Tuesday, November 23, 2010

రక్త చరిత్ర.2....ఎవరికి వుపయోగం!!

ఏ సంఘటన వల్ల ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అసలు ఊహించలేము. కానీ ఆవేశం తో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం ఎప్పుడూ విపరీతాలే జరుగుతాయి. సమరసిం హారెడ్డీ అనే పోస్ట్ లో సరదాగా ప్రస్తావించాను రెడ్డి లవ్ స్టోరీ అని. కానీ నిజానికి అంత సరదాగా ఆకధలు ముగియలేదు. అనసూయమ్మ, మా ఊరి ఫ్యాక్షన్ లీడర్ బార్య, ఆమెకి స్వంతంగా పిల్లలు లేరు కాని ఆమె తన మేనల్లుడు గౌరు వెంకట్రెడ్డి ని దత్తత తీసుకుంది అంటున్నారు కాని ఈ ఊరి గొడవల్లో డైరెక్టుగా గౌరు వెంకట రెడ్డికి, గౌరు చరితకి మాత్రం సంబంధం వుంది అనేది అక్కడి పసిపిల్లలికి కూడా తెలిసిన నిజం అయినా కూడా వాళ్ళు ముగ్గురు బయట ఎందుకున్నారో, ఏ సంబంధం లేని వాళ్ళు జైలు లో ఎందుకున్నారో మాత్రం ఎవరికీ అర్ధం కాని విషయం.
ఇక అనసూయమ్మ భర్త కి ఒక అన్న వున్నాడు అతను కాస్త మెతక మనిషి కావటం, అతనికి ముగ్గురు ఆడపిల్లలు కావటం, మగపిల్లాడు అందరికంటే చిన్నవాడు కావటం వల్ల అతను ఈ గొడవల్లో పెద్దగా తలదూర్చలేదు. కాని ఆ కుటుంబంలో వుండటం వల్ల వారి పిల్లల జీవితాలు కూడా తారుమారు అయిపోయాయి. అతని పెద్ద కూతురుకి అప్పటికే పెళ్ళి అయి భర్త కర్నూలు లో లాయర్ గా పనిచేస్తున్నాడు. కాని అతని మీద కేసు వేసారు. అంతే కాదు ప్రాణ భయం కూడా ఇక చేసేది లేక అతను కూడా ఈ గొడవల్లోకి రావలసి వచ్చింది. ఇక రెండో అమ్మాయి...అపర్ణ. అందమైన, సున్నితమైన అమ్మాయి. వెంకటేశ్వర రెడ్డి ( నా రెడ్డి ) తో తనకి పెళ్ళి అనే అందరు చెప్పటం, రెడ్డీ కూడా తన చుట్టూ తిరగటం చూసి, జీవితాన్ని అందంగా ఊహించుకొని కాలం గడుపుతుంది. కాని అనుకోని విధంగా ఈ ఫ్యాక్షన్, చిన్నాన్న చనిపోవటం, స్వంత బంధువులే చంపటం, అక్క భర్త జైలు కి వెళ్ళటం, తమ ఇంట్లో అందరికీ అకస్మాత్తుగా ప్రాణ భయం రావటం ....తన జీవితాన్ని ఎంత గా తలకిందులు చేస్తాయో అపర్ణ ఊహించలేకపోయింది. మహా అయితే తన పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది అని, లేదా రెడ్డీ తో పెళ్ళి అయ్యాక రెడ్డి కూడా కేసుల్లో పడాల్సి వస్తుంది అని ఊహించింది. కానీ....
రెడ్డి వాళ్ళ అమ్మ, అంటే మా అత్తమ్మ తన కొడుకు మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. ( అదేంటో రాయలసీమ లో కొడుకొక్కడే తమకి పుట్టిన బిడ్డ అని కూతుర్లు మాకేమీ కాదనే వుద్దేశ్యంతో వుంటారనిపిస్తుంది.ఒక్కొక్కరి ఇంట్లో తమ కూతుర్లకు వాళ్ళు చేసేది చూస్తే నాకు ఇలా అనిపించింది. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించినా పైగా కట్నాలివ్వాలి అని వాళ్ళేదో పరాయివాళ్ళన్నట్లు మాట్లాడుతుంటారు, మా వాడికేమైనా ఐతే ఇక మేమెందుకు బతకాలి అని, మా మనవడున్నాడు వాని తరువాతే మీరు అని ఇలా అన్నిట్లో కూతురిని, కూతురి పిల్లల్ని వేరు చేసి ఎదురుగానే మాట్లాడుతారు, ఆ సమయంలో మా ఆడబిడ్డల్ని చూస్తే నాకు ఏడుపొస్తుంది, కాని వాళ్ళకి కూడా అది అలవాటేమో పెద్దగా ఫీల్ అవ్వరు) ఇటువంటి పరిస్థితి వున్నప్పుడు ఎవరు కోరి అటువంటి పరిస్థితుల్లోకి కొడుకు ప్రాణాలు పణంగా పెడతారు? అందుకే ఎట్టి పరిస్థితిలో అపర్ణని చేసుకోవద్దు అని మా అత్తయ్య ఒట్టు పెట్టించేసుకున్నారు. రెడ్డి కాని, అపర్ణ కాని ఎవరూ ఏమి చెయ్యలేని పరిస్థితి ఊర్లో వున్న పరిస్థితి.