ఒక్కోసారి చిన్న చిన్న జీవులు కూడా మనకంటే ఎంతో గొప్పవి అని, మనమే ఏమీ చేతకాని వాళ్ళం అనిపిస్తుంది. ఒక చిన్న స్పైడర్( సాలి పురుగు) కూడా ప్రజలకు సాయం చెయ్యగలుగుతుంది కాని నేను(మనిషి) తన తోటి మనిషికి ఏమీ చెయ్యలేకపోతున్నాను అనిపించింది
నన్ను ఒక రోజు మా చైర్మేన్ గారు పిలిచి నువ్వు "దిసారిలకి", "గునియాలకి" ట్రైనింగ్ ఇవ్వాలి 5 రోజులు అన్నారు. దేని మీద ట్రైనింగ్?, అసలు ట్రైనింగ్ ఇవ్వడానికి నాకున్న అర్హత ఏంటి?ఇలాంటి చాలా ప్రశ్నలకి సమాధానాలు అడిగేంత టైము అతను ఎప్పుడూ ఎవరికి ఇవ్వరు. నాకసలే కంగారు. ఐన బయలుదేరా. దారిలో ఏమి చెప్పారంటే " ట్రైబల్స్ లో ఎవరు కూడా ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లరు, గునియాలే ప్రసవం చేస్తారు, ఏదైన ఆరొగ్య సమస్య ఎవరికి వచ్చినా దిసారి దగ్గరికి వెళ్తారు అందుకని మనం దిసారిలకి, గునియాలకి గర్భిణి స్త్రీ ల గురించి, ప్రసవం గురించి, ప్రసవం తరువాత జాగ్రత్తల గురించి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు."
సరే చాల మంచి ఆలోచన కాని ట్రైనింగ్ ఎవరిస్తారు సార్, ఎవరైన డాక్టర్ వస్తున్నారా అని అడిగాను. వాళ్ళు డాక్టర్ ని నమ్మరు అందుకే నువ్వే ఇవ్వాలి అన్నారు. నేనెలా ఇస్తాను నన్ను మా డాడీ డాక్టర్ చెయ్యాలనుకున్నారు కాని నేను కాలేదు కదా. నాకు గర్భిణీ స్త్రీలని దగ్గరనుండి చూస్తేనే చాల భయం ఇక ప్రసం ఎలా చెయ్యాలో చేసి చూపించాలా కొంపదీసి అని ఎవేవొ ఆలోచించి భయపడసాగాను. కాకపోతే ఆ ట్రైనింగ్ నేను ఇచ్చేముందు నేను చదవాల్సిన పుస్తకాలు, సమాచారం అంతా నాకు తరువాత ఇచ్చారు కాబట్టి ఎలాగో నెగ్గుకొని వచ్చాను.దిసారిలు, గునియాలు ఏమి నేర్చుకున్నారో నాకు తెలీదు కాని దెబ్బకి నాకు మాత్రం ఈ పెళ్ళి అన్నా పిల్లలన్నా చాలా భయం వచ్చేసింది. ఈ ట్రైనింగ్ లో వీళ్ళకి చెప్పాను కాబట్టి నాకు తెలిసింది అక్కడ హాస్పటిల్ లో డాక్టర్లకి ఈ విషయాలు తెలియకపోతే నా గతి ఏమి కావాలి అని భయపడ్డాను!!!
ఇక ట్రైనింగ్ అయ్యాక నేను మా చైర్మేన్ గారికి కొంత ఙ్ఞాన బోధ చెయ్యాలని ఆశపడ్డాను.దిసారి,గునియాలు ఇచ్చే మందులు ఎక్కువగా వేప, పసుపు మరియు ఇతర యాంటిబయోటిక్ వుంటాయి.అవి కూడా సీజన్ ప్రకారం వచ్చే జబ్బులకి సహజంగా పనిచేస్తాయి. కానీ వాళ్ళు చేసే పూజలు మంత్రాలకి అన్ని సమస్యలు తీరవు కదా అని వాదించటం మొదలు పెట్టను. మంత్రాలకు చింతకాయలు రాలవండి అనీ, మూఢనమ్మకాలు వద్దండీ వాళ్ళు అఙ్ఞనంతో వున్నారనీ చెప్పాను. నా వుద్దెశ్యం ఏదైనా మాచైర్మేన్ గారికి నేను గిరిజనులను తక్కువ అంచనా వేస్తున్నానని కోపం వచ్చింది. వాళ్ళవి మూఢనమ్మకాలు కాదనీ, వాళ్ళు ప్రకృతి లో మనకు తెలియని కాస్మిక్ పవర్ తో మాట్లాడగలరనీ, మనకు తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలకు వాళ్ళదగ్గర మనకంటే మంచి పరిష్కారం వుందని చెప్పారు. నేను కూడా అది గమనించాను.
