Wednesday, February 24, 2010

సిరిమువ్వలు...చిరు సందడి చెయ్యలని ఆశపడుతున్నా



అందువలన….నేను నా భ్లాగ్ క్రియేట్ చేసుకొని నాకు తోచింది రాయలని నిర్ణయించుకున్నా అన్నమాట. ఆ ఎందువలన ఏంటి అనేది ఈ టి.వి లో …ఫలానా సీరియల్ అంత పేద్ద కధ..మీకు పని ఏమీ లేనప్పుడు, నాకు కూడా పని ఏమి లేనప్పుడు .. ఆ కధ చెప్పుకుందాం.

ఇప్పుడు మాత్రం అసలు నేను ఎమి రాయాలనుకుంటున్ననో చెప్తాను. మొదట నేనెవరూ చెప్పాలి కదా!!!.. ఐ మీన్ ఏముంది గొప్ప నా గురించి చెప్పుకోడానికి.నా పేరు శిరీష సింపుల్ గా నేను ఒక ఆడ అమ్మాయిని అని చెప్పాల? ( మగ అమ్మాయిలు వుంటారా అని అడగకండి ప్లీస్ నేను అసలే టెన్షన్ లో వున్నాను), అమ్మని (5 సం. ల బాబు కి), వర్కింగ్ వుమన్ ని… అంతే కదా, ఓస్ స్ స్ అలాంటి వాళ్ళు సవాలక్ష మంది వుంటారు.. మరి అందరు రాయటం మొదలు పెట్టేసి, బ్లాగ్ చదవమంటే కష్టమే కదా!!! నిజమే …. కాని తప్పదు… మీరు చదవాల్సిందే. ఎందుకంటే నేను చెప్పే విషయాలు కొన్ని సార్లు మీకు బోల్డంత హాస్చర్యం, ఆనందం, బాధ, ఆలొచన కల్గిస్తాయి మరి. ఏందుకంటే నేను వర్క్ చేసెది “డెవలెప్మెంట్ సెక్టర్”. (పేరు ఎప్పుడూ వినలేదా???జాబ్ లో జాయిన్ అయినవరకు నేను కూడ వినలేదు). నా ప్రొఫెషన్ గురించి ఎవరైన అడిగితే ఒక ముక్కలొ డాక్టర్, యాక్టర్, ఇంజినీర్ అని చెప్పడానికి కుదరదు… ఆఖరికి రిక్షా తొక్కేవాళ్ళు కూడ “ ఐ యాం ఎ రిక్షా పుల్లర్” అని ఒక్క మాటలొ తన జాబ్ గురించి చెప్పగలరు. కానీ నేను + నాలంటి కొందురు అభాగ్యులు మాత్రం ఒక మాటలొ కాదు కదా ఒక్క పేజీ లో కూడా చెప్పలేము.. మేము మాత్రం మమ్మల్ని డెవలెప్ మెంట్ ప్రొఫెషనల్స్ అనీ, సోషల్ ఇంజనీర్స్ అనీ, సోషల్ వర్కర్స్ అనీ ముద్దుగా పిలుచుకుంటాము. ( అంటే ఏంటి ? అని మీ నెక్సట్ క్వశ్చన్ కదా!!! నాకు తెలుసు కాని ప్లీస్ అలా అడగకండి) . మేము ఎదో ఒక ఎన్.జి.ఒ ( నేషనల్/ఇంటర్నేషనల్) ద్వారా పని చేస్తాము. ఆలా అని సేవ మాత్రమే చేస్తాము జీతం తీసుకోము అనుకోకండి మేమూ బతకాలి కదా!!!

నేను మామూలుగ ఒక చిన్న టౌన్ లో పుట్టి అక్కడే చదివి, అందరిలాగె బి.ఎ చేసి, ఎం.ఎ కి అనుకోకుండ ఎ.యు లో సీటు వచ్చేసి కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరుచుకుని..జీవితం మీద ఎన్నో ఆశలు ఆశయాలు పెంచుకున్న సగటు స్టూడెంట్ ని. ఏదో ఉద్యోగం చెయ్యాలనే తపనలొ అనుకోకుండ ఈ ప్రొఫెషన్ లోకి వచ్చి పడ్డాను. ( ఇప్పుడు సంతొషిస్తున్నాను????). అసలు నాలాంటి అమ్మాయిలెందరికో బయట చదువు, ఉద్యొగం లాంటివి చాల కష్ట సాధ్యాలు. వాటికోసం పేరెంట్స్ తో పోరాటాలు. మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నరా? నిజమండి బాబూ.. అలాంటి బ్యాక్ గ్రౌండ్ తో నేను జాబ్ ఎలా జాయిన్ అయి వుంటానో ఎలా నెగ్గుకొని వచ్చానో అందరికి చెప్పకపోతే నా తలకాయ వెయ్యి ముక్కలయిపోతుంది అనిపించింది (చదివాక మీ అందరి తలకాయలు ఎన్ని ముక్కలయినా నాకు అనవసరం)

