Sunday, July 11, 2010

రావణ్(విలన్)- ఇది సినిమా కాదు[పార్ట్-2]

(నేను చేసిన పని చాలా మందికి నా మీద మంచి అభిప్రాయం కలిగించకపోవచ్చు, కానీ నేను పెద్ద ఆశయాలు లేని ఎన్నో భయాలు,స్వార్ధాలు వున్న మామూలు మనిషిని అని అర్ధం చేసుకొని చదవగలరు)

..............................................................

అతను నన్ను చూస్తున్నారు రెప్ప వేయకుండా, అతని వయసు ఇంత అని చెప్పడానికి కష్టం, శరీరం చాలా బక్కగా వుంది.కాళ్ళు చేతులూ మరీ మొద్దుబారినట్లున్నాయి,ఇక నేనే ఏదో మాట్లాడాలని "యాదమ్మా..అని మొదలుపెట్టాను.అతను "ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు?" అని అడిగారు నేను సరిగానే విన్నానా అని డౌట్ వచ్చింది, కానీ అతను మళ్ళీ అదే ప్రశ్న వేశారు. నేను ఏదో చేసుకుపోతున్నాను కాని ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు అని ఎవరైనా సడన్ గా అడిగితే ఏమి చెప్పాలి. నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నాను అన్నాను. ఇతనేదో చాలా సీరియస్ ప్రశ్నలు వెయ్యాలనే డిసైడ్ అయ్యాడని అర్ధం అయింది. మమ్మల్ని ఎందరో మా ఉద్యోగం గురించి, మా గురించి ప్రశ్నలు వేస్తారు. కొత్త గ్రామం వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా అడుగుతారు. అందులోను ఒక అబ్బాయి అమ్మాయి గనుక వెళ్ళామంటే అతను నీకేమవుతాడు?, ఈమె నీకేమవుతుంది అని కూడా అడుగుతారు, ఈ జాబ్ కి ఎంత లంచం ఇచ్చారు? గవర్నమెంట్ జాబేనా?ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలు. అలాగే ఇది కూడా అనుకున్నాను. ఇప్పటికీ అతను మాట్లాడిన  ప్రతీ మాటా గుర్తుంది అతని గొంతులో తీక్షణత్వం, మాటల్లో తెలివి,సమాచారం ఇలాంటివి అంతకు ముందెప్పుడూ నాకు ఎదురుకాని ఒక ప్రత్యేకత ఏదో!!(కానీ నిజంగా కొన్ని మాటలు అర్ధం కాలేదు,అందుకే అర్ధం అయిన మాటలు రాస్తున్నాను)

