Thursday, August 5, 2010

నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలి అనిపిస్తుంది

ఫ్రెండ్ అంటే ఆడ అయినా, మగ అయినా ఒకటే కానీ..నాకేమో రంగురంగుల సీతాకోక చిలుకల్లా, గలగల సవ్వడిచేసే సెలయేటి లా, పైనుండి దూకే జలపాతంలా, సునామీ కెరటం లా,చిరుజల్లుతో తడిపేసే జడివానలా, పాలలా, తేనెలా, పువ్వులా, పసిపాప నవ్వులా, అమ్మ ఒడిలా, నాన్న చేతిలా, అమ్మమ్మ చెప్పే కధలా,తాతయ్య చెప్పే వింతలా, బాలీవుడ్ గాసిప్ లా, టాలీవుడ్ సినిమాలా, హాలీవుడ్ అద్భుతంలా, టీ.వి .సీరియల్ సస్పెన్స్ లా, సాయంకాలం లో కలిగే చెప్పలేని వేధనలా, ఉదయాన్నే కలిగే ఉత్సాహంలా, గెలుపులోని గర్వంలా, అలుపులోని నిద్రలా..... ప్రతి క్షణం కొత్త అనుభవం లా అనిపించే అమ్మాయిలన్నా,వారి స్నేహమన్నా చాలా ఇష్టం. ఉన్న స్నేహితులకి నాకు సమయం కుదరదు,దూరం. మళ్ళీ నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలి అనే కోరిక రోజు రోజు కీ పెరిగిపోతుంది. అసలు పేరుతోనే మొదలైపోతుంది అమ్మాయిల స్నేహంలో విభిన్నత. లత, కవిత, ,చిత్ర, మధు, మీర, సత్య, భామ, ,సువర్ణ, లేఖ, రాధ, నవీన, మిత్ర, బృంద, సునంద, పూర్ణ,శాంతి, వేద, ఇలా ఏ పేరు తీసుకున్నా ఒక కావ్యంలా వుంటుంది, ఒక స్నేహితురాలితో ప్రతిరోజూ కూడా ఒక పండగలా వుంటుంది.

అసలు అమ్మాయిల మధ్య  స్నేహం ఎంత బాగుంటుందో! నాకు ఇంటర్ వరకు చాల మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ వున్నారు. ఆతరువాత డిగ్రీ నుండి ఎందుకో ఎప్పుడూ ఒంటిపిల్లి రాకాసి లా ఒక ఫ్రెండే దొరికేది. అవికూడా ఇక తప్పక చేసిన స్నెహాలో, కలిసి వెళ్ళడానికి రావడానికో అన్నట్లుండేవి. డిగ్రీ లో కవిత, నేను పి.జి గురించి కలలు కంటుంటే తను మ్యారేజీ కలలు కనేది. నేను జాబ్ ఎలా చెయ్యాలని మాట్లాడితే తను మొగుడిని ఎలా కంట్రొల్ లో పెట్టాలో మాట్లాడేది.కానీ అది కూడా బాగుండేది. పి.జి కొచ్చాక హాస్టల్లో రూం మేట్ శాంతి కాస్త నా టేస్ట్ కి తగిన అమ్మాయి. మేమిద్దరం కాస్త బాగానే ఎంజాయ్ చేశాము. కానీ తను ఎక్కువగా టీచర్ అవ్వాలని కష్టపడి చదువుతూ వుండేది. నేను కూడా విపరీతం గా చదివేదాన్ని కానీ ఒక గమ్యం లేకుండా ఏరోజు ఏది నచ్చితే, లైబ్రరీ లో ఆ సెక్షన్ కి వెళ్ళి చదివేదాన్ని. అలాంటి పిచ్చి పనులు నచ్చని గుడ్ గర్ల్ శాంతి. కేంపస్ లో మా క్లాస్ లో రోజూ వచ్చేవాళ్ళలో ఇద్దరే అమ్మాయిలు. నేను, ఇంకో బెంగాలీ అమ్మాయి రాఖీ ఘోష్. రాఖీ ఒక్కతే నాకు తెలిసిన బెంగాలీ అమ్మాయి. ఆమెకి కూడా పెళ్ళి కి ప్రెపేర్ అవ్వటమే జీవితం, పెళ్ళి తరువాత కి అవసరమైన వంటలు, ఇంటి పని, నగలు అంటూ ఎప్పుడూ అదే మాట్లాడేది. కానీ కవితకి, రాఖీ కి ఒక పెద్ద తేడా వుండేది.కవిత ఒక వ్యాపరస్థుడికో, సాధారణ ఉద్యోగస్థుడికో కావలసిన భార్యకి కావలసిన ప్రిపరేషన్ లో వుంటే, రాఖీ ఒక పెద్ద ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ లేదా పెద్ద పొజిషన్లో వుండే భర్త కోసం తగిన లక్షణాలు అంటే గెస్ట్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, పార్టీస్ కి ఎలా రెడీ కావాలి ఇలా..అందరు బెంగాలీ అమ్మాయిలు ఇలాగే వుంటారా అని నాకు అనుమానం వచ్చేది. కానీ పి.జి లో డిగ్రీ లో ఎక్కువ బాయ్ ఫ్రెండ్సే వుండేవాళ్ళు(వేరే అర్ధం లో కాదు) ఎందుకంటే కాలేజిల్లో ఎక్కువగా వాళ్ళే వుండేవాళ్ళు మరి. ఆతరువాత అరుకులో పనిచేసేప్పుడు సరిత అని ఒక అకౌంట్స్ అమ్మాయి నేను మాత్రమే ఆఫీస్ లో . మిగిలిన టైం అంతా ఫీల్డ్ లో అరుకు లో ఒంటరిజీవితం, లేదంటే మా తమ్ముడు, వాడి ఫ్రెండ్సే నా ఫ్రెండ్సు. వాడు అప్పటికి ఇంకా ఇంటర్ చదువుతున్నాడు కాబట్టి అమ్మాయిలంటే కాస్త దూరంగా వుండేవాడు. సో నో గర్ల్ ఫ్రెండ్స్.

