Monday, June 14, 2010

రేపిస్ట్...... కవిత్వం.

మనసు బాధగా వుంటే కవిత్వం వస్తుందా, లేక సంతోషంతో పరవశిస్తే కవిత్వం వస్తుందా? నాకైతే ఈ రెండు సంధర్భాలలో కూడా కవిత్వం రాదు. ఎందుకంటే నాకు అసలు కవిత్వం రాదు కదా అందుకన్నమాట.

కానీ విచిత్రం ఏమిటంటే కవిత్వం చదవటం కూడా రాని ఈ కవిత్వనిరక్షరాస్యులాలితో కూడా జీవితంలో కొన్నిసార్లు కవిత్వం చెప్పించగలిగాడు ఒక మహానుభావుడు.ఆ మహానుభావుడి గురించి, నా కవిత్వం గురించి చెప్తాను వింటరా?కానీ ముందే చెప్పేస్తున్న అదో పేద్ధ కధ.మీకు ఓపిక వుంటేనే మొదలుపెట్టండి.

నాకు వెలుగులో పోస్టింగ్ ఏ మండలమో ఎంచుకోమని అందరికీ ఇచ్చినట్లే అవకాశం ఇచ్చారు. మండలం సైజు బట్టి ఎంతమంది టీము అనేది నిర్ణయించారు. పాపం మా వాళ్ళందరు వాళ్ళ ఇంటికి దగ్గర అని, బంధువులున్నవనీ, ప్రయాణం సులభం అని, బస్సులు అన్ని ఊర్లకు వున్నయనీ ఇలా రకరకాలుగా నాకు ఈ మండలం కావాలి అంటే నాకు ఇది కావాలి అని కొట్టుకుంటున్నారు. నాకు ఏ మండలమైన ఒకటే ఇంటికి ఎంత దూరంగా వుంటే అంత మంచిది కదా! నాలాగే నా పి.జి క్లాస్మేట్ శ్రీను అలాగే వెంకటేశ్వర రెడ్డి అని ఇంకో అబ్బాయి ఏ రాయి ఐనా ఒకటే తల పగలగొట్టుకోడానికీ అని చెప్పారు( అదే ఏ మండలం అయిన ఒకటే అని పని చెయ్యడానికి అని మర్యాదగానే చెప్పారనుకోండి). సో మొదట ఆ విధంగా మేము ముగ్గురం మరాఠీల గ్రూపు ఎవరు వెళ్ళము అని చెప్పిన వజ్రపుకొత్తూరికి వెళ్ళడానికి సిద్ధం అయ్యాము.శ్రీను అంటే నాకు బాగా తెలుసు ఎందుకంటే మా ఇద్దరిదీ పరీక్షల్లో చూసి కాపీ కొట్టిన ధృఢమైన బంధం. పి.జి లో మొదట ఏదో పరీక్ష రోజు వచ్చాడు, నా వెనక కూర్చొని నీ అన్సర్ పేపర్ చూపిస్తావ చచ్చిపోవాల అనే లెవెల్ లో బెదిరించాడు. సరే నాకు కూడా ఎందుకో మరి చూడగానే నచ్చాడు నా సైజులో వున్నాడు. ఇక అప్పటినుండి మేము స్నేహితులం. మరి శ్రీను వున్న తరువాత ఆ ఇంకో మూడో మనిషి ఎవరైతే నాకేంటి గొట్టం అనుకున్నాను. కానీ ఆ గొట్టం అదే ఆ మూడో అబ్బాయే నాతో కవిత్వం చెప్పించగల మహానుభావుడని నాకు అప్పుడు నిజ్జంగా తెలీదు. ఆ మహానుభావుదు చాలా పొడుగ్గ జెండా కర్రలా వున్నాడు నా దగ్గరకొచ్చి నేనే ఆ మూడో మనిషిని రేపు మనం ఫీల్డ్ కి వెళ్ళాలి కదా ఎక్కడ కలవాలి అని అడిగాడు. నాకసలే పొడుగ్గా వున్న వాళ్ళంటే పరమ చిరాకు ఎందుకంటే నేను పొడుగ్గా లేను కదా మరి. సరే నీ పేరేంటి అని అడిగి పాపం పేరు చెప్తుంటే వినకుండానే సరే రేపు వుదయాన్నే 7 గంటలకి కరెక్ట్ గా శ్రికాకుళం బస్ స్టాండ్ కి వచ్చేయ్, నేను శ్రీను కూడా వచ్చేస్తాము, లేట్ చెయ్యకు నాకు పంక్చువాలిటీ గా