Monday, March 1, 2010

నీలయ్య ఇచ్చిన షాక్ మీద షాక్

పోయిన సారి పోస్ట్ లో మొత్తం గిరిజనుల ప్రాంతంలో పండగలు వాటి విశేషాలు చెప్పాను, ఈ సారి నాకు పరిచయం వున్న, కొంచెం ఎక్కువగా నా మీద ప్రభావం చూపిన గిరిజనులు వారి భావాలు చెప్తాను. నీలయ్య గురించి పరిచయం చేసా కదా.ఈసారి నీలయ్య గురించి పూర్తిగా చెప్తా. నీలయ్య ఒక గిరిజన వ్యక్తి (కాని ప్యాంటు వేసుకుంటాడు) అరుకు ప్రాంతంలో గ్రామాలలో వాళ్ళు చిన్న గోచి పెట్టుకుంటారు లేద మోకాళ్ళ వరకు అడ్డపంచె కట్టుకుంటారు.ఆడవాళ్ళైతే మొకాళ్ళు దాటే వరకు చీర కట్టుకుంటారు. జాకెట్ వేసుకోరు. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు జాకెట్ వేసుకోవటం మొదలుపెట్టారు. మగ వాళ్ళు కూడా షర్టు పాంటు వేసుకుంటున్నారు. మరీ లోపల గ్రామలలోకి వెళ్తే బోండ్ తెగ మొదలైన వాళ్ళు వుంటారు, వాళ్ళు కేవలం పూసలు, చెట్టు బెరడు లాంటివి మాత్రం మొలకి చుట్టుకుంటారు. 

నీలయ్యని నాకు తోడుగా, గైడ్ గా వుంచారు. నీలయ్య మొహంలో ఎటువంటి ఫీలింగ్ కనిపించదు. అన్నివిషయాలు ఒకేలా చెప్తాడు. నేను ఎం.ఎ లో వున్నప్పుడు కాస్త వైజాగ్ అంత నడవటం వలన నాకు నడక పెద్ద కష్టం అనిపించేది కాదు. కాని నీలయ్యతో నడవటం నా వల్ల అయ్యేది కాదు. అతని ఒక అడుగు నాకు నాలుగు పెద్ద పెద్ద అంగలు. అలాంటిది నీలయ్యతో పాటు కొండ ఎక్కి టైం కి అనుకున్న గూడెం (చిన్న గ్రామం) ఎప్పుడూ చెరలేకపొయాను. అయిన నీలయ్య ఫేస్ లో కనీసం అలసట, కోపం, చిరాకు ఏమి కనిపించవు.ఒక సంవత్సరం అతనితొ అడవుల్లొ వెళ్ళాక  నీలయ్య కి సంబందించి నేను కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కనుక్కోగలిగాను. అది ఆకలి. అతనికి ఆకలి వేస్తె వెంటనె చుట్టూ ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తాడు. అప్పటివరకు కేవలం నడిచెవాడు ఆకలేస్తె కాస్త చుట్టుపక్కల గమనిస్తాడు. నేను ఏవో పండ్ల చెట్లు వెతుకుతున్నాడెమో అనుకునేదాన్ని. కాని నాకు కనిపించని ఏవెవొ జంతువులు అతనికి అమాంతం దొరికిపొయేవి, లేదా అతని చిన్న కత్తికి, కర్రకి బలి అయిపోయేవి.ఒక సారి అలాగే ఒక గూడెం వెళ్ళాలని నేను ఉదయాన్నె పెద్దపర్వతావహరోహికురాలి లాగా వెనుక ఒక పెద్ద బాగ్ తగిలుంచుకొని రెడీ అయ్యా. అందులో బిస్కెట్ పేకెట్లు, బ్రెడ్,వాటర్ బాటిల్లు, టవల్, బట్టలు మొదలైనవి పెట్టుకున్నా. నాకంటే నా బాగ్ బరువెక్కువయ్యిందనిపించినా మొదటిసారి కాబట్టి వాటి అవసరం వుండదని తెలీదు కాబట్టి అలా రెడీ అయ్యాను. 

