Monday, April 26, 2010

నా ఇంటర్యూల పర్వం

మా ఇంట్లో వాళ్ళు, స్నేహితులు నన్ను ట్రైబల్ గా చూడటం మొదలయ్యాక కూడా నాకు నేను చేస్తున్న ఉద్యోగం నచ్చిందే కాని కష్టం అనిపించలేదు. ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి అదేదో నలుగురికి ఉపయోగపడే పనిలోనె మన జీవితం కూడా గడిస్తే మంచిది అనిపించి ఇదే సెక్టర్ లో ఉద్యోగాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నేను పని చేస్తున్న సంస్థ పరిస్థితి రాను రాను మరీ దారుణం గా అయిపోయింది. ఫండ్స్ లేక ప్రాజెక్ట్ లు లేక పని లేక వుండేవాళ్ళం. దేనికి డబ్బులు లేక పోయినా, జీతాలు ఇవ్వకపోయినా రోజుకు రెండుసార్లు బిస్కెట్లు, టీ మాత్రం వుండేది. కొన్ని రోజులకి నేను టీ బిస్కెట్ల కోసమే ఆఫీసుకి వెళ్తున్నట్లు అకస్మాత్తుగా ఙ్ఞానోదయం అయ్యింది. ఇక మనం డాడీతో చేసిన శపదం మళ్ళీ గుర్తొచ్చింది. వెంటనే మళ్ళీ ఉద్యోగవేట మొదలు పెట్టాను. 

నాకు ముసలి వాళ్ళంటే కొంచెం ఇష్టం. హెల్ప్ ఏజ్ ఇండియాలో ఉద్యోగాలు ప్రకటన పడింది. కానీ ఇంటర్వ్యూ ముందురోజు విపరీతమైన మలేరియా జ్వరంతో ఆసుపత్రి లో చేరాను. వాళ్ళు నా శరీరంలో అన్ని పార్టులకు గొట్టాలు పెట్టేశారు నీరసంగా వున్నానని. కళ్ళు తెరవకుండా వున్నాను 2 రోజులు కానీ ఇంటర్వ్యూ కి మాత్రం హాస్పటల్ అంతా గొడవ చేసి మరీ వెళ్ళాను. హెల్ప్ ఏజ్ ఇండియా వాళ్ళు నా టేలెంట్ చూసి కాదు కాని నా చేతులకు, ముక్కుకు వున్న గొట్టాలు చూసి, నాకున్న తపనకి ఇంప్రెస్స్  అయిపోయి వెంటనే నాకు జాబ్ గ్యారంటీ మీరు వెళ్ళి మళ్ళీ హాస్పటల్ బెడ్ మీద పడుకోండి పోయి అని చెప్పారు.నేను కూడ ఇక నాకు ఉద్యోగం వచ్చేసినట్లే అనుకున్నాను. కానీ విధి విపరీతం అంటే అదే. అప్పటివరకు నేను మా తమ్ముడు వున్న ఇళ్ళు ఖాళీ చేసి నేను మళ్ళీ బుద్ధిగా హాస్టల్లో జాయిన్ అయిపోయాను(దానికి వెనుక వేరే కుట్ర వుంది, మా తమ్ముడే కాదు, మా  చెల్లికూడా ఏదో పరీక్షలని తనతో పాటు ఇంకో ఫ్రెండ్, వైజాగులో పని వున్నా లేకపోయినా మా బంధువులు ఇలా అందరు నా ఇంటి మీదా, నా మీద ధండయాత్ర మొదలుపెట్టారు. పని ఎక్కువయ్యింది అందులో మాకు జీతాలు లేవు ఈ బాధలన్నీ వద్దని హాస్టల్ శరణం గచ్చామీ అన్నాను) మా తమ్ముడు వాళ్ళ నలుగురు స్నేహితులతో కలిసి ఇల్లు తీసుకొని వంట మొదలు పెట్టేశాడు (పనమ్మాయిని పెట్టుకున్నారు). అందువలన నాకు జాబ్ ఆఫర్ పంపిస్తే పాత ఇంటి వాళ్ళు పట్టించుకోలేదు. సో ఆవిధంగా నా హెల్ప్ ఏజ్ ఇండియా వుద్యోగం కూడా అందినట్లే అంది చేజారిపోయింది. చాలా రొజులు బాధపడ్డాను. కాని వాళ్ళని కాంటచ్ట్ చెయ్యలేదు.


