ్యాది సోకిన తను, తన చిన్నారి బిడ్డతో రోడ్ మీద పడిన ఎందరో ఆడవాళ్ళు. ఇక వారు బ్రతకడానికి దారి ఏది? అమ్మ నాన్న  చనిపోతే అనాధగా బ్రతకడం లేదా తాత గారింట్లో బ్రతకడం కూడా కష్టమే అలాంటిది వారు ఎయిడ్స్ తో చనిపోతే? చేరదీయాల్సిన వాళ్ళు కూడా చేరదీయకపోతే? ఎయిడ్స్ అంటే ఏమిటో తెలీకపోయినా, ఆ వ్యాధి చిన్నప్పుడే వాళ్ళకి తల్లిదండ్రులనుండి వారసత్వంగా వచ్చేస్తే? తన చర్మం ఎందుకు అలా వుందో, తనెందుకు ఎప్పుడూ జబ్బులు పడుతున్నానో తెలీక, అందరు తనని ఎందుకు నీచంగా చూస్తున్నారో తెలీక ఆ పిల్లల కళ్ళల్లో కనిపించే అయోమయం చాలా బాధ కలుగుతుంది.

ఎయిడ్స్ బయట నుండి చూస్తే ఒక ఆరోగ్య సమస్య, లేదా నీతి సంబందించిన సమస్య అనుకుంటాము. కాని అది అంతకు మించి ఎంతో.....ప్రకృతి ని శాసించే స్టేజ్ కి వచ్చాము అనుకునే మనకి, దేనికైన పరిష్కారం కనుక్కోగలమనుకునే మన శాస్త్ర విగ్ఞనానికి ఈ పిల్లల్ని చూస్తె సిగ్గు చేటు. హెచ్.ఐ.వి వచ్చినా సి.డి.4 కౌంట్ ఎక్కువ వుండి నిరోధక శక్తి బాగుంటే పర్వాలేదు. కానీ సి.డి.4 తగ్గిపోయాక ఒకసారి ఎ.ఆర్.టి మందులు వాడటం మొదలు పెట్టాక ఇక జీవితాంతం అవి వాడాలి. పిల్లల్లో కనుక ఎ.ఆర్.టి మందులు మొదలయిపోతే అవి 15 సంవత్సరాలు వరకే మొదటి లైన్ మందులు పనిచేస్తాయి. ఒక సారి రెండవ లైను మందులు మొదలైపోతే మహా అయితే 8 సంవత్సరాలు... చిన్నప్పుడే ఎ.ఆర్.టి మొదలైన పిల్లలికి,కరెక్ట్ గా టీన్ ఏజ్ కి వచ్చేసరికి ఇక జీవితం వుండదు. ఆ పిల్లల్ని చూస్తే నాకు ఏమి చెప్పాలో అర్ధం కాదు. కానీ ఒకటి నిజం. వ్యాధి వున్నా లేకపోయినా మనందరి మనసులు ఒకటే, మనందరి ఆశలు ఒకటే. నవ్వుతూ మాట్లాడితే సంతోషిస్తారు. వ్యాధి గురించి మాట్లాడితే.............చావు గురించి , సమాజం చూసే చూపు గురించి మాట్లాడితే.......

హెచ్.ఐ.వి లోతులు ఇంకా నాకు పూర్తిగా తెలీదు. ఒక్కొక్కరితో మాట్లాడితే ఒక్కో విషయం తెలుస్తుంది. కాని ఎంతమంది కి ఇవన్నీ తెలుసు? కౌన్సిలింగ్ ఇస్తున్నారు కాని ఎంతవరకు బయట విన్న అపోహలు నిజాలు కలిసిపోతున్నాయి అని తెలీదు. నేను హెల్త్ సైడ్ పని చెయ్యట్లేదు. కేవలం హెచ్. ఐ. వి కి గురి అయిన లేదా ప్రభావితమైన వారికి జీవనాధారం కల్పించే టాస్క్ నాది. కానీ కొంత వరకు తెలుసుకుంటున్నా.

మొన్న ఒకరోజు లత (పేరు మార్చేశాను), పాజిటివ్ నెట్ వర్క్ (హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరిది నెట్వర్క్) మెంబర్, నేను కలిసి చాలా సేపు కలక్టర్ ఆఫీస్ దగ్గర ఎదురుచూస్తూ కూర్చున్నాము. ఆ జిల్లా కలెక్టర్ కి ఎప్పటికీ మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడే సమయం దొరకటం లేదో, లేక పాజిటివ్ వాళ్ళంటే వున్న చిన్న చూపో కాని అంత సమయం తీసుకుంటున్నారు. లత కి నీరసం వస్తుంది. సరే అని నేను వుంటున్న హొటెల్ రూం కి తీసుకెళ్ళాను. కాసేపు ఫ్రెష్ అయ్యాక వెళ్ళొచ్చని. లత కి 25 సంవత్సరాలు. పాజిటివ్, ఒక కొడుకు 7 సంవత్సరాలు, 18 కి పెళ్ళి అయ్యింది, 20 కి విడో అయ్యింది, కనీసం భర్త శవాన్ని కూడా ఇంటికి రానీయలేదు స్వంత తల్లిదండ్రులు, అత్త మామలు. లత ఒంటరిగా బ్రతుకుతుంది. నెట్ వర్క్ లో చిన్న ఉద్యోగం, అప్పుడే ఎ.ఆర్.టి వాడుతుంది. తను చనిపోతే కొడుకేమి కావాలి? నేను అడిగాను ఎందుకు మంచిగా ఆహారం తీసుకుని వుంటే నీకు సి.డి.4 బాగుండేది కదా ఎ.ఆర్.టి కి అప్పుడే ఎలా వచ్చావు అని?, బార్యా భర్తలిద్దరికి హెచ్.ఐ.వి వుండి వాళ్ళిద్దారు కండోం లేకుండా సెక్స్ లో పాల్గుంటే, వైరస్ పెరిగిపోతుందని, ఇద్దరిలో ఒకరు ఎ.ఆర్.టి మందులు వాడుతుంటే రెండవ వారికి కూడా ఆ మందుల కు రెసిస్టెన్స్ వచ్చేసి సెకండ్ లైన్ మందులకు డైరెక్ట్ గా వెళ్ళాలని , తన భర్త ఎప్పుడు కండోం వాడలేదని చెప్పింది. హెచ్.ఐ.వి వచ్చక అసలెందుకు కలిశారు అని అదిగాను, అదేంటండి మా వయసెంత? మాకు కోరికలుండవా అని అడిగింది. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియక వ్యాది తీవ్రత పెంచేసుకున్నాము అని చెప్పింది. నిజమే మనందరికి హెచ్.ఐ.వి గురించి, దాని బారిన పడ్డవారి గురించి చాలా తక్కువ తెలుసు.

ఎ.ఆర్.టి మందులు చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. యాంటీ బయటిక్ ఎప్పుడో జ్వరమొచ్చినప్పుడు తక్కువ పవర్ ది వేసుకుంటేనె తిండి సహించక, వికారం వచ్చేసి నానా రకాలు అయిపోతుంది. అలాంటిది రోజూ హై డోస్ ఏంటీబయటిక్ వాడితే వారి పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. సరిగా తినలేరు, వాంతులు, కళ్ళు తిరగటం, కాంబినేషన్ మార్చినప్పుడు కొందరికి పెరాలసిస్ కూడా వచ్చేస్తుంది, చర్మ వ్యాధులు, చర్మం నల్లగా మాడినట్లు అవ్వటం, మెడ వెనుక మూపురం లా రావటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో వస్తుంటాయి.

ఒక వైపు శరీరం తో పోరాటం, ఒకవైపు సమాజంతో పోరాటం, ఒకవైపు చావమని చెప్పే మనసుతో పోరాటం....

ఒక్కొక్కరిని కదిపితే అంతులేని వేదన, మనిషి ఎంతో సాధించాము అంటాడు కదా మరి ఇదేంటి మన తోటి వారు నరకం చూస్తుంటే ఏమీ చెయ్యలేకపోతున్నాము? ఇంత ప్రాణాంతకమైన జబ్బులు ఇలా ఆకలి, దాహం,నిద్ర, సెక్స్ కోరిక వంటి సహజమైన అవసరాలు ద్వారా వస్తే ఎంత కష్టం (ఇక్కడ నేను నీతులు, సామాజిక కట్టుబాట్లు ఆలోచించటంలేదు, ఎందుకంటే ఈ కట్టుబాట్లు జంతువులకు లేవు కాని మనుషులకున్నాయి, కాని ఇలాంటి జబ్బులు మాత్రం మన్షులకే వున్నాయి) మనం ప్రకృతి సహజత్వం నుండి చాలా దూరం వచ్చేసామా??? మనకి మనమే నీతులు కట్టుబాట్లు, సౌకర్యాలు సంరక్షణలు ఏర్పాటు చేసుకొని, మనమే సహజమైన ప్రేమ, భంధాలు, సహజమైన కట్టుబాట్లు దాటి ఈ అసహజ సామాజీకీకరణ వల్ల ఇవన్నిటి బారిన పడుతున్నామా అనిపిస్తుంది .ఇటువంటి అలోచన మనకి జీవితంలో ఎన్నో సంధభాలలో కలుగుతుంది. అసలు మనిషి ఎందుకు ఈ సమాజికీకరణ చెందాడు అని(ముక్ఖ్యంగా ఆఫీసు లో చికాకొచ్చినప్పుడు, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు, నిద్రొస్తున్నా పనిచెయ్యల్సి వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇలా, హాయిగా ఆ పూట తిండి మాత్రం సంపాదించి నిద్రపోయే జంతువులను చూస్తే, టెన్షన్ లేని వాటి జీవితాన్ని చూస్తే, మెరిసిపోయే వాటి ఆరోగ్యమైన చర్మాన్ని చూస్తే ఈర్ష్య కలుగుతుంది.

మరి మనం అందరం ఏమి చేస్తున్నాము మన తోటి వారు ఇలాంటి వ్యాధికి గురవుతుంటే? ఇక్కడ కుటుంబాలు చూస్తే వారేదో అంగారక గ్రహం నుండి రాలేదు, మనలాంటి మామూలు కుటుంబాలు, ముందు రోజు వరకు సంతోషంగా జీవితం మీద ఆశతో, సమాజం లో గౌరవంగా బ్రతుకుతున్న వారే. దాని బారిన పడే పరిస్థితి వస్తుందని వారు కూడా ఊహించరు. మనం, మన కుటుంబాలు, స్నేహితులు, పిల్లలు ఈ వ్యాది రాకుండా ఎంతవరకు అరికడుతున్నాము, మన పిల్లల్ని ఎంతవరకు ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము? తల్లి దండ్రులు చూసి చేసిన పెళ్ళిల్లే, కాని అప్పటికే హెచ్.ఐ.వి వుంటే వారికి తెలుసుకునే అవకాశం వుందా? ఒక వేళ వ్యాదికి గురి అయితే కూడా జీవిత కాలం పొడిగించుకుని ఆరోగ్యంగా జీవించే అవకాశం ఎంతమందికి కల్పిస్తున్నాము? తోటి మానవులుగా, కుటుంబ సభ్యులిగా, స్నేహితులుగా, అద్యాపకులిగా, డాక్టర్లుగా, బాధ్యత కలిగిన స్థానాలలో వుండి మనం ఎంతవరకు మన పాత్ర నిర్వహిస్తున్నాము?ఎంతవరకు హెచ్.ఐ.వి. కి గురైన వారికి బ్రతికే ధైర్యాన్ని ఇస్తున్నాము?

పెద్ద పెద్ద చదువులు చదివి, వుద్యోగాలలో వుంటూ...ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలియకుండా వుండే వారి వల్ల ఈ కుటుంబాలు మానసికంగా కూడా బ్రతికే శక్తి కోల్పోతున్నాయి అని కళ్ళారా చూస్తుంటే...ఇంకా ఇలాంటి ఎన్ని విషయాలు నాకు ఇంకా తెలియకుండా వున్నాయా అని భయం వేస్తుంది.

Friday, March 25, 2011

మీ బాస్ హ్యాండ్సమా?? కాదా?


హాండ్సం బాస్ వుండటం ఎంతవరకు వుపయోగమో నాకు తెలీదు కానీ, నేను గమనించలేదు కాని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నాకు ఇప్పటివరకు వున్న బాస్ లలో ముగ్గురు తప్ప అందరు హండ్సం బాస్ లే. నేను వాళ్ళ పనినే చూశాను కాని వాళ్ళు హాండ్సం గా వున్నారా అని పాపం అసలు పట్టించుకోలేదు. కాని మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయాక షాపింగ్ వెల్దామని అక్కడే వుంటున్న నా కాలేజి ఫ్రెండ్ ని హొటెల్ దగ్గరికి వచ్చి పిక్ అప్ చేసుకోమని చెప్పాను. తన పేరు రాధిక.

విజయవాడ లో మా ఆఫీసు వాళ్ళు ఏదో ఒక పనికిమాలిన మీటింగ్ పెట్టారు రెండ్రోజులు. పగలంతా వాయించేశారు. ఇక సరే హాయిగా సాయంత్రం రిలాక్స్ అవుదామంటే మా బాస్ ఎక్కడ మళ్ళీ ఇంటర్నల్ టీం మీటింగ్ అంటాడో అని అతనేదో పనిలో బిజీ గా వున్నప్పుడు చూసి, ప్రీతం నేను సాయంత్రం బయటకి వెళ్తున్నా మనకేమీ వేరే మీటింగ్ లేదు కదా అని అడిగాను. "హ హా నో శిరీష  యు కెన్ గో అబ్సు ల్యూట్లేఅ నో ప్రాబ్లెం" అని హామీ ఇచ్చేశాడు. హమ్మయ్య అని నా ఫ్రెండ్ కి అర్జెంట్ గా కార్ తీసుకొని వచ్చెయ్ అని చెప్పేసా. తను కూడా మళ్ళీ నా మనసెక్కడ మారిపోతుందో అని( పాపం పూర్వానుభవం) వెంటనే వచ్చేసి రిసెప్షన్ లో వెయిట్ చేస్తూ కూర్చుంది. నేను మీటింగ్ అవ్వగానే, స్కూల్ పిల్లలు బడి గంట కొట్టగానే పరిగెత్తినట్లు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే మా ఇతర జిల్లాల స్టాఫ్,  కొలీగ్స్ ఓయ్ ఎక్కడికి పారిపోతున్నవ్ చాలా రోజులకు కలిశావు పద మన బాసులని తిట్టుకుందాం ప్రశాంతం గా నీ రూం లో అన్నారు. వాళ్ళకి నచ్చజెప్పి, షాపింగ్ అయ్యాక డిన్నర్ చేసి బలంగా తిట్టుకుందాం అని బరోసా ఇచ్చి రిసెప్షన్ దగ్గరకి వచ్చేసరికి రాధ ఎదురుచూస్తు కూర్చుని వుంది. తన దగ్గరకి వచ్చెలోపల నా టీం మెంబర్ దగ్గర నుండి కాల్ వచ్చింది ప్రీతం అర్జెంట్ గా ఇంటర్నల్ మీటింగ్ పెట్టాలన్నారు, మీ రూం లో పెడదామా, నా రూం లోనా అని. ఇదేంటి సడన్ గా అని నేను హోటల్ వదిలి చాలా టైం అయింది, నేను లేను, నా రూము లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసా. కానీ తీరా చూస్తే ఎదురుగా ప్రీతం వస్తూ కనిపిస్తున్నాడు. నన్ను చూస్తే మళ్ళీ దొరికిపోతా అని నా ఫ్రెండ్ కి చిన్న సైగ చేసి పక్కకి తప్పుకున్నా. రాధ నా సైగలు చూసి ఎవరి దగ్గర దాక్కుంటున్నానా అని చూసి ప్రీతం ని చూసింది.

