Friday, April 2, 2010

నా వెన్నెల రాత్రులు

ఇప్పుడే వెన్నెల చూసి వచ్చి కూర్చున్నాను. లక్కీ నిద్రపొతున్నాడు. బయట ఒక చందమామ, నాపక్కన ఒక చందమామ....లక్కీ, నా కొడుకు (తిట్టుకాదు నాకున్న ఒకేఒక బాబు) సరే వెన్నెల రాత్రులు అని మొదలుపెట్టి కొడుకు గురించి చెప్తుందేమిటీ టైము వేస్ట్ సోది కాకపోతే అనుకుంటున్నారా?వస్తున్నా వస్తున్నా అసలు విషయానికే వస్తున్నా. 

గిరిజనుల గురించి నా అనుభవాలతో ఈ వీక్ ఎండ్ కి పోస్ట్  రాయాలని మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు ఆ మూడ్ రావటంలేదు.నాకు ఎప్పుడు ఏది రాయలనిపిస్తుందో అది మాత్రమే రాయగలను, రాస్తాను. ఒకసారి లెక్కల పరీక్ష రోజు, పరీక్ష హాల్లో కవిత్వం తన్నుకుంటా వచ్చేసింది. అది రాస్తే కాని నా మనసు ఇక దేని మీదకి పోదు అందుకే మొదట కవిత్వం రాసేసా, ఆ తరువాత తీరికగా లెఖ్ఖలు చేసాను.అప్పుడు నా పేపర్ దిద్దిన వాళ్ళు బలయ్యారు,ఇప్పుడు ఈ బ్లాగ్ చదివే వాళ్ళు.(కవిత్వం రాయనులెండి, భయపడొద్దు)

ఇప్పుడు నా వెన్నెల రాత్రుల అనుభవాల గురించి రాయాలని వుంది. టైటిల్ చూసి మీరెదో ఊహించేసుకుంటున్నరు కదా! నేను స్వాతి వీక్లీ లో సరసమైన కధ లాంటిది రాస్తాననుకొనేరు, ఇది అది కాదు. కానీ ఇది అంతకంటే కూడా చాలా ఇదైనది.(ఆ ఇది ఏంటో తెలియాలంటే పూర్తిగా చదవండి)

నేను చాలా అందమైన వెన్నెల రాత్రులు చూశాను. బహుశా మీకనిపించవచ్చు వెన్నెల ఎక్కడైనా వెన్నెలే కదా ఏంటి పేద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. కాని ఆ తేడా నాకే తెలుసు. టౌన్ లో ఇళ్ళమద్య వెన్నెలకీ, నేను చూసిన వెన్నెలకీ చాల తేడా వుంది.అలాంటి వెన్నెల రాత్రి అనుభాలలో ఇది ఒకటి.ఈరోజు గుర్తొచ్చింది ఎందుకో!