ఈ లోగా మా వూర్లోనే గిరిజన కార్పోరేషన్ (ఐ.టి.డి.ఎ) లో ఏవో ఉద్యోగాలునాయంటే అప్లయి చేసి వెళ్ళాను. అప్పుడు దమయంతి గారు పార్వతిపురం ఐ.టి.డి.ఎ కి ప్రాజెక్ట్ ఆఫీసర్. మా వూర్లోనే హాయిగా వుద్యోగం చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంటర్యూ కూడా బాగా జరిగింది. కానీ శని నాకు బిళ్ళబంట్రోతు రూపంలో వచ్చాడు. దమయంతి గారికి మంచి నీళ్ళు తెచ్చిన అటెండర్ నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. అంతే కధ అడ్డం తిరిగింది. మా ఊర్లో నాకు ఎవరూ తెలీదు కానీ నేను అందరికి తెలుసు, మా డాడీ వల్ల. కాబట్టి ఎవరు నవ్వినా బహుశా మాకు తెలిసిన వాళ్ళేమో అని తిరిగి నవ్వటం అలవాటయ్యింది. ఐనా కూడా ఇంటర్యూలో వున్నాను కాబట్టి నవ్వకుండా సీరియస్ గా ముఖం పెట్టి మరీ నవ్వాను. అయినా ఆవిడ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ కదా కనిపెట్టేశారు. నేనెవరని ఆరా తీశారు. అప్పటివరకు ఆవిడ చూడని నా సర్టిఫికేట్లు చూశారు. డాటర్ ఆఫ్ ఫలానా ఫలానా...ఇంకేముంది కట్ చేస్తే, దమయంతి గారు, మా డాడీ, నేను ఆవిడ రూంలో కూల్ డ్రింక్ తాగుతున్నాము. 

ఆమె: ఏంటండి మీ అమ్మాయి ఇలాంటి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏముంది?చాలా కష్టం ఆ కొండల్లో ఎండ వాన అని చూడకుండా తిరగాలి. 

అతడు(మా డాడీ): నా వైపు కొర కొరా...

ఆమె:ఏమ్మా చక్కగా ఐ.ఎ.ఎస్ రాయి లేదా కంపూటర్స్ చేసుకో నీలాంటి వాళ్ళు చెయ్యలేరు ఈ వుద్యోగం. ఇప్పుడు చూడు మళ్ళీ మంచి క్యాండిడేట్లని చూసుకోవాలి.

నేను: నేను చెయ్యగలనండీ....

మా డాడీ: మళ్ళీ కొర కొరా... 

ఛా.. ఇది ఒక ఇంటర్యూనా? నా ఇంట్లో వాళ్ళని కూడా పిలిస్తే ఎలా?భందుమిత్ర సపరివారంగా ఆహ్వానించడానికి ఇదేమైన పెళ్ళా? నా క్వాలిఫికేషన్, పద్ధతి చూడాలి కానీ నేను పెరిగిన విధానం ఆధారంగా నన్ను పనికిరావు అనేస్తే చాలా అవమానంగా అనిపించింది. చస్తే మా ఊర్లో వుద్యోగ ప్రయత్నాలు చెయ్యకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను.వీలైతే ఏ ఆఫ్రికాకో అండమానో వెళ్ళిపోయి అయినా సరే ఇదే సెక్టర్లో పని చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఒక వేళ సెలెక్ట్ అయినా మాకు దగ్గర్లో ఐతే రోజు ఏదో ఒక సమస్య వస్తుంది అనిపించింది. ఇక బయట వేరె ఉద్యోగాలు చూడాల్సిందే. 

ఇది నా 4వ ఇంటర్యూ. మొదటి ఇంటర్యూ మరీ దారుణం. ఇంటర్యూ కి వెళ్ళి టి.వి లో పాటలు (బయట టి.వి అరేంజ్ చేశారు పనికిమాలిన కనస్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు) చూస్తూ నా పేరు ఎప్పుడు పిలిచారో కూడా వినిపించుకోలేదు.వాళ్ళు లంచ్ టైము అయ్యి ఆఫీసు మూసేస్తుంటే ఈ లోకంలోకి వచ్చాను. కానీ అది మంచిదే (?) అయ్యింది. ఈ ఎన్.జి.ఒ సెక్టర్లోకి రాగలిగాను.

