Sunday, August 22, 2010

లవ్, సెక్స్ అండ్ బిజినెస్

(ఈ పోస్ట్ కి ఈ పేరు కి సంబంధం లేక పోతే మాత్రం నన్ను తిట్టుకోకండి. నాకు పేరు తోచలేదు అందుకే ఈ పేరు పెట్టేసా.)

ఆ మధ్య నా కొలీగ్ తో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక అందమైన ఆడ జీవి కనిపించింది. నా మనసులో సంతోషం ఆపుకోలేక తన అందాన్ని నా కొలీగ్ కి వర్ణించాను. "చూడు వినోద్ ఆ షేప్ బ్యాక్ నుండి చూస్తే ఇలాంటి షేప్ బెస్ట్, స్కిన్ చూడు ఎలా మెరుస్తుందో, ఇలా ఆరోగ్యంగా పెద్ద బ్యాక్ తో వుంటేనే అసలు సిసలు జాతి అందం,బాగా పాలు పడతాయి తెలుశా అని చెప్పాను." నా కొలీగ్ నా వైపు చాలా వింతగా చూసి నువ్వు మరీ ఇంత పచ్చిగా  మాట్లాడతావా అని నా వైపు అక్కడ ఎదురుగా వెనక్కి తిరిగి నిల్చున్న ఒకామె బ్యాక్ షేపు ని మార్చి మార్చి చూడటం మొదలు పెట్టాడు. ఛీ ఛీ నేను  చెప్పింది ఆవిడ గురించి  కాదు అక్కడ మేస్తున్న గేదె గురించి అని చెప్పాను. అయినా కూడా మళ్ళీ ఆశ్చర్యపోతూ "నువ్వు గేదె అందం గురించి మాట్లాడుతున్నావా?" అని అడిగాడు.మీకెప్పుడైన అందం అంటే ఎవరు గుర్తొస్తారు, అమ్మాయిలు, చిన్నపిల్లలు, ప్రకృతి, మంచి ఆర్ట్ ఇలా ఏవేవో గుర్తొస్తాయి కదా, కానీ నాకు గేదెలు గుర్తొస్తున్నాయి. నాకు దెయ్యం పట్టిందా అని చూడకండి ఇది నిజంగా నిజం. ఇప్పుడు కాస్త ఆ పిచ్చి తగ్గింది కాని, ఆ మధ్య పశువుల పెంపకం ట్రైనింగ్ తీసుకున్నప్పుడునుండి ఈ పిచ్చి. ఎక్కడైన గేదె కనిపిస్తే చాలు, దాని బ్యాక్ షేప్ ఎలా వుంది, స్కిన్ మెరుస్తుందా లేదా, కొమ్ములు బాగున్నాయా లేదా, నడక బాగుందా లేదా అని చూడటం మొదలు పెట్టాను.

పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు వారి ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రాజెక్టులు చెయ్యటం ముఖ్యం. కూటి కోసమే కదా కోటి విద్యలు. సిటీ లో రకరకాలా పనులుంటాయి చేసి బతకడానికి. కానీ పల్లెల్లో ఏ కుటుంబం చూసినా వారి జీవనాధార గంపలో కనీసం రెండు మూడు రకాల పండ్లు(పనులు) వుంటాయి. అవి కూడా వ్యవసాయము, పశువుల పెంపకం లాంటివే. పల్లెల్లో ప్రతీ వారికి తప్పక ఒకటైన పశువు/ఎనుము/(బర్రె లేదా అవు), వుంటాయి. మరీ పేద వాళ్ళయితే మేకలు, గొర్రెలు వుంటాయి. నిజంగా చూస్తే బర్రెలు, ఆవుల కంటే మేకలే నయం. వాటిని మూవింగ్ బ్యాంక్స్/బ్యాంక్స్ ఆన్ లెగ్స్ అనొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయొచ్చు. తినేది తక్కువ, వాటికోసం చేసే సేవ, కష్టం తక్కువ ఆదాయం బాగుంటుంది. కానీ ఈ బర్రెలున్నాయే.......అదో పెద్ద వ్యాపారం, పని, కళ, కధ ఎదైనా అనొచ్చు. నాకు మనుషుల కంటే కూడా బర్రెలగురించే బాగా తెలుసు అనిపిస్తుంది ఒక్కోసారి.

చిన్నప్పుడు మా ఇంట్లో కూడా పశువులుండేవి అంట. కానీ మా ఇంటికి దూరంగా పశువుల శాల లో వుండేవి. నాకు పాల మీగడలో పంచదార వేసుకొని తినడమే తెలుసు కానీ పశువుల గురించి అసలు ఈ జాబ్ లో జాయిన్ అయిన వరకు ఏమీ తెలీదు. ఎద్దు అన్నా దున్నపోతన్నా మా మమ్మీ నన్ను తిట్టడానికి వాడే తిట్లు అని మాత్రమే తెలుసు. ఇక పశువుల్లో ఆడ మగ తేడా అసలు ఊహకే రాని విషయం.(మా మమ్మీ మాత్రమే, నన్ను మాత్రమే తిట్టే తిట్టు - లెంబెయ్యలా ఏడవకు" అని అర్ధం తెలుశా మీకు?) అలాంటి నేను మీకిప్పుడు ఎన్ని విషయాలైనా చెప్పగలను.

పల్లెల్లో ఆదాయాభివృద్ధి కార్యక్రమం అనగానే గుర్తొచ్చేది ఈ పశువులే, వాళ్ళు కూడా మాకు ఒక గేదెని ఇప్పించండి బాగుపడతాం అంటారు. మొదట్లో అవును కాబోలు, నిజమే ఏముంది ఒక గేదె ఇచ్చేస్తే పోయిందికదా, అది చక్కగా రోజూ పాలిచ్చేస్తుంది, ఆపాలు అమ్మేసుకొని వీళ్ళు అదేదో సినిమాలో వెంకటేష్ లాగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లు అయిపోతారు అనుకునేదాన్ని