కాని నా జాబ్ నాకు చాలా నేర్పింది. ఈ జాబ్ లొ ఎన్నో ఊర్లు తిరిగాను, ఎన్నో వృత్తుల వారిని కలిశాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను, మీటింగుల్లొ మాట్లడాను, విన్నాను, ఎందరో నాయకుల్ని, ఆఫీసర్లని కలిశాను, కలిసి పని చేశాను ( నేనెంతో ముసలి అయిపొయానన్నట్లు చెప్తున్నా కదా!!! ఫీల్ కోసం అలా చెప్పాను, టోటల్ గా ఇంతవరకు పని చేసింది కేవలం పది సంవత్సరాలే) ఒక్కొక్క రోజు ఒక కొత్త అనుభవం, ఒక్కో అనుభవం ఒక్కో కొత్త పాఠం. ఓక్కొసారి కమ్యూనిటీ (అంటే జనం) కి ద్రోహం చెయ్యలా? భాస్ కి/ఉద్యోగానికి ద్రోహం చెయ్యాల అనే పరిస్థితి. ఫగలు రాత్రి నడక, బోజనం, నిద్ర, కనీసం ఒక సేఫ్ ప్లేస్ కూడా వుండదు. ఛెంబు పట్టుకొని పొలం గట్లు మీద పరుగులు తీయటం, ఆరుబయట ఓపెన్ స్నానాలు, అడవి మద్యలో వున్నప్పుడు పులి ఇప్పుడే ఇటు వెళ్ళింది మేడం కాసేపు ఇక్కడే వుండి వెళ్దాము అని చెప్పినప్పుడు.. బాస్ తో పోరాడగలను, లేడీ కొలీగ్ తో పొరాడగలను కానీ పులి, పాము తో కూడా పోరాడలంటే ఈ కష్టాలు వద్దురా దేవుడా అనిపించేది మళ్ళీ వెంటనే మన డాగ్ టెయిల్ వంకరే కదా!!!! మళ్ళీ ఈ ఉద్యొగమే నచ్చేది. ఈ ఉద్యోగం నాకు చాల నేర్పింది. నా వ్యక్తిగత జీవితం, ఉద్యోగ జీవితం అని తేడా లేకుండా చాల విషయాలు ఈ ఉద్యోగంలో నేను నేర్చుకున్నాను.. ఇవన్నీ ఒక విధంగా ఇప్పటి సాఫ్ట్ వేర్/ ఫాస్ట్ కల్చర్ కి కాస్త దూరంగా తేడాగా నన్ను తయారు చేశాయి( నన్ను మా ఇంట్లో తేడా అంటారు, అంటే మామూలు ఆలోచనలు లేవని ) ఆ విషయం నాకు నా చెల్లి తమ్ముడు ద్వారా అర్ధం అవుతుంది.ఉధాహరణకి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు అందరిలా నేను పట్టూచీర ఎందుకు కట్టుకోవాలి,అసలు బంగారు నగలెందుకు కొనుక్కోవాలి, మన సోషల్ వర్కర్ డ్రెస్ తో సత్యన్నారాయణ వ్రతం ఎందుకు చెయ్యకూడదు అని ఆర్గుమెంట్ చేస్తా....కాని నేను నేర్చుకున్నవి, నా అనుభవాలు అలా వదిలేయాలని, లేక పోతే నాకు మత్రమే పరిమితం చేసుకోవలని అనిపించలేదు. ఆందుకే కాస్త బోరింగ్ టాపిక్/బ్లాగ్ అని పేరు వచ్చినా సరే నేను రాయాలని నిర్ణయించేసుకున్నాను.

సో ఫ్రెండ్స్, అందువలన….నేను రాయాల్సిందే మీరు చదవాల్సిందే.. మీరు అస్సలు మొహమాటం పడకండి,నేను కూడా పడను ..ఇక నో ఆర్గ్యుమెంట్స్!!!

హెచ్చరిక: ఈ బ్లాగ్ లొ అప్పుడప్పుడు కొందరు ఐ.ఎ.యస్ ఆఫీసర్లు వస్తారు….నా సేఫ్టీ కోసం నేను వాళ్ళ పేర్లు మార్చేయాలనుకుంటున్నాను.( హమ్మో మీలో ఎవరైనా వాళ్ళతో, వెళ్ళి నా మీద లేనిపోనివి చెప్పేస్తే??? ఆందుకన్నమాట!!!).

సరే మరి ఎక్కడనుండి మొదలు పెట్టాలి?????

నా మొదటి జాబ్ తో కొబ్బరికాయ కొడతా ( దీనితోనే మంగళం కూడా పాడేస్తావు అని అంతరాత్మ హెచ్చరిస్తుంది ఎందుకబ్బా???)

