Monday, March 15, 2010

ఆడపనా? మగపనా?

తాడి ని తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నే వాడు ఇంకొకడంట!! లేక పోతే మనమొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందంట!! ఈ రెండు సామెతల్లో నాకు ఏది సూట్ అయ్యిందో ఈ పోస్ట్ చివరలో మీరే చెప్పండి.

ఈ బ్లాగు మొదలు పెట్టినప్పుడు చెప్పాను కదా నా వుద్యోగ జీవితం లో నేను కలిసిన మనుషులు, ఎదురైన పరిస్థితులు, అనుభవాలు మీతో చెప్పాలని ఈ బ్లాగు ప్రారంభించా అని. ఎంత సేపు గిరిజనులు గురించే చెప్తున్నాను నా పరిణామక్రమం కూడా చెప్పితే బాగుంటుందని (ఎవరికి బాగుంటుంది? )  ఈసారి పోస్ట్ ఇలా వ్రాస్తున్నా. ఎందుకంటే మనం చూసే విషయాలే కాదు, వాటిని మనం ఎలా మన జీవితానికి అన్వయించుకున్నామో కూడా అంతే ముఖ్యం కదా!!

నేను మొత్తనికి ఉద్యోగం జాయిన్ అయ్యాక నా మకాం వైజాగ్ కి మారింది. అంతకు ముందు కూడా చదువు కోసం అక్కడే వున్నా ఎప్పుడూ హాస్టలే. కాని ఇప్పుడు ప్రత్యేకంగా వర్కింగ్ ఉమన్ హాస్టల్ అని, లేదా ప్రైవేటు హాస్టలని చేరాల్సి వచ్చింది. అప్పటికి మా తమ్ముడు కూడా బి.సి.ఎ చదువుతూ ఒక హాస్టల్ లో వుంటున్నాడు. ఎంత వుద్యోగం చేసినా, వయసులో పెద్ద అయినా అదేంటో అమ్మాయిలకి తోడు,పెద్ద దిక్కు అని ఆఖరికి ఒక చెడ్డీ వెసుకునేంత మగ బంధువునే వుంచాలని చూస్తారు పెద్దవాళ్ళు. నాకు మరీ చెడ్డీ వేసుకునేంత చిన్న కాకపోయినా నాకంటే 8 సం.ల చిన్న వాడయిన నా తమ్ములుంగారు నాకు పెద్ద తోడయ్యారు. మరింకేం వాడున్న హాస్టల్లోనే అమ్మాయిలు కూడా ఉన్నారని నన్ను కూడా జాయిన్ అయిపోవచ్చనీ మా ఇంట్లో వాళ్ళ వాళ్ళతో సహా నన్ను కూడా ఒప్పించాడు. వాడి తెలివితేటలు ఆ తరువాతే నాకు తెలిశాయి. సాధారణంగా వాడికి ఇచ్చే పాకెట్ మనీ వాడికి జస్ట్ చాక్లెట్ మనీకి సరిపోయేది. ఇక అక్క వాడి కనుసన్నల్లో వుంటే వాడి ఖర్చులు, వాడి బాధ్యతలు (అక్క తన కంటే పెద్దదైనా సరే ఆడపిల్ల అంటే పాపం చిన్న వాళ్ళైనా సరే మగపిల్లలకి బాధ్యతే  అని మన సమాజం ఆర్డర్ వేసింది కదా) ఉన్న చోటు నుండి కదలకుండా నెరవేరిపోతాయని వాడి ప్లాన్. 