ఇక వెలుగులోకి వచ్చాక దొరికారు గుంపులు గుంపులుగా అమ్మాయిలు. ట్రైనింగ్ టైములో, మీటింగ్స్ లో సందడే సందడి. అందులో మొదట చెప్పాల్సింది మాత్రం మాధురి గురించే.మొదటి రోజు టెస్ట్, ఇంటర్యూ అప్పుడు పరిచయం అయింది. గలగలా మాట్లాడేస్తుంది. నా ఫ్రెండ్ శ్రీను తను ఐ.టి.డి.ఎ లో పనిచేశారు కనుక శ్రీను పరిచయం చేశాడు. తరువాత మాధురి నాకు వరుసగా షాకులిచ్చింది.ట్రైనింగ్ లో మొదటిరోజు తనే నాకు ఎక్కువమందిని పరిచయం చేసింది. వీడు రాజా, మీవూరే,వీడు బసవరాజు ఒట్టి తింగరోడు, వీడు,వాడు, ఇది ,అది అని మధు చాలా మర్యాదగా మాట్లాడుతుంటే నేను నోరు వెళ్ళబెట్టుకొని వినేదాన్ని. అంతే కాదు మధు అందరిని వరసలు పెట్టి పిలిచేది. వరసలంటే అక్క, అన్న మాత్రం కాదు. అబ్బాయిలందరినీ "బావా" " మామ",అని పిలిచేది.అమ్మాయిల్ని కొందరిని వదిలేసినా కొందరిని భయంకరంగా "వదినా, మరదలా,పిన్నీ " అని పిలిచేది. నాకు మొదట్లో ఆశ్చర్యం వేసేది. అందరూ చేసేదానికి వ్యతిరేకంగా చెయ్యాలనో ఏమో మరి. అబ్బాయిలందరు హడలిపోయేవాళ్ళు. ఒరే బావా, ఏంటిరా నేను కనిపిస్తున్నా పలకరించకుండా వెల్ళ్ళిపోతున్నావు అని దొంగలా తప్పించుకోవాలని చూసిన వాళ్ళని కూడా పట్టుకొని మరీ పలకరించేది. మాట రౌడీ లా వున్నా మధు అంత మంచి మనసు ఎక్కడా దొరకదు. అందరిని నిజంగా తన మనుషులు అన్నంత ప్రేమ గా చూస్తుంది. పిలుపులోనే కాదు ఆ దగ్గరతనం. చూడడానికి ఒక అస్థిపంజరానికి డ్రెస్స్ వేసినట్లుండే మధు "బావా" అని పిలుస్తుంటే మా టీం అబ్బాయిలందరూ "మధు నువ్వు అలా పిలవకే బాబు, నేను ఆత్మ హత్య చేసుకుంటా" అని బెదిరిపోయేవాళ్ళు. ఒకరోజు మధు ఒక అబ్బాయిని తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. అంతకు ముందు 2,3 సార్లు తనని చూశాను. ఒసే శిరి, వీడు రవి, నేను పెళ్ళిచేసుకోబోయేవాడు అని చెప్పింది. నేను తికమక గా చూసేంతలోనే "ఒరేయ్ రవి, ఇదిగో రా శిరీషా, శిరీషా అని కలవరిస్తున్నావు కదా పరిచయం చేసేసాను, ఇక మీరూ మీరూ చూసుకోండి" అని చెప్పింది. నాకు పై ప్రాణలు పైనే పోయాయి. ఏం చెప్తుంది ఈ అమ్మాయి? తన లవర్ అని చెప్తూ నన్ను కలవరిస్తున్నాడని చెప్తుందేంటి? అని పిచ్చిదానిలా చూస్తున్నా. పాపం నా పరిస్థితి అర్ధం అయినట్లుంది రవి కి(తరువాత మా స్నేహితుడైపోయాడు) "మీరేమీ ఖంగారు పడకండి, మధు అలాగే మాట్లాడుతుంది. మధు ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుండి నేను కూడ అప్పుడప్పుడు వచ్చి చూస్తున్న, మీరు తెలుగు, ఇంగ్లీష్ లలో బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మంచి అనాలసిస్ చేస్తున్నారు, అందరితో స్నేహం గా వుంటున్నారు, ముఖ్యంగా మధుకి పిచ్చగా నచ్చేశారు, మీ గురించె ఏక్కువగా చెప్తుంది, అందుకే పరిచయం చెయ్యమని 2,3 సార్లు అడిగాను అందుకే ఇలా చెప్తుంది"  అని వివరించాడు. హమ్మయ్య అనుకున్నాను. రవి, మధు ల పెళ్ళి మేమే చేశాము. వాళ్ళ ఇళ్ళల్లో ఒప్పుకోకపోవటం వల్ల. ఇప్పటికీ నాకున్న మంచి స్నేహితులు వాళ్ళిద్దరు(ఇప్పుడు ముగ్గురయ్యారు). మధు, నేను  కలిసి ఎవరినైనా ఎదిరించేవాళ్ళం. (ముఖ్యం గా మా పి.డి గారినే) మొట్ట మొదట మాకు ఒక యూనియన్ అవసరమని మేమిద్దరం మా వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టి మొదలు పెట్టాము. అది ఇప్పుడు చాలా పెద్దది అయింది. కానీ మేమిద్దరం అక్కడ లేము.మధు శ్రికాకుళం దగ్గరలో రణస్థలం మండలం లో చేసేది, నాకు చాలా దూరం. మానసికంగా చాలా దగ్గర.

