Thursday, November 18, 2010

మా ఊరి రక్త చరిత్ర - ఫ్యాక్షన్ అసలు కధ

 (సమర సిం హా రెడ్డి తరువాత భాగం)
ఫ్యాక్షన్... ఇలాంటి ఒక పదం వుంది అనికూడా నాకు తెలియదు. నా పెళ్ళి వెంకటేశ్వర రెడ్డీ తో జరిగిన వరకు. జీవితంలో కొన్ని ఎందుకు జరుగుతాయో అసలు అర్ధం కాదు. నేనెక్కడో విజయనగరం జిల్లాలో ఒక చిన్న టౌన్ లో పుట్టి పెరిగాను, నా ఊహలు మహా అయితే వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు వుండేవేమో నా భవిష్యత్ గురించి. కానీ ఏదో సినిమా కధలా గా రక రకాల మలుపులు తిరిగి నేను రెడ్డీ ని పెళ్ళి చేసుకున్నాను. ఆ గ్రామంలో ఇంట్లో నాకు అన్నీ కొత్తగా అనిపించాయి. మన దేశంలోనే వున్నా అది ఒక పరాయి లోకం లా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ, మన బాషే అయినా ఒక్క ముక్క కూడా అర్ధమై చచ్చేది కాదు పెళ్ళి అయిన కొత్తలో. ఇప్పుడు కాస్త నయం. వాళ్ళు తినే తిండి, మెసిలే పద్ధతి, ఇళ్ళు, వంట, నిద్ర అన్నీ ప్రతీది కొత్త. పెళ్ళైన రోజే ఆ ఊరు చూడడానికే వింతగా వుంది. అన్నీ మట్టి మిద్దెలు. ఒకరి మిద్దె మీద మొదలుపెడితే వీధి చివర కి మిద్దెల మీద రోడ్ లాగా నడుచుకొని పోవచ్చు. ఇళ్ళు బండలతో పలకలతో కట్టుకుంటారు, దేవాలయానికి వున్నట్లు పెద్ద పెద్ద తలుపులు, గుమ్మాలు. అన్నిటికంటే వింత ఇంట్లోనే పశువులు కూడా కడతారు. మనుషులు పశువులు కలిపి ఒకే ఇంట్లో వుండటం అనేది వాళ్ళు చెప్పే గొప్ప రీజన్స్ ఎలా వున్నా నాకు మాత్రం కష్టమే. దోమలు ఈగల్లా ముసురుతుంటాయి దాని వల్ల. ఈగలు కూడా ఎక్కువే. నాకోసమని పెళ్ళి కి బాత్రూం, లెట్రిన్ కట్టించారంట మా ఇంట్లో. సాధారణంగా పల్లెల్లో ఇది చాలా ఇళ్ళల్లో వుండే సమస్యనే. కాకపోతే బాత్రూం లో ఎవరివో బాంబులు దాచిపెట్టడం మాత్రం సాధారణం కాదు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ ఊరి ఫ్యాక్షన్ కధ మా అత్తయ్య ద్వార, మిగిలిన వాళ్ళ ద్వారా వింటుంటే తెలుసుకుంటుంటే నేను సినిమాల్లో చూసిన బాలకృష్ణ, చిరంజీవి కధలు కాదు అని అర్ధం అయింది.అక్కడ ప్రతీ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జైల్లో వున్నారు. మొదటగా వెకటేశ్వర రెడ్డి (ఇతను ఫ్యాక్షన్ ఒక వైపు లీడర్) ని చంపిన తరువాత అతని భార్య అప్పటి నుండి ఒక పెద్ద ముఠా ని ఇంట్లోనే వుంచి వాళ్ళకి తిండి, బాంబుల తయారి, హత్యల ప్లానింగ్ లాంటి వాటికోసం వాడుకుంది. వీళ్ళందరి ని మెంటైన్ చెయ్యడానికి ఆవిడకి వున్న 500 ఎకరాల పొలం లో కొంత అమ్మేసుకుంది. అది చూసి వీళ్ళందరు గొప్పగా ఫీల్ అయ్యారు. మీ అందరికి ఏ కష్టం రాకుండా చూస్తాను అని చెప్పింది. అది విని ఆవిడ వుండగా మనకేంటి అనుకున్నారు. కాని ఆపోజిట్ వాళ్ళు పెట్టిన కేసులు వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోవటం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఇంటికొకరు చొప్పున జైల్లో పడ్డారు.

ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాధమైన కధ. కొన్ని ఇళ్ళు తాళాలు పడిపోయాయి శాశ్వతంగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా జైలుకి వెళ్ళిపోయారు. ముసలి తల్లి దండ్రులు పిల్లల మీద దిగులుతో చనిపోయారు. పిల్లల తల్లులు కుటుంబం లో వ్యవసాయం చేసే మగ వాళ్ళు లేక కూలిలుగా మారిపోయారు. ఊర్లో వున్న కొందరు మగవాళ్ళ తో పనులు జరగాలంటే మిగిలిన ఆడ వాళ్ళు ఎన్నో రకాలుగా బతిమలాడుకోవాలి. స్త్రీ పురుషుల జనాభా తేడాల వల్ల, జీవనాధారం పోవటం వల్ల ఎన్నో అక్రమ సంభంధాలు(అలా అనొచ్చో లేదో నాకు తెలీదు). జైలుకి వెళ్ళిన వాళ్ళలో ఇంజనీర్లు చదివిన అబ్బాయిలు, ఎం.బి.ఎ లు చేసిన వాళ్ళు, టీచర్లు ఇలా చదువుకుని జీవితంలో ఎన్నో సాధించాల్సిన వాళ్ళున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని కళకళలాడాల్సిన కుటుంబాలలో చీకటి, ఒంటరితనం, దిగులు, భయం నిండిపోయింది. అంత పెద్ద ఇంట్లో ఒక్కరే బిక్కు బిక్కుమనే వాళ్ళున్నారు. ఎవరి కోసమో మన పిల్లలు బలైపోయారని, అన్నీ చూసుకుంటానని చెప్పిన ఆవిడ చేతులెత్తేసి తను రాజకీయంగా ఎదిగిపోతుంటే చూస్తు కడుపు రగిలిపోతున్నవాళ్ళే వున్నారు. ఆపోజిట్ వాళ్ళలో మొదటిసారి వీరి ఆవేశానికి, రెండవసారి వీళ్ళు ప్లాన్ ప్రాకారం చనిపోయిన వ్యక్తులున్నారు. వారి కుటుంబాలు కూడా సంతోషంగా లేవు.

