Monday, April 26, 2010

నా ఇంటర్యూల పర్వం

మా ఇంట్లో వాళ్ళు, స్నేహితులు నన్ను ట్రైబల్ గా చూడటం మొదలయ్యాక కూడా నాకు నేను చేస్తున్న ఉద్యోగం నచ్చిందే కాని కష్టం అనిపించలేదు. ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి అదేదో నలుగురికి ఉపయోగపడే పనిలోనె మన జీవితం కూడా గడిస్తే మంచిది అనిపించి ఇదే సెక్టర్ లో ఉద్యోగాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నేను పని చేస్తున్న సంస్థ పరిస్థితి రాను రాను మరీ దారుణం గా అయిపోయింది. ఫండ్స్ లేక ప్రాజెక్ట్ లు లేక పని లేక వుండేవాళ్ళం. దేనికి డబ్బులు లేక పోయినా, జీతాలు ఇవ్వకపోయినా రోజుకు రెండుసార్లు బిస్కెట్లు, టీ మాత్రం వుండేది. కొన్ని రోజులకి నేను టీ బిస్కెట్ల కోసమే ఆఫీసుకి వెళ్తున్నట్లు అకస్మాత్తుగా ఙ్ఞానోదయం అయ్యింది. ఇక మనం డాడీతో చేసిన శపదం మళ్ళీ గుర్తొచ్చింది. వెంటనే మళ్ళీ ఉద్యోగవేట మొదలు పెట్టాను. 

నాకు ముసలి వాళ్ళంటే కొంచెం ఇష్టం. హెల్ప్ ఏజ్ ఇండియాలో ఉద్యోగాలు ప్రకటన పడింది. కానీ ఇంటర్వ్యూ ముందురోజు విపరీతమైన మలేరియా జ్వరంతో ఆసుపత్రి లో చేరాను. వాళ్ళు నా శరీరంలో అన్ని పార్టులకు గొట్టాలు పెట్టేశారు నీరసంగా వున్నానని. కళ్ళు తెరవకుండా వున్నాను 2 రోజులు కానీ ఇంటర్వ్యూ కి మాత్రం హాస్పటల్ అంతా గొడవ చేసి మరీ వెళ్ళాను. హెల్ప్ ఏజ్ ఇండియా వాళ్ళు నా టేలెంట్ చూసి కాదు కాని నా చేతులకు, ముక్కుకు వున్న గొట్టాలు చూసి, నాకున్న తపనకి ఇంప్రెస్స్  అయిపోయి వెంటనే నాకు జాబ్ గ్యారంటీ మీరు వెళ్ళి మళ్ళీ హాస్పటల్ బెడ్ మీద పడుకోండి పోయి అని చెప్పారు.నేను కూడ ఇక నాకు ఉద్యోగం వచ్చేసినట్లే అనుకున్నాను. కానీ విధి విపరీతం అంటే అదే. అప్పటివరకు నేను మా తమ్ముడు వున్న ఇళ్ళు ఖాళీ చేసి నేను మళ్ళీ బుద్ధిగా హాస్టల్లో జాయిన్ అయిపోయాను(దానికి వెనుక వేరే కుట్ర వుంది, మా తమ్ముడే కాదు, మా  చెల్లికూడా ఏదో పరీక్షలని తనతో పాటు ఇంకో ఫ్రెండ్, వైజాగులో పని వున్నా లేకపోయినా మా బంధువులు ఇలా అందరు నా ఇంటి మీదా, నా మీద ధండయాత్ర మొదలుపెట్టారు. పని ఎక్కువయ్యింది అందులో మాకు జీతాలు లేవు ఈ బాధలన్నీ వద్దని హాస్టల్ శరణం గచ్చామీ అన్నాను) మా తమ్ముడు వాళ్ళ నలుగురు స్నేహితులతో కలిసి ఇల్లు తీసుకొని వంట మొదలు పెట్టేశాడు (పనమ్మాయిని పెట్టుకున్నారు). అందువలన నాకు జాబ్ ఆఫర్ పంపిస్తే పాత ఇంటి వాళ్ళు పట్టించుకోలేదు. సో ఆవిధంగా నా హెల్ప్ ఏజ్ ఇండియా వుద్యోగం కూడా అందినట్లే అంది చేజారిపోయింది. చాలా రొజులు బాధపడ్డాను. కాని వాళ్ళని కాంటచ్ట్ చెయ్యలేదు.