లేకపోతే భలే చిరాకు అని చెప్పి నేను మర్నాడు ఖచ్చితంగా రెండుగంటల లేటుగా వచ్చేసాను. ఆ మాత్రం ఎదురుచూడలేరా అందులోనూ ముగ్గురిలో మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మాదే మెజారిటీ కదా! సరే అలా మొదలుపెట్టాము మా మొదటి ప్రయాణం వజ్రపుకొత్తూరికి. మాకు 3 ఊర్లు ఇచ్చి ఒక్కొక్కరు ఒక ఊర్లో కనీసం 2 రోజులుండాలి అని, అక్కడ గ్రామానికి సంబంధించి సమాచారం (పెద్ద ప్రశ్నా పత్రం ఇచ్చారులెండి) తేవాలని చెప్పారు. కాకపోతే ఒక చిన్న కండిషన్. మేము ఎవరన్నది చెప్పకూడదు. వెలుగు, జిలుగు అంటే ఎలాగూ ఎవరికీ తెలీదు కాబట్టి మాకు నచ్చిన అబద్ధం ఏదైన చెప్పి 2 రోజులు ఆ గ్రామంలో మా తిండి, వుండడానికి నీడ వగైరా మేమే సంపాదించుకోవాలి. ఇది మాకిచ్చిన పరీక్ష. మద్యలో మా ఆఫీసు నుండి ఎవరైన వచ్చి చెక్ చేస్తారని చెప్పలేదు కానీ వచ్చారు. పాపం కొందరు ఇంట్లో కూర్చొని కధలు చెప్పి దొరికిపోయారు. మేము కూడా ముగ్గురం మూడు గ్రామాలలో స్థిరపడ్డాము. నేను యూనివర్సిటీ స్టూడెంట్ అని గ్రామాల గురించి మా చదువని 2 రోజులు వుండడానికి ఏర్పాటు చెయ్యమని డైరెక్ట్ గా గ్రామ ప్రెసిడెంట్ ని అడిగి వాళ్ళింట్లోనే తిష్ట వేసాను. శ్రీను, రెడ్డీ కూడా అదే చెప్పారు. మొదటి రోజు బాగానే వుంది, కానీ 2 వ రోజుకి ఆ గ్రామంలో వున్న అబ్బాయిలు నేను ఇల్లిల్లూ తిరిగి సమాచారం అడుగుతుండటం, ఒక్కదాన్నే వుండటం చూసి నన్ను ఆటపట్టించటం మొదలుపెట్టారు. పల్లెల్లో వాళ్ళది కాస్త మోటు సరసం అనుకుంటా మరీ ఎవరూ లేని చోట నన్ను చూసి దారికి అడ్డంగా నిలబడి బెదిరించసాగారు.నాకు దిగులొచ్చేసింది, అయ్యో శ్రీను తో పాటు వెళ్ళినా బాగుండేది అనిపించింది. కానీ వెంకటేశ్వర రెడ్డి అకస్మాత్తుగా ప్రత్యక్ష్యం అయ్యాడు సినిమాలలోలాగా. నాకు భలే సంతోషం వచ్చింది. ఎందుకొచ్చావు అంటే అమ్మాయివి ఒక్కదానివే కదా నీకేదైనా అవసరం వుందేమో అని వచ్చాను నేను పలాస వెళ్తున్నాను అని చెప్పాడు. ఆహా నా ఫ్రెండ్ నాదగ్గర చూసి పరీక్ష రాసి పాస్ అయి కూడా నన్ను పట్టించుకోలేదు ఈ అబ్బాయి పేరు కూడా నాకు సరిగా గుర్తులేదు నాకోసం ఎంత బాగా ఆలోచించాడు అనిపించింది. అయినా కూడా ఆతరువాత చాలా సార్లు తన పేరు మర్చిపోయాను మళ్ళీ ఎందుకంటే కర్నూలు యు.ఎన్.డి.పి ప్రాజెక్ట్ నుండి ఒక 4 అబ్బాయిలు వచ్చారు అందరూ రెడ్డీలే శ్రీనివాస రెడ్డీ, వెంకటేశ్వర రెద్దీ, ఆ రెడ్డీ, ఈ రెడ్డీ అని.నేను రోజుకో పేరుతో పిలిచేదాన్ని శివారెడ్డీ, బాలక్రిష్న రెడ్డీ, నాగార్జున రెడ్డీ అని. పాపం ప్రతీ సారీ మేడం నా పేరు వెంకటేశ్వర రెడ్డీ అండి అని చెప్పేవాడు.