ఈ కేసులు, జైల్లు ఇదంతా ఒక వేరే ప్రపంచం. ఆశ నిరాశల మధ్య ఊగిసలాట. ఎన్నో విషయాల మీద వీరి తీర్పు ఆధారపడి వుంటుంది. జడ్జికి లంచం ఇవ్వడానికోసమని ఊరందరూ చందాలేసుకుంటారు. నాకు తెలిసిన లోకంలో జడ్జి అంటే దేవుడు. కాని వీళ్ళకి లంచం తీసుకొని కూడా మంచి చెయ్యని ఒక లంచగొండి. ఎలక్షన్లు వస్తే నా వరకు నేను ఆలోచించేది మహా అయితే మన లోకల్ ఎం.ఎల్.ఎ కేండిడేట్లలో ఎవరు తక్కువ చెడ్డవాడు అని, ఏ పార్టీ గెలిస్తే కాస్త తక్కువ అవినీతి వుంటుంది అని మాత్రమే. కాని ఇక్కడ ఎలక్షన్లంటే ధారాళంగా ఎవరు మందు పోస్తారు, ఎవరు కుటుంబానికి ఎంత ఇస్తారు అని మాత్రమే కాదు. ఎవరు గెలిస్తే మన కేసులు ఎత్తేస్తారు, ఏ పార్టీ గెలిస్తే ఎవరు జడ్జిగా వస్తారు, ఎవరు గెలిస్తే మనకి లైఫ్ పడుతుంది, ఎవరు గెలిస్తే మనకి లంచం తగ్గుతుంది అని. ఎలక్షన్లు ఈ కుటుంబాలకి జీవన్మరణ సమస్యలు. ఒకసారి లంచం తీసుకున్న జడ్జి వల్ల కేసు ఏదో అనుకూలంగా మారుతుంది అనుకుని అదే ఆశతో బెయిల్ మీద వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్తారు కొందరు. మళ్ళీ బైల్ మీద వచ్చి కాపరం చేసి వెళ్తారు, ఎందరికో పెళ్ళిళ్ళు కాలేదు. మొదటి కేసులో లైఫ్ పడేసరికి అంతవరకు ధీమాగా వున్న వాళ్ళ జీవితాలు ఒక్కసారి షాక్ చెందాయి. ఇక ఈ గ్రామాం లో వారికి ఎవరు పిల్లని ఇవ్వటం మానేసారు. నా పెళ్లి అక్కడ చుట్టుపక్కల ఒక వింత. ఎవరో చదువుకున్న అమ్మాయి, వుద్యోగం చేస్తుంది, ఎక్కడో దూరం లో ఊరు పెద్ద షావుకార్లు పిల్ల పాపం ఈ ఊరికి ఇచ్చారంట అని. నన్నే ఎంతో మంది అడిగారు తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావా అని. నాకు ఫ్యాక్షన్ తాలూక నిజస్వరూపం తెలీదు. రెడ్డీ కళ్ళల్లో కనిపించే ప్రేమ ఎందుకు నొరు దాటి బయటకి వచ్చేది కాదో అక్కడి పరిస్థితులు చూస్తే అర్ధం అయ్యింది. రెడ్డి మీద ఏమీ కేసు లేదు. కాని వెంకటేశ్వర రెడ్డి పేరు మీద కేసు వుంది. మా పక్క ఇంట్లో మా మామయ్య గారి చిన్నాన్న మనవడి పేరు కూడా అదే ఇంటి పేరుతో సహా. కాకపోతే ఆ వెంకటేశ్వర రెడ్డి నిజంగానే గొడవల్లో వున్నాడు, మా రెడ్డి ఆ గొడవల సమయంలో కర్నూల్ లో చదువుకుంటున్నాడంట. అందుకని కేసు మా రెడ్డి మీద కాదని ఆపోజిట్ వాళ్ళు క్లెయర్ గా చెప్పారంట. అయినా భయానికి మా అత్తయ్య వాళ్ళు రెడ్డిని ఎప్పటికి ఆ ఊరుకి దూరంగానే వుంచారు. ఈ క్రమంలో రెడ్డీ చిన్నప్పటి ప్రేమ మొగ్గలోనే తుడుచుకుపోయింది.కానీ...ఆమె జీవితం నాశనం అయిపోయింది.(అదిప్పుడు చెప్పను తరువాత చెప్తా)