ఆ హాస్టల్లో మమ్మల్నీ కనీసం సెకండ్ షో సినిమాకి కూడా వెళ్ళనీయట్లేదనీ, కనీసం హాస్టల్లో వున్న తోటి ఆడపిల్లలికి/మగపిల్లలికి లైను వెయ్యనీయటం లేదనీ ఇంకా ఇలాంటివే చాల కారణాలు వున్నా కూడా మా పేరెంట్స్ కి మాత్రం బోజనం సరిగా లేదనే కారణం మాత్రం చెప్పి మేమిద్దరం ఇల్లు తీసుకున్నాము. అప్పటికి ఒక స్వతంత్ర ఇంటిదాన్ని అవుతున్నాననే సంతొష పడ్డాను. నేనూ మా తమ్ముడు కలిసి చక్కగా పనులన్నీ చేసేసి వాడు కాలేజి కి నేను ఆఫీసు కి వెళ్తున్నట్లూ, రోజూ సెకెండ్ షో సినిమాలు చూస్టున్నట్లు కలలు కని ఇంట్లో చేరిపొయాను. అప్పుడు కలిగించాడు మా సోదర తమ్మయ్య అసలైన ఙ్ఞనోదయం.  వంట ఆడపిల్లలు చెయ్యాలికదా, ఇల్లు ఆడపిల్లలే కదా తుడవాలి, అంట్లు ఆడపిల్లలే కదా తోమాలి, కాయగూరలు ఆడపిల్లలే కదా తరగాలి, బట్టలు ఆడపిల్లలే కదా ఉతకాలి....ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే ఇక మగపిల్లలు చేసే పనులు ఒకటే మిగిలింది మార్కెట్ కి వెళ్ళి కాయగూరలు తేవటం. పోనీ అదైనా చెశాడా అంటే పుచ్చిపోయిన కాయగూరలు తేవటం, లేకపోతే కలర్ బాగున్నాయి కదా అని టమోటాలు మాత్రమే తేవటం చేసే వాడు. అదేమంటే నువ్వే తెచ్చుకో ఫో... నాకెలా తెలుస్తాయి అన్నాడు. నాకు మాత్రం ఎలా తెలుస్తాయి నేనేమైనా పుట్టడమే రైతు బజార్లో పుట్టానా? ఐనా నేను వాడికంటే ఎక్కువ సంవత్సరాలు పని అలవాటులేకుండా వున్నాను కదా అని ఎవరూ అనలేదు, అమ్మాయివే కదా నువ్వే చెయ్యాలి అన్నట్లు చూశారు. వాడి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అని వేరు వేరుగా, మా ఫ్రెండ్స్ అని కామన్ గా హాస్టల్లో మంచి బోజనానికి మొహం వాచి వున్న మా జనాలందరూ అప్పుడప్పుడు  బోజనానికి తగలడేవాళ్ళు. నేనసలే పని చెయ్యలేక చస్తుంటే అతిది దేవుళ్ళు కూడా!. వీళ్ళందరూ నా వంట గురించి కూరలో ఉప్పేస్తె బాగుండేది, చారులో చింతపండు వేస్తె బాగుండేది, ప్లేటు కడిగి బోజనం పెడితే బాగుండేది అని ఎగతాళి చేసేవాళ్ళు. అమ్మాయి అంటే అన్ని పనులు పుట్టిన వెంటనే తెలిసి వుండాలి అన్నట్లు మాట్లాడేవాళ్ళు. కానీ ఒక్కరు కూడా మా తమ్ముడి తో అక్కకి సాయం చెయ్యరా అని చెప్పలేదు. ఆఖరికి నేను కూడా అది నా అసమర్ధత లాగే ఫీల్ అవుతుండే దాన్ని.నేను అరుకు వెళ్తే మా తమ్ముడు వంటగది కాదుకదా అసలు ఇంటికే వచ్చేవాడు కాదు. హోటల్ లో తిని, ఆ చెత్త కూడా తీసుకొచ్చి ఇంట్లో పోగులు పెట్టేవాడు.  

ఆఫీసు లో పని, అరుకు ప్రయాణాలు, ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలో కోపంగా ఆకలితో ఎదురు చూస్తూ "రా నీ పని  చెబుతా" అన్నట్లు చూసే తమ్ముడు,సిటీ బస్సుల్లో ప్రయణాలు ఇవి కాక నాకు వచ్చే జీతం మా ఇద్దరి సినిమాలకీ, ఉదయం, సాయంత్రం టిఫిన్ లకే సరిపోయేది కాదు. ఫస్టు తేదీ వస్తుందంటే ఇంటి ఓనర్స్ కి జబ్బు చేస్తే బాగుండు, వాళ్ళు సడన్ గా చచ్చిపోతే బాగుండు అని దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఇలాంటి దుర్మార్గపు ప్రార్ధనలు చేసేదాన్ని. 

డబ్బు విలువ అప్పుడే తెలిసింది. మా డాడీ, మమ్మీ లతో ఎన్నోసార్లు డబ్బు ముఖ్యం కాదు అని వాదించేదాన్ని. బతకడానికి డబ్బు కావాలి, అదీ మన  ఒకరి బాధ్యత వున్నప్పుడు మరీ కావాలి అని తెలుసుకున్నా. కానీ పట్టు వదల లేదు. తమ్ముడికి ఇచ్చే పాకెట్ మనీ ఇంటి ఖర్చులకని ఎప్పుడూ అడగలేదు. డబ్బు ఎక్కువ వున్నా తక్కువ వున్నా కూడా రోజులు మాత్రం ఆగవు. గడిచిపోతునే వున్నాయి. కష్టపడినా కూడా నాకు ఆ రోజులెందుకో బాగా నచ్చాయి.