తీరా కొంచెం కొండ ఎక్కేసరికి  నా బాగ్ తో పాటు నన్ను కూడ ఎవరైన మోస్తె ఎంత బాగున్ను అనిపించింది. కాని నీలయ్య చేతులు వూపుకుంటూ నడుస్తున్నాడు. మన లాగా వాళ్ళకి అటువంటి మర్యాదలు తెలీవా అనిపించింది. కాని నా బాగ్ ఎవరో మొయ్యాలనుకునే నేను ఎందుకు అంత లగేజి తేవాలి అని ఆలొచించి నోరుమూసుకున్నా. 11 అయ్యె సరికి నేను సగం బాగ్ ఖాలీ చెసేసా. నీలయ్యని అడిగినా తను ఎక్కువగా తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. అప్పుడు నీలయ్య సడన్ గా ఒక చిన్న కుందేలు ని పట్టుకున్నడు. నేను పెంచుకోడానికి గిఫ్ట్ గా ఇస్తాడేమో అనుకున్నా.కాని నా సంతొషం చూసి కూడా ఏమి జవాబు చెప్పకుండా దాన్ని తీసుకొని పక్కకి పొయాడు. కాసేపటికి చేతిలో కొన్ని పెద్ద ఆకులతొ ఒక పొట్లం లా చుట్టి తీసుకొచ్చాడు. ఆ ఆకుల పొట్లాం చుట్టూ తడిపిన మట్టిని మెత్తాడు. దగ్గర్లో వున్న ఎండు పుల్లలు, ఆకులు ఒక చోట చేర్చి నిప్పు చేసాడు. నాకు అప్పటికే కళ్ళల్లొ నీళ్ళు. అయ్యో కుందేలు చచ్చిపోయిందే అని.(కాని నేను తినే చికెన్ మటన్ అప్పుడు గుర్తురాలేదు). ఆ మట్టి మెత్తిన పొట్లాన్ని ఆ నిప్పుల్లొ పడేసాడు. కాసేపయ్యక ఆ పొట్లం తీస్తే అది గట్టి పడింది. దాన్ని జాగ్రత్తగ విరగ్గొట్టాడు.మట్టి అంతా పడిపోయాక ఆకుల్లో మాంసం వేడి ఆవిరికి వుడికింది. నన్ను తింటావా అని అడిగాడు. వద్దు అన్నా. మళ్ళీ అడగకుండా మొత్తం తినేసాడు. కుందేలు మాత్రమే కాదు అన్ని జంతువులు తినే వాడు. పాములు కూడా కొన్ని రకాలవి తింటారు. నీలయ్య మాత్రం స్పెషల్ ఇది అది అనుకూకుండా అన్ని జీవాలకి న్యాయం చేస్తాడు. నాకు కూడా కొన్నాళ్ళకి అసహ్యించుకోవటం, బయపడటం తగ్గింది. వాళ్ళ తిండి ని అసహ్యించుకోవటం వాళ్ళని అవమానించటమే అనిపించింది.అరకు ట్రైబల్స్ పొదల్లో దొరికే "బుడ్డలు" అనే చిన్న చిన్న పురుగులు నిప్పుల్లొ వేయించి బంధువులు వస్తే స్పెషల్ అని పెడతారు. చూడడానికి మన రొయ్యల్లా వుంటాయి. కాని పురుగులు అని తెలిశాక మనం తినలేము కద!! నీలయ్య తో మాట్లాడటం, తన తెలుగు అర్ధం చేసుకోవటం వచ్చాక మా ఇద్దరికీ స్నేహం  బాగానే కుదిరింది. నీలయ్యకి అందరు చెసే పొలం పనులు, పోడు చేస్తే లాభం లేదని, కష్టం తప్ప ఏమి వుండదని అభిప్రాయం. ఇలా ఈ ఎన్.జి.ఒ తో లెదా అరుకు లో టూరిస్ట్ల కోసం, గవర్నమెంట్  వాళ్ళకోసం, మిషనరీ వాళ్ళకోసం తెలుగు నేర్చుకొని పనిచేయటమే లాభం అని చెప్తాడు. అప్పుడు వైజాగ్ వెళ్ళొచ్చుకదా అంటే అక్కడ అడవి లేదు కదా అనేవాడు. అడవి వాళ్ళ కి శ్వాస లాంటిది అని అనిపించింది. నాకెందుకు నేను పుట్టిన ఊరు వదిలి వెళ్ళలేనని అనిపించదు అని ఆలోచించేదాన్ని. సమాధానం దొరకలేదు. 