ఎప్పుడూ మా ఇంటి డాభా మీద నుండి మాత్రమే వెన్నెల చూశాను. ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్లో వున్నప్పుడు సముద్రం దగ్గర వెన్నెల చూసాను. ఎలా చూసినా వెన్నెల నన్ను కాళ్ళు చేతులు కట్టేసి కనీసం ఒక గంట అయిన నన్ను మంత్రముగ్ధను చెసేసేది. అలాంటిది ఒకసారి ఏమయిందో తెలుశా. ఒక గిరిజన గ్రామం..అరకు దగ్గర, నైట్ స్టే గూడెంలోనే. అక్కడ దోమలకి, కొత్తపరిసరాలకి ఇంకా అలవాటు పడలేదు కాబట్టి కాస్త రాత్రి అంటే భయంతో వున్నాను. వెన్నెల,గిన్నెల చూసే మూడ్ లేదు. కాని నేను వున్న ఇంటి గిరిజన స్త్రీ నన్ను బయటకి రా అని ఎక్కడకో వెల్దామని చెప్తుంది. నాకు వాళ్ళకి ఎప్పుడూ మూగ బాషే. బహుశా అతిది మర్యాదలో భాగంగా నన్ను టాయిలెట్ కి తీసుకెల్లాలని ఆశపడుతుందేమో, నాకు అవసరం లేదు అని చెప్పాను. సాధారణంగా పల్లెల్లో కూడా స్త్రీలు కాలకృత్యాలు తీర్చుకునేది రాత్రిపూట లేదా చీకటి వేకువన. ఆమె నా మాట వినలేదు రమ్మంటుంది. సరే అని వెళ్ళాను. సాధారణంగా రాత్రి అంతా తాగి వుంటారు అని వెళ్ళను. కాని బయట చూస్తే పండగలా వుంది. "పున్నమి వెన్నెల" గూడెం అందరు పిల్ల పెద్ద అందరూ బయటే వున్నారు. నవ్వుతున్నారు, సంతోషం కూడా నాలాగ ఆరోజు అక్కడ నైట్ స్టే అనుకుం!!! (ఆ ఆలొచన రాగానే అయ్యబాబోయ్ కవిత్వం వచ్చేస్తుందేంటి అనుకున్నా) . వెన్నెల ఎంతగా ప్రకాశిస్తుందంటే...నిజంగా పిండి ఆరబోయటం అంటే అదే అనుకుంటా. కాని ఇది బియ్యం పిండి, మినప్పిండి కాదు, వెన్నెల పిండి. అవును వెన్నెల పిండి ఆరోజే చూశాను. అది ప్రకాశిస్తుంది, ఆ చుట్టుపక్కలంతా ఆ కాంతితో ప్రతి చెట్టు, ప్రతి గుడిసె, ప్రతి మనిషి, ప్రతీది ఆఖరికి ఆకాశం, నేల తో పాటు నేను కూడా ప్రకాశిస్తున్నాను. ఇంతలో ఆడవాళ్ళంతా ఏంటో కొలాహలం, అరుపులు , నవ్వులు. ఎదో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ లేస్తున్నారు. నా పక్కనే కూర్చున్న ఆడవాళ్ళుకూడా జండావందనం రోజు చాక్లెట్స్ కోసం పరిగెడుతున్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా కేరింతలు నవ్వులతో పరిగెత్తారు. ఎదో జరుగుతుంది అనితెలుస్తుంది కాని, జరిగింది చూశాక ఇలాకూడా జరుగుతుందా అనిపించింది. ఆడవాళ్ళంతా కలిసి ఒకరి నడుము ఒకరు పట్టుకొని ధింసా ఆడటం మొదలు పెట్టారు. నేను అదే మొదటసారి ధింసా నృత్యం చూడటం. నవ్వుతూ తుళ్ళుతూ ఎవరు మొదలుపెట్టారో తెలీదు కాని ఒకరికి ఒకరు చేతులు కలుపుకుంటూ ఒకరి నడుం మీదుగా ఆపక్కవున్న వారి చెయ్యి పట్టుకొని అందరు కాళ్ళు పాదాలు ఒకేవిధమైన స్టెప్స్ వేస్తు అందరు కలిసి జట్టుగా ఒకేవైపు కదులుతున్నరు. ఆ లైను మొదటవున్న వ్యక్తి ఒక చిన్న రంగు బట్ట చేత్తో పట్టుకొని వూపుతూ లైన్ ని పాము మెలికలు తిరిగినట్లు తిప్పుతూ కదులుతుంది. నాకు చిన్నప్పటినుండి డాన్స్ అంటే ప్రాణం. అలాంటిది ఈ వెన్నెల్లో అన్ని మరిచి ఆనందంగా ఒక మధురమైన పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్న వాళ్ళని చూస్తే అసలు ఇదే కదా జీవితం అంటే అనిపించింది. మన ఊర్లో ఆడవాళ్ళు కనీసం ఇంట్లో డాన్స్ చెయ్యగలరా? కనీసం మనసు సంతోషంతో మత్తెక్కిపోతే ఆనందంగా ఆడగలరా? పాడగలరా? అసలు మనకి చిన్నప్పుడే ఆట,పాటలన్నీ ఆపేస్తారెందుకు. వీళ్ళల్లో ఇంత వుత్సాహం, అది వ్యక్తపరచడానికి మార్గం కూడా వున్నాయి. మరి మనకేమున్నాయి? మనసు సంతోషంతో వున్నప్పుడు డాన్స్ చెయ్యాలని ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలీదు కానీ నాకు  ఆనందం కలిగితే డాన్స్ చెయ్యలనే అనిపిస్తుంది. అది ఇక్కడ నా కళ్ళ ఎదురుగా జరుగుతుంది!!! ఇది కలా నిజమేనా!!!