అప్పట్లో నేర్చుకున్న, ఎక్కువగా ఆలోచించిన విషయం "పని". ఎందుకని కొన్ని పనులు ఆడపనులు, కొన్ని పనులు మగ పనులు అయ్యాయి? జీవుల్లో ఆడ మగ అనేది పకృతి పెట్టిన సహజమైన భేధం. అధి కూడా ఆడవాళ్ళ ద్వారా కస్టమైన పిల్లల్ని కనే పని జరిగేల చూసే భేధం. మిగిలిన పనులన్ని మనం కల్పించుకున్నవి, మనకి అవసరమైనవి. కాని ఇవి ఆడ పనులు, ఇవి  మగ పనులు అని  ఎవరు విభజించారు. ఎందుకని విసుగొచ్చేవీ, మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చేవి, మురికి పనులు ఆడవాళ్ళకి ఇచ్చారు? కష్టమైన పనులు ఆడవాళ్ళు చెయ్యలేరు అంటారు మళ్ళీ, స్త్రీ ని పూజించాలి అంటారు.

అప్పటివరకు కేవలం చదువు, ఫ్రెండ్స్, సరదాలతో గడిచిపోయిన జీవితం లో నిజంగా ఇంత భేదాలున్నాయని గమనించలేదు. అప్పట్నించి ఇంకా ఇప్పటికి కూడా గమనిస్తూనే వున్నాను.చాలా సంధర్భాలలో చాలా మంది నోట ఈ మాట విన్నాను. ఈ ఆడంగి పనులు నాకు చెప్పకు అనీ, మగరాయుడి పనులు చేస్తుంది చూడు అనీ.జీవుల్లో ఆడ మగ కనుక్కోగలం,ఇది ఆడ పంది, ఇది మగ పంది అని చెప్పడానికి కొన్ని సహజమైన లక్షణాలున్నయి.  ఈ పనులకి ఆడ మగ ఎలా వచ్చింది? నాకు ఏదైన సరైన లాజిక్ కనబడే వరకు దాని గురించి ఆలోచిస్తునే వుంటాను, గమనిస్తూనే వుంటాను.

మా ఆవిడ లేకపొతే ఒక్కరోజు కూడ వుండలేనండి, కనీసం నీళ్ళు కాచుకోవటం కూడా రాదు అనే మగవాళ్ళుంటారు మన  అందరి ఇళ్ళల్లో, సడన్ గా  కరెంట్ ఫ్యూజ్ పోయిందంటే, బ్యాంక్ లో డబ్బు డ్రా చెయ్యలంటే, సిలెండర్ మేడమీదకి ఎక్కించాలంటే, బల్బు కాలిపోతే మార్చాలంటే, కాస్త బరువు మొయ్యాలంటే, మార్కెట్ కి వెళ్ళి చికెన్/చేప తేవాలంటే  ఇలా చాలా పనులు పెద్ద టెక్నికల్ అనుకుంటారో లేక పోతే బజార్లోకి మనమెలా వెళ్ళటం అనుకుంటారో వీటిని చెయ్యని ఆడవాళ్ళుంటారు.

ఆడవాళ్ళు మగాళ్ళలాగ కస్టమైన పని చెయ్యలేరు అంటారు కొందరు. అసలు మనలో ఎంత మందికి తెలుసు ఆడ శిశువుల కంటే మగ శిశువుల్లోనె మరణాలెక్కువని, స్త్రీలే శారీరక మానసిక కష్టాలు బాగా తట్టుకొని నిలబడగలుగుతారని. ప్రకృతి స్త్రీకే పురుషుని కంటే  ఎక్కువ శక్తి సామర్ద్యాలిచ్చింది, కానీ మన సమాజం అసలు గర్భం లో ఆడ శిశువు వుందని తెలిస్తేనే తల్లి తినే తిండి లో శ్రధ్ధ తీసుకోదు, ఆడ పిల్లల్లో శారీరకంగా/మనసింకంగా/సామాజికంగా చాలా ఆంక్షలు విధించి నువ్విలా కదలకూడదు, ఇలా  నడవకూడదు, ఇంత తినకూడదు, బయట ఆటలాడకూడదు అని  స్త్రీ ఎదుగుదలని ఆపేస్తున్నాము. ఇక వాళ్ళు మగ వాళ్ళతో సమానంగా అన్నిపనులు చెసే అవకాశం ఎక్కడిది.