వెలుగు ప్రాజెక్ట్ మొదటి సారిగా సామాజిక అభివృద్ధి అనేది కూడ ఒక ప్రొఫెషన్ చేసి అందరికీ పరిచయం చేశారు. అప్పటివరకు టి.ఐ.ఎస్.ఎస్ (టిస్)వంటి కొన్ని పెద్ద విద్యాసంస్థలు ఇలాంటి ప్రొఫెషనల్స్ ని తయారు చేస్తున్నా కూడా వారెక్కడ వున్నారో, ఏమి పనిచేస్తున్నారో కూడా తెలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్  అన్ని రాస్ట్రాల కంటే అభివృద్ధి కార్యక్రమాలలో బాగుందని మన ప్రాజెక్టు లు చూసి చెప్పొచ్చు. ఎన్నో రాస్ట్రాల నుండి ఇప్పుడు ఇక్కడికి నేర్చుకోడానికి వస్తున్నారు.వెలుగు మొదలైనప్పుడు మా ట్రైనింగ్ కొ-ఆర్డినేటర్ షీబ కూడ టిస్ ప్రొడక్ట్ కావటం వల్ల,మేమంతా లోకల్ కావటం వల్ల కొందరు టిస్ లో చదువుకున్న సోషల్ వర్క్ ప్రొఫెషనల్స్ ని మాతో పాటు తీసుకుంటే వారి నుండి కూడ మేము నేర్చుకోవచ్చనే వుద్ధేశ్యంతో మా పి.డి గారు కూడ కేంపస్ ఇంటర్యూలు చేసి టిస్ నుండి,ఐ.ఆర్.ఎం.ఎ(ఇర్మా) నుండి, అగ్రికల్చర్ కాలేజీలనుండి, ఇంజనీరింగ్ కాలేజీలనుండి మొత్తానికి ఒక 20 మంది ని 2 వ బ్యాచ్ లో తీసుకున్నారు. అందులో వచ్చిన వాళ్ళలో టిస్ వాళ్ళు కొన్నాళ్ళు వున్నారు. మిగిలిన వాళ్ళు చాలా కారణాల వల్ల 90% మంది వెళ్ళిపోయారు.