అసలు పశువులు ఎక్కడబడితే అక్కడ ఎడ్జస్ట్ కాలేవు.వాటికి అలవాటైన వాతావరణం లో కూడా సరిగా పాలు ఇవ్వాలంటే ఎన్నో కండిషన్స్ అప్లై అవుతాయి.పచ్చి మేత,ఎండు మేత, దాణా, నీళ్ళు, దోమలు, అది వుండే ప్రదేశం, వేడి, వాసన,కాలం ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో విషయాల ప్రభావం వుంటుంది. ఎక్కడో హర్యానాలో బాగా పాలిస్తున్నాయి కదా అని జెర్సీ జాతి ఆవులని ఇక్కడికి తెచ్చి ఇచ్చారు పశు క్రాంతి పధకం లో, చూడడానికి భలే బాగున్నాయి. అది తినే తిండి పెట్టలేక ఆస్థులు అమ్ముకోవలసి వచ్చింది రైతులకి. తీరా తినింది కదా ఇక పాలివ్వొచ్చు కదా!! అహా లేదు అసలు ఇవ్వట్లేదు. కారణాలేంటని మాకొక చర్చ జరిగింది. ఏలూరులో వెలుగులో మా డి.పి.ఎం లు ఆ ఆవుల వెంట తిరిగి, వాటితో పాటు మేతకెళ్ళి, నిద్రపోయి పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటి అంటే ఇక్కడి వేడి తట్టుకోలేకపోవటమే కాక, పాపం ఈ ఆవులు సైటు కొడుతుంటే ఎద్దులకి తెలియటం లేదంట. అర్ధం కాలేదా, సరిగా చెప్తా వినండి. మామూలుగా ఈనిన 21 రోజులకే పశువులు మళ్ళీ ఎదకొస్తాయంట, ఎదకొస్తే మన ఏరియా లో పశువులు నానా హంగామా చేస్తుంటాయి. ఎక్కువగా అరవటం, కట్టు తెంచుకొని పరిగెత్తటం, మిగిలిన పశువుల మీదకి ఎక్కడం లాంటివేవో, చేస్తాయి. గేదలకైతె కొన్నిసార్లు మూగ ఎద వస్తుంది అంటే సరిగా ఎద లక్షణాలు కనిపించవు. అందుకని వేసక్టమీ చేసిన పోతులని మందలో వదలటం లేదా చీకటి గదిలో 2 రోజులు వుంచటం చేస్తారు. ఇలా మన ఏరియా పశువుల ప్రేమ భాషే మనకి తెలీదు. ఇక హర్యానా పశువు ప్రేమ భాష ఇక్కడి ఎద్దులు అర్ధం చేసుకోలేకపోయాయి. ఇలా మనసు విరిగిన ఆవులు పాలు ఇవ్వటం, చూడి కట్టడం మానేసాయి.(లవర్ మీద కోపం వస్తే అమ్మ మీద అలిగి అన్నం మానేసినట్లు) మనకేమైనా సరదా నా వాటిని ఊరికే మేపి కూర్చోబెట్టడానికి.వాటి ప్రేమ, వాటి సెక్స్, వాటి జీవితం అంతా మనం నియంత్రిస్తున్నది ఎందుకు?, మన లాభం కోసమే కదా. అలా అని ఎవరితో బడితే వాళ్ళతో ..ఐ మీన్ దారిన పోయే దున్నపోతులన్నిటితో ప్రేమలో పడకూడదు. మేలు జాతి గిత్తలుండాలి. అవి ఎవరు పెంచుతున్నారు ఈకాలం. వ్యవసాయానికి అవసరమైన రోజుల్లో ,ఎడ్ల పందాల కోసమో వుండేవి. ఇప్పుడు వాటితో అంత వుపయోగం లేదు.ఒక వేళ ఒకటీ రెండూ అక్కడక్కడా వున్నా అవి మేలు జాతి అని గ్యారంటీ లేదు, దీని తల్లి గుణాలు బట్టి మేలు జాతి అవునా కాదా అని నిర్ణయించాలి. ఆవిడెక్కడుందో ఎవరికి తెలుస్తుంది(మనుషులని అలా తల్లి నుండి కుటుంబం నుండి వేరు చేసేసి ఎక్కడో సంతలో అమ్మేస్తే ఎలా అనిపిస్తుంది? ఒక్కోసారి ఇలా సంతలని, పశువులని పరిశీలిస్తే బాధగా అనిపిస్తుంది, వాటికి అసలు తెలుస్టుందో లేదో కాని) ఒక వేళ మేలు జాతి అయినా మహా అయితే 100-150 సార్లు మాత్రమే సెక్శ్ చెయ్యగలదు జీవిత కాలంలో. మన బిజినెస్ టార్గెట్స్ కి ఈ సెక్స్ నెంబర్ ఏమూలకీ రాదు. అదే వీర్యం కలెక్ట్ చేసి పెడితే 2-5 వేల పశువులకి గర్భదారణ చెయ్యొచ్చు. పశువులని చూస్తే వాటి మగ జాతి మీద పాపం జాలేస్తుంది. కేవలం వీర్య దాతలుగా కాక ఇంకెందుకూ అవసరం లేకుండా పోయాయి. కోళ్ళల్లో పెట్టకావాలి గుడ్డు కావాలి, పెద్ద పశువుల్లో చూస్తే ఆవు, గేదె కావాలి పాలు కావాలి. ఆడ దూడ కావాలి.కోడె దూడ కొన్నిరోజులకే తిండి దండగ అంటారు.మేకల్లో కూడా అంతే ఆడ మేక కావాలి చక్కగా సంవత్సరం తిరిగే సరికి 4 పిల్లలు రెండు ఈతల్లో.మేకల్లో ఐతే అసలు మరీ దారుణం మంద అంతటికీ కలిపి ఒకటే మేక పోతు. మరీ ఇంత బహు భార్యత్వమా?? మొదట్లో మేము చాలా ఇబ్బందులు పడేవాల్లం కొన్ని ప్రశ్నలు వెయ్యడానికి. నాబార్డ్ రూల్స్ ప్రకారం 6మేకలు ఒక మేక పోతు కొనుక్కోమని ఒక గ్రామంలో 20 మండికి డబ్బులిచ్చాము. వాలేమో ఊరిలో మంద మొత్తానికి ఒకే మేక పోతు కొన్నారు ఎందుకలా చేశారు అని అడిగితే ఒకటి చాలు మంద అంతటికీ అని చెప్పారు. మా సుధర్శంగారు తనకి వచ్చిన తెలుగులో "అలా అయితే ఎలా బాబు ఒక్క పోతు ఎంత కష్టపడుతుంది అన్ని మేకలతో?" అని అడిగేసారు. ఆ గ్రామస్థులందరు నవ్వి నవ్వి ఎదో బూతు మాట అనేసారు. అతనికి తెలుగు రాదు కాబట్టి అర్ధం కాక బతికిపోయారు, నాకు అర్ధం అయి కానట్లు నటంచేసాను. ఉత్పత్తి దారుడికి కష్టమే తప్ప లాభం పెద్దగా వుండదు ఎలాగూ అందుకే వాళ్ళు ఇవన్నీ అంచనా వేసి ఏది లాభం అని చూసుకుంటారు. ఎదకొచ్చింది కదా అని ఎప్పుడు బడితే అప్పుడు గర్భదారణ చేయించరు. 12 గంటలలోపల చేయించాలి. కానీ పాలిచ్చే పశువులకి కనీసం 4, 5 నెలలు ఎదకొచ్చినా కట్టించరు. గర్భం వస్తే పాలు తగ్గిపోతాయనే అనుమానం తో, కానీ సరైన ఆహారం పెడితే, ఈత, పాల గ్రాఫ్ చూసుకొంటే మొదటి, రెండో ఎదల్లో కట్టిస్తే వాళ్ళకి కూడా లాభం ఎప్పుడూ పాలిస్తుంది మద్యలో ఒక నెల మాత్రం గ్యాప్ తో , కానీ కట్టించక పోవటం వల్ల,అది ఎదకొచ్చీ వచ్చీ ఇక విసుగొచ్చి ఎదకి రావతం మానేస్తుంది. అంతే కాదు ఒక వేల 4, 5 నెలల తరువాత కట్టించినా ఈలోగా పాలు ఆగిపోయి 4,5 నెలలు పాలివ్వకుండా సూడితో వుంటుంది. ఈలోగా బ్యాంకు వాళ్ళు ఇచ్చిన లోను కి
బకాయి పడిపోయి పశువుని అమ్మేస్తారు.