ఆ సమయంలో ఎందరి పెళ్ళిళ్లో తప్పి పోయాయి, ఎన్నో కధలు గుండెల్లో మిగిలిపోయాయి, వీళ్ళిద్దరు ఎదురుపడి ఎప్పుడూ మాట్లడుకోలేదు, ఏదో తెలియని నమ్మకం మాత్రమే ఒకరికొకరం అని , పెద్దలు కూడా పక్కాగా అడగటం జరగలేదు,ఖాయం చేసుకున్నది లేదు. కాదు అని చెప్పుకున్నది లేదు. కాని అందరి వుద్దేశ్యాలు అందరికి అర్ధం అయ్యాయి. రెడ్డిని హైదెరాబాదు చదువుకోసమని పంపేసారు (ముఖ్యంగా ఈ గొడవల్లో ఎక్కడ ఇరుక్కుంటాడో అని ) రెడ్డి బాధతో నలిగిపోయినా ఏమీ చెయ్యలేని వయసు.
కాని అపర్ణ వాళ్ళ పెద్దలు కాస్త ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు కాదంటే మా అమ్మాయికి పెళ్ళే కాదా, అతి త్వరలో గొప్ప ఆస్టిపరుడుని తెచ్చి చేస్తాము అని శపదం చేసి మరీ ఒక డబ్బున్న పెద్దమనిషికి ఇచ్చి అర్జెంటుగా పెళ్ళి చేశారు. అతను నిజంగా పెద్ద మనిషే, వయసులో, అన్ని రకాల వ్యసనాలలో, ఆస్థిలో అన్నిట్లో పెద్ద వాడే. సీమ పల్లెల్లో వున్న (నాకు ఎదురైన) ఇంకో బయంకరమైన ఆలోచన ఇది. పొలం, ఆస్తి వుంటే చాలు పిల్లని ఇచ్చేస్తారు. తాగుడు, ఇతర వ్యసనాలు వున్నాయని తెలిసినా అది ఒక విషయం అని ఎవరు కనీసం మాట్లాడరు. తాగితే తప్పా, తిరిగితే తప్పా, ఆస్తి వుంది కదా అని చూస్తారు. అమ్మాయికి ఇష్టమా అని కూడా అడగరు అనుకుంటా. అలా అపర్ణ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి రోజు రెడ్డి పడిన నరకం తను నాతో చెప్పినప్పుడు ఎప్పుడు చూడని కన్నీరు తన కళ్ళల్లో కొంచెం మెరిసి మాయమయ్యినప్పుడు అర్ధం అయింది. అపర్ణ పెళ్ళి రోజు ఏ పని లేకపోయిన నంద్యాల వెళ్ళి, పెళ్ళి జరిగే కళ్యాణ మండపం రోడ్డులో అటు ఇటు తిరిగాడంట, ఏ కారణం చేత ఐనా పెళ్ళి ఆగిపోతుందేమో అని, ఎవరో దూరపు బంధుత్వాన్ని సాకుగా చెప్పి వాళ్ళింటికి వెళ్ళి పెళ్ళి అయిపోయిందా, అపర్ణ బాగానే వుందా అని అనవసరమైన మాటలాడి, మళ్ళీ తనే తన తెలివితక్కువ తనానికి సిగ్గుపడి వచ్చేసాడంట. ఆ చిన్న వయసులో ఏమీ చెయ్యలేకపోయినా ప్రేమ మాత్రం ఎంతో స్వచ్ఛంగా వుంటుంది. కాని పరిస్థితులు ఎప్పుడు స్వచ్చంగా కలిగే ప్రేమ కి వ్యతిరేకంగానే వుంటాయేమో ! లేక దొరకదు అని తెలిసినప్పుడే ప్రేమ తీవ్రంగా వుంటుందా? ఏమో...!!!!
అపర్ణ కి పెళ్ళి అయినదగ్గర నుండి జీవితం నరకం అయిపోయింది. చిన్న వయసు, హాయిగా కలలు కంటున్న లోకం లో నుండి భయంకరమైన వాస్తవంలోకి దారుణంగా వచ్చి పడింది. అపర్ణ భర్త వ్యసనపరుడే కాదు, శాడిస్ట్ అని చెప్తారు. దానికి సాక్ష్యం ఆమె వంటి నిండా వున్న దెబ్బలు, సిగరెట్ తో కాల్చిన గుర్తులు. అతనికి చాల మంది తో అక్రమ సంబంధాలు, తాగుడు, శాడిజం... ఇవి కాక అపర్ణ ని ఎప్పుడూ ఇంటికి పంపేవాడు కాదు. ఒక వేళ పంపినా సాయంత్రానికి తిరిగి రావలసిందే. ఆమె పడే నరకం ఊర్లో అందరికీ అర్ధం అయేంతగా వుండేది. ఎన్ని కష్టాలో పడింది గొప్ప ఇల్లాలు అని పొగుడుతుంటారు ఆమె కష్టాలు తప్పించాలని ఆలోచన చెయ్యలేని ఈ మూర్ఖులు. ఇక ఆమె శరీరం తట్టుకో లేకపోయింది. మంచం పట్టింది. అప్పటికి ఆమె తల్లిదండ్రులకి కరుణ కలిగింది. అపర్ణని తమ ఇంటికి తీసుకొచ్చేశారు. కాని అపర్ణ ఎవరితో మాట్లాడటం మానేసింది. తనని తాను ఒక గదిలో బంధించుకుంది.  అపర్ణ కి ఒక బాబు పుట్టాడు, కొన్నాళ్ళకి ఆమె భర్త ఎయిడ్స్ వ్యాదితో మరణించాడు. ఆఖరి రోజుల్లో అపర్ణని చూడాలని తపించాడు. కాని అప్పటికే అపర్ణ ఈలోకంతో అన్ని సంబంధాలు తెంచుకొని తన గదిలో బంధీ అయిపోయింది, బాబు కూడా చనిపోయాడు, అపర్ణ కి కూడా ఎయిడ్స్ సోకిందని పరీక్షల ద్వారా తెలిసింది. అపర్ణ మరీ క్రుంగిపోయింది. వెలుగు కూడా భరించలేనంత చీకటిలో వుండిపోయింది. తను ఆ విధంగా ఒక డిప్రెషన్లో వుందని తెలిసి కూడా ఆమెకి అవసరమైన వైద్యం చేయించలేదు.