ఇక ఆతరువాత నా జీవితంలో ఎక్కువగా నేర్చుకున్న, ఎదిగే అవకాశం కల్పించిన, పెద్ద వాళ్ళతో పరిచయం చేసిన గవర్నమెంట్ ప్రోగ్రాము వెలుగు ఇంటర్యూలు నిజంగా కష్టమైనవి.కానీ నాకు ఇష్టమైనవి. అవి తరువాత పోస్టులో రాస్తాను. 

సరదాగా మీరు మీ ఫ్లాష్ బ్యాకులో మీ ఇంటర్యూలను ఊహించేసుకోండి ఇక.

Tuesday, April 20, 2010

అందరికీ థాంక్స్ (వీల్లందరూ మానసిక రొగులే)

అందరికీ చాలా థాంక్స్.


వీళ్ళందరు మానసిక రోగులే అనే పోస్టుకి స్పందిస్తూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. కొన్ని కామెంట్స్ పబ్లిష్ చెయ్యాలంటే కూడా అలోచించాల్సి వస్తుంది. ఆడవాళ్ళు అందరూ ఉత్తమోత్తములు మగవాళ్ళంతా నీచాతి నీచులు అని నేను ఎప్పటికీ చెప్పను. మనుషుల్లో రెండురకాలు మంచి చెడ్డలు తెలుసుకోగలిగే పరిణితి వున్న వాళ్ళు, ఆ పరిణితి లేని వాళ్ళు. అందరికీ అన్ని విషయలలో పరిణితి వుంటుంది అని కూడా చెప్పలేము. ఆ పరిణితి లేని విషయాలు నలుగురి కి ఇబ్బంది కలిగించేవి గా వుంటాయి. అందుకని వాటిని చర్చించటం వీలైతే ఆ ఇబ్బందులు తప్పించుకునేలా సలహ ఇవ్వటం కోసమే చర్చ అంతే కాని ఆడా మగా ఎవరు ఎంత చెండాలులు అని కాదు.నా వృత్తిలో స్త్రీలు కూడా దారుణంగా 
ప్రవర్తించే వాళ్ళని చూశాను. అవికూడ సమయం వచ్చినప్పుడు రాస్తాను. 


కామెంట్స్ కి సమాధానం కూడా ఒక పోస్టు లా ఎందుకు రాస్తున్ననంటే  చాలమంది ఎనానిమస్ కామెంట్స్ వచ్చాయి మళ్ళీ వాళ్ళెవరూ నా సమాధానం చూడక పోవచ్చు, కొన్ని కామెంట్స్ ఎలా వున్నాయంటే అలా ట్రైన్లలో అలా ప్రవర్తించటం అసలు తప్పే కాదు అన్నట్లు మరీ బయంకరంగా రాసారు. కొన్ని పబ్లిష్ చెయ్యాలనిపించలేదు. అందుకని ఈ పోస్టు.

Monday, April 19, 2010

వీళ్ళందరూ మానసిక రోగులే

పోయిన వారాం బ్లాగ్ రాయలేక పోయాను, కాస్త బిజీ గా వుండి. ఈ వారం రాయాలనుకున్నాను కాని మూడ్ అంతా చికాకుగా అయిపోయింది. ఈ వారం ఎక్కువగా కేంప్ లు వున్నాయి. మొన్న నేను ట్రైన్లో వస్తుంటే ఇంకొక భయంకరమైన అనుభవం. ఎందుకిలా? చదువుకున్నవాళ్ళు కూడ అంతేనా!!, జనరల్ కంపర్టమెంట్ లో అంతే, ఎ.సి లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా అంతే. 

