Monday, July 5, 2010

రావణ్ (విలన్)-ఇది సినిమా కాదు

మొన్న శనివారం రావణ్ (విలన్) సినిమా చూశాను. నాకు మామూలుగా అయితే అభిషేక్ ఇష్టం, కాని విక్రం బాగా చేస్తాడని కూడా ఒప్పుకుంటాను. హిందీ వెర్షన్ చూస్తే కానీ తెలీదు ఎవరు బాగా చేశారని.ఐశ్వర్య ని చూస్తే బాగాలేదనిపించింది(ఐశ్వర్య అభిమానులు వింటే నన్ను ఉరి తీశేస్తారేమో)ఇక అసలు విషయం ఏంటి అంటే ఇంతకీ సినిమాలో ఏమి చెప్పాలనుకున్నారు? మళ్ళీ రామాయణం చూసినట్లే అయింది.రావణుడు ఎందుకు అలా అయ్యాడని చెప్పాలనుకున్నరేమో!నిజం చెప్తున్నాను నాకు చాలా విషయాలు అర్ధం కావు. కానీ నోరు మూసుకొని వుండను ఏదో ఒకటి వాగుతుంటాను.అలాగే రావణ్ కూడా నాకు నిజంగా అర్ధం కాలేదు కానీ ఏదో వాగుతున్నా, నాకు అర్ధం అయిన వరకు. రావణ్ విలన్ గా ఎందుకయ్యాడు అని చెప్పాలని చూశారనిపించింది.

నిజంగా మన సమాజంలో నక్సలైట్లు ఎందుకు తయారవుతున్నారు అని చెప్పిన రీజన్స్  అన్నీ ఇంచుమించు ఇలాగే వుంటాయా? నిజానికి నక్సలైట్లు,విప్లవకారులు తయారయ్యేది కేవలం వారికేదో అన్యాయం జరిగిందనేనా? కాదేమో! నేను కూడా ఒకప్పుడు ఇలాగే అనుకునేదాన్ని నాకు నిజంగా నక్సలైట్లు తో మాట్లాడిన సంధర్భం ఎదురైన వరకు. అసలిప్పటికీ అది నిజంగా జరిగిందా అని నమ్మలేకపోతున్నాను.ఒకరకంగా నాకున్న ఈ అలవాటు( అర్ధం అయి కాకపోయినట్లుండడం, కొన్ని విషయాలు నిజంగా జరిగినా జరగనట్లు అనిపించడం) నన్ను ప్రశాంతంగా వుండనిచ్చాయనుకుంటా.(నేను చెప్పే కధలన్నీ పెద్దగా వుంటాయి మరి, ఓపిక వుందా?)