ఆ తరువాత 2వ సారి ఫీల్డ్ మరీ విచిత్రంగా ప్లాన్ చేసారు మా ఆఫీస్ లో. మండలంలో మొత్తం గ్రామాల లిస్ట్ ఇచ్చేసి మీరెలా చేస్తారో మీ ఇస్టం అన్ని గ్రామాలకి వెళ్ళి ఆ సమాచారం తీసుకు రండి కానీ మీరెవరో చెప్పొద్దు అన్నారు.అక్కడికి మేమేదో సి.బి.ఐ లో పనిచేస్తున్నట్లు.మాది పెద్ద మండలం,మేము ముగ్గురమే. సరే అని బయలు దేరాము. కొన్ని గ్రామాలు చేరాలంటే కనీసం బస్సు కూడా లేదు. కొన్ని గ్రామాలున్నాయని మేము తిరిగి వాస్కోడిగామాలలా కనుక్కున్నాము. వజ్రపుకొత్తూరు చాలా విచిత్రంగా వుంటుంది. మొత్తం సముద్రపు ఒడ్డు గ్రామాలు, మత్సకారులు. పల్లీలు,పట్టపు ముఖ్యమైన కులాలు. అవికాక మిగిలిన వాళ్ళు కూడా వున్నారు. కొన్ని గ్రామాలు సముద్రపు ఒడ్డునే వుంటాయి అంటే వారు అంట్లు తోమి గిన్నెలు కూడా సముద్రంలో కడుక్కుంటుంటారు అంత దగ్గరన్నమాట. అన్ని గ్రామాలలో జీడితోటలు వుంటాయి. వారికి అదే ప్రధాన పంట. ఇసుకనేల. జీడితోట వుంది ఇక్కడ మనుషులూ, ఊరు లేదూ అనుకున్నారో ఏమో అలా కొన్ని తోటల్లో గ్రామాలు రెవెన్యూ లెక్కల్లో లేవు. మేము ముగ్గురం ఒక గ్రామాన్ని కేంప్ గా పెట్టుకొని (ఎవరు తిండి నీడ చూపిస్తే వారిగ్రామం) చుట్టుపక్కల గ్రామాలు ఉదయం నుండి సాయంత్రం వరకు ముగ్గురు 3 వైపుల తిరిగి సాయంత్రానికి కేంప్ గ్రామం చేరేవాళ్ళం. ఒక్కోరోజు ఒక్కొక్కరు 2,3 కంటే ఎక్కువ తిరగలేకపోయే వాళ్ళం. రెడ్డీ ఎక్కువ కవర్ చేసేవాడు. తను సన్నగా బలంగా వుంటాడు కాబట్టి చాలా స్పీడుగా నడుస్తాడు. నేను మాత్రం వీలైనంతవరకు బస్సు తిరిగే గ్రామాలను కవర్ చేసి నడిచి వెళ్ళేవి పక్కనపెట్టేదాన్ని. కాని ఎప్పటికైనా తప్పదు కదా, రెడ్డీ తోడొచ్చాడు కొన్ని దూరం గ్రామాలకి. శ్రీను ది శ్రికాకుళం జిల్లానే. అదీ కాక శ్రీనుకి ఎప్పుడూ కడుపులో బాగుండేది కాదు. అందువల్ల శ్రీను ఎక్కువగా వచ్చేవాడు కాదు. ఒకవేళ వచ్చినా శ్రీను అర్జెంట్ గా ప్రకృతి పిలుస్తుంది అని చెరువు గట్లు చూసుకొని వెళ్ళిపోయే వాడు.ఇక నేను రెడ్డీ తనకోసం ఎదురుచూస్తు రాక రాక వచ్చే బస్సులు కూడా మా కళ్ళముందు వెళ్ళిపోతుంటే శ్రీను ని తిట్టుకునే వాళ్ళం. ఈ ప్రయాణలలో ముగ్గురం చాలా మంచి స్నేహితులయిపోయాము.