సోషియాలజీ లో  మాకు "అన్నా" అనే అమ్మాయి కధ  నాకు చాల సంధర్భాలలో గుర్తు వస్తుంది. "అన్నా" అనే అమ్మాయి సమాజానికి దూరంగా తోడేళ్ళ మధ్య పెరుగుతుంది. కొన్నాళ్ళ తరువాత ఆమెని మన సమాజం లోకి తీసుకొచ్చారు కాని "అన్నా" ఆమె వయసు వాళ్ళు చేయగలిగే ఏ శారీరకమైన పని చేయలేక, ఆ వయసుకి తగిన తెలివి (ఐ.క్యూ) లేకుండా వుంది.మన సమాజంలో ఆడవాళ్ళందరు అన్నాలే  చాల విషయాలకు సంబందించిన ఎక్స్పోసర్  లేని వాళ్ళెవరూ ఆ పని చెయ్యమంటే సడన్ గా మిగిలిన వాళ్ళలా చెయ్యలేరు. కాని అసలు చేయనే లేరు అని  కాదు.ఆడవాళ్ళేకాదు ఎవరుకూడా ఒకవిషయానికి కొన్ని తరాలుగా దూరం అయినప్పుడు తిరిగి ఆ విషయం మీద అవగాహన సంపాదించడానికి ఇంకాకొన్ని తరాలు, సమయం,సహాయం, అవకాశం, తగిన  పరిస్థితులు  అవసరమవుతాయి. నాకుతెలిసి రిజర్వేషన్ల వుద్దేశ్యం అదే అయ్యుంటుంది. దానిలో వున్న లోటుపాట్లు వేరే వున్నాయనుకోండి!! 

ఆఫీసు లో పని అంటే అంత కస్టం ఏముంది నేను కూడా చేస్తున్నా కదా! అది హాయిగా వుంటుంది. గౌరవంగా వుంటుంది. అదే కాదు బయట మగవాళ్ళు చేసే ఏపని అయినా చూస్తే నాకు రోజూ బట్టలుతికే పని, అంట్లు తోమే పని  కంటే సుఖం గానే వుంటుంది.మద్యలో స్నేహితులతో కబుర్లు, టీ లు, కాఫీలు, జోకులు, నవ్వులు అన్నిటికీ మించి మగ పనులకు జీతాలు. ఇంత చిరాకైన, అలసటైన, విసుగైన, తప్పని సరి అయిన, ముఖ్యమైన( ఇవి  ఎవరో ఒకరు చెయ్యక పోతే ఇంట్లో ఎవరూ ఆఫీసులకి స్కూళ్ళకి పోలేరు)పనులకు మాత్రం జీతం లేదు.

అందుకే కదా మీకు ఫ్రీ గా తిండి, బట్ట, బంగారు, గౌరవం అంటారేమో మరి? ఒకటి ఇంత పని చేసినా ఫ్రీ గా తింటున్నావు అనే మాట మిగులుతుంది, ఖాళీగా వుంది అనే మాటే మిగులుతుంది, ఆ పనికే గనుక లెఖ్ఖ కట్టి వసూలు చేస్తే మగ పని కంటే ఆడ పని చేస్తే వచ్చే సంపాదన చాలా ఎక్కువ అయిపోతుంది.  

ఇదంతా నేను అంట్లు తోముతూ, బట్టలుతుకుతూ, లెట్రిన్ కడుగుతూ ఆలోచించా. 