అప్పటికి ఒక ఇంటర్యూ లో దారుణంగా ఫెయిల్ అయ్యాక( ఆ కధ మళ్ళీ ఎపుడైనా చెప్పుకుందాము) ఇది రెండవ ఇంటర్యూ, మళ్ళీ వైజాగ్ లోనే, నాకు తెలిసిన పేద్ద సిటీ, ఎక్కువ దూరం అప్పటికి అదే, ఎందుంకంటే మా ఊరికి దగ్గర కదా!! న్యూస్ పేపర్ లొ ఏ కంపెనీ అని ప్రిఫరెన్సు ఇచ్చే స్టేజి కి మన తెలివి అప్పటికి లేదు కాబట్టి సరిగా చూసుకోకుండానే ఇంటర్యూ కి వెళ్ళా. అప్పటి వరకూ నాకు అది కంపెనీ కాదని ఆర్గనైజేషన్ అని కూడా తెలియదు. అన్ని ఒకటే నా వరకు. వాళ్ళ ఆఫీసు, ఆఫీసు లా లేదు, మామూలు 2 బెడ్రూం ఫ్లాట్ లా వుంది. హాల్ లొ ఒక 19 సం.ల అబ్బాయి (మేనేజర్ లా ఫీల్ అయ్యే అక్కడి ఆఫీస్ బాయ్) వున్నాడు కూర్చోమన్నాడు. హాల్ చీకటి గా వుంది బహుశా పవర్ కట్ అనుకున్నా కాని జాయిన్ అయిన తరువాత తెలిసింది పవర్ పొదుపనీ, కొన్నిసార్లు బిల్లు కట్టకపొతే కూడా అని!!(అప్పుడే తెలిసి ఉంటే నా కధ వేరే లా వుండేదేమో హుహ్!!) ఉదయం వెళ్తే మధ్యానం వరకు వెయిట్ చెశా..మధ్యలో టీ రెండు బిస్కెట్లు ఇచ్చాడు బాయ్. ఆ టైం లో లోపల రూముల్లో నుండి కొందరు వచ్చి తొంగి చూసి వెళ్ళారు. నాతో పాటు ఇంటర్యూ కి వచ్చిన ఇంకో ముగ్గురు వాళ్ళని చాలా అడిగేశారు ఆ కొద్ది టైం లో. నేను ఏమి అడగలేదే వాళ్ళు నన్ను ఏమి అనుకుంటారో అని కాసేపు బయపడ్డాను కూడా. అందరికీ అయిపోయాక నన్ను పిలిచారు లోపలికి, లోపల ఒక రూంలో ఒక మద్య వయసు ఆవిడ నీట్ గా తయారయ్యి కూర్చుని వున్నారు. ఆమే నన్ను ఇంటర్యూ చేశారు. ఏవేవో ప్రశ్నలు అడుగుతారు అనుకుంటే పెద్దగా ఏమి అడగలేదు, కనీసం నా ఎం.ఎ మార్కులు కూడా అడగలేదు. జాబ్ ఎలా వుంటుందో చెప్పారు , ట్రైబల్ ఏరియాకి వెళ్ళాలి, అరకు లోయ లో ఒక ఫీల్డ్ ఆఫీసు వుందని అరుకు వెళ్ళి 2, 3 రొజులు వుండాలని చెప్పారు. నాకు అరుకు అనగానే ఎం.ఎ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళిన పిక్నిక్ కళ్ళ ముందు కనిపించింది హుర్రే అని ఎగిరి గెంతినంత పని చేశాను. నాకు అరుకు అంటే భలే ఇష్టం అండి మీరు అక్కడే వుండిపోమన్నా సరే నాకు ప్రాబ్లం లేదు అని చేప్పాను. ఆవిడ ఎందుకో నా వైపు జాలిగా చూశారనిపించింది, కాని నెను అంతగా పట్టించుకోలేదు. కనీసం జీతం ఎంత ఇస్తారు, ఇతర సదుపాయాలేంటి అని అడిగి తెలుసుకోవాలని నాకు అప్పుడు తేలీదు, మా డాడీ నాకు ఇచ్చే పాకెట్ మనీయే అప్పుడు 4000 రూ./- నెలకి, మరి జాబ్ లో జీతం అంటే కనీసం ఒక 6000/- -7000/- వుండదా అనుకున్నా. నా పొజిషన్ పేరు కూడా అసలే చాల గొప్పగా వుంది మరి - ప్రోగ్రాం సెక్రెటరీ టు ఛైర్మన్/డైరెక్టర్, నేను అరుకు వెళ్ళాలంటే కారు వుంది అని కూడా చెప్పారు. ఇన్ని చెప్పాక చీప్ గా నాకు జీతం ఎంత ఇస్తారు అని ఎమి అడుగుతాము అనుకున్నా అదీ కాక నాకు డబ్బు విలువ పెద్దగా తెలీదు అప్పటికి. చెప్పాను కదా నా పాకెట్ మనీ కూడా మిగిలిపోయేది, అంటే జీవితం లో డబ్బు మనిషికి చాలా తక్కువ అవసరం అవుతుందేమో అనుకునేదాన్ని, పాకెట్ మనీ కాకుండా మావాళ్ళు నా ఖర్చులన్ని పెడుతున్నారనే విషయం నా ఖర్చులన్నీ నేను జీతం లోనుండి పెట్టుకోవటం మొదలుపెట్టాక అర్ధం అయింది. నేను అడగలేదు వాళ్ళు చెప్పలేదు జీతం విషయం, తీరా సెలెక్టెడ్ అని చెప్పాక,ఒక 2 రోజుల్లో జాయిన్ అయిపోతా అని చెప్పి ఒప్పుకున్న తరువాత షాకింగ్ న్యూస్ వెళ్ళిపోయే ముందు చెప్పారు...ఇప్పుడు మీది ప్రొబేషన్ పీరియడ్ మీకు 2 నెలల వరకు 1750/-(ఒక 50/- కలిపో, తీసో ఎందుకు రౌండ్ ఫిగర్ చెయ్యలేదో నాకు తెలీదు) మాత్రమే ఇస్తాము, 2 నెలల తరువాత 2000/- ఇస్తాము అని చెప్పారు.