ఆకలి, నిద్ర, ఇంకా మిగిలిన ప్రకృతి సహజమైన అవసరాలు, అలసట, భయాలు ఇవన్నీ మమ్మల్ని ఎంతో దగ్గర చేసాయి.నిర్మానుష్యంగా వున్న రోడ్డు మీద నడుస్తూ చిన్నపిల్లల్ల గట్టిగా అరిచేవాళ్ళం. పులి వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది అని ఒకరిని ఒకరు బయపెట్టుకొని పరిగెత్తేవాళ్ళం. ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోతే మిగిలిన ఇద్దరు తనకి సేవలు చేసేవాళ్ళం. ఒకరి పనిలో ఒకరు సహాయం చేసుకొనే వాళ్ళం. గ్రామాలలో మీటింగులు పెట్టి మేము వచ్చిన పనితో పాటు ఆ గ్రామానికి,ప్రజలకు అవసరమైన విషయాలు తెలుసుకొని వాటి కోసం ముగ్గురం ప్రిపేర్ అయ్యి మళ్ళీ మీటింగులు పెట్టి వారికి చెప్పేవాళ్ళం. చాలా గ్రామాలలో నీరు, పరిశుబ్రత, స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి ప్రత్యేకమైన మీటింగులు అడిగేవారు.ఇలా మా ఆఫీసులో ఇచ్చిన పని మాత్రమే కాకుండా మేము వేరే పని కూడా చేసే వాళ్ళం. 15 రోజుల పైనే తిరిగాము.వాళ్ళిద్దరు మొదట నేను ఉండడానికి సరైన చోటు వుండేలా చూసేవారు. కానీ చాలా సమయాల్లో మాకు స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ సెంటర్ ఇవే వుండడానికి ఇచ్చేవారు.మొదట్లో చాలా ఏడుపొచ్చేది.బాత్రూం కానీ,స్నానం కానీ చెయ్యాలంటే కానీ అవికూడా సరైన స్థలం చూసి నాకు సహాయపడే వారు. రాత్రి పూట మేము ఒకే దగ్గరపడుకున్నా కూడా వాళ్ళిద్దరు నాకోసం ఎంతో జాగ్రత్తపడేవాళ్ళు. నాకు ఉదయం మెలుకువ రాదు.కానీ రెడ్డి నన్ను ఖచ్చితంగా 3.30కి లేపేసేవాడు నా దృస్టిలో అది అర్ధ రాత్రి. కానీ తను బలవంతంగా నన్ను అప్పుడు వెళ్ళి స్నానం,బాత్రూం ముగించుకోమని నీళ్ళు పట్టి మరీ చెప్పేవాడు.చీకటికి కళ్ళుపొడుచుకున్నా ఏమీ కనిపించేది కాదు. అయినా రెడ్డీ వున్న శబ్ధం నాకు ధైర్యం ఇచ్చేది. బోరింగ్ దగ్గర స్నానం చేశానంటే ఈరోజు నాకు నేనే నమ్మలేకపోతున్నాను. నాకు మనుష్యుల మధ్య స్నెహం విలువ, ఒకరికి ఒకరు ఎంతగా సహాయపడొచ్చో అర్ధమ్య్యేది. మిగిలిన టీములు కూడా ఇలాగే స్నేహితులయ్యారో లేదో నాకు అంతగా తెలీదు కానీ మా టీములో ముగ్గురికి ఒకరంటే ఒకరికి విపరీతమైన నమ్మకం కుదిరింది.