ప్రపంచంలో సహజంగా వచ్చిన పిల్లల్ని కనే పనిలో వున్న తేడాలు తప్ప, మిగిలిన ఏ పనికి కూడా ఆడ పని, మగ పని  అని బేధం లేదు. అన్ని పనులు గౌరవప్రదమైనవని అందరూ గుర్తించాలి. అన్ని పనులకు సరైన వేతనం ఇవ్వాలి. అలా ఇవ్వలేని అసమర్ధత ఒప్పుకొని కనీసం ఆ పనులు  చేసే వాళ్ళని గౌరవించాలి, వీలైనంత ఆ పనిలో సహాయ పడాలి. ఎవరికి ఇస్టమైన పని వాళ్ళు చెయ్యనీయాలి అంతే కాని ఆడదానివి కాబట్టి నువ్వు ఇంటి పని తప్పక చెయ్యాలి అని, మగవాడివి కాబట్టి నువ్వు తప్పక సంపాదించే పనులు చెయ్యాలి అని  ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. నాకు తెలిసి చాలా కుటుంబాలలో సంపాదించే పని /భారం మగ పుట్టుక పుట్టావు కాబట్టి చెయ్యల్సిందే అని సంపాదించే తండ్రి చనిపోతే వెంటనే అందరికంటే చిన్న వాడైనా సరే మగ పిల్లవాడిని చదువు,ఆటలు మానిపిచేసి పనిలో పెట్టేయటం చూశాను.

చెప్పాను కదా నేను కొంచెం తేడా అని. ఇలా ఆలోచించి మా తమ్ముడితో గొడవపడేదాన్ని. అప్పట్లో నాతో గొడవపడినా కూడా ఇలాంటి ఆలోచనా సరళి వాడిని పూర్తిగా ఒక  ఆఢారపడే మగాడిగా తయారు కాకుండా మార్చగలిగింది. ఇది ఆడ పని ,మగ పని  అని  ఆలొచన మానుకున్నాడు వాడు ఇప్పుడు పనులు ఆడ మగ తేడా చూడడు కనీసం. వంట చెయ్యటం ఇస్టపడతాడు.ఇప్పుడు వాడు అన్ని పనులు చేస్తాడు?????(అసలు పని చెయ్యటమే మానుకున్నాడు అనేది నిజం). 

ఆధార పడే మగాడు అని ఎందుకన్నానంటే, ఒకసారి సమాజం వైపు చూడండి. మన జీవితాలు ఆఖరికి ఇంట్లో అంతమవుతాయి కానీ, ఆఫీసుల్లో కాదు. మనకి ఎంత ఆఫీసు పని, బయట పనీ బాగా వచ్చినా చివర్లో మనం ఒంటరి వాళ్ళం అయ్యేటప్పుడు లేదా ముసలి వాళ్ళై అందరికి బరువైనప్పుడూ. మన బట్టలు మనం ఉతుక్కోవటం చేతకాని, వంట చేతకాని, సరిగా కూరగాయలు ఎంచటం చేతకాని, ఆఖరికి తన పని ఏది తను చేసుకోవటం చేతకాని ఆధారపడే మగ వాళ్ళే చాలా కస్టపడతారు. వయసుంటే మళ్ళీ పెళ్ళి చేసుకొనీ, డబ్బుంటే ఒక ఆడ పని మనిషిని పెట్టుకొనీ మళ్ళీ అధారపదుతూ బతుకుతారు, ఇవేవీ లేకపోతే భార్యని పెట్టిన హింసలు తలుచుకొని బాధపడుతూ రోజులు ఎప్పుడైపోతాయా అని చూస్తారు.

అలాగే ఆడవాళ్ళైతే బయటకెళ్ళి సంపాదించలేక, పైసా కి కూడా పిల్లల మీద ఆధార పడాలి.

పనిని పని అని చూడలేకపోవటం, తక్కువ ఎక్కువ అనీ, ఆడ  మగ అనీ సహజం కాని తేడాలతో చూడటం వల్ల ఎవరికి నస్టం? ఇలా  ఆలోచించి నేను  పనులు  ఆడవైన మగవైనా వీలైనన్ని పనులు చెయ్యటం అంటే వీలైంతంత స్వతంత్రులం అవ్వటం అని నేర్చుకున్నాను మా తమ్ముడి వలన.

వాడు ఈ పోస్ట్ చదివితే నన్ను విలన్ చెసేసావా అక్కా అంటాడేమో? కాని వాడు నన్ను అన్ని కస్టాలు పెట్టడం వలనే నేను నేను ఆడ మగ తేడా లేకుండా అన్ని పనులు చేయటం నేర్చుకున్నాను. ఇంత ఎక్కువ స్వతంత్రురాలినయ్యాను.మన దేశానికి బ్రిటీషు వాళ్ళొచ్చి కష్టాలు పెడితేనే కదా మనకి  స్వాతంత్ర్యం వచ్చింది, అలాగె నా  స్వతంత్రానికి నా తమ్ముడు మొదటి హీరో.ఇలాంటి హీరో లు నాకు  ఇంకా చాలా మంది వున్నారు. మరి మీరు ఎంత స్వాతంత్రులో ఎప్పుడైనా ఆలోచించారా? 
 