నాకు ఆ విషయం వినడానికి అప్పుడు కాస్త షాక్ అనిపించినా, జాబ్ వచ్చిన ఆనందంలో అంతగా పట్టించుకోలేదు. కాని మా ఇంట్లో చాల పెద్ద యుద్ధం చేసి నిరాహార ధీక్ష చేసి నేను జాబ్ చేస్తున్నాను. నా శపధం ప్రకారం నేను మా పేరెంట్స్ మీద ఏ విషయానికీ ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా బ్రతికి చూపించాలనుకున్నాను కాబట్టి, ఎక్కువ కాలం ఎ.యు హాస్టల్ లో ఒ.సి గా వుడలేము కాబట్టి దొరికిన జాబ్ లో ముందు జాయిన్ అవ్వటమే మంచిది అని నిర్ణయించుకున్నాను. అది నా జీవితం లో బహుశా నా స్వంత ఆలోచనతో తీసుకున్న మొదటి సర్దుబాటు. అప్పటి వరకు ఎప్పుడు ఎందులో కాంప్రమైస్ కాలేదు. నేను అడగనివి కూడా అన్నీ ముందే సమకూరిపొయేవి ఎప్పుడూ, సో సర్దుబాటు అవసరం రాలేదు. ఒకవేళ ఏ రోజైన కూర నచ్చ్క పోయిన సర్దుకునే అలవాటు అంత చిన్న విషయాలలో కూడా లేదు. అంత దారుణమైన పొగరు( కాని అప్పుడు అలా అనిపించలేదు) ఉండేది. అలా నా మొదటి జాబ్ జాయిన్ అయ్యాను. ఇంటికి ఫోను చేసి మా మమ్మీ తో (డాడీతో గొడవ కదా !!) చూడు జస్ట్ ఒక వారం లో ఎలా ఉద్యోగం సంపాదించనో అని గొప్పగా చెప్పాను. అక్కడికి నేనేదో ఐ.ఎ.ఎస్ సాధించినట్లు. కాని అది నిజంగా నా మొదటి విజయమే కదండీ! ఎందుకంటే మా ఇంట్లో అసలు చదువు కోవటం అనేది బతకడానికి ఆస్థులు లేని వాళ్ళు మాత్రమే చదువుతారు మేము కేవలం పెళ్ళి కార్డ్ లో, గేటు దగ్గర నేంప్లేట్ లో పేరు పక్కన మా డిగ్రీలు రాసుకోడానికే అనే వుద్దేశ్యం వుంది. లేకపోతే డాక్టర్, ఇంజనీర్ లాంటి స్టేటస్ కి తగిన చదువులు చదవాలి. అటువంటి ఆలొచనలున్న కుటుంబం లో మొదట అసలు ఎం.ఎ వరకు చదువు కోవడమే (మద్యలోనే పెళ్ళి జరిగిపోవాల్సిన ప్రమాదం తప్పించుకొని) చాలా పెద్ద విజయం అలాంటిది ఉద్యోగం కూడా చేస్తున్నాను అంటే నావరకు మరియు మా బంధు వర్గం లో నాది చాల పెద్ద విజయం ( కాని వాళ్ళ భాషలో మంచి అమ్మయిలు నాలా వుండకూడదు, నేను చెప్పిన మాట వినే రకం(?) కాదు ). అలా అని నా విజయం వేస్ట్ అయిపోలేదు ఇంట్లో నెనే పెద్దదానిని కావటం వలన నా తరువాత వాళ్ళాందరికి చదువు, జాబ్ లాంటి వాటికోసం నాలాగ డాడీలతో యుద్ధాలు, నిరాహార దీక్షలు చెయ్యాల్సిన అవసరం రాలెదు. అంటే అది నా విజయమే కదా!!