అక్కడ ఎవరైనా సరే పంట వెయ్యాలంటే మొదట దిసారి నిర్ణయమే. పంటల కాలం మొదలయ్యే ముందు అందరు వారి పొలం నుండి కొంత మట్టి తీసుకొని వచ్చి దిసారికి చూపిస్తారు. దిసారి పదవి వంశపారంపర్యంగా వస్తుంది. కాబట్టి మట్టికి సంబందించి ఙ్ఞానం అంతా వారికి తరాలుగా వస్తుంది. ఏ మట్టిలో ఏ పంట పండుతుంది, మట్టి రంగు, వాసన, రుచి బట్టి అందులో వున్న ధాతువులేంటి అని అంచనా వెయ్యగలుగుతారు. అందుకే నత్రజని వంటివి తక్కువైతే పూజ పేరుతో పచ్చి ఎరువు ఆ భూమికి దొరికేలా చేస్తారు. దిసారి కావాలంటే ఆ ఙ్ఞనం నేర్చుకోవాలి. మంత్రాలు కేవలం ప్రజలలో నమ్మకం కలిగించటం కోసమే, కాని అసలు మాయ ఈ తరతరాల సైన్సు విఙ్ఞనమే.
నాకు అక్కడ అన్నిటికంటే నచ్చినది "బులు" - నా చిన్నారి స్పైడర్ మ్యాన్.పంటకి ఏదైనా తెగులు వచ్చిందంటే వాళ్ళ దిసారి వాళ్ళకి ఒక జీలుగు చెట్టుకి పూజ చేసి వాటి కొమ్మలు తీసి ఇస్తాడు. ఆ మంత్రించిన జీలుగు చెట్టు కొమ్మలు వారి చేనులో అక్కడక్కడ గ్రుచ్చితే చీడ పోతుందని నమ్మకం. కాని అసలు సీక్రెట్ దిసారి ఏరి కోరి తీసి ఇచ్చే కొమ్మల మీద నా హీరొ స్పైడర్ మ్యాన్ గూడు (వెబ్) వుండటమే, అవును బులు అనే ఈ సాలి పురుగు, సింగిల్ మ్యాన్ ఆర్మీ కాదు, బులు ఒక సామాజిక జీవి, అంటే మన తీనెటీగ లా ఒక గూడులో చాలా పెద్ద బులు జాయింట్ ఫామిలీస్ వుంటాయి. ఆ గూడులో రూములు కూడా వుంటాయండోయ్!! అంటే మన డైనింగ్ హాలు, బెడ్ రూములు,దెలివరీ రూం, నర్సింగ్ రూము ఇలా.ఆ సాలి గూడు ని మద్యలోకి రెండు భాగాలుగా జాగ్రత్తగా కట్ చేసి చూస్తే ఇంత చిన్న పురుగులు ఇంత టెక్నికల్ గా ఎలా గూడు కట్టాయా అనిపిస్తుంది. ఆ చిన్న వెబ్ లో వాటికి కావలసిన అన్ని సదుపాయాలున్నయి.ఇవి పగలంతా హ్యాపీగా నిద్రపోయి రాత్రి పూట ఫ్యామిలీ మెంబర్స్ అందరు గూడులోనుండి బయటకొచ్చి పంట పొలం లో వున్న చీడపురుగుల్ని తింటాయి. అంటే బులు ఒక మిత్ర క్రిమి (ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతులనీ, ఐ.పి.ఎం పద్ధతి అనీ మనం కూడా అదే పద్ధతుల్లోకి వస్తున్నాము)
అదేవిధంగా పశువులకు సంబందిచిన జబ్బులకు, ఎక్కువ పాలు కొరకు, ఎంతో విలువైన సమాచారం వుంది దిసారి దగ్గర.
ఇక గునియాల విషయానికి వస్తే వీళ్ళకి చాలా వరకు స్త్రీల ఆరొగ్యానికి సంబందించిన విషయాలు,సమాచారం వాళ్ళకి తరాలుగా వస్తుంది. అవి పాటల రూపంలో, కొన్ని రకాల ముగ్గులు గుర్తుల ద్వారా వాళ్ళు ఆ సమాచారం తరువాత తరానికి అందిస్తారు. గునియాలు గర్భిణి స్త్రీలలో పిండం స్థితి కొన్ని లక్షణాలు చూసి చెప్పగలుగుతారు. కడుపులో బిడ్డ ఎలావున్నది చెప్పగలుగుతారు. గునియాలకి కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ తెలుసు. ఏ దుంపలు, ఆకులు తింటే తల్లికి ఎక్కువగా పాలుంటాయి అని, బిడ్డలో వచ్చే చాలా జబ్బులకొసం తల్లి ఎటువంటి ఆహారం, మొక్కలు తినాలని చెప్తారు.
