Friday, May 14, 2010

వడదెబ్బ తగిలింది దాని ఫలితమే ఈ పైత్యం.

చెన్నై కి ఒక నమస్కారం పెట్టేయాలనిపిస్తుంది.కానీ అలా వదిలించుకునే వీలు ఇప్పట్లో కనిపించటం లేదు. నేను పనిచేసే సునామీ ప్రాజెక్ట్ కి హెడ్ ఆఫీసు చెన్నై లోనే వుంది. మొన్న 4 రోజులుగా చెన్నై లో వున్నాను. ట్రైన్ దిగగానే ఎవరో ఫెడేల్ మని కొట్టినట్లు తగిలింది వేడి గాలి. సరేలే ఎంత సేపు ఆటో లో హొటెల్ కి చేరిపోతే హాయిగా ఎ.సి కదా అనుకున్నాను. నా మనసులో మాట పైన "అతధాస్తు" దేవతలకి వినపడినట్లుంది. నీ పని చెప్తాము ఆగు అనుకున్నారు. అంతే జనాలందరూ తోసేస్తూ నన్ను ఎలాగో మొత్తానికి ఆటో స్టాండ్ దగ్గరికి చేర్చారు. నాకొచ్చిన తమిళం లో అషోక్ పిల్లర్ కి పొళామా అని అడిగాను. వెంటనే ఆటో వానికి అర్ధం అయిపోయింది నాకు తమిళం చాలా బాగా తెలుసని. 200 అని చెప్పాడు. వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లో మా తమిళ్ కొలీగ్ ఆటో బేరం చేసిన సీన్ గుర్తు చేసుకున్నాను, "ఎన్నప్పా ఇంద మాదిరి, కొంజెం చూసి చొల్లుంగొ" అన్నాను. అంతే టప టప బడ బడ అని ఏదో ఒక 5 నిముషాలు గుక్కతిప్పుకోకుండా చెప్పాడు. అతను చెప్పింది నాకు ఎక్కడ అర్ధం కాలేదు అనుకుంటాడో ఖర్మ అని "చెరి అప్ప" 150 లేలో అన్నాను(లేలో హిందీ కాబోలు) ఏదో ఒకటి ఈ వేడిలో ఇంకాసేపు బేరం చెయ్యకుండా ఎంతో కొంత మా ఆఫీస్ డబ్బులు కదా నాదేం పోయింది అనుకుని ఆటో ఎక్కేసాను.ఆటో కొంచెం దూరం పోనిచి " అషోక్ పిల్లర్ ఇంగలుకు తెరియుమా" అని అడిగాడు. అసలే రాత్రి 10 అయింది నాకు దారి తెలియదు అంటే ఆటో వాళ్ళతో కష్టం అని కొంజెం తెరియుం అని చెప్పను. (కొంచెం తెలుసని). నన్ను ఊరికే టెస్ట్ చేస్తున్నాడు కాని చెన్నై లో ఆటో వాళ్ళకి అంత ముఖ్యమైన ప్రదేశం తెలియదా అనుకున్నాను.కాని ఆ పైనున్న దేవతల వరం వలన నాకు ఒక అద్భుతమైన ఆటో వాడు దొరికాడు. అతను కూడా శ్రికాకుళం నుండి 20 రోజుల క్రితమే చెన్నై కి వచ్చాడంట అతనికి కూడా సేం టు సేం నాలాగే కొంచెం తమిళం మాత్రమే వచ్చంట, సేం టు సేం నాలాగే ఎక్కడికి దారులు తెలీవంట. 5 నిముషాలకి ఒకసారి లెఫ్టా రైటా అని అడుగుతుంటే డౌట్ వచ్చి అడిగితే చెప్పాడు. మరి ఇందాక అంత తమిళం మాట్లాడావు కదా అని అడిగితే అది తమిళం కాదమ్మ ఎదో కొంజెం కొంజెం తెరుయుం అన్నాడు. ఛా ఈ చెన్నై లో నన్ను ఒక తెలుగు వ్యక్తి తమిళంలో మోసం చెశాడా!!ఖర్మ. శుభ్రంగా తెలుగు మాట్లాడకుండా తమిళం మొదలు పెట్టి ఇద్దరం కష్టపడి తమిళం మాట్లాడామన్నమాట! సరే ఇప్పుడు ఎలా నాకు కూడా పూర్తిగా దారి తెలీదు అని చెప్పాను. అందుకే కదా మీకు తెలుసా అని అడిగాను అని దారి తెలియకపోవడం ఖచ్చితంగా నాదే తప్పన్నట్లు చెప్పాడు. పోనీ ఎవరినైనా అడుగు అంటే మీరు కూడా అడగండి నా తమిళం సరిగా వుండదు అని చెప్పాడు. అక్కడికి నాది తమిళ్ ఎం.ఎ.లిట్ అయినట్లు. సరేలే అని చెప్పాను. మొత్తానికి వాళ్ళనడిగి వీళ్ళనడిగి రాత్రి 12 గంటలకి నన్ను హొటెల్ కి చేర్చాడు. ఎవరు చెప్పింది మన దేశానికి స్వతంత్రం ఇంకా రాలేదని? నేనే ఉదాహరణ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా.....ఓహ్ ఆటో అబ్బాయి కూడా వున్నాడు కదా!! ఛా జస్ట్ మిస్ అయింది లేదంటే నేనే మనకి స్వాతంత్రం తెచ్చేసే దాన్ని.ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఎంత పెద్దైన ఆడవాళ్ళకి భయాలు వుంటాయి. ఎక్కడ మనసు భయం లేకుండా స్వేచగా వుండగలుగుతుందో ....అక్కడే కదా స్వతంత్రం. మనసులో భయం పోయిన రోజు 90% స్వతంత్రం వచ్చేసినట్లే. ఈ తతంగం అంతా అయ్యే లోపల నా ఫేస్ జిడ్డు పట్టేసి జుట్టు రేగిపోయి బాగా చెమటలు పట్టేసి నామీద నాకే అసహ్యం వేసేలా వున్నాను.నిజంగా అయితే నన్ను ఆ హొటెల్ లోపలకి రానీయకూడదు, మా ఆఫీస్ తరుపున నేను రెగ్యులర్ గా వెళ్ళటం వల్ల రానిచ్చారు. హొటెల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన రిసెప్షనిస్ట్ మాత్రం నన్ను చూసి ఐస్వర్య రాయ్ ని చూసినంత ఫీలింగ్ తో అద్భుతంగా నవ్వుతూ చూసి విష్ చేశాడు. అక్కడ కూడ "తంగ్లిష్" మాటలే. వెల్ కం మేడం అని మొదలు పెట్టి నల్లా ఇరికింగ్లా మేడం అని ఇంకా ఏదేదొ చెప్పాడు. మొత్తానికి నాకు అర్ధం అయింది ఏంటి అంటే.....ఏమి అర్ధం కాలేదు