అతను: నచ్చిందా, ఏంటి నచ్చింది?రాత్రి పూట ఒంటరిగా చీకటిలో వెళ్ళి రావటం నచ్చిందా?
నేను: మీకు నేను తెలుసా?నేను రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నానని ఎలా తెలుసు?
అతను: నీకేమి నచ్చింది?కష్టంగా లేదా?ఇది అంత మంచి ఏరియా కాదు
నేను:భయపెడుతున్నారా? నాకు ఇంతవరకు ఇక్కడ భయపడాల్సిన ఎటువంటి సమస్యా రాలేదు. ఏమో వస్తే అప్పుడు మానేస్తానేమో
అతను: గవర్నమెంట్ జాబే కదా రిపోర్ట్ రాస్తే సరిపోదా మీటింగ్ కి వెళ్ళాను అని ఎందుకని నిజంగా వెళ్ళటం?
నేను: నాకు అలా నచ్చదు, రిపోర్ట్ రాయగలను కానీ నా మనసే ఒప్పుకోదు. అయినా గవర్నమెంట్ లో ఎవరూ పని చెయ్యరని చెప్పలేము కదా.
అతను: ఏమి చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ కి చిత్త శుద్ధి లేదు. ఎవరికీ ఏమీ చెయ్యలేదు.మీ ప్రాజెక్ట్ అయినా అంతే.
నేను:(నాకు చాలా కోపం వచ్చేసింది) అందరూ ఎందుకు గవర్నమెంట్, గవర్నమెంట్ అని ఎవరినో తిట్టడం, ముందు మనకోసం మనం ఏమి చేసుకుంటున్నాము? వెలుగు ప్రాజెక్ట్ తాలూక ముఖ్యమైన వుద్ధేశ్యం కూడా ప్రజలు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ వుండకుండా అందరు కలిసి వారి కోసం వారు ఏమి చెయ్యగలరో ముందు చేసుకునేలా చెయ్యటమే. ఇంత మంచి ప్రాజెక్టు, ఆలోచన గవర్నమెంటుదే కదా! ఎన్.జి.ఓ లు, లేదా వేరే ఎవరైనా సరే గవర్నమెంట్ చెయ్యగలిగేంత మందికి, అన్ని రకాల పనులు చెయ్యగలరా, ఏమీ చెయ్యకుండానే మనందరం ఇలా వున్నామా?
అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో వున్న నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు.
నేను:సముద్రం ఏంటి,చెంబేంటి? అర్ధం అయినట్లు చెప్పండి
అతను: మరి గవర్నమెంట్ అన్నీ చేస్తుంటే ఎందుకు కొందరే బాగుపడుతున్నారు? ఎందుకు కొందరికి ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది? ఎందుకు అన్యాయం ఎప్పుడూ ఆ అన్యాయం పేదలికి, కొన్ని జాతులకే జరుగుతుంది?
నేను: చూడండీ, మీ ప్రశ్నలన్నీ కరక్టే కానీ ఒక ఇద్దరు మనుషులున్న ఒక కుటుంబంలో కలిసి ఉన్నప్పుడే ఎన్నో సమస్యలొస్తాయి, ఒక తల్లి పిల్లలే అమ్మ నాకంటే ఇంకొకరిని బాగా చూస్తుంది అని బాధపడతూ ఉంటారు, అలాంటిది ఇన్ని వైవిధ్యాలు, ఇంత జనాబా ఉన్న మన దేశమే కాదు ఎక్కడైనా ఎవరికీ అన్నీ సవ్యంగా 100% జరగాలని ఆశించటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే మనమెంతో సాధించాము,ఇప్పటికే మీరు చెప్పిన వెనుకబడిన జాతుల్లో ఎంతో మార్పు అభివృద్ధి వచ్చింది. ఇక ముందు ఇంకా వస్తుంది. వారి వంతు ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యాలి, తోటి వారిగా సమాజాంలో వున్న మన అందరికీ బాధ్యత వుంది కదా?ఒక్క గవర్న్మెంట్ నే తప్పు పడుతూ పోతే ఎలా? మనకి బాధ్యత లేదా?

అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో నీళ్ళగురించి మాట్లాడుతున్నవు అని చెప్పాను కదా. బాధ్యత తీసుకోవాలని చెప్పటం కాదు నిజంగా తీసుకోవాలి. అది చెప్పినంత సులభం కాదు. ఇక్కడ వున్న వెనుకబడ్డ వారికి బాద్యత తీసుకొని ఎందరో నిలబడ్డారు, కుటుంబాలు వదిలేసి, ఎంతో డబ్బు, పేరు తెచ్చిపెట్టే చదువు, జాబులు వదిలేసి కొండల్లో, అడవుల్లో తిండిలేక,వారికి వీరికీ ఏ సంబంధం లేకపోయినా ప్రాణాలకు తెగించి సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు, అది బాద్యత కాదా?నువ్వు చెప్పేది ఇంతకంటే గొప్ప బాధ్యత నా?నేను చెప్పేది ఎవరి గురించో అర్ధం అయిందా?

నేను: అర్ధం అయింది, అన్నల గురించి.నాకు వాళ్ళ గురించి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పిన మాటల్లో చూసినా, వాళ్ళకి అడవుల్లో తిరగటం, ప్రాణాలు కాపాడుకోవటం తోనే టైము అయిపోతుంది.ఇక వాళ్ళకి సమాజ జీవితంలో వున్న కష్టాలేమి తెలుస్తాయి? వేరే వారికోసం ఆలోచించడానికి వీలెక్కడ వుంటుంది. అదరినుండి దూరంగా పారిపోయి బతుకుతున్నారు.కనీసం వాళ్ళ కుటుంబానికైన ఉపయోగపడలేరు.ఇక సమాజానికి తుపాకీ పట్టుకొని వాళ్ళేమి మంచి చెయ్యగలరు.(ఇవి నిజంగా సినిమా డైలాగ్స్ లా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవన్నీ నేను వాగాను అతనితో)