నన్ను కూడా ఎవరో లాగారు, నేను కూడా ధింసా చేశా...నిజం. అప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏదో స్కూల్ ప్రోగ్రాములోనో, పోటీలలోనో ఏదో చిన్నపాటి పిల్ల డాన్స్లు చేసాను. మా ఇంట్లో వాళ్ళందరికి కొంచెం డాన్స్ ఇష్టం వుండటం వల్ల మాకు అప్పుడప్పుడు కొంత డాన్స్ నేర్పించారు. అదంతా ఏదో సహజంగా ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఆరోజు...వెన్నెల్లో, ఆరుబయట, చల్లనిగాలిలో, నాతోటి ఆడవాళ్ళందరితో,ఏరకమైన భయం జంకు లేకుండా నవ్వుతూ అరుస్తూ చేసిన ఆ ధింసా నాకు అప్పటివరకు వున్న సంకొచాలు, బాధలు, కలతలు, నొప్పులు అన్నీ నాకు దూరమైపోయి ఏదో తెలియని సంతోషం ఆవహించింది.అప్పుడే నేను కరెక్టైన ప్రదేశానికి వచ్చానని ఇప్పటివరకు జీవితంలో ఏదో దారి తెలియని క్రొత్త ప్రదేశంలో వున్నాననీ అనిపించింది. 

అప్పుడే కాదు ఎప్పుడు అవకాశం వచ్చినా నేను ధింసా ఆడుతునేవున్నా. మీరుకూడా ఎప్పుడైన మీతో పాటు నలుగురిని చేతులు కలిపి ఆడండి అందులో ఆనందం నేను చెప్తే మీకు అర్ధం కాదు మీరు అనుభవించాలి. మైమరచి ఆడటం, పాడటం, కవితలు చెప్పటం, డాన్స్ చెయ్యటం ఇవన్నీ ఒకరకమైన యోగా వంటివి. మన బాధలు అన్ని మరిపిస్తాయి. ఇది నా అనుభవం.

చాలా సమయం ధింసా చేశాక నేను అలసిపోయి కూర్చున్నాను, వాళ్ళకి అలసట అంత త్వరగా రాదేమో ఆడుతునే వున్నారు. నేను కూర్చుని చూస్తున్నా. ఎంత బాగుంది ఆ వెన్నెల రాత్రి, విపరీతమైన ప్రకాశం తో వెన్నెల, అదుపులేని ఆడవాళ్ళు, అంతులేని ఆనదం, అలుపులేని ధింసా.......ఇంత అద్భుతం నేను మళ్ళీ ఇంకెక్కడైనా చూడగలనా? ఒక్కసారి మా ఇళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ గుర్తొచ్చారు. మేమంతా ఎప్పుడైన ఇంత సంతోషంగా నృత్యం చేయగలమా? వెన్నెల్లో ఆడగలమా? అందులో వూరిమద్యలో? గట్టిగా నవ్వితే, మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారని  అనే భయాలతో బతికే నాకు ఇది నిజంగా స్వర్గం అనిపించింది. చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కాని వీళ్ళు రోజు స్వర్గంలో వుంటున్నారే. ఇంత సహజత్వం, ఇంత ప్రకృతి, ఇంత అందం, ఇంత స్వేచ్చ........నాకు అంత అందం, అంత  వెన్నెల ఎలా భరించాలో తెలియటం లేదు, చచ్చిపోవాలనిపించింది.ఈ వెన్నెల రాత్రి ఎంత బాగుంది? ప్రకృతికి ఎక్కడనుండి వచ్చింది ఇంత శక్తి? నన్ను ఈ చందమమ ఇలా లొంగదీస్తుందేమిటి? ఆ వెలుగు, ప్రకాశం, సంతోషం ఎంత బాగుందంటే అప్పుడే అక్కడే చచ్చిపోతే ఎంత బాగుంటుంది అనిపించేంత బాగుంది. ఇంత ఆనందంలో చావాలని ఎందుకనిపిస్తుంది అని ఆలోచించా...ఆశ్చర్యం నాకు నిజంగా చచ్చిపోవాలనే అనిపించింది.(ఎవరైనా ప్రియ నేస్తం తోడుగా వుంటే ఆ వెన్నెల్లో చేతులు పట్టుకొని అడవిలో నడుస్తే బాగుండేది అనికూడా అనిపించింది అనుకోండి) ఇలాంటి అద్భుతమైన వెన్నెల రాత్రులు  చూసినపుడు నాకేకాదు ఎవరికైనా అలాగే అనిపిస్తుందేమో!!!! చాలా సేపు ధింసా ఆడిన తరువాత వెళ్ళారు అందరు. కానీ చాలామంది అక్కడే వెన్నెల్లో నిద్రపోయారు. నాకు కూడా బయటనే మంచం వేశారు నేను వున్న  ఇంటివాళ్ళు. ఆ భరించలేని వెన్నెల చూస్తూ  నిద్ర కోసం ప్రయత్నించాను. ఏదో తెలియని బాధ కలుగుతోంది అప్పుడు..ఎందుకీ బాధ? నాకే  అర్ధం కాలేదు. మనిషి  మనసు విచిత్రమా లేక ప్రకృతి చేస్తున్న మాయా? ఇంతలోనే అంత సంతోషం, అంతలోనే ఇంత తెలియని విషాదమా???ఆ బాధతో నిండిన సంతోషాన్ని, సంతోషంతో కూడిన బాధని కూడా నా అలసట జయించింది. హాయిగా వెన్నెల నన్ను జోకొట్టింది. కలలుకూడా కలతపెట్టలేని నిద్ర వచ్చింది.