నా మొదటి జాబ్ ఒక చిన్న ఎన్.జి.ఒ, వైజాగ్ లో. అప్పటికి నాకు నిజంగా అసలు ఎన్.జి.ఒ గురించి ఎమీ తెలీదు. వాళ్ళు అరుకు ఏరియా లో వున్న గ్రామాలలో ట్రైబల్స్ తో పని చేస్తారు. ఆ ఎన్.జి.ఒ పని ఏంటి అంటే ముఖ్యం గా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అని చెప్పవచ్చు, ప్రతీ ట్రైబల్ తెగ కి ఒక సంస్కృతి కొన్ని పద్ధతులు వుంటాయి. ఆ పద్ధతులు, పండగలు అన్ని కూడ ఒక మంచి వుద్ధెశ్యం కోసం, వారి మనుగడకి దోహదం చేసేవిధంగా అవి డిజైన్ చేయబడ్డాయనే నమ్మకం తో ఆ ఇండీజీనియస్ నాలెడ్జె ( కరెక్ట్ ఐన తెలుగు అర్ధం నాకు తెలీదు కాని ప్రాచీన/సాంప్రదయకమైన/ప్రాంతీయ అనే అర్ధం వుండొచ్చు) ని మళ్ళీ పునరుధ్ధరించాలనేది, దాని ద్వార ట్రైబల్స్ లో వస్తున్న ఆహార, ఆర్ధిక, సాంస్కృతిక మొదలైన అనేక సమస్యలను తగ్గించాలని ఈ సంస్థ వుద్ధెశ్యం.

ఎన్.జి.ఒ లకు ఏదో ఒక వుధ్ధేశం మీద పని చేయలన్న తపన వుంటుంది. కాని కొందరు చాలా నిజమైన తపనతో విపరీతంగా ఆలొచించి ఆరోగ్యం కూడా పాడుచేసుకుంటారు. కొందరు అప్పటి ట్రెండ్ ప్రకారం దేనికి ఫండ్స్ వస్తే దానికి పని చేస్తూ పోతుంటారు కొంత పెరిగాక వారి ఆశయం నిలబెట్టుకొనే దిశగా ప్రయత్నిస్తారు, కొందరు ఆశయం పక్కన పెట్టేస్తారు. కాని అందరు ఎదో ఒకటి చేయాలనే తపనతో మొదలు పెడతారు.

ప్రస్తుతం కధలోకి వస్తే వాళ్ళకు అరుకు లో ఒక రీసెర్చ్ సెంటర్ వుంది. రీసెర్చ్ అంటే అక్కడ సైంటిస్ట్లు, ల్యాబ్, గాజు బీకరులు వుండవు. చాల ఆహ్లాదకరమైన వాతావరణం లో మంచి ట్రైనింగ్ సెంటర్, కిచెన్, కొన్ని ట్రైబల్ సంస్కృతికి సంబందిచిన వస్తువుల సేకరణ, కొందరు వుండడానికి వసతి వుంటాయి. ఒక కొండని తీసుకొని అలా డెవెలప్ చెశారు. నాలాగ జాయిన్ అయిన స్టాఫ్ అందరికి కొన్ని రోజులు అక్కడ సెంటర్ లో మరియు గ్రామాలలో ఫీల్డ్ టెస్ట్ అంటే ప్రొబేషనరీ లాంటిది. నా బ్యాక్ గ్రౌండ్ చూసిన ఎవరైనా నేను ఫీల్డ్ లో వుండగలనని ఊహించరు. అందుకే నన్ను ఫీల్ద్ కి పంపించేటప్పుడు తప్పక ఒకరు తోడు వుండేలా చూసేవాళ్ళు.నీలయ్య అనే ఒక గిరిజన వ్యక్తి ఎప్పుడు నాతో ఎక్కువగ ఫీల్డ్ కి పంపేవారు. నీలయ్యకి అరుకు చుట్టుపక్కల గ్రామాలలో తెలియని విషయం ఏమి లేదు. అడవి గురించి తెలియనిది అసలే లేదు. ఇక నేను ధైర్యంగా వెళ్ళి వచ్చేదాన్ని. కాని నాకు షాక్ ఎప్పుడూ నీలయ్య రూపంలోనే వచ్చేది అది కూడా ఎలాగో చెప్తా. కాని ముందుగా అక్కడి గ్రామలగురించి, పండగల గురించి కొన్ని విషయాలు చెప్తా.

గిరిజన గ్రామాలంత శుభ్రమైన గ్రామాలు నేను మన గ్రామాలలో ఎక్కడా చూడలేదు.బహుశా నీరు వాడకం గ్రామలలోపల ఎక్కువగా చెయ్యకపోవడం వల్లనేమో. అన్ని అవసరాలకి దగ్గరలో ఎదో ఒక వాగు దగ్గరకి వెళ్తారు. ఇళ్ళు మాత్రం చాలా శుభ్రంగా అలికి పెట్టుకుంటారు. మట్టి ఇల్లు గోడలంతా అందంగా వెరైటీ ముగ్గులతో అలంకరిస్తారు. వారి ముగ్గులకు కూడా అర్ధం వుంది అని మా డైరెక్టర్ రీసెర్చ్ చెప్తుంది.వుదాహరణకి : వాళ్ళు వేసే ముగ్గు ఒక గుంపు తెగకు, కులానికి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ వున్నారో చెప్పే ముగ్గులు, ఆ తెగ ఎదో చూసే వాళ్ళకి అర్ధం అవుతుంది, చెట్లు గురించి, పండగల గురించి చెప్పే ముగ్గులుంటాయి