నేను ఒకసారి మా అత్తయ్య గారి ఊరు వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వెంకటేశ్వర రెడ్డి జైలు నుండి మొదటి కేసు కొట్టేస్తే ఇంటికి వచ్చాడు.అలా చాలా మందికి మొదటి కేసు కొట్టేసారని అప్పుడు వాళ్ళంతా ఇంటికి రావటంతో ఊరంతా పండగ లా వుంది. మా మిద్దెలు కలిసే వుంటాయి. నేను పైన కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే వాళ్ళ మిద్దె మీద నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళెప్పుడు మాతో మాట్లాడరు. పేర్లు ఒకటయినా కూడా తనే జైలు కి వెళ్ళాల్సి రావటం వల్ల ఒక్క ముసలి తల్లి మాత్రం ఇంట్లో మిగిలింది, ఆమె కోపంతో మాట్లాడేది కాదు. సో ఇతను తొంగి చూస్తుంటే నేను పలకరించాను. మీరు వాళ్ళ బంధువులా? అని. కాదు ఇది మా ఇల్లే అని చెప్పాడు. నాకు అర్ధం అయింది తను ఎవరో. కాసేపు మౌనంగా వుండిపోయాము. కానీ తను నాతో మాట్లాడాలని చూస్తున్నాడనిపించింది. నేనే తిరిగి అడిగాను "అంటే మీరు వెంకటేశ్వర రెడ్డీ ..ఆ?"అని. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు గడ గడా మాట్లాడేసాడు. అవును మీ ఆయన పేరూ, నాది ఒకటే కాని కేసులో నన్ను జైలుకి పంపారు ఊరివాళ్ళంతా కలిసి. మీ వాయన బయట చదుకుంటున్నాడు గొడవల్లో లేడు అని. అప్పుడు నేను కూడా ఏముందిలే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అనుకున్నాను, జైలుకి వెళ్తున్న మా అందరినీ ఊర్లో వాళ్ళు అప్పుడు హీరోల్లా గొప్పగా చూసారు. మీ ఆయన ని పిరికివాడని,ఊరొదిలి పోయాడని అనుకున్నారు. కాని ....3 సంవత్సరాలు జైలులో వున్నా. శిక్ష పడింది వదినా!! అన్నాడు. తను అలా పిలిస్తే నాకు గుండెల్లో ఒక ఆత్మీయ భావం కలిగింది. రెడ్డీకి ఎవరూ తమ్ముడు లేరు. వుంటే నాకు ఒక మరిది వుంటే నన్ను ఇలాగే పిలిచేవాడుకదా అనిపించింది. నా భావం తనకి కూడా తెలిసిందో ఏమో అప్పటివరకు తన మనసులో వేదన అంతా నాకు చెప్పాడు. జైలు జీవితం నరకం వదినా, ఆ తిండి, నీరు, ఆఖరికి అక్కడ గాలి కూడా మనల్ని చంపేస్తుంది. బాగా పెడతారు తిండి కానీ అది తిన్న మనిషి మరి జీవితంలో ఏ పని చెయ్యడానికి శక్తి వుండదు. నాకు ఏడుపొచ్చేది, మా ఇంట్లో ఎంత పాడి వుంది. నెయ్యి లేనిదే ముద్ద దిగదు నాకు. ఎవడో చేసినదానికి, ఎవరో కుటుంబం కోసం నేనెందుకు ఈ కష్టాలు పడాలి అనిపించేది.వాళ్ళంతా హాయిగా లీడర్లు అయిపోయి ఆస్తులు పెంచుకుంటుంటే నేను మా ముసలిదాన్ని చూసుకునే వాళ్ళు కూడా లేకుండా వదిలేసి వాళ్ళకోసం జైల్లో వున్నా. ఎంత ఖర్చయినా ఇడిపిస్తాము మీకు అసలు భయం లేదు అన్నారు వదినా, మా పొలాలు అమ్మి జడ్జిలకి లంచాలు కట్టుకున్నాము.ఇక అమ్ముకోడానికి ఏమీ లేకపోతే ఊర్లో అందరు చందాలు ఏసారు మా కోసరం. ఇలా చెప్తుంటే తను ఏడుస్తాడేమో అని భయం వేసింది. టాపిక్ మార్చాను. మరి ఇప్పుడు వచ్చేశావు కదా! ఇక దాని గురించి ఆలోచించకు. నీకెంతో భవిష్యత్తు వుంది. ఏమి చెయ్యాలనుకుంటున్నావు? అని అడిగాను. పెళ్ళి చేసుకుంటా, ఇక్కడే వుంటే మీ కంటే నాకే ముందు పెళ్ళి అయిపోయేది, కొంచెం ఆరోగ్యం చిక్క బెట్టుకొని మిగిలిన పొలం లో పని చూసుకుంటా. మా అమ్మని ఒంటరిగా వదిలేసాను. ముసల్ది చానా కష్టపడింది. నేను పెళ్ళి చేసుకుంటే కోడలొస్తే కొంత సుఖపడతాది,చూడాలి...!!అని. తన కళ్ళల్లో ఎంతో ఆశ. ఈ మాటల మధ్యలో రెండు సార్లు వాళ్ళ అమ్మ, మా అత్తయ్య, మామయ్య వచ్చి మమ్మల్ని పిలిచారు. కానీ మేము మాట్లాడుతూనే వున్నాము.నాకు మీ మీద ఏమీ కోపం లేదు వదినా, మా ముసల్దానికి కడుపుకోత అంతే. దాన్ని కూడా 6 నెలలు జైల్లో పెడితే కోపం, బాధ,పౌరుషం అనీ పోతాయి అని నవ్వాడు.