అపర్ణ జీవితం ఇలా వుంటే రెడ్డి ఈ లోగా చదువు పూర్తయ్యి, మొదట UNDP  ప్రాజెక్టులో తరువాత వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తూ శ్రికాకుళం, వజ్రపు కొత్తూరు వచ్చాడు. రెడ్డీ ఎప్పుడూ మౌనంగా, అందరికీ దూరంగా వుండేవాడు. కాని తన టీం లో వున్న నేను, శ్రీను విపరీతమైన అల్లరి చేస్తూ జీవితం అంటే సంతోషమే అన్నట్లు వుండే వాళ్ళం. మేము పెరిగిన పరిస్థితుల్లో మాకు అంత తీవ్రమైన కష్టాలు లేవు. పరిస్థితులు ఒకే లా పుట్టిన పిల్లల్ని ఎలా మారుస్తాయో ఆ తేడా నన్ను, రెడ్డిని చూస్తే తెలుస్తుంది. శ్రీను కి పేదరికం, తల్లి చనిపోవటం వంటివి కష్టాలున్నా తనెప్పుడూ నవ్వుల బ్రహ్మానందం లా అందరిని నవ్విస్తూ వుంటాడు. మా ఇద్దరి స్నేహం, ఆటలు, నవ్వులు చూసి రెడ్డిలో కూడా చలనం వచ్చింది. (ఆ కధ అంతా నా ముందు పోస్ట్ లలో రాశాను కదా) కొన్నాళ్ళకు మాతో పాటు కలిసిపోయాడు. వాళ్ళ ఊరికధలు చెప్పాడు, కాని నేను వాటి తీవ్రత అర్ధం చేసుకోలేదు నిజంగా. వాటి ప్రభావం నా జీవితం మీద పెద్దగా లేదు కూడా. రెడ్డి ని నేను పెళ్ళి చేసుకొని ఆ ఊరెళ్ళాక నాకు ఆ ఊర్లో చూడాలనిపించింది, కలవాలనిపించింది కూడా అపర్ణ నే. ఆ ఊర్లో మగ పిల్లలందరూ జైలులో వున్నప్పుడు మా ఇంట్లో పెళ్ళి జరగటం బహుశా చాలా మందికి బాధ కలిగించి వుండొచ్చు. చాలా తిట్టుకున్నారని కూడా చెప్పారు అత్తయ్య. ఇవన్నీ నాకు తెలీదు. నేను ఎవరితో నవ్వుతూ మాట్లాడాలని చూసినా అందరూ నాతో కాస్త దూరం గానే వుండే వాళ్ళు అనిపించేది ఆ ఊర్లో, దగ్గరి బంధువులు తప్ప. కానీ అక్కడి ఎస్.సి కాలనీ లో మహిళలు మాత్రం నాకు ముందుగా తెలుసు. కారణం కర్నూలు జిల్లా నుండి వెలుగు ప్రాజెక్టు కమ్యూనిటీ రెసోర్స్ పర్సన్స్ గా అక్కడి చుట్టుపక్కల పల్లెల్లో ఎస్.సి మహిళలు శ్రికాకుళం వచ్చినప్పుడు నాకు పరిచయం. వాళ్ళు మాత్రం నన్ను కలిసేందుకు మేడం, మా మేడం అని నేను వెళ్ళినప్పుడంతా వస్తారు.
మా పెళ్ళి తరువాత నేను మా అత్తగాఇంటికి వెళ్ళి నప్పుడు రెడ్డీ ని ఎన్నో సార్లు అడిగాను అపర్ణ ని కలవాలి అని, అత్తయ్యని కూడా, అపర్ణ ఎవరినీ కలవదు, ఆమెకి ఎయిడ్స్ అని చెప్పారు. కాని మా మిద్దెమీదకి వాళ్ల మిద్దె, తను వుండే గది కిటికీ కనిపించేవి. నేను పైకెళితే నాకెప్పుడూ అపర్ణ రెడ్డి మీద కోపంతో ఆ గదిలో తనని శిక్షించుకుంటుంది అనిపించేది. రెడ్డీ కి చెప్తే నువ్వంత ఆలోచించకు అనేవాడు. ఎన్నోసార్లు ఎవరికీ తెలీకుండా అయినా వెళ్ళి తనని కలవాలనిపించేది. తనని ఆ పరిస్థితిలో వదిలేసింది రెడ్డీ అనిపించేది, నా బాద్యతే తనని బయటకి తీసుకు రావటం అనిపించేది. మా పెళ్ళి అయిన సంవత్సరం లోపలే అపర్ణ చనిపోయింది. ఆ రోజు రెడ్డి బాధపడ్డాడో లేదో నాకు తెలీదు కాని నాకు చాలా బాధ వేసింది. రెడ్డి కొంచెం ధైర్యం చేసి వుంటే అపర్ణ ఈ రోజు నా స్థానం లో వుండేది, కనీసం ఇలా దారుణమైన జీవితం అనుభవించి చనిపోయేది కాదు అని రెడ్డి తో అనేశాను. నాకు ఆమెని తలుచుకున్నప్పుడంతా ఎంతో బాధ కలుగుతుంది.