అడవిలో వెళ్తున్నప్పుడు ఎన్నో ఆకులు, మొక్కలు, దుంపలు కలక్ట్ చేస్తుంటారు దిసారి, గునియాలు. ఆ మొక్కల, దుంపల వుపయోగం వాళ్ళకి తరాలుగా వస్తున్న సమాచారం.మనం అటువంటి ఎంతో గొప్ప సమాచారం, నాలెడ్జ్ వాళ్ళ పరిస్థితులకు అనుకూలమైనది నాగరికత ప్రభావం వల్ల చాలా త్వరగా కోల్పోతున్నాము.
ఈ సమాచారం అంతా దిసారి గునియా ఇంక కొన్ని వర్గాలు పాటల్లో, ముగ్గుల్లో, పండగల్లో, మంత్రాలలో వుంచారు. కాని ఇప్పుడు మన సినిమా పాటలే అక్కడా వినిపిస్తున్నాయి
అక్కడ పని చేసిన ఒక సంవత్సరంలో నేను ఒకే ఒక పాట చరణం కాస్త నేర్చుకున్నాను "ఇచి ఇచి మువాపొడే రే సొయీ రణజలొథిలా డేగ ఇపాయా, ఇసమ కొరిబ అసె అసె రే సొయీ రణజలొతిలా దేగ ఇపాయా" ఈ రెండు ముక్కలు మాత్రం నేర్చుకున్నా.(అర్ధం ఏంటి అని మాత్రం అడగకండి, మీకెవరికైన తెలిస్తే మాత్రం చెప్పండి )
సరే ఇక అసలు దిసారిలకి తెలిసిన వైద్యం ఏదో చేస్తున్నారు!! అసలు ఒకరికి ఏదైనా పెద్ద ఆరొగ్య సమస్య వస్తే పల్లెలకే సరైన రవాణా సదుపాయలు లేవు అలాంటిది ఈ కొండల్లో వాళ్ళ పరిస్థితి దారుణం. గిరిజనులకోసం ప్రభుత్వం అన్ని సదుపాయలతో ఆసుపత్రి, ఆంబులన్స్ అందులోనే అధునాతన పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చాలా చేస్తుందండీ కాని ఆ వ్యవస్థలో పని చేసే వాళ్ళు మాత్రం అవి అవసరమైన వాళ్ళకి అందకుండా చేస్తారు. ఎక్కడ వుండాల్సిన సిబ్బంది అక్కడ వుండరు/వుండలేరు. అన్ని చోట్ల వుండకూడనంత అవినీతి వుంటుంది.ఇక తిట్టటం మొదలు పెడితే ఇది ఎక్కడా ఆగదు.నేను కూడా ఈ సమాజంలో భాగమే కదా!!
డాక్టర్, ఇంజనీర్, టీచర్ అని ప్రతీ ప్రొఫెషనల్ ని కూడా మొదట కనీసం 2,3 సం.లు తప్పనిసరిగా పల్లెలలో, గిరిజన ప్రదేశాలలో చేయనిదే ఎక్కడా పనిచేసె అర్హత ఇవ్వకూడదు అనిపిస్తుంది(చదువులో భాగంగా, ఇంకా పావురాల్ల మనసుతో వుంటారు కాబట్టి.ఒకసారి సమాజంలోకి వృత్తిలోకి వచ్చేస్తే కాకుల గుంపులో చేరి కాకులైపోతారని చెప్తారు). అలా ఐనా కనీసం కొందరైన అక్కడ వుండి చేస్తారేమో! అయిన మనం శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు/ఉపయోగాలు కనిపెట్టగలం కదా, ఇలాంటి ఎన్ని రూల్స్ పెట్టినా వుపయోగం వుండదు.