ఎంత చేసినా గేదె పాలు(+ నీళ్ళు), పేడ, ఎరువు అన్నీ కలిపినా ఖర్చులు పోను నెలకి 1500/- అంతే ఒక గేదె నుండి ఆదాయం రాదు. అదీ కొన్ని నెలలు ఎందిపోతుంది కాబట్టి 3,4 గేదెలు వుంటే కాని సరైన ఆదాయం రాదు.ఎక్కువయ్యే కొలది ఖర్చు కూడా. వ్యవసాయం వున్న వాళ్ళకే ఈ పశువులు లాభం.గడ్డి ఖర్చు వుండదు కాబట్టి. లేదంటే వ్యవసాయం లేనివాళ్ళు అప్పులపాలైపోతారు.


ఏంటో ఈ పశువులు, పేడా, పిడకలు అనుకుంటూ ఈ పోస్టు మరీ దూరదర్శన్ వారి పందుల పెంపకం ప్రోగ్రాములా వుందా?అయినా సరే చదివారుగా, అందుకు కృతజ్ఞతగా మీరెపుడైనా పశువులు పెంచాలనుకుంటే నన్నడగండి మీకో మంచి గేదెని సెలెక్ట్ చేసి పెడతాను. అంతే కాదు ఇంకా చాలా మెళుకువలు కూడా నేర్పిస్తాను. అయినా నాలాంటి పిచ్చి కోరికలు ఎవరికుంటాయి? నాకు మాత్రం చక్కగా ఒక 5 ఎకరాలా స్థలం లో అన్ని కాయాగూరలు, పండ్లు చెట్లు వేసి, 4 గేదెలు, 6 మేకలు పెంచుకుంటూ పంపుసెట్టు దగ్గర, కొబ్బరి చెట్ల నీడలో, రావి చెట్టు దగ్గరలో చల్లని తాటాకుల పాకవేసుకొని,ఊర్లో పిల్లలికి ట్యూషన్లు చెప్పుకుంటూ బతికితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది.కానీ అది ఎప్పటికైన నిజమవుతుందో లేదో!! నేను కూడా ఇప్పుడు కాదు, ఈపని ఇక వద్దు అని అనిపించినప్పుడు.

(ఇప్పుడు సడన్ గా నాకు ఈ జంతు ప్రేమ ఎందుకొచ్చిందో తెలుసా, మేము చేసిన ప్రాజెక్టులకు ఎవాల్యూయేషన్, ఆడిట్ జరుగుతుంది కదా ఈ లోపల మళ్ళీ అన్ని ప్రాజెక్టులు చూసి వాటిని చెయ్యడంలో మా వుద్దేశ్యం నెరవేరిందా అని చూస్తున్నాము. వాటిలో భాగంగా ఈ నల్లని నిగనిగలాడే గేదలను చూస్తుంటే ఈ ఆలోచనలన్నీ వచ్చాయి సరే అని పోస్ట్ రాసి పడేసా..)

Friday, August 20, 2010

మీ కడుపున మళ్ళీ అమ్మాయిగా పుడతా

నాకు కొంచెం సహాయం చేస్తారా?

హైదరాబాదు అంటేనే నా గుండె దడ దడా అంటుంది. ఎందుకంటే ఈ మధ్య రెండుసార్లు వెళ్ళి ఆ ట్రాఫిక్ చూసి పిచ్చెక్కింది. ఇక అక్కడే వుండాల్సి వస్తుంది. ఏమైనా జిల్లాల్లో వుండే హాయి అయిన జీవితం సిటీలో వుండదు కదా! పిల్లల స్కూలు, మన ఆఫీసు, ఇల్లు ఇవన్నీ ఎక్కడ కుదురుతాయో చెప్పలేము. నా ఆఫీస్ పంజాగుట్ట, మా హబ్బీ ది ఉప్పల్, మా తమ్ముడు బోరబండ, నేను రోజూ మెదక్, మెహబూబ్ నగర్ వెళ్తుండాలి. ఇదీ టోటల్ గా మేము తిరగబోయే ప్రదేశాలు. తమ్ముడు ఆఫీస్ హైటెక్ సిటీ ఒక వేళ వాడు మాకోసం ఇల్లు మారినా వాడికీ మరీ కష్టం కాకుండా వుండేలా మేము ఇల్లు చూసుకోవాలి. ఇవన్నీ కలిసే ప్రదేశం ఒకటి చెప్పండి. అంతే కాదు అన్నిటికంటే ముఖ్యం మా లక్కీకి మంచి స్కూల్ వుండాలి అదే ప్రధానమైన విషయం. వాడు చదివేది 1 క్లాస్ కానీ ఇప్పటికి వందసార్లు స్కూల్ మారాడు ఇప్పుడైన ఒక మంచి స్కూల్ లో వేసి ఇక మార్చకుండా కనీసం ఒక 5 సంవత్సరాలు వుండేలా వుంచుదాము అనుకుంటున్న. పాపం వాడికి స్నేహితులే వుండటం లేదు. మరీ రుబ్బుడు స్కూల్స్ కాకుండా స్పోర్ట్స్, విలువలు కూడా నేర్పే మంచి స్కూల్ ఏదైన తెలియజేయండి. అలాంటి స్కూల్స్ అసలు మన ఇండియాలోనే లేవంటారా? ఒక వేళ వున్నా లక్షల్లో ఫీజులు గుంజుతారేమో! నన్ను అప్పుల పాలు చెయ్యనిది, లక్కెని కష్టాల పాలు చెయ్యనిది మంచి స్కూల్ ఏదైన తెలిస్తే సలహా ఇవ్వండి. మన బ్లాగర్స్ లో హైదరాబాదీయులు ఎక్కువగా వున్నరనిపిస్తుంది. కనుక నాకు ఒక అనుకూలమైన ఏరియా మరియు స్కూల్ విషయం గురించి సమాచారం ఇచ్చి పుణ్యం కట్టుకోండి. వచ్చే జన్మలో మీ కడుపున మళ్ళీ అమ్మయిగా పుడతా. అస్సలు అల్లరే చెయ్యను.

Wednesday, August 18, 2010

మార్పు కావాలనిపించటంలేదా మీకు?