తరువాత ఇద్దరం బయటకొచ్చేసాము. తన కార్ లో కూర్చున్నాక అడిగింది ఎందుకు దాక్కున్నావు అని. నేనేమి దాక్కోలేదు. మా బాస్ మళ్ళీ సడన్ గా మీటింగ్ అన్నారు, నేను హొటెల్ లో లేనని నీకోసం అబద్దం చెప్పాను కాని బాస్ ఎదురుగ వస్తుంటే, నన్ను చూస్తే నేను మీటింగ్ వెళ్ళిపోవాలి, పాపం నువ్వు బాధపడతావని అలా మానేజ్ చేసా అని చెప్పాను. అవునా ఐతే ఓ.కె. అని బయలుదేరాము. కాసేపాగి మీ బాస్ భలే హ్యాండ్సం గా వున్నాడు, యంగ్ షారుఖ్ ఖాన్ లాగా అని చెప్పింది. అదిగో అప్పటి నుండి ఆలోచిస్తున్నా. నాకు ప్రీతం లో షారుఖ్ ఖాన్ కనిపించలేదేంటబ్బా అని. అసలు ప్రీతం హ్యాండ్సం ఆ? ప్రీతం కంటే కూడా హ్యాండ్సం బాస్ లు ఇంతకు ముందు కూడా వున్నారు,కానీ నాకెప్పుడు ఎందుకు బాస్ హ్యాండ్సం గా అనిపించడు అని. అసలు బాసు లు ఎక్కడైనా హ్యాండ్సం గా వుంటారా? ఈ రాధ కి ఏమీ తెలీదు పిచ్చి ముఖం ది.

బాస్ అంటే ఎప్పుడు కనిపించేది ఒక్కటే పని రాక్షషుడా, టార్గెట్ రాక్షషుడా, టైము రాక్షషుడా, డిసిప్లిన్ రాక్షషుడా ఇలా ఆలోచనలే వస్తాయి. అసలు నాకు తెలిసి బాసులు రెండు రకాలు. మంచి బాసు, చెడ్డ బాసు. అది ఆడ అయినా మగ అయినా. నాకు ఇంతవరకు ఆడ బాసు రాలేదు. ఒకసారి వున్నా నేను తనకి డైరెక్ట్ రిపోర్టింగ్ కాదు కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది మా ఇద్దరికి. ఇక మిగిలిన వాళ్ళందరు గవర్నమెంట్ లో వున్నంత కాలం పి.డి లు, ఐ.ఎ.ఎస్ లు. వాళ్ళెప్పుడు హడావిడి గా టెన్షన్ గా వుంటారు. ఏ మినిస్టర్ కో, ఏ కలక్టర్ కో వీళ్ళతో పడదు సో నేను కూడా నా బాసు శత్రువులని నా శత్రువుగా భావించి వాళ్ళు పెట్టే సమస్యలని తప్పించుకోవటం ఎలా, టార్గెట్లు రీచ్ అవ్వటం ఎలా, ప్రొగ్రాం లో ఏ మాట పడకుండా మేమంతా బయట పడటం ఎలా అని సతమతం అవుతుండటం తో సరిపోయేది. ఈ గొడవలో బాస్ హ్యాండ్సం అవునా కాదా ఎవరికి పడుతుంది. మంచి వాడా కాదా, ఇతను చేసే పనులు ప్రజలకి వుపయోగమా కాదా అని ఆలోచన వస్తుంది.పని ఎప్పటికీ తెమలదు. అంత పని వుంటుంది.

ఇక ఎన్.జి.ఓ లో ఇక్కడ పని కంటే పద్ధతులు, ప్రొసీజర్ లు ఎక్కువ. చేసే పని టార్గెట్లు తక్కువే కాని లోతెక్కువ.అందరికి స్వేచ్చ ఎక్కువ కాబట్టి ఒక పని చెయ్యలంటే వంద మంది వంద రకాల తప్పులు చూపిస్తారు,వంద ఆలోచనలు వంద దారులు చూపిస్తారు. ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో అసలు చెయ్యాలో వద్దో అని సతమతం అవుతుంటాము. ప్రతీ ఒక్కరు చెప్పే దానిలో ఒక అర్ధం వుంటుంది. ఎంతో లెర్నింగ్ వుంటుంది. తక్కువ డబ్బు ని ఎంత బాగా ఎక్కువమందికి తక్కువ క్రిటిసిజం తో వుపయోగించాలో అని తల పగలగొట్టుకోవాలి. ఈ ప్రాసెస్ లో బాస్ హ్యాండ్సం అయితే ఎంత కాకపోతే ఎంత. విపరీతమైన టూరింగ్, ఇంటికి వస్తే బ్యాగు లో మాసిన బట్టలు తీసి మంచి బట్టలు పెట్టుకునే టైము మాత్రమే వుంటుంటే, మొగుడు, పిల్లలు, ఇల్లు, కాయగూరలు, పప్పు వుప్పు, పనమ్మాయి, పిల్లాడి పరీక్షలు వీటికే సమయం దొరకట్లేదు ఇక బాస్ హ్యాండ్సం గా ఎలా కనిపిస్తాడు. అతని ఫోన్ వస్తుంటే హమ్మో ఇంకేమి కొత్త పని వచ్చిందో లేక సమస్య వచ్చిందో అనే ఆలోచన మాత్రమే వస్తుంది.

ఇవి కాక మా పని లో ఎంతో స్త్రగుల్. కొన్ని కుటుంబాలలో జీవితాలలో కొంతైన సమస్యలు తీర్చగలిగితే చాలు అనిపించె వుద్యోగాలు. కాని ప్రొసీజర్లు పద్దతులు బ్యూరోక్రసీ మన మనసులో సున్నితత్వాన్ని నలిపేస్తుంటాయి. ఆ సమయంలో ప్రజల ప్రయోజనం కోసం పోరాడే బాసే హ్యండ్సం గా కనిపిస్తాడు. అది కూడా.. ఆ పని, ఆ ప్రజలు మన వాళ్ళు అని ఫీల్ అవుతున్న కొలదీ, బాసు, వుద్యోగులు కలిసి ఆ పని మనది అనుకున్నప్పుడు ఒక రకమైన "మన ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక అందం ఒక అంశమే కాదు" మన అమ్మ, నాన్న మనకి అందం గా కనిపించరా? అలాగే మన టీం అనుకుంటే వారిలో బలం, బలహీనత మనదే, వారి అందం మన పనికి, విజయానికి, అపజయానికి ఎటువంటి వుపయోగం లేదు, అవసరం లేదు.

నాకు తెలిసి వుద్యోగం లో, పనిలో విపరీతమైన ఒత్తిడిలో ఏదో చెయ్యలనే తపనలో నలిగి పోతున్న వాళ్ళందరికీ మన పనిలో పరిచయాలు కేవలం ఒక సబ్జెక్ట్ గా మాత్రమె కనిపిస్తాయి అనుకుంటా. నాకు తెలిసి ఎవరైన  నా బాసుల గురించి చెప్పమంటే మొదటి బాసు...గిరిజనుల కోసం వారి ప్రాచీన సంస్కృతి కోసం తపన పడే పెద్దాయన గౌతం శంకర్, నేను ఎప్పటికైన అతని లా ఒక కాజ్ కోసం జీవితం అంకితం చెయ్యగలనా అనిపిస్తుంది. రెండవ బాస్ గిరిజా శంకర్....నడుస్తున్న ఆరాటం, తన పరిధిలో తనకి వీలయ్యేంత మార్పు తీసుకురావాలనుకునే తపన తో బొంగరంలా పరిగెడుతుండే మనిషి. ఇక ఆ తరువాత కూడా కొందరు మంచి బాసులు, ఏదో లే టైము గడిచిపోతే చాలు అనుకునే వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, వున్న పదవిని దుర్వినియోగం చేసిన వాళ్ళు, విపరీతంగా పని చేసే వాళ్ళు, రాత్రి పగలు మరిచి పని చేస్తున్నా పక్క వారి గురించి పట్టించుకునే వాళ్ళు, ఆఫీస్ అటెండర్ ఇంట్లో అవసరాలని కూడా కనిపెట్టి కనుక్కునే వాళ్ళు, తను టెన్షన్ పడుతూ అందరిని టెన్షన్ పెట్టి మనశ్శాంతి లేకుండా చేసే వాళ్ళు, ఎంత పెద్ద సమస్య అయినా, టెన్షన్ అయినా తనే తీసుకొని మనకి మార్గం చూపించి పని జరిపించే వాళ్ళు, తన టీం మీద విపరీతమైన మమకారం వున్న వాళ్ళు, తన టీం ని బయపెట్టి పని జరిగేలా చేసుకొని పదోన్నతి పొందటమే జీవితాశయం అయిన వాళ్ళు, ప్రజల కి, తన టీం కి అండగా నిలబడి వారి మీద నమ్మకమే తన మేనేజ్మెంట్ తరహా గా చూపించే వాళ్ళు


ఇలా ఎంతో మంది బాసులు. విపరీతమైన మంచి చూశాను, విపరీతమైన చెడు చూశాను. కానీ ఎవరూ కూడా (జీవితంలో ఏ మనిషి కూడా) అన్ని విషయాలలో చెడు కాదు, అన్నివిషయాలలో మంచి కాదు. అందరికీ మంచి వారు కాదు, అలా అని అందరికి చెడ్డవారు కాదు. ఎన్నో రకాల అందాలు, వికారాలు చూసాను. యె బాస్ హ్యాండ్సం అంటే ఏమి చెప్పాలి. ఒక్కో బాస్ లో ఒక్కో అందం. ప్రతీ బాసు కి ఇంకో అందమైనా లేద వికారమైన బాసు వుంటారు.

అసలు విషయం మరిచిపోయా...బాసులని తిట్టుకోవటం అనేది మన జన్మ హక్కు. అంతే కాని ప్రీతం మంచివాడని తిట్టుకోవటం మాత్రం మానేయం. మరి మీ బాస్ హ్యాండ్సమా?? కాదా?

Monday, November 29, 2010

తూ.గో.జి. వారికి ఒక విఙ్ఞప్తి

తూర్పు గోదావరి జిల్లా బ్లాగర్స్ కి ఒక విఙ్ఞప్తి, నేను ఒక క్విజ్ కార్యక్రమం చేయబోతున్నాను. అందులో తూర్పు గోదావరి కి సంబంధించి కొన్ని ప్రశ్నలు సమాధానాలు కావాలి. నాకంటే మీ జిల్లాకి సంబంధించిన సమాచారం మీ అందరి దగ్గర బాగా వుంటుంది. కాబట్టి దయచేసి తూర్పు గోదావరి జిల్లాకి సంబందించి ఏవైనా ప్రశ్నలు వుంటే రేపు ఎల్లుండిలోపల నాకు పంపండి. మరీ కష్టమైనవి కాకుండా మరీ అందరికీ తెలిసేవి కాకుండా వుంటే బాగుంటాయి.

మీ సహాయానికి కృతఙ్ఞతలు.

Tuesday, November 23, 2010

రక్త చరిత్ర.2....ఎవరికి వుపయోగం!!