నేను డాక్టర్ చదవనందుకు నేను బాధపడిన సంధర్భం కూడా అప్పుడే.ఒక సారి నేను నీలయ్య, మేరీ అరకు కి పద్మావతిపురం నుండి కొండమీద 20 కి.మీ పైన దూరం వుండే ఒక గూడెంకి వెళ్ళాము. ఆ గూడెం లో మాకు అంతకుముందు వెళ్ళినప్పుడు వున్న వాళ్ళ ఇంట్లో ఈసారి విడిది ఏర్పాటు చేయలేదు, కారణం అడిగితే ఆ ఇంట్లో మేము చూసిన 16సం.ల అమ్మాయి కి రెండు రోజులుగా ప్రసవం నొప్పులతో వున్నదని మాకు ఇబ్బంది అవుతుందని ఇలా వేరే చోట ఏర్పాటు చేశామని చెప్పారు.నేను, మేరీఅక్క, ఆమెని చూడడానికి వెళ్ళాము. లోపల అంతా చీకటి గది, వాసన వస్తుంది ఒక గునియా ఇంకా కొందరు స్త్రీలు వున్నారు. నేను సినిమాలలో చూసినట్లు ఆమె అరవాలి కదా అని ఎదురుచూశాను, కానీ ఆమె అప్పటికే చాలా కష్టపడిందని అలసిపోయిందని ఇక ప్రసవానికి ప్రయత్నం చేయలేకపోతుందని చెప్పారు.మేరీ అక్కకి కొంచెం ఐడియా వుందనుకుంటా, అలా వదిలేయకూడదని ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పింది. కానీ లోపలకి వెళ్ళి వచ్చిన మేరి అక్క బయటకి వస్తూనె కన్నీళ్ళతో వచ్చింది. కొంపదీసి చనిపోయిందా అని అడిగితే లేదు, రా నీకు చూపిస్తా అని తీసుకుని వెళ్ళింది. నాజీవితంలో మొదటిసారి ఒక ప్రసవం చూస్తున్నను అప్పుడు....కానీ బిడ్డ కాళ్ళు కాస్త బయటకి వచ్చివున్నాయి కొద్దిగా కదులుతూ చిన్న పాదాలు. నాకు అందులో ఏడవటానికి ఏముందో అర్ధం కాలేదు. గునియా ఆ అమ్మాయిని మొహం మీద కొడుతుంది, పొట్టమీద పైనుండి కింద వైపుకి నొక్కుతూ బిడ్డ బయటకి వచ్చేందుకు తోస్తుంది. అందులొ నాకు సమస్య అర్ధం కాలేదు, మేరీ అక్క అప్పుడు చెప్పింది బిడ్డ మొదట తల బయటకి రావాలి కానీ కాళ్ళొచ్చాయి, ఆసుపత్రి లో అయితే ఎదైనా చేస్తారు, అదికాక 2 రోజులయ్యి ఆమె కష్టపడుతుంది ఇక ప్రసవంకి ఆమె ఏమి చెయ్యలేదు అని.నాకు నేను డాక్టర్ చదివి వుంటే ఎంత వుపయోగపడేదికదా అని, నేనేమీ చెయ్యలేకపోతున్నందుకు చాలా కష్టంగా అనిపించింది.
వాళ్ళంతా ఇక చేసేది ఏమీ లేదన్నట్లు దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు నిర్వికారంగా వున్నారు, ఒక్క గునియా మాత్రం ఆమెని కొడుతూ బిడ్డ కాళ్ళదగ్గర నిప్పుతో వేడి చురుకపెట్టేలా వేడి తగిలిస్తూ ఏదో ప్రయత్నం చేస్తుంది. నేను , మేరి అక్క వాళ్ళని ఒప్పించి ఆసుపత్రికి బయలుదేరించాము.మా కారు కొండకింద వుంది అక్కడవరకు ఎలా అయినా జాగ్రత్తగా తీసుకెళ్తే ఆసుపత్రికి కారులో వెళ్ళొచ్చని చెప్పాము. అక్కడ ఫోను లేదు, ఏ బస్సు రాదు, నడిచి మాత్రమే దారి. నులక మంచం మీద ఆమెని పడుకొబెట్టి నలుగురు మోస్తూ కొంతమందితో కలిసి కొండ దిగటం మొదలుపెట్టాము. నేను మేరి అక్క వాళ్ళ వేగం అందుకోడానికి పరిగెడుతూ వెళ్ళాము. కనీసం ఒక 3 గంటలు పట్టే నడక గంటన్నరలో పూర్తిచేశాము. కారు దగ్గరకి వచ్చాక ఆమెని కారులోపలికి ఎక్కించాలని చూసినప్పటకి ఆమె చనిపోయి వుంది, ఒళ్ళు చల్లబడిందని నీలయ్య చెప్పాడు, అందరు నాడి చూసి నిజమే అన్నారు. ఎవరు ఏమి మాట్లాడలేదు. ఇకా ఆసుపత్రికి వద్దు అని మళ్ళీ వెనక్కు బయలుదేరారు. కనీసం ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్తే అందరికీ తెలుస్తుంది కదా అనీ, ఇంకేదో జరుగుతుందని ఆశతో మేరి అక్కకి చెప్పాను.కానీ ఇదంతా ఇక్కడ అలవాటే, ఒకవేళ మనం ఆసుపత్రికి వెళ్ళినా అక్కడ డాక్టర్ వుండరని, శవం తో ఎన్నిరోజులు అక్కడ వుంచుతారో, ఏమో వద్దు అని చెప్పింది. ఇక ఎవరు మాత్రం ఏమి చేస్తారు? ఆసుపత్రికి మొదటిరోజే తెస్తే బాగుండేదని మాకు కోపం వస్తే, హాయిగా ప్రశాంతంగా ఆమె ఇంట్లొ,తన వాళ్ళందరి మద్య గూడేం లోఆమెని చావనీయలేదని వాళ్ళకు మా మీద కోపం వచ్చింది.