నా లాగ ఎంతో మంది ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తుంటారు అనేక సమయాలలో. నేను ఉద్యోగ రీత్యా చాల ఎక్కువగా ఒంటరిగా ప్రయాణం చేస్తుంటాను. ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది కాని ఇప్పటికీ భయమే.సరిగా ప్రయాణం చెయ్యటం తెలీక కాదూ, వివిద ప్రదేశాలలో ఫార్మాలిటీస్ గురించి కూడా కాదు. మనుషుల వల్ల భయం. చిన్న వుద్యోగం లో వుంటే వున్న సౌకర్యాలు తక్కువగా వుండేవి అంటే బస్ ఖర్చులు, బొజనం ఖర్చులు వరకు వస్తాయి. సెకండ్ క్లాస్ ట్రైన్ టికెట్ కి మాత్రమే ఎలిజిబిలిటీ వున్నప్పుడు వచ్చే సమస్యలు చూసి అబ్బ కాస్త ఉద్యోగంలో ఎదిగితే ఇన్ని తిప్పలు వుండవు కదా అనుకునే దాన్ని, కానీ ఇప్పుడు కూడా అంతే. ఎ.సి. లో వెళ్ళినా మన చుట్టు వున్న మనుషులు బి.సి కాలం బుద్ధులతోనే వుంటే మన సమస్యలు అలాగే వుంటాయి. 

ట్రైన్లో వెళ్ళేటప్పుడు, రిసర్వేషన్  అయితే చాలు,లోయర్ బెర్త్ వస్తే చాలు అనుకోవడానికి లేదు. ఒకవేళ చివరిలో సైడు లోయర్ అయ్యిందనుకోండి వచ్చేపోయే వాళ్ళకి ఈజీగ దొరికిపోతాము. బాత్రూంలు దగ్గర నిలబడి భయంకరమైన చేష్టలు చూపిస్తారు. చాల భయం,అసయం వేసింది. సరే ఎవరో కుర్రకుంక, ట్రైన్లో తిరుగుతూ వుండేవాళ్ళు ఇలాగే వుంటారు అనుకున్నాను. కానీ మనతో పాటు ప్రయాణం చేసే వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళుంటారు. ఇదేమి పోయేకాలమో నాకు అర్ధం కాలేదు. సినిమాలలో ఆడవాళ్ళు అంగప్రదర్శన చేస్తున్నారు అంటారు. మరీ ఇంత దారుణంగా ఆడవాళ్ళు ఒంటరిగా వుంటే చూసి బహిరంగంగా అంగప్రదర్శన చేసే వాళ్ళని ఏమంటారు? బహుశా మానసిక రోగమేమో. ఈ మానసిక రోగం తో వున్నవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్ళే కావఖ్ఖర్లేదు, ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ,నాన్నలతో ప్రయాణం చేస్తున్నడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడని వాళ్ళ మాటల బట్టి అర్ధం అయింది.మరి తోటి ప్రయాణికులని ఏమి చూసి అంచనా వెయ్యాలో నాకు అర్ధం కావటం లేదు. 

బస్ లో ఐతే హింస కొనసాగుతూనే వుంటుంది తెల్లార్లూ. ఈ లక్సరీ, వోల్వో బస్ లు వచ్చాక మనం ఒంటరిగా ప్రయాణం చేసినా, తోడుగా ఎవరైనా వున్నాకూడా ఈ హింస రాయుళ్ళకి ఫర్వాలేదు. వాళ్ళకి బస్ సీటింగ్ చాల సౌకర్యంగా వుంటుంది.నిద్రనటిస్తూనే చేతులు వెయ్యటం, గిచ్చటం చేస్తుంటారు. లేచి గట్టిగా అడిగితే కూడా నిద్ర నటిస్తూనే వుంటారు.

టీనేజి అబ్బాయిలు, ఒక వయసులో వున్నవాళ్ళు, ముసలి వాళ్ళు, పల్లెటూరివాళ్ళు, సిటీ వాళ్ళు, బాగ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఎంతో గొప్పగా కనిపించేవాళ్ళు, రౌడీలా కనిపించే వాళ్ళు....అందర్లో ఇలాంటి వాళ్ళుంటారు.ట్రైన్లో ఏ.సి లో ప్రయాణం చేస్తే ఇంకా దారుణం అక్కడ ఒకరికి ఒకరు కనిపించకుండా కర్టెన్లు వేసేసుకుని మన గోడు పట్టించుకోరు. కొన్ని రూట్లలో ట్రైన్ మొత్తానికి ఇద్దరు లేక ముగ్గురు వుంటారు ఏ.సి కంపార్ట్మెంట్లో.ఇక నిద్రపోతే ఒట్టు. అలా కాకపోయినా సరే ఎదురవుతున్న అనుభవాలకి ప్రయాణంలో నిద్రపోతే భయం, నిద్రపోకపోతే కూడా భయం. ఇలాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల ఆడవాల్లు వుద్యోగాలలో పురుషులతో సమానంగా పని చెయ్యాలంటే ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కుంటూ కూడా పురుషులతో సమానంగా ఎదిగి చూపిస్తున్న ఎందరో స్త్రీలకు హేట్స్ ఆఫ్ చేస్తున్నా. మీరు ఈ సమస్యలకు భయపడి ఓడిపోయామని వెనకడుగు వేస్తే తరువాతి తరాలలో ఏ ఆడవాళ్ళు కూడా ఇక బయటకే రాలేరు. 