ఏ సంఘటన వల్ల ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అసలు ఊహించలేము. కానీ ఆవేశం తో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం ఎప్పుడూ విపరీతాలే జరుగుతాయి. సమరసిం హారెడ్డీ అనే పోస్ట్ లో సరదాగా ప్రస్తావించాను రెడ్డి లవ్ స్టోరీ అని. కానీ నిజానికి అంత సరదాగా ఆకధలు ముగియలేదు. అనసూయమ్మ, మా ఊరి ఫ్యాక్షన్ లీడర్ బార్య, ఆమెకి స్వంతంగా పిల్లలు లేరు కాని ఆమె తన మేనల్లుడు గౌరు వెంకట్రెడ్డి ని దత్తత తీసుకుంది అంటున్నారు కాని ఈ ఊరి గొడవల్లో డైరెక్టుగా గౌరు వెంకట రెడ్డికి, గౌరు చరితకి మాత్రం సంబంధం వుంది అనేది అక్కడి పసిపిల్లలికి కూడా తెలిసిన నిజం అయినా కూడా వాళ్ళు ముగ్గురు బయట ఎందుకున్నారో, ఏ సంబంధం లేని వాళ్ళు జైలు లో ఎందుకున్నారో మాత్రం ఎవరికీ అర్ధం కాని విషయం.
ఇక అనసూయమ్మ భర్త కి ఒక అన్న వున్నాడు అతను కాస్త మెతక మనిషి కావటం, అతనికి ముగ్గురు ఆడపిల్లలు కావటం, మగపిల్లాడు అందరికంటే చిన్నవాడు కావటం వల్ల అతను ఈ గొడవల్లో పెద్దగా తలదూర్చలేదు. కాని ఆ కుటుంబంలో వుండటం వల్ల వారి పిల్లల జీవితాలు కూడా తారుమారు అయిపోయాయి. అతని పెద్ద కూతురుకి అప్పటికే పెళ్ళి అయి భర్త కర్నూలు లో లాయర్ గా పనిచేస్తున్నాడు. కాని అతని మీద కేసు వేసారు. అంతే కాదు ప్రాణ భయం కూడా ఇక చేసేది లేక అతను కూడా ఈ గొడవల్లోకి రావలసి వచ్చింది. ఇక రెండో అమ్మాయి...అపర్ణ. అందమైన, సున్నితమైన అమ్మాయి. వెంకటేశ్వర రెడ్డి ( నా రెడ్డి ) తో తనకి పెళ్ళి అనే అందరు చెప్పటం, రెడ్డీ కూడా తన చుట్టూ తిరగటం చూసి, జీవితాన్ని అందంగా ఊహించుకొని కాలం గడుపుతుంది. కాని అనుకోని విధంగా ఈ ఫ్యాక్షన్, చిన్నాన్న చనిపోవటం, స్వంత బంధువులే చంపటం, అక్క భర్త జైలు కి వెళ్ళటం, తమ ఇంట్లో అందరికీ అకస్మాత్తుగా ప్రాణ భయం రావటం ....తన జీవితాన్ని ఎంత గా తలకిందులు చేస్తాయో అపర్ణ ఊహించలేకపోయింది. మహా అయితే తన పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది అని, లేదా రెడ్డీ తో పెళ్ళి అయ్యాక రెడ్డి కూడా కేసుల్లో పడాల్సి వస్తుంది అని ఊహించింది. కానీ....
రెడ్డి వాళ్ళ అమ్మ, అంటే మా అత్తమ్మ తన కొడుకు మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. ( అదేంటో రాయలసీమ లో కొడుకొక్కడే తమకి పుట్టిన బిడ్డ అని కూతుర్లు మాకేమీ కాదనే వుద్దేశ్యంతో వుంటారనిపిస్తుంది.ఒక్కొక్కరి ఇంట్లో తమ కూతుర్లకు వాళ్ళు చేసేది చూస్తే నాకు ఇలా అనిపించింది. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించినా పైగా కట్నాలివ్వాలి అని వాళ్ళేదో పరాయివాళ్ళన్నట్లు మాట్లాడుతుంటారు, మా వాడికేమైనా ఐతే ఇక మేమెందుకు బతకాలి అని, మా మనవడున్నాడు వాని తరువాతే మీరు అని ఇలా అన్నిట్లో కూతురిని, కూతురి పిల్లల్ని వేరు చేసి ఎదురుగానే మాట్లాడుతారు, ఆ సమయంలో మా ఆడబిడ్డల్ని చూస్తే నాకు ఏడుపొస్తుంది, కాని వాళ్ళకి కూడా అది అలవాటేమో పెద్దగా ఫీల్ అవ్వరు) ఇటువంటి పరిస్థితి వున్నప్పుడు ఎవరు కోరి అటువంటి పరిస్థితుల్లోకి కొడుకు ప్రాణాలు పణంగా పెడతారు? అందుకే ఎట్టి పరిస్థితిలో అపర్ణని చేసుకోవద్దు అని మా అత్తయ్య ఒట్టు పెట్టించేసుకున్నారు. రెడ్డి కాని, అపర్ణ కాని ఎవరూ ఏమి చెయ్యలేని పరిస్థితి ఊర్లో వున్న పరిస్థితి.ఆ సమయంలో ఎందరి పెళ్ళిళ్లో తప్పి పోయాయి, ఎన్నో కధలు గుండెల్లో మిగిలిపోయాయి, వీళ్ళిద్దరు ఎదురుపడి ఎప్పుడూ మాట్లడుకోలేదు, ఏదో తెలియని నమ్మకం మాత్రమే ఒకరికొకరం అని , పెద్దలు కూడా పక్కాగా అడగటం జరగలేదు,ఖాయం చేసుకున్నది లేదు. కాదు అని చెప్పుకున్నది లేదు. కాని అందరి వుద్దేశ్యాలు అందరికి అర్ధం అయ్యాయి. రెడ్డిని హైదెరాబాదు చదువుకోసమని పంపేసారు (ముఖ్యంగా ఈ గొడవల్లో ఎక్కడ ఇరుక్కుంటాడో అని ) రెడ్డి బాధతో నలిగిపోయినా ఏమీ చెయ్యలేని వయసు.
కాని అపర్ణ వాళ్ళ పెద్దలు కాస్త ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు కాదంటే మా అమ్మాయికి పెళ్ళే కాదా, అతి త్వరలో గొప్ప ఆస్టిపరుడుని తెచ్చి చేస్తాము అని శపదం చేసి మరీ ఒక డబ్బున్న పెద్దమనిషికి ఇచ్చి అర్జెంటుగా పెళ్ళి చేశారు. అతను నిజంగా పెద్ద మనిషే, వయసులో, అన్ని రకాల వ్యసనాలలో, ఆస్థిలో అన్నిట్లో పెద్ద వాడే. సీమ పల్లెల్లో వున్న (నాకు ఎదురైన) ఇంకో బయంకరమైన ఆలోచన ఇది. పొలం, ఆస్తి వుంటే చాలు పిల్లని ఇచ్చేస్తారు. తాగుడు, ఇతర వ్యసనాలు వున్నాయని తెలిసినా అది ఒక విషయం అని ఎవరు కనీసం మాట్లాడరు. తాగితే తప్పా, తిరిగితే తప్పా, ఆస్తి వుంది కదా అని చూస్తారు. అమ్మాయికి ఇష్టమా అని కూడా అడగరు అనుకుంటా. అలా అపర్ణ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి రోజు రెడ్డి పడిన నరకం తను నాతో చెప్పినప్పుడు ఎప్పుడు చూడని కన్నీరు తన కళ్ళల్లో కొంచెం మెరిసి మాయమయ్యినప్పుడు అర్ధం అయింది. అపర్ణ పెళ్ళి రోజు ఏ పని లేకపోయిన నంద్యాల వెళ్ళి, పెళ్ళి జరిగే కళ్యాణ మండపం రోడ్డులో అటు ఇటు తిరిగాడంట, ఏ కారణం చేత ఐనా పెళ్ళి ఆగిపోతుందేమో అని, ఎవరో దూరపు బంధుత్వాన్ని సాకుగా చెప్పి వాళ్ళింటికి వెళ్ళి పెళ్ళి అయిపోయిందా, అపర్ణ బాగానే వుందా అని అనవసరమైన మాటలాడి, మళ్ళీ తనే తన తెలివితక్కువ తనానికి సిగ్గుపడి వచ్చేసాడంట. ఆ చిన్న వయసులో ఏమీ చెయ్యలేకపోయినా ప్రేమ మాత్రం ఎంతో స్వచ్ఛంగా వుంటుంది. కాని పరిస్థితులు ఎప్పుడు స్వచ్చంగా కలిగే ప్రేమ కి వ్యతిరేకంగానే వుంటాయేమో ! లేక దొరకదు అని తెలిసినప్పుడే ప్రేమ తీవ్రంగా వుంటుందా? ఏమో...!!!!
అపర్ణ కి పెళ్ళి అయినదగ్గర నుండి జీవితం నరకం అయిపోయింది. చిన్న వయసు, హాయిగా కలలు కంటున్న లోకం లో నుండి భయంకరమైన వాస్తవంలోకి దారుణంగా వచ్చి పడింది. అపర్ణ భర్త వ్యసనపరుడే కాదు, శాడిస్ట్ అని చెప్తారు. దానికి సాక్ష్యం ఆమె వంటి నిండా వున్న దెబ్బలు, సిగరెట్ తో కాల్చిన గుర్తులు. అతనికి చాల మంది తో అక్రమ సంబంధాలు, తాగుడు, శాడిజం... ఇవి కాక అపర్ణ ని ఎప్పుడూ ఇంటికి పంపేవాడు కాదు. ఒక వేళ పంపినా సాయంత్రానికి తిరిగి రావలసిందే. ఆమె పడే నరకం ఊర్లో అందరికీ అర్ధం అయేంతగా వుండేది. ఎన్ని కష్టాలో పడింది గొప్ప ఇల్లాలు అని పొగుడుతుంటారు ఆమె కష్టాలు తప్పించాలని ఆలోచన చెయ్యలేని ఈ మూర్ఖులు. ఇక ఆమె శరీరం తట్టుకో లేకపోయింది. మంచం పట్టింది. అప్పటికి ఆమె తల్లిదండ్రులకి కరుణ కలిగింది. అపర్ణని తమ ఇంటికి తీసుకొచ్చేశారు. కాని అపర్ణ ఎవరితో మాట్లాడటం మానేసింది. తనని తాను ఒక గదిలో బంధించుకుంది.  అపర్ణ కి ఒక బాబు పుట్టాడు, కొన్నాళ్ళకి ఆమె భర్త ఎయిడ్స్ వ్యాదితో మరణించాడు. ఆఖరి రోజుల్లో అపర్ణని చూడాలని తపించాడు. కాని అప్పటికే అపర్ణ ఈలోకంతో అన్ని సంబంధాలు తెంచుకొని తన గదిలో బంధీ అయిపోయింది, బాబు కూడా చనిపోయాడు, అపర్ణ కి కూడా ఎయిడ్స్ సోకిందని పరీక్షల ద్వారా తెలిసింది. అపర్ణ మరీ క్రుంగిపోయింది. వెలుగు కూడా భరించలేనంత చీకటిలో వుండిపోయింది. తను ఆ విధంగా ఒక డిప్రెషన్లో వుందని తెలిసి కూడా ఆమెకి అవసరమైన వైద్యం చేయించలేదు.
అపర్ణ జీవితం ఇలా వుంటే రెడ్డి ఈ లోగా చదువు పూర్తయ్యి, మొదట UNDP  ప్రాజెక్టులో తరువాత వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తూ శ్రికాకుళం, వజ్రపు కొత్తూరు వచ్చాడు. రెడ్డీ ఎప్పుడూ మౌనంగా, అందరికీ దూరంగా వుండేవాడు. కాని తన టీం లో వున్న నేను, శ్రీను విపరీతమైన అల్లరి చేస్తూ జీవితం అంటే సంతోషమే అన్నట్లు వుండే వాళ్ళం. మేము పెరిగిన పరిస్థితుల్లో మాకు అంత తీవ్రమైన కష్టాలు లేవు. పరిస్థితులు ఒకే లా పుట్టిన పిల్లల్ని ఎలా మారుస్తాయో ఆ తేడా నన్ను, రెడ్డిని చూస్తే తెలుస్తుంది. శ్రీను కి పేదరికం, తల్లి చనిపోవటం వంటివి కష్టాలున్నా తనెప్పుడూ నవ్వుల బ్రహ్మానందం లా అందరిని నవ్విస్తూ వుంటాడు. మా ఇద్దరి స్నేహం, ఆటలు, నవ్వులు చూసి రెడ్డిలో కూడా చలనం వచ్చింది. (ఆ కధ అంతా నా ముందు పోస్ట్ లలో రాశాను కదా) కొన్నాళ్ళకు మాతో పాటు కలిసిపోయాడు. వాళ్ళ ఊరికధలు చెప్పాడు, కాని నేను వాటి తీవ్రత అర్ధం చేసుకోలేదు నిజంగా. వాటి ప్రభావం నా జీవితం మీద పెద్దగా లేదు కూడా. రెడ్డి ని నేను పెళ్ళి చేసుకొని ఆ ఊరెళ్ళాక నాకు ఆ ఊర్లో చూడాలనిపించింది, కలవాలనిపించింది కూడా అపర్ణ నే. ఆ ఊర్లో మగ పిల్లలందరూ జైలులో వున్నప్పుడు మా ఇంట్లో పెళ్ళి జరగటం బహుశా చాలా మందికి బాధ కలిగించి వుండొచ్చు. చాలా తిట్టుకున్నారని కూడా చెప్పారు అత్తయ్య. ఇవన్నీ నాకు తెలీదు. నేను ఎవరితో నవ్వుతూ మాట్లాడాలని చూసినా అందరూ నాతో కాస్త దూరం గానే వుండే వాళ్ళు అనిపించేది ఆ ఊర్లో, దగ్గరి బంధువులు తప్ప. కానీ అక్కడి ఎస్.సి కాలనీ లో మహిళలు మాత్రం నాకు ముందుగా తెలుసు. కారణం కర్నూలు జిల్లా నుండి వెలుగు ప్రాజెక్టు కమ్యూనిటీ రెసోర్స్ పర్సన్స్ గా అక్కడి చుట్టుపక్కల పల్లెల్లో ఎస్.సి మహిళలు శ్రికాకుళం వచ్చినప్పుడు నాకు పరిచయం. వాళ్ళు మాత్రం నన్ను కలిసేందుకు మేడం, మా మేడం అని నేను వెళ్ళినప్పుడంతా వస్తారు.
మా పెళ్ళి తరువాత నేను మా అత్తగాఇంటికి వెళ్ళి నప్పుడు రెడ్డీ ని ఎన్నో సార్లు అడిగాను అపర్ణ ని కలవాలి అని, అత్తయ్యని కూడా, అపర్ణ ఎవరినీ కలవదు, ఆమెకి ఎయిడ్స్ అని చెప్పారు. కాని మా మిద్దెమీదకి వాళ్ల మిద్దె, తను వుండే గది కిటికీ కనిపించేవి. నేను పైకెళితే నాకెప్పుడూ అపర్ణ రెడ్డి మీద కోపంతో ఆ గదిలో తనని శిక్షించుకుంటుంది అనిపించేది. రెడ్డీ కి చెప్తే నువ్వంత ఆలోచించకు అనేవాడు. ఎన్నోసార్లు ఎవరికీ తెలీకుండా అయినా వెళ్ళి తనని కలవాలనిపించేది. తనని ఆ పరిస్థితిలో వదిలేసింది రెడ్డీ అనిపించేది, నా బాద్యతే తనని బయటకి తీసుకు రావటం అనిపించేది. మా పెళ్ళి అయిన సంవత్సరం లోపలే అపర్ణ చనిపోయింది. ఆ రోజు రెడ్డి బాధపడ్డాడో లేదో నాకు తెలీదు కాని నాకు చాలా బాధ వేసింది. రెడ్డి కొంచెం ధైర్యం చేసి వుంటే అపర్ణ ఈ రోజు నా స్థానం లో వుండేది, కనీసం ఇలా దారుణమైన జీవితం అనుభవించి చనిపోయేది కాదు అని రెడ్డి తో అనేశాను. నాకు ఆమెని తలుచుకున్నప్పుడంతా ఎంతో బాధ కలుగుతుంది.

ఫ్యాక్షన్ వల్ల ఒక తరం అంతా ప్రభావితమవుతుంది. పిల్లలికి చదువులుండవు, చిన్న పిల్లలు పనిచెయ్యాల్సి వస్తుంది. ఆడపిల్లలికి కనీసం మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళి చెయ్యలేరు. మగ పిల్లలికి కూడా. హత్యల తరువాత ఊర్లో వాతావరణం నరకం అయిపోతుంది. ఏ క్షణంలో ఎవరు ఎవరిని చంపుతారో, ఎవరింటికి, పొలానికి నిప్పంటిస్తారో అని భయంతో బ్రతకాలి. నిన్నటివరకు అత్తా, మావా, బావ అని వరసలు పెట్టి పిలుచుకుని, ప్రతీ అవసరానికి తోడుగా వున్న వాళ్ళు ఈరోజు ఉద్వేగంతో యమకింకరులై మనమీద కొడవలి ఎత్తి నరకడానికి, నిప్పు పెట్టి మనల్ని తగలబెట్టడానికి వస్తారు. ఇది అదుపులో పెట్టడానికి పోలీసులు మోహరించి కర్ఫ్యూ విదిస్తే అది ఇంకో నరకం, అందరూ ఊరు వదిలి, పశువులను , పొలాలను వదిలి ఎక్కడో దూరంగా బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళలేని వాళ్ళు పోలీసులు చూపించే నరకం అనుభవిస్తూ, ప్రాణాలు, వారికున్న కోడి, మేక ఆస్థులు కాపాడుకోడానికి నానా అవస్థలు పడ్డారని అత్తయ్య చెప్తారు. ఊరి మొత్తానికి అత్తయ్య ఒక్కరే ఆడ మనిషి ఆ సమయంలో వున్నారంట. నా తప్పు లేకుండా మేమెందుకు భయపడాలి అని వున్నారంట. ఇంట్లో ముసలి వాళ్ళు, ఆడపిల్లల్ని తీసుకొని ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి ఆమెది.  ఇక ఇది ఇలా వుంటే జైలు కి వెళ్ళని వారంటూ ఆ ఊర్లో మిగలలేదు. ముసలి, పిల్లా అని తేడా లేకుండా అందరిని పోలీసులు పట్టుకెళ్ళారు. విచారణ పేరుతో వారాల పాటు, భయం వల్ల నెలలు పాటు ఊరొదిలి ఎక్కడెక్కడో తిరిగారు, దాక్కున్నారు మగవాళ్ళంతా.