ఈ సమ్మర్ ఎందుకొస్తుందో?అసలు సమ్మర్ సీజన్ లో ఆఫీసులెందుకో? మా ఆఫీస్ ఊటీ లోనో కొడైకెనాల్ లోనో లేదెందుకో? ఫార్మల్ డ్రెస్సులు వేసుకొనే ఆఫీసుకి ఎందుకు వెళ్ళాలో? హాయిగా నైటీ వేసుకొని రావొచ్చు అని కనీసం చెన్నై లో పాలసీ పెడితే బాగుండు.అసలు ఎ.సి ఎవరికి వారు పెట్టుకునే బదులు కొంచెం కస్టమైన సూర్యుడి ని ఎ.సి లో పెట్టేస్తే బాగుండును!!!నేను కేంపులు ఎక్కువయ్యి మార్నింగ్ వాక్ చెయ్యకుండా 10 రోజులనుండి కస్టపడి పెంచుకున్న కొవ్వంతా చెన్నై ఎండలకి 4 రోజుల్లో కరిగిపోయింది. అసలు ఎవరిని పలకరించామంటే చాలు తిడుతున్నారనిపించే సౌండ్ వచ్చేలా మాట్లడేస్తుంటారు. చచ్చినా హిందీ మాట్లాడరు, తెలుగు వచ్చినా రానట్లుంటారు. కాకపోతే వాళ్ళ భాషా ప్రాంతీయాభిమానం చూసి ఒక్కోసారి ముచ్చటగా అనిపిస్తుంది.



సరే ఇంకెన్నాళ్ళు సునామీ ప్రాజెక్ట్ అయిపోతుంది లే ఆ తరువాత ఎక్కడో వేరే ప్రాంతం వేస్తారు అనుకున్నాను...సునామీ వచ్చిన విషయం వాళ్ళు మర్చిపోయిన మేము అంత త్వరగా మరిచిపోనీయం అందుకే ఇంకా డిసెంబర్ వరకు పని చెయ్యాలి అని చెప్పారు. ఇంకో సంవత్సరం నాకు తమిళ్ కష్టాలు, చెన్నై వేడి ట్రాఫిక్ తప్పదు.హుహ్ ఏమి చేస్తాము!!! ఎవరికి ఎంత ఎండ వ్రాసిపెట్టివుంటే అంత.