నీలయ్య ఎప్పుడూ షాక్ ఇచ్చెవాడు. ఒక రోజు ఎప్పుడు కాసేపు ఆగి కూర్చుందాము అని అడగని నీలయ్య "మాడం, ఇక్కడ కున్సేపు కూసూని యెల్దావ్" అన్నడు. ఆహా నడకలో నేను నీలయ్య నే ఓడిస్తున్నను అని ఆనందపడుతూ దగ్గరలో రాయి మీద కూర్చోబోయా. "ఆడొద్దు, సెట్టెక్కు " అన్నాడు. ఎందుకు అంటే " ఇప్పుడే పెద్ద పిల్లి యెల్లింది, కూసేపు ఆగి యెల్దావ్" అన్నాడు. పెద్ద పిల్లి అంటె "పులి". వాసన తో  పసిగట్టాడంట, గుండెలు దభ దభా అని కొట్టుకుంటుండగా నెమ్మదిగా చెట్టెక్కి కూర్చున్నా. నాకు చెట్టు ఎక్కటం వచ్చని నాకు కూడా అప్పుడే తెలిసింది.కాని నీలయ్య ముఖం లో ఎప్పటిలాగే ఎటువంటి ఫీలింగ్ లేదు.

ఎప్పుడు ఫేల్డ్ కి వెళ్ళినా చీకటి పడే వేళకంటే ముందు ఎదో ఒక గూడెం చెర్చేవాడు నీలయ్య. ఆశ్చర్యం గా అన్ని గూడేలలో నీలయ్యకి తెలిసిన వాళ్ళుంటారు. గిరిజనులు మా కోసం అన్నం వండేవాళ్ళు. వాళ్ళు అంబలి, మాంసం, వుడకబెట్టిన దుంపలు తింటారు (ఇప్పుడు డైటింగ్ పేరుతో నేను కూడా అవే తింటున్నాను).విప్ప సారా, అరటి పండ్ల సారా మొదలైనవి తాగుతారు. . నేను ఎప్పుడూ 2 రోజులకంటే ఎక్కువ కంటిన్యూ గా ఫీల్డ్ కి వెళ్ళలేదు. నాకు అలవాటు చేసుకోవటం లోనే సరిపోయింది, అందులో ఎక్కువ సమయం నడకతోనే సరిపోయేది. నిజంగా వాళ్ళ గురించి అర్ధం చేసుకొని పని చేయాలంటే అక్కడే కొన్ని రోజులు వుండగలిగే వాళ్ళు పనిచెయ్యాలి.ఒక రోజు ఫీల్డ్ నుండి తిరిగి అరకు ఆఫీసు కి వస్తున్నాము. కాస్త చీకటి పడింది.అక్కడ ఎదో శవం కాలుతుంది, ఆ ఆలొచనతో భయపడకుండా వుండాలని నీలయ్య తో మాటలు మొదలుపెట్టా. నీలయ్యని కాసేపు ఆటపట్టిద్దామని, నీలాయ్య నువ్వు తినని మాంసం ఎదైన ఒకటి చెప్పు అన్నాను.దానికి నీలయ్య అస్సలు ఆలొచించకుండా సమాధానం చెప్పడు. " అన్నీ తిన్నా మాడం  ఒక్క మడిషి మాసం తినలేకపోయా" అన్నాడు.  ఓహూ ఏమి పాపం ఎందుకు తినలేదు అని అడిగాను, "ఒకసారి శవం కాలుస్తుంటే తీసి తిందామనుకున్న్నాను...కాని మా ఊర్లో వాలు కొట్టారండి నన్ను" అని చెప్పాడు. అప్పటివరకు జోక్ చేస్తున్నడేమో అని నవ్వుతున్న నేను అతని సిన్సియర్ జవాబు విని ఒక్కసారిగా షాక్ తో ఆగిపోయాను.నీలయ్య మాత్రం ఆగకుండా చెప్తూ నడుస్తూ పోతున్నాడు. "మల్లీ ఎప్పుడైన ఒకసారి తింటాలే సచ్చేలోపు" అని ముగించాడు.