వచ్చిన వాళ్ళల్లో ఈ టిస్ వాళ్ళు వింతగా కనిపించేవాళ్ళు. మా దేశవాళీ ఆవుల మందలో జెర్సీ ఆవుల్లా అన్నమాట. ఇక అప్పటితో నాకు ఎక్స్ ట్రా డ్యూటీ పడింది. వాళ్ళకి ట్రైనింగ్ లో వాళ్ళకోసం మా వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ లో తిరిగి చెప్పటం. ఇలా వచ్చిన 20 మంది లో ముఖ్యంగా చెప్పుకో వలసిన వాళ్ళు 4 మందే. వాళ్ళే కొంత ప్రభావం చూపి వెళ్ళిపోయారు. వారిలో చిత్ర రామస్వామి, శోభా రాఘవన్, సిసీలియా, ఇకో అబ్బాయి(నాకు పేరు గుర్తులేదు). ఆ అబ్బాయి చాల తక్కువ రోజులు వున్నాడు. తను ఒక విజువల్ ఇంపైర్డ్(కళ్ళు కనబడవు చిన్నప్పటినుండి).నేను మొదటి సారి అటువంటి వ్యక్తితో మాట్లాడటం. తను చాలా తెలివైన వాడు. కళ్లు లేకపోవటం వల్ల అనుకుంటా మిగిలిన విషయాలలో చాలా షార్ప్ గా వుడేవాడు. మా శబ్ధం, వాసన పసిగట్టి చెప్పేవాడు ఎవరు వచ్చింది అని. కానీ 2 వారాలు కూడా వుండలేకపోయాడు.

ఇక శోభ, విపరీతమైన మొండి ఘటం. తను నమ్మేదానికోసం ఎవరితో అయినా పోట్లాడేది. సీతంపేట ఏజెన్సీ లో ఎవరూ తిరగనన్ని గ్రామాలు ఒంటరిగా తిరిగింది. తిండి, నిద్ర,స్నానం లాంటి అవసరాలు కూడా పట్టించుకోకుండా పనిచేయగలిగే ప్రొఫెషనలిజం. కానీ సర్దుకుకుని పోవటం, పెద్ద ప్రాజెక్టులో పనిచేసేప్పుడు ఎక్కువమంది ప్రయోజనం కోసం కొందరిని విస్మరించాల్సి రావటం తను సర్దుకోలేకపోయింది. అందుకని ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. తనని జాబ్ లోనుండి తీసేసారు. కానీ తను వస్తాను అని చెప్పిన గ్రామాలన్నీ,చేస్తాను అన్న పనులన్నీ పూర్తి అయిన వరకు జీతం రాకపోయిన, ప్రాజెక్టులో వెలివేసినా పని పూర్తి చేసి వెళ్ళింది.తనని చూసి ఎందరో అబ్బాయిలు ఫీల్డు కి వెళ్ళటం నేర్చుకున్నారు. చెప్పిన మాట పై నిలబడటం...నాకెంతో నచ్చింది.మా టీంలో వున్న రెడ్డీ, శోభా ని కొన్నాళ్ళు సీతంపేట వేశారు. రెడ్డీ తో పాటు మాదగ్గరకి తన ఫ్రెండ్ చిత్రకోసం ఎక్కువగా వస్తుండేది.అలా శోభ కూడా నాకు ఫ్రెండ్ అయ్యింది.సీతంపేట ఐ.టి.డి.ఎ శోభ అంటే అందరికి ఒక వింత, కొందరికి అద్భుతం, కొందరికి భయం.