ఏంటి ఈ సోది మాకు అనుకుంటున్నరా...వడదెబ్బ తగిలింది దాని ఫలితమే ఈ పైత్యం.

14 comments:

హరే కృష్ణ said...

:) :)

Unknown said...

అమ్మో నేను జూన్ మొదటివారం లో కొడైకెనాల్ ప్లాన్ చేశా
కొంచెమైనా తమిళ్ రాకపోతే చాలా కష్టమని ఇంతకుముందు
వెళ్ళిన మా కొలీగ్ చెప్పాడు . నాకేమో ''నాను వున్నై కాదిలిక్కరెన్''
తప్ప ఏమిరాదు . అందుకే ఎక్కడన్నా'' లేర్న్ తమిళ్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ''
అన్న పుస్తకం దొరుకుతుందేమో అని చూస్తున్నా .

Anonymous said...

when compared with HYD, B'lore and Pune i like Chennai very much :-)

భావన said...

హ హ హా బాగానే అరవ దెబ్బ పడినట్లు వుంది గా మీకు. పాపం god bless you. మద్రాస్ లో పువ్వులు బలే వుంటాయండి. ఇంకా పచ్చ అరటీ పళ్ళు ఇంకా శరవణభవన్ లో రవ్వ దోశ ఎంజాయ్ మాడీ (అదేమి అలా మొహంపెట్టేరు ఇది కన్నడం ;-))

సృజన said...

ఎండ ప్రభావం బాగాచూపినట్టుందిగా:):)

మాలా కుమార్ said...

చెన్నై లో మల్లె పూవులు చాలా చాలా బాగుంటాయండి . అలాగే నీళ్ళ ప్రాబ్లం కూడా . పాపం వడ దెబ్బ .

3g said...

:):)

సవ్వడి said...

సరదాగా రాసారు.

సవ్వడి said...

సరదాగా రాసారు.

rishi said...

కంచం నిండా సాంబార్ పొయ్యలేదా మీకు ఎవరూ ఇంకా..? సాంబారు కష్టాలే వేరు లెండి అక్కడవి..ఎలాగూ డెశంబరు వరకు ఉంటారు కాబట్టి సాంబారు పోస్టు కూడా మేము ఎక్స్ పెక్ట్ చెయ్యచ్చేమో..హ్యాపీ సాంబార్ ఈటింగ్ :))

శిరీష said...

@ హరే కృష్ణ;3 జి :))

@రవి గారు తమిళ్ వచ్చేసి నట్లే వుంటుంది కానీ రాదు. నేను ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నా, అక్కడే వుంటే వచ్చేస్తుంది.

@అనానిమస్- మీరు ఖఛితంగా తమిళనాడు వాళ్ళు అయి వుంటారు.చెన్నై ట్రాఫిక్ కంట్రోల్, ధరల కంట్రోల్, ప్రాంతీయాభిమానం బాగుంటాయి.

@భావన,మాలాకుమార్,స్రుజన - మల్లేపూలు పెట్టుకునే అదృష్టం నాకు తక్కువగా కలుగుతుంది. మీటింగ్ కి ఆఫీస్ కి మల్లెపూలు పెట్టుకొని వెళ్ళలేను. శరవణా భవన్ ఫుడ్ మాత్రం తప్పదులేండి.

@సవ్వడి- :)))

@రిషి గారు ప్లీస్ సాంబార్ గుర్తు చెయ్యకండీ. లీవ్ తీసుకొని ఇంట్లో మా అమ్మగారు వండిపెడుతుంటే హాయిగా వున్నాను. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి ఎందుకు నన్ను బాధపెడతారు. కావాలంటే మీకోసం ఒక పెద్ద బకెట్ నిండా చెన్నై సాంబార్ పంపిస్తా మీ అడ్రెస్స్ ఇవ్వండి

sumanth said...

ee kaalam lo...artha ratri oka abbayi ontari ga tiriga galigithe svatantram ivvali....hehehe :P

శిరీష said...

Dreamer(sunny) gaaru, nijame paapam meerasalu raatri bayata tiragalekapotunnaremo kada. meeku bhayam aite cheppandi evaraina ammayilu thodostaaru. :):)

Unknown said...

శిరీష గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.