హాయ్ ఆల్, ఈరోజు నాకు సంతోషించాలో బాధపడాలో తెలియటం లేదు. మా చెల్లి అమెరికాలో వుంటుంది తను కుటుంబపరంగా సమస్యలు ఎదుర్కుంటూ చాలా కష్టమైన పరిస్థితి లో ఇండియా వస్తుంది. ఆ గొడవలతోనే రోజు మొదలయ్యింది.ఇంకా అవే ఫోన్లతో రోజు గడుస్తుంది. అసలు అమెరికా అని ఆస్త్రేలియా అని అంత దూరం ఎందుకు ఇస్తారో ఆడపిల్లల్ని, తల్లి దండ్రులు తోబుట్టువులకి అందరికీ దూరంగా , ఏ కష్టమొచ్చినా పరిగెత్తుకు రావడానికి ఎవరికీ వీలు కాదు. కష్టాలే కాదు సంతోషం అయినా సరే. ఈ గొడవల్లో నా మనసెంత విరిగిపోయిందంటే, ఎంత భయం వేస్తుంది అంటే అసలెందుకు పెళ్ళిళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు, అమ్మ నాన్న తో హాయిగా వుండిపోవచ్చుకదా అనిపిస్తుంది. నాకు ఈ సందేహం ఎప్పటి నుండో వుంది. ప్రస్తుతం వున్న వివాహ వ్యవస్థ ఎప్పుడో మనువు రాసిన రూల్స్ మీద నడుస్తుంది. అప్పటి సామాజిక పరిస్థితి, స్త్రీ పురుషుల మద్య డిఫరెన్సెస్, జీవన విధానం,ఆర్ధిక కార్యకలాపాలు, సామాజిక కార్యకలాపాలు అన్నీ ప్రతీది చాలా వేరుగా వుండేది. అప్పటి కుటుంబం నిర్వహించే విధులు, స్త్రీ పురుషులు నిర్వహించే పనులు, వారి అవగాహన, విద్య, ఎక్స్ పోజర్, చట్టం, న్యాయం అన్నీ ఇప్పుడు మారిపోయాయి. అప్పట్లో పెళ్ళి ఒక మతపరమైన నియమాలకు లోబడి కుటుంబాలు నడిచేవి కాబట్టి అటువంటి రూల్స్ తో జరిగేది. ఇప్పుడు మతాలకి, కుటుంబానికి, జీవన విదానానికి సంబంధం లేకుండా వుంది. కానీ ఇప్పటికి కూడా పెళ్ళి నుండి మనం మనువు చెప్పిన, లేదా మధ్యలో మార్చబడి ఎలాగో వచ్చిన పాత పద్ధతులనే ఆశిస్తూ పెళ్ళి నుండి ఒక పాత కాలపు, బార్యని లేదా భర్తని కోరుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఇవన్నీ ఎదో ఆధారం లేకుండా అనుకోవటంలేదు. 100 జంటల్లో 90 జంటలు సమస్యలతో వున్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఒకవేళ వున్నా కొన్నాళ్ళే. మనం మన రాజ్యాంగాన్ని రాసుకున్నాము, న్యాయశాస్త్రాన్ని రాసుకున్నాము, చట్టాలు చేసుకున్నాము. వీటన్నిటికి ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నాము. అవి కూడా ఎదో మహా గొప్పగా వున్నాయి అందరు వాటితో సంతృప్తి గా వున్నారని చెప్పటం లేదు. సమాజం అంటే క్రిమినల్స్, లాయర్లు, రోడ్లు, భవనాలు, ఆస్తులు, రాజకీయాలు ఇవేనా. కానీ వీటన్నిటికంటే సమాజం అనేది కొన్ని కుటుంబాల సమూహం కదా! అటువంటి కుటుంబ వ్యవస్థ ఎటువైపు వెల్తుంది? మన కుటుంబ వ్యవస్థ అందరికి సెక్యూరిటీని ఇస్తుంది, బార్యా భర్తలకి, పిల్లలకి, ముసలి వారికి, అనారొగ్యం తో వున్న కుటుంబ సభ్యులకి ఇలా అందరికీ మన కుటుంబం ఒక మర్రిచెట్టులా ఆశ్రయం కల్పిస్తుంది. కానీ కొన్ని పాత పద్దతులు, ఎక్స్ పెక్టేషన్స్ వల్ల, కొన్ని అసమానతల వల్ల, స్త్రీ నుండి ఇంకా అప్పటి స్త్రీ లనుండి ఆశించే పద్దతులు, ప్రవర్తన, పనులు ఆశించటం వల్ల సమస్యలు వస్తున్నాయి. చట్టాలు కుటుంబం లో ఎంతవరకు జోక్యంచేసుకోగలవు? వేరే మార్గం లేదా?? ఈ అవసరం వుంది అనేదీ బహుసా చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ అంత ఆవశ్యకత వచ్చేవరకు, పూర్తిగా వ్యవస్థ నాశనం అయ్యేవరకు ఈ సంధి రోజుల్లో పుట్టిన మనమంతా ఈ బాధలు పడాలేమో. ఒక్క స్త్రీలే కాదు ఎందరో పురుషులు కూడా కుటుంబ బారం అంతా మొయ్యాల్సి రావటం వంటి నియమాలతో బాధపడుతున్నారు.కానీ మనది పిత్రుస్వామిక వ్యవస్థ కాబట్టి అప్పటి పద్ధతుల్లో(ఇప్పటికి కూడా) చాలా వరకు పురుషులకు అనుకూలంగా వున్నాయి. సమస్య జటిలం అయిన రోజున ఇద్దరు మార్పు కోరుకుంటారు అనిపిస్తుంది.

ఇదిలా వుంటే ఆఫీస్ కి వచ్చేసరికి ఒక శుభవార్త, నాకు బాలసహయోగ లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ పొజిషన్ కన్ ఫర్మ్ అయిందని, హైదరాబాదు పోస్టింగ్ అని చెప్పారు. నా హస్బెండ్ కూడా హైదరాబాదు వస్తున్నారు ట్రాన్స్ ఫర్ మీద, నా తమ్ముడు అక్కడే వున్నాడు. సో ఇక నేను లక్కీ ఒంటరి వాళ్ళం కాదు. నాకు సిటీ లైఫ్ అంటే ఇష్టం లేక పోయినా అందరు వుంటారు, లక్కీ చదువు బాగుంటుంది అని వెళ్తున్నా. అదీ కాక ఈరోజు నా పుట్టిన రోజు. ఈ రోజు గడిచేలోగా ఎన్ని ఆలోచనలొస్తాయో, ఎన్ని అనుభూతులకు లోనుకావాలో. ఏంటో నా పుట్టినరోజు ప్రతీ సంవత్సరం ఇలాగే విపరీతమైన ఫీలింగ్స్ తో గడపాల్సి వస్తుంది.