మా వజ్రపుకొత్తూరు టీం లో నేను ఒక్కదానినే అమ్మాయిని, ఒక సంవత్సరం పాటు అబ్బాయిలతో స్నేహాం బోర్ కొట్టేసిన సమయంలో చిత్ర వచ్చింది. సన్నగా పొడుగ్గా టిస్ టీం లో కాస్త అమ్మాయిలా అనిపించే ఫిగర్(మా టీం అబ్బాయిల మాటల్లో చెప్పాలంటే).చిత్రకి వాళ్ళ అమ్మా నాన్న కంటే శోభ అంటే ప్రాణం. శోభని జాబ్ లోనుండి తీసేస్తె చిత్ర కూడా వెళ్ళిపోయింది. నాకు ఎంతో లోటు చేసి వెళ్ళిపోయింది. చెప్పాలంటే మేమిద్దరం పెద్ద గొప్ప స్నేహితులమా అంటే కాదు.కానీ మేమిద్దరం కలిసి చాలా సంతోషంగా వున్నాము. తను కేరళ అమ్మాయి. వచ్చీ రాని తెలుగుతో, అబ్బాయిలాంటి గొంతుతో, విపరీతమైన ఎనర్జీతో వుండేది. చిత్ర అప్పుడప్పుడు కొబ్బరినూనె తో వాళ్ళ వంటలు చేసేది. తన ఎదురుగా తిని పక్కకెళ్ళి ఊసేసేవాళ్ళం. చిత్ర కి ప్రతీ విషయంలో చాలా క్లారిటీ వుండేది.అలా అని మొండి కాదు. చాలా ఓపెన్ మైండ్. అందరి ఆలోచనలు అభిప్రాయాలు విని ఎంకరేజ్ చేసేది.నాకు మాత్రం ఎన్నాళ్ళ లోటో తీర్చడానికే చిత్ర వచ్చినట్లనిపించింది.నేను తనకోసం ఇంగ్లీష్ మాట్లాడినా మొదటి రోజే చెప్పేసింది తెలుగు లోనే మాట్లాడు, నేను నేర్చుకోవాలి అని. కొన్ని రోజులకే బాగా నేర్చేసుకుంది. తనతో వచ్చిన వాళ్ళెవరికీ రాలేదు కానీ చిత్రకి వచ్చేసింది.అప్పటివరకు నేను చాల విషయాల్లో ఎవరో ఏదో చెప్పిన వాటినే నిజమని అభిప్రాయాలు ఏర్పర్చుకునే దాన్ని. కానీ చిత్ర స్వంతంగా తెలుసుకునే వరకు ఏ అభిప్రాయం చెప్పేది కాదు. తన అభిప్రాయం అందరికీ నచ్చనిది అయినా చెప్పేది. ఏ పనికి కూడా ఎవరి మీదా ఆధార పడేది కాదు. నేను ఒక బకెట్ నీళ్ళు మొయ్యాలంటే, పెద్ద బరువు మొయ్యాలంటే, దూరం వెళ్ళాలంటే అబ్బాయిల మీద ఆధారపడేదాన్ని. చిత్రకి కూడా ఆపనులు కష్టమే అయినా వేరే విధంగా చెయ్యాలని చూసేది కాని ఎవరి మీదా ఆధార పడేది కాదు. పూర్తిగా బకెట్ మొయ్యలేకపోతే నాలుగుసార్లు కొంచెం కొంచెం మోసేది. భాష రాకపోయినా ఒక్కతీ ఎంత దూరమైనా వెళ్ళేది. ఎక్కువ దూరాలు ప్రయాణం చేసేప్పుడు నేను టాయిలెట్ కి వెళ్ళాల్సిన అవసరం వున్నా కంట్రోల్ చేసుకొని బాధపడుతుండేదాన్ని. చిత్ర సిగ్గు పడకుండా అందరికీ చెప్పి మరీ వెళ్ళేది. ఇలా ఎన్నో. ఎన్నో భయాలు, సిగ్గులు, మొహమాటాలు, కన్ ఫ్యూజన్ పోగొట్టింది మా అందరిలో. తనకి బైక్ నడపటం వచ్చినా, నాకు రాదని తెలిసినా నా బైక్ మీద ధైర్యంగా వెనక కూర్చొని వచ్చేది. ఎప్పుడూ కూడా నేను నడుపుతా అని నన్ను కించపరిచేది కాదు. (చాలా మంది అబ్బాయిలు మాత్రం ఇది తప్పక చేస్తారు - రకరకాల కారణాలతో). మేమిద్దరం అక్కడి నిర్మానుష్యంగా వుండే సముద్రపు ఒడ్డు చూసుకొని వెళ్ళేవాళ్ళం. వజ్రపుకొత్తూరు మండలంలో కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుండేవి. వాటి మీదనుండి కిందకి దొర్లుతూ ఇసుక పోసుకుని అల్లరి చేసేవాళ్ళం. జాలరి వాళ్ళు "ఐల వల"లాగుతుంటే(చాలా పెద్ద వల , చిన్న చిన్న రంధ్రాలతో మొత్తం సముద్రంలో చేప గుడ్లతో సహా వచ్చేస్తాయి అందుకే గవర్నమెంట్ దానిని బ్యాన్ చేసింది. కానీ ఐల వల ఊరికి ఒకటి వుంటే ఆ ఊరికే గొప్ప గా భావిస్తారు, ఐల వల ఉదయం గాని, అర్ధరాత్రి కానీ కొందరు వెళ్ళి వేసి వచ్చేస్తారు. తరువాత వేకువన లేదా మధ్యానానికి ఊర్లో వున్న ఆడ,మగ, పిల్ల ముసలీ అందరూ కలిపి ఆ వలని లాగుతారు), నేను చిత్ర కూడా వాళ్ళతో పాటు వల లాగే వాళ్ళం.ఉదయాన్నే చెంబు పట్టుకొని జీడితోటలోకి వెళ్ళటంతో మొదలుపెట్టే వాళ్ళం కబుర్లు, ఫీల్డ్ కెల్తూ, తిరిగివస్తూ, దారిలో ఎదో ఒక తోటలో ఆగిపోయి, రాత్రి డాబా మీదకెళ్ళి, నిద్రపోతూ కూడా ముగిసేవి కాదు. చిత్ర డిగ్రీ షూ(పాదరక్షలు) మేకింగ్ కోర్స్ చేసింది, ఇంటర్  బిట్స్ పిలానీ, పి.జి సోషల్ వర్క్ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా చదివింది(నాలాగే).కేరళ లో పుట్టి పెరిగి,ముంబైలో చదివి వచ్చిన చిత్ర జీవితం నాకు వింతగా వుంటే, చిన్న టౌన్లో పుట్టి, ఏదో చదివి, ఏదో చేస్తున్న నా జీవితం చిత్రకి వింత.తను వున్నన్ని రోజులూ ఎప్పుడూ ఉత్సాహంగా పరిగెత్తే వాళ్ళం.గట్టిగా నవ్వే వాళ్ళం, కోడి ని వెంటపడి పరిగెత్తి పట్టుకుని తెచ్చి గూట్లో పెట్టే వాళ్ళం, అదిపెట్టిన గుడ్లన్నీ పొదిగించి పిల్లలు అయితే మురిసిపోయాము, పొదుగుతున్న పెట్టని మహరాణిలా చూసుకున్నాము,కోడిపిల్ల చనిపోతే కూర్చొని ఏద్చాము...మా ఇద్దరికీ ఆరోజులు మాళ్ళీ వస్తాయా?