కొన్ని గ్రామాలు మాత్రమే తిరిగాము. మండలం మొత్తం తిరగాలంటే సరైన ప్రయాణసదుపాయాలు లేకుండా కష్టమే. రామాయణం లో పిడకలవేట లాగా ఇన్ని కష్టాలు స్నేహం మధ్యలో నాకు రెడ్డీకి గొడవయ్యింది. రెడ్డీ సిగరెట్ తాగేవాడు. అది మర్యాదో లేక భయమో కానీ రెడ్డీ నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. దూరం దూరం గా తిరుగుతుండేవాడు.శ్రీను,నేను మాత్రం చాలా అల్లరి చేసే వాళ్ళం.శ్రీను చాల సరదా మనిషి. మేమిద్దరం నవ్వి నవ్వి ఇక నవ్వలేక కదుపు,బుగ్గలు నొప్పి వచ్చి కూర్చొనే వాళ్ళం.రెడ్డీ కి ఇదంతా ఆశ్చర్యం.వీళ్ళిద్దరు ఏంటి చిన్నపిల్లల్లా ఆడుకుంటారు అన్నట్లు చూసేవాడు. నాకసలు నోటి దురద ఎక్కువ కదా అలా రెడ్డీని ప్రశాంతంగా వుండనిస్తే నేను శిరీష ని ఎలా అవుతాను. ఒక రోజు యధావిధిగా మధ్యానం బోజనం అయ్యాక వేరే గ్రామానికి నడుస్తూ వెల్తుంటే ఒక గుబురు గా వునా జీడితోట కనిపించింది. బెండిగేటు దగ్గర నుండి పలాస వరకు వున్న మెయిన్ లైను తప్ప మిగిలిన గ్రామాలన్నిటికి మద్య చాలా నిర్మానుష్యమైన తోటలు, ఇసుక నేలలు చాలా దూరం వరకు వుండేవి.అక్కడ నడవాల్సిందే.చీకటి పడే లోపు ఏదో ఒక గ్రామానికి చేరాల్సి వుండేది.లేదంటే కొన్ని ప్రాంతాలు నక్సల్ ఏరియాలు. అలాంటి జీడితోట చూసి శ్రీను "శిరి, రెడ్డీ ఇక మీరు నన్ను ఆపకండి, ఈ తోట నన్ను పిలుస్తుంది (అప్పటికే మాకది కోడ్ భాష అయిపోయింది. శ్రీను కి కడుపులో గడబిడ అయితే వెంటనే బ్రహ్మానందం లా మొహం పెట్టి శ్రీను తనని ప్రకృతి పిలుస్తుంది అనడం) అని చెప్పి వెళ్ళిపోయాడు. మేము చేసేది లేక ఎటూకాని ఆ ప్రదేశంలో కూర్చున్నాము. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేరలో జనసంచారంలేదు. జీడి పళ్ళ/పిక్కల సీజన్ కాదు కాబట్టి తోటలన్నీ ఖాళీగా వుంటాయి. కాస్త కొద్దిగా చీకటయ్యే లా వుంది. నాకు కొంచెం బోరుగా, భయంగా అనిపించింది. రెడ్డీ బుద్దిగా దూరంగా ఒక రాయిమీద కూర్చొని ఇసకలో కర్రతో రామకోటి కాబోలు సీరియస్ గా రాసుకుంటున్నాడు.సరే అని తనని పలకరించా. రెడ్డీ ఏదైనా మాట్లాడొచ్చుకదండీ బోరు కొడుతుంది అన్నాను. ఏమి మాట్లాడాలండి అన్నాడు(నేను అంత త్వరగా ఎవరిని అండి లేకుండా మాట్లాడను, రాయలసీమ వాళ్ళకు అండి అని మాట్లాడతారని అసలు తెలీదనుకుంటా అందుకని నన్ను అండి అని కష్టపడి పిలిచేవాడు). సరే మాట్లాడడానికి టాపిక్ కూడా మేమే చెప్పాలి కాబోలు అనుకొని, మీ గురించి చెప్పండి మీ ఊరు, మీ ఫ్యామిలీ, చదువు, ఫెండ్స్ అన్నీ చెప్పండి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు అన్నాను. అదే నేను చేసిన తప్పు. దానికి సరైన శిక్ష వేశాడు..