అలా నీలయ్య ఇచ్చిన షాక్ కి నేను భయపడి..ఒంటరిగా దొకితే నన్ను తినేస్తాడేమో అని చాలా రోజులు మా చైర్మన్ గారు ఎంత నచ్చ చెప్పినా నీలయ్యతో ఫీల్డ్ కి పోలేకపోయా. కాని గిరిజనుల అమాయకత్వం, నిజాయితీ, కల్మషం తెలియని మాటలు, స్వచ్చమైన చేతలు వాళ్ళని ప్రేమించేలా చేస్తాయి.

అక్కడ నేను వున్నన్ని రోజులు నీలయ్య నాతో ఫీల్డ్ కి తోడుగా వచ్చాడు. నా అవసరాలన్నీ నేను చెప్పకుండానే తెలుసుకుని ఒక్క మాటకూడా మాట్లాడకుండా నాకు అన్నీ చేసేవాడు.మనుషుల మధ్య భాష పెద్దగా అవసరం లేదని భావప్రకటన కి,  భాష కంటే మౌనం చాలా విషయాలను తేలికగ చెప్పేస్తుందని అనిపించేది. ఎందుకంటే అక్కడ నీలయ్య మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళినా, మా మద్య భాష సమస్య వల్ల మౌనం ఎక్కువ నేర్పేది.

నీలయ్య ఏమనుకున్నడో ఏమో ఒక రోజు "మాడం నువ్వు మాకు తెలివి లేదు అనుకుంటున్నావు కదా" అని అడిగాడు. "లేదు నీలయ్య నేను అల అనుకోలేదు అని చెప్పాను".నమ్మాడో నమ్మలేదొ నాకు అర్ధం కాలేదు. నా మనసులో మాత్రం పాపం గిరిజనులుకి ఏమి తెలీదు అనే భావం వుండేది. అప్పుడు ఒక గూడెం వెళ్ళాల్సి వుంది కాని నీలయ్య రూటు మార్చి తీసుకెళ్తున్నాడు అని డౌటు వచ్చింది (నిజం చెప్పాలంటే భయం వేసింది..ఏంటి నా జీవితం తో నేను ఏమి చేస్తున్నాను? ఎందుకు ఈ కొండల్లో తుప్పల్లో ఎవరో తెలియని ఒక గిరిజనుడి వెంట తిరుగుతున్నాను అని ఒక్కసారి శరీరం చల్లబడినట్లైపోయింది) ఏమి అడగడానికి, ఆలోచించడానికి ఒక్కోసారి మెదడు సహకరించదు. అలా అయింది.  కాని నడుస్తునే వున్న నీలయ్య వెనుక. బహుశా మనుషుల్ని నమ్మటం తప్ప మనం ఇంక ఏమి చెయ్యగలం అనే గుణమే నన్ను ఈ వుద్యోగం లో వుండేలా చేస్తుందేమో! ఈలోగా అక్కడ ఇంకో మనిషి కనిపించాడు. అడవిలో మన ఊర్లలో లాగా జనం కనిపించరు, ఎక్కడో ఒక చోట ఎవరో వుంటే వుంటారు. వాళ్ళు కూడ మనకంటికి సులభంగా కనిపించరు. ప్రకృతి అక్కడ పెద్దగా వుంటుంది ఏ జీవి ఐనా అందులో కలిసిపోయినట్లే వుంటుంది అనిపించేది. నీలయ్య అతని దగ్గరకి వెళ్ళి ఎదో వాళ్ళ బాషలో మట్లాడాడు.కాసేపటికి నాదగ్గరకి వచ్చి అతను దిసారి అని చెప్పాడు. మేము వెళ్ళబోయే గూడెం లో ముందు రోజు పోలీసులు ఎవరో నక్సలైటు కోసం అని అడగడానికి వచ్చి వున్నారంట. మనం వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ విషయం నీకు ముందే తెలుసా?అందుకే దారి మార్చావా? ఎలా తెలుసు అని వరసగా ప్రశ్నలు వేశా మళ్ళీ "నో జవాబు" . మరి వెనక్కు వెళ్దామ, కాని ఇంత ఎండలో ఎంత కష్టపడి ఎక్కాము కదా అని అన్నాను. దానికి దిసారి ఎదో చెప్పాడు. నాకు అర్ధం కాలేదు. నీలయ్య మొదటిసారి నవ్వాడు, నవ్వి " మాడం నీకు ఇప్పుడు వర్షం కావాలా అని మా దిసారి అడిగాడు అని చెప్పాడు"...వర్షం ఏమైనా నా హ్యాండ్ బ్యాగ్ లో వున్న రుమాలా? లేక పోతే చెట్టు మీద కాయనా, ఇప్పుడు అర్జెంట్ గా కావాలంటే రావడానికి అన్నను. మళ్ళీ వాళ్ళిద్దరూ ఎదో హ, హు, క, ఈ (వాళ్ళ భాష నాకు అలాగే వినిపిస్తుంది మరి) అని మాట్లాడుకున్నారు. నన్ను కూర్చోమని దిసారి అక్కడే ఎదో చుట్టు వెతికి ఒక చీమల పుట్ట పట్టుకొచ్చాడు. దాన్ని క్రింద పెట్టి దాని మీద ఎవేవో ఆకులు వేసి ఎదో పాట, మంత్రం లా మాట్లాడాడు. పుట్ట తీసి నేలకేసి కొట్టాడు.చీమలన్ని బయటకొచ్చాయి. మా వైపు చూసి ఎదో చెప్పాడు. నీలయ్య "మాడం మనం తొరగా యెల్లాలి, కొండ దిగే లోపు వర్షం వస్తే తడిసిపోతావ్ అన్నాడు. 