ఈ లోగా మా వూర్లోనే గిరిజన కార్పోరేషన్ (ఐ.టి.డి.ఎ) లో ఏవో ఉద్యోగాలునాయంటే అప్లయి చేసి వెళ్ళాను. అప్పుడు దమయంతి గారు పార్వతిపురం ఐ.టి.డి.ఎ కి ప్రాజెక్ట్ ఆఫీసర్. మా వూర్లోనే హాయిగా వుద్యోగం చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంటర్యూ కూడా బాగా జరిగింది. కానీ శని నాకు బిళ్ళబంట్రోతు రూపంలో వచ్చాడు. దమయంతి గారికి మంచి నీళ్ళు తెచ్చిన అటెండర్ నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. అంతే కధ అడ్డం తిరిగింది. మా ఊర్లో నాకు ఎవరూ తెలీదు కానీ నేను అందరికి తెలుసు, మా డాడీ వల్ల. కాబట్టి ఎవరు నవ్వినా బహుశా మాకు తెలిసిన వాళ్ళేమో అని తిరిగి నవ్వటం అలవాటయ్యింది. ఐనా కూడా ఇంటర్యూలో వున్నాను కాబట్టి నవ్వకుండా సీరియస్ గా ముఖం పెట్టి మరీ నవ్వాను. అయినా ఆవిడ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ కదా కనిపెట్టేశారు. నేనెవరని ఆరా తీశారు. అప్పటివరకు ఆవిడ చూడని నా సర్టిఫికేట్లు చూశారు. డాటర్ ఆఫ్ ఫలానా ఫలానా...ఇంకేముంది కట్ చేస్తే, దమయంతి గారు, మా డాడీ, నేను ఆవిడ రూంలో కూల్ డ్రింక్ తాగుతున్నాము. 

ఆమె: ఏంటండి మీ అమ్మాయి ఇలాంటి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏముంది?చాలా కష్టం ఆ కొండల్లో ఎండ వాన అని చూడకుండా తిరగాలి. 

అతడు(మా డాడీ): నా వైపు కొర కొరా...

ఆమె:ఏమ్మా చక్కగా ఐ.ఎ.ఎస్ రాయి లేదా కంపూటర్స్ చేసుకో నీలాంటి వాళ్ళు చెయ్యలేరు ఈ వుద్యోగం. ఇప్పుడు చూడు మళ్ళీ మంచి క్యాండిడేట్లని చూసుకోవాలి.

నేను: నేను చెయ్యగలనండీ....

మా డాడీ: మళ్ళీ కొర కొరా... 

ఛా.. ఇది ఒక ఇంటర్యూనా? నా ఇంట్లో వాళ్ళని కూడా పిలిస్తే ఎలా?భందుమిత్ర సపరివారంగా ఆహ్వానించడానికి ఇదేమైన పెళ్ళా? నా క్వాలిఫికేషన్, పద్ధతి చూడాలి కానీ నేను పెరిగిన విధానం ఆధారంగా నన్ను పనికిరావు అనేస్తే చాలా అవమానంగా అనిపించింది. చస్తే మా ఊర్లో వుద్యోగ ప్రయత్నాలు చెయ్యకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను.వీలైతే ఏ ఆఫ్రికాకో అండమానో వెళ్ళిపోయి అయినా సరే ఇదే సెక్టర్లో పని చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఒక వేళ సెలెక్ట్ అయినా మాకు దగ్గర్లో ఐతే రోజు ఏదో ఒక సమస్య వస్తుంది అనిపించింది. ఇక బయట వేరె ఉద్యోగాలు చూడాల్సిందే. 

ఇది నా 4వ ఇంటర్యూ. మొదటి ఇంటర్యూ మరీ దారుణం. ఇంటర్యూ కి వెళ్ళి టి.వి లో పాటలు (బయట టి.వి అరేంజ్ చేశారు పనికిమాలిన కనస్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు) చూస్తూ నా పేరు ఎప్పుడు పిలిచారో కూడా వినిపించుకోలేదు.వాళ్ళు లంచ్ టైము అయ్యి ఆఫీసు మూసేస్తుంటే ఈ లోకంలోకి వచ్చాను. కానీ అది మంచిదే (?) అయ్యింది. ఈ ఎన్.జి.ఒ సెక్టర్లోకి రాగలిగాను.

ఇక ఆతరువాత నా జీవితంలో ఎక్కువగా నేర్చుకున్న, ఎదిగే అవకాశం కల్పించిన, పెద్ద వాళ్ళతో పరిచయం చేసిన గవర్నమెంట్ ప్రోగ్రాము వెలుగు ఇంటర్యూలు నిజంగా కష్టమైనవి.కానీ నాకు ఇష్టమైనవి. అవి తరువాత పోస్టులో రాస్తాను. 

సరదాగా మీరు మీ ఫ్లాష్ బ్యాకులో మీ ఇంటర్యూలను ఊహించేసుకోండి ఇక.

2 comments:

kiran said...

:D Funny!

బాటసారి said...

Your interview journey is very interesting. Heard a lot about velugu program. Curious to know those details.
Ravi