భయపడటం కాదు కాని ప్రతీ సమస్యని ఎదుర్కోవటానికి కొన్ని మార్గాలుంటాయి. మీరు కూడా ఒంటరిగా ప్రయాణాలు చేసే వాళ్ళైతే, లేదా మీ ఇంట్లోని ఆడవారు ఒంటరిగా ప్రయాణాలు చేసే వాళ్ళైతే కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముందు అసలు దేనికీ కూడా భయపడకుండా మనసునిండా ధైర్యంతో వుండాలి. బ్యాగులో కొన్ని ముఖ్యమైన వస్తువులు తప్పక వుండాలి.సెల్ ఫోనులో ముఖ్యమైన నంబర్లకు కీ పాడ్ లో షార్ట్ కట్ ఇవ్వండి( అంటే ఒకటి నొక్కితే - నాన్న నంబర్ అలా). అసలు అన్నిటికంటే ముందు ఎవరైన ఇలా ఇబ్బంది పెడుతుంటే భయపడకుండా అందరికి తెలిసేలా గట్టిగా చెప్పాలి. మనం భయపడటంలేదు అని తెలిస్తే 90% ఇలాంటి వాళ్ళు భయపడతారు.అంతే కాదు ఇక ముందు ఎవరితో ఐనా అలా ప్రవర్తించాలంటే కూడా కాస్తా భయపడతారు.వీలైనంత వరకు ఆడవాళ్ళుండే చోటుచూసుకోవటం మంచిది కానీ మనకి అంత అదృస్టం అన్నిసార్లు దొరకదు. నా స్నేహితురాలు ఒకామే తన సెల్ ఫోన్ కి బయంకరమైన కీ పాడ్ టోన్ పెట్టుకుంది అదికూడా చాలపెద్ద సౌండ్  వచ్చేలా. ఇలా తను ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేసేప్పుడు ఎవరో తన బెర్త్ దగ్గరకు రాబోతే వెంటనే మొబైల్ కీ ప్రెస్ చేసి అందరిని అలెర్ట్ చేసిందంట.ఇలా ఒకొక్కరు ఒక్కో పద్ధతి  పాటిస్తునారు. ఆత్మ రక్షణ అంటే భయం లేని ఆత్మధైర్యమే అని అర్ధం చేసుకోవాలి. భయపడితే బుర్రపనిచెయ్యదు. సో ఫ్రెండ్స్ ధైర్యంగా వుండండి.
  

Friday, April 2, 2010

నా వెన్నెల రాత్రులు

ఇప్పుడే వెన్నెల చూసి వచ్చి కూర్చున్నాను. లక్కీ నిద్రపొతున్నాడు. బయట ఒక చందమామ, నాపక్కన ఒక చందమామ....లక్కీ, నా కొడుకు (తిట్టుకాదు నాకున్న ఒకేఒక బాబు) సరే వెన్నెల రాత్రులు అని మొదలుపెట్టి కొడుకు గురించి చెప్తుందేమిటీ టైము వేస్ట్ సోది కాకపోతే అనుకుంటున్నారా?వస్తున్నా వస్తున్నా అసలు విషయానికే వస్తున్నా. 

గిరిజనుల గురించి నా అనుభవాలతో ఈ వీక్ ఎండ్ కి పోస్ట్  రాయాలని మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు ఆ మూడ్ రావటంలేదు.నాకు ఎప్పుడు ఏది రాయలనిపిస్తుందో అది మాత్రమే రాయగలను, రాస్తాను. ఒకసారి లెక్కల పరీక్ష రోజు, పరీక్ష హాల్లో కవిత్వం తన్నుకుంటా వచ్చేసింది. అది రాస్తే కాని నా మనసు ఇక దేని మీదకి పోదు అందుకే మొదట కవిత్వం రాసేసా, ఆ తరువాత తీరికగా లెఖ్ఖలు చేసాను.అప్పుడు నా పేపర్ దిద్దిన వాళ్ళు బలయ్యారు,ఇప్పుడు ఈ బ్లాగ్ చదివే వాళ్ళు.(కవిత్వం రాయనులెండి, భయపడొద్దు)