నేను వజ్రపుకొత్తూరు మండలం లో పని చెయ్యటం మొదలయ్యాక ఇక అక్కడే మా స్థావరం ఏర్పాటు చేసుకున్నాము.మొదట్లో నేను, శ్రీను, రెడ్డీ మాత్రమే వున్నా తరువాత టీం లో చిత్ర, ధర్మా చేరారు.మేము వజ్రపుకొత్తూరు మండలం రాజ్యాన్ని మొత్తం పంచేసుకున్నాము.నా సామ్రాజ్యం పలాస నుండి బెండిగేటు మద్య ప్రాంతం. మెయిన్ లైను గ్రామాలతో పాటు లోపల ఇంటీరియర్ గ్రామాలు అన్నీ నావే. మొదట్లో నడిచి, బస్సుల్లో తిరిగే వాళ్ళం,కొన్నిరోజులకు అమ్మాయిలకి కైనటిక్ హోండాలు, అబ్బాయిలకు సుజికి సమురాయ్ లు ఇచ్చారు. దాని తో పని కాస్త సులభం అయింది.అలాగే గ్రామాలలో రాత్రిపూట వుండిపోవటం తగ్గిపోయింది. పని ముగించుకొని వీలైనంతవరకు తిరిగి వచ్చేసే వాళ్ళం.కానీ మా పని దొంగల్లాగా సాయంత్రం మొదలవుతుంది. పగలు గ్రామస్థులు అందరు పనులకు వెళ్ళిపోతారు సో, మనం వెళ్ళి పొదుపు చెయ్యండి, గ్రూపులు కట్టండి, మీ గ్రామంలో సమస్యలేంటి, ఊరి చెరువు ఎండిపోయింది అందరం కలిసి శ్రమదానం చేసి పూడిక తీద్దాము,పిల్లల్ని బడి కి పంపండి పనులకు వద్దు అని క్లాస్ పీకితే ఆ సమయంలో వినరు సరికదా మనల్ని నాలుగు పీకుతారు. అందుకని చక్కగా పక్షులన్నీ గూటికి తిరిగొచ్చే వేళ, పశువులన్నీ లేగ దూడలకి పాలు ఇవ్వాలని పరిగెడుతూ ఇంటికొచ్చే వేళ, పగలంత మండుటెండలో చెమటలు కక్కుతూ కూలి పని చేసినా ఇంటికెళ్తూ ఒకరిపై ఒకరు హాస్యాలాడుకుంటూ హుషారుగా వెళ్తున్న ఆడవాళ్ళను చూస్తూ మేము మా బండి స్టార్ట్ చేసుకొని ఊరిమీద పడతాము. మేము వస్తాము అని చెప్పిన గ్రామానికి వాళ్ళు ఇచ్చిన టైముకి మాత్రం వెళ్ళే వాళ్ళం ఎందుకంటే వాళ్ళకున్న పనులు,అలసట వల్ల జనాలకి తీరికే వుండదు(ముఖ్యంగా ఇంట్రస్ట్ వుండదు) అందుకని ఇచ్చిన అవకాశం మేమెలా వదులుతాము. అలా వెళ్ళి ఎక్కువగా మహిళలతో గ్రూపులు కట్టించటం, పొదుపులు చేయించటం చేసే ముందు గ్రామంలో సమస్యలని ఏదో ఒకటి పరిష్కరిస్తూ ఆ గ్రామంలో ఎంటర్ అయ్యేవాళ్ళం. కొత్తగా గ్రూపు చెయ్యాలన్నా, గ్రూప్ మీటింగులు అయినా, గ్రామస్తులతో మీటింగ్ అయినా అన్నీ అయ్యే సరికి ఎలా కాదన్నా 8-9 అయ్యేది. అప్పుడు ఒక్కోసారి వాళ్ళు బోజనం కూడా అంటే ఇంకా ఎక్కువ టైమయ్యేది. ఆ టైములో తిరిగి వెళ్ళే వాళ్ళం. మొదట్లో ధర్మా, శ్రీను, రెడ్డీ ఎవరు ఫీల్డ్ కి వెళ్తుంటే వాళ్ళతో నేను, చిత్ర ఎవరో ఒకరి బైక్ పై వెళ్ళే వాళ్ళం. మా ఏరియా లు డివిజన్ ప్రకారం నా గ్రామాలు, రెడ్డీవి కలిసేవి, చిత్ర గ్రామాలు, ధర్మా వి కలిశాయి.ఒకే బండి లో వెళ్ళి రెండు గ్రామాలు చూసి వచ్చే వాళ్ళం. కాని ఒకసారి రెడ్డీ నన్ను "నేనేమైనా నీ డ్రైవర్ అనుకున్నావా, ఎన్నాళ్ళు నా మీద డిపెండ్ అవుతావు" అన్నాడు. నాకు చాలా అవమానం అనిపించింది, నేను జీవితంలో సైకిల్ కూడా సరిగా నేర్చుకోలేదు, అలాంటిది ఒక్కదాన్నే ఖైనటిక్ తీసుకొని ఫీల్డ్ కి వెళ్ళిపోయా (ఆ తరువాత ధర్మా నన్ను వెతుక్కొని వచ్చాడనుకోండి).కాని ఆ ఉక్రోషంలో నాకు డ్రైవింగ్ వచ్చేసింది. అందుకు ఎందరో సహకరించారు.నేను బండి తీసుకొని బయటకెళ్తుంటే ఆ రూట్లో వెళ్ళే ప్రతీ వాళ్ళు కాసేపు వాళ్ళపని ఆపేసి పక్కకి జరిగి ఆగిపోయేవారు.బస్సు డ్రైవర్ బస్సుని వీలైనంత పక్కకి తీసి ఆపేసే వాళ్ళు. ఆఖరికి చిన్నపిల్లలు, వీధి కుక్కలు కూడా  దారి ఇచ్చేసే వాళ్ళు.(అందరికీ నేనంటే అంత మర్యాద). ఒక్క కోడి జాతి మాత్రం నాకు నిజమైన సవాళ్ళుగా నిలిచాయి. ఎక్కడో దూరంగా ఇంటి వెనుక  మేస్తుండేవి నా బండి వస్తుందనగానే ఎగురుకుంటా వచ్చి నా బండి కింద పడేవి.పల్లెలో "తమ్ముడు తమ్ముడే,పేకాట పేకాటే " ఎంత మేడం అయినా కోడి ని గుద్దిస్తే 200/- ఇవ్వాల్సిందే.(బహుశా నా బండి కిందే అన్నీ కాస్ట్లీ కోళ్ళే పడేవేమో!ధర్మా కి ఎప్పుడూ 20/-మాత్రమే ఖర్చు అయ్యేది,మాకు కోడి కూర కూడా వచ్చేది).