అతను: (చాలా సేపు మౌనంగా వుండిపోయారు)నేనెవరో తెలుసా? లాయర్ ప్రాక్టీస్ చేసుకొని బాగా సంపాదించుకోగలను, కానీ పొలీసులు చేసిన కూంబింగ్లో వెన్నెముకకి దెబ్బతగిలి ఏపనీ చేసుకోలేను ఇప్పుడు? అయినా నా బాధ్యత నా ప్రాణాలున్నవరకు నెరవేరుస్తాను.ఇప్పుడు నేను మేజర్ పనికి కొంత దూరంగా వున్నా, నిర్ణయాలలో, ప్లానింగ్ లో ఇంకా పనిచేస్తున్నాను. నీలాంటి వాళ్ళు సముద్రంలో బతుకుతూ కూడా చెంబులో ఉన్న నీళ్ళ గురించే మాట్లాడతారు. నువ్వు భయపడకుండా, బాధ్యతగా పనిచేసేది చూసి నీకు సమాజం మీద నిజమైన బాధ్యత వుందనుకున్నాను. మీకందరికీ జీవితం సుఖంగా వుండాలి,నీకు నిజంగా బాద్యత ఉంటే మాలో చేరు అప్పుడు తెలుస్తుంది బాధ్యత అంటే ఏంటో,ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు,లాయర్లు ఎన్నో గొప్ప చదువులు చదివిన వాళ్ళు, నిజంగా సమాజానికి కావలసింది ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు.నువ్వుకూడా తెలుసుకో,సరిగా ఆలోచించు.

(నిజంగా షాక్ అయ్యాను,నేను మాట్లాడేది ఎవరితో అని తెలిశాక, అతను అడుగుతున్నది ఏంటో తెలిశాక...ఎక్కువ టైం పట్టలేదు జవాబు చెప్పడానికి, ఎందుకంటే నాకు తెలుసు  నేనేది నమ్ముతానో)

నేను: నాకు ఎలా చెప్పాలో తెలియటంలేదు. కానీ నేను మీలా వుండలేను.నాకు మా మమ్మీ కావాలి,డాడీ కావాలి,నా చెల్లి తమ్ముడు కావాలి, వాళ్ళకి ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను వాళ్ళకి ఉపయోగపడాలి, నాకు నా ఫ్రెండ్స్ కావాలి, నా జీవితం నాకు ఎలా దొరికిందో అలా కావాలి.అలా వున్న జీవితం లో నేను నా వాళ్ళకీ, నాకు చేతనైనంత లో నా సమాజానికి చెయ్యగలిగితే చాలు.అంతే కానీ నా జీవితాన్ని, నా వాళ్ళని వదిలేసుకొని ఏదో వస్తుంది అని ఆశ తో బతకలేను.ఒకవేళ అలా బతికినా మీరు చెప్పే పూర్తి సమానత్వం, ఫుల్ గ్రీన్ సమాజం వస్తుందో రాదో నాకు తెలీదు కానీ నా జీవితం అంతకు ముందే అయిపోతుంది. ఈ జీవితం అలా అందరికీ దూరంగా ...నా వల్ల కాదు. నేను గొప్ప భావాలున్న మనిషిని కాదు. చాలా ఆశలు, కోరికలు,భయాలు వున్న మామూలు మనిషిని.(నేను అలాంటి మనిషిని అని నాకు కూడా అప్పుడే తెలిసింది)

ఇలా ఆవేశంగా ఏదో చెప్పేశాను.ఇంకా చెప్పాలనిపించింది మీరు కూడా ఇలా మీ జీవితం వృధా చేసుకోకండి అని, ఇంకా అడగాలనిపించింది మీకు మీ జీవితం నష్టపోయాను అని ఒక్కసారి కూడా అనిపించలేదా అని. కానీ ఎన్నో ఆలోచనలు నా మైండ్ నిండా. ఇటువంటి మాటలు చెప్తే అతనికి ఎలా అనిపిస్తుంది..కాళ్ళూ చేతులు చచ్చుబడిపోయిన మనిషికి తను నష్టపోయాననే బాధ కలుగుతుందా, నాలాంటి స్వార్ధం కోసం ఆలోచించేవాళ్ళున్న ఈ సమాజం కోసమా మేమంతా కష్టపడేది అనిపిస్తుందా...ఇలా నా ఆలోచనలో నేను మౌనంగా ఉండిపోయాను.అతను ఏమీ మాట్లాడలేదు.అతను కూడా ఏదో ఆలోచిస్తున్నట్లనిపించింది. నేను ఒక ట్రాన్స్ లో వచ్చినట్లు బయటకి వచ్చేసాను.ఎలా ఇంటికెళ్ళానో నాకే తెలీదు.