ఇప్పుడు నా వెన్నెల రాత్రుల అనుభవాల గురించి రాయాలని వుంది. టైటిల్ చూసి మీరెదో ఊహించేసుకుంటున్నరు కదా! నేను స్వాతి వీక్లీ లో సరసమైన కధ లాంటిది రాస్తాననుకొనేరు, ఇది అది కాదు. కానీ ఇది అంతకంటే కూడా చాలా ఇదైనది.(ఆ ఇది ఏంటో తెలియాలంటే పూర్తిగా చదవండి)

నేను చాలా అందమైన వెన్నెల రాత్రులు చూశాను. బహుశా మీకనిపించవచ్చు వెన్నెల ఎక్కడైనా వెన్నెలే కదా ఏంటి పేద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. కాని ఆ తేడా నాకే తెలుసు. టౌన్ లో ఇళ్ళమద్య వెన్నెలకీ, నేను చూసిన వెన్నెలకీ చాల తేడా వుంది.అలాంటి వెన్నెల రాత్రి అనుభాలలో ఇది ఒకటి.ఈరోజు గుర్తొచ్చింది ఎందుకో!

ఎప్పుడూ మా ఇంటి డాభా మీద నుండి మాత్రమే వెన్నెల చూశాను. ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్లో వున్నప్పుడు సముద్రం దగ్గర వెన్నెల చూసాను. ఎలా చూసినా వెన్నెల నన్ను కాళ్ళు చేతులు కట్టేసి కనీసం ఒక గంట అయిన నన్ను మంత్రముగ్ధను చెసేసేది. అలాంటిది ఒకసారి ఏమయిందో తెలుశా. ఒక గిరిజన గ్రామం..అరకు దగ్గర, నైట్ స్టే గూడెంలోనే. అక్కడ దోమలకి, కొత్తపరిసరాలకి ఇంకా అలవాటు పడలేదు కాబట్టి కాస్త రాత్రి అంటే భయంతో వున్నాను. వెన్నెల,గిన్నెల చూసే మూడ్ లేదు. కాని నేను వున్న ఇంటి గిరిజన స్త్రీ నన్ను బయటకి రా అని ఎక్కడకో వెల్దామని చెప్తుంది. నాకు వాళ్ళకి ఎప్పుడూ మూగ బాషే. బహుశా అతిది మర్యాదలో భాగంగా నన్ను టాయిలెట్ కి తీసుకెల్లాలని ఆశపడుతుందేమో, నాకు అవసరం లేదు అని చెప్పాను. సాధారణంగా పల్లెల్లో కూడా స్త్రీలు కాలకృత్యాలు తీర్చుకునేది రాత్రిపూట లేదా చీకటి వేకువన. ఆమె నా మాట వినలేదు రమ్మంటుంది. సరే అని వెళ్ళాను. సాధారణంగా రాత్రి అంతా తాగి వుంటారు అని వెళ్ళను. కాని బయట చూస్తే పండగలా వుంది. "పున్నమి వెన్నెల" గూడెం అందరు పిల్ల పెద్ద అందరూ బయటే వున్నారు. నవ్వుతున్నారు, సంతోషం కూడా నాలాగ ఆరోజు అక్కడ నైట్ స్టే అనుకుం!!! (ఆ ఆలొచన రాగానే అయ్యబాబోయ్ కవిత్వం వచ్చేస్తుందేంటి అనుకున్నా) . వెన్నెల ఎంతగా ప్రకాశిస్తుందంటే...నిజంగా పిండి ఆరబోయటం అంటే అదే అనుకుంటా. కాని ఇది బియ్యం పిండి, మినప్పిండి కాదు, వెన్నెల పిండి. అవును వెన్నెల పిండి ఆరోజే చూశాను. అది ప్రకాశిస్తుంది, ఆ చుట్టుపక్కలంతా ఆ కాంతితో ప్రతి చెట్టు, ప్రతి గుడిసె, ప్రతి మనిషి, ప్రతీది ఆఖరికి ఆకాశం, నేల తో పాటు నేను కూడా ప్రకాశిస్తున్నాను. ఇంతలో ఆడవాళ్ళంతా ఏంటో కొలాహలం, అరుపులు , నవ్వులు. ఎదో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ లేస్తున్నారు. నా పక్కనే కూర్చున్న ఆడవాళ్ళుకూడా జండావందనం రోజు చాక్లెట్స్ కోసం పరిగెడుతున్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా కేరింతలు నవ్వులతో పరిగెత్తారు. ఎదో జరుగుతుంది అనితెలుస్తుంది కాని, జరిగింది చూశాక ఇలాకూడా జరుగుతుందా అనిపించింది. ఆడవాళ్ళంతా కలిసి ఒకరి నడుము ఒకరు పట్టుకొని ధింసా ఆడటం మొదలు పెట్టారు. నేను అదే మొదటసారి ధింసా నృత్యం చూడటం. నవ్వుతూ తుళ్ళుతూ ఎవరు మొదలుపెట్టారో తెలీదు కాని ఒకరికి ఒకరు చేతులు కలుపుకుంటూ ఒకరి నడుం మీదుగా ఆపక్కవున్న వారి చెయ్యి పట్టుకొని అందరు కాళ్ళు పాదాలు ఒకేవిధమైన స్టెప్స్ వేస్తు అందరు కలిసి జట్టుగా ఒకేవైపు కదులుతున్నరు. ఆ లైను మొదటవున్న వ్యక్తి ఒక చిన్న రంగు బట్ట చేత్తో పట్టుకొని వూపుతూ లైన్ ని పాము మెలికలు తిరిగినట్లు తిప్పుతూ కదులుతుంది. నాకు చిన్నప్పటినుండి డాన్స్ అంటే ప్రాణం. అలాంటిది ఈ వెన్నెల్లో అన్ని మరిచి ఆనందంగా ఒక మధురమైన పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్న వాళ్ళని చూస్తే అసలు ఇదే కదా జీవితం అంటే అనిపించింది. మన ఊర్లో ఆడవాళ్ళు కనీసం ఇంట్లో డాన్స్ చెయ్యగలరా? కనీసం మనసు సంతోషంతో మత్తెక్కిపోతే ఆనందంగా ఆడగలరా? పాడగలరా? అసలు మనకి చిన్నప్పుడే ఆట,పాటలన్నీ ఆపేస్తారెందుకు. వీళ్ళల్లో ఇంత వుత్సాహం, అది వ్యక్తపరచడానికి మార్గం కూడా వున్నాయి. మరి మనకేమున్నాయి? మనసు సంతోషంతో వున్నప్పుడు డాన్స్ చెయ్యాలని ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలీదు కానీ నాకు  ఆనందం కలిగితే డాన్స్ చెయ్యలనే అనిపిస్తుంది. అది ఇక్కడ నా కళ్ళ ఎదురుగా జరుగుతుంది!!! ఇది కలా నిజమేనా!!!