సరే వినండి విన్నతరువాత మీరు ఆవిషయాలు కాస్త రహస్యంగా వుంచాలి అని చెప్పాడు. నవ్వొచ్చింది, రెడ్డి కాస్త సీరియస్ కామెడీ చేస్తాడని అప్పటికే కాస్త అర్ధం అయింది అలాగే అన్నాడేమో అనుకునా.కానీ తను చెప్పింది విని దిమ్మతిరిగిపోయింది. "మాది నంద్యాల దగ్గర చిన్న పల్లెటూరు, అమ్మ,నాన్న,ఒక అక్క,చెల్లి వున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి" అని ముగించాడు. నంద్యాల నుండి శ్రికాకుళం పల్లెటూరికి ఎందుకు వచ్చారు జాబ్ కోశం?అని అడిగా (ఇక్కడ తిండి తినలేక చాలా ఇబ్బంది పడేవాడు సరిగా ఒక్క రోజు కూడా తినలేకపోయేవాడు.మీ శ్రికాకుళం వాళ్ళు ఎందుకు చింతపండు నీళ్ళు చేసి దానితో బతికేస్తారు అని తిట్టుకునేవాడు.) దానికి సమాధానంగా దీర్ఘంగా కాసేపు ఆలోచించి"నేను ఒక తప్పు చేశాను, ఒకమ్మాయిని రేప్ చేశాను. పోలీసులు నాకోసం వెతుకుతున్నారు, మా ఇంట్లో వాళ్ళకి ఒక్కడినే కొడుకుని కదా కేసు మేము చూసుకుంటాము నువ్వెక్కడైనా దూరంగా వెళ్ళిపో అని చెప్పారు. అందుకే ఇంత దూరం వచ్చాను.ఇన్ని సమస్యలు పడుతున్నాను.నా జీవితం నీలాగా శ్రీనులాగా హాయిగా నవ్వుకునేది కాదు." అని చెప్ప్పాడు."రేప్ చేశావా!!! ఎందుకు చేశావు?" అని అడిగాను. తరువాత అర్ధం అయింది ఎంత చెత్త ప్రశ్న వేసానో ఆ షాక్ లో అని. "ఎందుకంటే ...ఏమో చెయాలనిపించిందీ, ఆ అమ్మయి బాగుంటుంది నీలాగ.ఒక్కతే దొరికింది" అని చెప్పాడు. నా లాగానా?, ఒక్కతే దొరికిందా!! నాకు ఏంటో కళ్ళుతిరిగినట్లు,పడిపోతున్నట్లు అనిపించింది.కానీ హమ్మో ఈ టైములో కళ్ళు తిరిగి పడిపోతే నన్నుకూడా రేప్ చేస్తాడేమో!అని భయం వేసింది.ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా కూర్చున్న చోటునుండి లేచి నడవటం మొదలుపెట్టాను.అవసరమైతే పారిపోడానికి సిద్ధంగా అన్నమాట.చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ లేరు, రేప్ చేసి పోలీసులనుండి పారిపోయి వచ్చి తీరికగా కూర్చున్న రెడ్డీ తప్ప.ఏమీ ఎరగనట్లు మళ్ళీ ఇసుకలో రాసుకుంటూ కూర్చున్నాడు.హుహ్..జీవితం మీద విరక్తి లాంటిది కలిగింది ఆ భయంలో, విరక్తి లో అప్పుడొచ్చింది మొదటిసారి నాకు కవిత్వం.