ఇంత సంతోషం గా గూడేం నాట్యం చేసిందే ఇంతకీ ఆ రోజు ఏమి పండగ? వెన్నెల పండగ నా?

18 comments:

bloggerbharathi said...

శిరీష గారూ అననా లేక శిరిశా అననా నిజంగా మీరు దిరిషేనపుష్పమే. చదువుతున్నంత సెపూ వెన్నెల్లో మీతోకలిసి నేను కూడా ధింసా నాట్యం చేస్తూనే ఉన్నాను. ఒక అనుభవం కలగటం ఒక ఎత్తైతే దాన్ని అంటే భావం తో వ్యక్త పరచడం అద్భుతం. మీ శైలి హృద్యం. ఎప్పుడెప్పుడు అరకులో వెళ్లి వెన్నెల్లో నర్తిద్దామా అనిపిస్తోంది. . నేనుకూడా D.R.D.A లో డ్వాక్రా పధకంలో చాలా ప్రదేశాలు తిరిగాను. కానీ నేను ఎప్పుదూ పేపర్ మీద పెట్టె ప్రయత్నమే
చెయ్యలేదు. చాలా బాగుంది--. జయభారతిసుసర్ల

bloggerbharathi said...

శిరీష గారూ అననా లేక శిరిశా అననా నిజంగా మీరు దిరిషేనపుష్పమే. చదువుతున్నంత సెపూ వెన్నెల్లో మీతోకలిసి నేను కూడా ధింసా నాట్యం చేస్తూనే ఉన్నాను. ఒక అనుభవం కలగటం ఒక ఎత్తైతే దాన్ని అంటే భావం తో వ్యక్త పరచడం అద్భుతం. మీ శైలి హృద్యం. ఎప్పుడెప్పుడు అరకులో వెళ్లి వెన్నెల్లో నర్తిద్దామా అనిపిస్తోంది. . నేనుకూడా D.R.D.A లో డ్వాక్రా పధకంలో చాలా ప్రదేశాలు తిరిగాను. కానీ నేను ఎప్పుదూ పేపర్ మీద పెట్టె ప్రయత్నమే
చెయ్యలేదు. చాలా బాగుంది--. జయభారతిసుసర్ల

radhika said...

wahh...మీ వర్ణన తో పట్టపగలు నాగదిలో వెన్నెల ని అనుభవించాను.

శిరీష said...

జయభారతి గారు,

నన్ను శిరీష అనాలి. పోస్ట్ నచ్చినందుకు సంతోషం. మీరు డి.ఆర్.డి.ఎ ఏ జిల్లలో చేశారు? మీ అనుభవాలు కూడా నాలాగే వుండొచు. నేను కూడా పనిచేశా. శ్రికాకుళం, వెస్ట్ గోదావరి లో. మీరు తప్పక రాస్తే బాగుంటుందనిపిస్తుంది.ఆలోచించండి.

శిరీష said...

Radhika gaaru,

thanks. its good to feel moon ninght in the summer.

శరత్ కాలమ్ said...

మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష్యగా వుంది. నేను గడపాలనుకున్నవిధంగా మీరు గడిపేస్తున్నారు!

శిరీష said...

శరత్ గారు,

నాకు కూడా ఈర్ష్యనే కలిగింది వాళ్ళని చూసి. కాకపొతే అప్పుడప్పుడు అలా వెళ్ళేవకాశం మనకి వుండొచ్చు కాని అక్కడి కష్టాలు తప్పించుకొని మనలా బతకడం వాళ్ళకి కుదరదు కదండి.

Anonymous said...