ఫ్యాక్షన్ వల్ల ఒక తరం అంతా ప్రభావితమవుతుంది. పిల్లలికి చదువులుండవు, చిన్న పిల్లలు పనిచెయ్యాల్సి వస్తుంది. ఆడపిల్లలికి కనీసం మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళి చెయ్యలేరు. మగ పిల్లలికి కూడా. హత్యల తరువాత ఊర్లో వాతావరణం నరకం అయిపోతుంది. ఏ క్షణంలో ఎవరు ఎవరిని చంపుతారో, ఎవరింటికి, పొలానికి నిప్పంటిస్తారో అని భయంతో బ్రతకాలి. నిన్నటివరకు అత్తా, మావా, బావ అని వరసలు పెట్టి పిలుచుకుని, ప్రతీ అవసరానికి తోడుగా వున్న వాళ్ళు ఈరోజు ఉద్వేగంతో యమకింకరులై మనమీద కొడవలి ఎత్తి నరకడానికి, నిప్పు పెట్టి మనల్ని తగలబెట్టడానికి వస్తారు. ఇది అదుపులో పెట్టడానికి పోలీసులు మోహరించి కర్ఫ్యూ విదిస్తే అది ఇంకో నరకం, అందరూ ఊరు వదిలి, పశువులను , పొలాలను వదిలి ఎక్కడో దూరంగా బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళలేని వాళ్ళు పోలీసులు చూపించే నరకం అనుభవిస్తూ, ప్రాణాలు, వారికున్న కోడి, మేక ఆస్థులు కాపాడుకోడానికి నానా అవస్థలు పడ్డారని అత్తయ్య చెప్తారు. ఊరి మొత్తానికి అత్తయ్య ఒక్కరే ఆడ మనిషి ఆ సమయంలో వున్నారంట. నా తప్పు లేకుండా మేమెందుకు భయపడాలి అని వున్నారంట. ఇంట్లో ముసలి వాళ్ళు, ఆడపిల్లల్ని తీసుకొని ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి ఆమెది.  ఇక ఇది ఇలా వుంటే జైలు కి వెళ్ళని వారంటూ ఆ ఊర్లో మిగలలేదు. ముసలి, పిల్లా అని తేడా లేకుండా అందరిని పోలీసులు పట్టుకెళ్ళారు. విచారణ పేరుతో వారాల పాటు, భయం వల్ల నెలలు పాటు ఊరొదిలి ఎక్కడెక్కడో తిరిగారు, దాక్కున్నారు మగవాళ్ళంతా.