ఇలా మొత్తానికి డ్రైవింగ్ వచ్చేసాక ఒక్కదాన్నేఅ ఆ నిర్మానుష్యమైన రోడ్లమీద ఝూమ్మని వెళ్తుంటే వావ్ ఎంత బాగుండేదో!!అప్పట్లో ఆ పల్లెల్లో బైక్ మీద తిరిగే అమ్మాయిగా పేరు గాంచాను. చిత్ర కి ముందే డ్రైవింగ్ వచ్చు కానీ చిత్రకి తెలుగు రాదు, తెలుగు మాట్లాడాలని చూసి బూతులు మాట్లాడేసేది.అందుకని ఎలాగూ తను ఎవరో ఒకరితో వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు ఎక్కువగా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. ఎడారిలో బతుకుతున్న వాళ్ళకి పెద్ద వాటర్ ఫాల్ దొరికినట్లైంది నా జీవితంలో చిత్ర రావటం.ఒక సంవత్సరంగా ఇద్దరబ్బాయిలతో తిరిగటం, మాట్లాడటం, 24 గంటలు నా ఎదురుగా అబ్బాయిలే. ఎంతైనా అమ్మాయిలకి అమ్మాయిల స్నేహం గొప్ప, అలాగే అబ్బాయిలకి కూడా. చిత్ర నన్నెంత ప్రభావితం చేసిందనే విషయం గురించి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం.ఇక నేను నా పని ఎవరిమీదా ఆధారపడకుండా చాలా పనులు చెయ్యగలగటం వీలయ్యింది డ్రైవింగ్ వచ్చాక. ఆ స్వతంత్రం ఎంత ఆనందమో అనుభవిస్తేనే తెలుస్తుంది. బైక్ మీద వెనక కూర్చొని వెళ్ళడానికి, బైక్ మనమే డ్రైవ్ చెయ్యడానికి పెద్ద తేడా ఏముంది అనుకుంటాము.కానీ బహుశా అమ్మాయిలకి అర్ధం అవుతుందేమో! నాన్నో, అన్నయ్యో, ఆయనో , తమ్ముడో తీసుకెళ్తే కానీ చాలా పనులు చేసుకోలేకపోవటం, వెళ్తున్న దారిలో అందమైన గడ్డిపూలు కనిపిస్తే, చిన్న కుక్కపిల్ల కనిపిస్తే, చల్లని జీడితోటలో కాసేపు కూర్చోవాలనిపిస్తే ఆగలేకపోవటం,  తలమీద చేపల బుట్ట బరువుతో ఎండలో ఒంటరిగా వెళ్తున్న ముసలామెని బైక్ ఎక్కించుకోవటం, పలాసకి కాలేజి కెళ్ళి గుంపులుగా వస్తున్న అమ్మాయిలని పలకరిస్తు పిచ్చాపాటి చెప్పటం ఇవన్నీ కుదురుతాయా మనకి. ఇలాంటివెన్నో వందల వేల అనుభవాలు, ఆ ప్రయాణాలలో.బహుశా ఇలాంటి పిచ్చి కోరికలన్నీ అమ్మాయిలకే వుంటాయేమో, చిత్ర కూడా నాలాంటిదే. కానీ రాత్రి మీటింగ్ అయ్యాక తిరిగి రావటం మాత్రం.....కాస్త భయంగా వుండేది. అది అసలే జీడితోటలు, చీకటి.