ఆ తరువాత నాకు మళ్లీ ఇంతవరకు స్నేహితులే లేరు. తరువాత ఏలూరు లో మేనేజీరియల్ పొజిషన్ కి వచ్చేసా.ఇక ఆ స్తేజ్ కి వచ్చాక స్నేహితులు దొరకటం కష్టమేమో!ఎక్కువగా ఈ పొజిషన్స్ లో మగవారుంటారు. ఒక వేళ ఆదవాళ్లున్న పెళ్లి అయి పిల్లలు, ఇల్లు ,ఆఫీసు పని తో సతమతమవుతుంటారు. నోరు తెరిస్తే మా ఆయన, మా అత్తగారు, మా తోడికోడలు, మా పాప, మా బాబు ఇవే మాట్లాడతాము. నేను కూడా అంతే. స్నేహానికి సమయం, మనసు, ఓపిక వుండదు. మగవారితో స్నేహాలు కుదిరే అవకాశం వుంటుంది కానీ ఏమో ఎందుకో కుదరదు.కొంత వ్యక్తిత్వం ఏర్పడిపోయాక అనుబంధాలు,బంధాలు అంత సులభంగా ఏర్పడవు అనిపిస్తుంది నాకు.ఏలూరులో హాస్టల్లో వుండేదాన్ని, ఆ హాస్టల్లో నేను ముగ్గురం జాబ్ హోల్డర్స్ మిగిలినవారంతా కాలేజీ అమ్మాయిలు.అక్కడ కూడా పెద్దగా స్నేహం కుదరలేదు. ఆతరువాత మళ్ళీ కేర్ లో జాయిన అయ్యాను.ఇక్కడ మా నెల్లూరు ఆఫీసులో నేనొక్కదాన్నే మిగిలిన స్టాఫ్ అందరు మగవాళ్ళే.ఎప్పుడైన స్టేట్ ఆఫీసుకి వెళ్తే అప్పుడు మాత్రం మీరా, సత్యభామ కాస్త మాట్లాడే అవకాసం, హొటెల్ రూములో కలిసి గడిపే అవకాశం వుంటుంది.నాకు ఒక అనుమానం స్నేహం అంటే మనం అనుకుని చేస్తామా? లేక అదే అవుతుందా? పువ్వుతో పాటు పరిమమళం లా, జాబిలితో పాటు వెన్నెల లా, సహచర్యంతో పాటు వచ్చేదే స్నేహం అని నా అభిప్రాయం. మనం వున్నంత కాలం ఆ స్నెహ పరిమళం, చల్లని వెన్నెల లా మనకి సేద తీరుస్తుంది.

