సరే ఇక అసలు విషయానికి వస్తాను. నేను కాస్త చిన్నగా వుండటం వల్ల నా ఏక్టివిస్టులందరూ కూడా కాస్త చిన్న వయసు వాళ్ళు, ఎక్కువగా ఆడవారు వుండే వారు. నాకు అది చాల ప్లస్ పాయింట్ అయింది. వీళ్ళంతా గ్రూపు మహిళలతో చక్కగా కలిసిపోయే వారు. కానీ నాణేనికి బొమ్మ బొరుసు లాగా కొన్ని మంచి కొన్ని చెడు కూడా చూశాను.ఎప్పుడూ ఇల్లు, లేదా ఊరు దాటని వారికి ఈ ఏక్టివిస్ట్ పొజిషన్ వల్ల అనుకోకుండా కావలసినంత స్వంతంత్రం, చేతిలో వారి సంపాదన, ఎక్స్ పోజర్ దొరికింది. ఈ స్టేజ్ ని చాలా వరకు అందరూ కొన్ని కష్టాలతో అయిన బాగానే దాటారు. ఎప్పుడూ లేనిది ఎక్కడ చూసినా వీళ్ళే మీటింగులని, బ్యాంకు పని అని ఎప్పుడూ తిరుగుతూ కనిపించటం, ఎక్కువమందితో మాట్లాడటం, వెలుగు టీం లో, బ్యాంకులలో, గవర్నమెంట్ ఆఫీసులలో తిరగటం, అక్కడి మగవాళ్ళతో కలిసి మాట్లాడటం, పగలు రాత్రి అని తేడా లేకుండా పని చేయటం, ప్రయాణాలు చేయటం మొదలైనవి అన్నీ అంత చిన్న పల్లెల్లో తీవ్రమైన అలజడి తీసుకొచ్చింది. వెలుగు కి మొదట్లో ఆఫీసు లేదు. అసలు చిన్న పల్లెల్లో మేము 4,5 మంది వుండడానికి సరైన ఇల్లే దొరకలేదు. చాలా చోట్ల కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ఇంటర్యూలో ఒప్పుకున్న విధంగా పనిచేసే మండలాలలో వుండేవాళ్ళు కాదు. నేను వుండలేను అని ఇంటర్యూలో చెప్పాను కానీ వజ్రపు కొత్తూరు మండలం లో మా టీంతో కలిసి అక్కడ పనిచేసినంత కాలం అలాగే వున్నాను. మాకు కావలసింది లెట్రిన్ వున్న ఇల్లు. అది మండలం అంతా వెతికితే ఒకటే దొరికింది. అందరూ అదే ఇంట్లో వున్నాము. బెడ్రూములు వేరు అమ్మాయిలకు అబ్బాయిలకు. కామన్ కిచెన్, కామన్ బాత్ రూం. ఆ కష్టాలన్నీ వేరే టపా లో రాస్తాను. సో ఇటువంటి పరిస్థితులలో వెలుగు అంటే ఏంటో ఎవరికీ అంతగా తెలియని టైములో మేము మా ఏక్టివిస్టులు అందరికి ఒక వింత టాపిక్ గా తయారయ్యాము. నేను నాలాంటి స్టాఫ్ వేరే చోట నుండి వచ్చాము కాబట్టి మా గురించి ఎలాగూ ఏమి మాట్లాడుకున్నా మాకు కలిగే ఇబ్బంది కంటే కూడా అక్కడే గ్రామాల నుండి వచ్చిన వారికి కలిగే ఇబ్బంది ఎక్కువ. అప్పుడే కాలేజి నుండి వచ్చిన ఆవేశం తప్ప జీవితం గురించి సమాజంలో వున్న మంచి చెడుల గురించి తెలియనితనం నాది. తెలిసినా, పుస్తకాల లో చదివిన విధంగా జీవితంలో అన్నీ ఆచరణలో పెట్టేందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలని తెలియని వయసు. నేను చిన్నప్పటి నుండి ఆడ మగ అని అడ్డుగీతలు గీసి స్నేహం చెయ్యలేదు ఎప్పుడు. దానికి కారణం మా ఇంట్లో మేము అంతా ఆడపిల్లలం అయితే మా బంధువులందరికి ఎక్కువగా మగపిల్లలు. మా తమ్ముడి స్నేహితులు మాకు కూడా స్నేహితులే. మా ఇంట్లో కూడా ఎప్పుడూ అలాంటి ఆంక్షలు విధించలేదు.కాబట్టి నేను ఇద్దరితో ఒకేలా ప్రవర్తించగలిగే మెచ్యూరిటీ అలవాటయింది.