Thursday, August 5, 2010

నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలి అనిపిస్తుంది

ఫ్రెండ్ అంటే ఆడ అయినా, మగ అయినా ఒకటే కానీ..నాకేమో రంగురంగుల సీతాకోక చిలుకల్లా, గలగల సవ్వడిచేసే సెలయేటి లా, పైనుండి దూకే జలపాతంలా, సునామీ కెరటం లా,చిరుజల్లుతో తడిపేసే జడివానలా, పాలలా, తేనెలా, పువ్వులా, పసిపాప నవ్వులా, అమ్మ ఒడిలా, నాన్న చేతిలా, అమ్మమ్మ చెప్పే కధలా,తాతయ్య చెప్పే వింతలా, బాలీవుడ్ గాసిప్ లా, టాలీవుడ్ సినిమాలా, హాలీవుడ్ అద్భుతంలా, టీ.వి .సీరియల్ సస్పెన్స్ లా, సాయంకాలం లో కలిగే చెప్పలేని వేధనలా, ఉదయాన్నే కలిగే ఉత్సాహంలా, గెలుపులోని గర్వంలా, అలుపులోని నిద్రలా..... ప్రతి క్షణం కొత్త అనుభవం లా అనిపించే అమ్మాయిలన్నా,వారి స్నేహమన్నా చాలా ఇష్టం. ఉన్న స్నేహితులకి నాకు సమయం కుదరదు,దూరం. మళ్ళీ నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలి అనే కోరిక రోజు రోజు కీ పెరిగిపోతుంది. అసలు పేరుతోనే మొదలైపోతుంది అమ్మాయిల స్నేహంలో విభిన్నత. లత, కవిత, ,చిత్ర, మధు, మీర, సత్య, భామ, ,సువర్ణ, లేఖ, రాధ, నవీన, మిత్ర, బృంద, సునంద, పూర్ణ,శాంతి, వేద, ఇలా ఏ పేరు తీసుకున్నా ఒక కావ్యంలా వుంటుంది, ఒక స్నేహితురాలితో ప్రతిరోజూ కూడా ఒక పండగలా వుంటుంది.

అసలు అమ్మాయిల మధ్య  స్నేహం ఎంత బాగుంటుందో! నాకు ఇంటర్ వరకు చాల మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ వున్నారు. ఆతరువాత డిగ్రీ నుండి ఎందుకో ఎప్పుడూ ఒంటిపిల్లి రాకాసి లా ఒక ఫ్రెండే దొరికేది. అవికూడా ఇక తప్పక చేసిన స్నెహాలో, కలిసి వెళ్ళడానికి రావడానికో అన్నట్లుండేవి. డిగ్రీ లో కవిత, నేను పి.జి గురించి కలలు కంటుంటే తను మ్యారేజీ కలలు కనేది. నేను జాబ్ ఎలా చెయ్యాలని మాట్లాడితే తను మొగుడిని ఎలా కంట్రొల్ లో పెట్టాలో మాట్లాడేది.కానీ అది కూడా బాగుండేది. పి.జి కొచ్చాక హాస్టల్లో రూం మేట్ శాంతి కాస్త నా టేస్ట్ కి తగిన అమ్మాయి. మేమిద్దరం కాస్త బాగానే ఎంజాయ్ చేశాము. కానీ తను ఎక్కువగా టీచర్ అవ్వాలని కష్టపడి చదువుతూ వుండేది. నేను కూడా విపరీతం గా చదివేదాన్ని కానీ ఒక గమ్యం లేకుండా ఏరోజు ఏది నచ్చితే, లైబ్రరీ లో ఆ సెక్షన్ కి వెళ్ళి చదివేదాన్ని. అలాంటి పిచ్చి పనులు నచ్చని గుడ్ గర్ల్ శాంతి. కేంపస్ లో మా క్లాస్ లో రోజూ వచ్చేవాళ్ళలో ఇద్దరే అమ్మాయిలు. నేను, ఇంకో బెంగాలీ అమ్మాయి రాఖీ ఘోష్. రాఖీ ఒక్కతే నాకు తెలిసిన బెంగాలీ అమ్మాయి. ఆమెకి కూడా పెళ్ళి కి ప్రెపేర్ అవ్వటమే జీవితం, పెళ్ళి తరువాత కి అవసరమైన వంటలు, ఇంటి పని, నగలు అంటూ ఎప్పుడూ అదే మాట్లాడేది. కానీ కవితకి, రాఖీ కి ఒక పెద్ద తేడా వుండేది.కవిత ఒక వ్యాపరస్థుడికో, సాధారణ ఉద్యోగస్థుడికో కావలసిన భార్యకి కావలసిన ప్రిపరేషన్ లో వుంటే, రాఖీ ఒక పెద్ద ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ లేదా పెద్ద పొజిషన్లో వుండే భర్త కోసం తగిన లక్షణాలు అంటే గెస్ట్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, పార్టీస్ కి ఎలా రెడీ కావాలి ఇలా..అందరు బెంగాలీ అమ్మాయిలు ఇలాగే వుంటారా అని నాకు అనుమానం వచ్చేది. కానీ పి.జి లో డిగ్రీ లో ఎక్కువ బాయ్ ఫ్రెండ్సే వుండేవాళ్ళు(వేరే అర్ధం లో కాదు) ఎందుకంటే కాలేజిల్లో ఎక్కువగా వాళ్ళే వుండేవాళ్ళు మరి. ఆతరువాత అరుకులో పనిచేసేప్పుడు సరిత అని ఒక అకౌంట్స్ అమ్మాయి నేను మాత్రమే ఆఫీస్ లో . మిగిలిన టైం అంతా ఫీల్డ్ లో అరుకు లో ఒంటరిజీవితం, లేదంటే మా తమ్ముడు, వాడి ఫ్రెండ్సే నా ఫ్రెండ్సు. వాడు అప్పటికి ఇంకా ఇంటర్ చదువుతున్నాడు కాబట్టి అమ్మాయిలంటే కాస్త దూరంగా వుండేవాడు. సో నో గర్ల్ ఫ్రెండ్స్.