"ఎరక్కపోయి అడిగాను ఇరుక్కుపోయాను.


నేను ఎరక్కపోయి అడిగాను ఇరుక్కుపోయాను


ఎవరో రావాలీ ..నన్ను ఇక్కడనుండి తీసుకొని పోవాలీ..."


బాగుందా నా మొదటి కవిత? ఏంటి ఇది కవిత కాదా?ఎందుకు కాదు, కవిత్వం అంటే కడుపులోతుల్లోంచి తన్నుకొని వచ్చే భావమే కదా?(అది వాంతి అంటార కొంపదీసి!!)ఏంటి ఇవి సినిమాలలో పాటలా?ఏమో నాకు సినిమా ఙ్ఞానం బాగా తక్కువ.ఇది మాత్రం నా కవితే.

ఇక ఆతరువాత నేను ఆ విపత్కర పరిస్థితుల నుండి ఎలా తప్పించుకున్నానో తెలియాలంటే తరువాత పోస్ట్ వరకు ఎదురుచూడాల్సిందే. నేను క్షేమంగా బయటపడాలని ప్రార్ధనలు జరపండి ప్లీజ్.

15 comments:

Anonymous said...

మీ ఇదివరకటి టెంప్లెట్ బాగుందండి దీనికంటే.

manasa said...

మీరు మరీను, ఆ హీరో నే కదూ మీరు పెళ్ళి చెసుకున్నది.(మీ ప్రీవియస్ బ్లాగ్స్ చదివిన నాలెడ్జి ఇది).నా గెస్ ప్రకారం ఆయన మిమ్మల్ని ఏడిపించటానికి అలా చెప్పి ఉంటారు.

ఆ.సౌమ్య said...

హమ్మో ఒళ్ళు గగుర్పొడిచిందండీ మీరు రాసినది చదివి. అసలు మీరు అక్కడనుండి ఎలా తప్పించుకున్నారు ఏం జరిగింది, త్వరగా రాయండి. నాకు టెన్షన్ ఎక్కువయిపోతోంది.

మీ శైలి మాత్రం భలే ఉంటుందండీ. ఏకబిగిన చదివిస్తారు. అంత సీరియస్ విషయాన్ని ఎంతో కామెడీగా రాసి చివరికి భయపెట్టేసారు. మీ వెలుగు విషయాలు వింటూ ఉంటే నాకు వచ్చిన అవకాశాన్ని (వెలుగు ప్రోజెక్ట్ లోనే సుమండీ) ఎందుకు వదులుకున్ననా అని అనిపిస్తూ ఉంటుంది. మీరు చేస్తున్న పనిని చాలా హృద్యంగా రాస్తారు మీరు.

మీకు అంత మంచి స్నేహితులు దొరకడం మీ అదృష్టం. ఒక్కరే ఆడపిల్ల, వాళ్లతో కలిసి అలా గ్రామాలు తిరగడం మన సమాజంలో ఎంత కష్టమో నేనూహించగలను. కానీ మీ ధైర్యానికి, పని పట్ల ఉన్న శ్రద్ధకి జోహార్లు.

ఆ.సౌమ్య said...

ఇది ఖచ్చితంగా కవిత్వమేనండోయ్, కవిత్వం కాదన్నవాళ్ళెవరో చెప్పెండి, వాళ్ల సంగతి చూద్దాం. మీకింకో కవిత చెప్తాను ఇది మననం చేసుకోండి.

"నేను కవిని కాదన్నవాణ్ణి కత్తెత్తి పొడుస్తాను,
నేను రచయిత్రి కాదన్నవాణ్ని రాయెత్తి కొడతాను"

Ram Krish Reddy Kotla said...

శిరీష గారు, మొదట మీ పోస్ట్ పొడవు కొలిచి..అమ్మో ఇంత పెద్దది నేను చదవగలనా? అని నాకే డౌట్... నాకు అసలే మహా బద్ధకం..కానీ మొదటి పేరాలో మొదలెట్టి ఆఖరి పేరాలోనే ఆగాను...అలా చదివించేటట్టు చేసింది మీ పోస్ట్ .. నేను కూడా ఇలా గ్రామాలు (తణుకు దేగ్గరి గ్రామాలు) తిరిగి ఇన్ఫర్మేషన్ గెదర్ చేసాం ఓ ఐ.టీ ప్రాజెక్ట్ కోసం, ఆ అనుభవాలు నా బ్లాగ్ లో కూడా రాసుకున్నాను... సరే, తదుపరి పార్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ :-)

నీహారిక said...

మీ పేరు మీ బ్లాగ్ పేరు కలిసి వచ్చేటట్లు భలే పెట్టారండీ!!
మీది ఖచ్చితంగా హృదయం లోంచి తన్నుకొచ్చిన కవితే!!