మా జాబ్ కి నా ఆలోచనా తీరు ప్రవర్తన సరిపోయిందేమో! కానీ పాపం చిన్న పల్లేల్లో పుట్టి ఎన్నో ఆంక్షల మధ్య పెరిగిన అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ వుద్యొగంలో కొన్ని కష్టాలు తప్పలేదు. అసలు ఈ వుద్యోగం ద్వార కలిగిన పరిస్థితుల్లో బ్యాలన్స్ తో నిలబడటానికి చాలా మందికి కొంత టైము పట్టింది.మొదట్లో మీటింగులో కూర్చోమంటే అమ్మాయిలంతా ఒక వైపు అబ్బాయిలంతా ఒక వైపు కూర్చునే వాళ్ళు. మేము కూడా. కానీ కొన్ని రకాల ఆటలు ఆడించి ఆ రెండు గ్రూపులని కలిపేసే వాళ్ళం. ఇక్కడ కలిసి పని చెయ్యాలంటే నమ్మకం చాలా ముఖ్యం. ఒకరిమీద ఒకరికి నమ్మకం, స్నేహం, అందరు కలిసి టీం గా పనిచెయ్యల్సిన టీం స్పిరిట్ కావాలి.కొంచెం ఇస్టం కొంచెం కష్టం సినిమాలో హీరోయిన్ కళ్ళుమూసుకొని వెనక్కు పడిపోతుంది కానీ హీరో మాత్రం ఆమెని పడిపోకుండా పట్టుకుంటాడు. అలా ఎందుకు చేశావు అంటే నేను పడనని నాకు నీ పై వున్న నమ్మకం అని చెప్తుంది. ఇదే ఆట మా టీం స్ లో 10 సంవత్సరాల క్రితం ఆడించారు. ఒకరితో ఒకరు సరిగా మాట్లాడే వారు కాదు మొదట్లో. కానీ ఇవన్నీ ఒకొక్కటే తగ్గిస్తూ రావటానికి చాలా సమయం పట్టింది. కానీ అందరు ఈ ట్రాన్సిషన్ బాగా తీసుకున్నారు అని చెప్పలేను. అలాంటిదే దీప కధ.
దీప అప్పటికి ఇంటర్ చదువుతుంది. చిన్నగా, అమాయకంగా నవ్వుతూ సిగ్గుపడుతూ వుండేది.చాలా మంది ఆడవాళ్ళు ఊరికే ఎందుకు సిగ్గుపడుతుంటారో నాకెప్పుడు అర్ధం కాదు, బహుశా అది సొగసేమో!!మా మమ్మీని అడిగితే నాకు లేని విషయాలు నన్ను అడగకు అని చెప్పింది. (అంటే ఆవిడకి సిగ్గులేదని కాదు, అనవసరంగా అలా సిగ్గుపడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె లో ఎక్కువ చూసింది విపరీతమైన గుండె నిబ్బరం.అందుకే ఆమెకి వున్న గుండె జబ్బుకి డాక్టర్లు ఎప్పుడో చనిపోతావు అని చెప్పినా కూడా ఇప్పటికి 30 సంవత్సరాలుగా మా అందరికంటే ఏక్టివ్ గా బ్రతికి చూపిస్తుంది.సో ఈ బ్యాక్ గ్రౌండ్ వల్ల నా పెళ్ళిలో కూడా నేను సిగ్గుపడలేకపోయాను. ) సరే దీప దగ్గరికి వద్దాము. నాకు అందరి ఏక్టివిస్ట్ ల కంటే దీప అంటే ఎక్కువ ఇష్టం వుండేది. ఎందుకంటే దీప తెలివైనది, స్వీట్ గా వుంటుంది.కానీ ఒకరోజు నాకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది.