చాలా సార్లు ఆ తోటల్లో వస్తుంటే కొందరు నా బండి ఆపి నేనెవరు ఏంటని అడిగే వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు అక్కడేమి చేస్తున్నారని అడగాలనిపించినా అడగలేదు, వాళ్ళ తోటలు వాళ్ళిష్టం.ఒకసారి మా ఇంట్లో వాళ్ళు నాకోసం ఏదో పంపిస్తే ఇవ్వడానికని మా తమ్ముడి ఫ్రెండ్ సుధాకర్ వచ్చాడు.మా ఇంట్లో మా అందరి స్నేహితులు మాతో పాటు మా ఇంటిమనుషులైపోతారు.నాతో పాటు ఒకరోజు ఫీల్డ్ కి వచ్చాడు.మీటింగ్ త్వరగానే ముగించి బైక్ మీద వస్తున్నాము. జీడితోటల్లో అలా చీకటిలో వస్తుంటే సుధాకర్ పైప్రాణాలు పైనే పోయినట్లున్నాయి.తను కాస్త భయస్థుడు, దారిపొడుగునా చీకట్లో ఎటువంటి భయాలు పడొచ్చో అన్నీ చెప్తున్నాడు, దూరంగా ఏవో మంటలు కనిపించాయి"బాబీ అవి ఏంటి ఆ మంటలు అని అడిగాడు, అసలే చీకటిలో డబల్స్ డ్రైవింగ్లో బిజీగా వుండి పరధ్యానంగా ఏదో శవం అయివుంటుందిలే సుధా అని చెప్పేశాను" ఇక సుధాకర్ నా ప్రాణాలు తీసేశాడు.బాబీ త్వరగా పోనీ, జాగ్రత్తగా పోనీ అంటూ, దెయ్యాలలో రకాలు, ఏ దెయ్యం కి ఏమి ఇష్టం అని చెప్తూ  భయపడుతూ నన్ను భయపెట్టసాగాడు. కానీ ఇంతలో మా బైక్ ని ఎవరో ఆపారు.

30-40 వయసులో వుంటారు, ఆ చీకటిలో నుండి ఎలా వచ్చారో తెలీదు. అందులో ఒకతను ఇంతకు ముందుకూడా ఒకసారి నా బండి ఆపాడు.అతను కోపంగా"నీకెన్నిసార్లు చెప్పాలమ్మా రాత్రిపూట ఇలా బండేసుకుని తిరగొద్దని, పోలీసులనుకోవచ్చు, ఏదైన జరగొచ్చు, అయినా అమ్మాయివి కదా రాత్రిపూట మీటింగులేంటి పగలు పెట్టుకో..."అని అరుస్తున్నాడు.నేను కూడా నా జాబ్ ఇది మీకేంటి అని చెప్పాలని చూశాను కానీ ఇంతలో రెండో అతను ఈయన్ని ఆపి, ఏమ్మా రాత్రి పూట ఇలా తిరగకమ్మ, ఇది మంచి ఏరియా కాదు, అన్నలుంటారు, పోలీసులు కూంబింగ్ చేస్తుంటారు,జాగ్రత్త. అని సుధాకర్ వైపు చూసి నువ్వెవరు అని అడిగారు.సుధాకర్ అప్పటికే గడ గడా వణుకుతున్నాడు.మా తమ్ముడు అని చెప్పాను నేను.వాళ్లు అనుమానంగా చూసి సరే మేడం మీరు పలానా గ్రామలో ఎస్.సి. వాళ్ళకి గ్రూపులు చెయ్యరా అని అడిగారు.ఎందుకు చెయ్యను ఆ గ్రామంలో వాళ్ళు అసలు నా మాట వినడంలేదు అని చెప్పాను. రేపు ఉదయాన్నే 8గంటలకి ఆ గ్రామంకి రండి, అక్కడ యాదమ్మ అని వుంటుంది ఆవిడని కలవండి, ఆమె మీకు సహాయం చేస్తుంది అని చెప్పాడు. సరే అని ఇక వెళ్తాను అని బయలుదేరాను.సుధాకర్ ఇంటికెళ్ళేవరకు ఇంకొక్క మాట మాట్లాడలేదు. ఉదయాన్నే బస్సెక్కిస్తే వెళ్ళిపోయాడు.వెళ్ళేముందు "బాబీ నువ్వు చేస్తున్న ఉద్యోగం చాలా డేంజర్ గా వుంది, నీకు చెప్పేంతవాడిని కాదు,నువ్వు నీకు నచ్చినపనే చేస్తావు అని తెలుసు,కానీ జాగ్రత్తగా వుండు బాబీ."అని సెంటిమెంట్ డైలాగులు చెప్పేసి వెళ్ళాడు.ఇక అప్పుడు బయలుదేరి ముందురోజు రాత్రి అతను చెప్పిన గ్రామానికి వెళ్ళాను.అప్పటికీ నాకు తెలీదు నేను ఒక సీక్రెట్ మీటింగ్ లో పాల్గొనబోతున్నానని, ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నానని.