అదే ట్రాన్స్ లో వున్నాను ఆరోజంతా. మధ్యానం మా టీం లో వాళ్ళకి జరిగింది చెప్పాను. అంతా విని ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అయ్యారు.
 ధర్మా-"హ్మ్ ఎందుకైనా మంచిది నువ్వొక్కదానివే రాత్రిళ్ళు తిరగకు కొన్ని రోజులు, ఆ ఊరు ఇప్పట్లో మనమెవ్వరూ వెళ్ళొద్దు" అనేసి వెళ్ళిపోయాడు.
చిత్ర తెలుగు మాట్లాడటం రాకపోయినా, అర్ధం అయ్యేది - "ఎదుకు వెలొదు? షి షుడ్ గో అండ్  వర్క్ ఏజ్ యుజుయల్, ఐ విల్ గో విత్ హెర్,షి ఈజ్ బ్రేవ్,డోంట్ ఫ్రైటెన్ హెర్,శిరీష, యు హేవ్ డన్ గుడ్,డోంట్ వర్రీ, వి ఆర్ విత్ యు".
రెడ్డీ- "హబ్బా, ఏంటి నక్సలైటా,నిన్ను జాయిన్ అవ్వమన్నారా?ఎవరో ఏదో మాట్లాడితే నువ్వు భయపడి మమ్మల్ని భయపెడుతున్నావా?" లేకపోతే నీ వర్క్ చూసి , నీ ప్రతాపం చూసి వాళ్ళు మురిసిపోయారా?,అన్నీ తిక్క మాటలు, పద రేపు నేనొస్తా నాకు చూపియ్ వాడేవన్నాడో నీకేమర్ధమయ్యిందో తేల్చేస్తాను". అన్నాడు.
నాకు కూడా ఇదంతా నిజం కాకపోతే బాగుణ్ణు అనిపించింది.బహుశా నేను అతని మాటల్ని అతిగా ఊహించుకున్నానా? కలగన్నానా?

మనిషి కి షాక్ అనిపించిన సంఘటనలు అసలు జరగలేదని, బహుశా తప్పుగా ఊహించామని అనుకంటాడనుంటా. నేనూ అలా అనుకోవడమే బాగుంది అని అనుకున్నాను.ఇంకా అనుకుంటున్నాను.