"అందరికి స్నేహితులరోజు శుభాకాంక్షలు" (నా స్నేహితులు పంపిన ఎస్.ఎం.స్.లు లేట్ గా చూస్తూ వారందరిని గుర్తుచేసుకొని ఈ పోస్ట్ వ్రాస్తున్నా,ఇది నా స్నేహితులందరికీ అంకితం)

17 comments:

Change Maker said...

శిరీష గారు, రెండు వారాల క్రితం ఇండియా వచ్చి నా స్నేహెతులలో చాలా మందిని కలిసిన ఆనందంలో చెప్తున్న మాటలివి. ఈ రోజే ఒక గ్రూప్ ని కలిసాను. ఒక స్నేహితుడైతే ఉద్యోగం ట్రైనింగ్ లో రెండు నెలల పరిచయం 93 APSEB లో , అత్యంత ఆప్త మిత్రుడు. స్నేహం మనం అనుకునే దానికంటే, దానంతట అదే అవుతుంది (నా అనుభవం ప్రకారం).

మీకు కూడా ఇంకో క్రొత్త స్నేహితురాలు దొరుకుతుంది త్వరలో , probably from the new blogging world.
Ravi

శ్రీ said...

మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు!

మీరు పని చేసే ప్రాజెక్త్స్ ప్రభుత్వానివా ? లేక ప్రైవేటా ?

నాన్ ప్రాఫిట్ టైపా ?

Anonymous said...

inta peddadaa :-o

రాజ్ కుమార్ said...

పోస్ట్ చాలా బాగుందండి .. మొదటి పేరా నుండి అధ్బుతం గా ఉంది..
" తన ఎదురుగా తిని పక్కకెళ్ళి ఊసేసేవాళ్ళం" హా హా.. మలయాళం వాళ్లతో అందరికి ఇదే experience అనుకుంటా ..:)
మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు..

Anonymous said...

oohalla vunnai mee anubhavaalu.baaga rasaru

Anonymous said...

oohalu ani pinchenta baga vunnai me anubhavalu

సవ్వడి said...

శిరీష గారు! ఈ పోస్ట్ చాలా బాగుంది. సో స్నేహితురాలు కోసం ఎదురు చూస్తున్నారన్నమాట... మీకు మీలాంటి మంచి స్నేహితురాలు దొరకాలని కోరుకుంటున్నాను.
శోభగారు చాలా గ్రేట్ కదా.... ఉద్యోగం తీసేసినా పనులు పూర్తి చేసారంటే చాలా మెచ్చుకోవాలి.
ఈ టపాలో చాలా విషయాలు తెలుసుకున్నాను... ముఖ్యంగా పని పట్ల నిబద్ధత గురించి. good post...