17 comments:

Anonymous said...

శిరీష గారు, చాలా బాగా రాస్తున్నారు. ఇంకా చాలా పొస్ట్ ల కొరకు ఎదురుచూస్తూ వుంటాము

భావన said...

శిరీష గారు, చాలా బాగా రాసేరు అండి, ఈ విషయం గురించి నాకు కూడా చాలానే ఆలోచనలు ఆల్మోస్ట్ మీ ఆలోచనలల్లేనే వుండేయ్ కాని నా గొంతు పెద్దది అవటం మూలం గా తమ్ముడి తో, మొగుడితో, కొడుకుతో పను లు చేయిస్తా తేడా లేకుండా. నేను చేస్తా అలానే. నాకు కూడా చాలా విడ్డూరం గా వుంటుంది మొగవాళ్ళు కొందర మీరు అన్నట్లు అమ్మో మా ఆవిడలేకపోతే అని, ఆడవాళ్ళు అమ్మో మా ఆయన లేకపోతే అని చెప్పే రీజన్స్ విని. మానసికం గా కంటే శారిరకం గా వీళ్ళు భంధాన్ని పెంచుకుంటున్నారల్లే వుందే అని. ;-)

Hima bindu said...

బాగా రాస్తున్నారు ."దిరిసెన పూలు "అరకులో ఉంటాయని విన్నాను మీ ప్రొఫైల్ లో వున్నా పూలు అవేనా అండీ ?
రంగు బాగుంటాయని ఒక్క టమాటాలు మాత్రమె తెచ్చే తమ్ముడు ......హ హ ...బాగుంది .

Anonymous said...

"ఆధార పడే మగాడు అని ఎందుకన్నానంటే, ఒకసారి సమాజం వైపు చూడండి. "

చూసాం! కాకపోతే నాదో చిన్న డౌటండి. మగాడు ఆధారపడి బతుకుతున్నాడు అన్నారు కదా, ఆడవాల్లు ఆధారపడడం లేదా? ఇంటి పని వంట పని ఆడవాల్లు చేసినా, సంపాదన కొరకు మగాడిమీద ఆడవాల్లు ఆధారపడడం లేదా? ఉదయం బయటికెల్లి సాయంత్రం వరకూ పనిచేసిన వచ్చే మగాడికి మీరు అందించే బిరుదు, ఆధారపడి బతికేవాడు, అవునా? చాలా బాగుంది.

Anonymous said...

Mari nannu maa avida kallabu challi muggu pettamantae naaku kashtamae.Alagani aamae levaleni parsthiti lo kuda aame chetha aa pani cheyanachanu.Andaru levakumundhu nidra lechi atleast ooti neelatho kallabu challi pakkanti valltho muggu veysthanu.

శిరీష said...

నా బ్లాగ్ చదివి కామెంటిన అందరికీ థాంక్స్ అంది. నేను ఈ పోస్టులో మగవారిని కాని ఆడవారిని కాని తప్పు పట్టడం లేదు. మన సమాజంలో వున్న పనులకు కూడా జెండర్ వుందని మాత్రమే చెబుతున్నా. ఆధారపడేది పనికోసమైనా, డబ్బుకోసమైనా ఆధారపడటమే అని నా అభిప్రాయం. చిన్నప్పుడు అందరం అన్నిటికీ ఆఢారపడతాము, పెరిగాక ఇండిపెండెంట్ అవుతాము. కాని పరిణితి యొక్క గరిష్ట స్థాయి ఇంటెర్ డిపెండెన్సీ..అంటే ఒకరికి ఒకరు ఇచ్హిపుచుకోవటం అన్నమాట. అంతే కాని పుచ్చుకుంటున్న పని మనకి చేతకానివాళ్ళలా తయారవ్వటం కాదనుకుంటున్నాను. అది ఆడవారైన మగవారైనా సరే నేను అందరిగురించి ఒకేలా ఆలోచించాననే భావిస్తునాను. మన అభిప్రాయాలు చెప్పేటప్పుడు కొందరికి బాధకలగుతుంది. కానీ ఏంచేస్తాం అందరికీ అన్నివేళలా సంతోషం కలిగించలేము కదా!! నిజంగా అందరు నాతో ఏకీభవించాలనీ రాయలేదు, అందరు నేను చెప్పినట్లే వుంటారనీ రాయలేదని అర్ధం చేసుకోగలరు. ఏదైనా నా బ్లాగ్ చదివినందుకు సంతోషం.

bloggerbharathi said...