కేసుల్లో జైలుకెళ్ళిన వారి కుటుంబాల అవస్థలు ఇప్పటికీ తీరలేదు. ప్రతి అవసరానికి జైలులో వున్న వాళ్ళని బెయిలు మీద ఇంటికి తేవాలంటే ఎంతో డబ్బు కావాలి. సంపాదించే మనిషి లేక ఆడవారి మీద కుటుంబం మొత్తం భారం పడుతుంది. ఊర్లో వాళ్ళు తమ ఆస్తులు పొలాలు కబ్జా చెయ్యకుండా చూసుకోవాలని కూడా ఆడవాళ్ళు భయపడాలి. వయసులో వున్న ఆడవాళ్ళు భర్త లేక, భవిష్యత్తు ఏంటో తెలియక రకరకాల సమస్యలు, కుటుంబ ఆసరా కొసం అక్రమ సంబంధాలు, ఇలా....చెప్పుకుంటూ పోతే ఒక తరం లో ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు, పిల్లలు అందరూ ఎన్నో అవస్థలు పడతారు. కొందరి జీవితాలు నరక ప్రాయం అయిపోతాయి అపర్ణ లా, వసంత, రవి  ల లా ( బి.ఇ.డి లవర్స్)
కానీ ఈ స్థితి కి కారణమైన కుటుంబాలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదుగుతూ బాగానే వున్నారు. మంచో చెడో పేరు బాగా సంపాదిస్తున్నారు. అలా అని వారి జీవితాలు అంత గొప్పగా లేవు. అపర్ణ ఆ ఇంట్లో అమ్మాయే. అనసూయమ్మ పగ, ప్రతీకారాలతో కేసులతో అడవులలో తిరిగింది కొన్నాళ్ళు.
మరి దీనికి పరిష్కారం ఏంటి అని చాలా మంది అడిగారు. నేను ఒక ముక్కలో చెప్పే పరిష్కారం ఏమీ లేదు. కానీ నా అనుభవం ప్రకారం సీమ లో పేదరికం ఎక్కువ, వర్షాధార పంటలవల్ల అయివుండొచ్చు. ఎక్కువ నిరక్షరాస్యత. ఆడపిల్లలికి చదువు ఇంకా తక్కువే. నిరక్షరాస్యత వల్ల నే ఎన్నో మూఢాచారాలు, కోపం, మూర్ఖత్వం. అందరూ చదువుకొని, ఆడ మగ బేధం తగ్గించుకొని, కాస్త ఆలోచన పెంచుకోవటం మంచిది. వారిని వాడుకొని ఈ పెద్దలు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోగలిగితే వాళ్ళే బయట పడగలరు.అది ఒకసారిగా జరగదు. కొన్ని తరాలు మారాలి. హింస కి హింసే జవాబు కూడా కాదు అనే ఆలోచన వస్తే ఒక హత్య తో ఆగిపోయేది ఇన్ని జీవితాలు నాశనం అయ్యేవి కాదు. మన చరిత్ర రక్త చరిత్ర అయితే ఆ రక్తం ఎవరిది? కేవలం ఆ ఒక్క కుటుంబానిదేనా? అందరి రక్తాలు చిందించిన ఆ చరిత్ర ఎవరికి వుపయోగం!!ఎంతో భవిష్యత్తు వున్న వారి జీవితాలు అర్ధాంతరంగా చరిత్రలయిపోడానికా?