ఆ ఊరు అప్పటికి 4 సార్లు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళినా నన్నేదో చిన్నపిల్లని కదా చూసినట్లు చూసి పెద్దగా పట్టించుకోరు. నేను చెప్పేది మాత్రం పూర్తిగా వినేవాళ్ళు ఆహా ఎంత బాగా వింటున్నారు అనుకునే లోపే సరే మేడం వుంటాము, అని ఇన్ డైరెక్ట్ గా నన్ను వెళ్ళిపొమ్మనేవాళ్ళు.బాగా పొడుగ్గా వున్నాడుకదా రెడ్డే మాట వింటారేమొ అనుకుని తను కూడా ట్రై చేశాడు. అందరం కలిసి ఒకసారి మీటింగ్ పెట్టాము, ఆ ఊర్లో ఏ  పప్పూ ఉడకలేదు. సరే ఇప్పుడెవరో వాళ్ళే పిలిచి సహాయం చేస్తాము అని చెప్పారు కదా, ఇక ఎటువంటి ప్రాబ్లెం లేదు అనుకున్నాను. ఆ యాదమ్మ ఎవరో కాని వెతకాలి అనుకుంటుండగా ఒకామే నా దగ్గరకి వచ్చింది.ఇంతకు ముందు మీటింగులకి వచ్చిన ఆమె కాబట్టి పలకరించాను. ఆమెని అడిగాను యాదమ్మ ఎవరు అని. ఆమే యాదమ్మ ఇంటికి తీసుకుపోతా రా మేడం అని తీసుకెళ్ళింది. ఆ ఊర్లో సందులన్నీ తిప్పింది. బయటనుండి చూస్తే చిన్న ఊరిలా వుంది కాని పెద్దదే, ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెనక్కి వెళ్ళలాంటే ఊర్లో ఎక్కడికొచ్చానో అర్ధం కాకుండా చుట్టు చుట్టు తిప్పింది ఆవిడ. చివరిగా ఒక తాళం వేసి వున్న ఇంటికి తీసుకెళ్ళింది. అయ్యో ఇంత దూరం వచ్చాక ఆవిడ లేదే అని అనుకున్నాను. కానీ నాతో వచ్చిన ఆవిడ విచిత్రంగా ఆ ఇంటి బయట గ్రిల్స్ తలుపుకి వున్న తాళం తీసింది. అదేంటి ఇది మీ ఇల్లా? అని అడిగాను. కాదు యాదమ్మ ది అని చెప్పింది, అంటే మీరే యాదమ్మ నా? అని అడిగాను, కాదు తాళం నాకు ఇచ్చింది అని చెప్పింది. ఇదేంటో యాదమ్మకి నేనొస్తున్నానని తెలుసా?లెక ఎప్పుడూ తాళం మీకే ఇస్తుందా అని అడిగాను. ఆవిడ ఒక చూపు చూసి( నీ ప్రశ్నలతో చంపకే బాబూ అన్నట్లు) ఇక్కడే కూర్చో మేడం ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ ధుమ్ముపట్టిన ఒక చెక్క కుర్చీ, కొన్ని ధాన్యం బస్తాలు వున్నాయి. ఇంకేమీ లేవు. ఇల్లంటా ధుమ్ము పట్టి వుంది. ఆ ఇంట్లో ఎవరూ కాపురం వుంటున్న సూచనలు లేవు. బయట వరండా ఇలా ధుమ్ము పేరుకొని వున్న ఇళ్ళు, అదీ పల్లెల్లో అసాధ్యం.అంతే కాదు ఈఒక్క గది కాదు తరువాత తలుపుకూడా తాళం వేసి వుంది. పల్లెల్లో ఎవరైన కాపురం వున్న ఇంటికి ఇన్ని తాళాళు పెట్టి పనికి వెళ్ళరు. సో ఈ ఇంట్లో ఎవరూ వుండటంలేదు అని నా మైండ్లో అంతా ఆలోచిస్తూ వున్నాను. అరగంటయింది ఎవరూ రాలేదు. యాదమ్మా రాలేదు, నన్ను అక్కడికి తెచ్చినమ్మా రాలేదు.అసలా వీధిలో ఎవరితో అయినా మాట్లాడదామంటే అక్కడ ఇళ్ళు ఎక్కువగా లేవు, వున్న ఇళ్ళల్లో ఎవరూ లేరు.అందరు పనికి వెళ్ళే టైము కదా నాకు ఇంకా అక్కడే ఎదురు చూడాలా వద్దా అర్ధం కాలేదు. ఈలోగా తాళం వేసి వున్న ఆ లోపల గదిలో ఎవో కొన్ని శబ్దాలు వినిపించాయి. నాకెందుకో ఆ లోపల ఎవరో వున్నారనిపించింది. ఆ శబ్దాలలో ఇందాక నాతో వచ్చిన ఆవిడ వున్నట్లనిపించింది.బహుశా వెనక తలుపు నుండి వచ్చారేమో అని ఇంకాసేపు ఎదురు చూశాను.ఎవరూ బయటికి రాలేదు. ఇంతలో ఒక 8-9 సంవత్సరాల అబ్బాయి అక్కడికి వచ్చి ఎదురింటి దగ్గర కూర్చున్నాడు. మనుషులెవరైనా కనిపిస్తే చాలని ఎదురుచూస్తున్నానేమో వెంటనే బయటకెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళాను, ఆ పిల్లాడు నేను పిలుస్తుంటే సిగ్గు పడుతూ వెనక్కి పరిగెత్తటం మొదలు పెట్టాడు. నేను కూడా వాడి వెనక కాసేపు వెళ్ళాను. ఇక వాడు నాకు దొరకడని నాకు అర్ధం అయి మళ్ళీ వెనక్కొచ్చాను. కానీ ఈసారి ఆ ఇంట్లో ఒక మనిషి కూర్చొని వున్నాడు, ఆ తాళం వేసి వున్న తలుపు తాళం తీసి వుంది, అతను చాలా సన్నగా ఎదో తేడా గా వున్నాడు. ఇందాక లేని ఇంకో కుర్చీ ఎక్కడనుండి వచ్చిందో, ఇతనెక్కడినుండి వచ్చాడో నాకు అర్ధం కాలేదు. నేను లోపలికి వెళ్ళాలో లేక వెళ్ళిపోవాలో కూడా అర్ధం కాలేదు. వెళ్ళిపోతే చెప్పకుండా వెళ్ళినట్లుంటుందని లోపలికి వెళ్ళి అతనితో "ఏవండీ యాదమ్మ ని కలవాలని వచ్చాను...నా పేరు..." అని చెప్పబోయేంతలో అతను "తెలుసు, రా లోపలికి వచ్చి కూర్చో" అన్నాడు. నా పేరు తెలుశా లేక నేను వచ్చిన కారణం తెలుసా అని ఆశ్చర్యపడుతూ కూర్చున్నాను.