కనీస అవసరాలైన కడుపు నింపేంత తిండి, సరిపడేంత బట్ట, స్వచ్చమైన గాలి, మంచి నీరు, ఆరోగ్యం, రవాణా,చదువు ఇటువంటి అవసరమైన సదుపాయాలు, భద్రత సామాజిక జీవులైన మన అందరికీ కల్పించలేని సమాజం మనది.ఇది జరిగిన చాలా రోజులు నాకు చాలా బాధగా అనిపించింది.ఒక ప్రాణం ఎంత నరకం అనుభవించిందో కదా కొండ దారుల్లో? ఆమెని అటువంటి పరిస్థితిలో పరిగెడుతూ తీసుకెళ్తుంటే ఆ కుదుపులకే ప్రాణం నిశ్శబ్ధంగా పోయిందేమో అని!! చిన్న "బులు" తన గూడులో కల్పించుకున్న సదుపాయాలు కూడా మనుషులైన మనలో చాలా మందికి లేవు.అందుకే వాళ్ళు మనల్ని మంత్రాలని, ఆత్మలని, దేవుళ్ళని నమ్ముతారు.కనీసం ఆ (మూఢ) నమ్మకాలు వుంటే కాస్త ధైర్యం ఐనా వుంటుంది కదా. లేదంటే చిన్నపిల్లలు నమ్మేలా ఏ సూపర్ మ్యానో, స్పైడర్ మ్యానో నిజంగా రావాలి.
4 comments:
పట్నాలలో ఉన్న ఆస్పత్రుల్లో సౌకర్యాలుండవు..
గిరిజన ప్రాంతాలలో ఆస్పత్రులు ఉన్నా, డాక్టర్లు ఉండరు.
2003లో అరకు వచ్చినప్పుడు చూశాను,
చాపరాయి కొండ దగ్గర ఒకతను జారి పడి దెబ్బలు తగిలితే ఆస్పత్రిలో డాక్టరు లేరు. పోనీ కాసేపట్లో వస్తాడా అంటే.. అదీ లేదు.
వస్తాడో లేదో అసలు తెలియదు.
కొంచెం ఓర్చుకునే దెబ్బలు కాబట్టి, వైజాగ్ వచ్చాక ట్రీట్మెంట్ ఇప్పించాం అతనికి. అదే ప్రాణాపాయం అయితే?
ఏదో ఎప్పుడైనా ఓసారి వెళ్లే మాకే అన్ని ఇబ్బందులనిపిస్తే..
అక్కడే ఉండే వారి పరిస్థితి, ఆ డాక్టర్ దయా దాక్షిణ్యాలమీద బతికే దుస్థితి చూసి జాలేసింది.
కానీ ఏమైనా చేయాలనిపిస్తుంది వాళ్లకి.
మీడీయాలో ఉన్నందుకు ఏదో ఒకరోజైనా చేయగలమనే నమ్మకం ఐతే ఉంది.
శిరీష గారూ !
నిజమే ! తోటి మనుష్యుల్ని నమ్మలేని పరిస్థితి మనది. వాళ్ళకు ఆ నమ్మకాలైనా ఆసరా వున్నాయి. కానీ మనకు దేవుడనే నమ్మకం కూడా కలుషితమైపోయింది.
కథనం బావుంది. అభినందనలు.
చాలా బాగా రాసారు . చదువుతుంటే ఎదురుగా జరుగుతునట్లు గ్గా వుంది .
మనసు అదో లా ఐపోయిందండి చదువుతుంటే. మాటలు కూడా రావటం లేదు ఏమని చెప్పాలో. ఎన్ని తెలియని కోణాలను చూపిస్తున్నారండీ. చాలా థ్యాంక్స్.
Post a Comment