నన్ను కూడా ఎవరో లాగారు, నేను కూడా ధింసా చేశా...నిజం. అప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏదో స్కూల్ ప్రోగ్రాములోనో, పోటీలలోనో ఏదో చిన్నపాటి పిల్ల డాన్స్లు చేసాను. మా ఇంట్లో వాళ్ళందరికి కొంచెం డాన్స్ ఇష్టం వుండటం వల్ల మాకు అప్పుడప్పుడు కొంత డాన్స్ నేర్పించారు. అదంతా ఏదో సహజంగా ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఆరోజు...వెన్నెల్లో, ఆరుబయట, చల్లనిగాలిలో, నాతోటి ఆడవాళ్ళందరితో,ఏరకమైన భయం జంకు లేకుండా నవ్వుతూ అరుస్తూ చేసిన ఆ ధింసా నాకు అప్పటివరకు వున్న సంకొచాలు, బాధలు, కలతలు, నొప్పులు అన్నీ నాకు దూరమైపోయి ఏదో తెలియని సంతోషం ఆవహించింది.అప్పుడే నేను కరెక్టైన ప్రదేశానికి వచ్చానని ఇప్పటివరకు జీవితంలో ఏదో దారి తెలియని క్రొత్త ప్రదేశంలో వున్నాననీ అనిపించింది. 