(కాస్త టెన్షన్ పడండి ఒక వారం...అప్పటివరకు విరామం!!)

22 comments:

నిశాంత్ said...

రావణ్ అంటే సినిమా గురించి అనుకున్నానండి.
ముందు సినిమానే ప్రస్తావించి మీ కథలోకి తీసుకెళ్ళారు. బాగుందండి. కానీ చివర్లో ఆ సస్పెన్స్ బాలేదండి :-(
బాగా ఇబ్బంది పెట్టారు.
ఇంకో వారం ఆగాలా..!!?
మీ ప్రకృతి ఆస్వాదన నచ్చిందండి.

ఆ.సౌమ్య said...

హమ్మ మీ సాహసాలకి జోహార్లండీ. రాత్రి పూట, ఆ పల్లెల్లో ఒక్కరూ ఎలా తిరిగారో ఏమో...మీ ధైర్యాన్ని చూస్తూ ఉంటే ముచ్చటేస్తున్నాది.

ఇలా ఒక అమ్మాయి అయి ఉండి ఇంత సాహసవంతమైన ఉద్యోగం చెయ్యడం, చేసినదాన్ని మనసారా ఆస్వాదించడం నిజంగా గొప్ప విషయం.

అయినా మీరిలా ప్రతీసారి సస్పెన్సు పెట్టేస్తుంటే కష్టమండీ బాబూ....రాసేదేదో వరసగా రోజూ రాసేస్తూ ఉండండి...వారం అంటే చాలా కష్టం సుమండీ :)

Ram Krish Reddy Kotla said...