ఇంట్లో ఆఫీస్ పని మీద నా దగ్గరకొస్తున్నాను అని చెప్పి ఉదయం వెళ్ళిన అమ్మాయి రాత్రి అయిన రాలేదు. వాళ్ళ ఇంట్లో నాదగ్గర వుందేమో అనుకుని ఊరుకున్నారు. నేను ఫీల్డుకి వెళ్ళడానికి నా కైనటిక్ హోండాలో పెట్రోల్ అయిపోతే దీప వాళ్ళింటిపక్కన వుండే వాళ్ళు మాత్రం పెట్రోల్ స్టాక్ పెడతారు ఇంట్లో(దొంగతనంగా) అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు టైము సాయంత్రం 4. దీప వాళ్ళ అమ్మగారు గుమ్మంలో నిలబడితే పలకరించాను, దీప వుందా అండి అని. ఆవిడ అయోమయంగా చూసి మీ దగ్గరకే వచ్చింది వుదయం 7 కే అని చెప్పారు.అదేంటండీ నేను అసలు పిలవలేదు, రేపు మాకు మీటింగ్ వుందని ఈరోజంతా మేము ఆ పనిలో వున్నాము అని చెప్పాను. ఆవిడ నావైపు చాలా కోపంగా చూసి లోపలకి వెళ్ళిపోయింది. నాకు వెంటనే చాలా భయం వేసింది. ఎందుకో గానీ పెట్రోల్ ట్యాంకు ఫుల్ చేయించాను. వెంటనే ఇంటికెళ్ళి మా కొలీగ్స్ కి విషయం చెప్పాను. అందరు ఫీల్డు కి వెళ్ళే ప్రొగ్రాం కేన్సిల్ చేసుకొని కూర్చున్నాము. రకరకాల ఆలోచనలు చేశాము.దీప చాల అమాయకంగా కనిపించినా తెలివైన అమ్మయి అని మా అందరి అభిప్రాయం. తనకి ఎవరితోనూ లవ్ ఎఫైర్ వున్న సూచన కూడా లేదు. ఒక వేళ వున్నా అంత అర్జెంటుగా పారిపోయే అవసరం లేదు కదా!నాతో ఎంతో చనువుగా మాట్లాడుతుంది, తనకి చదువుకోవాలనే కోరిక వుందని చెప్తే నేనే ఫీస్ కట్టి వాళ్ళ ఇంట్లో కూడా వొప్పించాను. ఇప్పుడు దీపకి ఏమైనా ఐతే బాధ్యత నాదే అనిపించింది. ఒకవేళ ఈ డిగ్రీ పనిమీదే ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్ళిందా! నా పేరు ఉపయోగించుకున్నప్పుడు నాకొక మాట చెప్పొచ్చుకదా! నేను తన అమాయకత్వం చూసి మోసపోయానా లేక దీప ఎవరిమాటలో నమ్మి మోసపోయిందా! అలా అయితే అసలు ఆమే ఇంట్లోనుండి బయటకి రావడానికి కారణమే నేను కదా. నాకు నిజంగా నా వుద్యోగం ఎంత బాద్యతా యుతమైనదో, ఎంత రిస్క్ వుందో అప్పుడు తెలిసింది. వెంటనే మా టీం లో వున్న 5 మంది దీపకోసం వెతకడానికి బయలుదేరాలని నిర్ణయించాము. పలాస దగ్గరలో వున్న పెద్ద ఊరు.ఎవరెక్కడికి వెళ్ళాలన్నా పలాస వెళ్ళాల్సిందే. అదీ కాక మా వెలుగు టీం చుట్టుపక్కల ఊర్లలో ముఖ్యంగా బస్సుల వాళ్ళకి, షాపుల వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళు దీపని చూస్తే వెంటనే ఎక్కడికి వెళ్ళింది తెలిసిపోతుంది. అలా అని మేము మా టూ వీలర్స్ తీసుకొని మనిషి ఒక వైపు వెళ్ళాలని ఎప్పటికప్పుడు ఇన్ ఫర్మేషన్ మా ఇంటి ఓనర్ అక్కకి ఫోన్ చేసి అప్ డేట్ చెయ్యాలని నిర్ణయించుకొని బయలుదేరాము.