ఇక వెలుగులోకి వచ్చాక దొరికారు గుంపులు గుంపులుగా అమ్మాయిలు. ట్రైనింగ్ టైములో, మీటింగ్స్ లో సందడే సందడి. అందులో మొదట చెప్పాల్సింది మాత్రం మాధురి గురించే.మొదటి రోజు టెస్ట్, ఇంటర్యూ అప్పుడు పరిచయం అయింది. గలగలా మాట్లాడేస్తుంది. నా ఫ్రెండ్ శ్రీను తను ఐ.టి.డి.ఎ లో పనిచేశారు కనుక శ్రీను పరిచయం చేశాడు. తరువాత మాధురి నాకు వరుసగా షాకులిచ్చింది.ట్రైనింగ్ లో మొదటిరోజు తనే నాకు ఎక్కువమందిని పరిచయం చేసింది. వీడు రాజా, మీవూరే,వీడు బసవరాజు ఒట్టి తింగరోడు, వీడు,వాడు, ఇది ,అది అని మధు చాలా మర్యాదగా మాట్లాడుతుంటే నేను నోరు వెళ్ళబెట్టుకొని వినేదాన్ని. అంతే కాదు మధు అందరిని వరసలు పెట్టి పిలిచేది. వరసలంటే అక్క, అన్న మాత్రం కాదు. అబ్బాయిలందరినీ "బావా" " మామ",అని పిలిచేది.అమ్మాయిల్ని కొందరిని వదిలేసినా కొందరిని భయంకరంగా "వదినా, మరదలా,పిన్నీ " అని పిలిచేది. నాకు మొదట్లో ఆశ్చర్యం వేసేది. అందరూ చేసేదానికి వ్యతిరేకంగా చెయ్యాలనో ఏమో మరి. అబ్బాయిలందరు హడలిపోయేవాళ్ళు. ఒరే బావా, ఏంటిరా నేను కనిపిస్తున్నా పలకరించకుండా వెల్ళ్ళిపోతున్నావు అని దొంగలా తప్పించుకోవాలని చూసిన వాళ్ళని కూడా పట్టుకొని మరీ పలకరించేది. మాట రౌడీ లా వున్నా మధు అంత మంచి మనసు ఎక్కడా దొరకదు. అందరిని నిజంగా తన మనుషులు అన్నంత ప్రేమ గా చూస్తుంది. పిలుపులోనే కాదు ఆ దగ్గరతనం. చూడడానికి ఒక అస్థిపంజరానికి డ్రెస్స్ వేసినట్లుండే మధు "బావా" అని పిలుస్తుంటే మా టీం అబ్బాయిలందరూ "మధు నువ్వు అలా పిలవకే బాబు, నేను ఆత్మ హత్య చేసుకుంటా" అని బెదిరిపోయేవాళ్ళు. ఒకరోజు మధు ఒక అబ్బాయిని తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. అంతకు ముందు 2,3 సార్లు తనని చూశాను. ఒసే శిరి, వీడు రవి, నేను పెళ్ళిచేసుకోబోయేవాడు అని చెప్పింది. నేను తికమక గా చూసేంతలోనే "ఒరేయ్ రవి, ఇదిగో రా శిరీషా, శిరీషా అని కలవరిస్తున్నావు కదా పరిచయం చేసేసాను, ఇక మీరూ మీరూ చూసుకోండి" అని చెప్పింది. నాకు పై ప్రాణలు పైనే పోయాయి. ఏం చెప్తుంది ఈ అమ్మాయి? తన లవర్ అని చెప్తూ నన్ను కలవరిస్తున్నాడని చెప్తుందేంటి? అని పిచ్చిదానిలా చూస్తున్నా. పాపం నా పరిస్థితి అర్ధం అయినట్లుంది రవి కి(తరువాత మా స్నేహితుడైపోయాడు) "మీరేమీ ఖంగారు పడకండి, మధు అలాగే మాట్లాడుతుంది. మధు ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుండి నేను కూడ అప్పుడప్పుడు వచ్చి చూస్తున్న, మీరు తెలుగు, ఇంగ్లీష్ లలో బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మంచి అనాలసిస్ చేస్తున్నారు, అందరితో స్నేహం గా వుంటున్నారు, ముఖ్యంగా మధుకి పిచ్చగా నచ్చేశారు, మీ గురించె ఏక్కువగా చెప్తుంది, అందుకే పరిచయం చెయ్యమని 2,3 సార్లు అడిగాను అందుకే ఇలా చెప్తుంది"  అని వివరించాడు. హమ్మయ్య అనుకున్నాను. రవి, మధు ల పెళ్ళి మేమే చేశాము. వాళ్ళ ఇళ్ళల్లో ఒప్పుకోకపోవటం వల్ల. ఇప్పటికీ నాకున్న మంచి స్నేహితులు వాళ్ళిద్దరు(ఇప్పుడు ముగ్గురయ్యారు). మధు, నేను  కలిసి ఎవరినైనా ఎదిరించేవాళ్ళం. (ముఖ్యం గా మా పి.డి గారినే) మొట్ట మొదట మాకు ఒక యూనియన్ అవసరమని మేమిద్దరం మా వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టి మొదలు పెట్టాము. అది ఇప్పుడు చాలా పెద్దది అయింది. కానీ మేమిద్దరం అక్కడ లేము.మధు శ్రికాకుళం దగ్గరలో రణస్థలం మండలం లో చేసేది, నాకు చాలా దూరం. మానసికంగా చాలా దగ్గర.

వెలుగు ప్రాజెక్ట్ మొదటి సారిగా సామాజిక అభివృద్ధి అనేది కూడ ఒక ప్రొఫెషన్ చేసి అందరికీ పరిచయం చేశారు. అప్పటివరకు టి.ఐ.ఎస్.ఎస్ (టిస్)వంటి కొన్ని పెద్ద విద్యాసంస్థలు ఇలాంటి ప్రొఫెషనల్స్ ని తయారు చేస్తున్నా కూడా వారెక్కడ వున్నారో, ఏమి పనిచేస్తున్నారో కూడా తెలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్  అన్ని రాస్ట్రాల కంటే అభివృద్ధి కార్యక్రమాలలో బాగుందని మన ప్రాజెక్టు లు చూసి చెప్పొచ్చు. ఎన్నో రాస్ట్రాల నుండి ఇప్పుడు ఇక్కడికి నేర్చుకోడానికి వస్తున్నారు.వెలుగు మొదలైనప్పుడు మా ట్రైనింగ్ కొ-ఆర్డినేటర్ షీబ కూడ టిస్ ప్రొడక్ట్ కావటం వల్ల,మేమంతా లోకల్ కావటం వల్ల కొందరు టిస్ లో చదువుకున్న సోషల్ వర్క్ ప్రొఫెషనల్స్ ని మాతో పాటు తీసుకుంటే వారి నుండి కూడ మేము నేర్చుకోవచ్చనే వుద్ధేశ్యంతో మా పి.డి గారు కూడ కేంపస్ ఇంటర్యూలు చేసి టిస్ నుండి,ఐ.ఆర్.ఎం.ఎ(ఇర్మా) నుండి, అగ్రికల్చర్ కాలేజీలనుండి, ఇంజనీరింగ్ కాలేజీలనుండి మొత్తానికి ఒక 20 మంది ని 2 వ బ్యాచ్ లో తీసుకున్నారు. అందులో వచ్చిన వాళ్ళలో టిస్ వాళ్ళు కొన్నాళ్ళు వున్నారు. మిగిలిన వాళ్ళు చాలా కారణాల వల్ల 90% మంది వెళ్ళిపోయారు.