గిరిజనులు ఒక్కో తెగ వాళ్ళూ కొన్ని పండగలు చేస్తారు. ఆంపొరబ్, పనసపొరబ్, ఇలా ఎవేవో పేర్లున్నాయి. అంటే ఆ పండగ చేసే వరకు ఆ పంట, పండూ వాళ్ళు తినటం మొదలుపెట్టరు. మనకి అది మామూలు పండగలా అనిపిస్తుంది, కాని గిరిజనులు ఎక్కువగ అడవిలో కాసే పండ్లు, కొద్దిగా పండె పంటల పై ఆధారపడటం వలన ఆ పండు లేదా పంటని మొగ్గలోనే తినటం మొదలు పెడితే ఇంకో పండ్లు సీజన్ వచ్చే వరకు ఈ పండ్లు వాళ్ళ ఆహార సమస్యని తీర్చలేదు. అందుకని ఒక సీజన్ లో వుండాల్సిన ఆహార భద్రత కోసం వాళ్ళు వివిధ రకాల పండగలు వుధ్ధేశించబడ్డాయి. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలెని మన లాంటి ఎందరో ఆధునికత పేరుతో వాళ్ళని మతం మార్పించటం, లేదా వాళ్ళే ఆధునికత మోజులొ మన దసరా, దీపావళి లాంటివి చెసుకోవటం మొదలు పెట్టారు.దాని వల్ల వాళ్ళ ఆహర భధ్రత దెబ్బతిని ఆకలి సమస్యకి గురి అవుతున్నారు.

గిరిజనులు ప్రతీ చెట్టుని, కొమ్మని, జంతువిని పూజిస్తారు. దానికి కూడా కారణం వుంది. ప్రతి తెగలో కొన్ని సబ్ తెగలుంటాయి వాటి పేర్లు ఎదో ఒక చెట్టు, జంతువు, పక్షి పేరుతో వుంటాయి, ఆ తెగ వాళ్ళు ఆ జీవి ని పూజించటమే కాదు కాపాడతారు, దానిని వేటాడరు. ఆవిధంగా అడవిలో జీవాల రక్షణ కూడ గిరిజనులు బాధ్యత గా తీసుకుంతారు. కాని మన చట్టాలు గిరిజనులు అడవిలో జీవులని చంపేస్తున్నారని, పోడు వ్యవసాయం, వంట చెఱ్కు వాడకం తో అడవి నాశనం చేస్తున్నారని చెప్పి అడవిలో పుట్టి పెరిగి అడవే తమ జీవితం, దైవం అని భావించే అసలైన అడవి బిడ్డల్ని అడవినుండి చట్టం,వన్యరక్షణ పేరుతో దూరం చేసి అడవి గురించి ఏమీ తెలియని మనం అడవిని కాపాడాలని ప్రయత్నిస్తున్నమా?? అందుకు వుదాహరణ మన గవర్నమెంట్ ప్రోగ్రాములు:

అడవి పెంపకం కోసం మనకి వి.ఎస్.ఎస్ కార్యక్రమం క్రింద అడవి పెంచాలి. అందుకోసమని చక్కగ పాదులు (క్రీపర్స్),చిన్న చిన్న మొక్కలతో వున్న అడవి నేలని మొత్తం క్లీన్ షేవింగ్ చెసేసి ఒకేరకానికి చెందిన కాయలు పువ్వులు ఇవ్వని, అడవిలో ఏ జీవికి పనికిరాని, కేవలం మనిషి వ్యాపార లాభానికి పనికి వచ్చే జీడి, సరుగుడు లాంటి మొక్కలు నాటాము. దానివల్ల అడవిలొ ఈక్విలిబ్రియం( అన్ని రకాల చెట్లు, పాదులు మొ.వి) పాడుచెశాము, పాదులు/నేల మీద పాకే చిన్న చిన్న మొక్కలు భూమి లోని తేమని పట్టి వుంచి నేల సారం కొట్టుకొనిపోకుండా వుంచుతాయి.క్లీన్ గా షేవింగ్ చేయటం వలన అటువంటి చిన్న మొక్కలన్ని పొయాయి అలాగే ఆ నేల కూడా వర్షం పడితే మట్టిని పట్టివుంచె చిన్న మొక్కలు లేక కొట్టుకుపోయింది.