ఇలాంటి ఎన్నో కధలు, ఎన్నో సమస్యలు, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించడానికి మనమెవరు. ఆ పరిస్థితుల్లో వారి బతుకు గడవడానికి ఎవరు కారణం? ఫ్యాక్షన్ వల్ల ఊర్లో 2 సంవత్సరాలు కర్ఫ్యూ పెట్టారు. ఇళ్ళు పొలాలు పశువులు వదిలేసి ఊర్లెమ్మట, అడవులెమ్మట తిరిగారు మగవాళ్ళు. పోలీసులకు భయపడి అమ్మగారిళ్ళకి, బంధువుల ఇళ్ళకి వెళ్లిపోయారు ఆడవాళ్ళు. ఊరి మొత్తానికి 4,5 కుతుంబాలు మాత్రమే వుండి అందరి పంటలు, పశువుల బాద్యత తీసుకున్నారంట.మా అత్తయ్య మాత్రం ఎవరెంత చెప్పిన కదలక ఇంట్లోనే వున్నారు ఇద్దరు ఆడ పిల్లలతో, ఒక ముసలి అత్తగారితో. పోలీసులకి భయపడి పిల్లలు చదవలేదు, ఫ్యాక్షన్ కి భయపడి, జైలు శిక్షలు పడి, ప్రేమించుకున్న వాళ్ళవి, పెళ్ళి కుదిరిన వాళ్ళవి పెళ్ళిళ్ళు ఆగిపోయాయి.

కుటుంబం అంటే ఎన్ని పనులు, ఎన్ని బాద్యతలు...పిల్లలికి చదువైన, రోజు వారి జీవనాధారమైన, ఇంట్లో ఏదైన కార్యక్రమానికి నిర్ణయమైనా...ఏది జరగాలన్నా ఆ ఊర్లో జైలుకి వెళ్ళి మాట్లాడే వరకు లేదా వాళ్ళ వాళ్ళకి బెయిలు ఇప్పించగలిగే వరకు ఆగాలి.  బెయిలు మీద ఎన్నాళ్ళు తీసుకురాగలరు? ఎన్నాళ్ళు ఒక మనిషి కోసం మన జీవితం లో అన్ని ఆపగలం? ఎవరు ఏ విషయాల్లో ఎదురు చూడగలరు?

బి. ఇ. డి చేసే సమయంలో కలిసి జీవితం పంచుకోవాలని కలలు కన్న ఇంకో జంట సడన్ గా అబ్బాయి జెయిలు కు వెళ్తుంటే ఆమెకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, పరిచయం లేని జెయిలు కి వెళ్ళి ఆ అబ్బాయి ని కలిసి ఎప్పుడొస్తావు అని ఆమె ఏడుస్తుంటే, తనని చూసి ఆ అబ్బాయి ఏడుస్తుంటే.. చూసిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఆగేవి కాదు. ఇక ఆమె బాధ ని చూడలేక ఆ అబ్బాయి ఆమెని కలవకుండా మానేసాడు. ఆ నిర్ణయం తీసుకొని ఆచరించడానికి ఎంత నరకయాతన అనుభవించాడో ఆ ఊరిలో చెప్పే జెయిలు కధల్లో ఒకటి, ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు ఇలా జెయిలు గొడల మద్య నలిగిపోవాల్సిందేనా? వాళ్ళేమి చేసారు? మన కోర్టులకు టైము లేకపోతె, ఎవరో చెప్తే వినడమే తప్ప, నిజం తెలుసుకోవటం కోర్టు పని కాక పోతే అది ఎవరి తప్పు? ఇలాంటి పరిస్తితి నేను విన్నాను, చూసాను కాబట్టి నాకు తెలిసింది. కాని ఇలాంటి ఎన్నో వేల లక్షలమంది ఎవరో చేసిన తప్పులకి, ఎవరో స్వార్ధానికి జీవితం బలి చేసుకొని ఏదో వింత జరిగి వారి జీవితం మారిపోవాలని ఎదురుచూస్తూ బ్రతుకుతున్నారో!!! ఇది ఫ్యాక్షన్ నడిపిన వాళ్ళ కధ కాదు, దానికి ఏ సంబంధం లేకపోయిన ఆ ఊర్లో పుట్టినందుకు నలిగిపోయిన ఎన్నో ఇళ్ళళ్ళో కధ.

కానీ ఆ ఇంట్లోనే పుట్టిన పిల్లల కధలు ఎలా వున్నాయో తరువాత పోస్ట్లో.

19 comments:

Overwhelmed said...

chala badha vestundandi..

మనసు పలికే said...

అయ్యబాబోయ్.. ఇవన్నీ నిజంగా జరుగుతాయని నాకు మీ టపా చూశాకే తెలిసిందండీ.. నిజంగా చాలా దారుణం..:( చాలా బాధగా అనిపిస్తుంది తలుచుకుంటుంటే...