శిరీష గారు ఇలా సస్పెన్స్ లో ఆపితే ఎలా చెప్పండి.. అయినా మనం ఎలాగు ఊహిస్తాము కాబట్టి...ఆ తరువాత ఎం జరుగుతుందంటే, ఆ సన్నటి వ్యక్తే "అన్న" అలియాస్ నక్సలైట్.. అతను మీ ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతాడు... అసలు తామెందుకు ఇలా అన్నల్లా మారిపోయారో మీకు చెప్తాడు.. ఆ తరువాత ...హమ్ ఇంకా నేను చెప్పను... మీరు చెప్పేదాకా ఆగుతాను...నేరేషన్ నిజంగా చాలా లైవ్లీగా అనిపించింది.. అన్నీటిని వర్ణించిన తీరు బాగుంది.. మీతో పాటే నేను కూడా అక్కడ ఉన్నట్లు.. మే గ్యాంగ్ లో నేను కూడా ఉన్నట్లు ఫీల్ అయ్యాను :-)

శిరీష said...

@nishanth, thanks for reading my blog and commenting. i write everything i felt and remember about those days. so my posts are really long, so i cant write in a single post(may be that is not good). at the same time i dont have time to write soon

@sowmya, thanks for comenting. that is not my braveness. there are so many ppl working like that. but may be nenu konchem over action chesi vuntanu.

@Ramakrishna garu, :) nannu demands adagadaaniki nenemaina Government naa? kasta opika pattnadi sir, suspense kastapadi create chestunte meeru tuss anipistunnaru.
thanks for ur complements.

Anonymous said...

రాత్రి పూట, ఆ పల్లెల్లో ఒక్కరూ ఎలా తిరిగారో ఏమో...

దెయ్యాలే పారిపోయే పెర్సనాలిటీ ఏమో

శిరీష said...

అనానిమస్, :) ఎమో మీరు చెప్పింది నిజమే అయ్యుంటుంది.

Anonymous said...

శిరీష మీ బ్లాగ్ చదవటం ఇదే మొదటిసారి . మీరు చెప్పే కధ ఊ కొడుతూ వులిక్కి పడేలా వుంది. నిజంగా నాకు మీ బ్లాగ్ చాలా చాలా నచ్చింది

Indrasena Gangasani said...

baagundi... :) :)..naa kooturu kooda mee antha dharyanga samaaja seva cheyyalani korukuntunnanu..

సవ్వడి said...

Really good narration madam....

శిరీష said...

@లలిత, థాంక్స్ నా బ్లాగ్ చదివి కామెంట్ చేసినందుకు.

@ఇంద్రథింక్స్, థాంక్స్ అండి. మా నాన్నగారు భయపడే వారు. కాని చిన్న కరక్షన్, నేను సమాజ సేవ చేయటం లేదు కేవలం నా జాబ్ చేస్తున్నాను.

@సవ్వడి, థాంక్స్ అండి

Unknown said...

మొత్తానికి శిరీష గారు గాంధీజీ కలలు కన్న
స్వరాజ్యం పలాసలో వచ్చిందని నిరూపించారు
అర్దరాత్రి ఆడది స్వేచ్చగా గా తిరగగలిగిన నాడె
దేశానికీ నిజమైన స్వతంత్రం అన్నారు కదా .
మీరేమో మరోప్రపంచం కధ చెప్పేలా వున్నారు .

Unknown said...

మొత్తానికి గాంధీజీ కలలు కన్న స్వతంత్రం పలాసలో వచ్చిందని నిరూపించారు
అర్దరాత్రి ఆడది స్వేచ్చగా తిరగ గలిగిన నాడే నిజమైన స్వతంత్రం అన్నారు కదా .
ఇంతకీ మీరు మరో ప్రపంచం లోకి తీసుకేలుతున్నరేమో?

శిరీష said...

@రవి గారు, నేను అర్ధ రాత్రి తిరగలేదు, ఓన్లీ 9 వరకేమో. సో పలాస లో కూడా రాలేదు స్వతంత్రం

A K Sastry said...

"నేటి భారతం" కి మీలాంటి వాళ్ళ అవసరం చాలా వుంది. బండిమీద వెళ్ళేటప్పుడు పలాస చుట్టుపక్కల లారీలతో జాగ్రత్త!

బై ది వే, వ్యాఖలు చేసేవాళ్ళ పూర్తి ప్రొఫైల్ చూసి మరీ జవాబు ఇవ్వండి.