వీళ్ళిద్దరి మంత్రాలకి చింతకాయలు రాల్తాయా అని నవ్వుకొని, ఆ ఎండని తిట్టుకుంటూ బయలుదేరా.ఒక 15నిమిషాలు నడిచామో లేదో వున్నట్లుండి వర్షం పడటం మొదలయ్యింది. నా మైండ్ మళ్ళీ బ్లాంక్ అయ్యింది. నా లాజిక్ కి అర్ధం కాని విషయాలు జరిగినప్పుడు నా మైండ్ ఇలాగే ఏమి ఆలోచించకుండా ఆగిపోయి నాకు సహాయం చేస్తుంటుంది.

ఆ వర్షం కూడా నాకోసమే పడినట్లు మేము రకు ఊర్లోకి వచ్చెసరికి ఆగిపోయింది. అక్కడ అసలు తీవ్రంగా ఎండ కాస్తుంది.

ఇప్పుడు చెప్పండి ఇన్ని షాకులు నాకు అవసరమా??? గిరిజనులు వాళ్ళకి తెలిసిన విషయాల్లో తెలివైన వాళ్ళని ఒప్పుకోకుండా వుంటానా?వాళ్ళకి ప్రకృతి గురించి చాలా విషయాలు తెలుసు, వాళ్ళ పూజలగురించి తరువాత పోస్ట్ లో నాకు తెలిసిన అనుభవాలు రాస్తాను
అసలు ఆ వర్షం ఎలా పడింది అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా.మీరేమంటారు, దిసారి పూజ కి పడిందా? లేక నా అలసట చూసి కొండ నా సేద తీర్చడానికి వర్షాన్ని ఇచ్చిందా? నేను చాలా సార్లు ప్రకృతి నాతో మాట్లాడుతుందనీ,నన్ను అర్ధం చేసుకుంటుందని, నాకు సహాయపడుతుందని ఫీల్ అవుతుంటా ఎందుకో మరి!

21 comments:

కొత్త పాళీ said...

వైజాగు కాంక్రీటు జంగిల్లో పడి తిరుగుతున్నవాడికి అకస్మాత్తుగా అరకు అడవి తగిలినట్టుంది మీ బ్లాగు చూడ్డం. మీ అనుభవాలు తరచుగా రాస్తూంటార్నై ఆశిస్తాను.

Veeragoni said...

ఇంత చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.కానీ ఆప్రకృతిని అంతా అభివృద్ధి పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేస్తూ పైగా ఆ ప్రకృతిని కాపాడే దానికి అడ్డునిలుస్తున్న గిరిజనులను నక్సలైట్లు అని అతి క్రూరంగా చంపివేస్తుంటే సభ్య సమాజం ఆ గిరిజనులను గాని ప్రకృతిని గాని కాపాడే దానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు.

శిరీష said...

నా బ్లాగ్ మీకు నచ్చినందుకు సంతోషం. మీ, మా అందరి ఆవేదన అదే కాని ఎవరి జీవితాలతో వాళ్ళు బిజీ కదా! కాని కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు పని చేస్తునే వున్నారు వీటి మీద. వీలైతే వారికి సహాయం అందించాలి.