కధ బాగుంది కానీ ప్రొఫైల్ ఫొటో బాలేదు. పొద్దున్న పనికి పోయే ముందు తీసిన ఫొటోలా ఉంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

నిజమేనండీ, ఆనందం వ్యక్తపరచడంలో ఆడా, మగా కూడా మొహమాట పడుతూండటం సర్వ సాధారణంగా కనిపిస్తూంటుంది.మంచి విషయం గురించి రాశారు.

భావన said...

అధ్బుతం శిరీష గారు. అబ్బ ఆ వెన్నెల మీరు వర్ణిస్తుంటేనే ఎంత హాయి గా వుందండీ. చాలా బాగా రాసేరు, ఎంత బాగానో వర్ణించారు. అవును మాములు గా చూస్తేనే వెన్నెల ఒక్కోసారి ఎంతో బాధ వస్తుంది. చెప్పలేని సంతోషం ఎక్కువ అయ్యి కూడా అదో లాంటి బాధ అనిపిస్తుంది. ఇంక అక్కడ వున్న మీ పరిస్తితి ఎలా వుందో వూహించుకోగలను. అధ్బుతం.

Change Maker said...

ఆ అమలిన ప్రకృతిలో అంత వెన్నెల అందాన్ని ఆస్వాదించటం చాలా అదృష్టం. మీరు పెట్టి పుట్టారు.
The kaleidoscope of emotions you have gone through is really amazing.

You are showing the contrast between the materialistic,instant world in which we are living and a world that was untouched by development, a world that live by nature.

శిరీష said...

@ మందాకిని, బాటసారి, భావన,

థాంక్స్ అండి.మీరు పొగుడుతుంటే నేను మురిసిపోతున్నాను.నిజంగా.


@ Anonymous garu,

మీరు ఏ కధ గురించి చెప్తున్నరు? నేను కధ రాయలేదు కదండీ! ఒకవేళ మీరు నా ప్రొఫైల్ ఫొటో గురించి మాట్లాడుతుంటే బహుసా మీరు చెప్పేది నిజమే, నా పోస్ట్ కి ప్రొఫిలె ఫొటో కి సంబంధం లేదు. నాకు బ్లాగ్ పేజి డిజైన్ చేసుకోవటం రాదు.

శిశిర said...

అనుభూతిని మాటల్లో తెలపగలగడం అందరికీ సాధ్యం కాదండి. చాలా బాగా రాశారు.

SRRao said...

శిరీష గారూ !
వెన్నెల కురిసిన రాత్రిని మీరు వర్ణించిన తీరు బ్లాగులోకంలో అమృతం పంచింది. అభినందనలు.

maa godavari said...

మీ కామెంట్ చదివి మీ బ్లాగ్ కి వెళ్ళేను.
నా బ్లాగ్ కి వచ్చి నేను రాసింది చదివి కామెంట్
రాసిందుకు థాంక్స్.
దిరిసెన పుష్పాలు పేరు చాలా బావుంది.
మీరు రాసిన నా వెన్నెల రాత్రులు అద్భుతుంగా ఉంది.
నేను వెన్నెల్లో మా గోదారిని ప్రేమించేదాన్ని.
ఒక సారి లడఖ్ వెళ్ళినప్పుడు
లేహ్ లో ఒకరాత్రి ఉన్నాను.ఆ రాత్రి మంచు కొండల్లో వెన్నెల
ధవళ కాంతుల్ని చూసి నేను ఆనందం పట్టలేక బిగ్గరగా ఏడ్చేసాను.
అబ్బ!! ఆ సోయగం,ఆ సౌందర్యం,
ఎంత చూసినా తనివి తీరదు.అనుభవించాల్సిందే.
అడవిలో మీ అనుభవం అలాంటిదే.
అభినందనలు.
భూమిక ఫోన్ నంబర్ 040 27660173.
కుదిరితే మనం మాట్లాడుకోవచ్చు కదా!!!

chandramohan said...

meeru rasina 'veelandru manasika rogule' chadivi ilaa vachchi vennello thadisanu. baaga rasaaru. oka anubhavaanni pondi padilangaa hrudayamlo dachu kovaadam veru. aa anubhoothini andaritho panchukovadam veru.indulo edo theliyani thrupti untundi. mee rendu postulu chadivaaka leka raasaaka meekemanisthi?
mana chutto manchee undi. chedoo undi. rentinee sweekarichagala sthitha prajnatha manku raavaali. appudu jeevithamanthaa vennelani srustinchukovachchu.

Srinivas said...

అదృష్టవంతులు మీరు. మీ చుట్టుపక్కల పిల్లల్ని చేరదీసి థింసా నేర్పించండి.

సవ్వడి said...

చెప్పడానికి మాటలు లేవు.