బిజీ బిజీ బిజీ, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు ఊడిపోయే ఉద్యోగానికి పనెక్కువయ్యింది. మా సునామీ ప్రాజెక్టు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ సెప్టెంబర్ తో ప్రాజెక్ట్ క్లోజ్ చెయ్యాలి. అందుకని ఫార్మాలిటీస్ ఇవాల్యుఏషన్లు అని రకరకాల పనులతో బిజీగా తిరుగుతున్న, పోస్ట్ రాసే మూడ్ కూడా లేదు.5 ఏళ్ళ క్రితం వచ్చాను ఈ నెల్లూరికి. ఇంకో 3 నెలల్లో వెళ్ళిపోతాను. తరువాతి మజిలీ ఎక్కడికో తెలీదు.
రాత్రి 9, అయి వుంటుంది. చెన్నై లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి నేను, షాహిద్, సుద్దర్శన్ ఇంక సుధర్శన్ ఫామిలీ కలిసి బొలెరో లో వచ్చాము.రావటమే డి.ఆర్.ఉత్తమ హొటెల్ కి వెళ్ళాము. ఇక్కడ వున్న స్టార్ హొటెల్. నేను మొదటిసారి హొటెల్ లో ఒక్కదాన్నే వుండాల్సిన పరిస్థితి. ఎప్పుడైన మా ఫ్యామిలీ తో వెల్తే వైజాగ్ లో అందరం కలిసి ఒకే రూం లో వుండేవాళ్ళం. నాకు భయం అనిపించింది అందుకని సుదర్శన్ గారికి(నేను రిపోర్ట్ చేసేది అతనికే) నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వుంటానండి అని చెప్పి వెళ్ళి నా వెలుగు ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వుంటే వెళ్ళాను. ఎన్నో గ్రామాలలో కనీస సదుపాయాలు కూడా లేని ఇంట్లో వుండగలిగాను కానీ ఈ నెల్లూరు వేడికి వాళ్ళ ఇంట్లో పడుకోవటం నా వల్ల కాలేదు. హాయిగా ఎ.సి రూం ఇస్తుంటే నేను ఇక్కడ నిద్రలేని రాత్రులు గడపలా?అని ఆలోచించి మరుసటిరోజు బుద్ధ్హిగా హొటెల్ కి షిఫ్ట్ అయిపొయా. నెల్లూరు వేడి ఆ మజాకా? అప్పటినుండి ఇప్పటి వరకు నెల్లూరు శిరీష అయిపోయాను. ఎందుకంటే వెలుగు శిరీష ని కాదు కదా.అంతే కాదు లక్కీ పుట్టడం నేను ఇక్కడికి రావటం. వాడిని ఎవరైన మీది ఏ వూరు అంటే నెల్లూరు అని చెప్తాడు. అలాంటి నెల్లూరు వదిలి వెళ్ళిపోవాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద మెట్రొ సిటీ రేంజి లో వున్నా, ఇంటి అద్దెలు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా వున్నా, సంవత్సరం పొడుగునా వేసవికాలం, వేడి, చెమటలు తో విసుగొచ్చినా...నెల్లూరు అలవాటైపోయింది. అందుకే వదిలి వెళ్ళాలంటే కాస్తా దిగులొస్తుంది.
కేర్ ఇండియా లో కూడా కొన్ని పొజిషన్స్ తీస్తున్నారు. ఊటీ లో టీ ప్లేంటేషన్ వర్కర్స్ కోసం పనిచేసే ప్రాజెక్టు, ఒరిస్సా లో హెల్త్ ప్రాజెక్టు, బీహార్ లో కూడా హెల్త్ ప్రాజెక్టు ఇలా ఎక్కడెక్కడో వున్నాయి. నాకు మాత్రం హెచ్.ఐ.వి. ఐడ్స్ తో బాధపడుతున్నవారికోసం పనిచెయ్యాలని వుంది. అంత ఈజీ కాదు కదా లక్కీ ని తీసుకొని తెలియని బాష ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా వుండటం. లక్కీ వాళ్ళ డాడీ వచ్చినా ఇక అంత దూరం అంటే చుట్టం లా వచ్చి వెళ్ళాల్సిందే.