కేసుల్లో జైలుకెళ్ళిన వారి కుటుంబాల అవస్థలు ఇప్పటికీ తీరలేదు. ప్రతి అవసరానికి జైలులో వున్న వాళ్ళని బెయిలు మీద ఇంటికి తేవాలంటే ఎంతో డబ్బు కావాలి. సంపాదించే మనిషి లేక ఆడవారి మీద కుటుంబం మొత్తం భారం పడుతుంది. ఊర్లో వాళ్ళు తమ ఆస్తులు పొలాలు కబ్జా చెయ్యకుండా చూసుకోవాలని కూడా ఆడవాళ్ళు భయపడాలి. వయసులో వున్న ఆడవాళ్ళు భర్త లేక, భవిష్యత్తు ఏంటో తెలియక రకరకాల సమస్యలు, కుటుంబ ఆసరా కొసం అక్రమ సంబంధాలు, ఇలా....చెప్పుకుంటూ పోతే ఒక తరం లో ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు, పిల్లలు అందరూ ఎన్నో అవస్థలు పడతారు. కొందరి జీవితాలు నరక ప్రాయం అయిపోతాయి అపర్ణ లా, వసంత, రవి  ల లా ( బి.ఇ.డి లవర్స్)
కానీ ఈ స్థితి కి కారణమైన కుటుంబాలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదుగుతూ బాగానే వున్నారు. మంచో చెడో పేరు బాగా సంపాదిస్తున్నారు. అలా అని వారి జీవితాలు అంత గొప్పగా లేవు. అపర్ణ ఆ ఇంట్లో అమ్మాయే. అనసూయమ్మ పగ, ప్రతీకారాలతో కేసులతో అడవులలో తిరిగింది కొన్నాళ్ళు.
మరి దీనికి పరిష్కారం ఏంటి అని చాలా మంది అడిగారు. నేను ఒక ముక్కలో చెప్పే పరిష్కారం ఏమీ లేదు. కానీ నా అనుభవం ప్రకారం సీమ లో పేదరికం ఎక్కువ, వర్షాధార పంటలవల్ల అయివుండొచ్చు. ఎక్కువ నిరక్షరాస్యత. ఆడపిల్లలికి చదువు ఇంకా తక్కువే. నిరక్షరాస్యత వల్ల నే ఎన్నో మూఢాచారాలు, కోపం, మూర్ఖత్వం. అందరూ చదువుకొని, ఆడ మగ బేధం తగ్గించుకొని, కాస్త ఆలోచన పెంచుకోవటం మంచిది. వారిని వాడుకొని ఈ పెద్దలు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోగలిగితే వాళ్ళే బయట పడగలరు.అది ఒకసారిగా జరగదు. కొన్ని తరాలు మారాలి. హింస కి హింసే జవాబు కూడా కాదు అనే ఆలోచన వస్తే ఒక హత్య తో ఆగిపోయేది ఇన్ని జీవితాలు నాశనం అయ్యేవి కాదు. మన చరిత్ర రక్త చరిత్ర అయితే ఆ రక్తం ఎవరిది? కేవలం ఆ ఒక్క కుటుంబానిదేనా? అందరి రక్తాలు చిందించిన ఆ చరిత్ర ఎవరికి వుపయోగం!!ఎంతో భవిష్యత్తు వున్న వారి జీవితాలు అర్ధాంతరంగా చరిత్రలయిపోడానికా?

Thursday, November 18, 2010

మా ఊరి రక్త చరిత్ర - ఫ్యాక్షన్ అసలు కధ

 (సమర సిం హా రెడ్డి తరువాత భాగం)
ఫ్యాక్షన్... ఇలాంటి ఒక పదం వుంది అనికూడా నాకు తెలియదు. నా పెళ్ళి వెంకటేశ్వర రెడ్డీ తో జరిగిన వరకు. జీవితంలో కొన్ని ఎందుకు జరుగుతాయో అసలు అర్ధం కాదు. నేనెక్కడో విజయనగరం జిల్లాలో ఒక చిన్న టౌన్ లో పుట్టి పెరిగాను, నా ఊహలు మహా అయితే వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు వుండేవేమో నా భవిష్యత్ గురించి. కానీ ఏదో సినిమా కధలా గా రక రకాల మలుపులు తిరిగి నేను రెడ్డీ ని పెళ్ళి చేసుకున్నాను. ఆ గ్రామంలో ఇంట్లో నాకు అన్నీ కొత్తగా అనిపించాయి. మన దేశంలోనే వున్నా అది ఒక పరాయి లోకం లా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ, మన బాషే అయినా ఒక్క ముక్క కూడా అర్ధమై చచ్చేది కాదు పెళ్ళి అయిన కొత్తలో. ఇప్పుడు కాస్త నయం. వాళ్ళు తినే తిండి, మెసిలే పద్ధతి, ఇళ్ళు, వంట, నిద్ర అన్నీ ప్రతీది కొత్త. పెళ్ళైన రోజే ఆ ఊరు చూడడానికే వింతగా వుంది. అన్నీ మట్టి మిద్దెలు. ఒకరి మిద్దె మీద మొదలుపెడితే వీధి చివర కి మిద్దెల మీద రోడ్ లాగా నడుచుకొని పోవచ్చు. ఇళ్ళు బండలతో పలకలతో కట్టుకుంటారు, దేవాలయానికి వున్నట్లు పెద్ద పెద్ద తలుపులు, గుమ్మాలు. అన్నిటికంటే వింత ఇంట్లోనే పశువులు కూడా కడతారు. మనుషులు పశువులు కలిపి ఒకే ఇంట్లో వుండటం అనేది వాళ్ళు చెప్పే గొప్ప రీజన్స్ ఎలా వున్నా నాకు మాత్రం కష్టమే. దోమలు ఈగల్లా ముసురుతుంటాయి దాని వల్ల. ఈగలు కూడా ఎక్కువే. నాకోసమని పెళ్ళి కి బాత్రూం, లెట్రిన్ కట్టించారంట మా ఇంట్లో. సాధారణంగా పల్లెల్లో ఇది చాలా ఇళ్ళల్లో వుండే సమస్యనే. కాకపోతే బాత్రూం లో ఎవరివో బాంబులు దాచిపెట్టడం మాత్రం సాధారణం కాదు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ ఊరి ఫ్యాక్షన్ కధ మా అత్తయ్య ద్వార, మిగిలిన వాళ్ళ ద్వారా వింటుంటే తెలుసుకుంటుంటే నేను సినిమాల్లో చూసిన బాలకృష్ణ, చిరంజీవి కధలు కాదు అని అర్ధం అయింది.అక్కడ ప్రతీ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జైల్లో వున్నారు. మొదటగా వెకటేశ్వర రెడ్డి (ఇతను ఫ్యాక్షన్ ఒక వైపు లీడర్) ని చంపిన తరువాత అతని భార్య అప్పటి నుండి ఒక పెద్ద ముఠా ని ఇంట్లోనే వుంచి వాళ్ళకి తిండి, బాంబుల తయారి, హత్యల ప్లానింగ్ లాంటి వాటికోసం వాడుకుంది. వీళ్ళందరి ని మెంటైన్ చెయ్యడానికి ఆవిడకి వున్న 500 ఎకరాల పొలం లో కొంత అమ్మేసుకుంది. అది చూసి వీళ్ళందరు గొప్పగా ఫీల్ అయ్యారు. మీ అందరికి ఏ కష్టం రాకుండా చూస్తాను అని చెప్పింది. అది విని ఆవిడ వుండగా మనకేంటి అనుకున్నారు. కాని ఆపోజిట్ వాళ్ళు పెట్టిన కేసులు వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోవటం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఇంటికొకరు చొప్పున జైల్లో పడ్డారు.

ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాధమైన కధ. కొన్ని ఇళ్ళు తాళాలు పడిపోయాయి శాశ్వతంగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా జైలుకి వెళ్ళిపోయారు. ముసలి తల్లి దండ్రులు పిల్లల మీద దిగులుతో చనిపోయారు. పిల్లల తల్లులు కుటుంబం లో వ్యవసాయం చేసే మగ వాళ్ళు లేక కూలిలుగా మారిపోయారు. ఊర్లో వున్న కొందరు మగవాళ్ళ తో పనులు జరగాలంటే మిగిలిన ఆడ వాళ్ళు ఎన్నో రకాలుగా బతిమలాడుకోవాలి. స్త్రీ పురుషుల జనాభా తేడాల వల్ల, జీవనాధారం పోవటం వల్ల ఎన్నో అక్రమ సంభంధాలు(అలా అనొచ్చో లేదో నాకు తెలీదు). జైలుకి వెళ్ళిన వాళ్ళలో ఇంజనీర్లు చదివిన అబ్బాయిలు, ఎం.బి.ఎ లు చేసిన వాళ్ళు, టీచర్లు ఇలా చదువుకుని జీవితంలో ఎన్నో సాధించాల్సిన వాళ్ళున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని కళకళలాడాల్సిన కుటుంబాలలో చీకటి, ఒంటరితనం, దిగులు, భయం నిండిపోయింది. అంత పెద్ద ఇంట్లో ఒక్కరే బిక్కు బిక్కుమనే వాళ్ళున్నారు. ఎవరి కోసమో మన పిల్లలు బలైపోయారని, అన్నీ చూసుకుంటానని చెప్పిన ఆవిడ చేతులెత్తేసి తను రాజకీయంగా ఎదిగిపోతుంటే చూస్తు కడుపు రగిలిపోతున్నవాళ్ళే వున్నారు. ఆపోజిట్ వాళ్ళలో మొదటిసారి వీరి ఆవేశానికి, రెండవసారి వీళ్ళు ప్లాన్ ప్రాకారం చనిపోయిన వ్యక్తులున్నారు. వారి కుటుంబాలు కూడా సంతోషంగా లేవు.

ఈ కేసులు, జైల్లు ఇదంతా ఒక వేరే ప్రపంచం. ఆశ నిరాశల మధ్య ఊగిసలాట. ఎన్నో విషయాల మీద వీరి తీర్పు ఆధారపడి వుంటుంది. జడ్జికి లంచం ఇవ్వడానికోసమని ఊరందరూ చందాలేసుకుంటారు. నాకు తెలిసిన లోకంలో జడ్జి అంటే దేవుడు. కాని వీళ్ళకి లంచం తీసుకొని కూడా మంచి చెయ్యని ఒక లంచగొండి. ఎలక్షన్లు వస్తే నా వరకు నేను ఆలోచించేది మహా అయితే మన లోకల్ ఎం.ఎల్.ఎ కేండిడేట్లలో ఎవరు తక్కువ చెడ్డవాడు అని, ఏ పార్టీ గెలిస్తే కాస్త తక్కువ అవినీతి వుంటుంది అని మాత్రమే. కాని ఇక్కడ ఎలక్షన్లంటే ధారాళంగా ఎవరు మందు పోస్తారు, ఎవరు కుటుంబానికి ఎంత ఇస్తారు అని మాత్రమే కాదు. ఎవరు గెలిస్తే మన కేసులు ఎత్తేస్తారు, ఏ పార్టీ గెలిస్తే ఎవరు జడ్జిగా వస్తారు, ఎవరు గెలిస్తే మనకి లైఫ్ పడుతుంది, ఎవరు గెలిస్తే మనకి లంచం తగ్గుతుంది అని. ఎలక్షన్లు ఈ కుటుంబాలకి జీవన్మరణ సమస్యలు. ఒకసారి లంచం తీసుకున్న జడ్జి వల్ల కేసు ఏదో అనుకూలంగా మారుతుంది అనుకుని అదే ఆశతో బెయిల్ మీద వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్తారు కొందరు. మళ్ళీ బైల్ మీద వచ్చి కాపరం చేసి వెళ్తారు, ఎందరికో పెళ్ళిళ్ళు కాలేదు. మొదటి కేసులో లైఫ్ పడేసరికి అంతవరకు ధీమాగా వున్న వాళ్ళ జీవితాలు ఒక్కసారి షాక్ చెందాయి. ఇక ఈ గ్రామాం లో వారికి ఎవరు పిల్లని ఇవ్వటం మానేసారు. నా పెళ్లి అక్కడ చుట్టుపక్కల ఒక వింత. ఎవరో చదువుకున్న అమ్మాయి, వుద్యోగం చేస్తుంది, ఎక్కడో దూరం లో ఊరు పెద్ద షావుకార్లు పిల్ల పాపం ఈ ఊరికి ఇచ్చారంట అని. నన్నే ఎంతో మంది అడిగారు తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావా అని. నాకు ఫ్యాక్షన్ తాలూక నిజస్వరూపం తెలీదు. రెడ్డీ కళ్ళల్లో కనిపించే ప్రేమ ఎందుకు నొరు దాటి బయటకి వచ్చేది కాదో అక్కడి పరిస్థితులు చూస్తే అర్ధం అయ్యింది. రెడ్డి మీద ఏమీ కేసు లేదు. కాని వెంకటేశ్వర రెడ్డి పేరు మీద కేసు వుంది. మా పక్క ఇంట్లో మా మామయ్య గారి చిన్నాన్న మనవడి పేరు కూడా అదే ఇంటి పేరుతో సహా. కాకపోతే ఆ వెంకటేశ్వర రెడ్డి నిజంగానే గొడవల్లో వున్నాడు, మా రెడ్డి ఆ గొడవల సమయంలో కర్నూల్ లో చదువుకుంటున్నాడంట. అందుకని కేసు మా రెడ్డి మీద కాదని ఆపోజిట్ వాళ్ళు క్లెయర్ గా చెప్పారంట. అయినా భయానికి మా అత్తయ్య వాళ్ళు రెడ్డిని ఎప్పటికి ఆ ఊరుకి దూరంగానే వుంచారు. ఈ క్రమంలో రెడ్డీ చిన్నప్పటి ప్రేమ మొగ్గలోనే తుడుచుకుపోయింది.కానీ...ఆమె జీవితం నాశనం అయిపోయింది.(అదిప్పుడు చెప్పను తరువాత చెప్తా)