అప్పుడే కాదు ఎప్పుడు అవకాశం వచ్చినా నేను ధింసా ఆడుతునేవున్నా. మీరుకూడా ఎప్పుడైన మీతో పాటు నలుగురిని చేతులు కలిపి ఆడండి అందులో ఆనందం నేను చెప్తే మీకు అర్ధం కాదు మీరు అనుభవించాలి. మైమరచి ఆడటం, పాడటం, కవితలు చెప్పటం, డాన్స్ చెయ్యటం ఇవన్నీ ఒకరకమైన యోగా వంటివి. మన బాధలు అన్ని మరిపిస్తాయి. ఇది నా అనుభవం.

చాలా సమయం ధింసా చేశాక నేను అలసిపోయి కూర్చున్నాను, వాళ్ళకి అలసట అంత త్వరగా రాదేమో ఆడుతునే వున్నారు. నేను కూర్చుని చూస్తున్నా. ఎంత బాగుంది ఆ వెన్నెల రాత్రి, విపరీతమైన ప్రకాశం తో వెన్నెల, అదుపులేని ఆడవాళ్ళు, అంతులేని ఆనదం, అలుపులేని ధింసా.......ఇంత అద్భుతం నేను మళ్ళీ ఇంకెక్కడైనా చూడగలనా? ఒక్కసారి మా ఇళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ గుర్తొచ్చారు. మేమంతా ఎప్పుడైన ఇంత సంతోషంగా నృత్యం చేయగలమా? వెన్నెల్లో ఆడగలమా? అందులో వూరిమద్యలో? గట్టిగా నవ్వితే, మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారని  అనే భయాలతో బతికే నాకు ఇది నిజంగా స్వర్గం అనిపించింది. చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కాని వీళ్ళు రోజు స్వర్గంలో వుంటున్నారే. ఇంత సహజత్వం, ఇంత ప్రకృతి, ఇంత అందం, ఇంత స్వేచ్చ........నాకు అంత అందం, అంత  వెన్నెల ఎలా భరించాలో తెలియటం లేదు, చచ్చిపోవాలనిపించింది.ఈ వెన్నెల రాత్రి ఎంత బాగుంది? ప్రకృతికి ఎక్కడనుండి వచ్చింది ఇంత శక్తి? నన్ను ఈ చందమమ ఇలా లొంగదీస్తుందేమిటి? ఆ వెలుగు, ప్రకాశం, సంతోషం ఎంత బాగుందంటే అప్పుడే అక్కడే చచ్చిపోతే ఎంత బాగుంటుంది అనిపించేంత బాగుంది. ఇంత ఆనందంలో చావాలని ఎందుకనిపిస్తుంది అని ఆలోచించా...ఆశ్చర్యం నాకు నిజంగా చచ్చిపోవాలనే అనిపించింది.(ఎవరైనా ప్రియ నేస్తం తోడుగా వుంటే ఆ వెన్నెల్లో చేతులు పట్టుకొని అడవిలో నడుస్తే బాగుండేది అనికూడా అనిపించింది అనుకోండి) ఇలాంటి అద్భుతమైన వెన్నెల రాత్రులు  చూసినపుడు నాకేకాదు ఎవరికైనా అలాగే అనిపిస్తుందేమో!!!! చాలా సేపు ధింసా ఆడిన తరువాత వెళ్ళారు అందరు. కానీ చాలామంది అక్కడే వెన్నెల్లో నిద్రపోయారు. నాకు కూడా బయటనే మంచం వేశారు నేను వున్న  ఇంటివాళ్ళు. ఆ భరించలేని వెన్నెల చూస్తూ  నిద్ర కోసం ప్రయత్నించాను. ఏదో తెలియని బాధ కలుగుతోంది అప్పుడు..ఎందుకీ బాధ? నాకే  అర్ధం కాలేదు. మనిషి  మనసు విచిత్రమా లేక ప్రకృతి చేస్తున్న మాయా? ఇంతలోనే అంత సంతోషం, అంతలోనే ఇంత తెలియని విషాదమా???ఆ బాధతో నిండిన సంతోషాన్ని, సంతోషంతో కూడిన బాధని కూడా నా అలసట జయించింది. హాయిగా వెన్నెల నన్ను జోకొట్టింది. కలలుకూడా కలతపెట్టలేని నిద్ర వచ్చింది.

ఇంత సంతోషం గా గూడేం నాట్యం చేసిందే ఇంతకీ ఆ రోజు ఏమి పండగ? వెన్నెల పండగ నా?