నా వుద్యోగం ఏమైన స్కూల్ టీచరా హాయిగా 10-4 చేసి ఇంటికి వచ్చేయడానికి. కేంపులు వుంటాయి అక్కడ లక్కీ ని చూసుకోవడానికి తెలుగు తెలిసిన మనిషి దొరికినా కూడా ప్రాక్టికల్ గా ఎన్నో సమస్యలుంటాయి. పిల్లలే అన్ని పరిస్థితులకు త్వరగా సర్దుకుపోతారు అంటున్నారు. కానీ నా భయాలు నాకుంటాయి కదా. ఈ భయాలతో నన్ను నేను చూసుకుంటుంటే అసలు నేను ముందు శిరీష నా కాదా అని అనుమానం వస్తుంది. నా భయాలన్నీ అపోహలేనేమో!అన్ని పరిస్థితుల్లో చక్కగా సర్దుకుపోగలమేమో? ఈ అనుమానాలతో, విపరీతంగా తిరగటం వల్ల నాకు నిద్ర ఎక్కువగా పట్టేస్తుంది. ఏంటి ఆశ్చర్యంగా వుందా! నాకు అంతే ఎప్పుడైన టెన్షన్, దిగులు, బాధ ఇలాంటివి ఏమైన వుంటే విపరీతంగా నిద్రపోతుంటాను. అసలు జీవితంలో 24 గంటల్లో 20 గంటలు నిద్రపోతుంటే ఎంత హాయిగా వుంటుందో కదా. ఇక మిగిలిన 4 గంటలు స్నానం చేసి, ఇల్లు క్లీన్ చేసుకొని, ఊరికే బాగా ఎండా గాలి పీల్చుకుంటే సరిపోయేలా ఎందుకు పెట్టలేదో దేవుడు. అసలు ఆకలి అనేదే లేకపోతే, పొట్ట భాగం లేకపోతే,అన్నం, పప్పు, కూర, సాంబార్ అని ఇన్ని రకాలు తినాల్సిన పని లేకపోతే ఎలా వుండేవాళ్ళం. ఎవరికీ ఉద్యోగాలు అక్ఖర్లేదు, పని కూడా అవసరం లేదు. ఏడ్చినట్లుంది అలా వుంటే లోకం అసలు బాగుండదు. నీ బోడి వుద్యోగం కోసం ఇంత అందమైన లోకం తీరు మార్చేస్తావా అని తిడుతున్నరా? నిజమే ఆకలి వుండాలి, పని వుండాలి, పరుగులుండాలి, తపన వుండాలి, అసంతృప్తి వుండాలి, దానికోసం మనిషి ఎప్పుడూ ఏదో అన్వేషిస్తూ వుండాలి, అప్పుడే జీవం వున్నట్లుంటుంది.
సో, నాలో జీవం వున్నవరకు నేనూ పరిగెడతా, నేనూ ఏదో ఒక పని చేస్తా, జీవన ప్రవాహం లో అడ్డంకులు, ఆటు పోట్లు తప్పవు అవి వుంటేనే అందం కద. అంత పెద్ద డైలాగులు అవసరం లేదు కానీ ఈ హడావిడిలో, అలోచనలలో బ్లాగులు రాసే మూడ్ రావటం లేదు. మళ్ళీ ఎప్పుడు రాయగలనో తెలీదు. అంతవరకు నా పెద్ద పెద్ద పోస్ట్లు అప్పుడప్పుడు చదవి నన్ను గుర్తు పెట్టుకోండి సరేనా?
6 comments:
అయ్యో....నేనిప్పుడే మీ బ్లాగ్ చదవటం మొదలుపెట్టాను అప్పుడే బాయ్ చెప్పేసారే. అలాకాదుకానీ ఇంకోమాట చెప్పండి
@లలిత గారు, నేను బ్లాగు రాయటం ఆపేయను, కానీ కాస్త మూడ్ రావట్లేదు అని చెప్పాను అంతే. తప్పక రాస్తాను, రాయడం నాకు ఇష్టం.
తప్పకుండా శిరీష గారు! మిమ్మల్ని గుర్తుంచుకుంటాం.
ఇక మీరన్నట్లు ఆకలి అన్నదే లేకపోతే... జీవితాలలో ఈ ఉరుకులు, పరుగులు ఉండవు. పోటీతత్వం ఉండదు. మనుషులు కాస్త ప్రశాంతంగా ఉండేవారేమో!
జీవితం లో ఆటుపోట్లు తప్పవు. ఇది కూడా మీరు అన్నదే! కాబట్టి సరదాగా ఉండండి.
మీ చివరి పేరా ఉద్వేగంగా వుండి, కన్నీరు తెప్పించింది అంటే నమ్మండి. కర్తవ్యం, ప్రతిఘటన లో విజయశాంతి ని తలపించారు.
అలా నిరుత్సాహపడిపోతే ఎలా? మాలాంటి పనీపాట లేనివాళ్ళకోసమైనా మీరు రాయాలి.
ఏం పర్లేదు అండి.. ఎన్నో కష్టాలను చిటీకెలో ఎదుర్కుని పరిష్కరించుకున్నవాళ్ళు ఇది కూడా అలానే చేసుకోగలరు. మీరేమి వర్రీ అవ్వకండి. అన్ని చక్కదిద్దుకుంటాయి. మీరు అతి త్వరలోనే బ్లాగ్ రాయటానికి కూడా వచ్చేస్తారు. Dont Worry, Be happy.
Post a Comment