నేను ఒకసారి మా అత్తయ్య గారి ఊరు వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వెంకటేశ్వర రెడ్డి జైలు నుండి మొదటి కేసు కొట్టేస్తే ఇంటికి వచ్చాడు.అలా చాలా మందికి మొదటి కేసు కొట్టేసారని అప్పుడు వాళ్ళంతా ఇంటికి రావటంతో ఊరంతా పండగ లా వుంది. మా మిద్దెలు కలిసే వుంటాయి. నేను పైన కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే వాళ్ళ మిద్దె మీద నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళెప్పుడు మాతో మాట్లాడరు. పేర్లు ఒకటయినా కూడా తనే జైలు కి వెళ్ళాల్సి రావటం వల్ల ఒక్క ముసలి తల్లి మాత్రం ఇంట్లో మిగిలింది, ఆమె కోపంతో మాట్లాడేది కాదు. సో ఇతను తొంగి చూస్తుంటే నేను పలకరించాను. మీరు వాళ్ళ బంధువులా? అని. కాదు ఇది మా ఇల్లే అని చెప్పాడు. నాకు అర్ధం అయింది తను ఎవరో. కాసేపు మౌనంగా వుండిపోయాము. కానీ తను నాతో మాట్లాడాలని చూస్తున్నాడనిపించింది. నేనే తిరిగి అడిగాను "అంటే మీరు వెంకటేశ్వర రెడ్డీ ..ఆ?"అని. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు గడ గడా మాట్లాడేసాడు. అవును మీ ఆయన పేరూ, నాది ఒకటే కాని కేసులో నన్ను జైలుకి పంపారు ఊరివాళ్ళంతా కలిసి. మీ వాయన బయట చదుకుంటున్నాడు గొడవల్లో లేడు అని. అప్పుడు నేను కూడా ఏముందిలే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అనుకున్నాను, జైలుకి వెళ్తున్న మా అందరినీ ఊర్లో వాళ్ళు అప్పుడు హీరోల్లా గొప్పగా చూసారు. మీ ఆయన ని పిరికివాడని,ఊరొదిలి పోయాడని అనుకున్నారు. కాని ....3 సంవత్సరాలు జైలులో వున్నా. శిక్ష పడింది వదినా!! అన్నాడు. తను అలా పిలిస్తే నాకు గుండెల్లో ఒక ఆత్మీయ భావం కలిగింది. రెడ్డీకి ఎవరూ తమ్ముడు లేరు. వుంటే నాకు ఒక మరిది వుంటే నన్ను ఇలాగే పిలిచేవాడుకదా అనిపించింది. నా భావం తనకి కూడా తెలిసిందో ఏమో అప్పటివరకు తన మనసులో వేదన అంతా నాకు చెప్పాడు. జైలు జీవితం నరకం వదినా, ఆ తిండి, నీరు, ఆఖరికి అక్కడ గాలి కూడా మనల్ని చంపేస్తుంది. బాగా పెడతారు తిండి కానీ అది తిన్న మనిషి మరి జీవితంలో ఏ పని చెయ్యడానికి శక్తి వుండదు. నాకు ఏడుపొచ్చేది, మా ఇంట్లో ఎంత పాడి వుంది. నెయ్యి లేనిదే ముద్ద దిగదు నాకు. ఎవడో చేసినదానికి, ఎవరో కుటుంబం కోసం నేనెందుకు ఈ కష్టాలు పడాలి అనిపించేది.వాళ్ళంతా హాయిగా లీడర్లు అయిపోయి ఆస్తులు పెంచుకుంటుంటే నేను మా ముసలిదాన్ని చూసుకునే వాళ్ళు కూడా లేకుండా వదిలేసి వాళ్ళకోసం జైల్లో వున్నా. ఎంత ఖర్చయినా ఇడిపిస్తాము మీకు అసలు భయం లేదు అన్నారు వదినా, మా పొలాలు అమ్మి జడ్జిలకి లంచాలు కట్టుకున్నాము.ఇక అమ్ముకోడానికి ఏమీ లేకపోతే ఊర్లో అందరు చందాలు ఏసారు మా కోసరం. ఇలా చెప్తుంటే తను ఏడుస్తాడేమో అని భయం వేసింది. టాపిక్ మార్చాను. మరి ఇప్పుడు వచ్చేశావు కదా! ఇక దాని గురించి ఆలోచించకు. నీకెంతో భవిష్యత్తు వుంది. ఏమి చెయ్యాలనుకుంటున్నావు? అని అడిగాను. పెళ్ళి చేసుకుంటా, ఇక్కడే వుంటే మీ కంటే నాకే ముందు పెళ్ళి అయిపోయేది, కొంచెం ఆరోగ్యం చిక్క బెట్టుకొని మిగిలిన పొలం లో పని చూసుకుంటా. మా అమ్మని ఒంటరిగా వదిలేసాను. ముసల్ది చానా కష్టపడింది. నేను పెళ్ళి చేసుకుంటే కోడలొస్తే కొంత సుఖపడతాది,చూడాలి...!!అని. తన కళ్ళల్లో ఎంతో ఆశ. ఈ మాటల మధ్యలో రెండు సార్లు వాళ్ళ అమ్మ, మా అత్తయ్య, మామయ్య వచ్చి మమ్మల్ని పిలిచారు. కానీ మేము మాట్లాడుతూనే వున్నాము.నాకు మీ మీద ఏమీ కోపం లేదు వదినా, మా ముసల్దానికి కడుపుకోత అంతే. దాన్ని కూడా 6 నెలలు జైల్లో పెడితే కోపం, బాధ,పౌరుషం అనీ పోతాయి అని నవ్వాడు.

ఇలాంటి ఎన్నో కధలు, ఎన్నో సమస్యలు, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించడానికి మనమెవరు. ఆ పరిస్థితుల్లో వారి బతుకు గడవడానికి ఎవరు కారణం? ఫ్యాక్షన్ వల్ల ఊర్లో 2 సంవత్సరాలు కర్ఫ్యూ పెట్టారు. ఇళ్ళు పొలాలు పశువులు వదిలేసి ఊర్లెమ్మట, అడవులెమ్మట తిరిగారు మగవాళ్ళు. పోలీసులకు భయపడి అమ్మగారిళ్ళకి, బంధువుల ఇళ్ళకి వెళ్లిపోయారు ఆడవాళ్ళు. ఊరి మొత్తానికి 4,5 కుతుంబాలు మాత్రమే వుండి అందరి పంటలు, పశువుల బాద్యత తీసుకున్నారంట.మా అత్తయ్య మాత్రం ఎవరెంత చెప్పిన కదలక ఇంట్లోనే వున్నారు ఇద్దరు ఆడ పిల్లలతో, ఒక ముసలి అత్తగారితో. పోలీసులకి భయపడి పిల్లలు చదవలేదు, ఫ్యాక్షన్ కి భయపడి, జైలు శిక్షలు పడి, ప్రేమించుకున్న వాళ్ళవి, పెళ్ళి కుదిరిన వాళ్ళవి పెళ్ళిళ్ళు ఆగిపోయాయి.

కుటుంబం అంటే ఎన్ని పనులు, ఎన్ని బాద్యతలు...పిల్లలికి చదువైన, రోజు వారి జీవనాధారమైన, ఇంట్లో ఏదైన కార్యక్రమానికి నిర్ణయమైనా...ఏది జరగాలన్నా ఆ ఊర్లో జైలుకి వెళ్ళి మాట్లాడే వరకు లేదా వాళ్ళ వాళ్ళకి బెయిలు ఇప్పించగలిగే వరకు ఆగాలి.  బెయిలు మీద ఎన్నాళ్ళు తీసుకురాగలరు? ఎన్నాళ్ళు ఒక మనిషి కోసం మన జీవితం లో అన్ని ఆపగలం? ఎవరు ఏ విషయాల్లో ఎదురు చూడగలరు?

బి. ఇ. డి చేసే సమయంలో కలిసి జీవితం పంచుకోవాలని కలలు కన్న ఇంకో జంట సడన్ గా అబ్బాయి జెయిలు కు వెళ్తుంటే ఆమెకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, పరిచయం లేని జెయిలు కి వెళ్ళి ఆ అబ్బాయి ని కలిసి ఎప్పుడొస్తావు అని ఆమె ఏడుస్తుంటే, తనని చూసి ఆ అబ్బాయి ఏడుస్తుంటే.. చూసిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఆగేవి కాదు. ఇక ఆమె బాధ ని చూడలేక ఆ అబ్బాయి ఆమెని కలవకుండా మానేసాడు. ఆ నిర్ణయం తీసుకొని ఆచరించడానికి ఎంత నరకయాతన అనుభవించాడో ఆ ఊరిలో చెప్పే జెయిలు కధల్లో ఒకటి, ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు ఇలా జెయిలు గొడల మద్య నలిగిపోవాల్సిందేనా? వాళ్ళేమి చేసారు? మన కోర్టులకు టైము లేకపోతె, ఎవరో చెప్తే వినడమే తప్ప, నిజం తెలుసుకోవటం కోర్టు పని కాక పోతే అది ఎవరి తప్పు? ఇలాంటి పరిస్తితి నేను విన్నాను, చూసాను కాబట్టి నాకు తెలిసింది. కాని ఇలాంటి ఎన్నో వేల లక్షలమంది ఎవరో చేసిన తప్పులకి, ఎవరో స్వార్ధానికి జీవితం బలి చేసుకొని ఏదో వింత జరిగి వారి జీవితం మారిపోవాలని ఎదురుచూస్తూ బ్రతుకుతున్నారో!!! ఇది ఫ్యాక్షన్ నడిపిన వాళ్ళ కధ కాదు, దానికి ఏ సంబంధం లేకపోయిన ఆ ఊర్లో పుట్టినందుకు నలిగిపోయిన ఎన్నో ఇళ్ళళ్ళో కధ.

కానీ ఆ ఇంట్లోనే పుట్టిన పిల్లల కధలు ఎలా వున్నాయో తరువాత పోస్ట్లో.

Monday, November 8, 2010

మిస్ యు ఆల్.

హలో,


గుర్తున్నానా?? అంతర్జాలాన్ని చాలా మిస్ అవుతున్నాను. మొత్తానికి హైదరాబాదులో వచ్చి పడ్డాను. ఇక్కడి ట్రాఫిక్, పొల్యూషన్, హడావుడి, సిటీ బస్సులకు, ఆటో మీటరుకి ఇంకా అలవాటు పడలేదు. ఐనా ఇంత చలేంటండీ బాబు. మా నెల్లూరులో 5 యేళ్ళూ ఎప్పుడు కనీసం దుప్పటి కూడా కప్పుకోలేదు. ఇక్కడ పగలు కూడా ఫుల్ గా ముసుగే. మా బాబు కి స్కూల్ వెతికేసరికి నాకు మొత్తం మన విద్యా వ్యవస్థ మీద విరక్తి వచ్చేసింది.

ఏంటీ అన్నీ నెగెటివే చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేమీ లేదు. ఇక్కడ చాలా మంది బంధువులు, స్నేహితులు నాకు దగ్గరలో వున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఇంట్లో ఎక్కువ టైము గడుపుతున్నాను. అంతే కాదండోయ్ మంచి కలర్ వచ్చేస్తున్నాను. (బాగా వండుకొని తింటున్నా కదా మరి).


ఇలా మంచి చెడ్డలు, కష్టసుఖాల తో బాగానే వున్నను. ఇంట్లోనే ఆఫీసు. కానీ ఇంక సెట్ కావాలి. ఇంటెర్నెట్ కనెక్షన్ ఇంకా పెట్టలేదు. వరుసగా పండగలు, వర్షాలు తో సెలవులు కదా!అందుకే మీరంతా బతికిపోయారు. అలా అని ఇలాగే సుఖంగా వుంటాము అనుకోవద్దు. నేను త్వరలో ఒక పెద్ద టపా తో వచ్చేస్తున్నా...కాసుకోండి.

బట్ ఐ మిస్ ద బ్లాగ్ వర్ల్డ్. మిస్ యు ఆల్.

Monday, September 27, 2010

సమరసింహా రెడ్డా కాదా?నేనే మోస పోయానా?

ధర్మం, ఈ మాట ఒక్కోసారి చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా! ఇది మంచి ఇది చెడు అని అసలు ఎవరు నిర్ణయించారు.ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెప్పినవే ఇప్పటికీ ధర్మాలా/నీతులా? ధర్మమ ఎప్పటికీ మారదా?మరి మన పురాణాలలో ఎప్పుడు ఎవరికి ఎలా కావలిస్తే అలా మార్చేసుకొని అదే ధర్మం అని చెప్పుకుంటూ వచ్చారే! అమ్మా తల్లీ నీకెందుకీ ధర్మ సందేహాలు మాకెందుకీ నీతి బోధలు అనుకుంటున్నారా? ఏమో బాబు నాకు అప్పుడప్పుడు ఇలాంటి ధర్మ సందేహాలు వస్తూ వుంటాయి. ఎవరిని అడగాలో అర్ధం కాదు. నాకు తెలిసిన విధంగా నాకు నేనే నా సందేహాలకు సమాధానాలు చెప్పేసుకుంటుంటాను. అలాగే ఒకానొక సమయంలో నాకు ఒక ధర్మ సందేహం కలిగింది. ఒకటేమిటీ చాలానే కలిగాయి ఆ విషయంలో. ఫ్యాక్షనిస్టుని పెళ్ళిచేసుకోవచ్చా? అనీ.పోనీ పెళ్లి చేసుకోకపోతేనేమి ప్రేమించ వచ్చా అనీ, ప్రేమిస్తే పెళ్ళిచేసుకోవాలా అనీ, అసలు ప్రేమించిన వానితో పోలిస్తే జీవితంలో మిగిలిన కష్టాలన్నీ చిన్నవి కాదా అనీ. అసలు ఇది ఒక ధర్మ సందేహమా, కొన్ని పేజీల ధర్మ సందేహాలా అని మీకు కూడా ధర్మ సందేహం వచ్చి వుండాలే ఈ పాటికి . వచ్చిన రాకపోయినా మీ ధర్మ సందేహం తీర్చడం ఒక బాద్యత కల భారత బ్లాగర్ గా నా ధర్మం....ఇక చదివి మీ ధర్మ సందేహాలు తీర్చుకోండి....


పని లేని మంగలి పిల్లి తల గొరిగాడంట, ఆ సామెత విన్నప్పుడంతా మరీ అంత పిచ్చి పని ఎవరైనా చేస్తారా అనుకున్నాను. కానీ నేను అదే చేసాను కొన్నాళ్ళ క్రితం. పెద్దగా పనిలేక టి.వి లో అదేదో బాలకృష్ణ సినిమాలు, చిరంజీవి సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు ఇస్తే చూశాను. కంటిచూపుతో చంపేయటాలు, ట్రైన్ ని ఆపేయడాలు, ఎవరెవరో వచ్చి అన్నా అని కాళ్ళకు దండాలు పెట్టేయడాలు చూస్తుంటే విపరీతమగా ఫీలయిపోయాను.నా జీవితం తో ఆడుకున్న సినిమాలు అవి. అదెలాగో తెలియాలంటే నాతో పాటు మీరు 1999 వ సంవత్సరం కి రావాలి.

అప్పట్లో శిరీష ఒక పసికందు(మానసికంగా పసిపిల్ల అని చెప్పడానికి అలా చెప్పా)ఎప్పుడు చూసినా ఫ్రెండ్సు, సినిమాలు, షికార్లు,జోకులు ఇవే తెలుసు. కుటుంబం అంటే అందరు కలిసి బోజనాలు చేస్తారని,పండగలు చేసుకుంటారని, టూర్లకి వెళ్తారని మాత్రమే తెలుసిన రోజులు. అటువంటి నాకు ఒక కొత్త ప్రపంచం చూపించాడు ది గ్రేట్ వెంకటేశ్వర రెడ్డి, అప్పటి నా కొలీగ్. కుటుంబం లో వాళ్ళు కలిసి మర్డర్ ప్లానింగ్ చెయ్యడం, ఊర్లో వాళ్ళు దానికి సహాయపడటం, ఒక వైపు మనిషి చనిపోతే ఊర్లో అందరు తమ ఇంట్లో మనిషి చనిపోయినట్లు ఆవేశపడటం, అవతలి వైపు వారి ఇళ్ళల్లో వాళ్ళని లాక్కొని వచ్చి చంపేయటం, ఇళ్ళకు, పండిన పత్తి కి నిప్పు అంటించెయ్యటం, మగవాళ్ళందరు ఊరొదిలి పారిపోయి అడవుల్లో దాక్కోవటం, ఆడవాళ్ళు కూడా ఊరొదిలి బంధువుల ఇళ్ళకి పోవటం, పోలీసులు సంవత్సరాలు తరబడి ఊర్లో కర్ఫ్యూ పెట్టడం,వున్న ఒకటి, రెండు ఇళ్ళ వాళ్ళని పోలీసులు కష్టాలు పెట్టడం.....ఈ మద్యలో కొన్ని ప్రేమ జంటల జీవితాలు, కుదిరిన పెళ్ళిళ్ళు, చదువుతున్న చదువులు అన్ని ఆగిపోయి జీవితాలు తలక్రిందులైపోవటం అనే కధలు చెప్పాడు. ఇదంతా వెంకటేశ్వర రెడ్డీ వాళ్ళ ఊరు చిందుకూరు (నంద్యాల దగ్గర) కధ. ఈ కధ అంతా నా ఒక్క దానికే కాదు మా టీం లో అందరికీ చెప్పాడు రెడ్డి. అందరూ  ఆశ్చర్యపోతూ, భయపడుతూ వింటుంటే నేను మాత్రం రెడ్డీ ని ఆరాధనగా చూస్తూ వినేదాన్ని. మాతో పాటు సామాన్యమైన మనిషిలా తిరుగుతూ, బోజనం చేస్తూ, ఆడుతూ పాడుతూ ఉన్న ఈ రెడ్డీ నిజానికి ఒక సమర సింహా రెడ్డి అయివుంటాడని, అఙ్ఞాతంలో వున్న ఇంద్రసేనా రెడ్డి అయివుంటాడని అనుకునేదాన్ని. ఒంటి చేత్తో ట్రైను ఆపేసే శక్తిమంతుడయి వుంటాడని, కంటి చూపుతో ప్రాణాలు తీసేసే పవర్ ఫుల్ మనిషి అయి వుంటాడని అనుకునేదాన్ని. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు తనికెళ్ళ భరణి లా మా ఆఫీసు కి వచ్చి అన్నా, రెడ్డన్నా అని మా రెడ్డి కాళ్ళ మీద పడిపోతాడనీ, ఎక్కడో ఏదో ఒక గుడిలో అనుకోకుండా ఒక జంట ఒక పసిపిల్లాడితో వచ్చి రెడ్డన్నా..ఏమై పోయావన్నా, అని కన్నీరు పెట్టుకొని ఆ పసిబిడ్డని రెడ్డి కాళ్ళమీద పెట్టేసి అన్నా ఈ బిడ్డ నీ దయవల్ల కలిగాడు(డబల్ మీనింగ్ ఏమీలేదు) వీడికి నీ పేరే పెట్టాము, నీ చేత్తో ఒక బంగారు గొలుసు ఇయ్యన్నా అంటారని ఆశపడి రెడ్డి ఎక్కడికెళ్ళినా వెనకే తిరిగేదాన్ని అలాంటి సీన్ మిస్ అయిపోకూడదని. ఏదో ఒక బస్ స్టాండులో సడన్ గా రెడ్డి మీద ఎవరైనా విలన్స్ అటాక్ చేస్తారేమో అని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించేదాన్ని.