శ్రీను(అప్పుడేమీ అనలేదు,కానీ ఆరోజు రాత్రి నేను ఒక్కదాన్నే డాబా మీదకి వెళ్ళినప్పుడు వచ్చి ఇలా చెప్పాడు-" శిరి, వాళ్ళ కళ్ళళ్ళో నువ్వు పడడం నీ అదృష్టం రా, నీకున్న గొప్ప గుణాలు నీకు తెలియలేదు, వాళ్ళకి కనిపించాయి,నీ జీవితం నీ ఇష్టం అనుకో, నేను ఈ సాహిత్యం అంతా ఈ మధ్య చదివాను రా, నాకు వాళ్ళని కలవాలనీ, వాళ్ళతో కలవాలనీ వుందిరా, నన్ను ఒకసారి వాళ్ళదగ్గరికి తీసుకెళ్ళరా" అన్నాడు. నాకు బుర్ర తిరిగిపోయింది, ఉదయం తగిలిన షాక్ కంటే పెద్ద షాక్ ఇది. శ్రీను ఎంతో సరదా మనిషి.కానీ తన జీవితం ఎంతో విషాదం. అందువల్ల తను మానసికంగా చాలా బలహీనం అని నాకు పి.జి లో తనతో కొన్ని రోజుల స్నేహంలోనే అర్ధం అయింది. అప్పటికి చూసిన సినిమా, కలిసిన మనిషి, చదివిన పుస్తకం, తెలుసుకున్న విషయం ఏదైన తనమీద కొంత కాలం విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కొన్ని రోజుల పాటు అదే పని గా ఆ ఒక్క ఆలోచన చేసి అంతకంటే వెరేదీ లేదు అన్నట్లు, అదే తన జీవితం అన్నట్లు లీనం అయిపోతాడు. జీవితంలో తనకి ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ అవసరం అనిపించేది నాకు. వీలైనంతవరకు తనకి దగ్గరగా వుండగలిగే జాబ్ దొరికినప్పుడు సంతోషం కలిగింది. ఒకసారి పాటలు సంగీతం మీద పడి నెలలు గడిపేశాడు, ఇంకోసారి ఆద్యాత్మికం చదివి ఏదో ఆశ్రమం లో చేరాలని అప్లికేషన్ కూడా తెచ్చుకున్నాను అని చెప్పాడు, ఇప్పుడు ఇలా.నాకు అప్పుడు వేసింది భయం. తిరుగుబాటుదారులు, నక్సల్స్, రావణులు తయారవ్వటానికి ఆ రోజు అతను చెప్పిన కారణాలు, నేను అనుకున్న కారణాలు, సినిమాల్లో చూపించే కారణాలు మాత్రమే కాదు శ్రీను లాగా ఏ కారణం లేకుండా ప్రభావితం అవ్వటం కూడా ఒక కారణం కావొచ్చు అనిపించింది. కారణాలేవైనా, నక్సలిజం మంచిదైనా, కాకపోయినా నా దారి మాత్రం కాదు. నా స్నేహితులని కూడా వెళ్ళేలా ప్రోత్సహించను. ఎందుకంటే నేను సాధారణ మనిషిని, నా వాళ్ళందరు నాతో పాటు వుండాలనీ, వారి వారి జీవితాలు సంతోషంగా గడపాలనీ,నా సుఖ ధుఖాలలో వాళ్ళు, వారి సుఖ ధుఖాలలో నేను తోడుగా వుండగలిగే సామాన్య పరిస్థితుల్లో మేమంతా వుండాలని మాత్రమే నేను కోరుకుంటాను. సమ సమాజ స్థాపన వంటి పెద్దకలలు కనేంత గొప్ప దానిని కాదు మరి. అందుకే నా ఆలోచనలను పక్కన పెట్టేసి శ్రీను మూడ్ డైవర్ట్ చేసే పనిలో పడ్డాము నేనూ చిత్రా.

8 comments:

indrathinks said...

chaala serious gaa undi matter..hatss off to ur courage....

మధురవాణి said...

శిరీష గారూ..
ఈ పోస్ట్ రెండు భాగాలు చదివాను. ముందుగా మీకు బోలెడన్ని ధన్యవాదాలు ఎందుకంటే.. మీకెదురైన ఆసక్తికరమైన అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు. చాలా చాలా బాగారాశారు. :-)
If I were in your shoes, I would tell him the almost the same answer. :-) కానీ, నిజాయితీగా చెప్పాలంటే మీ అంత ధైర్యంగా అలాంటి ఉద్యోగం చేయలేనేమో అని అనిపిస్తోంది. But, I would love to do it ;-)
మీరు బైకు నేర్చుకున్నాకా దొరికిన స్వేచ్చని వర్ణించిన తీరు చాలా నచ్చింది. Simply superb! ఇంకా, చివర్లో మీ ఫ్రెండ్ శ్రీను గురించి చెప్తూ మీరు చేసిన observation చాలా నిజం. కేవలం నక్సలైట్లని కాకపోయినా, ఎలాంటి మతవాదాలైనా, తీవ్రవాదమైనా లేదా ఎటువంటి వాదమైనా సరే చాలా మంది ఒక అభిప్రాయమంటూ లేని వాళ్ళే చాలా సులభంగా ప్రభావితం అయిపోతారు.
On the whole, its a very good post :-)

మీ బ్లాగంతా చదవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండీ.. ఏంటో ముహూర్తం కుదరట్లేదు.. కానీ, ఎప్పటికో ఒకప్పటికి మాత్రం ఖచ్చితంగా మొత్తం చదివేస్తాను. :-)

భావన said...

చాలా బాగుందండి. ఒక సాధారణ వ్యక్తి గా అనిపిస్తూనే అసాధారణ వ్యక్తిత్వం చూపించారు. బ్ర్రావో..

బద్రి said...