-శిరీష

Unknown said...

మీ బ్లాగు చాల బాగుంది.... మళ్ళి మళ్ళి చదవాలనిపిస్తుంది...:)

మాలా కుమార్ said...

మీ అనుభవాలు బాగా రాస్తున్నారు .
లల్లా దేవి నవల చదివినట్లుగా వుంది .

తెలుగు వెబ్ మీడియా said...

మా అన్నయ్య పని చేసేది గిరిజన ప్రాంతంలోనే. ఒరిస్సాలోని రాయగడ జిల్లా కాశీపూర్ లో పని చేస్తున్నాడు. కాశీపూర్ ప్రాంతం మన దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటి. అక్కడ గిరిజనులు ఆకలి వల్ల విషపు పుట్టగొడుగులు, మామిడి టెంకల అంబలి తింటారు.

Pramod said...

మీ అనుభవాలు, వాటిని మీరు మాకు తెలియచేస్తున్నా విథానం చాలా చాలా బాగున్నాయి. నాకు కొంచెం అసూయగా కూడా ఉంది. మీరు ఇలాగే అద్భుతంగా బ్లాగు కొనసాగించాలని కోరుకుంటూ, ధన్యావాదాలు.

Malakpet Rowdy said...

Very nicely narrated

కళాకారుడు R@M said...

nenu girujanula meda documentry tiste dani script writer mere...

కళాకారుడు R@M said...

nenu girijanula paiana tese documentary ki mere script writer...

veeraiah said...

Good, convinced about 'podu'. pl continue further.

రమణ said...

గిరిజనుల జీవన విధానాన్ని తెలుసుకోవటం ఆనందంగా ఉంది. మరిన్ని రాయాలని నేను కూడా కోరుకుంటున్నాను.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

చాలా బాగా రాస్తున్నారండి. మీ తదుపరి టపా కోసం ఎదురు చూస్తున్నాను.

VIKASA said...

Sireesha garu, mee blog chaala baagundi. girijanulato samayam panchukoleni endariko mee blog o anirvachaniyamaina anubhuti.

keep writing.

Best wishes,

Srinivas

psm.lakshmi said...

కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. చాలా సంతోషం.
psmlakshmi

భావన said...

చాలా బాగా రాస్తున్నారండి. ఎంత నిజం కదు మన మిడి మిడి జ్నానం తో అదే గొప్ప అది తెలియని వాళ్ళందరు అనాగరికులు అనుకుంటామే మనం. మీ అనుభవాలు మాతో ఇలా పంచుకోవటం చాలా సంతోషం శిరీష. నిజమే ప్రకృతి మనకు ఎప్పుడూ చెపుతూనే వుంటుంది అంట మన గురించి. మనం వినగలిగే శక్తి వుంటే, దానిని interpretచేసుకోగలిగితే అర్ధం అవుతుంది అంటారు కదా. very nice post.

నిషిగంధ said...

ఎన్నడూ చూడని ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారండి శిరీష గారు.. మీ శైలి కూడా చాలా బావుంది.. తరువాతి భాగం కోసం ఎదురుచూస్తుంటాను.. వెంటనే రాస్తారు కదూ!

మురళి said...

అడవి పచ్చదనాన్ని కళ్ళ ముందు నిలుపుతున్నారు.. పదే పదే వినడం వల్ల అవే నిజం అనుకునే కొన్ని అభిప్రాయాలు యెంత తప్పో మీ టపా చదివాక అర్ధమయ్యింది.. తరచుగా రాయండి..

కొండముది సాయికిరణ్ కుమార్ said...

చాలా బాగుందండి ఈ కొత్త కొత్త విషయాలు చదువుతుంటే.

శ్రీ said...

బాగా రాస్తున్నారు. అడవిలో తిరిగే వాళ్ళకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి.
పులిని వాసన బట్టి పసిగట్టడం, వాన కురిపించడం నిజంగా ఆశ్చర్యం!

Anonymous said...

చాలా బాగుందండి.
పాత పోస్తే కాని, నాకు మాత్రం కొత్తగా ఉంది.
చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను.
థాంక్ యు

:venkat