అంత జాగ్రత్తగా, అపూర్వంగా రెడ్దిని చూసుకుంటున్న రోజుల్లో ఇంకా అధ్భుతమైన విషయం చెప్పాడు. ఈ ఫాక్షన్ కధలో మరుగున పడిపోయిన ఒక విషాదభరితమైన ప్రేమ కధ. అది ఎవరిదో కాదు, మీరు మరీను అసలు సినిమాల్లో ప్రేమ కధలు,ఫ్లాష్ బ్యాక్ లు ఎవరికి వుంటాయి ఆ మాత్రం తెలుసుకోలేరా? ఆ... అదే హీరో కే.అంటే సమర సింహారెడ్డికే, ఇంద్రసేనా రెడ్డికే. అంటే వెంకటేశ్వర రెడ్డికే. అది కూడా పసివాడుగా వున్న సమరసింహా రెడ్డి గుణగణాలను ముందే ఊహించి అతనికోసమె ఆడపిల్లని కన్నారు ఆ ఊరి ఫాక్షన్ పార్టీ ఒక వైపు పెద్ద గారు. మన హీరో కూడా చిన్నప్పటి నుండే ఆమెతో మొగుడు పెళ్ళాలాట ఆడటం మొదలు పెట్టాడు.(నిజంగా పూర్తి ఆట ఆడితే తోలు తీస్తారు అక్కడ అందుకని కనిపించిన వాళ్ళందరికి ఆమె నా పెళ్ళాం అని చెప్పుకోవడం, ఆమె కాలేజి కెళ్ళినా,గుడికెళ్ళినా కాపల కాయడం లాంటి బాధ్యత గల పనులు మాత్రం చేసేవాడు) ఇలా పిల్లలు ముదురు వేషాలేస్తున్న సమయంలో జరిగింది ఆ ఊర్లో మొదటి ఫాక్షన్ హత్య. ఆ అమ్మాయి వాళ్ళ చిన్నాన్న ని అటువైపు వాళ్ళు ప్లాన్ వేసి పక్క ఊరికి పనిమీద పూజారి గారింటికెళ్తే వారితో కుమ్మక్కై కత్తులు కొడవళ్ళతో ముక్కలు గా నరికేశారు.అది జరిగిన అరగంటలో ఊరు అల్లకల్లోలం అయిపోయింది.ఎవరు ఎవరిని కొడుతున్నారో, ఎవరిని చంపుతున్నారో,ఎవరిళ్ళు తగలబెడుతున్నారో తెలీకుండా ప్రవర్తించారు.పోలీసులకి తెలిసి వచ్చే లోపల మగవాళ్ళు అందరూ పారిపోయారు.అడవులు పట్టుకొని తిరిగారు.అక్కడితో అయిపోలేదు. చనిపోయినతని భార్య శపదం పట్టింది నా భర్త కి ఆపోజిట్ మనిషి తాలూక వాడి రక్తంతో బొట్టుపెట్టి తరువాతే భర్తకి పిండం పెడతా అని. అలాగే ప్లాన్ చేసి బాంబు పెట్టి అతను వెళ్తున్న కారు పేల్చి అతన్ని ఇంట్కి లాక్కొచ్చి నరికించింది ఒక సంవత్సరంలో. కానీ ఈలోగా అవతలి వాళ్ళు కూడా ఊరుకోలేదు. మన హీరోయిన్ ఇంట్లో దొరికిన వాళ్ళని బంధువులని కూడా చంపారు. హీరోయిన్ అక్క భర్త పాపం ఎక్కడో కర్నూలు లో లాయర్ అయితే ఏసంబంధం లేని అతన్ని కూడా చంపేసారు. ఊర్లో అందరిమీదా పోలీసు కేసులు పెట్టారు.ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున అందరిని జైల్లో పెట్టరు. ఇటువంటి సమయంలో వెంకటేశ్వర రెడ్డీ తల్లిదండ్రులు ఆ సంబంధం చేసుకుని కొడుకుని బలి ఇవ్వలేము అని రెడ్డిని ఊరొదిలి ఎక్కడో దూరంగా వుండు అని పంపేసారు. ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళి అయిపోయింది. అలా అజ్ఞాతవాసం చేస్తూ వచ్చాడు రెడ్డి శ్రికాకుళానికి.

ఈ కధ విని బుర్ర వున్న అడ్డగాడిద ఎవరైనా సరే చచ్చినా ఆ ఊరితో కానీ, ఆ మనిషి తో కాని సంభంధం వద్దురా అని దూరం పారిపోతారు.మరి నేను బుర్ర లేని అడ్డగాడిదని కదా అందుకని రెడ్డిని ఇంకా ఇంకా ఆరాధన చూపులు చూడటం మొదలుపెట్టాను. ఫ్లాష్ బ్యాక్ లో పల్లెటూరి హీరోయిన్ అడ్డంకూడా తొలగిపోయింది కాబట్టి,నేనే ఇక ఈ కధలో నవ హీరోఇన్ అనుకుని ఫిక్స్ అయిపోయా, ఈ సమర సింహా రెడ్డి నాకే సొంతం అని డ్యూయెట్లు వేసేసుకున్నా. అసలు మా కుటుంబం లో ఎవరూ ఇంతవరకు కనీసం మర్డర్ స్పెల్లింగ్ కూడా సరిగా రాయలేరు, కానీ రెడ్డిని ఎన్ని మర్డర్లో చూసిన అనుభవం వుంది. మా వాళ్ళు ఎవరైన గట్టిగా మాట్లాడితే భయపడిపోతారు కానీ రెడ్డి వందమందితో అయినా డిషుం డిషుం అని ఫైటింగ్ చేసేస్తాడు, మా డాడీ మహా అయితే నాకు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని తెస్తారు, వాడితో నేను అమెరికా వెళ్ళి అంట్లు తోమాలి అందరిలా కాకుండా మెషిన్లో తోమాలి అంతే తేడా.అదే ఈ ఫాక్షన్ హీరో ని చేసుకుంటే ...."నేను ఒక పెద్ద కుంకుమ బొట్టు తో, కాస్త కష్టమైన రోజూ ఇంట్లో కూడా కంచిపట్టు చీర కట్టుకొని, రెడ్డి ఏమో వైట్ అండ్ వైట్ పంచెకట్టు తో మేమిద్దరం పేదలకి బట్టలు పంచుతూ, పిల్లలికి పుస్తకాలు పంచుతూ.."అలాంటి డ్రీంస్ వేసుకున్నా. ఒక్క సారి ఊహించండి సమర సిం హా రెడ్డీ నో, ఇంద్రసేనా రెడ్డీ నో పెళ్ళిచేసుకుంటే ఎలా వుంటుందో!! (ఒక అమ్మాయి ఏంగిల్ నుండి ఆలోచించండి) నేను కూడా అలాంటి కలలే కన్నాను. టాటా సుమోలు, కడప బాంబులు, తొడకొట్టడాలు, కంటిచూపుతోనే రౌడీలను చంపేసేంత ధైర్యవంతుడు లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత ధైర్యంగా వుంటుంది కదా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఎవరితో చిన్న గొడవైతే వాళ్ళ కొంపలేదో మునిగిపోతాయి అన్నట్లు భయపడుతూ బతుకుతుంటారు, సో నాకు కూడా పెద్దగా ధైర్యం లేదు. కానీ రెడ్డీ మాత్రం ఆర్.టి.సి కండక్టర్ చిల్లర ఇవ్వకపోయినా వాడిని దబాయించేవాడు, చిన్న చిన్న అన్యాయాలు ఎదిరిస్తుండే వాడు. అదిచూసి నేను తనలో నిజమైన ఇంద్రసేనా రెడ్డిని చూసాను.ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా తాగి మాట్లాడినా,చీకటై ఒక్కదానిని భయపడినా తోడుండేవాడు. ఎన్ని సార్లు నేనూ తనతో ఒంటరిగా వున్నా ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు. ఇవన్నీ చూసి కూడా లవ్ చెయ్యకపోవడానికి నాకేమైనా మెంటలా?అలాంటి సీన్లలో రెడ్డి అచ్చం హీరో అనిపించేవాడు.(ప్రేమ గుడ్డిది కదా,ఒక్కసారి కూడా నేను తనకి నచ్చలేదేమో అని ఆలోచించలేని గర్వం నా అందం మీద నాకు)

అంతవరకు పెళ్ళే చేసుకోను అనుకుని తీవ్రమైన నిర్ణయం తీసుకున్న నేను సరేలే ఈ ఒక్కసారికి ఈ సమరసింహారెడ్డిని చేసుకుందాం అనుకొని మా ఇంట్లో చెప్పేశా. వాళ్ళు కూడా సగం నా లాంటి ఊహలతో, ఇంకో సగం ఈ దెయ్యం (అంటే నేనే)ఎవర్నో ఒకరిని  చేసుకుంటే చాలు అనుకుని మొత్తానికి మా పెళ్ళి కానిచ్చేసారు.

అప్పుడు మొదలయింది అసలు కధ. అసలు పెళ్ళి చేసుకోవాలంటే ముందు ఇంట్లో చెప్పాలన్నప్పుడే మా సమరసింహా రెడ్డి భయపడుతుంటే తన అసలు ధైర్యం బయటపడింది, కానీ నేను సరేలే పెద్దలంటే గౌరవం ఏమో అనుకున్నా( అక్కడికి నాకు అది లేనట్లు) పెళ్ళయ్యాక మా అత్తగారు అసలు కధ చెప్పారు. ఊరందరి ఇంట్లో ఒకరు జైల్లో వున్నారు మరి మన ఇంట్లో ఎవరూ జైల్లో లేరేంటండీ అని అడిగాను. ఆవిడ అప్పుడు చెప్పారు "మీ వాయన కూడా వెళ్ళే వాడే గొడవల్లోకి, ఊర్లో అందరితో పాటు వెళ్తానని అంటే నేనే తిట్టి పంపించేసా కర్నూలు మా తమ్ముని ఇంటికి ఆతరువాత శ్రికాకుళం కి, వాడొక్కడే కొడుకు కదా వాడికేమైనా ఐతే మేము ఇక బతకలేము" అని చెప్పారు. నాకు ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. ఆ తరువాత రెడ్డీ ని అడిగా "నువ్వు ఒక్కరిని కూడా నరకలేదా? ఒక్కసారి కూడా బాంబు వెయ్యలేదా? కనీసం తొడ కొట్టడం ఐనా వచ్చా అని" అవేవీ రావని ఆ తరువాత చాలా సంధర్భాలలో చెప్పకనే అర్ధం అయిపోయింది.నా కలలన్నీ కల్లలైపోయాయి. అరివీర భయంకర శూరుడనుకొని పెళ్ళాడానే,కనీసం మామూలు శూరుడు కూడా కాదు కదా!

ఇప్పుడు చెప్పండి నాకు అన్యాయం చేసింది ఎవరు సమరసింహా రెడ్డా కాదా?నేనే మోస పోయానా? బాంబులతో , కొడవళ్ళతో ఫైటింగులు చేసే గొప్ప వీరుడని పొరబడ్డాను. అయినా తనంటే ఇష్టమే కలుగుతుంది. ఇది ధర్మమా???

(కానీ ఫ్యాక్షన్ తాలూక నిజమైన కధ తరువాత పోస్ట్ లో చెప్తాను, అది నా కళ్ళతో చూసింది, మా అత్తయ్యా చెప్పింది.మనసు ద్రవించిపోయే నిజాలు, నిజమైనా జీవితాల కధలు. కానీ ఈసారి కాస్త టైం పడుతుంది పోస్ట్ రాయడానికి, కామెంట్లకు జవాబివ్వడానికి ఎందుకంటే ఈ నెల్లూరు నెరజాణ ??? ఇక నెల్లూరు వదిలి హైదరాబాదు వెళ్తుంది.సో ఇల్లు, ఊరు,ఉద్యోగం అన్నీ మారాలంటే కాస్త టైము కావాలి కదా)

Friday, September 10, 2010

నా విరహంలో నీ తోడు

"వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా? విరహానా జోడీ నీవే. నీకు భూలోకుల కన్ను సోకక ముందే పొద్దు తెల్లార కుండా పంపిస్తాలే"

ఈ పాట లో గ్రామర్, చందస్సు ఇలాంటివన్నీ నాకు అర్ధం కావు కాని,భావం మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. ఒక్కసారి ఊహించండి, ఎవరూ లేని ఒంటరితనంలో మనసు తోడు కోరుకున్నప్పుడు, చుట్టూ ఆహ్లాదమైన వాతావరణంలో అంటే చిన్న చిరు జల్లు పడుతుంటే సాయంత్రం 7 దాటాక వరండాలో కూర్చున్నప్పుడు కాని, చల్లని రాత్రి పూట డాబామీద ఒంటరిగా తిరుగుతున్నప్పుడు కాని, ఏదైన తోటలో, నీటి వొడ్డున ప్రసాంతంగా వున్న ఆ మౌనంలో నాకు మాత్రం వేరే ఏ మనిషి తోడు కూడా వొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమో నాకు ఆ ఒంటరితనం చాలా బాగుంటుంది. కాని నాతో పాటు మౌనంగా కూర్చొని ఆ ఏకాంతానికే అందాన్ని, అద్భుతాన్ని తీసుకు రాగల ఒక తోడు కావాలనిపిస్తుంది. అది వేరే ఏ మనిషి తీసుకు రాగలరని నాకు అనిపించదు. మనకెంతో ఇష్టమైన మన పిల్లలైనా, ప్రియుడైనా, నేస్తమైనా కూడా కొన్ని సంధర్భాలలో ఎవరూ వద్దు ఒంటరిగా వుండాలి అనిపిస్తుంది కాని ఇంకేదో తోడు కావాలనిపిస్తుంది. ఈ భావం ఏంటో నాకే అర్ధం కాదు. అంటే అప్పుడు తోడు వద్దు కాని కావాలి అంటే ఏమైనా అర్ధం వుందా అసలు. నాకు మెంటల్ వచ్చిందా ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. నాకు చాలా సార్లు అలాగే అనిపిస్తుంది. అప్పుడు ఆలోచించేదాన్ని ఇప్పుడు మరి నాకు ఎలాంటి తోడు కావాలి అని. ఏ మనిషి లో ఐన ఏదో ఒకటి నచ్చనిది వుంటుంది, వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ వుంటాయి. అలాంటి తోడు కాదు కావాల్సింది. మౌనంగా వుండాలి కాని మాట్లాడుతున్నట్లే వుండాలి. ఆ చల్లని రేయికి, ఆ చక్కని ప్రకృతికి, ఆ చిక్కని నిశి కి కూడా అందాన్ని తెచ్చేలా వుండాలి. తను పక్కనుంటే చాలు మనసు ప్రశాంతంగా అయిపోవాలి, అమ్మ ప్రేమలా, స్నేహితుని భరోసా లా చల్లగా అనిపించాలి. ప్రియుని కౌగిలిలా మత్తుగా గమ్మత్తుగా వుండాలి.