ముక్కూ మొహం లేని వాళ్ళని బ్లాగు లోకం లోంచి వెలివెయ్యండి.

వాళ్ళ వ్యాఖ్యలు తొలగించండి వెంటనే!

శిరీష said...

@కృష్ణ శ్రీ గారు, చాలా థాంక్స్ అండి. నాకంటే కూడా ఎంతో అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఎందరో వున్నారు. ఈ ప్రశంసలు నిజంగా వాళ్ళకే చెందుతాయి. మీరు కామెంట్స్ గురించి చెప్పిన సలహా ఎందుకో నాకు అర్ధం అయింది. ఈ పేరూ ఊరు లేని మనిషి(బహుసా ఒకరో, ఎందరో) పాపం చాలా కష్టపడి నా పోస్ట్లు చదువుతున్నారు. కాకపోతే ఎందుకో నా మీద కాస్త కోపంగా వున్నారు,

మనం చెప్పినవన్నీ అందరికీ నచ్చాలని లేదు, అలాగే ఒకరు చెప్పే అన్ని విషయాలు మనకి నచ్చాలని లేదు అనే విషయం తెలుసుకో లేక పాపం అలా రాస్తున్నారు.కొన్ని ప్రచురించటం అనవసరం అనిపించినవి అసలు చెయ్యటం లేదు.

Anonymous said...

నీమీద కోపం ముక్కూ మొహము లేని ( ఆ అంకుల్ అనుకుంటున్నాడు) వాళ్ళకెందుకుంటుంది అమ్మాయ్. ఆ అంకుల్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువ అనుకోవాలి గాని. వసపిట్టలా బాగా రాశావనే భావిస్తాను, ఎందుకంటే నాకు పెద్ద పోస్టులు చదివే ఓపిక లేదు, ఏమనుకోకే తల్లి.
మీ అంకుల్ కి లాఫింగ్ థెరపీ చేయించవే అమ్మా. మరీ మూతి అలా బిగదీసుకుని వుంటున్నారు.

శిరీష said...

@అనానిమస్ ??????? థాంక్స్,నా పోస్ట్ చదవకుండానే కామెంటినందుకు

రాజ్ కుమార్ said...

అబ్బా...మళ్ళీ సస్పెన్స్.... :(
SUper ga undandi post..
waiting for part2... :)

భావన said...

బలే ఆసక్తి గా చెపుతారండి మీరు ఏ విషయాన్నైనా. తరువాత తరువాత. మరీ వారం కాదు కాని ఒక రోజు తీసుకుని రాసెయ్యండీ మరి.

sreedevi said...

బాగుంది అనేది చాల చిన్న మాట. నేను చాల బ్లాగ్స్ చదువుతూ ఉంటాను. కానీ మీ అంత బాగా ఆకట్టుకొన్నది ఇంకొకటి లేదు. నేను వెంటనే మీ ఫోల్లోవేర్స్ లిస్టు లో చేరి పోయాను. ప్లీజ్ కీప్ రైటింగ్. ఎంతో మంది అమ్మాయిలకు డ్రీం జాబు మీరు చేస్తున్నారు. మేము కేవలం డ్రీం చేస్తూ ఉంటాము. మీలాంటి వాళ్ళు అ ద్రేఅమ్స్ ని realize చేసుకుంటారు . మీ పోస్ట్స్ అన్ని చదివాను, దమయంతి గారు ఒకసారి చెప్పినట్లు కంప్యూటర్స్ చేసి ఉంటె మా లాగా ఎటూ కాకుండా ఐ mean అటు సొసైటీ కి ఇటు పర్సనల్ కీ సరియన justification చెయ్యలేక ఎందులోను satisfaction లేకుండా అయ్యేవారు. I am very jealous of you .

శిరీష said...

నాకో డౌటు, అనానిమస్ లు అందరు ఒకరేనా???

శిరీష said...

@భావన గారు, త్వరగా రాయాలని నాకూ వుంది కానీ రాయలేకపోతునా. త్వరలో మా ప్రాజెక్ట్ అయిపోయేలా వుంది. వుద్యోగం ఊడిపోతే రోజుకో పోస్ట్ రాసేసి విసిగిస్తా

@@శ్రీదేవి గారు, నా బ్లాగ్ మీకు నచ్చినందుకు చాలా సంథోషం. వెల్కం టు మై వండర్ ల్యాండ్