"పోడు". ఇది గిరిజనులు చేసె వ్యవసాయ పధ్ధతి. ఒక చోట చెట్లు అన్ని కొట్టేసి, కాల్చెసి ఆ నేలలొ కొన్ని రొజులు వ్యవసాయం చేస్తారు. కాని కొండ వాలు వల్ల ఒకటి రెండు పంటల తరువాత ఆ నేలలో మట్టి కొట్టుకొని పోయి ఇక పంట పండదు. అందుకని మళ్ళీ ఇంకో ప్రదేశంకి వెళ్ళి అక్కడ చెట్లు కొట్టి మళ్ళీ పోడు చేస్తారు. దీనివల్ల అడవి నాశనం అయిపోతుందని మన గోల. కాని నిజానికి పోడు కోసం గిరిజనులు కొట్టే అడవి కంటే టింబర్ మొదలైన వాటి కోసం మనం కొట్టే చెట్లు చాలా ఎక్కువ.అందువల్ల గిరిజనులని పోడు కి దూరం చెసే బదులు మా లాంటి సంస్థలు పోడు వ్యవసాయం లో భూమి సారం కొట్టుకు పోకుండా చెసే పధ్ధతులు చెప్పేవాళ్ళు. అడవి కొట్టడమే కాదు గిరిజనులు అడవి పెంచటానికి కూడా అంతే కృషి చేస్తారు. వాళ్ళకి వున్న పండగల్లో ఒకటి "వసంత పొరబ్" (పేరు అదే అనుకుంటా) ఆ పండగ లో మగవారికి బొట్టుపెట్టి వేటకి పంపుతారు, వాళ్ళు చెప్పిన దారిలో వెళ్ళి ఎవరు ముందుగా ఏదైన ఒక పెద్ద వేట చేసి వస్తారో వాళ్ళు గెలుస్తారు. అంతే కాదు వారు వెళ్ళే దారి అంతా అన్నిరకాల విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళాలి. ఇది వాళ్ళకు తెలియకుండానె గిరిజనులు అడవి పెంచటానికి చెసే ఒక పండగ.

ఇప్పటికే చాల ఎక్కువ రాశాను. మొదటి పోస్టు ఇంతకంటే రాస్తే మళ్ళీ బయపడి ఎప్పుడూ నా బ్లాగ్ జోలికే రారు. తరువాత పోస్టులో మరిన్ని ఇంట్రస్టింగ్ కబుర్లతో కలుసుకుందాము.

మీకు నా బ్లాగ్ కి అర్ధం వుంది అనిపిస్తే నాకు వ్రాయండి, ఒకవేళ బాగా లేదన్నా కూడా వ్రాయండి...నన్ను సరిదిద్ధడానికి ఎదైనా పరవాలేదు


19 comments:

భాస్కర రామిరెడ్డి said...

స్వాగతం శిరీష గారు.ఆడుతూ పాడుతూ బ్లాగింగ్ చేయండి. మొదటి పోష్ట్ లోనే చాలా కబుర్లు చెప్పారు. వైటింగ్ ఫార్ నెక్స్ట్ పోస్ట్

Could you remove word verification.

భావన said...

ముందు గా బ్లాగ్ లోకం లోకి ఆహ్వానమండి, తరువాత మీ వుద్యోగ లోకం లోకి మమ్ములను ఆహ్వనించి నందుకు ధన్యవాదాలు. చాలా బాగా రాస్తున్నారు మొదటి పోస్ట్ లోనే, ఎక్కువ ప్రపంచం చూసిన అలవాటు మీదేమో. చాలా ఇంట్రస్టింగ్ గా వున్నాయి మీరు చెప్పే విషయాలు.. కాంప్లికేటేడ్ విషయాలను తేలిక గా చెపుతున్నారు. ఇంకో పోస్ట్ కోసం చూస్తుంటాము. Welcome one more time.

radhika said...

చాలా బాగా రాస్తున్నారు

శిరీష said...

thank you very much bhavana, bhaskar and radhika.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

శిరీషగారూ!
మన పక్కనే ఉన్న ఒక కొత్త బంగారు లోకం గురించి రాస్తున్నారు. బాగుంది. ఇవన్నీ మా లాంటి వాళ్ళకు తెలియని విషయాలే సుమా!
ఇక మీ ఉద్యోగ విజయాలు బావున్నాయి.
శిరీష కుసుమం అంటే దిరిసెన పుష్పమేనాండీ!
శిరీష కుసుమం సుకుమారంగా ఉంటుందిట. మీరేమో rocking గా ఉన్నారు!!!!!!!hi.hi..

శిరీష said...

మందాకినీ గారు,

థాంక్స్ ఫర్ కాంప్లిమెంట్స్. భావాలు ఎవరివైనా సున్నితమైనవే సమాజం బట్టి కొన్నిసార్లు రెబల్ అనిపిస్తాయేమొ. నా బ్లాగ్ ద్వారా చాలా విషయాలు అందరికి తెలియజేయాలనీ, మన పక్కనే వున్న మనం పట్టించుకోని మనుషుల గురించి, సమస్యల గురించి చెప్పలనుకుంటున్నను. మీలాగ ప్రొత్సహిస్తే వుత్సాహం గా రాయగలుగుతానేమో. సో థాంక్స్ ఒన్స్ అగైన్.

శిరీష అంటే దిరెసెన పుష్పమే.

bloggerbharathi said...