18 comments:

మేధ said...

OMG!
ఇవన్నీ చదువుతుంటేనే చాలా బాధగా అనిపిస్తోందే, ఇక భరించేవాళ్ళ పరిస్థితి...
మీరన్నట్లు చదువుకోవడం వల్ల కొంత మారచ్చేమో కానీ చదువుకున్నా వాళ్ళ మూర్ఖత్వం పోనంతవరకూ ఇలాంటివి తప్పవు..

కొత్త పాళీ said...

అదే అన్నాడు మహాకవి శ్రీశ్రీ, రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అని.
కవి రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఒక మంచి కథ రాశారు వీరనారి అనే పేరుతో. అందులో, తమది కాని ఈ ఫేక్షన్‌పోరులో బలయ్యే సాధారణ కుటుంబపు ఆవేదన మనసు కదిలేలా చిత్రించారు.

life is certainly stranger than fiction.
I sincerely hope a positive change comes to this area very soon.

మీరు చాలా బాగా రాశారు, ఎక్కడా అనవసరపు సెంటిమెంటాలిటీ లేకుండా, విషయాన్ని పల్చబడనివ్వకుండా.

Overwhelmed said...

AYYO..

మనసు పలికే said...

మనసంతా ఏదోలా అయిపోయిందండీ.. ఏం చెప్పాలో తెలియడం లేదు. మీరన్నది 100% నిజం, నిరక్షరాస్యత వల్లనే ఇటువంటి కష్టాలు అన్నీ.. పాపం..

Unknown said...

touching story.... Nuvvu ela bratuku tunnavu talli

Unknown said...

Better you start writing stories for Movies bcoz you mixed all points.

Unknown said...

Better you start writing stories for Movies bcoz you mixed all points.

కన్నగాడు said...

This content is apt for this title, really scary.

కమల్ said...