మీరు 2000లలో అక్కడ వున్నారనుకుంటా. అసలు 90లలో ఆ ప్రాంతంలో నక్సల్ వుద్యమం చాలా తీవ్రంగా వుండేది. ప్రతి గ్రామం నుండి కనీసం ఒకరైనా వుద్యమంలో వుండేవాళ్ళు. మా వూరి నుండే 5గురు చేరారు (అప్పటికి నేను చిన్నపిల్లొణ్ణి లేకుంటే చేరేటోణ్ణెమో:-)). 4గురు మొదటి సంవత్సరంలోనే తిరిగి వచ్చేసారు. ఒకతను కొనసాగి 5 సార్లు ఎన్ కౌంటర్ లలో తప్పించుకుని చివరికి 2002లో లొంగిపోయాడు అది కూడా ఆరోగ్యకారణాల వల్ల. అతను వుద్యమంలో వుండేప్పుడు అప్పుడప్పుడు ఊరు వచ్చేవాడు. ఆయన చెప్పే మాటలు వింటే నిజంగా మనం కూడా వాళ్ళతో చేరాలి అన్నట్టు వుండేవి.

మా స్కూల్ టాయిలెట్ గోడపై కొన్ని వాక్యాలు వ్రాసుండేవి. అందులో నాకు బాగా గుర్తున్నవి
"బూటకపు ఎన్ కౌంటర్ లు నశించాలి"
"జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో - పీపుల్స్ వార్ జిందాబాద్".
అవి ఇప్పటికీ వున్నాయనుకుంటా.

శిరీష said...

@ బద్రి గారు, మీరు చెప్పే పరిస్థితులు (ప్రతీ గ్రామం నుండి కనీసం ఇద్దరు ) నేను వున్నప్పుడు కూడా వున్నాయి.2000 లో, ఇప్పుడెలా వుందో ఆ గ్రామాలు చూడాలని, నేను పీల్చిన ఆ గాలి, స్పర్శ మళ్ళీ కావాలని వెళ్ళాలని చాలా వుంది. కానీ అసలు కుదరటం లేదు. మా లక్కీ కాస్త పెద్ద అయ్యాక నేను వెళ్తాను, మీరు వెళ్తున్నారా?ఎలా వుంది వజ్రపుకొత్తూరు?


@భావన గారు, చాలా థాంక్స్.

@ మధురవాణి గారు, మీకు త్వరగా ముహుర్తం కుదరాలని కోరుకుంటున్నను. (నా బ్లాగ్ చదవటానికి) మీరు చెప్పింది నిజమే, పేదరికం, డబ్బు ఆశ కూడా ఒక కాఋఅనం నక్సలిసం కి ఒక కారణం అవుతుందని తెలిసి ఆశ్చర్యం వేసింది.

@ఇంద్రా థింక్స్, థాంక్స్ అండి అప్పుడు నాకూ భయం వేసింది.

కన్నగాడు said...

మీరు చాలా ధైర్యవంతులండీ, నా దృష్టిలో నక్సలైట్లు దిక్సూచి, తెరచాప లేని సాహస నావికులు. పాపం మంచి కోసం ఏదో చెయ్యాలని, మంచో చెడో ఆలోచించకుండా ఏదో చేసేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఒక ఆలోచనా విధానం లేకుండా, అన్ని రోగాలకు ఒకే మందులా తుపాకీ గొట్టానికి పని చెప్పేస్తోంది.

సవ్వడి said...

శిరీష గారు! శ్రీను లాంటివాళ్లు తప్ప మిగతావారెవరూ అంత త్వరగా అందులో చేరరు.
మధురవాణి గారు అన్నట్లు.............. ఎటువంటి వాదమైనా సరే చాలా మంది ఒక అభిప్రాయమంటూ లేని వాళ్ళే చాలా సులభంగా ప్రభావితం అయిపోతారు. ఇది కరక్ట్.
గమ్యం సినిమాలో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. " బైట ఏం జరుగుతుందో జనం మధ్యకొస్తే తెలిసింది. " అంటాడు. వీళ్ళంతా ముందు మనుషుల మధ్యకు వస్తే చాలా పనులు చెయ్యగలరు.
మాట్లాడింది అన్నలతో అని తెలిసాక..... ఆరోజంతా మీరెంత టెన్షన్ పడ్డారో కదా!

సవ్వడి said...
This comment has been removed by the author.