చాలా అద్భుతమైన ఆలోచన. మీరు ఎన్ .జి.ఓ లో పనిచేస్తున్ననగానే నాకు మీ భావాలు మొత్తం అవగాహనా అయ్యి. నేను కూడా
గ్రామీణ్నాభివ్రుద్ధి శాఖ లో నాలుగేళ్ళు పని చేశాను.మీ బ్లాగ్ చదువుతుంటే నన్ను నేను చదువుతున్నట్లుంది మనిద్దరి భావనలుకుడా బాగా దగ్గరగా సరిపోలుతాయి ఆ ఉద్యోగం లో ఎంత కష్ట పడతామో అంత ప్రపంచ జ్ఞానం సంపాదిస్తాం. నేను చేయాలనుకున్న పని మీరుచేస్తున్నారు. శుభాకాంక్షలు.

SRRao said...

శిరీష గారూ !
స్వాగతం. బ్లాగులోకానికి స్వాగతం. విభిన్నమైన అంశం మీది. చాలాకాలంగా గిరిజన సంస్కృతులను గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో కొన్ని పుస్తకాలు చదివాను. ముఖ్యంగా బిరుదరాజు రామరాజు గారివి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ( ఆయన పేరు ఆదినారాయణ గారని గుర్తు ) వారి జీవన శైలి మీద పరిశోధనా గ్రంథం చదివాను. ప్రత్యక్షంగా గిరిజనలోకంలోకి వెళ్ళాలని వాళ్ళ జీవన విధానాలు పరిశీలించాలని వున్నా దానికి దూరంగానే ఇప్పటివరకూ నా జీవితం గడిచింది. ఇన్నాళ్ళకు గిరిజన జీవనంతో ప్రత్యక్ష పరిచయంవున్న మీరు బ్లాగు ద్వారా ఆ విశేషాలను తెలియజెయ్యడం నాకు చాలా ఆనందం కలిగించింది. మీ రచనా శైలి కూడా ఆహ్లాదకరంగా వుంది. ఎప్పుడూ మామూలు విషయాలను మాత్రమే రాసే నాలాంటి వారికి ఇది విభిన్నమే ! కొనసాగించండి. శుభాభినందనలు

Pramod said...

నమస్తే శిరీష గారూ,
మీ బ్లాగు చాలా బాగుంది. ఎన్నో ఆసక్తికర విషయాలను, చాలా సులబంగా అర్ధమయ్యే భాషలొ రాసారు. మీకు చాలా థాంక్స్. మీ తదుపరి పోస్ట్ కోసం చూస్తుంటాము.

రామ said...

స్వాగతం. జీతం ఎంతైనా, మీరు చేస్తున్న ఉద్యోగం చెయ్యడానికి, జీతం తో పాటు సంతృప్తి కూడా ఉంటే కాని సాధ్యం కాదు. అది ఏమిటో మీరు చెప్పడానికి ఉద్యుక్తులైన తీరు (మొదటి పోస్టు) చాలా బాగుంది. అందరూ రాసే (నేను కూడా), అందరికీ తెలిసిన - సినిమాలు, టీవీలు, రాజకీయాలకంటే మీరు చెప్పబోయే విషయాలు విభిన్నంగా, ఆసక్తికరంగా ఉంటాయి అని నాకు అనిపిస్తోంది.

శిరీష said...

thank to all ( SRRao, Pramod, rama and jayabharathi). i will send my new post by today evening.

sunita said...

Welcome to blog world. చాలా ఇంటరెస్టింగ్ గా రాస్తున్నారు. అవునూ శిరీష కుసుమం అంటే గోంగూర పువ్వు కదా!

శిరీష said...

ఇంకా నయం, కొత్తిమీర కట్ట అన్నారు కాదు. శిరీష అంటే దిరెసెన పుష్పం అంట, నేను ఎప్పుడూ చూడలేదు కానీ పార్వతి తపస్సు అనే 8 వ తరగతి తెలుగు వాచకం లో చదివాను. సరదాగ అన్నాను. బ్లాగ్ చదివి కామెంట్ రాసినందుకు చాలా థాంక్స్.
- sireesha

Hima bindu said...

interesting!

మురళి said...

చాలా బాగా రాస్తున్నారు శిరీష గారూ..

chandu said...

ya chala baga raasaru I appriciate u

శ్రీ said...

నెల్లూరు నెరజాణ గారు చాలా బాగా రాస్తున్నారు.

మెహెర్ said...

"అరకు" మీద రాసిన పోస్టులన్నీ చదివాను. అన్నీ కళ్లకు కట్టినట్టు బాగా రాసారు. ముఖ్యంగా నీలయ్య పోస్టూ అవీ! నాకిప్పుడు మీరు చేసిన ఉద్యోగాలన్నీ చేసేయాలనిపిస్తుంది. :)

శిరీష said...

@chinni, murali, chandu, thanks andi sorry mee coments late ga choosaanu.

@Meher garu, annee vudyogaalu cheseyyaalani naaku kooda anipistuu vuntundi chaala sinimaalu choosinappudu lawyer ayipovaalani, docotor, police officer ilaa...hahhaa. thanks for the coment