అదేంటో రాయలసీమ లో కొడుకొక్కడే తమకి పుట్టిన బిడ్డ అని కూతుర్లు మాకేమీ కాదనే వుద్దేశ్యంతో వుంటారనిపిస్తుంది.ఒక్కొక్కరి ఇంట్లో తమ కూతుర్లకు వాళ్ళు చేసేది చూస్తే నాకు ఇలా అనిపించింది. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించినా పైగా కట్నాలివ్వాలి అని వాళ్ళేదో పరాయివాళ్ళన్నట్లు మాట్లాడుతుంటారు, మా వాడికేమైనా ఐతే ఇక మేమెందుకు బతకాలి అని, మా మనవడున్నాడు వాని తరువాతే మీరు అని ఇలా అన్నిట్లో కూతురిని, కూతురి పిల్లల్ని వేరు చేసి ఎదురుగానే మాట్లాడుతారు, ఆ సమయంలో మా ఆడబిడ్డల్ని చూస్తే నాకు ఏడుపొస్తుంది, కాని వాళ్ళకి కూడా అది అలవాటేమో పెద్దగా ఫీల్ అవ్వరు

కానీ నా అనుభవం ప్రకారం సీమ లో పేదరికం ఎక్కువ, వర్షాధార పంటలవల్ల అయివుండొచ్చు. ఎక్కువ నిరక్షరాస్యత. ఆడపిల్లలికి చదువు ఇంకా తక్కువే. నిరక్షరాస్యత వల్ల నే ఎన్నో మూఢాచారాలు, కోపం, మూర్ఖత్వం. అందరూ చదువుకొని, ఆడ మగ బేధం తగ్గించుకొని, కాస్త ఆలోచన పెంచుకోవటం మంచిది. వారిని వాడుకొని ఈ పెద్దలు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోగలిగితే వాళ్ళే బయట పడగలరు

శిరీషగారు... పైన మీరు చెప్పిన విషయాలు చూస్తుంటే మీరు కూడ కేవలం నాణేనికి ఒక వైపునే చూస్తున్నట్లే ఉన్నది..మీరు ఉదహారించిన విషయాలన్ని ప్రతిప్రాంతలంలోనూ ఉండేవే..ఒక్క రాయలసీమలో మాత్రమే ప్రత్యేకంగా లేవు..నేను ఆ ప్రాంతం వాడినే..! స్త్రీల విషయాలలో మీరు చెప్పినవే నిజమనుకునే ప్రమాదమౌన్నది..! మీరు చూసిన సంఘటనలు అక్కడక్కడ ప్రత్యేకపరిస్థితుల్లో మాత్రమే ఉంటాయి కాని అవే మొత్తం సీమలో ఉంతాయనుకుంటే పొరబాటే..! నేను కడపప్రాంతం వాడిని..మా అమ్మగారు 1960 లలోనే మైసూర్ రాష్ట్రం వెళ్ళి డిగ్రీ నాలుగు సంవత్సరాలు చదివారు. అంటే అర్థం చేసుకోండి అప్పట్లోనె ఆడవారు చదువు సంధ్యల్లో ముందంజు ఉన్నారనే సంగతి స్పష్టమవుతుంది. రాయలసీమలో ఉన్నదల్లా వర్షధార ప్రభావం మాత్రమే వాటివలనే కక్షలు కార్పాణ్యాలు ఉన్నవి అక్కడ.నంధ్యాల ఒక్కటే రాయలసీమ కాదండి. ఇక మా యింట్లో అందరూ చదువుకున్నవారే..కోస్తాప్రాంతాలతోనూ పోల్చుకుంటే రాయలసీమలో విధ్యావంతులు ఎక్కువే అందుకు కారణం కరువు..! అక్కడి 40..50 ఎకరాల ఆసామి కూడ నిరుపేదే అందుకే అక్కడి రైతులు పుడమితల్లిని నమ్ముకోవడం కన్న చదువులతల్లిని నమ్ముకుంటారు..అందుకే అక్కడ డాక్టర్స్..ఇంజనీర్స్ ఎక్కువగా ఉంటారు..!అదే కోస్తా, సర్కారు జిల్లాలో 2..3..5 ఎకరాల ఆసామి కూడ ధనవంతుడే..అక్కడ చదువులు చదివి ఒకరికిందా గుమస్తా గిరి ఎందుకు చేయాలి అన్న తత్వం ఎక్కువ. అమెరికాలోనూ..సింగపూర్‌లలోను ఎక్కువగా పులివెందుల..కడపవాసులు చాలా మందే గుంపులుగా వుంటారు. ఫ్యాక్షన్ అన్న పదం కేవలం మీడియా వారి సృష్టి..అక్కడి గ్రామ కక్షలు వేరు వాటి స్వరూపం వేరు..! నా బ్లాగ్‌లో ఆ గ్రామకక్షలమీదనే ఒక నవల రాస్తున్నాను అదీను శాస్త్రీయంగా కడప. కర్నూల్ జిల్లాలో పరిశోదనలు చేసి వ్రాస్తున్నది..! మీకు వీలుంటే చదవండి.