ఇవన్నీ మనుషులెవరూ ఇవ్వలేరు. కాని ఇలాంటి అనుభవం నాకు కలిగింది.ఒకసారి కాదు కొన్ని సంధర్భాలలో తన తోడు నా విరహపు రాత్రుల్లో దొరికింది. ఆ తోడే, నేస్తమే, ఆ ప్రియుడే నా అందాల మామ, చంద మామ. ఆ ఏకాంతంలో తన తోడు దొరికినప్పుడంతా ఎంతో తృప్తి. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు చంద్రుడు రోజూ అక్కడే వుంటాడు. కాని మనం చూసే దృష్టి వల్ల ఒక్కోసారి మాత్రమే అందంగా కనిపిస్తాడు అని. కాని అది నిజం కాదు. ఆ చంద్రుడు మన మనసు లోకి చొరబడితేనే అందం కనిపిస్తుంది. ఏకాంతంలో తన తోడు ని అనుభవిస్తూ మౌనంగా ప్రేమించగలిగేతేనే ఈ తృప్తి కలుగుతుంది.

వజ్రపుకొత్తూరు లో వున్నప్పుడు కొన్ని సార్లు సాయత్రం 7 దాటాక సముద్రపు ఒడ్డుకు వెళ్ళేదాన్ని. చీకటి, చక్కని రేయి, నిర్మానుష్యమైన సముద్ర తీరం, చల్లగా మెత్తగా కాళ్ళకింద తగిలే ఇసుక, గాలి తో పాటు ఎగిరి వచ్చి తాకే నీటి తుప్పర్లు, అంత ఒంటరి రేయిలో కూడా హోరున ఏదో చెప్తున్నట్లుందే సముద్రపు ఘోష. మొదట కలిగేది భయం, అది ఈ లోకపు పరిస్థితులు కలిగించే భయం. ధైర్యం చేసి అక్కడెక్కడో పడవల దగ్గర కనిపించే ఒకరో ఇద్దరో మనుషుల గురించి భయపడకుండా, తోటి మనుషులున్నారు అని ధైర్య పడగలిగి ఇసుకలో కూర్చోగలిగితే మొదలవుతుంది ఆ ప్రేమ ప్రయాణం. సముద్రం పై వెన్నెల చేసిన వెండి వెలుగుల దారి లో మొదలవుతుంది ఈ లోకాన్ని విడిచి తనతో గడపాలని చూసే నాకోసం చనదమామ దిగి వచ్చే అద్భుతం.కెరటాల మీద వెన్నెల వజ్రాల మెరుపులు నన్ను, నా చుట్టూ వున్న లోకాన్ని అబ్భుతమైన సౌందర్య రాసిగా ముస్తాబు చేస్తాయి. ఆ కెరటాల హోరు లో వున్న విరహ వేదన నాదేనా అనిపిస్తుంది. గాలి తో పాటు నా వేదనా గీతిక చంద్రుని చేరిందా! ఆ చీకటి వెలుగుల్లో ఒంటరిగా ఎవరు నాకోసం చూస్తున్నారు అని మబ్బుల చాటునుండి మరింత ప్రకాశంతో నన్ను తొంగి చూస్తున్నది అందుకేనా! ఇంత విశాల ప్రపంచంలో పక్కనే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి గొడవల్లో వాళ్ళు పడిపోతే కేవలం తన కోసమే ఈ అంతులేని జలరాసి కి ఎదురుగా, అందరికీ దూరంగా ఈ ఇసుక తిన్నెల నడుమ భయపడక చూస్తున్న నాకోసం దిగి రాక ఏమి చేస్తాడు? చంద మామ తన నేస్తాన్ని కలవాలని వచ్చినప్పుడు ఇక ఆ ఏకాంతానికి ఈ ప్రపంచంలో ఏ శక్తి అడ్డు తగల లేదు. మరునాడు ఇవ్వాల్సిన రిపోర్టులు కాని, చీకటిలో కలిగే భయాలు కాని, ఇంటికెళ్ళమని హెచ్చరించే పల్లెకారులు కాని, తొందరగా తిరుగుతున్న చేతి వాచి ముల్లు కాని ఏమీ కనిపించవు వినిపించవు. ఇక ఎవరూ మనుషులు రారు అని ధైర్యంగా ఇసుక రంధ్రాల లోనుండి బయటకి వచ్చి సముద్రపు ఒడ్డునంతా నింపేసి అల్లరిగా పరిగెత్తే పీతలు జనాభా కూడా కనిపించదు, దూరంగా సముద్రం లోపలకి వేటకి వెళ్ళిన వారికోసం ఒడ్డున ఏర్పాటు చేసిన ఎత్తైన రాట పై కుండలో వెలుగుతున్న దీపం వెలుతురే పట్టపగలు అనిపించేంత ధైర్యాన్ని ఇస్తుంది. గాలి తో పాటు తాకుతున్న నీటి తుప్పర్లు మేమంతా నీకు తోడున్నాము అని చెప్తాయి. సముద్రపు ఘోష సంగీతమైపోతుంది. ఇక నాకు భయమన్న మాటే మతికి రాదు. చందమామ నా విరహాన తోడై వచ్చేసాడు. నేను, తను ఇద్దరం మౌనంగా సముద్రాన్ని చూస్తున్నాము. నాకు ఆ సముద్రం ఎందుకో ఆడుతూ అల్లరి చేస్తున్న నా చిన్నారి పాప లా అనిపించింది. చందమామ తన వెన్నెల తో పాపని నిమురుతున్నాడు. నేను నా చూపులతో కెరటాల అల్లరికి నవ్వుతూ మురిసిపోతున్నాను. ఈ సముద్రానికి ఇంత అందం ఎక్కడిది. కెరటాల పై మెరిసే ఆ వజ్రాల వెలుగు, పాల నురుగు చందమామది ఐతే, ఈ చలాకీ తనం, లోతైన భావం నా పోలిక. ఆ అంతులేని తనం మా ఇద్దరి పోలిక నాకు చంద్రుని పై వున్న అంతులేని ప్రేమ లా, చంద్రునికి వున్న అంతులేని ఆకర్షణ లా ఈ సముద్రానికి ఎక్కడా లేని అంతులేని నీరు గా మారింది. నేను చంద్రుని చూడటం లేదు కాని ఆ సముద్రంలో మెరుపుగా,ఆ గాలిలో చల్లదనం లా, ఆ చీకటిలో వెలుగులా, నన్ను చుట్టు ముట్టిన తన వెన్నెల కౌగిలిలోనే నేను వున్నాను. చందమామ కూడా నన్ను చూడటం లేదు ఎగిసి పడుతున్న కెరటాలలో నా మనసులోని భావాలను,భయాలనూ నవ్వుతూ చూస్తున్నాడు. మేమిద్దరం మౌనంగా వున్నాము కాని మాట్లాడుకుంటున్నాము. " నేను ఫీల్డ్ కి వెళ్ళినా, బండి మీద వస్తున్నా నా వెంటే వస్తున్నావు కదా, జీడి చెట్ల చాటునుండి నువ్వు నన్ను చూడటం నేను చూసాలే అని నేను చెప్పాను.' 'చూస్తున్నానని నువ్వు గమనిస్తున్నావని నేను కూడా చూశాలే, ఎవరితోనో మాట్లాడుతూ చీకటి పడే సరికి నేను వచ్చానా లేదా అని నువ్వు ఆకాశం వైపు చూడటం నేనూ చూశాలే, నేను రాని రోజున నీ కళ్ళల్లో నిరాశ ని మబ్బుల చాటు నుండి చూశాలే" అని నన్ను మౌనంగా నే ఆట పట్టిస్తున్నాడు"

ఎంత సమయమైనా మేమిద్దరం ఇలా మౌనంగా ఒకరికొకరు తోడుగా వుండగలం. తన చల్లని వెన్నెల వెలుగులు నాకిష్టం, తనని చూసి మురిసిపోయే నా కళ్ళల్లో వెలిగిపోయే వెన్నెల తనకిష్టం. కాని మా మౌనం, ఏకాంతం సముద్రపు ఘర్జన తో భంగం అయింది. ఇక నేను అల్లరి చేసి ఆటలాడి అలసి పోయాను, ఇక నిద్ర వస్తుంది నాకు అని గట్టిగా చెప్పింది. ఇక చేసేదేముంది, మళ్ళీ కలవాలని కళ్ళతోనే బాస చేసుకొని విడిపోయాము. చందమామ పైకెళ్ళిపోయాడు, సముద్రానికి వెన్నెల దుప్పటి కప్పి జోకొట్టాడు. నేను పెదవులు కలిపాను గుడ్ నైట్ కిస్ పెట్టాలని,సముద్రపు ఉప్పదనం తగిలింది నా పెదవుల పై. నవ్వుకుంటూ వచ్చేశాను.మనసంతా ఎంతో హాయిగా వుంది,తృప్తిగా వుంది,అసంతృప్తిగా వేదనగా కూడా వుంది. నాకు తెలుసు పైనుండి నన్నే చూస్తున్నాడని, అదే నాకు తనపై వున్న భరోసా. తనకి తెలుసు నేను ఇప్పుడు తనని చూడనని, చూస్తే వదిలి వెళ్ళలేనని, ఆ ప్రేమకే లొంగి పోయి వస్తున్నాడు నాకోసం నేలపైకి నా విరహపు రాత్రుల్లో తోడుగా..ఎప్పటికీ.

ఇలాగే కాకపోయినా కొద్ది తేడాతో అయినా మనలో ప్రతీ ఒక్కరికి జీవితంలో అప్పుడప్పుడు ఏకాంతం కావాలని, ఆ ఏకాంతంలో ప్రకృతి మన తోడు గా వుంటే మనసు సంతోషంతో నిడిపోయి తృప్తి,అసంతృప్తి ల మధ్య ఊగిసలాడుతూ ఒక తీరని వేదన కలుగుతుంది కదా!! అది ఎందుకు అలా? అది ప్రకృతిలో వున్న గొప్పతనమా? ఇటువంటి అనుభవం నాలుగు గోడల మధ్య ఏరోజూ కలగదు. నేను ఎప్పుడైనా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు సముద్రపు వొడ్డున వున్నా, కృష్ణ తీరాన కూర్చున్నా, జీడి తోటలో కూర్చున్నా, వెన్నెల రాత్రిలో మాత్రమే కలుగుతుంది. రూం లో ఒక్కదాన్నే వున్నా కూడా ఇటువంటి అద్భుతమైన భావం కలగదు. మహా అయితే బోర్ కొట్తి విరుగొస్తుంది, టి.వి.చూసి తలనొప్పి వస్తుంది. మీకెంతో నచ్చిన ఫ్రెండ్ తో మాట్లాడినా, ఒక వేళ మీ లవర్ తో మాట్లాడినా కూడా కలగని సంతోషం ప్రకృతిలో వుంది. వీలైతే ట్రై చెయ్యండి. అదే ఇష్టమైన మనిషితో ఒక్కసారి అలా ఒక ఏకాంతమైన ప్రకృతిలో 10 నిముషాలు మాట్లాడకుండా కూర్చున్నా కూడా అది జీవితాంతం గుర్తుండిపోతుంది. నాకు ఇప్పటికి కళ్ళ ముందు కనిపిస్తూనే వుంటాయి అటువంటి సన్నివేశాలు. ఇంత గొప్ప అనుభవాలను ఇచ్చిన ఈ జీవితం అంటే, ఈ వుద్యోగం అంటే, వీటిని ఆస్వాదించగలిగే నా మనసంటే నాకెంతో ఇష్టం. ఇదంతా మనం మనిషిగా పుట్టడం వలనే కదా! ఎన్నో భావాలను నింపుకున్న మనసులున్న ఈ మనుషులంటే కూడా ఎంతో ఇష్టం. కలిసిన ప్రతీ మనిషి లో ఏదో ఒకటి నచ్చుతుంటే అందరిని ఇష్టపడుతుంటే జీవితం ఎంత బాగుంటుంది కదా!!! ద్వేషాలు లేని, కోపాలు లేని, కల్మషంలేని సంతోషం అందరికీ దొరకాలని ఆశిస్తూ....

మరొక అరుదైన అనుభవాల దిరిసెన పుష్పాన్ని మీ ముందుంచుతున్నాను.

(అంతా రాసి చదివాక ఏదో కవిత్వం లా అనిపిస్తుంది. కాని మొన్న ఒకసారి ఊరినుండి వస్తుంటే జీప్ లో నుండి చూస్తే నాతో పాటు వస్తున్న చంద్రుడుని చూస్తూ వచ్చాను. హొటెల్ రూంలోకి వచ్చాక కూడా నా వెంట పరిగెత్తి వస్తున్న ఆ చందమామే కళ్ళముందు కనిపిస్తుంటే మనసులో కలిగిన భావాలు గుర్తొచ్చిన ఙ్ఞాపకాలు ఇలా రాసాను)

Sunday, August 22, 2010

లవ్, సెక్స్ అండ్ బిజినెస్

(ఈ పోస్ట్ కి ఈ పేరు కి సంబంధం లేక పోతే మాత్రం నన్ను తిట్టుకోకండి. నాకు పేరు తోచలేదు అందుకే ఈ పేరు పెట్టేసా.)

ఆ మధ్య నా కొలీగ్ తో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక అందమైన ఆడ జీవి కనిపించింది. నా మనసులో సంతోషం ఆపుకోలేక తన అందాన్ని నా కొలీగ్ కి వర్ణించాను. "చూడు వినోద్ ఆ షేప్ బ్యాక్ నుండి చూస్తే ఇలాంటి షేప్ బెస్ట్, స్కిన్ చూడు ఎలా మెరుస్తుందో, ఇలా ఆరోగ్యంగా పెద్ద బ్యాక్ తో వుంటేనే అసలు సిసలు జాతి అందం,బాగా పాలు పడతాయి తెలుశా అని చెప్పాను." నా కొలీగ్ నా వైపు చాలా వింతగా చూసి నువ్వు మరీ ఇంత పచ్చిగా  మాట్లాడతావా అని నా వైపు అక్కడ ఎదురుగా వెనక్కి తిరిగి నిల్చున్న ఒకామె బ్యాక్ షేపు ని మార్చి మార్చి చూడటం మొదలు పెట్టాడు. ఛీ ఛీ నేను  చెప్పింది ఆవిడ గురించి  కాదు అక్కడ మేస్తున్న గేదె గురించి అని చెప్పాను. అయినా కూడా మళ్ళీ ఆశ్చర్యపోతూ "నువ్వు గేదె అందం గురించి మాట్లాడుతున్నావా?" అని అడిగాడు.మీకెప్పుడైన అందం అంటే ఎవరు గుర్తొస్తారు, అమ్మాయిలు, చిన్నపిల్లలు, ప్రకృతి, మంచి ఆర్ట్ ఇలా ఏవేవో గుర్తొస్తాయి కదా, కానీ నాకు గేదెలు గుర్తొస్తున్నాయి. నాకు దెయ్యం పట్టిందా అని చూడకండి ఇది నిజంగా నిజం. ఇప్పుడు కాస్త ఆ పిచ్చి తగ్గింది కాని, ఆ మధ్య పశువుల పెంపకం ట్రైనింగ్ తీసుకున్నప్పుడునుండి ఈ పిచ్చి. ఎక్కడైన గేదె కనిపిస్తే చాలు, దాని బ్యాక్ షేప్ ఎలా వుంది, స్కిన్ మెరుస్తుందా లేదా, కొమ్ములు బాగున్నాయా లేదా, నడక బాగుందా లేదా అని చూడటం మొదలు పెట్టాను.

పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు వారి ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రాజెక్టులు చెయ్యటం ముఖ్యం. కూటి కోసమే కదా కోటి విద్యలు. సిటీ లో రకరకాలా పనులుంటాయి చేసి బతకడానికి. కానీ పల్లెల్లో ఏ కుటుంబం చూసినా వారి జీవనాధార గంపలో కనీసం రెండు మూడు రకాల పండ్లు(పనులు) వుంటాయి. అవి కూడా వ్యవసాయము, పశువుల పెంపకం లాంటివే. పల్లెల్లో ప్రతీ వారికి తప్పక ఒకటైన పశువు/ఎనుము/(బర్రె లేదా అవు), వుంటాయి. మరీ పేద వాళ్ళయితే మేకలు, గొర్రెలు వుంటాయి. నిజంగా చూస్తే బర్రెలు, ఆవుల కంటే మేకలే నయం. వాటిని మూవింగ్ బ్యాంక్స్/బ్యాంక్స్ ఆన్ లెగ్స్ అనొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయొచ్చు. తినేది తక్కువ, వాటికోసం చేసే సేవ, కష్టం తక్కువ ఆదాయం బాగుంటుంది. కానీ ఈ బర్రెలున్నాయే.......అదో పెద్ద వ్యాపారం, పని, కళ, కధ ఎదైనా అనొచ్చు. నాకు మనుషుల కంటే కూడా బర్రెలగురించే బాగా తెలుసు అనిపిస్తుంది ఒక్కోసారి.

చిన్నప్పుడు మా ఇంట్లో కూడా పశువులుండేవి అంట. కానీ మా ఇంటికి దూరంగా పశువుల శాల లో వుండేవి. నాకు పాల మీగడలో పంచదార వేసుకొని తినడమే తెలుసు కానీ పశువుల గురించి అసలు ఈ జాబ్ లో జాయిన్ అయిన వరకు ఏమీ తెలీదు. ఎద్దు అన్నా దున్నపోతన్నా మా మమ్మీ నన్ను తిట్టడానికి వాడే తిట్లు అని మాత్రమే తెలుసు. ఇక పశువుల్లో ఆడ మగ తేడా అసలు ఊహకే రాని విషయం.(మా మమ్మీ మాత్రమే, నన్ను మాత్రమే తిట్టే తిట్టు - లెంబెయ్యలా ఏడవకు" అని అర్ధం తెలుశా మీకు?) అలాంటి నేను మీకిప్పుడు ఎన్ని విషయాలైనా చెప్పగలను.

పల్లెల్లో ఆదాయాభివృద్ధి కార్యక్రమం అనగానే గుర్తొచ్చేది ఈ పశువులే, వాళ్ళు కూడా మాకు ఒక గేదెని ఇప్పించండి బాగుపడతాం అంటారు. మొదట్లో అవును కాబోలు, నిజమే ఏముంది ఒక గేదె ఇచ్చేస్తే పోయిందికదా, అది చక్కగా రోజూ పాలిచ్చేస్తుంది, ఆపాలు అమ్మేసుకొని వీళ్ళు అదేదో సినిమాలో వెంకటేష్ లాగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లు అయిపోతారు అనుకునేదాన్ని

అసలు పశువులు ఎక్కడబడితే అక్కడ ఎడ్జస్ట్ కాలేవు.వాటికి అలవాటైన వాతావరణం లో కూడా సరిగా పాలు ఇవ్వాలంటే ఎన్నో కండిషన్స్ అప్లై అవుతాయి.పచ్చి మేత,ఎండు మేత, దాణా, నీళ్ళు, దోమలు, అది వుండే ప్రదేశం, వేడి, వాసన,కాలం ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో విషయాల ప్రభావం వుంటుంది. ఎక్కడో హర్యానాలో బాగా పాలిస్తున్నాయి కదా అని జెర్సీ జాతి ఆవులని ఇక్కడికి తెచ్చి ఇచ్చారు పశు క్రాంతి పధకం లో, చూడడానికి భలే బాగున్నాయి. అది తినే తిండి పెట్టలేక ఆస్థులు అమ్ముకోవలసి వచ్చింది రైతులకి. తీరా తినింది కదా ఇక పాలివ్వొచ్చు కదా!! అహా లేదు అసలు ఇవ్వట్లేదు. కారణాలేంటని మాకొక చర్చ జరిగింది. ఏలూరులో వెలుగులో మా డి.పి.ఎం లు ఆ ఆవుల వెంట తిరిగి, వాటితో పాటు మేతకెళ్ళి, నిద్రపోయి పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటి అంటే ఇక్కడి వేడి తట్టుకోలేకపోవటమే కాక, పాపం ఈ ఆవులు సైటు కొడుతుంటే ఎద్దులకి తెలియటం లేదంట. అర్ధం కాలేదా, సరిగా చెప్తా వినండి. మామూలుగా ఈనిన 21 రోజులకే పశువులు మళ్ళీ ఎదకొస్తాయంట, ఎదకొస్తే మన ఏరియా లో పశువులు నానా హంగామా చేస్తుంటాయి. ఎక్కువగా అరవటం, కట్టు తెంచుకొని పరిగెత్తటం, మిగిలిన పశువుల మీదకి ఎక్కడం లాంటివేవో, చేస్తాయి. గేదలకైతె కొన్నిసార్లు మూగ ఎద వస్తుంది అంటే సరిగా ఎద లక్షణాలు కనిపించవు. అందుకని వేసక్టమీ చేసిన పోతులని మందలో వదలటం లేదా చీకటి గదిలో 2 రోజులు వుంచటం చేస్తారు. ఇలా మన ఏరియా పశువుల ప్రేమ భాషే మనకి తెలీదు. ఇక హర్యానా పశువు ప్రేమ భాష ఇక్కడి ఎద్దులు అర్ధం చేసుకోలేకపోయాయి. ఇలా మనసు విరిగిన ఆవులు పాలు ఇవ్వటం, చూడి కట్టడం మానేసాయి.(లవర్ మీద కోపం వస్తే అమ్మ మీద అలిగి అన్నం మానేసినట్లు) మనకేమైనా సరదా నా వాటిని ఊరికే మేపి కూర్చోబెట్టడానికి.వాటి ప్రేమ, వాటి సెక్స్, వాటి జీవితం అంతా మనం నియంత్రిస్తున్నది ఎందుకు?, మన లాభం కోసమే కదా. అలా అని ఎవరితో బడితే వాళ్ళతో ..ఐ మీన్ దారిన పోయే దున్నపోతులన్నిటితో ప్రేమలో పడకూడదు. మేలు జాతి గిత్తలుండాలి. అవి ఎవరు పెంచుతున్నారు ఈకాలం. వ్యవసాయానికి అవసరమైన రోజుల్లో ,ఎడ్ల పందాల కోసమో వుండేవి. ఇప్పుడు వాటితో అంత వుపయోగం లేదు.ఒక వేళ ఒకటీ రెండూ అక్కడక్కడా వున్నా అవి మేలు జాతి అని గ్యారంటీ లేదు, దీని తల్లి గుణాలు బట్టి మేలు జాతి అవునా కాదా అని నిర్ణయించాలి. ఆవిడెక్కడుందో ఎవరికి తెలుస్తుంది(మనుషులని అలా తల్లి నుండి కుటుంబం నుండి వేరు చేసేసి ఎక్కడో సంతలో అమ్మేస్తే ఎలా అనిపిస్తుంది? ఒక్కోసారి ఇలా సంతలని, పశువులని పరిశీలిస్తే బాధగా అనిపిస్తుంది, వాటికి అసలు తెలుస్టుందో లేదో కాని) ఒక వేళ మేలు జాతి అయినా మహా అయితే 100-150 సార్లు మాత్రమే సెక్శ్ చెయ్యగలదు జీవిత కాలంలో. మన బిజినెస్ టార్గెట్స్ కి ఈ సెక్స్ నెంబర్ ఏమూలకీ రాదు. అదే వీర్యం కలెక్ట్ చేసి పెడితే 2-5 వేల పశువులకి గర్భదారణ చెయ్యొచ్చు. పశువులని చూస్తే వాటి మగ జాతి మీద పాపం జాలేస్తుంది. కేవలం వీర్య దాతలుగా కాక ఇంకెందుకూ అవసరం లేకుండా పోయాయి. కోళ్ళల్లో పెట్టకావాలి గుడ్డు కావాలి, పెద్ద పశువుల్లో చూస్తే ఆవు, గేదె కావాలి పాలు కావాలి. ఆడ దూడ కావాలి.కోడె దూడ కొన్నిరోజులకే తిండి దండగ అంటారు.మేకల్లో కూడా అంతే ఆడ మేక కావాలి చక్కగా సంవత్సరం తిరిగే సరికి 4 పిల్లలు రెండు ఈతల్లో.మేకల్లో ఐతే అసలు మరీ దారుణం మంద అంతటికీ కలిపి ఒకటే మేక పోతు. మరీ ఇంత బహు భార్యత్వమా?? మొదట్లో మేము చాలా ఇబ్బందులు పడేవాల్లం కొన్ని ప్రశ్నలు వెయ్యడానికి. నాబార్డ్ రూల్స్ ప్రకారం 6మేకలు ఒక మేక పోతు కొనుక్కోమని ఒక గ్రామంలో 20 మండికి డబ్బులిచ్చాము. వాలేమో ఊరిలో మంద మొత్తానికి ఒకే మేక పోతు కొన్నారు ఎందుకలా చేశారు అని అడిగితే ఒకటి చాలు మంద అంతటికీ అని చెప్పారు. మా సుధర్శంగారు తనకి వచ్చిన తెలుగులో "అలా అయితే ఎలా బాబు ఒక్క పోతు ఎంత కష్టపడుతుంది అన్ని మేకలతో?" అని అడిగేసారు. ఆ గ్రామస్థులందరు నవ్వి నవ్వి ఎదో బూతు మాట అనేసారు. అతనికి తెలుగు రాదు కాబట్టి అర్ధం కాక బతికిపోయారు, నాకు అర్ధం అయి కానట్లు నటంచేసాను. ఉత్పత్తి దారుడికి కష్టమే తప్ప లాభం పెద్దగా వుండదు ఎలాగూ అందుకే వాళ్ళు ఇవన్నీ అంచనా వేసి ఏది లాభం అని చూసుకుంటారు. ఎదకొచ్చింది కదా అని ఎప్పుడు బడితే అప్పుడు గర్భదారణ చేయించరు. 12 గంటలలోపల చేయించాలి. కానీ పాలిచ్చే పశువులకి కనీసం 4, 5 నెలలు ఎదకొచ్చినా కట్టించరు. గర్భం వస్తే పాలు తగ్గిపోతాయనే అనుమానం తో, కానీ సరైన ఆహారం పెడితే, ఈత, పాల గ్రాఫ్ చూసుకొంటే మొదటి, రెండో ఎదల్లో కట్టిస్తే వాళ్ళకి కూడా లాభం ఎప్పుడూ పాలిస్తుంది మద్యలో ఒక నెల మాత్రం గ్యాప్ తో , కానీ కట్టించక పోవటం వల్ల,అది ఎదకొచ్చీ వచ్చీ ఇక విసుగొచ్చి ఎదకి రావతం మానేస్తుంది. అంతే కాదు ఒక వేల 4, 5 నెలల తరువాత కట్టించినా ఈలోగా పాలు ఆగిపోయి 4,5 నెలలు పాలివ్వకుండా సూడితో వుంటుంది. ఈలోగా బ్యాంకు వాళ్ళు ఇచ్చిన లోను కి
బకాయి పడిపోయి పశువుని అమ్మేస్తారు.

ఎంత చేసినా గేదె పాలు(+ నీళ్ళు), పేడ, ఎరువు అన్నీ కలిపినా ఖర్చులు పోను నెలకి 1500/- అంతే ఒక గేదె నుండి ఆదాయం రాదు. అదీ కొన్ని నెలలు ఎందిపోతుంది కాబట్టి 3,4 గేదెలు వుంటే కాని సరైన ఆదాయం రాదు.ఎక్కువయ్యే కొలది ఖర్చు కూడా. వ్యవసాయం వున్న వాళ్ళకే ఈ పశువులు లాభం.గడ్డి ఖర్చు వుండదు కాబట్టి. లేదంటే వ్యవసాయం లేనివాళ్ళు అప్పులపాలైపోతారు.


ఏంటో ఈ పశువులు, పేడా, పిడకలు అనుకుంటూ ఈ పోస్టు మరీ దూరదర్శన్ వారి పందుల పెంపకం ప్రోగ్రాములా వుందా?అయినా సరే చదివారుగా, అందుకు కృతజ్ఞతగా మీరెపుడైనా పశువులు పెంచాలనుకుంటే నన్నడగండి మీకో మంచి గేదెని సెలెక్ట్ చేసి పెడతాను. అంతే కాదు ఇంకా చాలా మెళుకువలు కూడా నేర్పిస్తాను. అయినా నాలాంటి పిచ్చి కోరికలు ఎవరికుంటాయి? నాకు మాత్రం చక్కగా ఒక 5 ఎకరాలా స్థలం లో అన్ని కాయాగూరలు, పండ్లు చెట్లు వేసి, 4 గేదెలు, 6 మేకలు పెంచుకుంటూ పంపుసెట్టు దగ్గర, కొబ్బరి చెట్ల నీడలో, రావి చెట్టు దగ్గరలో చల్లని తాటాకుల పాకవేసుకొని,ఊర్లో పిల్లలికి ట్యూషన్లు చెప్పుకుంటూ బతికితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది.కానీ అది ఎప్పటికైన నిజమవుతుందో లేదో!! నేను కూడా ఇప్పుడు కాదు, ఈపని ఇక వద్దు అని అనిపించినప్పుడు.

(ఇప్పుడు సడన్ గా నాకు ఈ జంతు ప్రేమ ఎందుకొచ్చిందో తెలుసా, మేము చేసిన ప్రాజెక్టులకు ఎవాల్యూయేషన్, ఆడిట్ జరుగుతుంది కదా ఈ లోపల మళ్ళీ అన్ని ప్రాజెక్టులు చూసి వాటిని చెయ్యడంలో మా వుద్దేశ్యం నెరవేరిందా అని చూస్తున్నాము. వాటిలో భాగంగా ఈ నల్లని నిగనిగలాడే గేదలను చూస్తుంటే ఈ ఆలోచనలన్నీ వచ్చాయి సరే అని పోస్ట్ రాసి పడేసా..)