కానీ కరెక్ట్ గా ఊరు సెంటర్ దగ్గరకి వచ్చేసరికి ఊరివాళ్ళంతా పెద్ద గుంపుగా వచ్చేసారు. మేము పారిపోతున్నామనుకున్నారు. ఆ ఆలోచన కూడా మాకు రాలేదు. మేము దీప కి ఏమైవుంటుందో ని ఆలోచించాము కానీ మాకేమవుతుంది అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.కానీ పల్లెల్లో వాళ్ళని మోసం చేసి పారిపోయేవాళ్ళు ఎక్కువగా వుంటారు అందుకని మమ్మల్ని కూడా అదే కోవలోకి చేర్చారు. కానీ మా టీంలో వెంకటేశ్వర రెడ్డి కొంచెం ముందుగా గ్రహించాడు. వాళ్ళతో మీరేమి చెప్పొద్దు అని చెప్పాడు. తనే ముందుగా వెళ్ళి మేమే మీ దగ్గరకి వస్తున్నాము. గ్రామంలో కుర్రాళ్ళని అవసరమైతే మా టూ వీలర్స్ ఇచ్చి వెతకడానికి పంపాలి. దీప కి ఏమి కాకుండా త్వరగా బయలుదేరండి అని చెప్పాడు. ఆ మాటలు విని గ్రామ పెద్దలు కాస్త శాంతించినా దీప వాళ్ళ కుటుంబం, ఇంకా కొందరు మా మీద కోపం వుందో ఏమో మీరే ఏదో చేశారు అని గట్టిగా అరవటం మొదలు పెట్టారు. నాకు అర్జెంట్ గా పోలీస్ సహాయం తీసుకోవాలనిపించింది. కానీ పల్లెల్లో పోలీసు, చట్టం న్యాయం అంతా ముందు గ్రామస్తులదే. మేము చాలా నచ్చచెప్పాము. అప్పటికి మా గురించి బాగా తెలిసిన సంఘం మహిళలు మాకు అండగా వచ్చారు. లేదంటే ఆ కోపంలో గ్రామస్తులు మమ్మల్ని ఏమి చేసేవారో. అసలు ఎవరూ మీటింగ్ కి ఈ రోజు రాలేదు. అంటే శిరీష మేడం పిలవలేదు అనే కదా అర్ధం. మమ్మల్ని కూడా ఈరోజు రమ్మని ఆమె చెప్పలేదు. దీప ఎక్కడికెళ్ళిందో ఏమో అబద్ధం చెప్పి వుండొచ్చు కదా! ఒక వేళ ఆమెకి తెలిసే వుంటే వెళ్ళి దీప వాళ్ళమ్మని ఎందుకు పలకరిస్తుంది అని గ్రామపెద్దలతో వాదించారు. మా టీం మాత్రం ఆల్ మోస్ట్ అందరూ బిక్కచ్చిపోయాము. చిత్ర, నేను ఏడుపు ఆపుకుంటూ నిలబడ్డాము.చిత్ర నా చెయ్యి గట్టిగా పట్టుకింది. రెడ్డి, ధర్మా, శ్రీను మా చుట్టూ కంచుకోటలా నిలబడ్డారు. ఒకవేళ ఎవరైనా చెయ్యి చేసుకుంటే మాకు ఏమీ కాకూడదని. ఇదే కదా స్నేహం, అదే కదా టీం లో ఒకరిపై ఒకరికి కలిగే నమ్మకం.అందుకే నేను ఎప్పటికి మా టీం ని, ఆ జాబ్ ని మర్చిపోలేను. మొత్తానికి అబ్బాయిలు ముగ్గురూ ఆ ఊర్లో మిగిలిన కొందరు అబ్బాయిలతో కలిసి వెతకడానికి వెళ్ళారు.సాయంత్రం 5 కి వెళ్ళిన వాళ్ళు రాత్రి 11 కి వచ్చారు.కానీ దీప దొరకలేదు.ఆరోజు రాత్రి నేను ఎప్పటికి మర్చిపోలేను. అప్పటికే నేను, చిత్ర కలిసి మా పి.