వచ్చిన వాళ్ళల్లో ఈ టిస్ వాళ్ళు వింతగా కనిపించేవాళ్ళు. మా దేశవాళీ ఆవుల మందలో జెర్సీ ఆవుల్లా అన్నమాట. ఇక అప్పటితో నాకు ఎక్స్ ట్రా డ్యూటీ పడింది. వాళ్ళకి ట్రైనింగ్ లో వాళ్ళకోసం మా వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ లో తిరిగి చెప్పటం. ఇలా వచ్చిన 20 మంది లో ముఖ్యంగా చెప్పుకో వలసిన వాళ్ళు 4 మందే. వాళ్ళే కొంత ప్రభావం చూపి వెళ్ళిపోయారు. వారిలో చిత్ర రామస్వామి, శోభా రాఘవన్, సిసీలియా, ఇకో అబ్బాయి(నాకు పేరు గుర్తులేదు). ఆ అబ్బాయి చాల తక్కువ రోజులు వున్నాడు. తను ఒక విజువల్ ఇంపైర్డ్(కళ్ళు కనబడవు చిన్నప్పటినుండి).నేను మొదటి సారి అటువంటి వ్యక్తితో మాట్లాడటం. తను చాలా తెలివైన వాడు. కళ్లు లేకపోవటం వల్ల అనుకుంటా మిగిలిన విషయాలలో చాలా షార్ప్ గా వుడేవాడు. మా శబ్ధం, వాసన పసిగట్టి చెప్పేవాడు ఎవరు వచ్చింది అని. కానీ 2 వారాలు కూడా వుండలేకపోయాడు.

ఇక శోభ, విపరీతమైన మొండి ఘటం. తను నమ్మేదానికోసం ఎవరితో అయినా పోట్లాడేది. సీతంపేట ఏజెన్సీ లో ఎవరూ తిరగనన్ని గ్రామాలు ఒంటరిగా తిరిగింది. తిండి, నిద్ర,స్నానం లాంటి అవసరాలు కూడా పట్టించుకోకుండా పనిచేయగలిగే ప్రొఫెషనలిజం. కానీ సర్దుకుకుని పోవటం, పెద్ద ప్రాజెక్టులో పనిచేసేప్పుడు ఎక్కువమంది ప్రయోజనం కోసం కొందరిని విస్మరించాల్సి రావటం తను సర్దుకోలేకపోయింది. అందుకని ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. తనని జాబ్ లోనుండి తీసేసారు. కానీ తను వస్తాను అని చెప్పిన గ్రామాలన్నీ,చేస్తాను అన్న పనులన్నీ పూర్తి అయిన వరకు జీతం రాకపోయిన, ప్రాజెక్టులో వెలివేసినా పని పూర్తి చేసి వెళ్ళింది.తనని చూసి ఎందరో అబ్బాయిలు ఫీల్డు కి వెళ్ళటం నేర్చుకున్నారు. చెప్పిన మాట పై నిలబడటం...నాకెంతో నచ్చింది.మా టీంలో వున్న రెడ్డీ, శోభా ని కొన్నాళ్ళు సీతంపేట వేశారు. రెడ్డీ తో పాటు మాదగ్గరకి తన ఫ్రెండ్ చిత్రకోసం ఎక్కువగా వస్తుండేది.అలా శోభ కూడా నాకు ఫ్రెండ్ అయ్యింది.సీతంపేట ఐ.టి.డి.ఎ శోభ అంటే అందరికి ఒక వింత, కొందరికి అద్భుతం, కొందరికి భయం.