చాలా బాగుంది. ప్రతి ఆడపిల్లకి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి తమ్ముడు తప్పక ఉండే ఉంటాడు. ఎమన్నా అంటే ఫెమినిస్ట్ అన్న ముద్ర వేస్తారు. చస్తున్నా సహాయం అదీ ఇంటి పని వంట పని, ఇల్లు ,వాకిలీ శుభ్రం చేయడం అటుంచి,
తెచుకుని తిన్న హోటల్ tindi పొట్లం కాగితాలు కూడా అలసిపోయి వచ్చిన వాళ్లకి స్వాగతఓ పలుకుతుంటే తిక్క రేగుతుంగి. అయినా మన మనసు లోతుల్లో కూడా వ్వాళ్ళకి పనులు చేత కావనే భావం ,వాళ్ళనలా తయారు చేస్తుంది. ఏమంటారు?

SRRao said...

శిరీష గారూ !

నూతన సంవత్సరంలో మీ దిరిసెన పుష్పాలు మరిన్ని గిరిజన పుష్పాలను అందించాలని కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో...

- శిరాకదంబం

A V MARUTI SAIRAM said...

"జీవుల్లో ఆడ మగ కనుక్కోగలం,ఇది ఆడ పంది, ఇది మగ పంది అని చెప్పడానికి కొన్ని సహజమైన లక్షణాలున్నయి. ఈ పనులకి ఆడ మగ ఎలా వచ్చింది? నాకు ఏదైన సరైన లాజిక్ కనబడే వరకు దాని గురించి ఆలోచిస్తునే వుంటాను, గమనిస్తూనే వుంటాను."
Idi nijam ga adbhutam.. Nenu mee anumati lekundaa naa Gmail Status message ga petukunnanu. Anyadhaa bhavimch vaddu. Nenu ilaage adigevaadini chaala mandini.. Nenu intloo vanta chesthunnappudu chaalamandi comment chesevaaru.. Maa ammaku help chesinaa .. Illu chimminaa.. prati daanikee entiraa aadangi panulu ani. Nenu ade cheppevaadini "Idi keevalam Pani.. Aadadaa magadaa ani kaadu.." ani.
Baga Raasaaru

నాగప్రసాద్ said...

ఆడ, మగ ఇద్దరూ సమానమైనప్పటికీ వాళ్ళద్దరికీ ఉన్న భౌతికమైన, శారీరకమైన తేడా గురించి తెలిసిందే. ఆ తేడాకు అనుగుణంగానే కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండటం కోసం ఆడపనులు, మగపనులు అని మన పూర్వీకులు వేరు చేశారని నా అభిప్రాయం. ఆ పనుల తేడా అలా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.

మగవాళ్ళ పనులు అంటే ఏసీ గదిలోని కంప్యూటర్ డబ్బాల ముందు, గవర్నమెంటు ఆఫీసుల్లో కునుకు పాట్లు తీయడం మాత్రమే కాదు. గనుల్లో పనిచేయడం, బండలు పగల గొట్టడం, పండుగ అని కూడా లేకుండా బస్సులు తోలే డ్రైవర్లు, దేశం మొత్తం సరుకులు రవాణా చేసే లారీ డ్రైవర్లు, వారితో పాటు వెళ్ళే క్లీనర్లు, సెకండ్ షో అయిన తర్వాత ఆటో కావాలా? అని అర్ధరాత్రి దాకా నిద్ర మేల్కొని మన ఇంటికి చేర్చే ఆటో డ్రైవర్లు, ఇంకా వివిధ రకాల కూలీలు, ఇలా చెప్పుకుంటూ చాలానే ఉంది లిస్టు. ఇంకా పొలం పనుల గురించి తెలిసిందే. వాటి కోసం మగవాళ్ళు ఎంత కష్టపడతారో కూడా తెలిసిందే. వీటిల్లో కొన్ని రకాల పనులు ఆడవాళ్ళు చేయలేరు. కొన్ని రకాల ఆడవాళ్ళ పనులు మగవాళ్ళు చెయ్యలేరు. అందుకే ఎవరికి కేటాయింపబడిన పనులను వాళ్ళు చిన్నప్పట్నుంచే నేర్చుకొని, మానసికంగా వాటికి అలవాటు పడటం మంచిదని నా అభిప్రాయం.