డి గారికి ఫోన్ చేసి విషయం చెప్పాము. వాళ్ళు అక్కడి లోకల్ ఇన్స్ పెక్టర్ ని ఉదయాన్నే పంపిస్తామని చెప్పారు. అదే విషయం అక్కడి పంచాయతీ ప్రెసిడెంట్ కి కూడా చెప్పారు. వెంటనే కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రెసిడెంట్ కి మేము ఊరికే అల్లరిచేసే పిల్లలం కాదనీ, మమ్మల్ని ఏమీ చెయ్యకూడదని అర్ధం చేసుకున్నాడు. కానీ మేము 5మంది రాత్రంతా నిద్రపోలేదు. స్వరూప అని వేరే మండలం లో చేస్తున్న మా కొలీగ్ మరియు ఫ్రెండ్ ఆరోజు మా దగ్గరే వుండటం వల్ల తను రాత్రంతా మా అందరిని చేతులు పట్టుకొని ప్రార్ధనలు చేయించింది.మాలో ఎవరికీ దైవ భక్తి లేదు అయినా ఒకరికి ఒకరు తోడున్నామని ధైర్యంగా అనిపించింది.ఉదయాన్నే 5 గంటలకి ఇన్స్ పెక్టర్ వచ్చారు. అతనికి జరిగింది చెప్పాము. భయపడకండి నేను చూసుకుంటా అన్నారు. కానీ 7 అయ్యేసరికి దీప వచ్చేసిందని వార్త వచ్చింది.ఇన్స్పెక్టర్ గారు వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడదాము అన్నారు. మేమే వద్దండి ఆమె కూడా భయపడి వుంటుంది, ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తామని పంపించేశాము. మేము శ్రికాకుళం మీటింగ్ కి కూడా వెళ్ళకుండ ఇంట్లో వుండిపోయాము. ఆరోజు మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాము.ప్రజలకోసం పనిచేసినా కూడా, వాళ్ళ మధ్యనే బతుకుతున్నా కూడా ఎప్పటికైనా మనల్ని గమనిస్తూ వుంటారు, చిన్న తప్పు జరిగినా మనల్ని వదిలిపెట్టరు అని అర్ధం అయింది. నాకైతే అసలెందుకు ఈ కష్టాలన్నీ, నమ్మని మనుషుల మధ్య ఎందుకు వుండాలి అనిపించింది. కానీ ఆలోచిస్తే అన్నీ సహజంగానే జరిగాయి అనిపించింది.దీప నా పేరు చెప్పి వెళ్ళటం వల్లనే గ్రామస్తులు అలా స్పందించారు.
ఈ సంఘటన మాకే కాదు వెలుగు కే ఎంతో నేర్పింది. మేము ఏక్టివిస్ట్లు సెలక్షన్ కి ఒక పెద్ద పుస్తకం పట్టేన్ని రూల్స్ పెట్టేసుకున్నము. అంతే కాదు వెలుగు గురించి ప్రజలలో సరైన పరిచయం చెయ్యాలని కూడా నిర్ణయించారు.ఇలాంటివే రకరకాల సమస్యలు మా టీం వాళ్ళు ఎక్కువగా ఎదుర్కోవలసి రావటంతో పి.డి గారు స్వయంగా అన్ని మండలాలకు వెళ్ళి వెలుగు అంటే చంద్రబాబు నాయుడు డైరెక్టుగా అందరిమీద పెత్తనం చెయాలించడానికి ఏర్పాటుచేసిన ప్రోగ్రాం అన్నట్లు బిల్డప్ ఇచ్చారు.