మా వజ్రపుకొత్తూరు టీం లో నేను ఒక్కదానినే అమ్మాయిని, ఒక సంవత్సరం పాటు అబ్బాయిలతో స్నేహాం బోర్ కొట్టేసిన సమయంలో చిత్ర వచ్చింది. సన్నగా పొడుగ్గా టిస్ టీం లో కాస్త అమ్మాయిలా అనిపించే ఫిగర్(మా టీం అబ్బాయిల మాటల్లో చెప్పాలంటే).చిత్రకి వాళ్ళ అమ్మా నాన్న కంటే శోభ అంటే ప్రాణం. శోభని జాబ్ లోనుండి తీసేస్తె చిత్ర కూడా వెళ్ళిపోయింది. నాకు ఎంతో లోటు చేసి వెళ్ళిపోయింది. చెప్పాలంటే మేమిద్దరం పెద్ద గొప్ప స్నేహితులమా అంటే కాదు.కానీ మేమిద్దరం కలిసి చాలా సంతోషంగా వున్నాము. తను కేరళ అమ్మాయి. వచ్చీ రాని తెలుగుతో, అబ్బాయిలాంటి గొంతుతో, విపరీతమైన ఎనర్జీతో వుండేది. చిత్ర అప్పుడప్పుడు కొబ్బరినూనె తో వాళ్ళ వంటలు చేసేది. తన ఎదురుగా తిని పక్కకెళ్ళి ఊసేసేవాళ్ళం. చిత్ర కి ప్రతీ విషయంలో చాలా క్లారిటీ వుండేది.అలా అని మొండి కాదు. చాలా ఓపెన్ మైండ్. అందరి ఆలోచనలు అభిప్రాయాలు విని ఎంకరేజ్ చేసేది.నాకు మాత్రం ఎన్నాళ్ళ లోటో తీర్చడానికే చిత్ర వచ్చినట్లనిపించింది.నేను తనకోసం ఇంగ్లీష్ మాట్లాడినా మొదటి రోజే చెప్పేసింది తెలుగు లోనే మాట్లాడు, నేను నేర్చుకోవాలి అని. కొన్ని రోజులకే బాగా నేర్చేసుకుంది. తనతో వచ్చిన వాళ్ళెవరికీ రాలేదు కానీ చిత్రకి వచ్చేసింది.అప్పటివరకు నేను చాల విషయాల్లో ఎవరో ఏదో చెప్పిన వాటినే నిజమని అభిప్రాయాలు ఏర్పర్చుకునే దాన్ని. కానీ చిత్ర స్వంతంగా తెలుసుకునే వరకు ఏ అభిప్రాయం చెప్పేది కాదు. తన అభిప్రాయం అందరికీ నచ్చనిది అయినా చెప్పేది. ఏ పనికి కూడా ఎవరి మీదా ఆధార పడేది కాదు. నేను ఒక బకెట్ నీళ్ళు మొయ్యాలంటే, పెద్ద బరువు మొయ్యాలంటే, దూరం వెళ్ళాలంటే అబ్బాయిల మీద ఆధారపడేదాన్ని. చిత్రకి కూడా ఆపనులు కష్టమే అయినా వేరే విధంగా చెయ్యాలని చూసేది కాని ఎవరి మీదా ఆధార పడేది కాదు. పూర్తిగా బకెట్ మొయ్యలేకపోతే నాలుగుసార్లు కొంచెం కొంచెం మోసేది. భాష రాకపోయినా ఒక్కతీ ఎంత దూరమైనా వెళ్ళేది. ఎక్కువ దూరాలు ప్రయాణం చేసేప్పుడు నేను టాయిలెట్ కి వెళ్ళాల్సిన అవసరం వున్నా కంట్రోల్ చేసుకొని బాధపడుతుండేదాన్ని. చిత్ర సిగ్గు పడకుండా అందరికీ చెప్పి మరీ వెళ్ళేది. ఇలా ఎన్నో. ఎన్నో భయాలు, సిగ్గులు, మొహమాటాలు, కన్ ఫ్యూజన్ పోగొట్టింది మా అందరిలో. తనకి బైక్ నడపటం వచ్చినా, నాకు రాదని తెలిసినా నా బైక్ మీద ధైర్యంగా వెనక కూర్చొని వచ్చేది. ఎప్పుడూ కూడా నేను నడుపుతా అని నన్ను కించపరిచేది కాదు. (చాలా మంది అబ్బాయిలు మాత్రం ఇది తప్పక చేస్తారు - రకరకాల కారణాలతో). మేమిద్దరం అక్కడి నిర్మానుష్యంగా వుండే సముద్రపు ఒడ్డు చూసుకొని వెళ్ళేవాళ్ళం. వజ్రపుకొత్తూరు మండలంలో కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుండేవి. వాటి మీదనుండి కిందకి దొర్లుతూ ఇసుక పోసుకుని అల్లరి చేసేవాళ్ళం. జాలరి వాళ్ళు "ఐల వల"లాగుతుంటే(చాలా పెద్ద వల , చిన్న చిన్న రంధ్రాలతో మొత్తం సముద్రంలో చేప గుడ్లతో సహా వచ్చేస్తాయి అందుకే గవర్నమెంట్ దానిని బ్యాన్ చేసింది. కానీ ఐల వల ఊరికి ఒకటి వుంటే ఆ ఊరికే గొప్ప గా భావిస్తారు, ఐల వల ఉదయం గాని, అర్ధరాత్రి కానీ కొందరు వెళ్ళి వేసి వచ్చేస్తారు. తరువాత వేకువన లేదా మధ్యానానికి ఊర్లో వున్న ఆడ,మగ, పిల్ల ముసలీ అందరూ కలిపి ఆ వలని లాగుతారు), నేను చిత్ర కూడా వాళ్ళతో పాటు వల లాగే వాళ్ళం.ఉదయాన్నే చెంబు పట్టుకొని జీడితోటలోకి వెళ్ళటంతో మొదలుపెట్టే వాళ్ళం కబుర్లు, ఫీల్డ్ కెల్తూ, తిరిగివస్తూ, దారిలో ఎదో ఒక తోటలో ఆగిపోయి, రాత్రి డాబా మీదకెళ్ళి, నిద్రపోతూ కూడా ముగిసేవి కాదు. చిత్ర డిగ్రీ షూ(పాదరక్షలు) మేకింగ్ కోర్స్ చేసింది, ఇంటర్  బిట్స్ పిలానీ, పి.జి సోషల్ వర్క్ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా చదివింది(నాలాగే).కేరళ లో పుట్టి పెరిగి,ముంబైలో చదివి వచ్చిన చిత్ర జీవితం నాకు వింతగా వుంటే, చిన్న టౌన్లో పుట్టి, ఏదో చదివి, ఏదో చేస్తున్న నా జీవితం చిత్రకి వింత.తను వున్నన్ని రోజులూ ఎప్పుడూ ఉత్సాహంగా పరిగెత్తే వాళ్ళం.గట్టిగా నవ్వే వాళ్ళం, కోడి ని వెంటపడి పరిగెత్తి పట్టుకుని తెచ్చి గూట్లో పెట్టే వాళ్ళం, అదిపెట్టిన గుడ్లన్నీ పొదిగించి పిల్లలు అయితే మురిసిపోయాము, పొదుగుతున్న పెట్టని మహరాణిలా చూసుకున్నాము,కోడిపిల్ల చనిపోతే కూర్చొని ఏద్చాము...మా ఇద్దరికీ ఆరోజులు మాళ్ళీ వస్తాయా?

ఆ తరువాత నాకు మళ్లీ ఇంతవరకు స్నేహితులే లేరు. తరువాత ఏలూరు లో మేనేజీరియల్ పొజిషన్ కి వచ్చేసా.ఇక ఆ స్తేజ్ కి వచ్చాక స్నేహితులు దొరకటం కష్టమేమో!ఎక్కువగా ఈ పొజిషన్స్ లో మగవారుంటారు. ఒక వేళ ఆదవాళ్లున్న పెళ్లి అయి పిల్లలు, ఇల్లు ,ఆఫీసు పని తో సతమతమవుతుంటారు. నోరు తెరిస్తే మా ఆయన, మా అత్తగారు, మా తోడికోడలు, మా పాప, మా బాబు ఇవే మాట్లాడతాము. నేను కూడా అంతే. స్నేహానికి సమయం, మనసు, ఓపిక వుండదు. మగవారితో స్నేహాలు కుదిరే అవకాశం వుంటుంది కానీ ఏమో ఎందుకో కుదరదు.కొంత వ్యక్తిత్వం ఏర్పడిపోయాక అనుబంధాలు,బంధాలు అంత సులభంగా ఏర్పడవు అనిపిస్తుంది నాకు.ఏలూరులో హాస్టల్లో వుండేదాన్ని, ఆ హాస్టల్లో నేను ముగ్గురం జాబ్ హోల్డర్స్ మిగిలినవారంతా కాలేజీ అమ్మాయిలు.అక్కడ కూడా పెద్దగా స్నేహం కుదరలేదు. ఆతరువాత మళ్ళీ కేర్ లో జాయిన అయ్యాను.ఇక్కడ మా నెల్లూరు ఆఫీసులో నేనొక్కదాన్నే మిగిలిన స్టాఫ్ అందరు మగవాళ్ళే.ఎప్పుడైన స్టేట్ ఆఫీసుకి వెళ్తే అప్పుడు మాత్రం మీరా, సత్యభామ కాస్త మాట్లాడే అవకాసం, హొటెల్ రూములో కలిసి గడిపే అవకాశం వుంటుంది.నాకు ఒక అనుమానం స్నేహం అంటే మనం అనుకుని చేస్తామా? లేక అదే అవుతుందా? పువ్వుతో పాటు పరిమమళం లా, జాబిలితో పాటు వెన్నెల లా, సహచర్యంతో పాటు వచ్చేదే స్నేహం అని నా అభిప్రాయం. మనం వున్నంత కాలం ఆ స్నెహ పరిమళం, చల్లని వెన్నెల లా మనకి సేద తీరుస్తుంది.

"అందరికి స్నేహితులరోజు శుభాకాంక్షలు" (నా స్నేహితులు పంపిన ఎస్.ఎం.స్.లు లేట్ గా చూస్తూ వారందరిని గుర్తుచేసుకొని ఈ పోస్ట్ వ్రాస్తున్నా,ఇది నా స్నేహితులందరికీ అంకితం)