శిరీష said...

@అనానిమస్, కొత్తగా వుందని ట్రై చేస్తున్నాను. బాగలేకుంటే మార్చేస్తాను.

మానస, నేను రేపిస్ట్ ని పెళ్ళిచేసుకోలేదు. ఒక ఫేక్ష హీరో(?) ని చేసుకున్నా.

@సౌమ్య, నిజమే నాకు మంచి స్నేహితులు వెలుగు ప్రాజెక్ట్ లో దొరికారు. అలా తిరుగుతూ పనిచేయటం కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా వుండేది. ఇప్పుడు తలుచుకుంటే నేనే అలా తిరిగాన అనిపిస్తుంది. మీ పొగద్తలకు చాల థాంక్స్. మీ కవిత గుర్తుపెట్టుకుంటా.


@

శిరీష said...

@ రామ క్రిష్ణ గారు, ఏక బిగిన చదివినందుకు, కామెంట్ కి చాల థంక్స్. మీ ఫీల్డ్ అనుభవాలు చదువుతాను.


@ నీహారిక, చాలా థాంక్స్ నా కవితా హృదయాన్ని అర్ధం చేసుకున్నందుకు (ఇంకొన్ని కవితలున్నయి పంపమంటార పర్సనల్ గా)

నేను said...

మీ story ఏమొకాని, నన్ను మా వూరు తీసుకెళ్ళారు.

నిర్మానుష్యమైన తోటల్లో వెళ్ళేప్పుడు వచ్చే sound (కీచురాళ్ళదనుకుంటా) భలే వుంటుంది. almost 10 yrs అవుతుంది అవన్ని వదిలేసి, అప్పుడప్పుడు వూరెళ్ళడమే కాని తోటలకి వెళ్ళడం కుదరడం లేదు :-( .

ఆ జీడితోటల్లో తిరిగేప్పుడు పులులు,ఎలుగుబంట్లు కాకపోయినా నక్కలు, తోడెళ్ళు తగిలుండాలే?

మీరు మా వూర్లో ఏమన్నా adventures చేసారేమో చదవాలని waiting ఇక్కడ.

Ramu S said...

శిరీష గారు,
పోస్ట్ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, అద్భుతంగా ఉంది.
రాము
apmediakaburlu.blogspot.com

రాజ్ కుమార్ said...

ఇంత కాలం ఈ బ్లాగ్ ఎలా మిస్ అయ్యనో అనిపిస్తుందండి... అన్ని పోస్ట్లు ఈరోజే చదివేసాను.చాల బాగున్నాయి.. మీ అభిమానుల లిస్ట్ లో నన్ను కూడ చేర్చుకొండి.. Kaani ee post lo matram konchem bhaya pettaru... waiting for the next post. :) :)

శిరీష said...

@బద్రి గారు, మీ ఊరు అనకండి. వజ్రపుకొత్తూరు మండలం నా ఊరు కూడా.నాకెంతో నచ్చిన ప్రదేశాలున్నయి అక్కడ. జీడి తోటలు, నిర్మానుష్యమైన సముద్రపు తీరం ఇప్పటికి నా కళ్ళముందే వున్నాయి.నక్కలు కాడుకాని ఒకసారి ఎలుగుబంటి తో కాసేపు కాలక్షేపం చేశానులెండి.

@రాము గారు, థాంక్స్ అండి.

@వేణు రాం గారు, నా పోస్ట్లు మీకు నచ్చినందుకు సంతోషంగావుంది, లిస్ట్ లో ఎలా చేర్చుకోవాలో నాకు తెలీదండి, 22 మంది వాళ్ళే చేరారు. థాంక్స్ టు ఆల్ ఫ్రెండ్స్.

రాజ్ కుమార్ said...

అభిమానుల లిస్ట్ అని మాట వరసకి అన్నానండి... మీ ఫాలోవర్స్ లిస్ట్ లో 22 వ వాడిని నేనే.. :)

Indrasena Gangasani said...

Excellent narration.. :) :)

శిరీష said...

@ indrathinks; thanks andi