శిరీష said...

@ బాటసారి రవి గారు, థాంక్స్ అండి. మీ నోటి చలవ వల్ల నాకో గాళ్ ఫ్రెండ్ దొరికితే అదే సంతోషం. విష్ యు హేపీ హాలిడేస్.

@ శ్రీ, థాంక్స్ అండి, నేను పని చేసేది నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్

@అనానిమస్, ఊహల్ల అనిపిస్తాయి నాకు కూడా తలుచుకుంటే కానీ నిజాలే. అందుకే నా జీవితం అంటే నాకు చాలా ఇష్టం.

@వేణురాం, థాంక్స్. సో మీరు కూడా కొబ్బరినూనె వంటల బాధితులా??

@అనానిమస్, పోస్ట్ పెద్దదయ్యిందా? అప్పటికే చాలమందిని వదిలేసా

@ సవ్వడి, థాంక్స్ అండి. నా పోస్ట్ మీకు ఇంత ఉపయోగపడిందా!!!

హరే కృష్ణ said...

కేరళ వాళ్ళు తెలుగు చాలా తొందరగా నేర్చుకుంటారు
బాగా చెప్పారు

santhi said...

You can take me as friend :-). How to post comment in telugu :-( ?
See I am taking for granted you as my fried as asking questions already.I would like write big comment in telugu. Can you please help me.

-Santhi

శిరీష said...

Hai santhi,

thanks for the coment and also for taking me as ur freind. lekhini.org use cheyyandi telugulo type cheyyochchu.

శిరీష said...

@ hare krishna, meeru kooda kerala vaalla??? thanks for the coment

Sahithi said...

హలొ శిరీష గారు,

నెను మీ బ్లొగ్ ని రెగులర్ గా చదువుతుంటాను అండి. మీకు చాల పెధ్ధ ఫాన్ ని. మీరు చెసె వర్కు వెరి fascinating. మీ రచన సైలి నాకు బాగ నచ్చాయి. ఫ్రథ్యేకంగా మీరు reddy ( మీ husband) గారి గురుంచి మీ friend srinu గురుంచి రాసిన funny episodes చాల బాగున్నాయి.
మీరు ఒప్పుకుంటె నీను మీకు friend ఔతాను.
మీరు నన్ను friend గా accept చెయాలని ఆ దెవున్ని వెడుకుంటున్న :-).
ఇంక నా గురుంచి అయితె నీను ఒక బొరింగ్ software engineer ని.

సాహితి

నీహారిక said...

మనం కలిసి పనిచేసే చోట, ఇంటా, బయట ఎందరో కలుస్తారు.కొందరితోనె మనసు విప్పి మాట్లాడతాము.వారే స్నేహితులు.అలా మనసున ముడివేసుకొనే నేస్తం మీకు దొరకాలని,మమ్మల్ని కూడా మీ నేస్తాలుగా భావించాలని కోరుకుంటూ,స్నేహితులరోజు శుభాకాంక్షలు.

శిరీష said...

@ Neehaarika, thanks for the coment and very happy to have friends like you.

Kathi Mahesh Kumar said...

TISS వాళ్ళ గురించి మీ అబ్సర్వేషన్ కరెక్టే...వాళ్ళు కొంచెం హైబ్రీడ్ సోషియల్ వర్కర్లు. :)

శిరీష said...

@ కత్తి గారు,
ఓకే నా బ్లాగ్ మొత్తం ఇప్పుడే మొదటి సారి అన్ని పోస్ట్లు చదివినట్లున్నారు. అన్నిటికీ ఇక్కడే రిప్లై చేస్తా. మొత్తానికి మీకు నా బ్లాగు నచ్చినట్లా లేనట్లా...కత్తి మార్కు కామెంట్లు లేవేంటి? సినిమా తీస్తారా...సరే హీరోయిన్ మాత్రం నేనే. హీరో ని కావాలంటే అభిషేక్ బచ్చనో, హృథిక్ రోషనో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ ఆల్ ద కామెంట్స్.