శిరీష said...

@ కొత్త పాళీ గారు థాంక్స్ అండి, నేను కధ రాయలేదు కదా అందుకని నేచురల్ గా వుందనుకుంటా

శిరీష said...

@జాబిలి, మనసు పలికే, థాంక్స్ ఫర్ కామెంట్స్

@శ్రీధర్, మీరు నిర్మాత అవుతానంటే నేను సినిమా కధలు రాస్తాను. ఏమంటారు?

శిరీష said...

@ కమల్, మీరు చెప్పింది కూడా నిజమే అయి వుండొచ్చు. ఎందుకంటే మీ అనుభవం కదా, ఇది నేను చూసిన కొన్ని పల్లెలు, బంధువుల మాటలు వాటితో నాకు కలిగిన అభిప్రాయం. ఇప్పుడు చదువు పెరుగుతుంది అమ్మాయిల్లో కూడా కాని అబ్బాయిల ప్రాముఖ్యత మాత్రం చాలా క్లియర్ గా చూపిస్తారు అది అక్కడే చూశాను. మిగిలిన ప్రాంతాలలో అబ్బాయిలకు ఇంత ఎక్కువ ప్రాధాన్యత నేను చూడలేదు ఎందుకంటే నేను అన్ని పల్లెలు తిరుగుతుంటాను. టౌన్లలో పరిస్థితి మారిందని ఒప్పుకుంటాను. మీ బ్లాగ్ తప్పక చదువుతాను. కామెంట్ కి చాల థాంక్స్ అండి. మీ అమ్మగారి గురించి తెలుసుకోవటం సంతోషం కలిగింది.

సవ్వడి said...

so sad...

రాజ్ కుమార్ said...

శిరీష గారు,మీరు టపా వేసిన వెంటనే చదివాను... కానీ ఏమని కామెంట్ పెట్టాలో తెలియలేదు. నిజంగా.. మనసంతా ఏదోలా అయిపోయిందండీ..

ఆ.సౌమ్య said...

నేను ఇంతకు ముందు భాగాలకి రెండు కామెంట్లు పెట్టానండీ, అవి మీరు ఎందుకు అప్రూవ్ చెయ్యలేదు?

శిరీష said...

డియర్ సౌమ్య గారు,
సారీ అండి చాలా రోజుల తరువాత బ్లాగ్ ఓపెన్ చేశాను. అందుకే మీ కామెంట్స్ చదవలేదు. మీరు చెప్పినట్లు నాకు కూడా కొళాయి గొడవలే తెలుసు. ఫ్యాక్షన్ గొదవలు విన్నక కూడా నాకు కొళాయి గొడవలే బెటర్ అనిపిస్తున్నాయి. ఆ ఊరి పేరు చిందుకూరు.

శిరీష said...

డియర్ సౌమ్య గారు,
సారీ అండి చాలా రోజుల తరువాత బ్లాగ్ ఓపెన్ చేశాను. అందుకే మీ కామెంట్స్ చదవలేదు. మీరు చెప్పినట్లు నాకు కూడా కొళాయి గొడవలే తెలుసు. ఫ్యాక్షన్ గొదవలు విన్నక కూడా నాకు కొళాయి గొడవలే బెటర్ అనిపిస్తున్నాయి. ఆ ఊరి పేరు చిందుకూరు.

శిరీష said...

వేణు గారు,
కొన్ని సార్లు మౌనం కూడా చాలా చెప్తుంది, సో మీ మౌన కామెంట్ కూడా చెప్పల్సింది చెప్పింది. థాంక్స్