దీప మాత్రం ఆరోజంతా రాలేదు. మేము దీపని ఏక్టివిస్ట్ గా తీసేయాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ఇదే విధంగా ఇంకెవరూ చెయ్యకూడదని. దీప ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకోవటం, ట్రైన్ చెయ్యటం ఇవన్న్నీ నాకు చాలా పెద్ద గ్యాప్. కానీ ఎవరికోసమో ఏపనీ ఆగిపోదు కదా!మర్నాడు దీప ఇంటికొచ్చింది. చిత్ర ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడారు. నాకు మాట్లాడాలనిపించలేదు. మాట్లాడితే ఏడుస్తానేమో అనిపించింది. దీప అందరికి చెప్పిన విషయం ఏంటి అంటే వాళ్ళ నాన్నమ్మ ఒంటరిగా వుంటోంది వేరే ఊర్లో. దీప వాళ్ళ ఇంట్లో ఎవరూ ఆ ముసలామెని చేరదీయరు, మాట్లాడరు.కానీ దీపకి ఆమె అంటే ఇష్టం. అందుకని అబద్ధం చెప్పి ఆమె వున్న్న ఊరికి వెళ్ళింది.రాత్రి అయిపోవటం వలన అక్కడే వుండిపోవలసి వచ్చిందంట.తను చేసింది ఒక మంచి పని అయినా కూడా దీప చెప్పిన ఒక అబద్ధం వల్ల మా టీం అంతా ఆరోజు పడిన నరకం నన్ను దీప మీద జాలి చూపనీయలేదు. ఒకేమాట మాట్లాడాను దీప తో "దీప ఇకనుండి నువ్వు రానవసరంలేదు, వేరే వాళ్ళని నీ ప్లేస్ లో తీసుకుంటున్నాము" అని. అది తప్పా కాదా నాకు తెలీదు. కానీ అది అవసరం. తరువాత చాలా సార్లు కనిపింపించినా కూడా ఎప్పుడూ నేను సరిగా మాట్లాడలేదు. ఆ తరువాత నేను అక్కడనుండి వచ్చేశాను. ఇప్పటికి 8 సంవత్సరాలు పైనే అయింది. నిన్న రాత్రి దీప ఫోన్ చేసింది.మేడం బాగున్నారా? మీరూ వెంకటేశ్వర రెడ్డీ సార్ పెళ్ళిచేసుకున్నరంటకదా, ఇప్పుడు మీరు నెల్లూరులో ఉన్నారంటకదా,చాలా సంతోషం గా వుందండి మీతో మాట్లాడుతుంటే. నాకు కూడా పెళ్ళి అయింది, కావలిలో మా ఆయన టెలిఫోన్ డిపార్ట్ మెంట్లో పని, నాకు ఒక పాప....నేను మిమ్మల్ని ఒకసారి కలవొచ్చా?అని అడిగి కాసేపాగి.. "ప్రైవేటుగా ఈసంవత్సరమే నేను డిగ్రీ పూర్తి చేశాను" అని చెప్పింది. నాకు సంతోషం అనిపించింది.ఇంటి అడ్రస్ చెప్పాను. ఎప్పుడైనా వీలు చూసుకొని కలుస్తానని చెప్పింది.