ఆడ, మగ ప్రతి ఒక్కరూ చిన్నప్పట్నుంచే ఏదో ఒక బ్రతుకు తెరువుకు సంబంధించిన పనిలో అంతో ఇంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటే మంచిది. అప్పుడు ఆధారపడటాలు ఉండవు. ఒకప్పుడు కులవృత్తుల వల్ల ఇటువంటి సమస్యలు వచ్చేవి కాదు. కులమనేది, ఒక వృత్తి నైపుణ్యానికి ఒక బ్రాండ్ వంటిది. ఫలానా కులంలో ఉన్నవానికి వాడి కులానికి సంబంధించిన పనిలో నైపుణ్యం ఉన్నా లేక పోయినా బ్రాండ్ తోనే గడిచిపోయేది.

ఇంకా ముందు తరంలో ప్రస్తుత కాలంలోలాగా ఒకరు, ఇద్దరు పిల్లలకు పరిమితమయ్యే పరిస్థితి ఉండేది కాదు. 10-15 మంది దాకా పిల్లల్ని కనేవాళ్ళు. కాబట్టి, ఆ విధంగా కూడా ఆడవాళ్ళు శారీరకంగా బలహీనంగా అయ్యేవాళ్ళేమో. ఆ కారణంగానే వారికి కష్టమైన పనులు చెప్పకుండా, వంటింటికి పరిమితం చేసి ఉండొచ్చు. అంతేకానీ, ఆడవాళ్ళను అణగద్ర్రొక్కాలన్న దురుద్దేశ్యం మన సంస్కృతిలో ఎప్పుడూ లేదు. మిగిలిన చదువుల అసమానతలు వంటివి వివిధ రాజుల ఏలుబడిలో, దండయాత్రల్లో ఆయాకాలల్లో జాతిని రక్షించుకోవడానికి ఏర్పర్చుకున్న కట్లుబాట్లు అనుకుంటున్నాను. ప్రస్తుతకాలంలో ఆయా కట్టుబాట్ల అవసరం లేదు. కాబట్టి నో ప్రాబ్లెమ్స్. కాకపోతే పాతతరానికి, కొత్తతరానికి వారధి జరుగుతున్నప్పుడు ఆడ, మగ తేడా వంటి విషయాలకు మానసికంగా అలవాటు పడటానికి మరో తరం అవసరమవుతుంది.


>>"మరి మీరు ఎంత స్వాతంత్రులో ఎప్పుడైనా ఆలోచించారా? "
At present I am 100% dependent. :))).

Amma Sreenivas said...

శిరీష గారు, చాలా బాగా రాస్తున్నారు

sangeetha said...

I liked your posts a lot . I will wait for your future posts. Have you considered writing a book based on your experiences in araku etc ??
I think i would be among the first to buy your book.

Sangeetha

శ్రీ said...

నేను కూడా మీ తమ్ముడి టైపే నండి. కాకపోతే ఇపుడు వంట,బట్టలు ఉతకడం,ఇల్లు తుడవడం,బాత్ రూములు కడుక్కోవడం వచ్చు,చేస్తున్నాను.

Anonymous said...

well written post ... definitely thought provoking ... thank you...

కొత్త పాళీ said...

@ శ్రీ :))

శిరీషగారు, మీ అభిప్రాయాలని మీరు వ్యక్తపరిచే తీరు చాలా బావుంది.

శిరీష said...

కొత్తపాళీ గారు,

నా అభిప్రాయం నచ్చిందో లేదో కాని చెప్పిన పద్దతి నచ్చింది కదా!!

Anonymous said...

Good Post.. But you should understand men also do all the work at home. Maa intlo nenu pedha vadini naaku 3 sisters andharu chinna vaalle. kani nenu vaallaku chakkaga vanta chei pettevadini. Ippatiki nenu maa avida vantachesetappudu nanne cheyyamantundhi yendhukante nenu baga vanta chesthanu. Even nenu jobki vellina kooda inti pani mathram idharamu share chesukone vallam. Naaku inti pani chayyalante chala happy yendhukante nenu baga istapadi chesthanu.Atleast nenu intlo vunnappudu aina vaallaku rest ivvalani anukuntanu.