Anonymous said...

inthaku meedi ye oooru

సవ్వడి said...

hmmmm...

మీ నేస్తం said...

chaala baaga rasaru...alage aa nayakuralu and opposition leader perlu kooda rayandi please. These sick ppl are spoiling many and they have to be exposed to everyone. Alanti vallani andaru chinna choopu choostene malli ilantivi jaragavu. atleast raboye taralanna baagupadatayi

మేధ said...

సినిమాల్లో చూపించినట్లు ఉండదు, వాళ్ళకి చాలా ఇబ్బందులు అవీ ఉంటాయనుకున్నాను కానీ ఈ రకమైన జీవితం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు!! మీకు తెలిసిన మరిన్ని విషయాలు బ్లాగుద్వారా తెలియపరచండి..

శిరీష said...

@ జాబిలి, మనసు పలికే, నిజమేనండి అత్తయ్య మాటల్లో ఇలాంటి కధలెన్నో బయటకి వస్తుంటాయి నాకు విన్నప్పుడంతా చాలా బాధ గా వుంటుంది.

@అనానిమస్, మా ఊరు నంద్యాల దగ్గర పల్లె.

@ మీ నేస్తం, వాళ్ళ పేర్లు వివరాలు కూడా రాస్తానండి.

@ మేధ, నాకు తెలిసినవి అన్నీ తప్పక రాస్తాను,

థాంక్స్ టు ఆల్

అక్షర మోహనం said...

Rachana baavundi.

Anonymous said...

కొత్త ప్రపంచము గురించి విన్నట్లు,చూస్తున్నట్లు ఉంది. ఈ సమస్య అందరు చదువుకుంటే తప్పక పోతుంది. రాయలసీమ పల్లెల్లో 'కొంతమంది' మూర్ఖాగ్రేసరులు ఉంటారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే సగము దరిద్రము వదులుతుంది. మీరు చెప్పే విధానము చాలా బాగుంది. కీప్ రైటింగ్.

Sahithi said...

baaga chepparu,, medi nandyala daggara ee vooru? maadi kooda akkade.

Anonymous said...

చాలా వివరంగా అర్ధమయేల్లా చెప్తున్నారండీ. నేనింకా ఇవన్నీ సినిమా వాళ్ళ పైత్యపు కబుర్లనుకున్నా. కానీ ఇవన్నీ నిజాలని తెలిస్తే చాలా జాలిగా వుంది.I am ashamed of my ignorance! ఇదే విషయాన్ని కసి అని ఇంకో సీరియాల్ లో రాస్తున్నారొక బ్లాగరి. ఇక మీద పరిస్థితులు మార్చేందుకు, ఇలాటి అమాయకుల్ని ఫాక్షన్ లీడర్ల బారి నించి రక్షించేందుకు ఏమి చేయాలంటారు?
శారద

Anonymous said...

చాలా వివరంగా అర్ధమయేల్లా చెప్తున్నారండీ. నేనింకా ఇవన్నీ సినిమా వాళ్ళ పైత్యపు కబుర్లనుకున్నా. కానీ ఇవన్నీ నిజాలని తెలిస్తే చాలా జాలిగా వుంది.I am ashamed of my ignorance! ఇదే విషయాన్ని కసి అని ఇంకో సీరియాల్ లో రాస్తున్నారొక బ్లాగరి. ఇక మీద పరిస్థితులు మార్చేందుకు, ఇలాటి అమాయకుల్ని ఫాక్షన్ లీడర్ల బారి నించి రక్షించేందుకు ఏమి చేయాలంటారు?
శారద

రాజ్ కుమార్ said...

మీతో ఇదే ప్రాబ్లం అండీ ..ఏమి రాసినా పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళి పోతారు. ముందు పార్ట్ లాగ కామెడి అనుకున్నా.. హ్మ్మ్... అసలు కధ చెప్పి గుండెలు పిండేసారు.. ఇప్పడు ఏమని కామెంట్ పెట్టాలో తెలియటం లేదు.. ఊకోడదామని వచ్చి ఉలిక్కి పడ్డాను.

శిరీష said...