దీప 8 సంవత్సరాలతరువాత ఫోన్ చేసి పాత ఙ్ఞాపకాలని మళ్ళీ గుర్తుచేసింది. ఒక్కోసారి ఎవరి కోణం నుండి వాళ్ళు సరిగా వున్నా ఇలాంటి అనుకోని సంఘటనలు అందరిని బాధిస్తాయి. తరువాత తరువాత ఇలాంటి ఎన్నో సంఘటనలు నాకు కూడా అలవాటైపోయాయి. ఏక్టివిస్టులు కూడా మాతో పాటు చాలా కష్టపడ్డారు. మంచి ఏక్టివిస్టు దొరికితే ఆ ఊర్లో గ్రూపులన్నీ బాగుపడతాయి. తరువాత కాలంలో ఒక్కో జిల్లాలో వాళ్ళని ఒక్కోలా పిలుస్తున్నరు. నెల్లూరు లో సంఘ ప్రియ అంటారు. బాగుంది కదా పేరు.
14 comments:
హమ్మయ్య! కధ సుఖాంతమైందన్నమాట. మీ రచనా శైలి చాలా బాగుంది. కొంచెం టెన్షన్ పెట్టారు.
lakshmi naarayana garu, meeku naa saili nachchinanku thanks anDi. intakee naa saili eantandi? nijamgaa naaku teleedu. ippatiki chala mandi chepparu.
కళ్ళముందు జరిగినట్టే రాసారు. అభినందనలు.
కథనం బావుంది.ఎక్కడా బోర్ కొట్టకుండా చదివించగలిగారు.మంచి రచయిత్రి కాగలరు.ప్రయత్నించి చూడండి.
బాగుందండీ, ఉద్యోగంలో పుస్తకాలు చదివి నేర్చుకోలేని ఇలాంటివి చాలానే నేర్చుకుంటాము కదా. ఇంతకీ దీప నిజంగా ఎక్కడికెళ్ళిందో తరవాతైనా కనుక్కున్నారా?
అభిగ్నయ గారు, థాంక్స్.
లోకేష్ గారు, నేనా? రచయితా? కష్టమండి. అది ఎంతో వున్నతమైన బాష, ఆలోచనలు, ఊహా శక్తి మొదలైన ఎన్నో లక్షణాలు కలిగిన వారికే సాధ్యం.
భాస్కర్ గారు, దీప నిజంగానే వాళ్ళ నాయనమ్మ ఇంటికే వెళ్ళింది
చాలా బావుంది
మీలో ఒక ఒక గొప్ప రచయిత్రి ఉన్నారు
Harea krishna garu,
thanks andi. meerandaru ila chepte nijamgaa rachanalu cheseasi janaala meedaki vadileastaa
Sireesha garu,
Deepa meeda kasepu anumanam vachela chesaru, kasepu deepaku emaindo ani tension pettaru, mee friends batch choosi muchtesindi.
Meeru Deepa nu artham chesukovalsindi, anyways nice incident to share from an omniscient writer.
Brahmesh
tension pettarandee.ayithe chivari varakoo chadivinchaaru.baagundi mee anubhavam.
చాలా బాగుంది శిరీష గారు. ప్రతి క్షణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. నిజమే కదా జీవితం లో ప్రతి అడుగులోను ఎన్నో నేర్చుకుంటూ వుంటాము. పాపం ఎంత టెన్షన్ పడ్డారో కదా ఆ రాత్రి.
ధరనిజ గారు, థాంక్స్ పూర్తిగా చదివి కామెంట్ చేసినందుకు.
భావన గారు, నిజంగానే టెన్షన్ పడ్డాము. ఇప్పుడు నిజంగా మా ఇంట్లో వాళ్ళు పారిపోయినా పెద్ద టెన్షన్ పడనేమో!
మీ రచనా శైలి చాలా బాగుందండీ. కానీ, నాకు దానికంటే ఎక్కువగా నచ్చింది మీ ఉద్యోగం. నేనూ చదువుకునే రోజుల్లో అలాటి ఉద్యోగం చేయాలని ఆశపడ్డను. ఇంకా అదే ఉద్యోగం చేస్తున్నారా?
All the best.
శారద
@sarada garu, inka ide sector lo pani cheastunnaanu kani velugu loa kaadu.
Post a Comment