@ అక్షర మోహనం, నా రచన నచ్చినందుకు థాంక్స్ అండి
@ అప్పి బొప్పి, నిజమే కాని ఎన్ కౌంటర్ చేస్తే కూడా వేరే సమస్యలు. థాంక్స్ ఫర్ కామెంట్
@ సాహితి, మాది నంద్యాల దగ్గర చిందుకూరు మరి మీదో?
@ శారద గారు, ఇలాంటి పరిస్థితి వుందని నాకు కూడా పెళ్ళి అయ్యేవరకు తెలియలేదు. పరిష్కారం ఏమిటంటే.... అదొక విషవలయం నిరక్షరాస్యత, పేదరికం, వీటికి కారణాలు వాటిని పరిస్కరిస్తే ఇలాంటి సమస్యలు తగ్గుతాయి
@ వేణు రాం గారు, మీ కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్. కామెంట్ లో మీరు ఏదో ఒకటి రాసి ప్రోత్సహించడమే చాలు, ప్రత్యేకంగా ఏమి రాయాలి అని ఆలోచించకండి.

Kalpana Rentala said...

శిరీష,

ఇప్పుడే మీ బ్లాగ్ చూడటం.ఇది మీ రక్తచరిత చదివి పెడుతున్న కామెంట్ కాదు. ఇంకా చదవలేదు.మొత్తం మీ బ్లాగ్ పై పైన చూసాను. నా బ్లాగ్ లో మీరు పెట్టిన కామెంటు కు, ఎంతో అభిమానం తో మీరు నాకిచ్చిన అందమైన బహుమతి కి చాలా చాలా సంతోషించాను అని మీకు వ్యక్తిగతం గా చెప్పాలనిపించి ఇక్కడకు వచ్చి మీకు కామెంట్ పెడుతున్నాను. మీ మైల్ తెలియదు కాబట్టి ఈ కామెంట్ ఇక్కడ. నా నవల పూర్తి కాగానే అప్పుడు ఇవన్నీ వచ్చి నెమ్మదిగా చదివే ప్రయత్నం చేస్తాను.

సిరిసిరిమువ్వ said...

రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి విన్నాం కాని అక్కడి వారి జీవితాలు మరీ ఇంత భయంకరంగా ఉంటాయని తెలియదు. ఎవరిది తప్పు? ఎవరికి శిక్ష? బాగా వ్రాస్తున్నారు.

జేబి - JB said...

బాగా రాశారండి, చదువుతుంటే ఒక ఉద్వేగం కలిగింది. తన బ్లాగులో రాసిన ఇంటర్వూ అనుభవాలు చదివి వర్మకూడ రక్తచరిత్రలో అలా చంపుకుంటున్నవారు, ముఖ్యంగా సామాన్య్లులైన అనుచరుల భావోద్వాగాలు చూపిస్తాడనుకున్న. కానీ నాయకుల ఎదుగుదలపైనే దృష్టిపెట్టాడు. అతను మీ బ్లాగు తప్పక చదవాలి, ఇప్పుడే ఆయన బ్లాగులో ఈ వ్యాసం లంకె ఇస్తాను.

@అప్పి-బొప్పి: మొన్న హైదరాబాదులో జరిగిన గొడవ చూస్తే చదువొక్కటే మార్పు తేదు అనిపిస్తుంది.

ఆ.సౌమ్య said...

ఫేక్షన్ అనే పదన్ని సినిమాలలో వినడం తప్ప ఇంత భయంకరంగా ఉంటుందని తెలీదండి. ఆ ఊరి వాళ్ళని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తున్నాది. నేనూ మీలాగే విజయనగరంలో పుట్టి పెరిగాను. ఏవో కొళాయి దగ్గర తగవులు తప్ప పెద్దగా తెలీదు. మీరు చెప్పినవి వింటూ ఉంటే నమ్మశక్యంగా లేదు, చాలా ఆశ్చర్యమేస్తున్నాది. చాలా బాధగా ఉంది. వాళ్ల జీవితాలు బాగుపడాలని మనసారా కోరుకుంటున్నాను.

ఆ.సౌమ్య said...

ఇంతకీ ఆ ఊరిపేరేమిటో చెప్పగలరా? ఊరికే తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీకు పబ్లిక్ గా చెప్పడం ఇష్టం లేకపోతే నా బ్లాగులో కామెంటుగా పెట్టండి. అది నేను పబ్లిష్ చెయ్యను, అదీ మీకు అభ్యంతరం లేకపోతేనే.